[శ్రీ రాజ్ వరదా గారి ‘గోవింద్ గార్డెన్స్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
భజగోవింద శ్లోక సారాంశం మోహ విచ్ఛేదనం. అందుకే దీన్ని మోహముద్గరం అని కూడా అంటారు. అశాశ్వతమైన బంధాల మోహాన్ని వదిలి పరమార్థాన్ని ఎలా పొందాలో వివరించే 31 శ్లోకాల మాలిక మోహముద్గరం. శ్లోకాలు అన్వయంలోనూ, ఆచరణలోను మరీ జటిలమైనవి కాకపోయినా పండితులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానించడం వల్ల, అనువాదకులు తమ తమ అవగాహనా స్థాయిలకి తగ్గట్టుగా అనువదించడం వల్ల ‘భజగోవిందం’ క్లిష్టమైనదనీ, ఆ శ్లోకాలు ఆధ్యాత్మిక సాధకులకు తప్ప సాధారణ ప్రజలకు అంత సులువుగా లొంగవన్న అభిప్రాయం వ్యాపించింది. ఆ అభిప్రాయం నిజం కాదంటూ, అందులోని వివేకాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో, 31 శ్లోకాలకు వాటి సారాంశాన్ని సూచించే విధంగా 31 కథలను కూర్చి, సరళంగా, సుబోధకంగా అందించారు శ్రీ రాజ్ వరదా. రాధాకృష్ణులని, గోవుని నేపథ్యంగా చేసుకుని, ఒక కాలనీలో ఇళ్ళు, కుటుంబ సభ్యులను కేంద్రంగా చేసుకుని ‘గోవింద్ గార్డెన్స్’ పేరిట శంకర భగవత్పాదుల అమృతవాణిని కథాసంపుటిగా అందించారు రచయిత.
మోహాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గాన్ని చూపే అద్భుత కథల సంపుటి ఇది. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ చదివి, ఆచరించాల్సిన ఒక విలక్షణమైన పుస్తకం.
♦
శ్రీ రాజ్, అనిల్ అనే ఇద్దరు మిత్రుల సంభాషణ ఫలితంగా, శ్రీరాజ్ ఒక కాలనీలోని ఒక్కో ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల ప్రవర్తనని, వారి స్వభావాన్ని గమనిస్తాడు. ఆ కాలనీలో తోటమాలిగా ఉంటున్న ఆదిశంకరయ్య కొందరు వ్యక్తుల ఆలోచనలలోని లోపాలని ఎత్తి చూపుతాడు. ఆర్భాటాలు లేకుండా సామాన్యంగా ఉంటూ, నిరాడంబరంగా నిర్మోహంగా ఉన్నవారిని అభినందిస్తూ, ఏదీ లోపమో, ఏది సవ్యమో చెప్తూంటాడు. పైకి అతను పెద్దగా చదువుకున్నట్టు అనిపించకపోయినా; నిత్యానిత్యాల అవగహాన, ఏది వదులుకోవాలి, దేన్ని పొందాలనే జ్ఞానం ఉన్నవాడని అర్థమవుతుంది.
ఆది శంకరయ్య కొందరిది మూర్ఖత్వమని ఎందుకు అంటున్నాడో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కాలనీలో ఒక్కో ఇంటికీ వెళ్ళి, ఆ కుటుంబంలోని వారిని కలిసి వారితో మాట్లాడుతాడు శ్రీ రాజ్.
హౌస్ నెంబర్ 1 ఇల్లులా కాకుండా ఓ ప్రయోగశాలలా అనిపిస్తుంది. డా. సూర్యనారాయణ అనే మొక్కల శాస్త్రవేత్త ఆధునిక పద్ధతులలో మొక్కలను పెంచుతుంటాడు. ఎన్నో లెక్కలు వేసి జాగ్రత్తగా నాటిన మొక్కలో ఒకటి సాయంత్రమయ్యేసరికి వాడిపోయి, చచ్చిపోతుంది. అదెందుకో బతకలేదో ఆది శంకరయ్య చెప్తాడు. అంత్యకాలం వచ్చినప్పుడు ఏ లెక్కలూ, ఏ పాఠాలూ, ఏ తెలిసిన విద్యలూ కాపాడవు. మోహముద్గరంలోని మొదటి శ్లోకం సారమిది.
