[శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి రచించిన ‘గూడు చినబోయెరా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. ఇది రెండవ, చివరి భాగం.]
రెండు మూడేళ్ళు గడిచిపోయాయి. తన సంసారంలో అన్ని సమస్యలూ ఉమ్మడి కుటుంబం వల్లే అనుకున్న యశ్వంత్ అంచనా తలక్రిందులైపోయింది. విడి కాపురం పెడితే భార్యాభర్తలు సంతోషంగా, అన్యోన్యంగా ఉండగలమనుకున్నాడు. తనది పూర్తిగా భ్రమ అని తేలిపోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. చిన్న చిన్న వాటికి అలకలు, మూతి బిగించడాలు.. దేనికో ఒకదానికి పేచీ! సమస్య అంతా మంజూలోనే వుందని తెలిసేసరికి అక్కడ రాధమ్మ గుండె బ్రద్దలై పోయింది. అలిగి భార్యా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయిన కొడుకును తలుచుకుని ఆమె కుమిలిపోని క్షణం లేదు.
మంజుకు వంట చెయ్యడం రాదు. నేర్చుకుని చేద్దాం, భర్తకు రుచిగా వండి పెడదాం అన్న జ్ఞానం లేదు. చేసే ఆ వంట కూడా విసుక్కుంటూ, ఇక తప్పదన్నట్టుగా చేస్తుంది. ఉప్పో కారమో ఎక్కువో తక్కువో అవుతుంది. ఆవురావురుమని ఆఫీసునుండి వచ్చి కూర్చుని నోట్లో ముద్ద పెట్టుకుంటే లోపలికి దిగేది కష్టమై పోతుంది యశ్‌కు. అర్ధాకలితో లేచిపోయిన సందర్భాలు ఎన్నో వున్నాయి. భర్త చిన్న పిల్లాడిలా అన్నం ప్లేట్‌లో కెలికేసి అర్ధాకలితో లేచిపోతే పెద్దగా బాధపడేది కాదు మంజు.
ఒకరోజు పట్టలేక అన్నాడు – “టీవీలో ఆ దిక్కుమాలిన సీరియల్స్ చూస్తూ, ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతూ మనసు ఎక్కడో పెట్టుకుని చేస్తే వంట ఇలాగే తగలడుతుంది. తినడానికి చేస్తున్నావో పెంట మీద పారబొయ్యడానికి చేస్తున్నావో తెలియడం లేదు. ఇంత కష్టపడి సంపాదించుకుంటున్నది కడుపు నిండా తినడానికే కదా!”
“నాకు వంట రాదు. ఒక్కగా నొక్క ఆడపిల్లనని నన్ను వంట చెయ్యనిచ్చేవాళ్ళు కాదు మా పుట్టింట్లో. ఇక్కడి పుల్ల అక్కడ పెట్టనిచ్చేవాళ్ళు కాదు. రాణివాసంలో పెరిగినట్టుగా పెరిగాను. నాకు వంటపనీ, ఇంటి పనీ ఎలా వస్తుంది? వంటకు వంటమనిషిని పెట్టండి.”
“ఇద్దరి కోసం వంట మనిషా?” విస్మయంగా అడిగాడు..
“నావంట నాక్కూడా బాగా లేదు. ఇద్దరం కడుపునిండా తినాలంటే వంట మనిషిని పెట్టుకోవడం ఒక్కటే దారి.”
ఎప్పుడు చూసినా ఇల్లు చిందరవందరగా ఉంటుంది. తల్లీ పిల్లా కలిసి కుర్‌కురేలు, ఆలూచిప్స్ లాంటివి తిని వాటి కవర్లు ఇంట్లోనే పడేస్తారు. పాప ఆడుకుని ఎక్కడ పడితే అక్కడ పడేసిన బొమ్మలు.. ఇంకా ఏవేవో పడి వుంటాయి గదినిండా. యశ్‌కిది నచ్చదు. ఇల్లు శుభ్రంగా, పద్ధతిగా ఉండాలంటాడు. ఇల్లు నీట్‌గా ఉంటేనే మనసుకు హాయిగా వుంటుందని చెబుతాడు. అయినా మంజు పట్టించుకోదు. పనిపిల్ల వచ్చి ఊడ్చే వరకు అవి అలా ఇష్టారాజ్యం చేస్తుంటాయి.
ఒకరోజు రెండో బావమరిది రవి వచ్చాడు. తనకు అర్జంటుగా డబ్బు అవసరం పడిందని, పది లక్షలు కావాలని, వారం పది రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు.
స్నేహితుడితో కలిసి కొత్తగా మొదలు పెట్టిన వ్యాపారం యశ్వంత్‌కి అంత ఆశాజనకంగా లేదు. డబ్బుకు ఇబ్బందిగానే వుంది. కాని, బావమరిది అడిగితే లేదని చెప్పడానికి మొహమాటపడి, స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అప్పుగా తెచ్చిచ్చాడు.
ఒకసారి మాటల సందర్భంలో పెద్ద బావమరిదితో మంజుకు వంట రాని విషయం చెప్పి వంటమనిషిని పెట్టమంటోందని చెప్పాడు.
“మంజు నాకు అన్ని సంగతులు చెప్పింది. ఉమ్మడి కుటుంబంలో అది పడ్డ కష్టాలు, అవమానాలు.. అన్నీ తెలుసు. అప్పుడే వచ్చి నిన్ను, మీ వాళ్ళనీ కడిగేద్దామనుకున్నాను. అవును,నా చెల్లెలికి వంట రాదు. పని రాదు. మాకు ఒక్కగా నొక్క ఆడపిల్ల. మాఇంట్లో రాజకుమారిలా పెరిగింది. వంటకు మనిషిని పెట్టలేని బీద స్థితిలో ఉన్నావా? పెట్టలేనని చెప్పు. డబ్బు పారేసి నేను పెడతాను వంటమనిషిని నీ ఇంట్లో. నా చెల్లిని మాత్రం కష్టం పెట్టకు.”
