Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గూడు చినబోయెరా-1

[శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి రచించిన ‘గూడు చినబోయెరా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]

యశ్వంత్ ఉదయం ఐదింటికంతా లేచి దుప్పటి మడత పెట్టి పక్క శుభ్రంగా సర్ది ఉదయ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. టెర్రస్ గార్డెన్‌లో యోగాసనాలు, ధ్యానం పూర్తి చేసుకున్నాకే మిగతా కార్యక్రమాలు ప్రారంభమౌతాయి అతడికి. అతడి పన్నెండవ యేట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా చేరినప్పటి నుండి అతడి కబ్బిన క్రమశిక్షణ అది. కాని కొన్ని నెలలుగా అది బీటలు వారుతూ వచ్చి కనుమరుగై పోయింది. అసలు ఆ యశ్వంత్‌కీ ఈ యశ్వంత్‌కీ పోలికే లేనంతగా మార్పు వచ్చింది. ఆ కర్రసాములూ, యోగా, సేవా కార్యక్రమాలు, రక్త దానాలు, ఆ ఉత్సాహం, ఆ ఎనర్జీ గత స్మృతులుగా మిగిలి పోతున్నాయి. అతి ప్రియమైన వ్యక్తులు జీవితం నుండి తప్పుకున్నట్టే అవీ జీవితం నుండి తప్పుకున్నాయి.

చాలా రోజులుగా అతడికి నిద్ర సరిగా పట్టడం లేదు. నిద్ర లేని రాత్రులు గతాన్ని కెలికి మనసునెంత వేదనకు గురి చేస్తాయో నిద్రలేమి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.. తట్టుకోలేక నిద్ర మాత్రలు అలవాటు చేసుకున్నాడు. గంటా రెండు గంటలు.. అదీ కలత నిద్ర.. ఆ నిద్రలో తలా,తోక లేని పిచ్చి కలలు.. పక్క మీద దొర్లగా దొర్లగా ఏ తెల్లవారు ఝామునో కాస్త కునుకు.. గోడ గడియారం ఠంగున అయిదు కొట్టి లేపేస్తుంది.

ఆ రోజూ అలాగే లేచాడు యశ్వంత్. బెడ్ మీది నుండి లేచి ఉదయం కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఫ్రిజ్ లోనుంచి పాల పాకెట్ తీసుకుని స్టౌ మీద వేడి చేసి కాఫీ కలుపుకున్నాడు. బాల్కనీ లోకి వచ్చి రోజూ కూర్చునే కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ బయట ప్రకృతిని చూడసాగాడు. ఐదో అంతస్తులో వున్న బాల్కనీ అది! అక్కడక్కడా కొన్ని బిల్డింగ్స్ అడ్డమైనా ఆకాశం బాగానే కనిపిస్తూంది. చీకటి తెరలు చీల్చుకుని వెలుగు రేఖలు పరుచు కోవలసిన సమయమది. పొగమంచు దట్టంగా అలుముకుని వెలుగు రేఖలను తన పొట్టలో దాచుకుందేమో చీకటిగా, ఏమీ కనిపించకుండా వుంది. చెట్ల మీద పక్షులు మాత్రం తమ కిచ కిచలతో తెల్లారిందని చెబుతున్నాయి. బయట ప్రకృతిని కొండచిలువలా చుట్టేసి స్తబ్ధంగా మార్చిన పొగమంచు లాంటిదే తన మనసునీ చుట్టేసింది. ఈ కొండచిలువ నుండి ప్రకృతి బయటపడుతుందేమో గాని తనకి విడిపించుకునే అవకాశం లేదనుకున్నాడు యశ్వంత్. ఈ బొందెలోని ఈ జీవిని పట్టుకు పోవడానికి తన ఊపిర్లను లెక్కపెడుతూ చివరి ఊపిరి కోసం ముంగిట మృత్యువు వేచి వుందని తెలుసు. మనిషి ఆయుర్దాయం వాళ్ళు తీసుకునే శ్వాసలను బట్టి వుంటుందట. డాక్టర్లు చెప్పేశారు.. ఇక కొద్ది రోజులు! అంతే! తన రక్తంలోని కాన్సర్ కణాలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి ఈ శరీరాన్ని మృత్యుదేవత చేతికి అందివ్వడానికి.

ఒకసారి తన శరీరం వైపు చూసుకున్నాడు యశ్వంత్. వదులొదులుగా వేళ్ళాడుతున్న చొక్కాలో పంట చేల మధ్య నిలబెట్టిన దిష్టి బొమ్మలా వున్నాడు. నిర్వేదం పులుముకున్న నవ్వొకటి అతడి పెదవుల మీద కదిలింది. గతం మనసులో మెదిలింది.

***

పధ్నాలుగు పదిహేనేళ్ళు వచ్చేసరికి ఫిట్‌నెస్ మీద దృష్టి మళ్ళింది. జిమ్‌కి వెళ్ళేవాడు. వెళ్ళని రోజు ఇంట్లోనే చేసేవాడు. పిడికిలి బిగిస్తే భుజం క్రింద ఇంతెత్తున ఉబ్బే కండరాల్ని చూసి మురిసి పోయేవాడు. కర్ర తిప్పడంలో మెరుపు వేగం చూపేవాడు. “కండలు పెంచి కర్ర సాములు నేర్చి ఎవరి మీదికి యుద్ధానికి వెళ్ళాలిరా” అని వెక్కిరించే వాళ్ళు అన్నగార్లు. “ఈ ప్రపంచంలో ఏ చోట చూసినా మనిషికి మనిషి శత్రువే! అవతలి మనిషిని అణగ ద్రొక్కి ఆధిపత్యం సంపాదించాలని చూసే వాడే! మన ప్రక్కన ఒక శత్రువు ఉన్నప్పుడు వాడి నుండి ఆత్మ రక్షణ చేసుకోడానికైనా మనకు మానసిక బలంతో పాటు శారీరక బలం కూడా అవసరమే.. మన నమ్మకాలను, మన ఆత్మగౌరవాన్ని కించపర్చి మనలను క్రిందికి లాగి పడేస్తుంటే వాడి ముక్కు మీద గుద్ది తగిన సమాధానం చెప్పడానికైనా మనకు బలం అవసరమే కదా? ఈ అవసరం గమనించే వివేకానందుడు.. యువతకు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగి వుండాలని చెప్పేవారు.” అనేవాడు యశ్వంత్.

యశ్వంత్ అంతంత బరువులెత్తి చెమటలు కారుస్తుంటే తల్లి మనసుకి బాధగా వుండేది. “అల్లారు ముద్దుగా పెంచుకున్నాంరా.. ఏ అమాలీలో, కూలీలో మోసినట్టుగా ఆ బరువులెత్తడమేమి, చెమటలు కక్కడమేమి” అనేది. ఇంటి వాళ్ళ సంగతి వదిలి పెడితే స్నేహితులు మాత్రం జూనియర్ సల్మాన్ అని పిలుచుకునేవారు.