హౌస్ నెంబర్ 2 ఇల్లులా కాకుండా మ్యూజియంలా అనిపిస్తుంది శ్రీ రాజ్‌కి. అక్కడున్న ప్రతి వస్తువు అరుదైనదీ, విలువైనదీ అని తెలుస్తూనే ఉంటుంది. అది వ్యాపారవేత్త లత ఇల్లు. వ్యాపార విస్తరణకే సమయం సరిపోని ఆమె, ఇంటి నిర్వహణ బాధ్యతని మల్లికి అప్పగిస్తుంది. లత తోనూ, మల్లి తోనూ మాట్లాడగా వారిద్దరి స్వభావాలు అర్థమవుతాయి. లతలా పాకడంలో ఉన్న ధ్యాస, మల్లిలా పరిమళించడంలో లేదని వ్యాఖ్యానిస్తాడు ఆది శంకరయ్య. ‘నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు’ అన్న భజగోవిందం రెండవ శ్లోకం సారం ఈ కథ.
హౌస్ నెంబర్ 3 యజమాని కాంతామోహన్. ఆయన భార్య లావణ్య. శ్రీ రాజ్ వారింటికి వెళ్ళినప్పుడు, ముందు వరండాలో పెద్ద జనరేటర్‌ని గమనిస్తాడు. అక్కడున్న రాధాకృష్ణుల మైనపు విగ్రహంలో రాధ సౌందర్యంలోని ప్రశాంతతని గుర్తిస్తాడు. తనకి అందమంటే ఇష్టమని అంటాడు కాంతామోహన్. ఇంతలో లైట్స్ ఆరిపోయి, ఏసి ఆగిపోతుంది. మైనం కరిగిపోతుందేమోనని భయపడుతుంది లావణ్య. కాలనీ ఆఫీస్‌కి ఫోన్ చేస్తే, సమస్య వాళ్ళింటి మెయిన్ బోర్డులోనే ఉందని చెప్తాడు ఆది శంకరయ్య. ‘ఎంతటి లావణ్యమైనా చివరికి మైనంలా కరిగిపోతుంద’న్న భజగోవిందం మూడవ శ్లోకం సారం ఈ కథ.
మర్నాడు హౌస్ నెంబర్ 4కి వెళ్తాడు శ్రీ రాజ్. ఆ ఇల్లు పాత కొత్తల కలయికలా ఉంటుంది. ముందుగదిలో రాధాకృష్ణుల బొమ్మపై ఎప్పుడూ నీరు పడేలా ఏర్పాటు చేసినట్టున్నారు. ఇంటి యజమాని విద్వత్ వచ్చి పరిచయం చేసుకుంటాడు. ప్లానింగ్ సరిగా ఉంటే అన్నిటినీ కంట్రోల్ చేయచ్చని అతను నమ్ముతాడు. ఇంతలో అతని ట్యాబ్‌లో ఒక సందేశం వస్తుంది. ఎంతో జాగ్రత్తగా ప్రణాళికలు వేసి, ఓ విదేశీ కంపెనీలో చేసిన ఇన్వెస్ట్మెంట్లో, కొత్త టాక్స్ విధానం వల్ల అతడికొచ్చే రాబడి బాగా తగ్గిపోయిందని ఆ మెసేజ్ సారాంశం. తన తెలివి, తన ప్లాన్లు విఫలమయ్యాయని బాధపడతాడు విద్వత్. ‘తామరాకు మీద నీటిబొట్టు ఎంత చంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంతే అస్థిరమైనద’న్న భజగోవిందం నాల్గవ శ్లోకాన్ని వివరిస్తుందీ కథ.
