[వజ్జీరు ప్రదీప్ గారి ‘గ్రీటింగ్స్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
సిటీలో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. నేను గదిలో ఒంటరిగా ఓ పుస్తకంలో పుస్తకంలాగా, వస్తువులో వస్తువులాగానో చలనం లేని వాడిలా నిశ్శబ్దంగా ఉన్నాను.
నాతో మాట్లాడేవారే లేరు, నేను ఒంటరిని. నిన్న మొన్నటి వరకు నాతో తిరిగిన నేస్తాలు చాలా మంది ఈ లోకం విడిచి వెళ్ళారు.
ఊరు దాటి వచ్చాకా పక్కనున్న ఊరిలో పరిచయమైన వాళ్ళు కాలక్రమేన పెళ్ళిళ్ళు చేసుకుని కొత్త జీవితంలో, కొత్త దారులు వెతుకుంటూ వెళ్ళారు. ఇక్కడా నేను మళ్ళీ ఒంటరినైనాను.
డిసెంబర్ 31 మళ్ళీ జీవితంలో రానట్టు ఒకరి కొకరు ఫోన్ చేసుకోవడం, మందు, బిర్యాని, చికెన్ అంటా, అదేంటో తాగేవాడికి ప్రతి రోజు థర్టీ ఫస్టే గదా, ఈ రోజు స్పెషల్. ఇది మరో సాకు వాడికి.
నాకు కనీసం హ్యాపీ న్యూయర్ చెప్పేవాళ్ళు లేక ఎన్నేళ్ళైందో. ఈ జీవితానికి ఓ ప్రేమ పంచేవాళ్ళు లేరు, కనీసం మనసులో భావాలను పంచుకోడానికి కూడా ఓ మనిషి తోడు లేకపోవడం ఎంత దురదుష్టకరం చెప్పండి.
జీవితంలో ప్రతీ పండుగ వచ్చినప్పుడల్లా నా కండ్లలో నీళ్ళు ఊరడమే తప్ప ఎప్పుడు సంతోషం చూసి ఎరగను. రాఖీ పండుగకు వచ్చే చెల్లిని దేవుడు ఎత్తుకెళ్ళి మోసం చేశాడు, ఆ తరువాత తమ్ముడు, నాన్న ఒకరెనుకా ఒకరు ఈ లోకంలోని మనుషులకు దూరంగా ఈ భూదేవి ఒడిలో కలిసి పోయారు,
ఉగాది, సంక్రాంతి, దసరా, అన్ని పండుగలే. నాకు మాత్రం అవి వేరేలా అనిపించేవి. పచ్చనోట్లతో దూరమైన బంధాల లాగానే అవి కూడా మెల్లగా నాకందనంత దూరం చేసిన దేవుడు కనిపిస్తే నిలదీయాలని ఎన్నిసార్లు అనుకున్నానో.
దూరంగా రోడ్లపై అరుపులు కేకలు బాణాసంచాల చప్పుడు.
అదే మా చిన్నప్పుడు..
***
“అమ్మా! నాన్నకు చెప్పవే గ్రీటీంగ్స్ కొనీయ్యమని” బతిమిలాడుతున్నారు తమ్ముడు, చెల్లి.
“డబ్బుల్లేవ్ బిడ్డా! ఈ సారికి ఎట్లనో సర్దుకోండి” అమ్మ బుజ్జగిస్తూ అంది.
“తెలుసు కాని మా ఫ్రెండ్స్ వేరేలా అనుకుంటారమ్మా. ఇప్పటికే నువ్ పిసినారివి అంటూ ఎగతాళి చేస్తుంటారు” బుంగ మూతి పెట్టి అంది చెల్లి.
“మన పరిస్థితులు మనకు తెలుసు. వాళ్ళకు తెలియవు కదా బిడ్డా!” అమ్మ సర్ది చెబుతుంది.
“అమ్మా! ప్లీజ్”
“న్యూ ఇయర్ అంటున్నారు గద పిల్లలు, ఆ సెల్ఫ్ డబ్బాలో వున్న డబ్బులు తీసి ఇవ్వు శోభా.”
“ఆ డబ్బులు పక్కకు ఎందుకు పెట్టామో గుర్తుందా మీకు” కోపంగా అంది అమ్మ.