***

గతం గుర్తొచ్చి చేయి చాచి పిడికిలి బిగించి చూచుకున్నాడు యశ్వంత్. కండలు పైకి ఉబ్బుకు రాలేదు గాని కండ కరిగి పోయి చర్మం కప్పిన ఎముకలు కనిపించాయి. ఆరోగ్య కరమైన ఆ శరీరమూ.. ఆనందకరమైన ఆ జీవితమూ ఏమై పోయాయి? అతిలోక సౌందర్యవతి అయిన భార్య, ముద్దు లొలికే బిడ్డ తన జీవితం శూన్యం చేసి వెళ్ళి పోయారు. ఎందుకిలా అయిపోయింది తన జీవితం? తను చేసిన తప్పేమిటి?

గత జీవితం ఒక దృశ్యంగా మారి సినిమా రీల్‍లా మనో ఫలకం మీద కదలి పోసాగింది.

***

బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా ఒక్కటైన జంటకు అది తొలి రాత్రి. శోభనం రాత్రి! నవ వధువు మంజులకు తెల్ల చీర కట్టించి చక్కగా అలంకరించి పాల గ్లాసు చేతి కందించి “మరిది నీకోసం పైన తన గదిలో ఎదురు చూస్తుంటాడు వెళ్ళు” అంది పెద్ద తోడి కోడలు వరలక్ష్మి.

ఎన్నో మధురోహలు గుండెలో సందడి చేస్తుండగా పాల గ్లాసు పదిలంగా పట్టుకుని పైకి వెళ్ళి యశ్వంత్ గది తలుపు తట్టింది మంజుల.

“తలుపు గడియ పెట్టలేదు. లోపలికి రావచ్చు.”

తను చూసిన సినిమాల్లోని శోభనం సీన్లు కళ్ళ ముందు కదలసాగాయి మంజులకు. తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టగానే తలుపు చాటున వున్న అతడు గబుక్కున చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేస్తాడని, సుతారంగా నడిపించుకుంటూ పోయి మంచంమీద పడేసి చిలిపి పనులు చేస్తాడని.. ముద్దులతో ముంచెత్తుతాడని.. ఆత్రంగా వుంది ఆ అనుభవం ఎలా వుంటుందో నని! తలుపు నెట్టుకుని లోపలి వెళ్ళాలా.. అతడొచ్చి తీసికెళ్ళేదాకా ఆగాలా?.. తటపటాయిస్తూ నిలబడింది మంజుల. అతడు రాలేదు.. తీసికెళ్ళలేదు. మరోసారి తలుపు తట్టింది. మళ్ళీ అదే జవాబు! తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళక తప్పలేదు. అతడు జెంటిల్మెన్‌లా దిండ్లను ఆనుకుని చదువుకుంటున్నాడు. “ఓ! మంజూ! నువ్వనుకోలేదు. నువ్వనుకుంటే గుమ్మం దగ్గరికి వచ్చి ఈ నా సౌందర్య దేవతని సాదరంగా స్వాగతించే వాడిని. సారీ!” అంటూ చదువుతున్న పుస్తకం పక్కన టీపాయ్ మీద పెట్టి మంచం దిగొచ్చాడు. ఆమె చేతిలోని పాల గ్లాసు ఓ చేత, మరో చెయ్యి ఆమె నడుం చుట్టు వేసి నెమ్మదిగా మంచం దగ్గరికి నడిపించుకు పోయి మంచం మీద కూర్చోబెట్టి ప్రక్కన తానూ కూర్చున్నాడు. ఆమె చుబుకం పట్టి పైకెత్తి ముఖంలోకి ఆరాధనగా చూస్తూ, “అందమైన కొలనులో ఇప్పుడే విచ్చిన పద్మంలా వుంది నీ ముఖం. పెళ్ళి చూపుల్లో మొగమాటపడి సరిగా చూడ లేదు. ‘వీడు ఆడపిల్లని ఎప్పుడూ చూడనట్టు మొరటుగా ఎగబడి చూస్తున్నాడేమిటి’ అని అనుకుంటారేమో నని. పెళ్ళిలో కూడా సరిగా చూడలేదు. చాలా సేపు తెర అడ్డం! తెర తీశాక కూడా ముఖానికి బాసికాలు. అవి తీశాక కూడా ముఖానికి ఇంతెత్తున పౌడర్ కొట్టుకుని కొట్టొచ్చేలా పెదవులకు ఇంత రంగు పూసుకొని ఫుల్ మేకప్‌లో వున్నావు.. నీ అసలు అందం ఎక్కడ కనిపించింది! నిజం చెప్పాలంటే మేకప్ అవసరం లేదు నీకు! సహజ సిద్ధమైన అందం నీది! ఇంత అందం నా స్వంతం అనుకుంటే చాలా గర్వంగా వుంది. అదృష్టవంతుడిని నేను. నా మనసులోని మాటను నిజాయితీగా చెప్పాను. మరి నీకు నేను నచ్చానా? నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు.” అన్నాడు.

నచ్చావు అన్నట్టుగా మౌనంగా తలూపింది మంజుల.

“మనది ప్రేమ వివాహం కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు. అభిరుచులు, ఆలోచనలు, భవిష్యత్తు పట్ల ఆలోచనలు, లక్ష్యాలు ఏమీ తెలియకుండానే ఒక్కటయ్యాం. ఇప్పుడు సంసార జీవితంలో అడుగు పెడుతున్నప్పుడైనా ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడం, మనసులు కలబోసుకోవడం అవసరమని నా ఉద్దేశం.”

“……”

“మాటలు రావా? మూగ పిల్లవా? అయ్యో, భగవంతుడా! మూగ పిల్ల నిచ్చి పెళ్ళి చేశారా? ఎంత మోసపోయాను!” తమాషాకి అన్నట్టుగా అన్నాడు, కొంటె నవ్వు కంటి చివర మెరుస్తుండగా.

మంజుల కంగారు పడింది. “అదేం లేదు. ఏం మాట్లాడాలో తోచక..”

 ఆమె చుబుకం క్రింద రెండు వేళ్ళుంచి సుతారంగా పైకి లేపుతూ “నీ గురించి చెప్పు! పెళ్ళిచూపులకు ముందు పెద్దొదిన నీ గురించి చెబుతూ, ‘అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూంది, నలుగురన్నదమ్ముల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల! మనకీ వాళ్ళకీ దూరపు చుట్టరికం కూడా వుంది..’ అని అంది. అంతకు మించి ఇంకేం తెలియదు. నీ అభిరుచులు, ఇష్టాలు.. డిగ్రీ తరువాత ఏం చేయాలను కుంటున్నావు.. పీజీ చేయాలనుకుంటున్నావా?” అడిగాడు.

“నాకు మొదటి నుండి చదువంటే బోర్. కనీసం డిగ్రీ అయినా లేకపోతే ఎలా అని అమ్మావాళ్ళ బలవంతంతో డిగ్రీలో చేరి ఫైనల్ కి వచ్చాను. ఆ కాస్తా పరీక్షలు అయిపోగానే చదువుకు దండం పెట్టేయడమే.”