యశ్వంత్‌కి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఎంత బలుపు కాకపోతే చెల్లెలి భర్తతో ఇలా మాట్లాడతాడు? కాని నిగ్రహించుకున్నాడు. చెల్లెలి కంటే వీడు ఇంకా మూర్ఖుడు వున్నట్టుంది. ఏం మాట్లాడినా ఇంకా వికటిస్తుందని నోరు మూసుకున్నాడు.
వుండే సమస్యలు వుండగా కొత్త సమస్య వచ్చి పడింది. కారు డ్రైవింగ్ నేర్చుకుంటానని పట్టుబట్టింది మంజు. “మా వదినలకంతా కారు డ్రైవింగ్ వచ్చు. దర్జాగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసులకు పోతారు. ఎప్పుడైనా మా ఊరికి పోవాలన్నా, పిల్లను స్కూల్ దగ్గర వదలాలన్నా, షాపింగులకు, సినిమాలకు వెళ్ళాలన్నా మీ మీద ఆధారపడాలి. నాకు డ్రైవింగ్ నేర్పించారంటే మీకు శ్రమ తగ్గుతుంది.”
“తల్లీ, డ్రైవింగ్ మాట మళ్ళీ ఎత్తకు! కావాలంటే నీకు కారు కొనిచ్చి డ్రైవర్ని పెడతాను. ఎక్కడికి కావాలంటే అక్కడికి హాయిగా తిరుగుదువు గాని!” చేతులు జోడించాడు.
వారం తిరగకుండా కారు కొన్నాడు మంజు కోసం. డ్రైవర్ని పెట్టాడు. ఆ సమస్య అలా తీరిపోయిందని అనుకుంటుండగా.. “అమ్మగారు ఈ రోజు డ్రైవింగ్ నేర్పించాలని తీసికెళ్ళారు” అని చెప్పాడు డ్రైవరు.
ఆ మాట నిజమా కాదా అని కూడా అడగలేదు యశ్వంత్. మంజు ఆ చెంపా ఈ చెంపా వాయించాడు. “నీకేమైనా బుద్ధుందా? నీకేమైనా అవుతుందనే కదా, కారు డ్రైవింగ్ వద్దని చెప్పింది? డ్రైవింగ్ నేర్చుకుంటానని డ్రైవర్ని తీసికెళ్ళావా?”
తెల్లటి బుగ్గల మీద అయిదు వ్రేళ్ళ గుర్తులు చూసేసరికి యశ్ సిగ్గు పడ్డాడు, తాను చేసిన చండాలపు పనికి. కళ్ళ నిండా నీళ్ళతో నిర్ఘాంతపోయి చూస్తున్న మంజును చటుక్కున గుండెలకు అదుముకున్నాడు – “నీకేమైనా అయితే తట్టుకోలేననే కదా, కారు కొని డ్రైవర్ని పెట్టింది? నువ్వు లేకపోతే నేను బ్రతక లేనే, మంజూ! నీకు ఏదైనా అయితే పాప ఏం కావాలి? నేనేం కావాలి? నువ్వు నా ప్రాణం. నువ్వు లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేను” ఆర్ద్రంగా అన్నాడు. “సారీ రా!పశువులా ప్రవర్తించాను”
ఒక్క మాట కూడా మాట్లాడలేదు మంజు. పిచ్చిదానిలా జుట్టు పీక్కుంటూ, అక్కడున్న వస్తువులన్నీ విసిరికొడుతూ ఏడవసాగింది. ఆమెను ఎలా శాంతపర్చాలో తెలియలేదు యశ్‌కు.
“మంజూ, ప్లీజ్! సారీ చెప్పాను కదా? నువ్వు నాకు లేకుండా పోతావన్న బాధతో చేసిన పని!..”
“ముందు నువ్వు నా కళ్ళెదుట నుండి వెళ్ళిపో! నీ ముఖం చూడలేను.” భద్రకాళిలా అరిచింది.
అతడు ముఖం చిన్న బుచ్చుకొని గదిలోంచి బయటికి వెళ్ళి పోగానే తలుపులు దఢాలున మూసుకుంది. నయం.. పాప లేదు. మొన్న వాళ్ళ అమ్మమ్మ వచ్చినప్పుడు తనతో తీసికెళ్ళింది. యశ్ వెళ్ళి తన గదిలో తలపట్టుకు కూర్చున్నాడు. ఆ రాత్రి ఇద్దరికీ తిండి లేదు. ఎన్ని సార్లు తట్టినా తలుపు తెరవ లేదు మంజు. సోఫాలో కూర్చుని కూర్చుని ఏ తెల్లవారుజామున్నో పట్టిన నిద్ర! పనిమనిషి ప్రక్కన నిలబడి గట్టిగా పిలిస్తే గాని మెలుకువ కాలేదు యశ్ కు.
“పొద్దు పొద్దున్నే అమ్మగారు టాక్సీ పిలుచుకుని వెళ్ళిపోయారు. పుట్టింటికా, సారూ? మీరేమో ఇక్కడ పడుకుని నిద్రపోతున్నారు. మళ్ళీ ఏం జరిగింది, బాబూ?”
చీటికి మాటికి పోట్లాటలు, అమ్మగారి కోపతాపాలు ఇంట్లో పని చేసేవాళ్ళకు తెలియకుండా వుండవు కదా?
ఒక్కసారి ఎదుట పిడుగు పడ్డట్టయింది యశ్‌కు. పరిగెత్తుకు వెళ్ళి బార్లా తెరిచివున్న గదిలోకి తొంగి చూశాడు. బీరువా తలుపులు తెరిచి వున్నాయి. ఇష్టమొచ్చినట్టు లాగినట్టుగా కొన్ని చీరలు క్రిందికి వ్రేలాడుతున్నాయి. బీరువానే కాదు, గదంతా చిందరవందరగా వుంది.