“పక్కింటి శ్యామలక్క న్యూ ఇయర్ ముగ్గేసింది వాకిట్లో. చెల్లెతో పాటు నువ్వు రంగులు వేయండి. నేను రఘును పంపి గ్రీటింగ్ కార్డ్స్ తెప్పిస్తాను. సరేనా” నాన్న మెల్లగా అన్నాడు.
నేను చాక్ పీస్తో హ్యాపీ న్యూ ఇయర్ అని ఆర్ట్ వేశాక అందులో రంగులు నింపారు చెల్లీ, తమ్ముడు. దానికి అటూ ఇటూ పురి విప్పిన నెమళ్ళు పైన ఒకటి కింద ఒకటి ముగ్గు వేసింది చెల్లి, రంగులన్ని నింపాక ఊరంత ఎవరెవరు ఏమేం వేశారో చూసి వచ్చాం.
“ఊరందరిలో మనదే బాగుంది గద అన్నయ్య” అంది చెల్లి.
“నిజమే రా! ఫ్రైజ్ ఇస్తే మనకే వచ్చేది” నవ్వుతూ అన్నాను.
“సంక్రాంతి వుందిగా అన్నయ్యా, అప్పుడు ట్రై చేద్దాం. ఫ్రైజ్ మిస్ కాకుండా చూసుకుందాం” గంతులేస్తూ అంది.
“నువ్వంటే ఫ్రైజ్ మనదే చెల్లి, పదా మనకు నాన్న గ్రీటింగ్స్ తెప్పిచ్చిండేమో!” అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళే సరికి ఏదో గొడవ జరుగుతుంది.
రామలింగం గతంలో పెట్టుబడికి అప్పు ఇచ్చిండటా, ఇప్పుడు కట్టమని గొడవ, ఇంట్లో పదిమంది పెద్ద మనుషులు కూర్చున్నారు. అమ్మ, నాన్న ఓ మూలన భయంతో మౌనంగా కూర్చున్నారు.
“పంట చేతికి వచ్చాక కడుతాం” అని నాన్న,
“లేదు అప్పు ఇప్పుడు కట్టాల్సిందే” అని అతను.
“నేను ఓ పని చెబుతాను చేయిండ్రి” అప్పు ఇప్పిచ్చినాయన మెల్లగా అన్నాడు.
వాడు అసలే కుట్ర బాజి. ఏం చెబుతాడో అని అమ్మ నాన్న బిక్కు బిక్కు మని ఓ మూలన కూర్చుండి చూస్తున్నారు.
“మోతు గుడ్డం భూమి అమ్మండి” మెల్లగా వాడి మోసపు కుట్రను బయట వేశాడు.
“భూమి అమ్మడం – మనిషి చావడం రెండు ఒకటే” నాన్న కండ్ల నీళ్ళు తీసుకుంటూ అన్నాడు.
“అయినా పంట మీద భూమి ఎవరు కొంటరు?” అమ్మ అంది.
“నేను అమ్మిస్తాను. ఇదిగో వీడు మా తమ్ముడు వానికి భూమి లేదు. డబ్బులు ఇప్పిస్తాను పంట అయిపోయకా కొలత పెట్టుకుందాం” అప్పు ఇప్పిచ్చినాయనా అన్నాడు.
“భూమి అమ్మడం నాకు ఇష్టం లేదు” నాన్న గట్టిగా మంకు పట్టుబట్టిండు.
అప్పు ఇప్పించినాయన నాయనమ్మ తాతయ్యతో మాట్లాడి ఒప్పించిండు.
నాన్న ససేమిరా ఒప్పుకోలేదు.
“అప్పు నేను ఇప్పిచ్చాను. నువ్ గట్టనంటే నేను గట్టాల్నా” ఆవేశంగా అన్నాడు.
“ముందు నా అప్పు తీర్చండి. లేకుంటే నేను ఇక్కడ నుండి పోనే పోను” అంటూ మంచంలో నుండి లేచి కింద కూర్చున్నాడు రామలింగం.
నాన్న ఉరి వేసుకుని చస్తానని పగ్గం బట్టుకుని పెద్దమ్మ తల్లి గుడిదిక్కున్న బంజరు భూమి వైపు వెళ్ళాడు.