“డిగ్రీ అయిపోయాక ఏం చేస్తావు మరి? టైం పాస్ కావాలి కదా?”

“టైంపాస్ కేమి.. టీవీ ఉంటుంది, ఫోనుంటుంది. యూట్యూబ్ తెరిస్తే టైమే తెలియదు. స్నేహితులున్నారు. వాళ్ళతో మాట్లాడుతుంటే గంటలు గంటలు తెలియకుండానే గడిచిపోతాయి.”

“నీ ఇష్టాలు చెప్పు! సినిమాలు ఇష్టమా? అభిమాన హీరో హీరోయిన్ ఎవరు? ఖాళీ సమయంలో ఏం చేయాలని అనిపిస్తుంది? పుస్తకాలు.. అంటే.. కథలూ నవలలు చదివే అభిరుచి వుందా?”

“క్లాస్ పుస్తకాలు చదవడం అంటేనే బోర్.. ఇక అవన్నీ ఎవరు చదువుతారు?”

“నా గురించి కూడా నువ్వు తెలుసుకోవడం మంచిది కదా?.. నాన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్! అన్నయ్య లిద్దరూ డిగ్రీ పూర్తవగానే నాన్నకి చేదోడువాదోడుగా బిజినెస్ లోకి వెళ్ళి పోయారు. చిన్నన్నయ్య తరువాత చాలా గ్యాప్‌తో పదేళ్ళకి పుట్టినందుకేమో అమ్మకి నేనంటే గారాబం ఎక్కువ, చిన్నోడు చిన్నోడంటూ. నాన్నకి ఇంట్లో ఉండి పిల్లలతో గడిపే సమయం తక్కువ. మాకేదైనా సుస్తీ చేస్తే మాత్రం ఎన్ని పనులున్నా మా దగ్గరి నుండి కదిలేవాడు కాదు. నాన్నా ఎలా వుందిరా అని ఘడియ ఘడియకూ అడుగుతూ డాక్టరు రాసిచ్చిన మందులు టైం ప్రకారం వేస్తూ పాలూ పళ్ళ రసాలు తాపుతూ మా ప్రక్క ప్రక్కనే దిగులుగా కూర్చుని వుండేవాడు. అమ్మా నాన్నల ప్రేమను ఎంత పొందాలో అంతా పొందిన అదృష్టవంతులం మా ముగ్గురు అన్నదమ్ములం. అన్నయ్యల కంటే నేను చాలా చిన్నవాడిని కావడం వల్లేమో యశూ యశూ అంటూ పోటీ పడి ఎత్తుకుని తిప్పేవారు ఇద్ధరన్నయ్యలు.. వాళ్ళకీ నేనంటే అపేక్ష! ‘అన్నయ్యలిద్దరూ బిజినెస్ లోకి వచ్చేశారు..నువ్వు బాగా చదువుకొని డాక్టర్ కావాలి..పై చదువులకి నిన్ను అమెరికా పంపిస్తాను’ అనేవాడు నాన్న. నాకు మాత్రం నీలాగే చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఏవరేజ్ స్టూడెంట్‌నే. అన్నయ్యలకి కొంచెం డిఫరెంట్ గానే పెరిగాను. నా ఫ్రెండు హరీష్ తండ్రి టీచరుగా చేస్తూనే ఆర్.ఎస్.ఎస్.లో చురుకైన కార్యకర్తగా వుండేవాడు. కర్రసాముల్లో, కుస్తీ పట్లలో యోగాసనాలలో శిక్షణ ఇచ్చేవాడు. మంచి బాడీ బిల్డరు. హరి తాను వెడుతూ నన్నూ తీసుకెళ్ళేవాడు. కొద్ది రోజుల తర్వాత నేనూ శిక్షణ నిచ్చే స్థాయికి ఎదిగాను శాఖలో.

తరుచూ సేవాకార్యక్రమాలు, రక్త దాన శిబిరాలలో చురుకైన కార్యకర్తగా పాల్గొంటుంటాను. సంవత్సరానికి రెండు సార్లు రక్తదానం చేస్తుంటాను. నాన్న బిజినెస్ లోకి నేను వెళ్ళక పోయినా బిజినెస్ అనేది రక్తం లోనే వుందేమో నాన్న నడిగి డబ్బు తీసుకుని చిన్న చిన్న బిజినెస్ లు చేస్తుంటాను.. మంచి లాభాలు వచ్చాయి. నా డబ్బుతో కారు కొన్నాను. సిటీలో కుక్కట్‌పల్లి సైడ్ ఫ్లాట్ కొన్నాను.. మా ఫ్రెండ్ కొంటుంటే. నాకు ఎందరో స్నేహితులున్నా హరి నా ప్రాణ స్నేహితుడు. బాధ కలిగినా ఆనందం కలిగినా వాడితో పంచుకుంటాను. వాడూ అంతే. ఇక నీ సంగతి చెప్పు!” మాట్లాడుతున్నంత సేపు ఆమె చెయ్యి తన చేతిలోనే పట్టుకున్నాడు.

“నలుగురు అన్నలకు ముద్దుల చెల్లిని. మా అమ్మ నన్ను మా ఇంటి మహాలక్ష్మి అంటుంది. మా ఇంట్లో నా గారాబానికి ఏం తక్కువ లేదు.” గర్వంగా చెప్పింది.

“ఎంత తమాషా? మనిద్దరి జీవితాలలో దగ్గరి పోలికలున్నాయి కదూ?” యశ్వంత్ మాట్లాడుతూనే చేతి కున్న గడియారం వైపు చూశాడు. “వీడేమిటి.. శోభనపు మంచంమీద అసలు పని వదిలి పెట్టి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నా డనుకుంటున్నావా? ప్రొద్దున సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజ కాగానే అయ్యగారు దక్షిణ తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోతూ.. నా చెవిలో గుసగుసగా ఏం చెప్పాడో తెలుసా? పదకొండు తరువాత కార్యానికి సుమూహూర్తం వుందని చెప్పాడు. ఈ లోపల కబుర్లు చెబుతూ అమ్మాయి భయం పోగొట్టి సాన్నిహిత్యం ఏర్పడేలా చూచుకొమ్మని చెప్పాడు.” గిలిగింతలు పెడుతున్నట్టుగా వున్న అతడి కొంటె చూపుకు సిగ్గు ముంచు కొచ్చినట్టుగా తల దించుకుంది మంజు. తరువాత ప్రక్క మీద మల్లెపువ్వులు నలిగి పోవడానికి ఎంతో సేపు పట్టలేదు.

రెండు మూడు నెలలు పూల తెప్ప మీద విహార యాత్రలా గడిచి పోయింది వారి దాంపత్య జీవితం.

