Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోసేవే గోవిందసేవ

[‘గోసేవే గోవిందసేవ’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

అ – అమ్మ

ఆ – ఆవు

అమ్మ వంటిదే ఆవు అంటూ అమ్మకు ఆవుకు అభేదాన్ని చెప్పాడు ఒక కవి. అందుకే “గావః విశ్వస్య మాతరః” అని వేదాలలో చెప్పబడింది.

ఆవును గోమాత అని వ్యవహరిస్తారు. గోవు జంతువు అయినా అది సాధుజీవి. గోవు పెద్దలనేకాదు తనను సమీపించిన పిల్లలను సైతం ప్రేమతో చూస్తుంది. అమ్మ ప్రేమిస్తుంది, లాలిస్తుంది, బుజ్జగిస్తుంది, ఆకలి తీర్చి అన్నీ తానై రక్షిస్తుంది. అలాగే గోమాత తనను సమీపించిన వారిని అమ్మలా కాపాడుతుంది. అందునా పసి పిల్లలపై ఎంతో ఆదరణను చూపిస్తుంది.

ఒకప్పుడు తల్లి వద్ద పాలు లేకపోయినా, విధివశాత్తు తల్లి కాలం చేసినా ఆ పసిగుడ్డును ఆవుపాలతో పెంచేవారు. అందుకే ఆవును మాత అని సంబోధిస్తారు. కాని నేడు పాలలో ఎన్నో ప్రత్యామ్నాయాలు వచ్చాయి. అయినా ఆవుపాలకు సాటి మరేవి లేవు. అందుకే గోవు ఎంత గొప్పదో కదా.

ఆనాడు దేవకి గర్భాన జన్మించి యశోద వద్ద పెరిగిన పరమాత్మ గోవులతో ఆడాడు, పాడాడు. తానే గొల్లడై గోవులను కాచి గోపాలకుడైనాడు. గోవర్థనోధ్ధరణము గావించి గో, గోపాలక, గోపికలను కాపాడి గోవిందుడు అయినాడు. అందుకే శ్రీకృష్ణుని గోపాలుడని, గోవిందుడని వ్యవహరిస్తారు. పరమాత్మకున్న సహస్రనామాలలో గోపాలక, గోవింద అన్న నామములు అత్యంత ప్రీతిపాత్రము. నేడు కలియుగదైవమైన వేంకటేశ్వరుని గోవిందా, గోవిందాయని భక్తులు ఆర్తితో పిలుస్తారు.

గోవింద గోవిందయని కొలువరే

గోవిందాయని కొలువరే

అని అన్నమయ్య ఆస్వామిని కీర్తించుటలో ఆ నామము యొక్క గొప్పదనము విదితమగుచున్నది. పరమాత్మ ప్రేమను పొందిన ఆ గోజాతి ఎంత గొప్పదో కదా.

గోవు తన వద్దకు వచ్చిన వారిని చూపులతో పలకరిస్తుంది. అంటే పసిపిల్లల విషయం చెప్ప పనిలేదు. గోమాతను ఒక జంతువుగా కాక అమ్మలా భావిస్తే ఆ కన్నులలోని భావాలు మనకు అర్థమవుతాయి. పెద్దలు ఆవు వద్దకు వెళ్ళి పొదుగునుండి పాలను తీస్తారు. ఆ సమయంలో దాని లేగను దూరంగా కట్టి వేస్తారు. దూరంగా కనబడే ఆ లేగను చూసి దాని మనసులో ఎన్నో భావాలు కదలాడుతాయి. కానీ అమ్మ ఏ బిడ్డ అయినా బాధపడితే చూడలేదు. అందునా ఆవు మహా జ్ఞాని. అంటే అది తీర్చేది మన కడుపులోని ఆకలి కాదు. మానవుడిలోని జ్ఞానానికి సంబంధించిన ఆకలి. జ్ఞానవంతురాలైన ఆవు పాలు, పెరుగు సేవిస్తే మనుషులలో జ్ఞాపకశక్తి, జ్ఞానము, రోగనిరోధక శక్తి,, సంస్కార శక్తి, దీర్ఘాయువు, వీర్యవృద్ది, వ్యక్తి తేజస్సు పెరుగుతాయి అంటారు. గోవు మలమూత్రములను ఎరువులుగా వాడితే పండిన ఆహార పదార్థాలు కూడా శక్తికి తోడ్పడతాయి. గోసేవ పరమాత్మ సేవతో సమానము. భగవంతుని ప్రత్యక్షంగా సేవించడం అసాధ్యము. అందుకే మనకు కనిపించే గోవును సేవించడం భగవంతుని సేవతో సమానమని చెప్పవచ్చు.

