Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-16

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

 

[కాల గమనంలో మరో ఐదేళ్ళు గడిచిపోతాయి. జగన్నాథరావు గారు కూడా స్వర్గస్థులయ్యారు. మురళి గరివిడిలో ఉద్యోగం మానేసి, తుని దగ్గర తాండవ షుగర్ ఫ్యాక్టరీలో ఇంజనీరుగా చేరుతాడు. పిత్రార్జితంగా వచ్చిన పాత ఇల్లుని తొలగించి కొత్త ఇంటి నిర్మాణం చేయాలనుకుంటాడు. బావ శ్యామల రావుని కలుపుకుని, దాని పక్క ఇంటిని కూడా కొని, రెండిటిని తీసేసి వాటి స్థానంలో విశాలమైన ఇల్లు కడతాడు. అందులో చెల్లెలి పిల్లలకి వాటా ఇస్తాడు మురళి. సాహితి బీకాం పూర్తి చేసి బ్యాంకు పరీక్షలకు కోచింగ్ తీసుకుంటుంది. సాత్విక్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంటాడు. బిఎస్ఆర్‌బి ప్రకటన వస్తుంది. సాహితి అప్లయి చేసి ఎగ్జామ్‍కి హాజరవుతుంది. రిటెన్ టెస్ట్ పాసవుతుంది. ఇంటర్వ్యూకి హైదరాబాద్ రమ్మని కాల్ లెటర్ వస్తుంది. శ్యామల రావుతో కలిసి హైదరాబాద్ వెళ్ళి ఇంటర్వ్యూకి హాజరవుతుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబులు బాగా చెప్తుంది. తిరిగి విశాఖకి వచ్చేస్తారు తండ్రీకూతుళ్ళు. మర్నాడు కాలేజీకి వెళ్ళగానే శ్యామల రావుకి ప్రిన్సిపాల్‍గా ప్రమోషన్ వచ్చినట్టు తెలుస్తుంది. కుతూహలమ్మ గారితో సహా స్టాఫ్ అందరూ అభినందిస్తారు. రణస్థలం కాలేజీకి పోస్ట్ చేస్తారు. మర్నాడు ఉదయం తన కారులో వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇద్దామని అంటారు కుతూహలమ్మ గారు. అనుకున్నట్టుగానే వెళ్తారు. అక్కడ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి తిరిగి వస్తారు. సాత్విక్‌కి ఎమ్‌సెట్‌లో సీట్ రాదు. గీతంలో చేరుతాడు. సాహితి ఉద్యోగానికి సెలెక్ట్ అవుతుంది. రాజమండ్రిలోని ఇన్నీసుపేట ఆంధ్రా బ్యాంకులో క్లర్క్‌గా పోస్టింగ్ ఇస్తారు. శ్యామల రావు, మురళి వెళ్ళి సాహితిని ఆఫీసులో చేర్పించి, హాస్టల్‍లో దింపి వస్తారు. – ఇక చదవండి.]

మరో ఆరు నెలల్లో కుతూహలమ్మ గారికి డి.వి.ఇ.ఓ.గా ప్రమోషన్ వచ్చింది. ఆమెకు సంవత్సరంన్నరే సర్వీసుంది. ఆమెను అనంతపురం జిల్లాకు వేశారు. ఘనంగా వీడ్కోలు మహోత్సవం జరిగింది. ఆమెకు వేలికి బంగారు ఉంగరం పెట్టారు స్టాఫంతా కలిసి. శాలువా కప్పారు. పట్టుచీర పెట్టారు.

ఆమెకు తోడుగా అనంతపురం వెళ్లాడు శ్యామల రావు. సామాన్లు తాను తిరిగివచ్చిన తర్వాత మూవర్స్ అండ్ ప్యాకర్స్ పంపిస్తానన్నాడు. కారులో అంత దూరం ప్రయాణం చేయలేనని ఆమె అన్నందువల్ల భువనేశ్వర్ – బెంగుళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఎసిలో రెండు బెర్తులు బుక్ చేశాడు. తనకు డి.వి.ఇ.ఓ. హోదాలో కారు ఇస్తారనీ, ఇక్కడి నుంచి తన కారు తీసుకొని పోవడం అనవసరమనీ, తాను రిటైరై వచ్చేవరకు శ్యామల రావును వాడుకొమ్మనీ చెప్పిందామె.

ఉదయం పదింబావుకు ప్రశాంతిలో బయలుదేరారు. విజయవాడ, నర్సరావుపేట, వినుకొండ, గిద్దలూరు, నంద్యాల, ద్రోణాచలం, గుంతకల్ మీదుగా అనంతపురం వెడుతుందా రైలు. మొదట వైజాగ్ నుంచే ఉండేది. తర్వాత భువనేశ్వర్‌ వరకు పొడిగించారు.