హౌస్ నెంబర్ 5కి వెళ్తే, అది పెద్ద తోటలా అనిపిస్తుంది. ఒక్క నేరేడు పూల మీద తప్ప, మిగతా అన్ని పూల మీద మెత్తటి జాలీని కప్పి ఉంచుతారు. ఆ ఇంట్లో ఉండే పెద్దావిడ పేరు అవని, ఆమె కూతురు రాణి. అవనికి నేరేడు పూలన్నా, నేరేడు తేనె అన్నా చాలా ఇష్టం. తేనెటీగల్ని కూడా జాగ్రత్తగా పెంచుతుందామె. ముందు అవని, శ్రీ రాజ్ లోపలికి వెళ్తారు. అక్కడ నేరేడు చెక్కతో చేసిన రాధాకృష్ణుల బొమ్మ కనబడుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా రాణి వచ్చి కూర్చుంటుంది. ఆమె బాగా అలసిపోయినట్టు శ్రీ రాజ్ గ్రహిస్తాడు. పెద్దామె పొద్దున పడిపోయిందని తెల్సుకున్న ఆది శంకరయ్య ఆమెని చూడ్డానికి వచ్చి, ఆమె పాదాలకు మర్దనా చేస్తాడు. తిరిగి వెళ్తూ, తేనె తెస్తున్నంత వరకే తేనెటీగపై మమకారం అని వ్యాఖ్యానిస్తాడు. మోహముద్గరం లోని 5వ శ్లోకం చెప్పే ‘ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటార’న్న వాస్తవాన్ని సూచిస్తుందీ కథ.
హౌస్ నెంబర్ 6కి వెళ్తాడు శ్రీ రాజ్. ఇంటి ముందు లాన్ ఉంది గానీ, పచ్చదనం లేదు. లోపలికి వెళ్తే, గదిలో ఓ మూలగా రాధాకృష్ణుల బొమ్మ సన్నని వెండి పనితో చేసినది కనబడుతుంది. అయితే కృష్ణుడి చేతిలో వేణువు లేకపోవడం చూసి, ‘ఇక్కడ మురళి కనిపించడం లేదు’ అని పైకే అంటాడు. అప్పుడే అక్కడికొచ్చిన ఇంటి యజమాని పరంధామయ్య చనిపోయిన తన కొడుకు మురళిని గుర్తు చేసుకుంటాడు. ఇది వరకు అతని కోసం చాలా మంది వచ్చి వెళ్తుండేవారని, ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదని వాపోతాడు. బాధ్యతల నెపంతో, మన కలలను వాయిదా వేసుకుంటే, ఒక్కోసారి వాటిని సాకారం చేసుకోడానికి మనం ఉండకపోవచ్చు. ‘ఎంతవరకైతే ఈ దేహంలో ప్రాణం ఉంటుందో అంతవరకే కుశలం అడుగుతార’న్న 6వ శ్లోకం సారాన్ని వ్యక్తం చేస్తుందీ కథ
ఏడవ ఇంటి ముందు పెద్ద తోట, చివరగా ఓ ఎత్తైన చిన్న గుట్ట లాంటి ప్రదేశం మీద రాధాకృష్ణుల విగ్రహం ఉంటుంది. అక్కడికి చేరడానికి కొన్ని మెట్లు! ఈ ఇంటి సభ్యులంతా తమ తమ పనుల్లో బిజీగా ఉండి, రాధాకృష్ణుల విగ్రహానికి పూలు కూడా అర్పించలేకుండా ఉంటారు. జీవితంలోని వివిధ దశలలో తమ తమ అభిరుచులలోనో, ఆసక్తులలోనూ చిక్కుపోయి, భగవంతునిపై ధ్యాస పెట్టలేనివారిని హెచ్చరించే ఏడవ శ్లోకాన్ని ఈ కథ సూచిస్తుంది.