***

మంజూకి ఆ రోజు చాలా బోర్‌గా వుంది. యశ్ ఆఫీసుకు వెళ్ళి పోయాక టీవీలో రెండు సినిమాలు చూసింది. ఇక చూడాలనిపించక ఆపు చేసి ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసింది. ఎగ్జామ్స్‌కి చదువుకోవాలని కబుర్లు పొడిగించకుండా ఫోన్ పెట్టేసారు. పుట్టింటికి చేసింది. చిన్న వదిన తప్ప ముగ్గురు వదినలు ఉద్యోగస్తులు. డ్యూటీకి వెళ్ళి పోయారు. చిన్నొదిన పుట్టింటికి వెళ్ళింది. తల్లి “చేతిలో పని వుందే.. తరువాత మాట్లాడతాను” అంటూ ఆవిడా ఫోన్ పెట్టేసింది. ఎవరితో మాట్లాడదామన్నా అందరూ బిజీ బిజీ! ఈమధ్య టీవీ చూడ్డం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం ఇదివరకులా సంతోషాన్నివ్వడంలేదు. యశ్ సాన్నిధ్యం తప్ప ఇంకేమీ సంతోషాన్నివ్వడం లేదు. కిటికీ దగ్గరికి వెళ్లి బయటికి చూస్తూ నిలబడింది. నిలబడి నిలబడి కాళ్లు లాగుతున్నా అలాగే నిలబడింది. చివరికి కారు దిగుతూ కనిపించాడు యశ్. సరాసరి పైకొస్తాడనుకుంది. ఎంతకీ రాలేదు. దుఃఖం వచ్చేసి వెళ్ళి మంచం మీద పడి పోయింది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు యశ్. బట్టలు మార్చుకుని, తల్లి భోజనానికి పిలిచి వడ్డిస్తే వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని తినేశాడు, అప్పటికే అతడికి ఆకలేస్తూ వుండడం వల్ల. చెయ్యి కడుక్కుని మెట్లెక్కి పోతుంటే పిల్లలు అతడి చెయ్యి పట్టి లాక్కు పోయారు.. బాబాయ్ క్యారమ్స్ ఆడుదాం రమ్మంటూ. రెండాటలాడి డ్రెస్ చేసుకొని పైకి వెళ్ళాడు. అతడు తలుపు తట్టగా తట్టగా వచ్చి తలుపు తీసి విసురుగా వెళ్ళి పడుకుంది. ఏడ్పుతో ఎర్రబడిన కళ్ళు చూసి విస్తుపోయాడు.

“ఏడుస్తున్నావా! ఎందుకు? ఏం జరిగింది? ఎవరేమన్నా అన్నారా” ఆమె గడ్డం క్రింద చెయ్యుంచి ఆర్తిగా అడిగాడు.

“నన్ను నా పుట్టింటికి తీసికెళ్ళి వదిలి రండి”

“ఎందుకు.. ఏం జరిగింది?”

“నాకిక్కడ చాలా బోర్ గా వుంది.”

“బోరయితే ఇలా గదిలో వుండిపోక క్రిందికొచ్చి పిల్లలతో ఆడుకోవచ్చు కదా.. సెలవులు కావడంతో పిల్లలు ఇంట్లోనే వున్నారు. వాళ్ళతో చెస్, క్యారమ్స్ ఆడుకోవచ్చు కదా.. ఆటకి మంచి పార్టనర్ దొరికిందని సంతోష పడతారు పిల్లలు.”

“పిల్లలతో నేనేం ఆడతాను? గంట క్రితం మీరు ఆఫీస్ నుండి రావడం చూశాను. ఇప్పటికి గుర్తొచ్చానా? నేనొక దాన్ని ఒంటరిగా పడి ఎదురు చూస్తుంటానని తెలియదా?”

“సారీ రా! ఆకలేస్తుంటే అమ్మ అన్నానికి పిలువగానే వెళ్ళితిన్నాను. మంజు తిన్నదా అని కూడా అడిగాను. తిన్నావని చెప్పింది అమ్మ. తిని పైకి వస్తూంటే ‘ఆడుదాం రా, బాబాయ్’ అంటూ పిల్లలు లాక్కు పోయారు.”

“ఆఫీసుకు వెళ్ళాలని తయారయ్యారు కదా.. వెళ్ళండి. ఇంట్లో.. ఒంటరిగా నా చావు నేను చస్తాను.” ఏడుస్తూ తలగడలో తల దూర్చింది. కాస్సేపు బ్రతిమిలాడాడు. అలక తీరేలా కనిపించలేదు. ఏంచేయాలో తోచలేదు.

“అర్జెంటు పని వుంది, మంజూ! వెళ్ళాలి! తొందరగా రావడానికి ప్రయత్నిస్తాను. ఒంటరిగా వుంటే ఇలాగే పిచ్చిగా వుంటుంది. లే! లేచి ఫ్రెష్ అయి క్రిందికి వెళ్ళి వదినా వాళ్ళతో మాట్లాడు. పెద్దొదిన చాలా సరదా మనిషి ఛలోక్తులు వేసి నవ్విస్తూ వుంటుంది. నాకామె అమ్మ తరువాత అమ్మలాంటిది. ఆమెకు పెళ్లి అయి ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను పిల్లవాడిని. చిన్న వదినకి నవలల పిచ్చి.ఆమెకి లైబ్రరీ నుండి నవలలు తెచ్చి పెట్టి తెచ్చి పెట్టీ నాకూ సాహిత్యం మీద ఇష్టం ఏర్పడింది. అయితే నేను చదివేది ఇంగ్లీషు నావెల్స్, ఫిలాసఫీ. వెళ్ళి చిన్నొదినతో మాట్లాడు. తను చదివిన ఏ నవల గురించో అద్భుతంగా చెప్పి నీకు టైం తెలియకుండా చేస్తుంది. నువ్వూ ఆమెలా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నావంటే బోర్ అన్న మాట నీ దగ్గరికే రాదు.”

“ఇంకేమైనా చెప్పు.. ఆ చదవడమంటే నాకు బోర్.”

ఒకటి రెండు రోజులు తరువాత యశ్ వాళ్ళమ్మ రాధమ్మ కూడా తన అసంతృప్తి వ్యక్తం చేసింది కొడుకు దగ్గర. టిఫిన్‌కీ, భోజనానికీ క్రిందికి రావడం తప్ప కోడలు ఎప్పుడూ తన తన గదిలో వుండిపోవడం గురించి.

“గెస్ట్‌లా తినడానికి మాత్రమే క్రిందికి వస్తుంది. ఎవరితో మాటా మంతీ వుండదు. నలుగురున్న ఉమ్మడి కుటుంబం! అందరిలో కలివిడిగా తిరిగితే బాగుంటుంది. నీ భార్యకి చెప్పు!”

యశ్ చెప్పాడో లేదో గాని మంజు ప్రవర్తనలో మార్పు రాలేదు. ముందొచ్చిన కోడళ్ళిద్దరు ఆణి ముత్యాలు. ఎన్నడూ ఏ మాటా చెప్పించుకోలేదు. కుటుంబంలో చక్కగా ఒదిగి పోయారు. ఈ పిల్ల కొంచెం వేరే.. అనుకుందామె. చూచాయగా చెప్పిందో నాడు ఇలా ఉంటే బాగుండదని.. మొగుడికి ఏం చెప్పిందో గాని.. చెప్పిన గంటకే హాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకొని స్టైల్‌గా మేడ దిగింది మంజు. వెనక బ్యాగ్ భుజానికి వేసుకుని దిగిన యశ్ హాల్లో వున్న తల్లి దగ్గర ఆగి “మంజుకి వాళ్ళమ్మను చూడ బుద్ధవుతుందట. దింపి రేప్పొద్దున వచ్చేస్తాను”అని పెళ్ళాం వెనుక వెళ్ళిపోయాడు.