మధ్యాహ్నానికి వెజిటబుల్ పలావు, పెరుగన్నం, రాత్రికి పూరీ, బంగాళాదుంపల కుర్మా, వంట మనిషితో చేయించుకొచ్చింది మేడంగారు. వాళ్లు అనంతపురం చేరేసరికి ఉదయం ఏడున్నరైంది. సప్తగిరి సర్కిల్‌లో రూం తీసుకొని ఫ్రెషప్ అయ్యారు. డి.వి.ఇ.వో. ఆఫీసు ఆర్ట్ కాలేజీ క్యాంపస్‍లో ఉంది. పది గంటలకు కుతూహలమ్మ గారు అనంతపురం జిల్లా వృత్తి విద్యాశాఖాధికారిణిగా బాధ్యతలు స్వీకరించారు. కడప ఆర్.జె.డి గారికి, హైదరాబాదు కమిషనర్ గారికి జాయినింగ్ రిపోర్టు మెయిలు పెట్టారు.

మేడంగారు సింగిల్ వుమన్ అనీ, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలనీ స్టాఫ్‌ను అభ్యర్థించాడు శ్యామల రావు. ఆయన నా తమ్ముని కంటే ఎక్కువనీ, శ్రీకాకులం జిల్లా రణస్థలం కాలేజీ ప్రిన్సిపాల్ అనీ, నాన్-టీచింగ్ క్యాడర్ నుంచి వచ్చాడనీ గర్వంగా పరిచయం చేసిందామె. మర్నాడు ప్రశాంతికి అతనికి రిజర్వేషన్. ఒక అటెండర్‌ను వెంట పెట్టుకొని ఆమె కోసం ఇల్లు చూడసాగాడు. మర్నాడుదయం అరవిందనగర్‍లో ఒక అపార్ట్‌మెంట్ దొరికింది. సింగిల్ బెడ్రూం ఫ్లాట్, సౌకర్యంగా ఉంది. ఒక పని మనిషి కమ్ వంటమనిషిని చూడమని చెప్పాడు స్టాఫ్‌కి. ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు జిల్లాలోని ప్రిన్సిపాల్స్ అందరితో సమావేశం ఏర్పాటు అయింది ఆర్ట్స్ కాలేజీ కాన్ఫరెన్స్ హలులో. శ్యామల రావును తన పక్కనే కూర్చోబెట్టుకుంది. తనకు ఇంకా ఒకటిన్నర సంవత్సరం మాత్రమే సర్వీసు ఉందనీ, ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్తగా పని చేసుకోండని చెప్పింది

శ్యామల రావును కూడా మాట్లాడమంది. అధిక ప్రసంగం అవుతుందని, సున్నితంగా, వినయంగా తిరస్కరించాడు. కొందరు సీనియర్ ప్రిన్సిపాల్స్, డివిఇవో గారికి తమ సహకారం తప్పక ఉంటుందనీ, ఆమె నిశ్చింతగా ఉండవచ్చని తెలిపారు.

సాయంత్రం ఆరు గంటలకు ప్రశాంతిలో బయలుదేరి, మర్నాడు మధ్యాహ్నం ఒకటిన్నరకు వైజాగ్ చేరుకున్నాడు. ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద ‘శ్రావణి మెస్‍’లో భోంచేసి ఇల్లు చేరుకుని విశ్రాంతి తీసుకున్నాడు. సెల్‍ఫోన్లు రాజ్యమేలడం ప్రారంభించిన కాలమది. కొడుక్కి, కూతురికీ, మురళికీ ఫోన్లు చేసి తాను క్షేమంగా తిరిగి వచ్చినట్లు చెప్పాడు.

నాలుగు రోజుల తర్వాత ఆదివారం వచ్చింది. అగర్వాల్ మూవర్స్ అండ్ ప్యాకర్స్‌తో మాట్లాడి కుతూహలమ్మ గారి సామాన్లు పంపించేశాడు. ట్రక్‌కు సగమే అవుతాయనీ, బెంగుళూరుకు వెళ్లే ట్రక్‍లో షేరింగ్ సిస్టమ్‍లో పంపుతామనీ, పూర్తి ఛార్జెస్ చెల్లించనవసరం లేదనీ చెప్పారు వారు. ఇంటివారికి ఇల్లు అప్పచెప్పి, డ్రైవర్‍ను తీసుకుని ఆమె కారులోనే కొమ్మాది చేరుకున్నాడు. ఇంటి ముందరే కారు పెట్టించాడు. తనకు మంత్లీ బేసిస్ మీద డ్రయివర్ అవసరం లేదనీ, ఎక్కడికయినా వెళ్లాలంటే ఫోన్ చేస్తానని చెప్పి అతని నంబరు తీసుకున్నాడు. అతని పేరు చెంగయ్య.

సాత్విక్ కారును చూసి పరమానందభరితుడయ్యాడు. “ఎక్కడిది నాన్నా, సెకండ్ హ్యాండ్ కొన్నావా నా కోసం?” అని అడిగాడు సంబరంగా.

“మేడంగారిది నాన్నా! ఆమె రిటైరయ్యేంతవరకు మన దగ్గర ఉంచుకోమన్నారు.”

“అయితే ఇంకేం? నేనా కారు డ్రయివింగ్ నేర్చుకుంటాను. ఎలాగూ మనమూ త్వరలోనే కారు కొంటాం కదా!”

