Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గాడ్స్ మస్ట్ బీ క్రేజీ

[వి. ఆనందవర్ధన్ గారు రచించిన ‘గాడ్స్ మస్ట్ బీ క్రేజీ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

‘కుయ్‌..కుయ్‌..కుయ్‌’ అని ఏకకాలంలో 14 లోకాల్లో అదే పనిగా సైరన్‌ మోగింది. ఆ సైరన్ మోగిన విధానాన్ని బట్టి అది నేరుగా దేవలోకం నుంచి మోగినట్టు అందరికీ అర్థమైంది. సమయం తక్కుగా ఉన్నప్పుడు అత్యవసర మీటింగ్‌కు అందర్నీ అలర్ట్‌ చేయటానికి ఈ సైరన్‌ను ఉపయోగిస్తుంది దేవలోకం. 14 లోకాలన్నింటికీ దేవలోకమే హెడ్‌ ఆఫీస్‌. దేవ లోకం కూడా ఇప్పుడు అడ్వాన్స్‌ టెక్నాలజీ యూజ్‌ చేస్తోంది.

“వాట్‌ డ్యూడ్‌.. ఏంటీ ఈ సమయంలో దేవలోకం సైరన్‌ మోగింది. ఇప్పటి దాకా న్యూస్‌ చూస్తూనే ఉన్నానే. ఎక్కడా ఏ సమస్యా లేదే” తన దగ్గరున్న సమాచారాన్ని ఇవ్వడంతో పాటు సైరన్‌ పై ఆరా తీశాడు ఓ యక్షుడు. “నాకు మాత్రం ఏం తెలుసు గురూ.. ఇదేదో సీరియస్‌ మేటర్‌లా ఉంది. లేకపోతే ఇంత రాత్రి వేళ ఎందుకు అలర్ట్‌ ఇస్తారు” అని ఓ గంధర్వుడు సెలవిచ్చాడు. సరిగా అదే సమయంలో అక్కడికి పరుగు పరుగున వచ్చారు కిన్నెర, కింపురుషులు. వచ్చీ రాగానే.. “బ్రో. మనమిప్పుడు అర్జంటుగా సిస్టమ్‌ ఆన్‌ చేసి ఆన్‌లైన్‌లో రెడీగా ఉండాలి. హెడ్డాఫీస్‌ నుంచి ఇందాక సైరన్‌ వచ్చింది విన్నారుగా” అని రొప్పుతూ చెప్పారు. “కూల్‌.. కూల్‌ మై డియర్‌.. మేం కూడా ఇప్పుడా విషయమే మాట్లాడుతున్నాం. మేం రెడీగానే ఉన్నాం. అది కాదు సంగతి. అసలు ఈ వేళ అప్పుడు ఇంత అర్జంటుగా మీటింగ్‌ ఎందుకు? అని. నాకు తెలిసీ ఏ ఎమర్జన్సీ లేదు. మరి ఎందుకు అలర్ట్‌ చేశారనే మాట్లాడుకుంటున్నాం. మీకేమైనా తెలిస్తే చెప్పండి అన్నాడు ఇందాకటి యక్షుడు. “తినబోతూ రుచి, చూడబోతు విశేషం అడగకూడదంటారు.. త్వరగా మీ సిస్టమ్‌ దగ్గరికి వెళ్లండి.. ఇంక కొన్ని నిమిషాలే టైముంది” అని తొందరపెట్టాడు గంధర్వుడు.