ఎనిమిదవ ఇంట్లో మానవ్ అనే జీవశాస్త్రవేత్త ఉంటాడు. అతని తోటలో వాల్నట్లు చెట్లు ఉంటాయి. ఉడతలు ఉంటాయి. ఇంటి తలుపు మీద చెక్కిన రాధాకృష్ణుల బొమ్మపై వెలుగు పడినప్పుడు, దాని నీడ దూరం వరకూ పడుతూంటుంది. మానవ్కి ఇద్దరు కూతుర్లు. ఒకమ్మాయి అతన్నో ప్రశ్న అడిగితే, అతను జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. ‘నీవు ఎవరు? ఎవరికి చెందినవాడివి? ఎక్కడ నుంచి వచ్చావు వంటి అన్వేషణని కొనసాగించమ’ని సూచించే మోహముద్గరం ఎనిమిదవ శ్లోకం సారం ఈ కథ.
తొమ్మిదవ ఇంట్లో సరోజిని గారిని కలిసి, ఆమెతో మాట్లాడిన తర్వాత – ‘మనం ఏదో ఒకదాని వెంట పరిగెత్తడం ఆపినప్పుడే, మనకి ఉన్నదాన్ని ఆస్వాదించే వీలు కలుగుతుంది’ అన్న భావన శ్రీ రాజ్‌లో స్ఫురిస్తుంది. భజగోవిందం తొమ్మిదో శ్లోకం ‘సత్సంగత్వే నిస్సంగత్వం..’ ఇదే భావనని వివరిస్తుంది. చక్కని కథ ఇది.
ఇంటి నెంబరు పదిలో మేధ గారిని, ఆవిడ మేనకోడలు కామినిని కలుస్తాడు శ్రీరాజ్. వారి ఇంట్లో అన్నీ పొందికగా ఉంటాయి. బయట ఒక ఔట్‌హౌస్ లాంటిది ఉంటుంది, కాని బహుశా అది నిరుపయోగంగా ఉన్నట్లుంది అని అనుకుంటాడు శ్రీ రాజ్. మాటల్లో అది ఒకప్పుడు బోర్ రూమ్ అనీ, బోరింగ్ పంప్‌కి సంబంధించిన వస్తువుల కోసం కట్టారని మేధగారు చెప్తారు. రెండేళ్ళకే బోరు ఎండిపోయిందని, ఆ గది నిరుపయోగంగా ఉందని చెప్తుందామె. భర్త లేకుండా ఎలా ఉండగలుగుతున్నావత్తయ్యా అని కామిని అడుగుతుంది. మేధ అందుకు తగ్గ జవాబిస్తుంది. వారిద్దరి గురించి ‘మేధ లాగా మేధస్సు లేని ఈ ప్రాపంచిక కామం మూర్ఖమే’ అని అంటాడు ఆది శంకరయ్య. మోహముద్గరం పదవ శ్లోకం ‘వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః’కు సారమీ కథ.
భౌతిక సంపదని, యవ్వనాన్ని చూసి గర్వించకూడదనీ, అదంతా నిమిషాల్లో హరించుకుపోతుందన్న మోహముద్గరం పదకొండవ శ్లోక సారాన్ని వివరిస్తుంది హౌస్ నెంబర్ 11 కథ.
12వ కథలో, హౌస్ నెంబర్ 12 లోని ఆకాశ్, తన్విలు – తమ తోటలోని చెట్ల ద్వారా, అవకాశం ఉండగానే వీలైనంత సొమ్ము చేసుకోవాలని చూస్తారు. కాలచక్ర భ్రమణంలో వయసు కరిగిపోతుందని తెలిసి, ఆశల నెరవేర్పు లేదని, తనివి తీరలేదని బాధపడేవాళ్ళకి హెచ్చరిక ఈ కథ.
హౌస్ నెంబర్ 13లో సాంగత్య్ని కలుస్తాడు శ్రీ రాజ్. ఆ ఇల్లు సాంగత్య్ మేనమామ సజ్జన్ది. తమ మేనమామ గురించి చెప్తూ, “ఆయన జీవితం పెద్ద పెద్ద నియమాలతో నడవదు. కానీ చిన్న చిన్న నియంత్రణలతో నడుస్తుంది. మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను పట్టుకుని పరుగెత్తరు. అవసరం లేనివాటిని అక్కడికక్కడే వదిలేస్తారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు. అన్నది ముందే తూకం వేసుకున్నట్టే ఉంటుంది.” అంటాడు సాంగత్య్. ‘చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక’ అన్న భజగోవిందం 13 శ్లోకం సారాన్ని వివరించే కథ ఇది.
