[శ్రీ బండ్ల మాధవరావు రచించిన ‘గ్రాహం బెల్ జ్ఞాపకాల్లో’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
బ్రాంట్‌ఫోర్డ్ వీధుల్లో
గాలిలో ఏదో అదృశ్య స్వరం
ఇప్పటికీ ప్రయాణిస్తున్నట్టుంది
చరిత్ర తన చిరునామాగా
రాసుకున్న నేల అది
ఇప్పుడా నగరం టెలిఫోన్ సిటీ
టుటెలా హైట్స్‌లోని
ఆ నిశ్శబ్ద గృహంలో
ఒక యువ శాస్త్రవేత్త ఆలోచన
ప్రపంచ దూరాలను కొలిచింది.
మనిషి గొంతులోని స్పందనను
తీగల మీద నడిపించి,
దూరాన్ని సంభాషణగా మార్చిన
సృజనాత్మక మేధావి నడిచిన నేల
అక్కడొక ఆలోచన పుట్టిన క్షణం జ్ఞాపకానికొచ్చి
నన్ను ఉద్వేగభరితుడ్ని చేసింది.
మాట ప్రవహించడం మొదలైన చోటు
మాట తీగలై ప్రపంచం చుట్టొచ్చిన చోటు
దురానున్న మనుషుల్ని
మాటలతో దగ్గర చేసిన చోటు
1874లో మొలిచిన ఆ ఆలోచన
బ్రాంట్‌ఫోర్డ్ నుంచి పారిస్ దాకా
మానవ స్వరానికి రెక్కలిచ్చింది.
ఆ క్షణంలో
ప్రపంచం చిన్నదైంది
మనుషుల మధ్య దూరం
తీగంత అయింది
ఇప్పుడు ప్రపంచమే గుప్పిట్లోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరున్న తెలుగు కవి, సహృదయుడు అనగానే అందరూ తలచే ఒకే పేరు బండ్ల మాధవరావు. పలు కవితా సంపుటులను ప్రచురించారు.
