[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘గూడు ఖాళీ అయిపోయింది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
బాధ్యత
బరువుగా కళ్ళెత్తి చూస్తుంటే
బాధ సుళ్ళు తిరుగుతూ
లోన ఉండలేని బయట పడలేని
సందిగ్దతను తూకం వేస్తుంటే
కాలాన్ని కొద్ది కొద్దిగా చెల్లించి
క్రమక్రమంగా కొనుగోలు చేసుకున్న భవిత
జవాబుదారీతనాన్ని ఆశిస్తుంటే
కార్యక్షేత్రానికి రమ్మని గట్టిగా గద్దిస్తుంటే
ఖర్చయిపోయిన సెలవుల జమాపద్దు
ఖాళీగా కళ్ళముందు కనబడుతుంటే
నవ్వుల పువ్వులు వాడిపోయి
పకపకల పరిమళాలు ఇగిరిపోయి
కవ్వింతల కాలక్షేపం కరిగిపోయి
ఎడబాటును తనస్థానంలో నిలిపేస్తూ
ఆత్మీయత కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే
అనుబంధాల గిరిని తుడిచేస్తూ
అవసరాల గడిలోకి అమాంతం దూకేస్తూ
సందడినంతా తమతో సర్దేసుకుని
కొలవుల నెలవులకు పదపదమంటూ
ఎదిగిన గువ్వలు ఎగిరెళ్ళిపోయిన వేళ
గూడు ఖాళీ అయిపోయింది
గూడు.. ఖాళీ అయిపోయింది
కానీ..
ఆశను నింపుకున్న తల్లి కళ్ళు మాత్రం
వీథి గుమ్మానికి అతుక్కుని ఉన్నాయి
వెళ్ళిపోయిన గువ్వల రాకను వెతుక్కుంటూ
వంటింట్లో ఓ పిడికెడు కూడు
ప్రతిపూటా ఇకమీదట మిగిలిపోతుంటుంది
ఆకలితో నిండిన ‘అమ్మా..!’ అనే పిలుపు
ఏ క్షణంలోనైనా వినపడుతుందేమోనని
నిజానికి.. ఆరోజు ఇప్పట్లో రాదనీ
అంత తొందరగా రాదని తెలిసినప్పటికీ
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