“మంజు టాక్సీలో వెళ్ళిపోయిందా?” అశనిపాతం తగిలినట్టుగా వున్నాడు యశ్.
“అవును, బాబూ! మళ్ళీ ఈ ఇంట్లో కాలు పెట్టనని, మీ ముఖం చూడనని చెప్పి కారు తలుపు దఢాలున మూసుకుని వెళ్ళిపోయింది.”
యశ్‍కు ఎదుట పిడుగుపడ్డట్టు అయింది. పోట్లాటలూ, కోపాలు, అలకలు ఈ సంసారంలో సర్వసాధారణమే అయినా అవి కాస్సేపటికో, ఒకరోజు తరువాతనో సమసిపోయేవి. ఈసారి మాత్రం అలా జరుగుతుందినిపించడం లేదు. తను కోపగించుకున్నా, పోట్లాడినా, అలక పాన్పు ఎక్కినా ఇంట్లోనే వుందన్న ధైర్యం వుండేది. వెళ్ళిందేగాని అటునుండి ఏ కబురూ లేదు. ఫోన్ కూడా లేదు. తను చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మంజు లేని ఇల్లు శూన్యంగా, బావురుమన్నట్టుగా అనిపిస్తూంది. పదిహేను రోజులు అతి కష్టంగా గడిచిపోగా ఇక ఆగలేకపోయాడు యశ్.
“నేను రేపు మార్నింగ్ బయల్దేరుతున్నాను. బ్యాగు సర్దుకుని పాపతో రెడీగా వుండమని చెప్పు, మంజుతో. నువ్వు నాకివ్వాల్సిన డబ్బు కూడా రెడీ చేసి పెట్టు. నాకు అర్జంట్‌గా కావాలి.”
రవికి ఫోన్ చేసి చెప్పి మరునాడు బయల్దేరాడు యశ్. మరునాడు యశ్ వెళ్ళేసరికి తండ్రి తప్ప నలుగురన్నదమ్ములున్నారు ఇంట్లో.
ఇంట్లో కాలు పెట్టీ పెట్టకముందే “ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా” అన్నాడు రవి పెడసరంగా.
“ఎవరి ముఖమో పెట్టుకు రావలసిన అవసరం నాకేముంది? నా ముఖమే పెట్టుకు వచ్చాను. నా వల్ల తప్పే జరిగింది. సారీ చెప్పి మంజునూ పాపను తీసుకుని పోవడానికి వచ్చాను.”
“నీ సారీ ఎవడికి కావాలి? బంగారం లాంటి పిల్లను నీకు కట్టబెట్టింది కొట్టి చంపడానికా? నువ్వు మనిషివా, పశువ్వా? అంత చేయరాని పని ఏం చేసింది మా చెల్లెలు? కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకోవడం అంత తప్పా? మా ఇంట్లో ఆడవాళ్ళంతా కారు డ్రైవింగ్ నేర్చుకుని ఆఫీసులకి సెల్ఫ్ డ్రైవింగ్‌తో వెడతారు కదా?”
“నా భయం నాది..”
“తొక్కలో భయం. భయం కాదు! భార్య చెప్పు క్రింద తేలులా అణిగి మణిగి ఉండాలన్న దురహంకారం. నలుగు రన్నదమ్ములకు ఒక్కతే ఆడపిల్లరా! మా కెంత అపురూపమో తెలుసా? వాచిపోయిన బుగ్గలతో అది కనిపించగానే మా అన్నదమ్ములం నలుగురం ఎంత విలవిలలాడామో తెలుసా? వచ్చి నిన్ను బతికుండగానే పాడెకు కట్టి తగలేయాలన్నంత కోపం వచ్చింది.. అమ్మ అడ్డు పడకపోతే అదే జరిగేది.”
“ఆలూమగలన్నాక ఏవో కలతలు కలహాలు వస్తూనే వుంటాయి, రవీ! నచ్చజెప్పి పంపాలి గాని మీరే ఆమె మొండితనానికి సపోర్ట్ చేస్తే ఎలా?”
“నచ్చజెప్పి పంపడమా.. ఈ రోజు కోపం పట్టలేక ముఖం పగుల గొట్టినవాడివి రేపు కోపం వస్తే గొంతు పిసికి చంపవని గ్యారంటీ ఏమిటి?”
“ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు? నేను కొట్టింది ఒకే ఒక్క చెంప దెబ్బ! అది కూడా కారు డ్రైవింగ్‌లో తనకేదైనా జరగరానిది జరిగితే ఎలా అన్న బాధతో కొట్టిన దెబ్బ! మంజును పిలువండి ఆమెతోనే మాట్లాడతాను. నాకు ఎక్కువ టైం లేదు. ఆమెనూ, పాపను తీసుకుని వెళ్ళిపోతాను.”
“మంజు రాదు.మేం పంపం. ముందు నువ్వు సజావుగా బయటికి ఎలా పోతావో చూసుకో.”
“ఏం కొడతారా?” షర్ట్ చేతులు వెనక్కి జరుపుకుంటూ పౌరుషం ఉబికి వచ్చినట్టుగా ఛాతీ విరుచుకు నిలబడ్డాడు యశ్. చిన్నప్పటి నుండి వ్యాయామంతో ఉక్కులా మార్చుకున్న శరీరం.
మాటా మాటా పెరిగి పోయింది.
అడ్డంగా తిని బలిసి పోయిన శరీరాలు. నలుగురన్నదమ్ములు ఏకమై మీద పడి ధన ధన బాదేస్తుంటే తల్లి అడ్డు పడింది.
“మీకు బుద్ధుందా?ఎంతైనా మనింటి ఆడపిల్ల మొగుడు రా” అంటూ. “కాని బాబూ, నువ్వు చేసిన పని బాగా లేదు. నలుగురు మగపిల్లల తరువాత పుట్టిందని ఎంత అపురూపంగా పెంచుకున్నామో తెలుసా? తల్లిని.. నేనైనా ఒక్క దెబ్బ కూడా ఎన్నడూ కొట్టలేదు. నీకు చేతులెట్లా వచ్చాయి? చిట్లిన పెదవులతో బూరెలా పొంగిన చెంపలతో గడపలో అడుగిడిన పిల్లను చూసేసరికి నా కడుపులో ఎంత దేవినట్టు అయిందో తెలుసా?”