అంతా ఊపిరి బిగపట్టి కంప్యూటర్ల ముందు కూచున్నారు. స్ర్రీన్‌ పై కౌంట్‌ డౌన్‌ మొదలైంది. అంతా జూమ్‌ మీటింగ్‌లో సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా అనుకున్న సమయానికి దేవ గురువు బృహస్పతి. “హాయ్‌, హలో,” అంటూ అందర్నీ పలుకరించాడు బృహస్పతి. “ఈ అత్యవసర మీటింగ్‌ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో మీలో ఎవరికైనా తెలుసా?” అని ప్రశ్నించాడు దేవగురు. “ఈ టైమ్‌లో అలర్ట్‌ రావటం మేం మొదటిసారి చూస్తున్నాం గురువుగారు. ఇక ఎందుకిచ్చారో మాకెట్ల తెలుస్తుంది” అన్నారు పలువురు చిన్న దేవుళ్లు. “మరేం లేదు.. ఈ మధ్య మీడియా మరీ హుషారైంది కదా.. ఎవరైనా లీక్‌ ఇచ్చారేమోనని అడిగా అంతే.” అన్నాడు బృహస్పతి. కంప్యూటర్‌ స్ర్కీన్ల ముందు కూచున్న ముక్కోటి దేవతలు ఎవరి ముఖాలు వాళ్లే చూసుకున్నారు.

“ఆల్‌రైట్‌.. ఇక విషయంలోకి వస్తా.. మీకు ఏమైనా సమస్యలున్నాయా?” సూటిగా అడిగాడు బృహస్పతి. దేవుళ్లంతా చేతులెత్తారు. “మీరు చెప్పండి.. మీ సమస్యేంటో” అని ఓ నడివయస్సు దేవుడికి అవకాశమిచ్చాడు బృహస్పతి. “ఏం చెప్పమంటారు సార్‌.. ఈ మధ్య వెరికోన్‌ వీన్స్‌తో బాగా ఇబ్బంది పడుతున్నాను. అంత గొప్పగా గుడి కట్టి.. నా విగ్రహాన్ని మాత్రం నిలబడినట్టు చెక్కించారు. ఏళ్లుగా నిలబడి రక్తప్రసరణలో సమస్యలొచ్చాయి. ఒక్క రోజు కూడా సెలవు దొరకడం లేదు వైద్యం చేయించుకుందామంటే” అన్నాడు. “నా సంగతి మరీ దారుణం సార్‌.. పది రకాల నైవేద్యాలైతే పెడుతున్నారు. కానీ, అవన్నీ కల్తీ పదార్థాలతో తయారు చేస్తున్నారు. దీంతో లేనిపోని రోగాలతో అవస్థ పడుతున్నాను” అని వాపోయాడు మరో దేవుడు. “నాది ఇంకో చిత్రమైన సమస్య సర్‌.. తెల్లారి అలంకరించిన పూల మాలలు రాత్రయినా అలాగే ఉంచుతున్నారు. గుడి తలుపులు వేశాక ఆ వాడిపోయిన పూల కోసం ఎక్కడ లేని దోమలు చేరి నన్ను కుడుతున్నాయి. అదేంటో ఈ మధ్య చికున్‌ గున్యా అంట.. ఆ నొప్పులు భరించడం దేవుడైనా నాకే సాధ్యం కావటం లేదు. ఇక సామాన్య భక్తులు ఎలా భరిస్తున్నారో” మరో దేవుడు దీనంగా సెలవిచ్చాడు. “తినటం, భక్తులను అలరించడం మినహా మరే వర్కే ఉండటం లేదు సార్‌.. కనీసం తిన్న తిండి అరగటానికైనా అంతో ఇంతో వర్కవుట్స్‌ ఉండాలి కదా సార్‌.. అలా వర్కవుట్స్‌ చేసే అవకాశం లేక చిన్న వయస్సులోనే మాలో చాలా మందికి డయాబెటిక్‌ అయ్యాం సార్‌” అని ఓ కుర్ర దేవుడు చెప్పటం ఆలస్యం.. చాలా గొంతులు “అవునవును” అంటూ అరిచాయి. “సార్‌, భక్తులు తెచ్చే కుంకుమ, పసుల్లో కెమికల్స్‌ ఉంటున్నాయి, వాటి వల్ల మా స్కిన్‌ బాగా పాడైపోయింది. అంతెందుకు భక్తులు వెలిగిచ్చే అగరొత్తులే తీసుకోండి. ఇవి కూడా కెమికల్స్‌ దట్టించి చేయడంతో ఆ పొగకు మాలో చాలా మందికి ఉబ్బసం వ్యాధి వచ్చింది” ఇలా దేవుళ్లంతా తమ రోగాల చిట్టాను, అవస్థలను వెల్లడించారు.