హౌస్ నెంబర్ 14లో ఉత్తర్ కుమార్ అనే కాషాయధారిని కలుస్తాడు శ్రీ రాజ్. అతనివన్నీ డాంబికాలేనని అతని మాటల వల్ల అర్థమవుతుంది. కాషాయం ధరించినా, సత్యాన్ని దర్శించలేని మూర్ఖుల గురించి చెప్పే మోహముద్గరం లోని 14వ శ్లోకం ‘జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబరబహుకృతవేషః’ ను సూచించే కథ ఇది.
15వ ఇంట్లోని ఇద్దరు వృద్ధులూ, వారి భార్యలను కలుస్తాడు శ్రీ రాజ్. వాళ్ళల్లో వయసు పెరుగుతున్నా, ప్రాపంచిక గౌరవాల పట్ల కోరిక నశించదు. వాళ్ళని చూసి, “ఇంకాస్త గౌరవం కోసం చింత.. ఇంకాస్త ధనం కోసం చింత.. ఇంకాస్త.. ఇంకాస్త.. అనే చింత చచ్చినా పులుపు చావదు.. నిశ్చింత లేని చింతది మూర్ఖమే..” అంటాడు ఆది శంకరయ్య. మోహముద్గరం లోని 15వ శ్లోకం ‘అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండం’ ను సూచించే కథ ఇది.
హౌస్ నెంబర్ 16లో ఎర్త్ సైంటిస్ట్ తపస్ని కలుస్తాడు శ్రీ రాజ్. తాను నిరాడంబరత ప్రాధాన్యమిస్తానని చెప్తాడు తపస్. కానీ అమితమైన గుర్తింపుని కోరుకుంటాడు. ఆ రోజు తాను చూసినది, ఇల్లు కాదు, ఓ మనసు అని అనుకుంటాడు శ్రీ రాజ్.
హౌస్ నెంబర్ 17లో గంగని కలుస్తాడు శ్రీ రాజ్. ఆ ఇంట్లోనూ, వారి తోటలోనూ ఏదో క్రమం లేని అందం ఉందనీ, ఏదో లోపిస్తోందని గ్రహిస్తాడు. తనకి ఆలయాలాన్నా, యాత్రలన్నా ఇష్టమని చెబుతుంది గంగ. ఎక్కడికి వెళ్ళినా, అక్కడ తనకు నచ్చిన బొమ్మలు కొనుక్కొస్తానని అంటుంది. పూరీ క్షేత్రం నుంచి తెచ్చి గోడ మీద అమర్చిన ఒక బొమ్మని చూపిస్తుంది. అది, బలరాముడు, కృష్ణుడు, సుభద్రల బొమ్మ అని చెప్తాడు శ్రీ రాజ్. తాను ఆమెని రుక్మిణి అనుకున్నాను ఇన్నాళ్ళు అని చెబుతుంది గంగ. భజగోవిందం లోని 17వ శ్లోకం ‘కురుతే గంగాసాగారగమనం వ్రత పరిపాలన మథవా దానం’ చదివితే, ఈ కథలో గంగ లోని లోపమేమిటో తెలుస్తుంది.
మర్నాడు హౌస్ నెంబర్ 18కి వెళ్ళి, రత్నాకర్ అనే షేర్ బ్రోకర్ని కలుస్తాడు శ్రీ రాజ్. అతని తోటలో ఫ్లేమ్ లిల్లీ పూలు ఎక్కువగా కనిపిస్తాయి. అతను ఆ పూలనీ, జీవితాన్ని పోలుస్తాడు. రత్నాకర్‌తో సంభాషణ వల్ల వైరాగ్యం అంటే ఏమిటో స్పష్టమవుతుంది శ్రీ రాజ్‌కి భజగోవిందం లోని 18వ శ్లోకం ‘సుర మందిర తరు మూల నివాసః..’ కి సారాంశమీ కథ.