“మనం కాదు. నాకంత స్తోమత లేదు. నీవు ఉద్యోగం చేసి కొందువుగాని” అన్నాడు నవ్వుతూ.

“నీకేం తక్కువ నాన్నా! నీవు ఒక కాలేజి ప్రిన్సిపాల్‍వి” అన్నాడు వాడు గర్వంగా తండ్రిని చూస్తూ!

“పిచ్చివెధవా” అన్నాడా తండ్రి, కొడుకును వాత్సల్యంగా చూస్తూ.

కొన్నిసార్లు ప్రతి వారం వచ్చేది సాహితి. తర్వాత సెకండ్ శాటర్ డే, సండే లకు మాత్రం రాసాగింది. సాయంత్రం ఏదో కంప్యూటర్ డిప్లొమా కోర్సుతో చేరిందట.

ఒకరోజు రాత్రి ఫోన్ చేసింది. “చెప్పరా తల్లీ!” అన్నాడు ఆన్ చేసి. “నాన్నా! ఈ హాస్టల్ తిండి తినలేకపోతున్నా. మా బ్రాంచి లోనే నర్మద అనే అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయిది నూజివీడు. మొన్నటివరకు వాళ్ల పిన్నిగారింట్లో ఉండేది. వాళ్ల బాబాయికి ట్రాన్స్‌ఫరై గుంటూరుకు వెళ్లిపోతున్నారట. మా హాస్టల్లో ఖాళీ ఉందా అని అడిగింది.

నేను ఒక ప్రపోజల్ పెట్టాను నాన్నా! అదే యింట్లో ఇద్దరం కలిసి ఉంటే ఎలా ఉంటుందని. హాస్టల్లో ఫుడ్ ఎంత ఘోరంగా ఉంటుందో వర్ణించి చెప్పానులే ఆ అమ్మాయికి. ఇద్దరం కలిసి వంట చేసుకుంటాము. నీవు ఎప్పుడయినా రాజమండ్రి వచ్చినా, తమ్ముడు వచ్చినా ఉండటానికి వీలుగా ఉంది. రెండు బెడ్ రూంలున్నాయి నాన్నా!” అంది.

“ఏ ఏరియా అమ్మా అది?” అని అడిగాడు.

“ఇన్నీసుపేటే నాన్నా! బ్యాంకుకు ఎంత దగ్గరంటే లంచ్ బ్రేక్‍లో వెళ్లి అన్నం తిని రావొచ్చు.”

“భలే ఉందే ఈ ప్రపోజలు! మరి ఇద్దరూ ఆడపిల్లలు! సెక్యూరిటీ..”

“ఆ సమస్య లేదు నాన్నా, ఇంటివారు క్రింద ఉంటారు. ఆయన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన, ఆయన భార్య ఇద్దరే ఉంటారు. కొడుకు యు.ఎస్.ఏ.లో ఉంటాడట”

“సరేరా బంగారు! గో అహెడ్ అండ్ బెస్టాఫ్ లక్!”

“ఉండు. పెట్టేయకు. నీవు వచ్చి రెండ్రోజులుండి మాకు అన్నీ సెట్ చేసి ఇచ్చి వెళ్ళు”

“నిజమేనే. నాకు తోచలేదు. మీరెప్పుడు షిఫ్ట్ అవుతారు ఆ ఇంటికి?”

“వచ్చే ఆదివారమే నాన్నా”

“సరే నేను ఆరోజు ఈస్ట్‌కోస్ట్‌కి వచ్చేస్తాలే తల్లీ! సోమ, మంగళ సెలవు పెడతాను. కొన్ని వంట గిన్నెలు తీసుకొని వస్తా.”

“థాంక్యూ నాన్నా, గుడ్ నైట్!”

‘గుండెల మీద ఆడుకున్న బబ్బితల్లి ఎంత ఎదిగిపోయింది చూస్తూండగానే’ అనుకున్నాడు. సాత్విక్‌కి విషయం చెప్పాడు. వాడు కూడా రావాలంటే వాటికి సెమిస్టర్ పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. సెకండ్ యియర్, ఫస్ట్ సెమ్!

ఆరోజు ఉదయం ఎనిమిదన్నరకు రాజమండ్రి చేరుకున్నాడు ఈస్ట్‌కోస్ట్‌లో. ఒక గోతాంలో కొన్ని గిన్నెలు, గరిటెలు, స్పూన్లు, మూతలు, వాడకుండా వదిలేసిన ఒక స్టవ్ తెచ్చాడు. సాహితి, నర్మద స్టేషన్‌కు వచ్చారు. తండ్రిని స్నేహితురాలకి పరిచయం చేసింది. పెద్దపెద్ద కళ్లద్దాలతో, బక్కపల్చగా ఉంది పిల్ల. ఇద్దరూ ఒకసారి సెలెక్టయ్యారట.

ఎదురుగ్గా ఉన్న ఉడిపి హోటల్లో ముగ్గురూ టిఫిన్ చేశారు. ఆ అమ్మాయి చేతులు కడుక్కోడానికి వాష్ చేసిన వద్దకు వెళ్లినపుడు, గొంతు తగ్గించి తండ్రితో అంది సాహితి.

