Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుడి చేసే మేలు

[బాలబాలికల కోసం ‘గుడి చేసే మేలు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

ఒక రోజు రవి వాళ్ళ నాన్నతో కలసి పుస్తకాల షాపుకి వెళుతున్నాడు. ఆ రోడ్డు పక్కనే పెద్ద ప్రాంగణంతో గణపతి గుడి ఉంది అక్కడ చాలా మంది భక్తులు గుంజిళ్ళు తీస్తూ, నడుస్తూ కనబడ్డారు. వారిని చూసి రవి కొంత ఆశ్చర్యపోయాడు. రవి మెదడులో కొన్ని ప్రశ్నలు ఉదయించాయి. “అసలు వీళ్ళందరూ ఎందుకు గుంజిళ్ళు తీస్తున్నారు? ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు? దాని వలన లాభం ఏమిటి?” వంటి ప్రశ్నలు.

పుస్తకాలు కొన్నాక ఈ ప్రశ్నలనే రవి వాళ్ళ నాన్నను అడిగాడు.

రవిని తీసుకుని గుడిలోకి వెళ్ళాడు ఆయన. గుడిలో ప్రశాంతంగా ఒక మంటపంలో కూర్చుని తిరిగే జనాలను, గుడిలో మ్రోగే గంటల శబ్దాలను వినమని చెప్పాడు. గుడిలోంచి వచ్చే మంచి కర్పూరం వాసన ఆ పక్కనే ఉన్న రంగుల పూలచెట్లను చూడమని, గుడి ముందున్న ఎత్తైన ధ్వజస్తంభం చూడమన్నాడు.

అవన్నీ చూసాక, “చూసాను నాన్నా, వీటి వలన లాభం ఏమిటి?” అడిగాడు రవి.

రవి నాన్న చిరునవ్వుతో ఈ విధంగా చెప్పాడు.

“చూడు రవీ మన పూర్వీకులు అనేక మంచి పనులు చేయడానికి మనకు అనేక మార్గాలు చూపారు. అందులో గుడి ఒకటి. గుడికొస్తే కొందరు లేక వయసులో పెద్దవారు ప్రదక్షిణలు చేస్తారు, అది గుండెకు మంచిది. గుడిలో తీర్థం ఇస్తారు తెలుసు కదా, అందులో ఏలకులు, లవంగం, జాపత్రి, పచ్చ కర్పూరం, తులసి వేసి ఇస్తారు. అందుకే ఈ తీర్థం ఔషద గుణాలు కలిగి ఆరోగ్యానిచ్చి మేలు చేస్తుంది. గుంజిళ్ళు తీస్తే మన మెదడు అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ మధ్య పాశ్చాత్య దేశాలలో కూడా గుంజిళ్ళు అలవాటు చేస్తున్నారు. ఆ ధ్వజస్తంభం చూడు, అది ఎత్తుగా ఉండి ఊరుని కాపాడుతుంది. బెంజిమన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త పిడుగులు పడితే ఎత్తుగా బిల్డింగ్ లపై లోహ రాడ్డును పెట్టి దానికి ఓ గట్టి రాగి వైరుతో భూమిలోకి కలిపితే పిడుగు పడదని చెప్పాడు. కానీ మన పూర్వీకులు ఈ ద్వజస్తంభం పెట్టి మనల్ని పిడుగుల నుండి రక్షించే ఏర్పాటు ఎప్పుడో చేసారు. గంటల శబ్దం ఒక విధమైన మనఃశాంతిని ఇస్తుంది. ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతుంటాడు. గుడిలో ఇన్ని శాస్త్రీయమైన అంశాలు ఉన్నాయి. ఇప్పడు తెలిసిందా గుడికి జనాలు ఎందుకు వస్తారో” రవిని ఆయన అడిగారు.

“తెలిసింది నాన్నా భక్తి, గుడి ఇంతమేలు చేస్తాయని తెలుసు కున్నాను” అన్నాడు.

ఇద్దరూ ఆనందంగా గుడిలోకి వెళ్ళి తీర్థం తీసుకుని మెల్లగా ఇంటికి వెళ్ళారు.

Exit mobile version