హౌస్ నెంబర్ 19లో ప్రొఫెసర్ నిత్యానంద్ గారిని కలుస్తాడు శ్రీ రాజ్. ఆయన ఆస్ట్రో ఫిజిసిస్ట్. ఆయన ముఖంలో చెరగని చిరునవ్వు. లోపలికి వెళ్తారు. గోడల మీద నిత్యానంద్ గారు వివిధ వయసుల్లో ఉన్న ఫోటోలుంటాయి. వాటన్నింటిలో కూడా ఆయన మొహంలో అదే చిరునవ్వు ఉంటుంది. ఆయనని కలవడానికి వచ్చిన ఆది శంకరయ్య కాసేపు మాట్లాడి వెళ్తూ వెళ్తూ ఓ మాట అని వెళ్తాడు. ఆది శంకరయ్య చెప్పిన ఆ మాటలని 19వ శ్లోక సారాంశంగా భావించవచ్చు.
హౌస్ నెంబర్ 20లో సంస్కృత అధ్యాపకుడు నేరెళ్ళ నారాయణ మూర్తి గారిని కలుస్తాడు. ఆయన తరతమ భేదాలు లేకుండా తన పిల్లలకీ, సమీపంలోని స్లమ్ పిల్లలకు భగవద్గీతను నేర్పిస్తుంటారు. ఆయన భార్య సహధర్మచారిణి. స్లమ్ పిల్లలని దగ్గరకు రానీయద్దని బెదిరింపులు వచ్చినా ఆయన మానరు. భజగోవిందం లోని 20వ శ్లోకం ‘భగవద్గీతా కించిదధీత గంగా జలలవ కణికాపీతా’ సారాన్ని చెబుతుందీ కథ. ఈ కథ గురించి రచయిత ఏం చెప్పారో, ప్రత్యేక ఇంటర్వ్యూలో చదవండి.
గోవింద్ గార్డెన్స్‌లో 21వ ఇల్లు లైఫ్ కోచ్ నిర్భయ్ గారిది. ఆయనకి ఎన్నో సమస్యలుంటాయి. తన సమస్యలని దేవుడు కూడా తీర్చలేడని అంటాడాయన. ఆయన మనవరాలు ఛాయ వచ్చి, ఓ అద్భుతమైన విషయాన్ని చెబుతుంది. చిన్న వయసులోనే ఆమెకి ఆ అవగాహన కలగడం ఆశ్చర్యమే. ఆమె చెప్పిన మాటలు భజగోవిందం లోని 21వ శ్లోక సారాన్ని వ్యక్తం చేస్తాయి.
హౌస్ నెంబర్ 22లోకి ప్రవేశించగానే, అక్కడ ఓ చెట్టుక్రింద ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం శ్రీ రాజ్‌ని ఆకర్షిస్తుంది. అది శ్రీకృష్ణుడి నిర్యాణ సమయంలో కాలి బొటన వేలికి బాణం తగిలినప్పటి విగ్రహం. ఆ ఇంటి యజమాని ఆనంద్ యోగి ఒక చెట్టుక్రింద ధ్యానం చేసుకుంటుంటాడు. శ్రీ రాజ్ అక్కడికి వెళ్ళిన సమయంలో రెండు సంఘటనలు జరుగుతాయి. రెండిటిని సమ భావంతో చూస్తాడాయన. అసలైన యోగిపుంగవుని స్థితి ఎలా ఉంటుందో తెలిపే 22వ శ్లోకానికి అద్దం పడుతుందీ కథ.