“వాల్లు ఛౌదరీస్ నాన్నా, పరవాలేదు కదా?” అన్నది జంకుతూ.

“విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాక అలాంటి పట్టింపులు ఉండకూడదమ్మా! నా సంగతి తెలుసు కదా! మరి ఫుడ్ హాబిట్స్..?”

“అడిగానులే! నాన్-వెజ్ తినదట. ఎప్పుడయినా నూజివీడు వెళ్లినపుడు..”

“అయితే ప్రాబ్లం లేదు.”

ముగ్గురూ ఆటోలో ఇంటికి వెళ్లారు. పెయింట్స్ అవీ బాగానే ఉన్నాయి గాని అయ్యవారి నట్టిల్లులా ఉంది. ముందుగా హె.పి. గ్యాస్ ఆఫీసుకు వెళ్లి ఆధార్, అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేసి గ్యాస్ కనెక్షనకు అప్లయి చేశారు. ఇంతకు ముందులా కాకుండా ప్రాసెస్ సింప్లిఫై చేశారు కాబట్టి ట్వంటీఫోర్ అవర్సులోపే వస్తుందని చెప్పారు.

అక్కడి నుంచి శ్యామలా టాకీసు సెంటరుకెళ్లి మూడు మంచాలు కొన్నారు. పైపులతో చేశారవి. వాటికి ప్లాస్టిక్ నవారు అల్లి ఉంది. వాటిమీదికి మూడు పల్చని దూది పరుపులు, దిళ్ళు కొన్నారు. దుప్పట్లు, రెండు కర్టెన్లు, డోర్‍మాట్స్, రెండు బాత్రూంలకు రెండు బక్కెట్లు, మగ్గులు, చీపుర్లు, చెత్త ఎత్తే ప్లాస్టిక్ చాట, పెరట్లో బట్టలు వేసుకోవడానికి ప్లాస్టిక్ తాడు అన్నీ తీసుకున్నారు. మంచాలు పరుపులు అడ్రస్ చెబితే ఇంటికే పంపిస్తామన్నారు.

అక్కడి నుండి మోర్ సూపర్ మార్కెట్‌కు వెళ్లి బియ్యం, పప్పులు, నూనె పాకెట్లు, ఇతర కిరాణా సామాన్లు కొన్నారు. అవన్నీ పోసిపెట్టుకోడానికి ప్లాస్టిక్ కంటెయినర్లు కూడా అక్కడ దొరికాయి.

ఇవన్నీ శ్యామలరావే తరచి తరచి ఆలోచించి కొన్నాడు. ఆడపిల్ల లిద్దరికీ, ఇంత డిటెయిల్స్‌గా ఒక కొత్త సెటప్‌కు కావలసినవన్నీ తెలియవు.

మోర్ పక్కనే ‘అంబాభవన్’ కనపడింది. అప్పటికి లంచ్ టైం అయింది కాబట్టి భోంచేశారు. ఇంటికి వెళ్లేసరికి ఒకటిన్నర. రెండుకు మంచాలు, పరుపులు తెచ్చేశాడు పాపు అబ్బాయి. పక్కన వీధిలోని షాపులో రెండు లీటర్లు కిరసనాయిలు తెచ్చాడు శ్యామల రావు.

రెండు రూముల్లో రెండు మంచాలు, హాల్లో ఒకటి వేశారు. కరైన్స్, తాళ్ళు కట్టటం అయింది. కిరాణా సామాన్ల పాకెట్లు కట్ చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో పోసుకున్నారు. గైడెన్స్ అంతా శ్యామల రావుది.

చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసుకున్నారు. ట్యూబ్ లైట్లు, ఫాన్లు, పెరటి, బాత్రూం లైట్లు ఇంటివారివే ఉన్నాయి కాబట్టి సమస్య లేదు. పైన పెరట్లోంచి దొంగలు దిగకుండా గ్రిల్స్ ఉన్నాయి. ముందు వరండాకు కూడా గ్రిల్స్ వేశారు.

ఇంటి ఓనరు గారింట్లో పనిచేసే ఆమె వచ్చింది. నర్మద పిన్ని గారింట్లో కూడా చేసేదట. ఆమె పేరు రత్నప్రభ అట. మహారాణుల పేరులా ఉంటే అనుకున్నారు. గదులు తుడిచి, గిన్నెలు తోమి, బట్టలు కూడా ఉతుకుతానంది. నెలకు మూడు వందల యాభై అడిగింది. ఆ యాభై తగ్గించమన్నాడు శ్యామల రావు. ఆమె సరేనంది. రేపట్నించి వస్తానంది.

పాత స్టవ్‍ను శుభ్రం చేశాడు శ్యామల రావు. వత్తులు చివర్లు కట్ చేసి, ఒక పాతగుడ్డకు కొంత కిరసనాయిలు అద్దుకొని శుభ్రంగా తుడిచాడు. నూతన్ కంపెనీ స్టవ్ అది. కిరసిన్ ట్యాంకులో పోసి, వెలిగిస్తే చక్కని నీలిరంగు మంట వచ్చింది.

