Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోపాలం గారి రైలు ప్రయాణం..

[శ్రీమతి తల్లాప్రగడ ప్రభావతి గారు రచించిన ‘గోపాలం గారి రైలు ప్రయాణం..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ధ్యాహ్నం భోజనాలు అయ్యాక అరగంట కునుకు తీసి లేచారు జానకమ్మ, గోపాలం గారు. మధ్యాహ్నం 12-30 కి భోజనం చేసి గంటో, అరగంటో పడుకుని లేచి సీరియల్స్ చూడటం జానకమ్మ దినచర్య. రిటైర్ అయ్యాక గోపాలం గారు కూడా భార్యని అనుసరిస్తున్నారు. అయితే ఆయనకి సీరియల్స్ చూడటం ఇష్టం ఉండదు. అందుకని ఏవో పుస్తకాలు చదువుకుంటారు. 4-30కి లేచి టీ పెట్టుకొని తాగి, ఏ బిస్కెటో, జంతికలో తిని దగ్గరున్న పార్కుకి వెళ్ళి వాకింగ్ చేసి వస్తారు ఇద్దరూ. రాత్రి 8 లోపల ఏదో టిఫెన్ చేసుకుని తిని, పదింటి కల్లా పడుకుంటారు. పొద్దున ఐదింటికి లేచి మళ్ళీ వాకింగ్, స్నానం, పూజ, గోపాలం గారు లైబ్రరీకి, జానకమ్మకి వంట తోటి గడిచిపోతుంది ఉదయం.

ఎన్నో ఏళ్లుగా ఉన్న ఊరు, సొంత ఇల్లు కాబట్టి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కాలక్షేపానికి లోటు లేదు. ముగ్గురు పిల్లలు. అబ్బాయిలు ఇద్దరూ హైదరాబాద్. ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు. అమ్మాయి బెంగళూరు. ఇద్దరూ ఉద్యోగాలు. వాళ్ళకి ఒక కొడుకు. పిల్లలందరూ దగ్గర దగ్గర 10, 12, 8 వయసులో వారే. ఈ మధ్య గోపాలం గారికి కుటుంబమంతా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని అనిపిస్తోంది. కానీ ఒకరికి కుదిరితే ఒకరికి కుదరదంటారు. ఎంత దూరమైనా కారులో వెడదామంటారు. ఆయనకి కారు ఇష్టం ఉండదు. రైలు ప్రయాణం అంటే ఇష్టం. ఎలా ఐనా సరే ఈ సారి అందరూ కలిసి రైలులో ఎక్కడికైనా వెళ్ళాలని ఆయన కోరిక.

ముందు భార్యతో మొదలు పెడదామని “ఏమే ఆ సీరియల్ ఆపి ఒకసారి ఇలా రా.. మాట్లాడాలి” అన్నారు.

“ఉండండి.. నాలుగింటికి ఎలాగో అయిపోతుంది. అంత అర్జెంట్‌గా మాట్లాడేది ఏముంది”. అని సీరియల్‌లో మునిగిపోయింది ఆవిడ. నాలుగింటికి టి.వి. కట్టేసి టీ పెట్టి పట్టుకొని వచ్చి “ఊ.. చెప్పండి ఏమిటో” అంది జానకమ్మ.

“మనం రైలెక్కి ఎన్నాళ్ళయింది?” అడిగారు.

“కిందటి నెల్లోనే కదండీ పాసింజర్‌లో తణుకు తీసుకెళ్ళారు సూరిగాడి పెళ్ళికి. తలకొట్టేసినట్టయింది నాకు. పెద్దాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. కారుంది.. అలా ఎందుకు వెళ్ళారని” అందావిడ.

“సరేలే.. వాళ్ళకది మాములే.. రైలులో దూరం ప్రయాణం గురించి అడిగా.” అన్నారాయన.

“రైలులో దూర ప్రయాణాలు చేసే ఓపిక ఎవరికీ లేదు. కావాలంటే మీరు వెళ్ళండి. ఎవరూ రారు. అయినా ఎక్కడికి ఇప్పుడు.” చిరాగ్గా అంది జానకమ్మ.

ఆవిడకి పిల్లలతో కార్లలో తిరగటం అలవాటయి పోయింది. “పిల్లలందరికీ దగ్గర దగ్గర పదేళ్ళు వస్తున్నాయి. వాళ్ళు పుట్టాక రైలెక్కలేదు. ఎక్కితే కారు, లేదా విమానం.. పిల్లలకి అన్నీ తెలియాలి కదా. ముందు నీ అభిప్రాయం చెప్పు.” అన్నారు.