పుట్టింటికి వెళ్తానని ఒక్క మాట అడగలేదు ఈ కొత్త కోడలు. వెళ్ళేప్పుడూ ఒక్కమాట చెప్పలేదు. తిరిగి వచ్చాక కూడా తిన్నగా వున్నది లేదు. మేనల్లుడి పుట్టిన రోజు అనో, మేనకోడలు చీరకట్టు ఫంక్షన్ అనో, పండుగనో పబ్బమనో.. పుట్టింటికి ప్రయాణం కడుతూనే వుంటుంది. రాధమ్మకి ఒకటి అర్థమైంది.. ఈ చిన్న కోడలు కొంచెం కొరకరాని కొయ్య అని.. కొడుకు ఆమె ముందు డూడూ బసవన్న అయ్యాడని! నలుగురున్న మంచి కుటుంబం.. పిల్ల చక్కని చుక్క అని చిన్నకోడలుగా తెచ్చుకుంది! ఎలా చక్కదిద్దాలో తెలియడం లేదు. ఏం అంటే ఏం తప్పో, అత్తగారు మంచిది కాదన్న చెడ్డ పేరు వస్తుందేమో నన్న భయం. చూసి చూసి ఓనాడు స్పష్టంగానే చెప్పింది “హోటల్‌కి వచ్చి తినేసిపోయినట్టు ఇదేం పద్దతి, మంజులా? ఇది ఉమ్మడి కుటుంబం.. తలా ఓ పని చేస్తేనే అందరికీ అన్ని వేళకు అందుతాయి. నీకు చేతనైన పని నువ్వు చేయాలి.”

“నాకు పని అలవాటు లేదు, ఆంటీ! మా ఇంట్లో చిన్న పని కూడా చేయనివ్వరు. అన్ని పనులకు పని వాళ్ళున్నారు. ఇవతలి పుల్ల అవతల పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బు పారేస్తే పని వాళ్ళు బొచ్చెడు మంది దొరుకుతారు. మాకు డబ్బుకు కొరత లేదు.”

“ముందు ఆ ఆంటీ అన్న పదం మళ్ళీ వాడకు! అత్తయ్యా అని పిలువు!”

“మా వదినలు మా అమ్మని ఆంటీ అనే పిలుస్తారు.”

“అది మీ అమ్మ గారికి ఇష్టమేమో.. నాకిష్టం కాదు. పారేయడానికి డబ్బు ఇక్కడా కొదవలేదు. వంటపని మనం చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. మనం తింటున్న రెండు ముద్దలు బ్రతకడానికి కాదు, ఆరోగ్యం కోసం! ఆనందంగా వుండడం కోసం! భర్తా పిలలకు భోజనం రుచికరంగా చేసి వడ్డించడంలో వున్న ఆనందం ఇల్లాలికి మరెందు లోనూ దొరకదు. ఒక ఇంటికి ఇల్లాలిగా నా అభిప్రాయమది! రోజూ వంట నేనే చేస్తాను. పెద్దకోడలు టిఫిన్ పని చూస్తుంది. చిన్నామె వంటకి కావలసిన కూరగాయలు తరిగి పెట్టి అవి ఇవి అందిస్తూ నాకు సాయంగా వుంటుంది. రేపటి నుండి నువ్వు ఆ డ్యూటీ తీసుకో..”

“చేతులు కోసుకుంటానని మా అమ్మ నన్ను చాకులు గాని, కత్తి పీట గాని ముట్టు కోనిచ్చేది కాదు. నాకు కొయ్యడం రాదు.” అనేసి మరో మాటకు అవకాశం లేకుండా చర చర పైకెళ్ళి పోయింది మంజు.

ఆ రోజు రాత్రి భోజనానికి రాలేదు. యశ్ ఎంత బ్రతిమాలినా పట్టు విడువలేదు. “నాకు పని రాదు! మీ అమ్మ మాటలను బట్టి చూస్తే పని చేసే వాళ్ళకే ఈ ఇంట్లో తిండి అన్నట్టుగా ఉంది.!”

“ఛ! అమ్మ ఆ ఉద్దేశంతో అని ఉండదు. పనివాళ్ళ మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోవడం మంచిదన్న ఉద్దేశంతో అని వుంటుంది.”

“మీరు మీ అమ్మని సమర్థించక నన్ను సమర్థిస్తారా?మీరు మీరంతా ఒకటి. పరాయిదాన్ని నేనే కదా? నన్ను మా ఊరికి పంపించెయ్యండి.” ఏడవ సాగింది.

తల పట్టుకున్నాడు యశ్. ఎలా నచ్చ జెప్పాలో తోచలేదు.

“బాబాయ్, నాన్నమ్మ భోజనానికి రమ్మంది” పెద్దన్న కూతురు రత్న వచ్చి పిలిచి పోయింది.

పొట్టలో ఆకలి దంచేస్తున్నా తానూ పస్తు పడుకోక తప్పలేదు యశ్‌కు. పొద్దున అన్నాడు తల్లితో “అదో రకం మనిషమ్మా తను. నువ్వు ఏదో అనడం, ఆమె ఏదో అనుకోవడం.. ఆ దెబ్బ నా మీద పడడం! మరోసారి ఇలాంటివి రిపీట్ కాకపోతే మంచిది. ప్రశాంతంగా ఉంటుంది. తను పని చెయ్యక పోతే జరగదా ఇంట్లో? ఇన్నాళ్ళు అమే చేసిందా” కొంచెం సీరియస్ గానే అన్నాడు.

రాధమ్మకి ఎంత తర్కించుకున్నా తాను అన్న దాంట్లో అంత తప్పేం వుందో అర్థం కాలేదు. కాని ఒకటి అర్థమైంది.. ఈ చిన్న కోడలు షార్ట్ టెంపర్ మనిషని! ఆమె జోలికి పోకపోతేనే తన అత్తగారి మర్యాద నిలుస్తుందని! ఎంత సహనం తెచ్చుకుందామన్నా తిండికి తప్ప మేడ దిగని ఈ కోడలి వ్యవహారం చికాకు తెప్పిస్తుంటే ఓ రోజు వియ్యపురాలికి ఫోన్ చేసి మంజూ వ్యవహారం గురించి చెప్పింది.