ఇంటి ఎదురుగ్గానే చిన్న కిరాణాషాపుంది. అందులో రెండు పాల పాకెట్లు, ఒక పెరుగు పాకెట్ తెచ్చుకున్నారు. నాలుగు గంటలకు స్టవ్ మీద టీ పెట్టి ఇచ్చాడు. ఐదు గంటలకు ఒక కుర్రవాడు వెదురుబుట్టలో సమోసాలు పెట్టుకొని “తాజా సమోసా, ఆనియన్, కార్న్ సమోసా” అని అరుచుకుంటూ వీధిలో వెళ్తూంటే వాడిని కేకేసి పిలిచి డజను సమోసాలు తీసుకున్నారు. రూపాయికొకటి. తలా నాలుగు తిన్నారు. చాలా రుచిగా ఉన్నాయి.

శ్యామలరావు నర్మదను “నీ ఇష్టదైవం ఎవరమ్మా?” అని అడిగితే “వినాయకుడు అంకుల్” అని బదులిచ్చింది.

శ్యామల రావు సెంటర్‍కు వెళ్లి ఒక ఫోటో ఫ్రేముల షాపులో లక్ష్మీనృసింహుడు, వినాయకుడు, పార్వతీపరమేశ్వరుల ఫోటోలు మూడు తెచ్చాడు. అట్లే రెండు దీపపు సెమ్మెలు, అగరుబత్తీల స్టాండు. కర్పూరం పట్టుకొచ్చాడు. వంటింట్లోనే ఒక షెల్ఫులో న్యూస్ పేపర్ పరిచి పటాలు పెట్టి, పూజాసామగ్రి అమర్చాడు. స్నానం చేసి, దీపారాధన చేసి పటాలకు పూలు పెట్టి వినాయకుడికి నరసింహునికి అష్టోత్తరం చేసి, అగరొత్తులు వెలిగించి హారతిచ్చాడు.

రాత్రి బొంబాయిరవ్వతో ముగ్గురికీ ఉప్మా చేశాడు శ్యామల రావు. ఉదయం ఒకాయన ఇంటి వద్దకే ఇడ్లీ చట్ని తెచ్చి అమ్మితే అవి తినేసి పిల్ల లిద్దరూ బ్యాంకుకు వెళ్లారు.

పది గంటలకు రెండు సిలిండర్లతో సహా గ్యాస్ కనెక్షన్ వచ్చేసింది. స్టవ్ కూడా అదనపు ఛార్జీ తీసుకుని వాళ్ళే యిచ్చారు. శ్యామల రావు వీధి చివర కొట్ల కూరగాయలు తెచ్చకున్నాడు. ఒక స్టీలు సామాన్ల షాపులో ఒక కుక్కరు, ఉండనీ అని ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు తెచ్చాడు. అన్నం, పాలకూర పప్పు, బంగాళాదుంపల వేపుడు చేశాడు. పెరుగు పాకెట్ ఉంది. పన్నెండున్నరకు సాహితికి ఫోన్ చేసి, వంట చేసేశాననీ, లంచ్‌కి యింటికి వచ్చేయండనీ చెప్పాడు. ఈలోపు క్రిందికి వెళ్లి ఓనర్ గారిని కలిసి, తమ పిల్లలను కొంచెం చూసుకోండని రిక్వెస్ట్ చేసివచ్చాడు

సాహితి వచ్చీ రాగానే తండ్రిని వాటేసుకుంది. “వావ్! యు ఆర్ గ్రేట్ నాన్నా, ఒక్కరోజులో ఎన్ని ఏర్పాట్లు చేశావు?” అన్నది.

“అంకుల్! హాట్సాఫ్ టూ యువర్ ప్లానింగ్!” అన్నది నర్మద.

“ఆరువందలమంది అడోలసెంట్ బాయ్ అండ్ గర్ల్స్‌ని, ఇరవైమూడు మంది స్టాఫ్‍ని అడ్మినిస్టర్ చేసే నాకు ఇదో లెక్కా?” అన్నాడు శ్యామల రావు. “అందులో, వీళ్లమ్మ పోయినప్పటి నుంచి డొమెస్టిక్ మానేజిమెంట్‍లో కూడా ఆరితేరాను తల్లులూ!” అన్నాడు. మర్నాడు కూడా ఉండి వాళ్లకు కావలసినవన్నీ సమకూర్చి, మంగళవారం సాయంత్రం జన్మభూమిలో విశాఖ చేరుకున్నాడు.

***

వచ్చేవారం రాలేననీ, నర్మదతో బాటు వాళ్ల ఊరు నూజివీడు వెళుతున్నాననీ, వచ్చే నెలలో ఒక సోమవారం సెలవు పెట్టి, సెకండ్ సాటర్ డే, సండేలు వస్తాననీ ఫోన్ చేసింది సాహితి.