అమ్మ బోరుమని ఏడుస్తుంది. నాయనమ్మ తాతయ్య చెరో వైపు నుండి నాన్నను ఆపడానికి వెళ్ళారు.
రైతు పంట పండించాలంటే ఇన్ని కష్టాలుంటాయా? అప్పు అంటే ముప్పనే వీళ్ళు అప్పు ఎలా తెచ్చారో నాకు అర్థం అయ్యేది కాదు.
“నువ్ చెల్లెను తమ్ముడిని తీసుకుని స్కూల్‌కు వెళ్ళు. ఇక్కడ ఏమైనా మేం చూసుకుంటాం” అని అన్నం పెట్టి టిఫిన్ బాక్సులు ఇచ్చింది అత్తయ్య.
“మేం స్కూల్‌కు వెళ్ళనే వెళ్ళం, నాన్న వచ్చాక వెళ్తాం” ఏడుస్తూ అన్నాం.
“వద్దు రా. చెల్లె, తమ్ముడు భయపడుతాండ్లు. అక్కడన్న నెమ్మదిగా కూర్చుంటారు” అంది అత్త.
‘నిజమే కదా అత్తంది. ఇక్కడుంటే చెల్లె, తమ్ముడు భయపడతాండ్లు. స్కూల్లో అయినా అన్ని మర్చిపోయి కూర్చుంటారు’ మనసులో అనుకుంటూ బాధగానే సైకిల్ పై వాళ్ళను కూర్చుండబెట్టుకుని భయలుదేరాను.
స్కూల్లో అందరు ఒకరి కొకరు స్వీట్స్ తినిపించుకుంటూ గ్రీటింగ్స్ ఇచ్చుకుంటున్నారు. చెల్లి తమ్ముడు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని నావైపు చుశారు.
నేను చాలా సేపు ఆలోచించాను. అందరిలానే చెల్లి, తమ్ముడు మొఖాలల్లో సంతోషం చూడాలి అనుకున్నాను.
బ్యాగులోని తెలుగు బుక్ అట్టలోపల దాచుకున్న డబ్బులు వెతికాను, అందులో ఎప్పుడో నాన్న నోట్ బుక్ కొనుక్కోడానికి ఇచ్చినవి అలానే దాచుకున్నాను, ఇవి ఇప్పుడు వారి సంతోషానికి ఉపయోగపడుతున్నాయి.
సైకిల్ తీసుకుని దగ్గరలో వున్న పోస్ట్ ఆఫీస్‌కు వెళ్ళి కొన్ని పోస్ట్ కార్డ్స్ తీసుకుని మళ్ళీ స్కూల్ కు తిరిగి వచ్చాను, చెల్లికి తమ్ముడికి విషయం చెప్పి క్లాస్ లకు పంపాను.
ఫస్ట్ పిరియేడ్ అయ్యేలోపు నేను స్కెచ్‌తో రకరకాల రూపాలలో హ్యపీ న్యూ ఇయర్ అని రాసి చిన్న లోగో గీసి ‘సేవ్ అగ్రికల్చర్ – సేవ్ ఫార్మర్’ అని రాసి ఫ్లవర్స్, డిజన్స్తో కూడిన ఫార్మర్ బొమ్మలను గీసి వాళ్ళ చేతికిచ్చాను, కొన్ని సర్ప్రైజ్గా అడ్రస్ రాసి పోస్టుబాక్స్ లో వేశాను.
మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు చెల్లి, తమ్ముడు ఆ కార్డ్స్ పంచి వారికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గ్రీటింగ్ కార్డులను నాకు చూపించారు. కాని నా మనసులో ఇంటి వద్ద ఏం జరుగుతుందోనన్న ఆందోళన తొలుస్తునే వుంది.
“బాబు శివా, నిన్ను ప్రిన్సిపాల్ మేడం రమ్మంటుంది” అటెండర్ వచ్చి చెప్పగానే నేను టీచర్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాను.
“హ్యపీ న్యూ ఇయర్ శివా” ప్రిన్సిపల్ మేడం షేక్ హాండ్ ఇస్తూ చెప్పింది.