“ఇవన్నీ అందరికీ సాధారణమైన రోగాలే.. నేనడిగింది ఇంతకన్నా పెద్ద సమస్య ఏదైనా ఉందా? అని” మధ్యలో అడ్డు తగిలాడు బృహస్పతి. అర్థం కానట్టు ముఖాలు పెట్టారు ముక్కోటి దేవుళ్లు. “ఇప్పడు మన దేవుళ్లందరికీ ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. మీరు కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నదే. చాలా కాలం నుంచి పరిష్కారం దొరక్క మీరంతా అవస్థ పడుతున్నారు. ఇప్పుడు అది కాస్త బాగా ముదిరిపోయింది. భూలోకవాసుల నుంచే మీకందరికీ ఈ ముప్పు వస్తోంది. రాన్రాను ఇది మరీ శృతిమించిపోతోంది. ఇన్నాళ్లు భరించినా.. కొంతమంది దేవుళ్లు ఇక తమ వల్ల కాదని.. ఇప్పటికే పలు రకాల ఆరోగ్య సమస్యలతో సతమతవుతున్నామని, ఈ దేవుడిగిరి నుంచి మాకు విముక్తి ప్రసాదించమని అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. మొదట్లో ఈ సమస్యను తేలిగ్గా తీసుకున్నా.. ఇప్పుడు అది మన జాతీయ సమస్యగా మారింది.” అని కాస్త ఆగారు బృహస్పతి. అప్పటికే ముక్కోటి దేవతలకు చూచాయగా సమస్య అర్థమైంది. తమలో చాలా మంది దేవుళ్లు భక్తుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యే ఇది. వారిలో పాపభీతి పెరిగే కొద్దీ దేవుళ్లకు కొత్త సమస్య వచ్చి పడింది. మనిషికైనా, దేవుడికైనా సమయానికి ఇంత తిండి. శరీరానికి అవసరమైన విశ్రాంతి అవసరం. కొన్ని సందర్భాల్లో తిండి లేకపోయినా ప్రాణానికి అంత ప్రమాదం లేదు కానీ.. సరిపడా నిద్ర లేకపోతే మాత్రం ఎక్కడ లేని రోగాలు చుట్టుముడతాయి. మనుషుల్లో కూడా చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బంది దేవుళ్లు కూడా పడుతున్నారు. విచిత్రమేమంటే భక్తుల నుంచే ఈ ప్రమాదం దేవుళ్లుకు వచ్చింది.

“ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటా.. భూలోకంలో పాపులు పెరిగిపోయి, వారు చేసిన తప్పుల నుంచి బయట పడేందుకు దేవుళ్లను పూజించడం ఎక్కువైంది. వీరి భక్తి పాడుగాను.. వేళాపాళా లేకుండా పోతోంది. ఇది వరకు చక్కగా తెల్లారి గుడి తలుపులు తెరిచి మంగళహారతి ఇచ్చేవాళ్లు. మధ్యాహ్నాం ఓ రెండు మూడు గంటల పాటు హాయిగా విశ్రాంతి తీసుకోనిచ్చేవారు. ఆ తర్వాత సంధ్యవేళ మళ్లీ ఆలయాలు తెరిచినా రాత్రి 8 కల్లా కట్టేసేవారు. దేవుళ్లందరికీ కావాల్సినంత విశ్రాంతి దొరికేది. ప్చ్‌.. ఇప్పుడు ఆ టైమ్‌ టేబుల్‌ ఎవరూ, ఎక్కడా పాటించడం లేదు. మొదట్లో ఇది బాగానే ఉన్నా రాన్రాను భరించలేని విధంగా తయారైంది పరిస్థితి. దీనిపై దేవలోకానికి ఫిర్యాదులు ఎక్కవయ్యాయి.” సమస్య మొత్తం పూసగుచ్చాడు బృహస్పతి. అంతసేపు సైలంట్‌గా వింటున్న సమస్త దేవుళ్లు నిజమే కదా.. మనందరిదీ ఇదే సమస్య. దీన్నుంచి ఎట్లా బయటపడాలో తెలీక తమలో తామే కుమిలిపోతున్నారు. ఇప్పుడు పెద్దల దృష్టికి విషయం వెళ్లింది కాబట్టి త్వరలోనే పరిష్కారం దొరకుతుందని ఆశగా బృహస్పతి వైపు చూశారు.