ఒక రోజు ఉదయం సేమ్యా కిచిడీ చేసి, లంచ్ బాక్స్ లోకి పుదీనా రైస్, పెరుగన్నం పెట్టాడు శ్యామల రావు. సాత్విక్ తండ్రికి బై చెప్పి, బైక్ తీసుకొని కాలేజీకి వెళ్ళిపోయాడు. ఆరోజు వాడికి సెమిస్టర్ పరీక్షలు చివరిరోజు. రాత్రి ఆలస్యంగా వస్తాననీ, సాయంత్ర ఫ్రెండ్స్‌తో కలిసి రుషికొండ బీచ్, కైలాసగిరిలో తిరిగి, హోటల్ మేఘాలయలో డిన్నర్ చేస్తామనీ ముందు రోజే చెప్పాడు వాడు. ఐదువందలు నాన్న నడిగి తీసుకున్నాడు.

వాడు వెళ్లి పోయింతర్వాత తానూ తయారై, నడుస్తూ వెళ్లి కొమ్మాది జంక్షన్‍లో రాజమండ్రి – ఇచ్ఛాపురం ఎక్స్‌ప్రెస్ బస్ ఎక్కాడు. ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీకాకుళంలో ప్రిన్సిపాల్స్ మీటింగ్ ఉంది. ఇంకో ప్రిన్సిపాల్ అయితే ఆరోజు ఓ.డి. (ఆన్ డ్యూటీ) కాబట్టి కాలేజీకి వెళ్లడు. సీనియర్ లెక్చరర్‌కి ఎవరికైనా ఇన్‌ఛార్జి రాసేసి ఇంట్లో రిలాక్స్ అయి డైరెక్ట్‌గా శ్రీకాకుళం వెళతాడు.

ఇంట్లో ఉండి ఏం చేద్దామని, లంచ్ అవర్ వరకు కాలేజీలో పని చూసుకొని వెళ్లొచ్చు కదా అనుకొని కాలేజికి వెళ్లాడు. సియల్స్ నోట్ చేసి, అటెండెన్స్ రిజిస్టర్ కౌంటర్‍లో సైన్ చేశాడు. ఇద్దరు ఇంగ్లీష్ జె.యల్స్‌లో ఒకరు సెలవు పెట్టారు. ఆయన క్లాసులు రెండు తానే తీసుకున్నాడు. ఫస్ట్ సైన్స్ వారికి ‘డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్’, సెకండ్ కామర్స్ వారికి విలియమ్ వర్డ్స్‌వర్త్ పోయం ‘డఫోడిల్స్’ చెప్పాడు. ప్రిన్సిపాల్ గారు క్లాసుకు వస్తారంటే పిల్లలకు మహదానందం! ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ వారికిష్టం. “డియర్ ఫ్రెండ్స్” అంటారు ఒకసారి, “మై డియర్ యంగ్ గైస్” అంటూ ఒకసారి వాళ్లను సంబోధిస్తూ, పాఠం చెబుతాడు శ్యామల రావు.

క్లాసులు పూర్తి చేసుకొని తన రూముకొచ్చాడు. రోజూ కనీసం ఒక క్లాస్ అయినా తీసుకోవడం అతని అలవాటు. తాను చెప్పిన టాపిక్‌కి ఫాలో అప్ లెక్చరర్స్‌కు చెబుతాడు.

సీనియర్ అసిస్టెంట్ గోపాత్రుడు గారు వచ్చి స్కాలర్‌షిప్ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. తర్వాత రికార్డ్ అసిస్టెంట్ వచ్చి “రెండు టి.సి.లు ఉన్నాయి సార్, తెమ్మంటారా?” అని అడిగాడు. తెమ్మని చెప్పాడు. అందులోని ఎంట్రీలను రిజిస్టర్ లోని డిటైల్స్‌తో కౌంటర్ చెక్ చేసి, క్రింద తన డిజిగ్నేషన్ ఉన్న చోట గ్రీన్ ఇంక్‌తో సైన్ చేశాడు.

సివిక్స్ మాస్టరు సింహాచలం గారు వచ్చి, టిసిలు అయ్యేంతవరకు కూర్చున్నారు. రికార్డు అసిస్టెంటు వెళ్లిపోయిన తర్వాత, “చెప్పండి మాస్టారు” అన్నాడు. ఆయన, ‘మాస్టారూ, ఈ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ఆ సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు మన ప్రేయర్ గ్రౌండ్‍లో చిన్న మీటింగ్. మీరు వచ్చి పిల్లలను అడ్రస్ చేయాలి. మన సర్పంచ్ ‘తాతయ్యలు’ గారు మన కాలేజీలో చదువుతున్న కొందరు దివ్యాంగులకు తలా ఐదువందల చొప్పన ధన సహాయం అందిస్తారట వారి పార్టీ తరపున.”

“నాకు ఈ రోజు శ్రీకాకుళంలో మీటింగ్ ఉంది మాస్టారు! మీరూ, తెలుగు మాస్టారూ లాగించెయ్యండి” అని చెప్పి ఆయనను పంపించాడు.