ఆమె కూతుర్ని వెనకేసుకు వచ్చింది. “అది మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల. మా ఇంటి మహాలక్ష్మిగా, గారాబంగా పెరిగింది. అన్నలకీ అదంటే ప్రాణం. చిన్న పని కూడా చేయనిచ్చేవాళ్ళు కాదు. పనిదేముంది, వదిన గారూ!పైసలు పారేస్తే పని వాళ్ళు కొదవా? మీరు నెమ్మది మనుషులని, కోడళ్ళని కూతుళ్ళలా చూసుకుంటారని మధ్యవర్తులు చెబితేనే మీ సంబంధం కలుపుకున్నాం. మీ తీరేమో ఇలా వుంది. మంజు నాకంతా చెప్పింది. అందరిలో కలివిడిగా తిరగడం లేదని మీ షికాయత్ అయితే నెమ్మదిగా కలిసి పోతుంది లెండి. తొందరపడి మాటలు జారకండి. వ్యవహారం చెడిపోతే తల్లిని నేను కూడా సరి చేయలేను.”

‘వీళ్ళ గారాబం తగలెయ్య! పిల్లను చెడగొట్టారు కదా’ అనుకుందామె ఫోన్ పెట్టేసి.

చీటికీ మాటికీ బాగ్ సర్దుకుని పుట్టింటికి తయారు.. అమ్మను చూడబుద్ధేస్తుందని.. అదని ఇదని! పంపక పోతే గొడవ! మనశ్శాంతి కరువు! పెళ్ళి కాక ముందు ఒంటరిగా ఎలా వున్నాడో తెలియదు గాని ఇప్పుడు మంజు లేకుండా ఒక్క క్షణం వుండడం కష్టమనిపిస్తుంది యశ్వంత్‌కి. అందుకని తానే తీసికెళ్ళి తనతో పాటు ఒకటి రెండు రోజులుండి తీసుకు వచ్చేస్తున్నాడు. చీటికి మాటికి ఈ ప్రయాణాల వల్ల తన బిజినెస్‌కి దెబ్బ అని గాని, ఈ పద్ధతి బాగా లేదని గాని, ఇంట్లో అందరితో కలివిడిగా ఉండమని గాని చెబితే అస్సలు పాజిటివ్‌గా తీసుకోదు. అవమానంగా ఫీలవుతుంది. చలవరేకులా తెల్లగా వుండే ముఖం మంకెన పువ్వులా ఎర్రగా అయిపోతుంది. నిండుగా వున్న నీటి తొట్టిని కదిలించినట్టుగా కన్నీళ్ళు జల జల రాలిపోతాయి.

చిన్న కోడలి ఈ వ్యవహారమంతా చూసి ‘మేడమీద రాజకుమారి’ అన్న పేరు పెట్టింది, యశ్ పెద్దన్న భార్య వరలక్ష్మి. వాళ్ళలో వాళ్ళు మంజు గురించి మాట్లాడుతున్నప్పుడు అదే పేరుతో వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో మనం పెట్టిన పేరు తెలిస్తే మన భరతం పడుతుందని కూడా నవ్వుకుంటున్నారు.

***

నెల తప్పడంతో మంజు ఎక్కువగా పుట్టింట్లోనే వుండసాగింది. మూడో నెల తల్లి వచ్చి తీసికెడితే పాప పుట్టి అయిదో నెల పడ్డాక గాని పంపలేదు.

యశ్ కంటే పెద్ద వాళ్ళైన ఇద్దరన్నదమ్ముల పిల్లలు పెద్ద వాళ్ళై స్కూళ్ళకి వెడుతున్నారు. చాలా రోజుల తరువాత తమింటికి పారాడే పాప రావడం వల్ల అందరికీ అపురూపమైపోయింది యశ్ పెద్దొదిన పాపకి పాలు పట్టడం, ఆడిస్తూ తినిపించడం చేస్తే చిన్న కోడలు రమ్య లాల పోసి బొట్టూ కాటుక పెట్టి చక్కగా అలంకరిస్తుంది. షాపింగ్ కి పోయినప్పుడల్లా మా బుజ్జికి ఇది బాగుంటుంది అది బాగుంటుందని ఎంత ఖరీదైనా నచ్చిన డ్రెస్ తెచ్చి ఆ పిల్లకి తొడిగిస్తే తప్ప ఆమె మనసు ఆగదు. ఇక పిల్లలైతే ఎత్తుకొని ఆడించడానికి పోటీ పడతారు. రాధమ్మ ప్రొద్దున, సాయంత్రం మనుమరాలికి దిష్టి తీస్తుంది.

అందరి ప్రేమ ఒకెత్తయితే యశ్ ప్రేమ ఒకెత్తు. ఇంట్లో వున్నంత సేపు అతడి గుండెలే పాపకి పాన్పుగా మారిపోతాయి. చేతులతో పైకెత్తి పట్టుకుని ఎగరేస్తూ “నా బుజ్జి, నా మాణిక్యం, నా బంగారు, నా వెన్నెల తరక, నా పాలవెల్లి” అంటూ సహస్ర నామ స్తోత్రం చదువుతాడు.

“నీ కూతురు వెన్నెల తరక అయితే మరి నేనూ?” అని మురిపెంగా అడుగుతుంది మంజు.

“నువ్వు నా నిండు చందమామవి” ఆమెను దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకుంటాడు. “నువ్వు నా జీవితంలోకి పున్నమి వెన్నెల్లా నడిచి వచ్చావు, మంజూ!”

***

మూడు నాలుగు నెలల వరకే పాపకి తన పాలిచ్చింది మంజు. తరువాత తన దగ్గర పాలు లేవని పోతపాలు అలవాటు చేసింది. పుట్టింట్లో వున్నప్పుడు పాప పనులన్నీ ఆయా చూసేది. ఇక్కడి కొచ్చాక ఆయాతో పనిలేకుండా ఇంట్లో వాళ్ళే ఇష్టంగా చూస్తుండడంతో తన గదిలో నిశ్చింతగా టీవీ చూస్తూ, స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూ హాయిగా గడిపేస్తూంది. తాను ఎంత తప్పు చేస్తూందో ఒక సంఘటనతో తెలిసొచ్చింది ఆమెకు. పగలంతా వాళ్ళ దగ్గరా వీళ్ళు దగ్గరా గడిచి పోయినా రాత్రికి అమ్మ దగ్గర పడుకోడానికి వచ్చేది పాప. రాత్రి భోజనాల తరువాత పాప నెత్తుకుని పైకి వచ్చేవాడు యశ్. ఆ రోజు ఇంటికి రావడానికి లేటవుతుందని నువ్వు తిని పైకెళ్ళేప్పుడు పాపని తనతో పాటు తీసికెళ్ళమని చెప్పాడు యశ్ మంజుతో. పైకి పోదాం రా అని ఆమె ఎత్తుకునేసరికి “నాన్నొత్తాక వత్తా” వచ్చీరాని మాటలతో చంకలోంచి జారి పోసాగింది. “పిన్నీ, నేను తీసుకు వస్తా” నంటూ రత్న ఎత్తుకు వచ్చి దించి పోయినా ఆ పిల్ల అక్కల దగ్గరికి పోతానంటూ మూసిన తలుపు పట్టుకుని ఏడవ సాగింది. మంజు లాక్కు వచ్చి మంచం మీద కూలేసింది. మంచంమీది నుండి జారిపోయి ఆ పిల్ల మళ్ళీ అదే ఏడుపు! సహనం నశించి రెండు దెబ్బలు కూడా వేసింది మంజు. ఏడ్చి ఏడ్చి అదే ఊరుకుంటుందని నిద్ర పోయిన ఆమె యశ్ తలుపు తట్టితే లేచి వెళ్ళి గడియ తీసింది. పాప ఏడ్చి ఏడ్చి తలుపు ముందే పడి నిద్ర పోయింది. నేలమీద పడి నిద్ర పోతున్న కూతుర్ని చూసి ఎంత ఆశ్చర్య పోయాడో అంత తల్లడిల్లి పోయాడు.