ప్రిన్సిపల్ మేడం ఏంటి నన్ను పర్సనల్‌గా పిలుచుకుని హాపీ న్యూ ఇయర్ చెప్పడం ఏంటి? నాకే కాదు అక్కడ ఆఫీస్ రూంలో కూర్చున్న ఏ టీచర్‌కు అర్థం కాలేదు గాని అందరి మొఖాలలో ఓ చిరునవ్వైతే కనిపిస్తుంది.
“సేమ్ టూ యు మేడమ్” అన్నాను ఆశ్చర్యంగా.
ప్రిన్సిపల్ స్టాఫ్ అందరిని పిలవడంతో ఒక్కొక్కరు వచ్చారు. అందరు కూర్చున్నాకా నేను గీసిన గ్రీటింగ్స్‌ని వాళ్ళ ముందు పెట్టింది.
“అవి చేతితో గీసినట్టుగా లేవు, అచ్చం ప్రింట్ చేసినట్టే వుంది మేడం” అన్నారు.
“అంతేనా? మీరు గమనించింది” ప్రిన్సిపాల్ అనడంతో అందరు మేడం వైపు చూశారు.
ఎవరు చప్పుడు చేయకపోవడంతో ఒక్కో గ్రీటింగ్లో ఓ ప్రత్యేకతను విడమరిచి చూపించింది ప్రిన్సిపాల్.
“నిజమే! ఓ చోట పూలసాగు, మరో చోట మిర్చి, వరి, పత్తి రకరకాల పంటలతో వ్యవసాయం చేసే రైతు, చివరకు పంట అమ్మితే మిగిలే పరిస్థితులను ఈ పెయింటింగ్స్‌లో మనకు కంఢ్లకు కట్టినట్టు కనిపించేలా వేశాడు” ప్రిన్సిపాల్ విడమరిచి చెబుతుంటే మిగతా స్టాఫ్ కళ్ళప్పగించి చూస్తున్నారు.
“సేవ్ ఫార్మర్ – సేవ్ అగ్రికల్చర్ ప్రతీ పేయింటింగ్ క్రింద నువ్వు రాసిన ఈ ట్యాగ్‌లైన్ చాలా బాగుంది శివా” ఆర్ట్ టీచర్ గుర్తించి అభినందించాడు.
“వ్యవసాయం చేసే రైతులకు ఎన్ని కష్టాలుంటాయో కదా. ఓ వైపు అతి వృష్టి – మరో వైపు అనావృష్టి, బ్యాంకు ఋణాలు, చివరకు పంట చేతికి వస్తుందో రాదో” సైన్స్ టీచర్ చెబుతూనే తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఏడ్చింది.
“మేడం! ప్లీజ్” ఆమె భుజంపై చేయి వేసి ఓదార్చింది ప్రిన్సిపల్.
“మన సైన్స్ టీచర్ అనిత వాళ్ళ నాన్న రైతు, వ్యవసాయాన్ని ప్రేమించాడు, నలుగురికి అన్నం పెట్టాలన్న ఆకాంక్షే తప్ప తన గురించి తానేప్పుడు ఆలోచించుకోలేదు, బతికినంత కాలం రైతుగానే బతకాలనుకున్నాడు. ముగ్గురు పిల్లలను చదివిస్తూనే అనేక కష్టాలకు ఓర్చుకుని చివరకు తనువు చాలించాడు, రైతు ఎప్పుడు రాజే” ప్రిన్సిపాల్ చెబుతుంటే అందరు సుదీర్ఘమైన ఆలోచనలో పడ్డారు.
‘ఇంటి వద్ద అమ్మ నాన్న పరిస్థితి ఎలా వుందో? నాన్న ఇంటికి వచ్చాడో రాలేదో? అప్పు ఇప్పిచ్చినాయనా, ఇచ్చిన రామలింగం ఇద్దరు కూడబల్కుని వడ్డీకి వడ్డీని అసలు కాగితాలు మారుస్తూ వచ్చారు, గట్టిగా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరైనా అంటే తప్పు మనదే అంటారు’ మనసులోనే గుర్తు చేసుకుంటుంటే కండ్లనీళ్ళు ఆగలేదు.
“శివా ఏం ఆలోచిస్తున్నావ్?” సదానందం సార్ భుజం తట్టాడు.
నేను కండ్ల నీళ్ళు తుడుచుకుని “ఏం లేదు సర్” అన్నాను.