కొందరు పిల్లలు వచ్చి తలుపు వద్ద నిలబడి “మే ఐ కమిన్ సార్” అని పాటలాగా పాడుతున్నారు. వారు వొకేషనల్ పిల్లలని గ్రహించాడు. రమ్మని సైగచేశాడు. వాళ్లు వచ్చి ప్రిన్సిపాల్ గారికి విష్ చేసి, “మాస్టారు! సైకిలుస్టాండ్ ఉన్న షెడ్డు పై రేకులు పాడయ్యాయండి. కొన్నిచోట్ల లేవు, ఉన్నవాటికి రంధ్రాలు పడి మా సైకిళ్లు ఎండకు వానకు చెడిపోతున్నాయి సార్. బాగు చేయిస్తే మంచిది సార్” అన్నారు.

“తప్పకుండా చేయిద్దాం. నేనూ మొన్న అటుగా వెళ్లినప్పుడు చూశాన్లెండి” అని అటెండరును పిలిచి, గోపాత్రుడు గారిని ఒకసారి రమ్మనమని చెప్పాడు.

అతను తిరిగివచ్చి, “ఊడీసీగారు టెజరీ కెల్లారటండి” అని చెబితే పిల్లలందరూ నవ్వారు.

ప్రిన్సిపాల్ కూడా నవ్వి, “తవిటయ్యా, ఊడీసి కాదు, యుడిసీ అనాలి అని ఎన్నిసార్లు చెప్పాను? అసలా పేరే లేదిప్పుడు! సీనియర్ అసిస్టెంట్ అనాలి.”

“నాకు నోరు తిరగదు బావు” అన్నాడతను బుర్ర గోక్కుంటూ. “అలాంటపుడు శుభ్ర్రంగా పాత్రుడు గారని అను.”

“అలగేను బావు”

పిల్లలతో, “మీరు వెళ్లండి, నేను స్పెషల్ పీజు నుంచి ఎమాంట్ డ్రా చేయించి షెడ్ రిపేరు చేయిస్తా లెండి. ఆ పని మన పి.డి.గారు సత్తిబాబుకు అప్పచెబుతాను” అన్నాడు.

“థాంక్యూ సార్” అని చెప్పి పిల్లలు వెళ్లిపోయారు. టైము చూశాడు. పావు తక్కువ ఒంటిగంట.

స్వీపర్ సావిత్రమ్మను పిలిచి, “అమ్మా, నేను లంచ్ చేస్తా, మంచి నీళ్లు పెట్టు” అని చెప్పాడు.

రూముకు ఒక పక్క కర్టెన్ వేసి ఒక భాగాన్ని వేరు చేశారు. అది ప్రిన్సిపాల్ గారి రెస్టింగ్ రూం. దాంట్లో ఒక చిన్న కర్ర టేబులు, ఒక కుర్చీ వేసి ఉన్నాయి ఒక మూల. ఒక ఈజీ ఛెయిర్ కూడ ఉంది. కాళ్లు జాపి పెట్టుకోడానికి దాని ముందు చిన్న స్టూలు కూడా ఉంది. లంచ్ బాక్స్ ఉన్న బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్లాడు. కిటికీలు తెరిచాడు. సావిత్రమ్మ ఒక జగ్గుతో నీళ్లు, ఒక గాజు గ్లాసు, ఒక పింగాణీ ప్లేటు తెచ్చిపెట్టింది.

ఆమే అతనికి వడ్డించసాగింది. కర్టెన్ అవతల వొకేషనల్ మేడమ్ నీలిమ గొంతు వినబడింది. “మాస్టారు, మాస్టారూ, ప్రిన్సిపాల్ సార్!” అని పిలుస్తుంది. అమెను లోపలికి పిలవమని సావిత్రమ్మకు చెప్పాడు.

నీలిమ మేడమ్ లోపలికొచ్చి శ్యామల రావును వినయంగా విష్ చేసి “ఈరోజు నా బర్త్ డే మాస్టారు.” అంటూ ఒక చిన్న స్టీలు డబ్బా లోంచి బేసిన్ లడ్డుండలు రెండు తీసి అతని ప్లేట్‌లో వేసింది. తర్వాత రెండు మసాలా వడలు కూడా.

“థాంక్యూ నీలిమా” అన్నాడు.

“ప్లీజ్ బ్లెస్ మీ సార్” అంటూ వంగి ప్రిన్సిపాల్ కాళ్లకు నమస్కరించింది.

“విష్ యు వెరీ హ్యాపీ బర్త్ డే తల్లీ” అని ఆమె తల మీద చేయి పెట్టి దీవించాడు. సాహితి కంటే మహా అయితే రెండు మూడేళ్లు పెద్దదయి ఉంటుందనుకున్నాడు.

“ఈ రోజు సెలవు పెట్టలేకపోయావా?” అని, “ఎందుకులే అసలే మీరు కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ. ఉన్నది సంవత్సరానికంతా కలిపి పది సెలవులు. ఒక పని చేయి. ఆఫ్టర్ నూన్ సైన్ చేసి, చిన్న పర్మిషన్ లెటరు నా టేబుల్ మీద పెట్టి, ఇంటికెళ్లిపో. నీ క్లాసు ఎవరికైనా అప్పగించి వెళ్ళు.”