“రోజు రోజుకు రౌడీ వేషాలు వేస్తూ ఉందది.” జరిగింది చెప్పింది.

కూతురు పాల బుగ్గల మీద వ్రేళ్ళ గుర్తులు చూసి కోపం పట్టలేక పోయాడు యశ్. భార్య చెంప చెళ్ళు మనిపించాడు. అతడిలో విచక్షణ మేల్కొనే సరికి జరగాల్సిన అనర్థం జరిగి పోయింది. అవమానం, దుఃఖం ఆమెని పిచ్చి దాన్ని చేశాయి. హిస్టీరిక్ గా ఏడవడం, పిడికిళ్ళు బిగించి పరుపు మీద బాదడం.. అదంతా చూసి భయపడి పోయాడు. ఆమెను బలంగా గుండెలకు అదుముకుని అనునయించడం మొదలు పెట్టాడు. “సారీ రా! సారీ”

“నేనేం తప్పు చేశానని నన్ను కొట్టావు? అది నన్నెంత సతాయించిందో తెలుసా?”

“……..”

“మీ వాళ్ళు అతి ప్రేమలు ఒలక బోసి నా పిల్లను నా దగ్గరికి రాకుండా చేస్తున్నారు. నాకు కాకుండా చేస్తున్నారు. చూస్తాను, రేపటి నుండి ఇది వాళ్ళ దగ్గరికి ఎలా వెళుతుందో! చంపి పాతరేస్తాను.”

“నీ పిల్లను నీకు దూరం చేయాలని వాళ్ళెందుకు అనుకుంటారు? పసిపిల్లలంటే ఎవరికైనా ప్రాణమే. ఇంటి పిల్ల.. రక్త సంబంధం.. సహజంగా ఆ ప్రేమ ఎవరికైనా వుంటుంది. ఇక నుంచి పాప అన్ని పనులు నువ్వు చేస్తుండు. అది సహజంగానే వాళ్ళకు దూరమై నీకు దగ్గరవుతుంది. నీ పిల్లను వాళ్ళమీద వదిలేసి టీవీలో సీరియల్స్ చూస్తూ ఫోన్లో స్నేహితులతో బాతాఖానీ కొడుతూ నీలోకంలో నువ్వుండి పోతే..”యశ్ మాట పూర్తి కాకముందే దిండు తీసుకుని కొట్టసాగింది మంజు.

“నేను పెద్దగా చదువు కోలేదు. నాకే ఉద్యోగం రాదు. టైంపాస్‌కి నన్నేం చేయమంటావు? రేపటి నుండి నన్ను నీ ఆఫీసుకు తీసి కెళ్ళి పని నేర్పు. పెద్ద వ్యాపారవేత్త అవుతారం ఎత్తుతాను. నీకు గౌరవంగా వుంటుంది. నాకు దర్జాగా వుంటుంది.”

‘అమ్మ.. తల్లీ.. ఇంట్లో ఇంత వెలగబెడుతున్నావు! ఇక ఆఫీసుకు వస్తేనా..’ మనసులో అనుకున్నాడు. “పాపని చూసుకో. పాప స్కూల్ కి వెళ్ళడం మొదలు పెట్టాక అలాగే ఆఫీసుకు వద్దువు గాని” అన్నాడు మృదువుగా ఆమె వీపు మీద తట్టి.

మంజు అనుకున్నంత సులువు కాలేదు, పిల్లను పెద్దమ్మల దగ్గరికీ, అక్కల దగ్గరికీ వెళ్ళకుండా చేయడం. పట్టుకొచ్చి పట్టుకొచ్చి అన్నం పెట్టినా తినకుండా చంకలోంచి జారిపోయి రోజూ కథలు చెబుతూ ఓపిగ్గా టిఫిన్ గాని, అన్నం గాని తినిపించే పెద్ద పెద్దమ్మ దగ్గరికే పరిగెత్తి ఆమె కాళ్ళని చుట్టేస్తోంది. ఎన్నిసార్లు లాక్కుని వచ్చినా అదే తంతు. విసిగి పోయి చేతిలో వున్న అన్నం గిన్నె నేలకి విసిరి కొట్టి ధుమధుమ లాడుతూ చేతులు కడుక్కుంటుండగా మంజుతో అంది వరలక్ష్మి “పిల్లలందరూ తిండి దగ్గర ఇలాగే సతాయిస్తారు, మంజూ! వాళ్ళని ఆడిస్తూ, మరిపిస్తూ పొట్ట నింపే సరికి మనం తిన్నది కాస్తా అరిగి పోతుంది. మనం విసుక్కోకుండా పెడితే తప్ప వాళ్ళ పొట్ట నిండదు.”

ఉదయం స్నానం దగ్గరా అలాగే చేసింది. “రమ పద్దమ్మ పోస్తది” అంటూ ఆమె దగ్గరకు పరిగెత్తడం! పెద్దమ్మ అనడం రాదు దానికి. రమ్యని రమ అంటుంది.

ఒక రోజు గడిచే సరికి అందరకీ అర్థమైపోయింది, పిల్ల తమ దగ్గరికి రావడం మంజుకి ఇష్టం లేదని. ఆపిల్ల వచ్చి మీద పడుతుంటే దూరంగా పెట్టడం ఎలాగో వాళ్ళకీ తెలియడం లేదు. ఎత్తుకోకపోతే నేలకి కాళ్ళు బాదుకుంటూ రాగాలు పెట్టి ఏడుస్తూంది. మంజుకీ అర్థమైంది పిల్లని వాళ్ళకు దూరం చేయడం సాధ్యం కాదని.

***

పిల్లని ప్లే స్కూల్ లో చేర్పిస్తుందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. తల్లడిల్లారు. ఇన్నాళ్ళు ఎంతో సహనంతో చిన్న కోడలి జోలికి పోకుండా వున్న రాధమ్మకి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. అత్తా కోడలికి మాటల యుద్ధం బాగానే జరిగింది. “రెండేళ్ళయినా నిండని పిల్లను ప్లేస్కూల్ లో చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకేమైనా పిచ్చా.. నువ్వసలు తల్లివేనా?”

“తల్లిని కాబట్టే ఈ బాధ! నా పిల్ల నాకు కాకుండా పోతుందనే నా బాధ! మీరందరూ కలిసి నా పిల్లను నాకు దూరం చేస్తున్నారు..” మనసులో జ్వలిస్తున్న బాధంతా కక్కేసింది మంజు. అత్తగారే కాదు వింటున్న అందరూ అవాక్కయ్యారు. ప్రపంచంలో ఇంత విపరీతంగా ఆలోచించే వాళ్ళు ఉంటారా అని!