వాళ్ళ మాటలు వింటుంటే తిక్కరేగిపోయింది యశ్‌కు. కోపం, బాధ, దుఃఖం.. ఏం మాట్లాడుతున్నాడో స్పృహ లేకుండా పోయింది. “మీ పిల్లను మీరు ఎన్నాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోండి. పాపని పిలువండి. పాపని తీసుకుని వెళ్ళిపోతాను.”
“పాప రాదు. పాప తల్లీ రాదు. మేం పంపం. దిక్కున్న చోట చెప్పుకో ఫో! ఎక్కువగా మాట్లాడితే నీ మీద గృహ హింస కేసు పెట్టి బొక్కలో తోయిస్తాం. జాగ్రత్త! వెళ్ళు!” మంజు పెద్దన్న అన్నాడు.
“ఒక్కసారి మంజును పిలువండి.”
తల్లి పిలిచింది. ప్రక్క గదిలో వుండి అంతా గమనిస్తున్న మంజు మెల్లిగా వచ్చింది.
“ఇంకా నా మీద కోపం పోలేదా, మంజూ? చూశావా నీ అన్నలు ఎంత మర్యాద చేశారో నాకు?” పేలవంగా నవ్వాడు.
“ఛీ! ఏం ముఖం పెట్టుకొని వచ్చావు? నీ ముఖం చూడ్డం కూడా నా కిష్టం లేదు.” ముఖం త్రిప్పుకుంది మంజు
ఇంతకంటే అవమానం ఏముంటుంది ఏ మగవాడికైనా! జేవురించిన ముఖంతో అన్నాడు. “సరే.. పాపనివ్వు వెళ్ళిపోతాను.”
“పాపనిచ్చి నేనేం చేయాలి?”కఠినంగా అడిగింది.
“ఏం చేస్తావో నాకు తెలియదు.పాప లేకుండా నేను వెళ్ళను. పాప నా ప్రాణం!”
“తల్లినుండి పిల్లను వేరు చేసి తీసుకు పోవాలనుకుంటున్నావురా! ఎంత నీచుడివి కాకపోతే ఇంత దుర్మార్గమైన ఆలోచన వస్తుంది?పాప పేరెత్తితే చంపి పాతరేస్తాను.” మీది మీదికి వచ్చాడు రవి.
“నా రక్తం పంచుకు పుట్టిన పాప నాకు కావాలనుకోవడం దుర్మార్గమెలా అవుతుంది?”
“పాపను తొమ్మిది నెలలు నీ కడుపులో మోసినట్టు నా పాప పాప అంటున్నావు!” వెటకారం చేశాడు పెద్దన్న.
ఈ మూర్ఖులతో నాకేం పని అన్నట్టుగా భార్య వైపు తిరిగాడు యశ్. “నిన్ను పాపను నా ప్రాణంగా ప్రేమించాను కదా, మంజూ? దానికి ఫలితమిదా? ఇంత కఠిన శిలవు ఎందుకయ్యావు? అంత తప్పు నేనేం చేశాను?”
“నేను మాత్రం అంత పెద్ద తప్పు ఏం చేశాను? ఆడవాళ్ళు ఎవరూ డ్రైవింగ్ నేర్చుకుని కారు నడపడం లేదా? అంత ప్రేమించి నందుకేనా నా చెంపలు పగుల గొట్టావు?”
“నా వల్ల తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నాను కదా! క్షమించు, ప్లీజ్! మరోసారి నిన్ను బాధపెట్టే పనులేమీ చెయ్యను. ప్రామిస్!”
“నా మనసు విరిగిపోయింది.నేను రాను. వెళ్ళు”
“పాపనివ్వు, వెళ్ళిపోతాను.”
“పాపనిచ్చి నేనేం చేయాలి? “
“నేనక్కర లేనప్పుడు నా రక్తం పంచుకు పుట్టిన నా పాప నీ దగ్గరెందుకు?”
“కొట్టి చంపమంటావా దాన్ని?”
దగ్గర పెద్ద పిడుగుపడి షాక్ తగిలినట్టుగా మ్రాన్పడిపోయాడు యశ్. కాస్సేపటికి తెప్పరిల్లి “పాపను పిలువు. పాప వస్తానంటే తీసికెడతాను.”
“అది ఇప్పుడిప్పుడే నిన్ను మరిచిపోతూంది. మళ్ళీ గుర్తు చేసినట్టు ఎందుకు? పాపను చూపించను” తన మాటకి తిరుగు లేదన్నట్టుగా అనేసి లోపలికి వెళ్ళిపోయింది మంజు.
తల పట్టుకు కూర్చున్నాడు యశ్. మంజు ఇంత కఠిన శిలగా ఎందుకు మారిపోయిందో అర్థం కావడం లేదు. ఇక ఏం చేసినా ఆమె మనసు కరగదని తెలిసిపోయింది. పాపని చూడాలని మనసు తహ తహలాడిపోతున్నది.
“నెమ్మదిగా నేను నచ్చజెప్పి పంపుతాను, బాబూ! గొడవ చేయకుండా ఇప్పటికి వెళ్ళండి”
తల్లి మాటకు అడ్డుపడ్డాడు రవి. “నీకు మతిగాని పోయిందా? ఏమిటి నచ్చజెప్పి పంపేది? ఆరు నూరైనా మంజును అతడి దగ్గరికి పంపేదిలేదు. పంపితే ఈసారి దాని శవమే వస్తుంది మన దగ్గరకు. కొట్టి చంపుతాడు దుర్మార్గుడు.”