దేవుళ్ల మనస్సుల్లోని భావనను ఇట్టే పసిగట్టిన బృహస్పతి మళ్లా తన ప్రసంగాన్ని కొనసాగించాడు. “ఇప్పుడు తక్షణ కర్తవ్యమేమంటే.. మీరంతా కలిసి ఫలానా రోజున దేవలోకంలోని యూనివర్సల్‌ సమ్మిట్‌కు రావాలి. ఆ సమ్మిట్‌కు త్రిమూర్తులు హాజరవుతున్నారు. మీ సమస్యను, దాని తీవ్రతను వారు అర్థం చేసుకుని పరిష్కరిస్తారు” అంటూ సమ్మిట్‌ జరిగే తేదీని ప్రకటించాడు బృహస్సతి. “ఈ సమ్మిట్‌ గురించి 14 లోకాల్లో విస్తృత ప్రచారం చేపట్టండి. ఫ్లెక్సీలు, బ్యానర్లతో పాటు మీడియాలో అడ్వర్టయిజ్‌మెంట్లు, మన ఇంద్ర లోకపు సెలబ్రిటీలతో క్యాంపెయిన్‌ చేయించండి. అరుదుగా జరిగే ఈ సమ్మిట్‌ దేవలోక చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేయాలి. ఇందుకోసం మీరంతా ఎవరికి తోచిన సహాయం వాళ్లు చేయాలి. మరోసారి ఏర్పాట్లను సమీక్షించటానికి మీ ముందుకు వస్తా. సమయం తక్కువగా ఉన్నది. ఏర్పాట్లు అదిరిపోవాలి, సమ్మిట్‌ సక్సెస్‌పైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉందని మాత్రం మరిచిపోకండి” అని ఆర్డర్‌ వేసి కంప్యూటర్‌ స్ర్కీన్‌ పై నుంచి అంతర్థానమయ్యాడు బృహస్పతి.

