[వడలి రాధాకృష్ణ గారి ‘గ్రీన్ లైట్ ఏరియా’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
సీనియర్ రచయిత వడలి రాధాకృష్ణ గారి 9వ కథాసంపుటి ‘గ్రీన్ లైట్ ఏరియా’. పాలపిట్ట ప్రచురణల వారు ప్రచురించిన ఈ పుస్తకంలో 20 కథలున్నాయి.
“వడలి రాధాకృష్ణ కథలు మానవ సంబంధాల పట్ల వారికి గల నిష్కల్మషమైన భావనను వెల్లడి చేస్తాయి. కునారిల్లుతున్న కుటుంబ వ్యవస్థల పట్ల రచయిత పడుతున్న వేదనను తెలియజేస్తాయి” అని వ్యాఖ్యానించారు శ్రీ తిమ్మన శ్యామ్ సుందర్.
~
సముద్రంలో వేటకెళ్ళిన మొగుడు ముత్యాలప్ప కోసం ఎదురుచూస్తూ, తమ పెళ్ళికి ముందు జరిగిన సంఘటనలని గుర్తు చేసుకుంటుంది గురవమ్మ. సూపరాజుపల్లి సముద్రంలో దొరికే నల్లిజాతి చేపలని వేటాడడంలో మొనగాడని మధ్యవర్తి చెప్పి తమ పెళ్ళి జరిపించడం జ్ఞాపకం చేసుకుంటుంది. సముద్రంలో వేటకి వెళ్ళిన వాళ్ళంతా తిరిగొచ్చేసినా ముత్యాలప్ప మాత్రం రాడు. గత కొద్దిరోజులుగా, వేటకెళ్ళొచ్చాకా, మొగుడిలో వస్తున్న శారీరిక ఇబ్బందులను ఆమె గుర్తించింది. విపరీతమైన చలి, జ్వరంతో వణికిపొతాడు. డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే, సముద్రం లోపలికి వెళ్ళడం వల్ల, అక్కడి వాతావరణం మార్పుల వల్ల వచ్చే విష జ్వరం అని చెప్పి ఏవో మందులిస్తాడు. గురవమ్మని పక్కకి పిలిచి, సంసారానికి దూరంగా ఉండాలని చెప్తాడు. క్రితంసారి వేటకి వెళ్ళొచ్చాకా, విపరీతమైన చలితో వణికిపోయాడు ముత్యాలప్ప. వైద్యుడు చేసిన హెచ్చరికని విస్మరించి, శారీరికంగా దగ్గరై మొగుడికి చలిని, వణుకును తగ్గిస్తుంది. మొగుడిని రక్షించుకోవాలనుకునే ప్రయత్నంలో ఆ జబ్బుని తనకి అంటించుకుంటుంది గురవమ్మ. నల్లజాతి చేపలు చాలా పడ్డాయన్న ఉత్సాహంతో ఒడ్డుకు చేరిన ముత్యాలప్పకి, గురవమ్మ ఇక లేదనే వార్తని, తీరం మీదే అందిస్తుంది పక్కింటి జాలారమ్మ. ఏడుస్తూ ఇంటి వైపు పరిగెత్తుతున్న ముత్యాలప్పని మళ్ళీ చుట్టేస్తుంది చలిజ్వరం. ‘జాలువారు జీవితాలు’ కథ జాలరుల జీవితంలోని ఒక పార్శ్వాన్ని చూపుతుంది. ఏ మహిళ అయినా తన భర్త ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఎంతగా ప్రయత్నిస్తోందో చెప్తుంది. దాంపత్య ధర్మాన్ని ప్రదర్శిస్తుంది.