ఇక ఏం మాట్లాడినా లాభం లేదని అప్పుగా తెచ్చిచ్చిన డబ్బు విషయం తేల్చుకుందామని “నా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు రెడీ చేసిపెట్టమన్నాను కదా, రవీ?! డబ్బిస్తే వెళ్ళిపోతాను” అన్నాడు.
“ఇప్పుడు నా దగ్గర లేదు. ఉన్నప్పుడు నీ ముఖాన పారేస్తాను.”
“ఇచ్చిన డబ్బు అడిగితే వున్నప్పుడు ముఖం మీద పారేస్తానంటావా? ఇదేం మర్యాద? నా దగ్గర డబ్బులేక పోతే వడ్డీకి తీసుకుని ఇచ్చానురా! వడ్డీ పెరిగి పోతూంది.”
“చెప్పాను కదా వున్నప్పుడు నీ డబ్బు నీకు పడేస్తానని”
బరువెక్కిన గుండెలతో తిరిగి వచ్చిన యశ్‌కి దేనిమీదా ఆసక్తి లేకుండా పోయింది.
కార్చిచ్చు మధ్య చిక్కిన లేడి పిల్లలా అయిపోయింది మనసు. హరీష్‌కి ఫోన్ చేశాడు “మనసు బాగా లేదు. నీకు చాలా సంగతులు చెప్పాలి. ఒకసారి రారా” అంటూ.
హరీష్ టూర్లో వుండి పదిహేను రోజుల తరువాత గాని రాలేకపోయాడు.
హరీష్ తన చిన్న నాటి స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు. జరిగిందంతా చెప్పి ఏడ్చేశాడు యశ్. “పాపను చూడాలని నా గుండె ఎంత తహతహ లాడిపోతోందో మాటలతో చెప్పలేను, హరీ! దాన్నిఒక్కసారి గుండెలకు హత్తుకుంటే నా బాధంతా తీసేసినట్టవుతుంది. నువ్వెళ్ళి నచ్చజెప్పి ఎలాగైనా పాపనీ, మంజునూ తీసుకొచ్చెయ్యి” అంటూ చేతులు పట్టుకున్నాడు.
“నేను వెడతాను కాని మంజు వస్తుందని నమ్మకం లేదు నువ్వు చెబుతున్న మాటలను బట్టి! కాని, నువ్వేమిటి ఇలా అయిపోయావు?”
“మనసు బాగా లేదురా! కంటి నిండా నిద్ర లేక ఎన్నాళ్ళయిందో!! భార్య విడిచి పెట్టిపోయింది. నా కూతుర్ని నా దగ్గరకు తెచ్చుకునే మార్గం కనిపించడం లేదు. బ్రతికి ఏం చేయాలనిపిస్తోంది. ఈ బిజినెస్, ఈ సంపాదన, ఈ జీవితం ఎవరి కోసం?”
“మంజుకు నేను నచ్చజెప్పి తీసుకు వస్తాగాని ముందు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొద్దాంరా! నీకు తెలుస్తుందో లేదో.. నువ్వు చాలా చిక్కి పోయావు. ముఖం పేషెంట్‌లా పీక్కుపోయింది. నీ బాడీలో చాలా తేడా కనిపిస్తూంది. కఠినమైన వ్యాయామంతో బలంగా తీర్చిదిద్దుకున్న శరీరం! పదిమంది వచ్చి ఒక్కసారి మీద పడినా వాళ్ళను చిత్తుగా కొట్టగలవాడివి. నీ బావమరుదులతో దెబ్బలు ఎలా తిన్నావురా?”
“నాకు అదే ఆశ్చర్యంగా వుంది. ఆ నలుగురు ఒక్కటై కొడుతుంటే నేనెందుకు తిరగబడలేక పోయానని నాకూ ఆశ్చర్యంగానే వుంది. నువ్వన్నట్టు నా శరీరంలో తేడా తెలుస్తూనే వుంది. నేను బాడీ బిల్డర్ నన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు వ్యాయామం చేసే తీరిక లేదు. శరీరం మీద శ్రద్ధ తీసుకునే ఓపిక లేదు. భార్య అనుకూలవతి కాకపోతే మగవాడి జీవితం ఎంత అస్తవ్యస్తం, నరకం అవుతుందో చూపడానికి నేనే ఉదాహరణ! వ్యాపారంలో చాలా డబ్బు పెట్టాను. అప్పుగా తెచ్చి పెట్టాను. లాభాల సంగతి అలా వుంచు. పెట్టిన డబ్బే వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇంట్లో సంసారం పరిస్థితి ఇలా వుంది. పాడుపడిన ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నట్టుగా వుంది! ఇలా వుండక ఎలా వుంటాను?”
మంజుకు నచ్చజెప్పి తీసుకు రావడానికి వెళ్ళిన హరీష్ వట్టి చేతులతో రాక తప్పలేదు.. దగ్గర వుండి డాక్టర్ దగ్గరికి స్నేహితుడిని తీసుకు పోదామనుకున్న అతడికి అర్జంట్‌గా రమ్మని ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో వెళ్ళిపోక తప్ప లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని మరి మరీ చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన వాడు తిరిగి రావడానికి కొన్ని నెలలు పట్టింది. బిజినెస్ రీత్యా దేశ విదేశాలు తిరగుతూ వుండడం వల్ల. అప్పటికి యశ్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా వుంది కాన్సర్‌తో. ఊపిరి తీసుకోడానికి కష్టపడుతున్నాడు. వైద్యానికి వ్యాపారంలో కాస్తో, కూస్తో సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్నాడు. స్నేహితుడిని చూసి కంట నీరు తిరిగింది హరీష్‌కి. మంజును తీసుకు వద్దామని వెళ్ళాడు. పరిస్థితి అంతా చెప్పి “వాడి పరిస్థితి అస్సలు బాలేదు. కాన్సర్ మహమ్మారి వాడిని పీల్చి పిప్పి చేసింది. వాడు బ్రతకడు.ఈ చివరి రోజులు ప్రశాంతంగా పోవాలంటే నువ్వు రావాలి. వాడి ప్రాణాలన్నీ పాప మీదే పెట్టుకున్నాడు. పాపను గుండెలకు హత్తుకుంటే చాలు నా రోగం పారిపోతుందిరా అని ఏడ్చాడు. తోడులేని ఒంటరి చిలుకలా మిగిలిపోయిన వాడిని చూసి జాలిపడు తల్లీ! నీకు చేతులెత్తి దండం పెడతాను.” కన్నీళ్ళతో మంజు చేతులు పట్టుకున్నాడు హరీష్.