అనుకున్న రోజు రానే వచ్చింది. 14 లోకాల నుంచి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో కొంత మంది. సొంత వెహికల్స్‌లో కొంత మంది, కొంత మంది ధనిక దేవుళ్లు పుష్పక విమానాల్లో ఇలా ఎవరికి తోచిన మార్గాల్లో వాళ్లు దేవలోకానికి బయల్దేరారు. కొన్ని వేల మైళ్ల దూరానికే దేవలోకంలో వండుతున్న పదార్థాల వాసన గుప్పుమని తగులుతోంది. మొత్తానికి ‘సమ్మిట్‌ కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్ల జరిగినట్టుంద’ని లొట్టలేసుకుని మరీ బిలబిలమని వచ్చారు దేవలోకానికి పిల్ల దేవుళ్ల నుంచి పెద్ద దేవుళ్ల దాకా. ఎంట్రన్స్‌లో వారి ఐడీలు చూపిస్తే వారి స్థాయిని బట్టి బ్యాడ్జెస్‌ ఇస్తున్నారు. అంతా తమ తమ బ్యాడ్జీలు తీసుకుని దేవలోకంలోకి ఎంటరయ్యారు. టీ, టిఫిన్స్ పూర్తి చేసేలోగా మీటింగ్‌ సమయమైంది. అంతా క్రమశిక్షణతో ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్లు వెళ్లి కూర్చున్నారు దేవుళ్లంతా. సభికులందరినీ ఓసారి తేరిపార చూసి బృహస్పతి గంభీరమైన స్వరంతో స్పీచ్‌ మొదలెట్టాడు. “ఇది మన దేవలోకానికి మునుపెన్నడూ రాని విపత్తు. దేవుళ్లంతా సమస్య పరిష్కారానికి ఇలా ఒక్క తాటిపైకి రావటం చాలా సంతోషంగా ఉంది. ఇక సూటిగా విషయానికొస్తాను. ఈ మీటింగ్‌ కన్నా ముందు కోర్‌ కమిటీ మీటింగ్‌ ఒకటి జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇంత మంది మీ సమస్యలు చెప్పటం టైమ్‌ వేస్ట్‌ అని భావించాం. అందరి సమస్య ఒక్కటే కాబట్టి అందరి తరుఫున ఒక మెమరాండం తయారు చేశాం. అది ఇప్పుడు మీకు చదివి వినిపిస్తా” అని చదవటం మొదలెట్టాడు బృహస్పతి. “ఇప్పటికే ఎన్నోమార్లు ఎన్నో తీవ్రమైన సమస్యల నుంచి మనల్ని గట్టెక్కించిన శ్రీ మహా విష్ణువే మనకు దిక్కు. ఈ సమస్యను కూడా ఆయన ముందు పెట్టాలని నిర్ణయించాం. మీరు మీ సీట్లలోంచి కదలకుండానే మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. మీకందరికీ ట్యాబ్స్‌ ఇచ్చారు కదా.. అందులో మీరు తీర్మానం నచ్చితే గ్రీన్‌ బటన్‌, నచ్చకపోతే రెడ్‌ బటన్‌ నొక్కండి. చివర్లో బిల్‌ పాస్‌ అయ్యింది లేనిది నేను డిక్లేర్‌ చేస్తాను” అన్నాడు బృహస్పతి.

“యువర్‌ టైమ్‌ స్టార్ట్‌ నౌ” అన్నాడు దేవగురువు. క్షణాల్లో అంతా టపీటపీమని బటన్‌ నొక్కేశారు. ఓ నిమిషం తర్వాత డిజిటల్‌ బోర్డుపై ఓటింగ్‌ సరళి ప్రత్యక్షమైంది. తీర్మానానికి దేవుళ్లంతా ఓటేశారు. వెంటనే బృహస్పతి “ఐ సా విట్‌ ఐ సా విట్‌.. ది బిల్‌ ఈజ్‌ పాస్డ్‌” అని అన్నాడు. హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది. అక్కడే ఆశీనులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ, శివుడు సంతోషంగానే కనిపిస్తున్నా.. విష్ణువు ముఖంలో మాత్రం విచారం కనిపించింది. సమావేశానికి వచ్చిన ముక్కోటి దేవుళ్లంతా ఇది గమనించారు. ‘అదేమిటి దేవదేవుడి ముఖంలో అంత విచారం దేనికి? ఏమై ఉంటుంది’ అందరి మదిలో ఇదే ప్రశ్న ఏకకాలంలో ఉత్పన్నమైంది. బృహస్పతి తన ‘డ్యూటీ ముగిసింద’ని, “ఇక మీరు మాట్లాడాలి” అని విష్ణువు వైపు తిరిగి చెప్పాడు.