“శివ జనవరి 26 రోజున రైతు గురించి పిల్లలకే కాదు, పెద్దలు అందరికి అర్థమయ్యేలా నీతో ఓ ఫోగ్రాం చేయించాలి అనుకుంటున్నాను, నువ్ మంచి స్కిట్ రాస్తావో, పెయింట్స్ వేస్తావో నీ ఇష్టం. వ్యవసాయం అంటే ఏంటో చిన్నలకి, పెద్దలకు క్లియర్‌గా అర్థమయ్యేలా చేయాలి” ప్రిన్సిపాల్ అనౌన్స్ చేసింది.
“ఈ దేశానికి అన్నం పెట్టే రైతు గురించి ప్రత్యేక ప్రోగ్రాం పెడతామంటే మేమందరం సహకరిస్తాం. ఓ వైపు అంతరిస్తున్న వ్యవసాయంను రక్షించడానికి భవిష్యత్ తరం రైతులను తయారుచేయడానికి మనం కృషి చేద్దాం” ఉపాధ్యాయులు అందరు మూకుమ్మడిగా అన్నారు.
“సేవ్ అగ్రికల్చర్ – సేవ్ ఫార్మర్. నీ ఈ నినాధం ఇక్కడే ఆగకూడదు. మనందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. మన స్కూల్‌కు సంబంధించిన పక్క ల్యాండ్‌లో చిన్న చిన్న పంటలు వేసి రోజూ ప్రతీ అరగంట వారికి అక్కడే ప్రాక్టికల్‌గా తెలియజేయడం ద్వారా రేపటి తరానికి మనం గొప్ప రైతులను ఇవ్వచ్చు గదా” అన్నారు ప్రిన్సిపాల్.
స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి నాయనమ్మ ఎదురచ్చి “పోస్ట్‌మాన్ వెంకట్ నీకేవో లెటర్స్ వచ్చాయని ఇచ్చి వెళ్ళాడు రా” అంటూ తనబ్బీలో దాచినవి తీసి ఇచ్చింది.
మొదట నాయనమ్మ మొఖం చుశాను, తన మొఖం బాదగానే వుంది. ‘అంటే ఇంట్లో అప్పు ఇప్పించినోడు రగిలించిన కుంపటి ఇంకా మండుతూనే వుందన్న మాట’ మనసులో అనుకుంటూ తను ఇచ్చిన కార్డ్స్ తీసుకున్నాను.
నేను వాటిని ప్రేమగా పట్టుకుని చూశాను, ఊరిలో అందరికి న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్సు వచ్చేవి మా ఇంటికే ఎందుకురావు? ఆ ఆలోచన ఎప్పుడు నన్ను వెంటాడేది, పోస్ట్‌మాన్ మా ఇల్లుదాటి పక్కిండ్లకు వెళ్ళినప్పుడల్లా మనసు తల్లడిల్లేది, అందుకే ఈ సారి మా అడ్రస్‌తో నేనే గ్రీటింగ్స్ వేసుకున్నాను సరదాగా. ‘ఆ గ్రీటింగ్సే ఇవి అన్నమాట’ మనసులో దాచుకుని పలానా వాళ్ళు పంపారని అమ్మతో అబద్ధం చెప్పాను.
“అది నిజమైతే బావుండు రా” అంది అమ్మ.
“అమ్మా?” అన్నాను.
“నీ పెయింటింగ్స్ నాకు తెలియవా? నువ్ గీసిన ఈ బొమ్మలలో మనిషి బతకడానికి సరిపడ ధైర్యమిచ్చే మెసేజ్ వున్నది చూడు అది కదా మనిషికి నిజమైన అవసరం, కాస్త వెనుకపడితే పిక్క తినే రాబంధువులు ఉన్న ఈ లోకంలో మన పర లేకుండా అందరు బతకాలి, అందులో నేనుండాలి ఆ సందేశం ప్రపంచానికి అందించేవాడే మనిషి. చక్కగా గీశావు నాయనా” నన్ను దగ్గరకు తీసుకుని అంది అమ్మ.
“హ్యపీ న్యూ ఇయర్ రా” ముగ్గురిని దగ్గరకు తీసుకుని అంది అమ్మ.
“సేమ్ టూ యు అమ్మా” ముగ్గురం అమ్మను పట్టుకుని అన్నాం.