“అతడు కొట్టిన దెబ్బలు నా చెంపల మీద కాదు, మనసు మీద పడ్డాయి. మనసు గాయం మానేది కాదు ఎన్నటికీ. నేను ఏం చేసినా అతడికి సమ్మతం కాదు. అన్నిటికీ ముఖం చిట్లిస్తాడు. ఏం చేస్తే ఏమంటాడో అన్న భయం. అలాంటి కాపురం నాకు అవసరం లేదు..”
“ఇది పట్టింపులు పంతాలకు సమయం కాదు. చెప్పాను కదా అతడి ఆరోగ్యం బాగుండ లేదని! ముఖ్యంగా పాప కోసం అల్లాడి పోతున్నాడు..”
“వచ్చి అతడికి సేవలు చేయడానికి నేను నర్సును కాదు.”
“మానవతా దృష్టితో..”
అతడి మాట పూర్తి కాక ముందే “నా కంత దయాగుణం లేదు” అని వెళ్ళబోయింది.
“నువ్వు వచ్చినా రాకపోయినా పాపని తీసుకు వస్తానని వాడికి ఆశ పెట్టి వచ్చాను. మళ్ళీ రేపు పాపను తెచ్చి నీ కప్పగిస్తాను. ప్రామిస్ చేసి చెబుతున్నాను. పాపను ఒకసారి గుండెలకు హత్తుకుంటే చాలు ప్రశాంతంగా చచ్చిపోతానంటున్నాడు.”
“పాపను పంపే ప్రశ్నే లేదు.”
“వాడి మీద ఎందుకింత కక్షగట్టావు? ఒక్కసారి కొట్టిన దానికే కొట్టాడు కొట్టాడు అంటున్నావు గాని దూరమైన నిన్ను తలుచుకుని ఎంతగా బాధ పడుతున్నాడో తెలుసా? నువ్వు వాడి ప్రాణం, మంజూ! నేనబద్దం చెప్పడం లేదు. నీ మనసునే ప్రశ్నించుకో.”
“అతడి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు” ఇక మాట్లాడవలసినదేమీ లేదన్నట్టుగా లోపలికి వెళ్ళి పోయింది.
“వాడు రోగంతో చావుకు రోజులు లెక్క పెడుతున్నాడని మాకు తెలుసు. ఎలాగా పోయేవాడితో విడాకులు ఎందుకని ఊరుకున్నాం గాని లేకపోతే ఎప్పుడో విడాకులు వాడి ముఖం మీద పారేసి లక్షణంగా మా చెల్లెలుకి మళ్ళీ పెళ్ళి చేసేవాళ్ళం. వాడికక్కడ చావు డప్పులు మ్రోగగానే ఇక్కడ మా చెల్లి పెళ్ళి బాజాలు మ్రోగుతాయని చెప్పు నీ దోస్తుకు. మంజు త్వరలో కోటీశ్వరుడి భార్య కాబోతూంది..” అంటూ పర్స్ లోంచి ఫోటో ఒకటి తీసి హరీష్ ముందు ఆడించాడు రవి. “మోహనకృష్ణ. పేరుకు తగిన అందగాడు. చూశావా, ఆ అందం, ఆ పర్సనాలిటీ! నీ దోస్త్ ఇతడి కాలి గోటికి సరిపోడు.”
“వాడి గురించి నీకు అంతే తెలుసేమో. నాకు చాలా తెలుసు. వాడికి ఆడ పిచ్చి కూడా వుంది. అందమైన ఆడది కనబడితే వదలడు. వాడి చిత్త కార్తె కుక్క వేషాలు చూసి వాడి పెళ్ళాం అసహ్యించుకుని డైవర్స్ ముఖంమీద పారేసి వెళ్ళిపోయింది. వాడి కన్ను అందమైన నీ చెల్లి మీద పడడం అవకాశంగా తీసుకుని చెల్లెలితో అతడి పెళ్ళి జరిపిస్తానని ఆశ పెట్టి వాడి నుండి లక్షలు లక్షలు దొబ్బేస్తూ వాడిని నీ అవసరానికి వాడుకుంటున్నావనీ తెలుసు. నాకు తెలియందంతా మంజు మనసులో ఎలా ఇంతగా యశ్ పట్ల విముఖత కలిగించ గలిగావా అని!”
“నేను విముఖత కలిగించడమేమిటి? వాడు చేజేతులా చేసుకున్నాడు. భార్య అంటే కాలి క్రింది చెప్పులా అణిచి వుంచాలనుకున్నాడు..”
మంజు మరో ఇద్దరు అన్నలు కూడా అక్కడ వున్నారు. “ఏమిట్రా, అతడు ఏదేదో చెబుతున్నాడు కృష్ణ గురించి! ఇంద్రుడు చంద్రుడు కుబేరుడు అని చెప్పి అతడితో మంజు పెళ్ళి ఖాయం చేశావు!..”
“ఇంద్రుడు చంద్రుడు కుబేరుడే. అబద్దం ఏం చెప్పలేదు.”
“అతడికున్న ఆడపిచ్చితో ఏఏ గజ్జి కుక్కల దగ్గరికి వెళ్ళి ఆ గజ్జి తగిలించుకున్నాడో.. ముందు డాక్టర్లకు చూపండి. లేకపోతే మీ గారాల చెల్లెలు ఆ రోగాల పుట్టలతో కుళ్ళి కుళ్ళి చావాల్సి వస్తుంది.” వెటకారంగా అని హరీష్ బయటికి నడుస్తుంటే.. అన్నగార్లు తన్నడానికి రవి మీదికి వెళ్ళడం కనిపించి నవ్వుకున్నాడు. భర్తపట్ల మంజుకు అంతగా విముఖత కలగడానికి అన్నల హస్తముందని అర్థమైంది. చెప్పుడు మాటలు చేటుకదా!