హౌస్ నెంబర్ 23 ఒక ఓపెన్ ఆడిటోరియంలా అనిపిస్తుంది శ్రీ రాజ్‌కి. అక్కడ రంగస్థల కళాకారిణి ముగ్ధని కలుస్తాడు. ఆమె గతించిన తన భర్తని మరవలేక, పూలల్లో అతన్ని చూసుకుంటూ, ఆ పువ్వుల్ని ఎవరినీ కోయనివ్వదు. స్వప్నంలో కనిపించే దృశ్యం లాంటి ప్రపంచాన్ని విడిచిపెట్టమని సూచించే 23వ శ్లోకాన్ని అన్వయించిన కథ ఇది.
హౌస్ నెంబర్ 24లో, కోమలిని, ఆమె తండ్రి తరంగ్ రామ్‌ని కలుస్తాడు శ్రీ రాజ్. సంగీతం యొక్క శక్తి తెల్సిన వ్యక్తి ఆయన. కానీ కోపాన్ని నిగ్రహించుకోలేడు. భగవంతుడిని కోరుకుంటే, అన్నిటా, అంతటా, అందరిలోనూ సమబుద్ధిని కలిగి ఉండడం అవసరమనే 24వ శ్లోకానికి సారం ఈ కథ.
హౌస్ నెంబర్ 25 ప్రసిద్ధ అడ్వొకేట్ రమేష్ గారిది. జీవితం కనెక్షన్స్ మీద నడుస్తుందనీ, విలువ జోడించని వాళ్ళు అవసరం లేదన్న భావన ఆయనది. తన ఇంట్లో ఏర్పాటు చేయబోయే పార్టీకి కేవలం సమాజంలో ట్రెండ్ అవుతున్నవారినే పిలుస్తానని అంటాడు. వారింటి నుంచి బయటకు వెళ్తుంటే, మరో తండ్రీ కొడుకులను చూస్తాడు. ఆ తండ్రి స్వభావం రమేష్ గారి స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది. ‘శత్రౌ మిత్రే పుత్రే బంధవ్ మా కురు యత్నం విగ్రహ సంధవ్’ అన్న 25వ శ్లోకం సారాన్ని చెబుతుందీ కథ.
హౌస్ నెంబర్ 26లో, కరుణ, విజయ్ అనే తల్లీ కొడుకులని కలుస్తాడు. వారి తోటలో నరకాసురుడిని సంహరించేందుకు సిద్ధమవుతున్న పెద్ద కృష్ణుని విగ్రహం, చుట్టూ వందల సూర్యకాంతి పూలు ఉంటాయి. వాళ్ళిద్దరితో మాట్లాడితే, గొప్ప విషయం తెలుస్తుంది శ్రీ రాజ్‌కి. విజయం పట్ల మోహమే నరకమని అర్థమవుతుంది. ఆత్మజ్ఞానం లేని మూఢులు సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారని చెప్పే 26వ శ్లోకాన్ని సూచించే కథ ఇది.
హౌస్ నెంబర్ 27లో, శ్రీ రాజ్ నలుగురు యువకులను కలుస్తాడు. వారు తాము రకరకాల ప్రయోగాలు చేస్తున్నామని చెప్తారు. వాళ్ళు శ్రీ రాజ్‌తో మాట్లడుతుండగా అక్కడికి వచ్చిన ఆది శంకరయ్య, వారి ప్రవర్తనని గమనించి మూర్ఖత్వమని అంటాడు. భజగోవిందం 27వ శ్లోకం ‘గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం’ ప్రాధాన్యాన్ని చెబుతుందీ కథ.
హౌస్ నెంబర్ 28లో, శ్రీ రాజ్ బలహీనతలని అణచుకోలేక, అనారోగ్యం పాలయిన డా. అరవింద్‌ని కలుస్తాడు. మరణం తప్పదని తెలిసినా మోహం వీడలేని మనస్తత్త్వం ఆయనది గ్రహిస్తాడు శ్రీ రాజ్. ఈ కథ భజగోవిందం 28వ శ్లోకం సారాన్ని వివరిస్తుంది. ఈ కథ చదువుతున్నపుడల్లా, అప్రయత్నంగా నాకు ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలోని ‘ఆశా పాశం బందీ సేసేలే’ అనే పాట గుర్తొచ్చింది.