“ఎ. సి. కోచ్ అయితే ఫర్వాలేదు” అంది జానకమ్మ.

“అద్దాలు బిగించుకొని ఎ.సి. కోచ్ లో కూచుంటే ఎంతో, కారులో కూర్చున్నా అంతే కదా.” అన్నారాయన.

“అంటే ఏమిటి మీ ఉద్దేశం? అందరినీ స్లీపర్‌లో రమ్మంటారా? ఎవరూ రారు.”

“నువ్వొస్తావా” అడిగారు గోపాలం గారు.

“అస్స లు రాను” విసురుగా అంది జానకమ్మ.

“సరే.. అడిగి చూస్తా అందరినీ”.

“తిట్టించుకోవడం సరదా అయితే మీ ఇష్టం.” అంటూ లోపలికి వెళ్ళి పోయింది జానకమ్మ.

మర్నాడు ఆదివారం. పిల్లలంతా ఇంట్లోనే ఉంటారు. అందరికీ చెప్పారు కాన్ఫరెన్స్ కాల్ పెట్టమని. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరూ నెట్ లోకి వచ్చారు.

“ఏమిటి నాన్నా.. ఆస్తి పంపకాలేమైనా చేస్తున్నావా.. అందరితో మాట్లాడాలన్నావు” రెండో కొడుకు శేఖర్ సరదాగా అన్నాడు.

“ఏరా.. నీ కొచ్చే లక్షలు సరిపోవటం లేదా.. నాన్నగారిని అడుగుతున్నావు” పెద్ద కొడుకు రాజు చురకేసాడు.

“ఏ ఆస్తులైనా ఆడపిల్లకి కూడా హక్కుంది.” అలా కూతురు పద్మ లైన్ లోకి వచ్చింది. ఇలా కాసేపు సరస సంభాషణలు జరిగాయి.

“చెప్పమ్మా.. ఏమిటి విశేషాలు” రాజు అడిగాడు.

“ఏమో బాబూ మీ నాన్నగారికి ఏదో కోరికట వినండి.” అంది జానకమ్మ.

గోపాలం గారు గొంతు సవరించుకుంటూ “పిల్లలున్నారురా” అన్నారు.

“ఆ.. ఉన్నారు” అన్నారంతా.

“పిలవండి.. ముందు వాళ్ళతో మాట్లాడాలి” అన్నారు గోపాలం గారు.

పిల్లలందరూ వీడియో లోకి వచ్చారు. కాసేపు వాళ్ళతో మాములుగా మాట్లాడి “పిల్లలూ మీరెప్పుడైనా రైలు ఎక్కారా?” అని అడిగారు.

పిల్లలు  “లేదు.. తాతయ్య.. ఎప్పుడూ రాజమండ్రి, హైదరాబాద్, బెంగళూరు కారులోనే కదా వెడతాము. ఒకసారి తిరుపతి వెళ్ళాము. అప్పుడు విమానంలో వెళ్ళాము.” అన్నారు ఒకరి తర్వాత ఒకరు.

“మరి మీకు రైలు ఎక్కాలని లేదా?” అడిగారు గోపాలం గారు.

“నేను రెడీ. నేను కూడా తాతయ్య..” అని అందరూ ఉత్సాహంగా… “ఎక్కడికి వెడదాం తాతయ్య… లాంగ్ జర్నీ అయితే బాగుంటుందని..” ఇలా కాసేపు తాతగారితో ముచ్చట్లాడారు.

“సరే పిల్లలూ మీరు వెళ్ళండి.. అమ్మా, నాన్నలని రమ్మనండి.” అన్నారాయన.

“ఏమిటి.. నాన్న.. ఎక్కడికి ప్రయాణం .. ఎప్పుడూ?”.

“వెళ్ళొచ్చు.. చక్కగా కారులో వెళ్దాం.”

“హ.. అందరం కలిసే వెళ్ళొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు. రైలయితే ఈ లగేజీలు మోసుకుంటూ తిరగాలి. ఇలాంటి ప్రయాణాలు పెట్టకండి నాన్నా.. ఎవరికీ ఓపికలు లేవు.”

“పిల్లలకి తెలియదు. ఏదో రైలెక్కాలి అనుకుంటారు. కావాలంటే రాజమండ్రి వచ్చినప్పుడు పాసింజర్ రైలు ఎక్కిద్దాములే.”

“ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారు”

“అమ్మ కూడా రైలెక్కి దిగి నడవలేదు.” ఇలా తలొక మాటా మాట్లాడారు కొడుకులు, కూతురు.

జానకమ్మ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వింటోంది.

గోపాలం గారు సౌత్ టూర్ అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మాటలు విని, ఎందుకులే అనుకుని “తిరుపతి వెడదాంరా. పిల్లల్ని రైలులో తీసుకుని వెళ్ళాలని నా కోరిక. వాళ్ళకి కష్టం, సుఖం తెలియాలి” అన్నారు.

“సరే.. ఎప్పుడను కుంటున్నారు..” కూతురు అడిగింది.

“సంక్రాంతికి అయితే కొంచెం జనం తక్కువ ఉంటారేమో అని” అన్నారాయన.

“జనం ఎప్పుడూ మామూలే.. కానీ పండగకి ఇంట్లో ఉండకుండా…” పెద్ద కొడుకు మాట పూర్తి అవకుండానే కోడలు రమ అందుకుంది. “మా అమ్మ గారి ఊర్లో చాలా బాగా చేస్తారు పండుగ. మిమ్మల్ని కూడా పిలిచారు కదా మావయ్య గారు” అంది.

“పదేళ్ళ బట్టి వెడుతూనే ఉన్నాము కదమ్మా మీ ఇంటికి. ఈసారి స్వామి దర్శనం చేసుకుందాం. మీ వాళ్ళని కూడా రమ్మందాం” అన్నారు. రమ ఏమనలేక ఊరుకుంది. చిన్న కోడలికి కూడా ఇష్టం లేకపోయినా మాట్లాడలేదు. కానీ రైలులో ఎంతమాత్రం ఇష్టం లేదు. మామగారికి ఈ రైలు పిచ్చేమిటో అనుకుంది.

“నాన్నా.. రైలులో అయినా ఎలా కలుస్తాము. మీరో మూల, మేమో మూల… అందరం ఎక్కడ కలుస్తాము… మాకు తిరుపతి దగ్గర. మీ అల్లుడు రైలు అంటే ఒప్పుకోరు.” కూతురు పద్మ అంది.

“అల్లుడుతో నేను మాట్లాడతానులే అమ్మా.. ఈ ఒక్కసారికి నా మాట వినండి అందరూ. నేను నా ప్లాన్ చెబుతాను వినండి. తర్వాత అందరూ ఆలోచించి చెప్పండి.” అన్నారు.

తండ్రి గట్టి పట్టుదల మీద ఉన్నాడని అర్థమయ్యింది అందరికీ. ఆయన ఎప్పుడూ ఏమీ అడగలేదు. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు ఎలా చెబితే అలా చేస్తున్నారు. సరే ఈ సారి ఆయన చెప్పినట్లు వింటే ఏం పోతుంది అనుకుని “చెప్పండి నాన్నా” అన్నాడు రాజు.

“అందరూ వినండి. భోగి ముందు శని, ఆదివారాలు వచ్చాయి. మనం  శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం దర్శనం, ఆదివారం చుట్టు పక్కల చూసుకుని రాత్రి రైలు ఎక్కి సోమవారం రాజమండ్రి వస్తాము. పెద్దాడి కుటుంబం కావాలంటే భోగి రోజు ఉండి, సంక్రాంతికి వాళ్ళ అత్తారింటికి వెళ్తారు. తర్వాత మీ ఊళ్ళకి తిరుగు ప్రయాణం మీ ఇష్టం. అందరం కలిసి వెళ్ళటానికి మమ్మల్ని హైదరాబాద్ రమ్మంటారా, మీరు రాజమండ్రి వస్తారా.. మీరే నిర్ణయించుకోండి. వీటన్నింటికీ రిజర్వేషన్లు, కొండ మీద రూం లు, దర్శనం ఇవన్నీ చూసుకోండి.” అన్నారు.

“మీ అల్లుడు గారిని అడగాలి నాన్నా” అంది పద్మ.

“నరేంద్ర నా మాట కాదనడు. వచ్చాక చెప్పు. నే మాట్లాడుతా” అన్నారు గోపాలం గారు. నరేంద్రకి మావగారంటే చాలా గౌరవం ఉంది.

“సరే నాన్నా.. బావగారితో కూడా మాట్లాడాక ఆలోచించుకుని రేపు రాత్రి మా నిర్ణయం చెబుతాము.” అన్నారు కొడుకులిద్దరూ.