మంజు రావడానికి ఒప్పుకోలేదని చెప్పాడు తప్ప మంజుకు మళ్ళీ పెళ్ళి చేస్తున్నారన్న విషయం చెప్పలేదు స్నేహితుడి మనసు మరీ బాధ పడుతుందని.
అర్జంట్ పనులు చూసుకుని వచ్చేస్తాని హరీష్ వెళ్ళి వారమైంది.
***
గతం తలపోస్తున్న యశ్వంత్‍కి హరీష్ దగ్గర వుంటే ఎంతో ఊరటగా, ధైర్యంగా ఉంటుంది. దేశ విదేశాల్లో విస్తరించిన వ్యాపారం వల్ల అతడు రోగపీడితుడైన స్నేహితుడి దగ్గర ఒకటీ రెండు రోజుల కంటే ఎక్కువ వుండలేక పోతున్నాడు. వెళ్ళిన దగ్గరి నుండి ఫోన్ చేస్తూనే వున్నాడు యశ్, “నువ్వు రారా!నువ్వుంటే నాకు ధైర్యంగా వుంటుంది” అని!
“ఇక నాలుగైదు రోజులే. నిన్ను సతాయించడానికి నేనుండను. డాక్టరు నా చివరి రోజు చెప్పేశాడు” యశ్ ఏడ్చుకుంటూ ఫోన్ చెయ్యడంతో పనులన్నీ ప్రక్కన పెట్టి వచ్చాడు. నిజంగానే యశ్ ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయి వుంది. యశ్‌కివి చివరి రోజులని చెబితే మంజు తప్పక వస్తుందన్న ఆశతో వెళ్ళి రిక్త హస్తాలతో వచ్చాడు హరీష్ “సారీ.. తీసుకు రాలేక పోయాను. మరిచిపోరా మంజునూ పాపను”
“ఏం చెబుతున్నావురా? వాళ్ళు నా ప్రాణం రా! ఎలా మరిచిపోతాను?”
“ఆ అన్నలు మంచివాళ్ళు కాదురా! ఏవేవే నీ మీద చాడీలు చెప్పి మంజు మనసును మార్చేశారు.”
“నాకు నా పాప కావాలి. తెచ్చివ్వరా నా పాపని.. ఒక్కసారి పాపని గుండెలకు హత్తుకుంటే ఈ బాధంతా ఉఫ్ మని ఎగిరి పోతుంది.. నా పాప నా గుండెల మీద పెరిగిందిరా! ఒక్కసారి.. ఒక్కసారి..” ముఖం మీద చేతులు కప్పుకుని ఏడవ సాగాడు యశ్.
స్నేహితుడి బాధ చూసి హరీష్ చలించి పోయాడు. యశ్‌కి దగ్గరగా జరిగి అతడి ముఖాన్ని అమ్మలా తన పొట్టలో అదుముకున్నాడు.
“నిన్నిలా చూడలేక పోతున్నానురా! నేను మరోసారి మంజు దగ్గరికి వెడతాను. ఈ సారి నా మిసెస్‌ని తీసుకు వెళతాను. తనైతే ఫ్రీగా మాట్లాడుతుంది మంజుతో. ఎలాగైనా ఒప్పిస్తుంది. కాని, దానికి ముందు నువ్వొక పని చెయ్యాలి. ‘ఒక్కసారి.. ఒక్కసారి వాడిని చూడాలి. నా గుండెలకు హత్తుకోవాలి’ అని నీలాగే అల్లాడిపోతున్నారురా రాధా ఆంటీ! ఆమె గుండెలో నువ్వు చేసి వచ్చిన గాయం ఇంకా మానలేదు. అదింకా రేగిపోయి బాధ పెడుతూనే వుంది. నేననుకుంటా, ఆమె బాధే నీకు శాపమైందేమో!”
యశ్‌కి ఇంటి నుండి వచ్చేసిన నాటి సంఘటన గుర్తు కొచ్చింది.
“కన్న కడుపులో రగిలే చిచ్చు నీకు అర్థం కావడం లేదు, కన్నా! నీకూ ఓ కూతురు ఉంది. ముందు ముందు నీకు తెలిసి వస్తుందిలే.. పిల్లలు దూరమైతే కన్నపేగు పడే ఆరాటమేమిటో..”
యశ్ గుండెలో తుపాకీ ప్రేలినట్టయింది.
“వెళ్ళే ముందు మంచి దీవెనే ఇచ్చింది కదా మీ అమ్మ.. పదండి!” మంజు వెటకారం!
“ఈ రెండేళ్లలో నీకు అమ్మని చూడాలని ఒక్కసారి కూడా అనిపించలేదా?”
“అనిపించింది. కోడళ్ళ ఎదుటే అమ్మను అంత అవమానించి ఇంటి నుండి బయటకు వచ్చేశాక మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వెనక్కి వెడతాను? ఒకటి రెండుసార్లు అమ్మను చూడబుద్ధి అవుతున్నదని తయారై మంజును పిలిస్తే రానన్నది. జీవితంలో మళ్ళీ ఆ గడపలో కాలు పెట్టనంది. సరే, నువ్వు రాకపోతే రాకపోయావు. పాపను తీసుకుని వెళ్ళొస్తాను అని చెప్పాను. దానికీ ఒప్పుకోలేదు. ‘పాపని నాకు కాకుండా చేస్తారనే ఆ ఇంటినుండి వచ్చేశాను. పాపను అస్సలు పంపను’ అంది. నేను వెడితే అందరూ పాప ఏదీ మంజు ఏదీ అని అడుగుతారు. ఏం జవాబు చెబుతానని వెళ్ళలేదు.”