“నాన్న ఎక్కడ అమ్మా?” ఆందోళన పడుతూనే అన్నాను.
“అదిగో వస్తున్నాడు” అంది బాధను దాచుకుంటూ అమ్మ.
కొట్టంలో ఎడ్లకు మేత వేసి గోలెంలో చేయ్ కడుకుని ఇంట్లోకి వస్తూనే “హ్యాపీ న్యూ ఇయర్ రా పిల్లలు” అన్నాడు.
“హ్యాపీ న్యూ ఇయర్ నాన్న” షేక్ హాండ్ ఇస్తూ అన్నాం.
“మార్నింగ్ జరిగిన విషయాలేవి మనసులో పెట్టుకోకుండా చక్కగా చదువుకోండి. అలాంటివన్నీ మన రైతు కుటుంబాలలో సర్వసాధరణం, నా ఒంట్లో ప్రాణం వున్న వరకు మీ జీవితాన్ని తీర్చిదిద్దడమే నా ధ్యేయం” నాన్న కండ్ల నీళ్ళు దాచుకుంటూనే గర్వంగా అన్నాడు నా చేయి పట్టుకుని.
నాకైతే గొప్ప గొప్ప వాళ్ళ చేయి తగిలితే ఎలా వుంటుందో ఎందుకో ఇప్పుడు నాన్న చేయి స్పర్శ అంతకు వేయిరెట్లు ఎక్కువే అనిపించింది, నేను నా అరచేయిని ప్రేమగా చూసుకుంటూ గదిలోకి వెళ్ళాను.
‘రైతు అంటే ఈ దేశానికి అన్నం పెట్టేవాడు. అందుకే సేవ్ అగ్రికల్చర్ – సేవ్ ఫార్మర్ ఈ నినాధం ఆగిపోకూడదు’ మనసులో అనుకుంటూ ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందో నాయనమ్మను అడిగాను.
“అప్పు ఇప్పించినోడు భూమి బేరం పెట్టించాడు వాడి తమ్ముడు ఇచ్చిన డబ్బులతో రామలింగం అప్పు తీర్చారు” నాయనమ్మ అంటుంటే నాకు కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయింది, నేను బిగ్గరగా ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తూ కింద కూలబడ్డాను.
“భూమి అమ్మడం – ప్రాణం పోవడం ఒక్కటే” అన్న నాన్న మాట చెవులలో మారుమోగుతుంది.
‘ఎంత కష్టం వచ్చిన వారి మొఖాలలో కనిపించకుండా మమ్మల్ని కడుపులో పెట్టుకుని ప్రేమగా మాకు భవిష్యత్తును మాత్రమే అందించాలని లేని నవ్వుని పులుముకుని జీవిస్తున్న వాళ్ళకు మేం ఏం ఇచ్చి ఋణం తీర్చుకోవాలి’ అనుకుంటుంటే జేబులోని గ్రీటింగ్ కార్డ్స్ కింద పడ్డాయి.
హ్యాపీ న్యూ ఇయర్ దాని కింద నేను రాసిన ట్యాగ్ ‘సేవ్ ఫార్మర్ – సేవ్ అగ్రికల్చర్’ రంగు రంగులతో వేసిన రైతు బతుకు చిత్రం కనిపిస్తుంది.
***
బయట మంచు పొరలను చీల్చుకుంటూ ఆకాశంలో మెరుపులు టపాకాయల మోతలు మెర్కురీ లైట్ల వెలుతురు నా జేబులో ఫోన్ మోగడంతో నేను గతంలో నుండి వర్తమానంలోకి వచ్చాను.
“హ్యాపీ న్యూ ఇయర్” అంది ఓ ఆడగొంతు.
నాకు తెలియకుండానే మస్తిష్కం మందగించింది, “హ్యాపీ న్యూ ఇయర్” అన్నాను నేను, ఈ భూమి మీద నా కోసం కూడా ఓ మనిషిని దేవుడు పుట్టించాడని అప్పుడనిపించింది,
మనసు పొరల్లో దాగిన దుఃఖం ఒక్కసారిగా ఆవిరైపోయి నా పెదవులపై చిన్న చిరునవ్వు కొత్త రెక్కల ఆశలతో విరిసింది.