హౌస్ నెంబర్ 29 – గోవింద్ గార్డెన్స్ లేఅవుట్ చేసిన కనకదంతుడు గారిది. ఆయన ఇల్లంతా చాలా ఆడంబరంగా, పటాటోపంతో ఉంటుంది. ఆయన ఎంత ధనవంతుడైనా, ఆయనకున్న భయాలేమిటో చెప్తాడు. మంచి చేయాలని ఎందుకు చేయలేకపోయాడో చెప్తాడు. ‘అర్థమనర్థం భావయ నిత్యం నాస్తితతః సుఖలేశః సత్యం’ అనే 29 శ్లోకం సారాన్ని వివరిస్తుందీ కథ.
హౌస్ నెంబర్ 30లో, ఇంటి యజమాని కల్పనని కలుస్తాడు శ్రీ రాజ్. తాను ఎక్స్పీరియన్స్ డిజైనర్ననీ, కార్పొరేట్ సంస్థల కోసం అనుభవాలని సృష్టిస్తానని చెబుతూ, తన ప్రయోగాలని చూపిస్తుంది. తన తండ్రి యోగా కేంద్రాన్ని ఆధునికీకరించి, పాత విషయాలనే కొత్తగా చెబుతుందామె. గోవిందుని మాయే ఒక కల్పనా లోకమని తెలుసుకోకపోవడం ఆమె మూర్ఖత్వమని అంటాడు ఆది శంకరయ్య.
ఇప్పటి వరకు శ్రీ రాజ్ చూసినవి ఇళ్ళు. ఇక చూడాల్సింది ఒకటే. అది సైట్ 31. ఆది శంకరయ్య గుడిసె ఉన్న స్థలం. అక్కడికి వెళ్ళిన శ్రీ రాజ్‌కి ఒక వింత సంఘటన ఎదురవుతుంది. దాంతో అతనికి 31వ శ్లోకం అర్థం తెలియడమే కాకుండా, మొత్తం మోహముద్గరం అవగతమవుతుంది.
గోవింద్ గార్డెన్స్ ప్రయాణం ముగిసినా, జ్ఞానాన్వేషణ కొనసాగుతుంది.
♦
సరళమైన కథల రూపంలో అందించిన ఈ హృద్యమైన రచన, ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో మనసుకు ప్రశాంతతను చేకూర్చే ఒక దివ్యౌషధం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
అజ్ఞానపు పొరలను విడిపించి, ఆత్మజ్ఞానపు వెలుగులను నింపే శ్లోకాలకు కథారూపం. భ్రమల సంసారంలో పరమార్థాన్ని వెలికితీసే ప్రజ్ఞానమీ పుస్తకం.
భావితరాలకు సన్మార్గాన్ని, సరైన జీవన విలువులను నేర్పించే కథల పందిరి. ప్రాపంచిక భ్రమలను త్యజించి, జీవితంలో ఏది పొందాలో సరళంగా బోధించే కథల సంపుటి.
మనసులోని అజ్ఞానాన్ని, అశాశ్వతమైన మోహాలను వదులుకోవాలని హెచ్చరిస్తాయీ కథలు. ప్రతి కథకీ, ఎఐ టెక్నాలజీ ద్వారా చక్కని బొమ్మని అందించారు.
ఆశలకు, మోహాలకు దూరంగా జరిగి ప్రశాంతంగా ఎలా జీవించాలో నేర్పే అద్భుతమైన పుస్తకం ‘గోవింద్ గార్డెన్స్’.
***
రచన: శ్రీ రాజ్ వరదా
ప్రచురణ: ఎ వరదా పబ్లికేషన్
పేజీలు: 266
వెల: ₹ 516/-
ప్రతులకు:
ఎ వరదా పబ్లికేషన్,
ఫోన్: 9739097692
ఈమెయిల్: care.varadapublications@gmail.com
~
శ్రీ రాజ్ వరదా గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-sri-raj-varada/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