కాసేపు తల్లితో కూడా మాట్లాడాక ఫోన్ పెట్టేసారు. రాత్రి మామగారితో మాట్లాడిన నరేంద్ర ఏమనలేక సరే అన్నాడు. బావమరుదులతో మాట్లాడి తనకు మీటింగు లుంటాయని డైరెక్ట్‌గా తిరుపతి వస్తానని, రిటర్న్ జర్నీలో అందరితో కలిసి రాజమండ్రి వస్తానని చెప్పాడు. కొడుకులిద్దరూ తల్లి తండ్రులను వారం ముందు హైదరాబాద్ వచ్చేయమన్నారు. అక్కడ నుంచి కలిసి వెళ్ళొచ్చు అని. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్లీపర్‌లో వచ్చే సమస్య లేదని చెప్పేసారు.

గోపాలం గారు ఏమనలేక ఊరుకున్నారు. ఆయనకి తన అభిప్రాయాలు పిల్లల మీద రుద్ది, ఉన్న గౌరవం పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు. వారం ముందు హైదరాబాద్ వెళ్ళారు గోపాలం దంపతులు.

అందరూ కలిసి అనుకున్న రోజు రైలెక్కి తిరుపతి బయలుదేరారు. అందరూ ఉత్సాహంగా ఉన్నా, గోపాలం గారి మనసులో అంత ఉత్సాహం లేదు. పైకి కనపడకుండా నవ్వుతూ పిల్లలతో కబుర్లు చెబుతున్నారు.

అత్త, కోడళ్ళు ఒకటై పోయి జోకులేసుకుంటూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. జానకమ్మ ఏ ఎండ కా గొడుగు పట్టగలదు. గోపాలం గారు అద్దాల లోంచి బయటకు చూస్తున్నారు. మసక మసక గా కనపడుతున్నాయి పరిసరాలు. పెద్దకొడుకు రాజు అంతా గమనిస్తున్నాడు. వచ్చి పక్కనే కూర్చుని “సారీ.. నాన్నా నీ కోరిక పూర్తిగా తీర్చలేకపోయాను. కానీ ఇప్పుడు పూర్వంలా లేదు నాన్నా స్లీపర్ లో.. అందరూ ఎక్కేసి కూర్చుంటున్నారు. కాళ్ళ దగ్గర, బెర్త్ ల మధ్య పడుకుండి పోతున్నారు. మనం ఏమీ అనలేము. వెయిటింగ్ లిస్ట్ అంటారు. దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. అందుకే స్లీపర్ వద్దన్నాము. ఒక పని చేద్దాం. రాజమండ్రి నుండి విజయవాడ వెళ్దాము రైలులో పిల్లల్ని తీసుకుని.” అన్నాడు రాజు.

“సరే లేరా.. మీరు కూడా అన్నీ ఆలోచించే చేస్తారుగా.. ఫర్వాలేదు” అంటూ నవ్వారు గోపాలం గారు.

మర్నాడు తిరుపతిలో ముందే బుక్ చేసిన కార్లు వచ్చాయి. పద్మా వాళ్ళు కలిసారు. అందరూ కలిసి దైవ దర్శనం చేసుకుని, చుట్టు పక్కల అన్నీ చూసుకుని రాజమండ్రి వచ్చేసారు. పండుగ అయ్యాక అందరూ కలిసి విజయవాడకి మామూలు రైలులో వెళ్ళారు. పిల్లలంతా కిటికీ పక్కన సీట్ కోసం పోట్లాడుకుంటుంటే, సర్ది చెప్పి వాళ్ళ మధ్య గోపాలం గారు కూడా పిల్లాడైపోయి అన్నీ వివరంగా చెపుతూ ఆనందం పొందారు. పెద్ద కొడుకు వైపు మెచ్చుకోలుగా చూసారు.

“ఒక వయసు వచ్చాక పెద్ద వాళ్ళని కూడా పిల్లల్లా చూసుకోవాలిరా.. లేకపోతే మానసికంగా కృంగి పోతారు. పైకి చెప్పరు. చిన్న చిన్న కోరికలేగా” అన్నాడు తమ్ముడితో రాజు.

“ఔను.. అన్నయ్యా.. తిరుపతికి వెళ్ళినప్పటికి, ఇప్పటి ఈ ప్రయాణానికి చాలా తేడా ఉంది నాన్న ముఖంలో” అన్నాడు శేఖర్.

ఎవరి మనోభావాలతో సంబంధం లేని రైలు ప్రతి చిన్న స్టేషన్‌లో ఆగుతూ ముందుకు నడుస్తోంది.

Exit mobile version