Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గ్రహించాలోయి మాయను వీడాలోయి

[మనిషి ఆశల వెనుక పరుగులు తీస్తూ అసలైన ప్రశాంతతను మర్చిపోతున్నాడని, కళ్ళకి కమ్మిన మాయను తొలగించి, ఆత్మజ్ఞానం వైపు నడవాలంటూ ‘గ్రహించాలోయి మాయను వీడాలోయి’ అనే కవితని అందిస్తున్నారు కరణం నారాయణ స్వామి పిళ్లై.]

~

బంధాల భ్రమ
కన్నవారు ఉన్నారని కమ్మని కలలు కంటాము,
కష్టమొస్తే ఎవరు మనకు తోడుండరని గ్రహిస్తాము,
లోకమనే నాటకాన నిమిత్త పాత్రలం మనమని
గ్రహించాలోయి మాయను వీడాలోయి!

కాలం విలువ
గడచిపోయిన కాలం తిరిగి మళ్ళీ రాదని
కనుమూత వేయకముందే కర్తవ్యం చేయాలని
వట్టి ఆశల వలలో చిక్కుకుపోకూడదని
గ్రహించాలోయి మాయను వీడాలోయి!

జ్ఞానోదయం
దేహమే దేవళమనే దివ్య జ్యోతిని వెలిగించాలని,
ద్వేషాన్ని వీడి ప్రేమ మార్గాన్ని నిర్మించుకోవాలని
శాశ్వతం కాని సిరి కోసం ప్రాకులాడకూడదని
గ్రహించాలోయి మాయను వీడాలోయి!

జీవిత పరమార్థం
వచ్చినప్పుడు ఏమి లేదు, పోయేటప్పుడు ఏమి రాదని,
నలుగురికి మేలు చేసే పుణ్యమే మిగులుతుందని
అశాశ్వతమైన ఈ లోక సత్యాన్ని గుర్తించాలని
గ్రహించాలోయి మాయను వీడాలోయి!

అహంకారం
అహంకారపు పొరలు కళ్ళను కప్పకూడదని
అశాంతి కడలిలో మునిగి తేలకూడదని
నిజమైన సుఖము మనలోనే ఉందని
గ్రహించాలోయి మాయను వీడాలోయి!

పరమాత్మ-పరహితం 
పరమాత్ముని జాడను మన లోన వెతుక్కోవాలని
పరహితము కోరడమే  గొప్ప బతుకని
కాలం గడవక ముందే ఈ సత్యాన్ని
గ్రహించాలోయి మాయను వీడాలోయి!

కోపం – శాంతి
కోపంతో కళ్ళు మూసుకుపోతే దారి తెలియదని
అసూయతో బతికితే మనశ్శాంతి దొరకదని
ప్రేమతో బతకడమే గొప్ప వరమని
గ్రహించాలోయి మాయను వీడాలోయి!

కర్మ సిద్ధాంతం
మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని
మంచి చేస్తే మంచే మన దరి చేరుతుందని
పాపపు పనుల వల్ల సుఖం రాదని
గ్రహించాలోయి మాయను వీడాలోయి!

మౌనం – ధ్యానం
మాటల హోరులో మన గొంతు వినపడదని
మౌనంలో వెతికితేనే పరమాత్మ కనిపిస్తాడని
వట్టి వాదనలు మాని నిశ్శబ్ద సత్యాన్ని
గ్రహించాలోయి మాయను వీడాలోయి!

(ఈ కవితా పంక్తులు మనలో చిన్న ఆలోచనను రేకెత్తించినా, ఈ కవిత రాసినందుకు సార్థకత లభించినట్లే. మాయను వీడదాం, పరమార్థాన్ని పొందుదాం. – రచయిత)

Exit mobile version