కరోనా కాలంలో అందరిలానే కునారిల్లిన ఓ ఆలయ పూజారి విషాదాన్ని ప్రదర్శిస్తుంది ‘నిశీధి నీడ’ కథ. కరోనా వల్ల కొన్ని నెలల పాటు గుడిలో పూజలు నిలిచిపోతాయి. పూజారి వరదాచార్యులు దాతలు ఇస్తున్న సరుకులు తీసుకోడానికి అహం అడ్డొస్తుంది. భారమంతా గుడిలోని అమ్మవారిపై వేసి ఊరుకుంటాడు. ‘ఈ సమయంలో అహం పనికిరాదు, వెళ్ళి క్యూలో నిలబడి సరుకులు తీసుకురమ్మ’ని భార్య ప్రమీల బ్రతిమాలుతుంది. అతను అంగీకరించడు. ఇద్దరూ ఆకలితో బాధపడుతూంటారు. ఓ రోజు గుడి తెరిచి అమ్మవారికి పూజ చేయడానికి కూడా ఓపిక లేని స్థితికి చేరుకుంటాడు. కానీ ఎలాగో ఓపిక తెచ్చుకుని పూజ చేసి రమ్మని, వచ్చాకా హార్లిక్స్ తాగవచ్చని, సరుకులు కూడా తెచ్చానని ప్రమీల చెప్తుంది. డబ్బెక్కడది అని అడగబోయి, ఆమె మెడలో ఉండాల్సిన బంగారు గొలుసు లేదని గ్రహించి నిట్టూరుస్తాడు. తను నమ్ముకున్న దేవత తనకేమీ చేయలేదనే భావన కలుగుతుంది. అప్పుడు వివేకం కోల్పోయి ఓ పని చేయబోతాడు. ప్రమీల హెచ్చరిస్తుంది. “నమ్ముకున్న వాళ్ళం..! నమ్మకం విశ్వాసం సడలిపోరాదు!” అంటూ భర్త తప్పుని సరిదిద్దుతుంది.
కరోనా కాలంలో జరిగిన శవదహనాలను వారాణాసిలో నిత్యం జరిగే శవదహనాలతో పోలుస్తుంది ‘ఇంతలేసి జీవితాలు’ కథ. కరోనా సోకి, ఇంటికి, కుటుంబ సభ్యులకి దూరంగా, శ్మశానం ప్రక్కగా ఉన్న అపరకర్మల శాలలో కాలం గడుపుతున్న యాదయ్యకి బ్రతుకు తాలూకు వైరుధ్యాలు అర్థమవుతాయి. తనతో పాటు ఉంటున్న వారు మృత్యువాత పడడం, బ్రతికి ఉన్న తనని చూడడానికి తనవాళ్ళెవరూ రాకపోవడం, కనీసం ఫోన్లో మిస్డ్ కాల్స్ అయినా లేకపోవడం అతన్ని బాధిస్తాయి. ఆశ్చర్యంగా అతను కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్తాడు. మరో ఐదేళ్ళు ఉద్యోగం చేసి, రిటైరవుతాడు. కొన్నాళ్ళకి ఎరియర్స్ రూపంలో రెండు లక్షల రూపాయలొస్తాయి. వాటిని, అప్పట్లో తనకి ఆశ్రయమిచ్చిన అపరకర్మల శాల వారికి విరాళంగా ఇచ్చేసి తృప్తిగా బయటకి వస్తాడు.
‘బ్రతుకు ఆవలి జీవితాలు’ కథ – మనిషిని అసూయ కమ్మేసినప్పుడు, ఎదుటి వ్యక్తిలోని సంస్కారం, మంచితనం కనబడనీయదని చెప్తుంది. సుగర్ ఫ్యాక్టరీలో సీజనల్ వర్కర్ అయిన కొమరయ్య, ఫ్యాక్టరీలో చక్కగా పనిచేసే కనిగిరి మిత్రులు. ఓ రోజు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో కనిగిరి చనిపోతాడు. యాజమాన్యం అతని కుటుంబానికి ఆర్థికంగా పరిహారం ఇచ్చి, ఎంబిఎ చదివిన అతడి కొడుకు మహేష్కి చదలవాడ ఆఫీసులో ఉద్యోగం ఇస్తుంది. ప్రతిభావంతుడైన మహేష్ ఉద్యోగంలో ఎదిగిపోతాడు. మహేష్ ఎదుగుదల, ఆఫ్ సీజన్ పేరిట తనకి ఉద్యోగం లేకపోవడం, చదువు వంటబట్టని కొడుకు బాధ్యత పట్టకుండా తిరగడం వంటివి కొమరయ్యకి అసూయ కలిగిస్తాడు. మహేష్ మీద అసహనం పెంచుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత తన పెళ్ళికి పిలవడానికి వచ్చిన మహేష్ ప్రవర్తన, మాటలు కొమరయ్యలోని అసూయని దహించివేస్తాయి.
కాలం కరుగుతున్న కొద్దీ మనిషిలోని వ్యాపార పోకడ, భక్తినీ, వివేచననీ ఎలా పక్కదారి పట్టిస్తాయో ‘నడిబొడ్డు నిజం’ కథ చెబుతుంది. మనుషుల నైజానికి ఈ కథ దర్పణం.