“బర్త్ డే అనే రాయనా మాస్టారూ?”

శ్యామల రావు నవ్వి అన్నాడు. “వద్దు తల్లీ. నాట్ వెల్ డూయింగ్ అని రాయి. తప్పదు మరి.”

ఆమె అతనికి థాంక్స్ చెప్పి వెళ్లిపోయింది.

సావిత్రమ్మకు ఒక లడ్డు, ఒక వడ ఇవ్వబోతే, “వొకేసనల్-అమ్మ నాక్కూడ ఇస్తాది బావు. తవురు తినండి’ అన్నది.

“నీకు ఇవ్వదని కాదమ్మా, నేను అన్ని తినలేక” అన్నాడు.

అతని భోజనం అయ్యాక క్యారేజి గిన్నెలు ఒక మూలన ఉన్నవాష్ బేసిన్‍లో కడిగి టేబుల్ మీద బోర్లించి పెట్టింది. రూం మధ్యలో ఉన్న ఫ్యాను గాలి ఇక్కడికి కూడా వస్తుంది.

రెండు గంటలవరకు లంచ్ బ్రేక్. ఒక అరగంట ఈజీ చెయిర్‍లో కళ్లు మూసుకుని రిలాక్స్డ్‌గా పడుకున్నాడు. పావు తక్కువ రెండుకు లేచి ముఖం కడుక్కొని, తల దువ్వుకొని, తన సీట్లోకి వచ్చాడు

గోపాత్రుడుగారు వచ్చి “ట్రెజరీకి వెళ్లాను మాస్టారు. మన లెక్కల మాస్టారిది డి.ఎ. అరియర్ బిల్లు సబ్మిట్ చేసి వచ్చాను. పిలిచారట!” అన్నాడు. అతనికి సైకిలు షెడ్ విషయం చెప్పి, స్పెషల్ కరెంట్ ఇయర్‌ దానిలో నుంచి రెండు వేలు డ్రా చేయమని చెప్పాడు. మీటింగ్‌కు బయలుదేరుతున్నానని, మొన్న టెస్ట్ రిజల్టు, అడ్మిషన్స్ స్టేటస్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్ మీట్‍లో సెలెక్టయిన వారి వివరాలు, వొకేషనల్ పిల్లల అప్రెంటిస్‌షిప్ ప్రపోజల్సు అన్నీ పది నిమిషాల్లో కావాలని చెప్పాడు.

“అన్నీ ఉదయాన్నే రడీ చేసేసి, ట్రెజరీకి వెళ్లాను మాస్టారు” అన్నాడు పాత్రుడుగారు.

“గుడ్. అలాగే ఎవరినైనా బండి మీద నన్ను బస్టాప్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పండి.”

రెండు పదికి మీటింగ్‍కు సంబంధించినవన్నీ ఒక ఫోల్డర్‌లో సర్ది తెచ్చిచ్చాడు.

కామర్స్ లెక్చరర్ లక్ష్మీపతి వచ్చి, “మాస్టారూ, వెళదామా?” అని అడిగాడు.

“పదండి మాస్టారు!” అని లేచాడు. అటెండెన్స్ రిజిస్టరులో ఆఫ్టర్ నూన్ సైన్ చేయలేదు. గ్రీన్ ఇంక్‌తో ఓ.డి. అని మార్క్ చేశాడు.

“స్టాఫ్ ఆర్డర్ మాథ్స్ మాస్టారి పేర రాశాను. ఆయనను చూసుకోమని చెప్పండి” అని చెప్పి బండి వెనక కూర్చున్నాడు.

“పోనీ శ్రీకాకుళంలో దింపయ్యమంటారేటి?” అనడిగాడు లక్ష్మీపతి. ప్రిన్సిపాల్ గారి మీద ప్రేమతో కాదు. అతను శ్రీకాకుళం నుంచి తిరుగుతాడు. ఆయన్ను దింపేసి తాను ఇంటికి వెళ్లిపోవచ్చనని. శ్యామల రావుకు అర్థమయింది.

నవ్వి “వద్దులెండి. నేను బస్సులో వెళతాను. మీకంతగా పని ఉంటే ఒక గంటకు పర్మిషన్ రాసిపెట్టి త్రీ థర్టీకి వెళ్లిపోదురూ!”

“పనేమీ లేదులెండి మాస్టారు!” అన్నాడతను కూడా నవ్వుతూ.

విశాఖ-శ్రీకాకుళం ఆర్డినరీ వచ్చింది. దాంట్లో ఎక్కలేదు. దానికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది. వెనకే కాకినాడ- పలాస లగ్జరీ వచ్చింది. దాంట్లో ఖాళీ లేదు. ఎక్కి నిలబడ్డాడు. అరగంట లోపే అంబేద్కర్ బొమ్మ దగ్గర దిగి, ఆర్ట్స్ కాలేజీ కాంపస్‍లో ఉన్న డి.వి.ఇ.వో. ఆఫీసుకు వెళ్లాడు. మూడయ్యింది సరిగ్గా..

(ఇంకా ఉంది)

Exit mobile version