ఇక తప్పదన్నట్టు విష్ణవు అదే విచార వదనంతో లేచి మైకందుకున్నాడు. “మీ అందరికీ నాపై ఉన్న నమ్మకానికి పేరు పేరున ధన్యవాదాలు. నిజానికి మీరిన్నాళ్లు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఎంత భయంకరమైందో నాకు తెలుసు. మీ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన నేనే ఈ సమస్యలో తీవ్రంగా కూరుకుపోయి ఉన్నాను. మీకు తెలుసో లేదో కానీ.. మీ అందరికన్నా ఎక్కవగా భక్తుల తాకిడి ఎదుర్కొంటున్నది నేను. లక్షలాది మంది జనం నిత్యం నన్ను దర్శించటానికి కొండపైకి వస్తుంటారు. వాళ్లందరికీ ఓపికగా దర్శనమివ్వాలి, వారి కోరికల్నీ వినాలి. వాటిలో కొన్నింటిని అప్పటికప్పుడే పరిష్కరించాలి. కొన్ని ఆలస్యంగానైనా పరిష్కరించాలి. అలా చేస్తున్నందుకే నాపై మనుషులకు విపరీతమై నమ్మకం కుదిరింది. రెండు రోజులు సెలవులొస్తే చాలు.. వేల కిలోమీటర్ల నుంచి కూడా రెక్కలు కట్టుకుని తిరుమలకు వచ్చేస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు ఎప్పుడూ వీఐపీల తాకిడి కూడా నాకు ఎక్కువే. వేళా పాళా లేకుండా వచ్చే వీవీఐపీల కోసం నాకు విశ్రాంతినివ్వటమే మరిచిపోయారు. రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు తయారైంది నా పరిస్థితి. మీ సమస్య తీర్చమంటున్నారు సరే.. ఇప్పుడు నా సంగతి ఎలా తీర్చుకోవాలో నాకే తెలీటం లేదు” అని చాలా బాధగా ముగించాడు కలియుగ వైకుంఠవాసుడు, శ్రీనివాసుడు.

హాలంతా పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌. దేవుళ్లంతా ఓ రకంగా షాక్‌లో ఉన్నారు. ఎవరిలోనూ చలనం లేదు. వారు ఆ స్థితిలో ఉండగానే.. బృహస్పతి చేతిలోని ట్యాబ్‌కు ‘ట్వింగ్‌ ట్వింగ్‌’ అని ఓ మెస్సేజ్‌ వచ్చింది. ఏమిటా అని ఓపన్‌ చేసి చూస్తే.. ఆయన పీఆర్వో చేసిన ట్వీట్‌ కనిపించింది. ఆదరాబాదరా ట్వీట్‌ ఓపన్‌ చేశాడు బృహస్పతి. సుప్రీం కోర్టు ట్వీట్ అది. దాన్నే బృహస్పతి పీఆర్వో ఫార్వార్డ్‌ చేశాడు. ఆ ట్వీట్‌లో ఇలా ఉంది.

“దేవుడికి నిద్ర, విశ్రాంతి లేకుండా పూజలు చేస్తారా?” బృందావన్‌ ఆలయ దర్శన వేళల్లో మార్పుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్‌ అది. అందులో ఇంకా క్లియర్‌గా పేర్కొంది కోర్టు బృందావనం పరిస్థితే ఇలా ఉంటే ఇక సాక్షాత్తు కలియుగ దైవం తిరుమలేశుని పరిస్థితి ఏంటి? అని సుప్రీం సూటిగా ప్రశ్నించింది. తక్షణం దేవుళ్లకు తగిన విశ్రాంతినిచ్చేలా టైమ్‌ టేబుల్‌ తయారు చేయాలి. ఇది అన్ని గుళ్లలో అమలయ్యే విధంగా చూడాలని అన్ని రాష్ట్రాల దేవదాయ శాఖలను ఆదేశిస్తూ.. ఈ రూల్‌ను అతిక్రమిస్తే ఆయా ప్రభుత్వాలపైన కఠిన చర్యలు తప్పవని సుప్రీం కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. బృహస్పతి సుప్రీం కోర్టు తీర్పును గట్టిగా చదివి వినిపించాడు. అప్పటిదాక మూగబోయిన హాలంతా ఒక్కసారిగా అరుపులు, కేరింతలతో మార్మోగిపోయింది. అప్పటిదాకా విచారవదనంతో కనిపించిన శ్రీ మహా విష్ణువు ముఖంలో కూడా ఆనందం తాండవించింది. ఎన్నడూ లేని ప్రశాంత వదనంతో దేవలోకంలో అందరికీ దర్శనమిచ్చారు మహా విష్ణువు.

Exit mobile version