Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గొల్లభామినులు.. గోవులు.. గోపాలుడు

[శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘గొల్లభామినులు.. గోవులు.. గోపాలుడు’ అనే భక్తి కవితను అందిస్తున్నాము.]

*తొర్రుపట్టుల వద్ద గొల్లదేవర నిలచి,
కర్రి కన్నయ్యతో ఊసులాడగ నేడు!
గోకులము నుండి గొల్లెతలు చేరి,
*తొలికుడుపు దేవరకు ముచ్చటగ పెట్ట,
కుడుపు తిని ఎచటికో పరుగు తీసేనే!
చెట్లుచాటున దాగి చిత్రముగ చూసి,
అలవోకగా చిరునవ్వు చిందించి
గొల్లరో గోపెమ్మ చూడు చూడమ్మ!
కానరాకున్నాడు నల్లని కన్నయ్య!

కానలయందు దాగినాడేమొ?
మాలతీలతలతో ముచ్చట్లు చెప్పెనో!
మాధవీపూలతో మత్తిల్లినాడేమో?
మధుమాలతీ పొదల ఆడుతున్నాడేమొ!
మందారవనమందు దారి కాచాడేమొ?

తులసి వనమున వనమాలి ఆయెనో!
కానరావేమయ్య నవనీతచోర!
గోపికా గోపికా ఓ గోపబాలా!

మాయ*మాణవకుడేడె? ఎచ్చటున్నాడే !
రావేల ఇచటకు అలకబూనావ?
రాధమ్మ చెంతకు చేరియున్నావా?

నవనీతమునునీకు తెచ్చినామయ్య!
మధురమైన మమత కూర్చి తెచ్చేము!
రావయ్యా కన్నయ్య గిరిధరా రారా!
చిరునవ్వు వెన్నెలలు విరియగా రారా!

కరిముచ్చు చాటుగా దాగొనియున్నావ!
రాధమ్మ నీ కడకు చల్లగా వచ్చి
దొంగాటలాడుతూ కనులు మూసేనా!

గోధూళి వేళ లేగదూడలతో,
ముచ్చట్లు చెప్పుతూ తువ్వాయితో,
పరుగుల ఉరకలతో లేగల్లొలేగయై,
వాటితో గంతులతో లేలేత గరిక
పరకలను నోటికందించుతూ,
గోమాత దగ్గరికి నవ్వుతూ వచ్చెను!

సురభి రావమ్మ! పాలీయవమ్మ!
ఆకొన్నలేగలు అలసిపోయేను!
కన్నబిడ్డలచూచి చేపులు రాగా,
క్షీరమును తాగేటి దూడల మధ్య,
తానునూ పాలను దూటుతూ తాగెను!

పాలుతాగేటి గోపయ్యనుచూసి,
ఇచ్చటనే దాగితివ ముద్దు కృష్ణయ్య!
అమ్మమ్మ! మాయలనేర్చినావే! నువ్వు!
ఒక్క దూకున వచ్చి వెన్నచట్టి పట్ట,
ముందుగా ముద్దిచ్చి వెన్న తిను కృష్ణా!

వెన్నుని గని వెన్నెలల నవ్వులతో
మురిసిపోయేరమ్మ గొల్ల భామినులు
సంతోషసాగరమున తేలినారమ్మ!

~~~

తొర్రుపట్టు = ఆవుల మంద..ఘోషము

తొర్రు = ఆవు.. మొదవు..

తొలికుడుపు = అన్నప్రాసనము లేక, దైవ ప్రసాదం సమర్పించుట, ఆరగింపు సేవ

మాణవుకుడు = బాలకుడు.. బాలుడు

Exit mobile version