అంతటి సాధుమూర్తి అయిన గోవు వద్ద ఒక పసి పిల్లవాడిని వదిలిపెడితే అది ఎంత ప్రేమగా చూస్తుందో కదా!

నడకకూడా వచ్చీరాని ఒక పసివాడు గోవు దగ్గరకు వెళితే దాని ప్రతిస్పందన ఎంత గొప్పగా ఉన్నదో కదా. సమీపంలోనే దాని లేగను కట్టివేశారు. అయినా అది ఆ పిల్లవాడిని ఆదరించే తీరు అద్భుతం. మనిషిలో లేని సహనం ఆ ఆవులో మనకు కనిపిస్తుంది. అందుకే గోవుని ముక్కోటి దేవతా స్వరూపంగా భావించి పూజిస్తారు. అది ఆ పిల్లవానిపై ఎంత ప్రేమ చూపుతోందో కదా. వాడు దాని చెవులు పట్టుకుని లాగుతూ దాని మొఖం చూస్తూ ఉంటాడు. ఆ సన్నివేశాన్ని చూస్తే తల్లి ఒడిలో పాలు తాగుతూ ఆ తల్లి మెడలోని పుస్తెలను పట్టుకొని ఆడుకుంటున్న పిల్లవాడి ఆనందం మనకు కనిపిస్తుంది. ఆ గోవు ముఖంలో కూడా అలాంటి ప్రసన్నతే మనకు గోచరిస్తుంది. దాని ముఖాన్ని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు గోవు తన లేగను నాకుతున్నపుడు కలిగే భావన దాని ముఖంలో ప్రస్ఫుటమవుతుంది. పసివాడు కూర్చుంటే గోవు ఆ పిల్లవాని ఒడిలో తన తలపెడుతుంది. పసివాడు కూర్చున్నపుడు తల్లి పిల్లవాని ఒడిలో తలపెట్టి పడుకుంటే ఆ పిల్లవాడి ఆనందం వర్ణనాతీతం. తల్లి ముఖాన్ని ముద్దు పెట్టుకుంటాడు, కళ్ళు ముట్టుకుంటాడు, చెవులు లాగుతాడు, నోట్లో వేలు పెడతాడు, ఒకటి ఏమిటి అన్నీ తన సొంతమే అన్నట్లు, అమ్మ ఒక బొమ్మలా ఆడుకుంటాడు. తన తల్లికి తానే తల్లినైనానన్న భావన కనిపిస్తుంది ఆ పిల్లవాడి కన్నులలో.

గోవు కూడా తన సమీపించి కూర్చున్న పిల్లవాడి ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది. గోమాతను ఆశ్రయం చేసుకున్న ఆ బాలునిలో తల్లిఒడిలో పడుకున్న నిశ్చింత కనిపిస్తుంది. తల్లి ఒడి పిల్లలకు ఒక రక్షణ వలయం. అంతటి శక్తినిస్తుంది ఆవు యొక్క సామీప్యత. తన ఒడిలోకి తీసుకొని పిల్లవానికి స్తన్యమిస్తుంది తల్లి. అలానే తన ఒడి చేరి తనతో ఆడుకుంటున్న ఆ పిల్లవాని ఆకలి తీర్చటానికి ఆ ఆవు తన పొదుగును చూపుతూ ఆకలిని తీర్చుకోమన్నట్లుగా చూస్తున్న గోమాత చూపులలోని ప్రేమ, అనురాగము, ఆప్యాయత అత్యద్భుతము. ఆ గోవు తన చేతలతో ఆ పిల్లవాడిని లాలించి, బుజ్జగించిన తీరు అనితర సాధ్యము. తల్లి అలసిన, తన ఆరోగ్యం సహకరించకపోయినా ఏనాడు తన బిడ్డలను నిర్లక్ష్యం చేయదు. తల్లిలానే గోమాత కూడా తన బిడ్డలనే కాదు మానవులను అందునా పసి పిల్లలపై చూపే ప్రేమ నిరుపమానము. అలా అలసి గోమాత ఒడిలో సేదతీరుతున్న ఆ పసిపిల్ల వాడిపై ఆ గోవు చూపే ఆదరణము చెప్పటానికి మాటలు చాలవు.

Exit mobile version