“కనీసం తప్పు చేశానని అనిపించిందా?”
“అనిపించినా దిద్దుకోలేని తప్పుకదా? దాని ఫలితమే కదా నేనిప్పుడు అనుభవిస్తున్నది!” నిస్పృహగా అన్నాడు యశ్.
“దిద్దుకోలేని తప్పని ఎందుకంటున్నావు? నువ్వు వెళ్ళు.. క్షమించమని అడగాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ నిన్ను అక్కున చేర్చుకుంటుందో లేదో చూడు. తల్లి మనసు పిల్లల తప్పును ఎప్పటి కప్పుడు మరిచి పోతుందే కాని గుర్తుపెట్టుకుని సాధించడానికి పూనుకోదురా! అమ్మ దగ్గర అభిమాన పడడం ఏమిటి, పిచ్చి కాకపోతే?”
“అంతేనా.. వెళ్ళనా?అమ్మ నా ముఖం చూస్తుందా.. మాట్లాడుతుందా?” అమాయకంగా, బేలగా చిన్న పిల్లాడిలా అడిగాడు.
“నేను చెప్పడం ఎందుకురా.. నా మాటలో నిజమేమిటో నువ్వే చూద్దువు గాని! నీ ఒక్కడికి ముఖం చెల్లకపోతే నీతో నేనూ వస్తా పద.”
***
“బాబాయ్ వొచ్చాడు, యశ్ బాబాయ్ వచ్చాడు.” పిల్లలు అరుస్తూ వచ్చారు వంటపనిలో వున్న రాధమ్మ దగ్గరికి. ఆమె చేతిలో వున్న గరిట జారిపోయింది. “నిజమా, లేక తమాషా పట్టిస్తున్నారా” సంబ్రమంగా ఇటు తిరిగింది.
“అదిగో. బాబాయే వచ్చేశాడు..”
పిల్లల కేరింతల మధ్య గుమ్మంలో కనిపించిన ఆకారాన్ని చూసి ముఖంలో నిర్విణ్యత చోటు చేసుకోగా నిలువు కళ్ళు పడ్డాయి రాధమ్మకు. పంట చేల మధ్య కర్రలకు చొక్కా తొడిగి నిలబెట్టిన దిష్టి బొమ్మలా.. విరిసిన గులాబీ పువ్వు రంగులో పుష్టిగా నిలువెత్తు కనిపించే తన యశ్ స్థానంలో ఈ దిష్టి బొమ్మ ఎలా వచ్చింది? ఏమైంది వాడికి.. “కన్నా,ఏమైందిరా నీకు?ఎందుకిలా అయ్యావు?…”ఆమె గాద్గదికంగా అంటూ పరుగున సమీపించింది.
“అమ్మా.. నన్ను క్షమించు..”
“ఛ! తల్లీ పిల్లల మధ్య క్షమార్పణలు ఏమిటిరా.. పిచ్చికన్నా..”
మరు క్షణం కర్ర పుల్లల్లా వున్న కొడుకు చేతుల్లో బందీ అయింది. “అమ్మా, నన్ను క్షమించు..” ఆర్తిగా అంటూనే క్రిందికి జారిపోయాడు యశ్. కుడిచెయ్యి తల్లి పాదాల మీద వుండిపోగా శరీరం నేల మీద వెల్లకిలా పడింది.
వెనకే వచ్చిన హరీష్ అతడిని లేపబోయి కెవ్వుమన్నాడు – “అయ్యో, యశ్ వెళ్ళిపోయాడమ్మా! పంజరం నుండి చిలుక ఎగిరి పోయింది. ‘ఈ పంజరంలో వున్న చిలుకను అందుకోడానికి మృత్యుదేవత ముంగిట ఆత్రుతగా నిరీక్షిస్తూంది. ఏ క్షణమైనా ఈ తలుపు తెరుచుకోవచ్చు’ అనేవాడు యశ్. చాలా నరకమనభవించాడమ్మా! అమ్మ గుండెల మీద సేద దీరుతానని వచ్చి అంతలోనే.. అంతలోనే వెళ్ళిపోయాడు..” గాద్గదికమైంది అతడి గొంతు.
ఒక్కసారి పాపను గుండెలకు హత్తుకోవాలని వుందని అల్లాడిపోయిన యశ్ చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడనుకుంటే హరీష్‍లో దుఃఖం పొంగి పొర్లింది ‘భగవాన్! ఇటువంటి విషాదాంత జీవితం ఎవరికీ రాయకు’ అనుకున్నాడు జలజల రాలిపోతున్న కన్నీళ్ళ మధ్య.
మూడేళ్ళుగా కొడుకు కోసం ఆరాటపడిన రాధమ్మ అతడు తన చేతుల్లోనే విగత జీవి కావడం చూసి కుప్పకూలిపోయింది.
(సమాప్తం)
1942లో వనపర్తిలో జన్మించిన శాంతాదేవి రచనారంగంలో ప్రవేశించి సుమారు అర్ధ శతాబ్దం దాటింది. 65 నవలలు, 70-75 కథలు వ్రాశారు. కొన్ని నవలలు సినిమాలుగా, టెలీఫిల్ములుగా రూపొందాయి. కొన్ని నవలలు కన్నడంలోకి అనువాదమయ్యాయి.
శ్రీమతి మల్లాది సుబ్బమ్మ ‘ధర్మనిధి’ పురస్కారం, ‘సుశీలా నారాయణరెడ్డి’ అవార్డు, జీవిత సాఫల్య పురస్కారం, మాదిరెడ్డి సులోచన స్మారక పురస్కారం, స్ఫూర్తి పురస్కారం వంటి పురస్కారాలను పొందారు.
పోల్కంపల్లి శాంతాదేవి రచనలపై పలువురు పరిశోధనలు చేసి డాక్టరేట్, ఎం.ఫిల్ పట్టాలు పొందారు.