“ఇన్నాళ్ళు నువ్వెలా వున్నా, నీ ప్రవర్తన నచ్చక పోయినా చూసి చూడనట్టుగా పోయాను గాని ఇది మాత్రం సహించను. ముక్కు పచ్చలారని పసిబిడ్డనే అది.. ఇంట్లో చూడడానికి ఎవరూ దిక్కు లేనట్టుగా ప్లేస్కూల్‌కి పంపుతానంటే నేనొప్పుకోను.”

“మీరెవరు ఒప్పుకోడానికి ఒప్పుకోకపోడానికి? ఇది నాకు యశ్ కూ సంబంధించిన విషయం.”

“నాకు సంబంధం లేదంటావా? అత్తగారినే! నీ మొగుణ్ణి కన్న దాన్ని. గడ్డిపోచలా తీసేస్తావా నన్ను?” నిప్పులు కురిపిస్తూ చాచి కోడలి చెంప మీద కొట్టింది రాధమ్మ.

మంజు కళ్ళలో కన్నీళ్ళకి బదులు నిప్పులు కురిపిస్తూ “మళ్ళీ నిన్ను కొట్టలేనని కాదు. యశ్ బాధ పడతాడని కొట్టడం లేదు. కొడితే నీ పరువే మౌతుందో ఆలోచించు. మరోసారి నా జోలికి వచ్చావంటే జరిగేది మాత్రం ఖచ్చితంగా అదే. జాగ్రత్త!” పిల్లను చంక నేసుకుని విసురుగా పైకెళ్ళి పోయింది.

ఆమెలో అత్తగారి దాష్టీకం ఎన్నడూ చూడని కోడళ్ళిద్దరు ఆశ్చర్యపోయారు. ఆమె నిగ్రహం కోల్పోయి చిన్నకోడలి మీద చెయ్యి చేసుకోడం చూసి! యశ్ వచ్చాక ఇదంతా చెప్పి గొడవ చేస్తుందనుకున్నారు గాని మొగుణ్ణి తీసుకుని వేరు కాపురానికి వెళ్ళి పోతుందని మాత్రం ఎవరు ఊహించలేదు. పెద్దపిల్ల పైకెళ్ళి చూసొచ్చి ‘బాబాయ్ వాళ్ళు సామాను సర్దుకుని హైదరాబాద్ వెళ్ళి పోతున్నా’రని చెప్పేసరికి రాధమ్మ లబ లబ లాడుతూ పైకొచ్చింది. “ఏమిట్రా ఇది?అత్తాకోడళ్ళన్నాక తగవులు రావా? నేను కలగ చేసుకున్నది ఎందుకు? ముక్కు పచ్చలారని పసిదాన్ని ప్లే స్కూల్లో వేస్తానంటే తట్టుకోలేకనే కద కల్పించుకున్నది? నాన్నమ్మని! ఆ మాత్రం హక్కు లేదా అడగడానికి?”

“మాటలతో ఆగలేదు. కొట్టావు కదా? అదేం చిన్న విషయమా? అది వెళ్ళి వాళ్ళ అన్నలకి చెప్పి.. గృహ హింస క్రింద కేసు పెడితే నువ్వు నేను అందరం వెళ్ళి జైల్లో వుండాల్సి వస్తుంది. విషయం అంత దూరం వెళ్ళనందుకు సంతోషించు. ఎలాగూ నీకు మంజు మొదటి నుండి నచ్చలేదు. నీ ఇంటి నుండి, నీ కళ్ళెదుట నుండి వెళ్ళిపోతున్నందుకు నువ్వింక నిశ్చింతగా ఉండొచ్చు కదా?”

“తన నుంచి తన పిల్లని దూరం చేస్తున్నారని అనుకోవడమే హాస్యాస్పదంగా వుందిరా! ఇక నుండి ఆ పిల్లను ముట్టుకోమన్నా ముట్టకోరెవరు.”

“ఎలాగా నేను హైదరాబాద్‌లో వుండి బిజినెస్ చూచుకోవాలనుకుంటున్నాను ఎప్పటినుంచో. ఎప్పుడో ఒకసారి వెళ్ళేదే. దీని గురించి ఇక వాద వివాదాలొద్దు. అనవసర రభస వద్దు. మాదారిన మమ్మల్ని పోనీ.” యశ్ ముఖమంతా ఎలాగో పెట్టుకుని అన్నాడు.

“నాకున్నది ముత్యాల్లా ముగ్గురు కొడుకులు. చిన్నవాడివని నీమీద ప్రేమ ఎక్కువ పెంచుకున్నానురా. రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరి పోతున్నావు నీ భార్యబిడ్డలను తీసుకుని. ముచ్చటైన ఈ గూడు చిన్నబోతుందిరా! అమ్మ మనసు తట్టుకోలేక పోతూందిరా!ఒక్కసారి ఈ అమ్మ గురించి ఆలోచించరా!”

“నువ్వు దీన్ని సహజంగా తీసుకుంటే మంచిదమ్మా! రెక్కలొచ్చాక ఏ పక్షీ గూడు పట్టుకుని వుండదు. జోడు వెదుక్కుని వెళ్ళిపోతుంది. జీవితమంతా తోడు వెంటే సాగి పోతుంది. మనిషి అయినా అంతే. కన్నావు! పెంచావు! పెళ్ళి చేశావు. ఇప్పుడు ఆమెతోనే సాగిపోవడం నా ధర్మం కదా! ఈ కీచులాటలు, పోట్లాటలతో.. నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. నీకు నమస్కారం చేస్తాను. మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయకు. ఎలాగో నేను హైదరాబాద్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుండో. అది ఇలా కలిసి వచ్చిందంతే.”

“కన్న కడుపులో రగిలే చిచ్చు నీకు అర్థం కావడం లేదు, కన్నా! నీకూ ఒక కూతురుంది కదా! ముందు ముందు నీకు తెలిసి వస్తుందిలే కన్న పేగు పడే ఆరాటమేమిటో!”

“వెళ్ళే ముందు మంచి దీవెనలే ఇచ్చింది కదా మీ అమ్మ? ఇక పదండి” వెటకారంగా అంది మంజు యశ్వంత్ చెయ్యిపట్టుకు లాక్కుపోతూ.

బ్యాగులూ, సూటుకేసులూ ఢిక్కీలో కుక్కేసి కారులో కూర్చుని వెళ్ళిపోతున్న వాళ్ళను కన్నీటి తెరల మధ్య మసక మసకగా చూస్తూ ద్వారం పట్టుకుని నిలబడి పోయిన రాధమ్మకు గాలివానకు పడిపోయిన గూడులా అనిపించింది తన కుటుంబం.

పాప ఆటలు పాటలు, కేరింతలు వినిపించని ఇల్లు బోసి పోయినట్టుగా అనిపించి అందరినీ దిగులు ఆవరించింది.

(ఇంకా ఉంది)

Exit mobile version