‘నూతిలోని తాబేలు’ చక్కని కథ. సున్నితమైన కథాంశంతో అల్లిన కథ. నైతికత కోల్పోయిన మనిషి తన ప్రవర్తనని ఎలా దిగజార్చుకుంటాడో, అది నచ్చని అతని ఆప్తులు ఎలా స్పందిస్తారో ఈ కథ చెబుతుంది. చంద్రమూర్తి గారింటి బావిలోని నక్షత్ర తాబేలుతో, ఆయన భార్య సరళని పోల్చడంలో రచయిత చక్కని నైపుణ్యం ప్రదర్శించారు. సంభాషణలు, సన్నివేశాలు ఈ కథకి గొప్పగా అమరాయి. కోర్టు ఇచ్చిన ఒకానొక తీర్పు సమాజంలో పెడధోరణులకి ఎలా కారణమైందో ఈ కథ తెలుపుతుంది.
ఆఫీసు పని మీద పేటపురం వచ్చిన కాశీకి అక్కడి మిత్రులు ఆ ఊరి ప్రత్యేకతని నూరిపోసి, అతన్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తారు. ఆ ఊరు వ్యభిచారులకు ప్రసిద్ధి. కాశీ ఆ ఊరికొచ్చి 15 రోజులవుతున్నా ఇంకా వేశ్యల వద్దకు వెళ్ళకపోవడాన్ని చేతకానితనంలా ప్రకటిస్తారు. చివరికి వారి ప్రలోభానికి లొంగిపోయి, ఊర్లో బాగా పేరున్న హంసలక్ష్మి అనే ఓ వేశ్య దగ్గరకి వెళ్తాడు. ఆమె దగ్గర అతనికో విచిత్ర అనుభవం ఎదురవుతుంది. పేటపురం వ్యభిచారుల గురించి కొత్త నిజాలు తెలుస్తాయి. హంసలక్ష్మి కంపెనీలోని వాళ్ళు పడుపువృత్తి మానేసి, ఇతరత్రా పనులు చేసుకుంటూ గౌరవంగా బ్రతుకుతున్నారని చెప్తుందామె. అతనిలో అట్టడుగుకి జారిన వివేకాన్ని తట్టి లేపి, పైకి తెస్తుంది ‘గ్రీన్ లైట్ ఏరియా’ కథలో. గజమూర్తి లాంటి ధూర్తులున్న సమాజంలోనే ఆదిలక్ష్మి లాంటి వారూ ఉంటారన్న చక్కని నిజాన్ని చాటుతుందీ కథ. మనం ఎవరి వైపు ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి.
చక్కగా మాట్లాడి, తనని ఏమార్చి, తన కుటుంబం పట్ల తనకి లేని ఆలోచనలు కల్గించి, ఆర్థిక లాభం పొందాలని చూసిన అన్న ఆలోచనని పసిగట్టిన రూపవతి చివరికో నిర్ణయం తీసుకుంటుంది ‘మట్టి ప్రమిద దీపాలు’ కథలో. దాంతో ఆమె లోని అలజడి ఉపశమిస్తుంది.
జీవితంలో బాగా ఎదిగిపోయిన మర్రి మహేష్ ఓ మధ్య తరగతి కుర్రాడు చాలా ఏళ్ళ తరువాత స్వగ్రామానికి ఇంటికి వస్తాడు. కుటుంబ సభ్యులంతా బాగా ఆదరిస్తారు. ఆప్యాయంగా మాట్లాడుతారు. కానీ మహేష్లో ఎక్కడో చిన్న అసంతృప్తి. తనవాళ్ళు, మిత్రులు.. తనని మనస్ఫూర్తిగా ఆదరించలేదన్న అనుమానం కలుగుతుంది. తనని ఆ ఇంటి మనిషిలా కాకుండా, ఓ సంపన్నుడిలా చూస్తూ గౌరవంగా వ్యవహరించడం అతనికి నచ్చదు. తాను కోల్పోయిన అత్మీయతాస్పర్శ అతనికి తెలుస్తుంది. నగరానికి బయల్దేరేముందు తల్లి చేసిన ఓ పని అతనిలోని నైరాశ్యాన్ని తొలగిస్తుంది. ‘నిదురించని తోట’ కథ ఆసక్తిగా సాగుతుంది.
అపరకర్మలలో తిలదానాలు తీసుకునే శివతీర్థని ఆ ఊర్లో పిండాల పంతులని పిలుస్తారు. అల్లరి కుర్రకారు శవతీర్థ అని అంటారు. వృద్ధాప్యంతో నిస్సహాయుడైన శివతీర్థ జీవితాన్ని కళ్ళకు కడుతుంది ‘విధ్వంస ధ్వని’ కథ. అగ్రవర్ణాల లోనే అంటరాని కాకుల వంటి వాళ్ళు తనలాంటి వాళ్ళు అనుకుంటాడు. అతని మానసిక వేదనకి, సమాజం తీరుకి ఈ కథ అద్దం పడుతుంది.
‘సముద్రానికి తెలుసు’ కథని, సముద్ర తీరంలో స్థిరపడిపోయి, అక్కడి జాలరుల జీవితాలను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వారే వ్రాయగలరు. సముద్రానికి ఏం తెలుసు? ఎంత తెలుసు అన్నది ఎవరికి వారు చదువుకోవాల్సిందే. ఈ సంపుటిలో సముద్రం గురించి ఉన్న కథలలో చక్కని కథ.
‘నల్ల నందివర్ధనం’, ‘తెల్ల చీకటి’ కథలు ఆసక్తిగా సాగుతాయి. వస్తువు స్వభావానికి విరుద్ధమైన లక్షణాలను శీర్షికకి జోడించిన ఈ కథల గురించి నేనేమీ చెప్పను. సంచికకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రచయిత ఈ కథల గురించి చెప్పిన విషయాలు చదవండి. ఆ కథల నేపథ్యం తెలుస్తుంది.
ఒకప్పుడు ఎందరి దాహార్తినో తీర్చిన తమ బావి నీటిని తోడుకోడానికి ఇప్పుడు ఎవరూ ముందుకు రాకపోవడం బావారావుని బాధిస్తుంది. అందుకు కారణమేమిటో అతనికి తెలుసు. వ్యక్తిగత సమస్యలు అతని కూతురుని బలి తీసుకోగా, జనాలు ఆ బావి నీటిని ఉపయోగించడం మానేస్తారు. ఊర్లోకి మంచి నీళ్ళ ట్యాంకుల రాక మొదలవుతుంది. ఆ బావిని, దాని చుట్టూ ఉన్న ప్రకృతినీ, పక్షులని కాపాడుకోవాలనే సంకల్పంతో ఉన్న బావారావుకి ఓ చక్కని ఆలోచన వస్తుంది. దాన్ని అమలు చేయపూనుకుంటాడు. ‘నీటి నిజం’ కథ సమాజాన్ని యథాతథంగా ప్రతిబింబిస్తుంది.
‘రాతిచిగుళ్ళు’, ‘చీకటి చిక్కబడింది’, ‘మార్గం మలుపు తిరిగింది’ కథలు సమాజపు చీకటి కోణాలని వ్యాఖ్యానిస్తాయి. అంతటి నిశీధి లోనూ, కాస్తంత వెలుగురేఖని ప్రదర్శించిన వారిని చూపుతాయి.
~
“ప్రపంచాన్ని, మనుషులనీ సానుకూలంగా అర్థం చేసుకోవాలన్న ఆలోచనలని ప్రోది చేస్తాయి ఈ కథలు. పరిస్థితుల ప్రాబల్యం కారణంగా తల్లడిల్లే మనుషుల పట్ల కాసింత దయ చూపాలన్న దృష్టిని ప్రసాదిస్తాయి” అన్న గుడిపాటి గారి మాటలతో పాఠకులు ఏకీభవిస్తారు ఈ పుస్తకం చదివాక.
***
రచన: వడలి రాధాకృష్ణ
ప్రచురణ: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
పేజీలు: 176
వెల: ₹ 200/-
ప్రతులకు:
పాలపిట్ట బుక్స్, హైదరాబాద్
ఫోన్: 9848787284
~
గోనెల్ల శేష వరలక్ష్మి
1-75, శ్రీనిలయం,
ప్రసాద్ నగర్,
విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ దగ్గర,
ఓడరేవు రోడ్, పేరాల పోస్ట్
చీరాల 522004
బాపట్ల జిల్లా. ఆంధ్రప్రదేశ్
ఫోన్: 9985336444
~
వడలి రాధాకృష్ణ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-vadali-radhakrishna/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
