Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-17

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[కుతూహలమ్మ గారికి డి.వి.ఇ.ఓ.గా ప్రమోషన్ ఇచ్చి అనంతపురంలో పోస్టింగ్ ఇస్తారు. ఆమెకు తోడుగా శ్యామల రావు వెళ్ళి ఆమె జాయినింగ్ ఈవెంట్‌లో పాల్గొంటాడు. పాత ఇంటిలోని ఆమె సామాన్లన్నీ సర్ది పాకర్స్ అండ్ మూవర్స్ వారితో అనంతపురం పంపిస్తాడు. ఏడాదిన్నరలో తిరిగి వచ్చేస్తాను కాబట్టి కారు ఇక్కడే ఉంచేయమని, డ్రైవర్‌ని పెట్టుకుని శ్యామల రావుని వాడుకోమంటుందామె. ఓ రాత్ర సాహితి ఫోన్ చేసి, ఓ కొలీగ్‌తో కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని ఉందామని అనుకుంటున్నట్టు చెప్తుంది. మరుసటి ఆదివారం రాజమండ్రి బయల్దేరుతాడు శ్యామల రావు. సోమ మంగళవారాలు సెలవు పెట్టి, రాజమండ్రిలోనే ఉండి సాహితి ఇంటికి అవసరమైన అన్ని వస్తువులు అమర్చి వస్తాడు. తరువాత మామూలుగా ఆఫీసు వ్యవహారాల్లో మునిగిపోతాడు. ఓ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీకాకుళంలో ప్రిన్సిపాల్స్ మీటింగ్ ఉంటుంది. ఓ ఇంగ్లీష్ లెక్చరర్ రాకపోతే, ఫస్ట్ యియర్ సైన్స్ వారికి ‘డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్’, సెకండ్ యియర్ కామర్స్ వారికి విలియమ్ వర్డ్స్‌వర్త్ పోయం ‘డఫోడిల్స్’ చెప్తాడు. మధ్యాహ్నం భోం చేసి, ఓ కొలీగ్‌ని స్కూటర్ మీద బస్ స్టాండ్ దగ్గర దింపమంటాడు. బస్ ఎక్కి, శ్రీకాకుళం అంబేద్కర్ బొమ్మ దగ్గర దిగి, ఆర్ట్స్ కాలేజీ కాంపస్‍లో ఉన్న డి.వి.ఇ.వో. ఆఫీసుకు సరిగ్గా మూడు గంటలకి చేరుకుంటాడు శ్యామల రావు. – ఇక చదవండి.]

మీటింగ్ ముగిసేసరికి ఐదయ్యింది. డి.వి.ఇ.వో. గారు చెప్పిన ఇన్‍స్ట్రక్షన్స్ అన్నీ బ్రీఫ్‍గా చిన్న డైరీలో రాసుకున్నాడు, అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వైజ్. రేపు కాలేజీలో స్టాఫ్ మీటింగ్ పెట్టి అవన్నీ తన స్టాఫ్‍కు వివరించాలి.

మీటింగ్ లోనే బిస్కట్సు, టీ సర్వ్ చేశారు. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చేసరికి కాంప్లెక్సు నుంచి వస్తున్న వైజాగ్ నాన్-స్టాప్ బస్ ట్రాఫిక్ సిగ్నల్ పడి ఆగి వుంది. గబాగబా వెళ్లి తలుపు వద్ద నిలబడి “సీట్లున్నాయా బ్రదర్” అనడిగాడు డ్రైవరును.

“మీకెన్ని కావాలేటి?” అనడిగాడు అతను నవ్వుతూ.

ఎక్కి ముందే ఉన్న సింగిల్ సీట్‌లో కూర్చున్నాడు. డ్రైవరు టికెట్ కొట్టి ఇచ్చాడు. కొమ్మాది జంక్షన్‌లో దిగే సరికి ఏడు. సాత్విక్ డిన్నర్‍కు రానని చెప్పిన విషయం గుర్తొచ్చింది. తనకొక్కడికే ఏం వండుకుంటాం లెమ్మని, అక్కడే ఉన్న టిఫిన్ బండి వద్ద మూడు ఇడ్లీలు, మూడు మైసూరు బజ్జీలు కట్టించుకొని వెళ్లాడు. ఇంటికి వెళ్లి స్నానం చేసి, దేవుడికి దీపారాధన చేసి తినేస్తే ఒక పనయిపోతుందనుకున్నాడు.

టిఫిన్ చేసేసరికి ఎనిమిది కావస్తూంది. హాల్లో సోఫాలో కూర్చుని టివి ఆన్ చేశాడు. ఈటివీలో ఏదో బ్లాక్ అండ్ వైట్ సినిమా వస్తుంది. కాసేపు చూసేసరికి అది హరనాథ్, జమున నటించిన ‘లేత మనసులు’ అని అర్థమైంది. సినిమాలో లీనమై చూస్తూండగా, సెల్‍ఫోన్ మోగింది. కొడుకు.

“చెప్పు నాన్నా!” అన్నాడు.

“అంకుల్ నేను సాత్విక్ ఫ్రెండ్ అబ్బరాజుని. మేం కైలాసగిరి నుంచి, మేఘాలయలో డిన్నర్ చేద్దామని వస్తూంటే సాత్విక్ బైక్‍ను ఒక ఆటోవాడు రాంగ్ సైడ్‌లో వచ్చి తగిలించాడంకుల్. ఇద్దరం పడిపోయాము. నాకేమీ కాలేదు కాని వాడికి ఎడమ మోకాలికి దెబ్బ తగిలింది. అస్సలు కాలు మోపలేకపోతూంటే ఎందుకయినా మంచిదని పోలీస్ బ్యారక్స్ దగ్గరున్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి తీసుకొచ్చాము. మీరేం కంగారుపడకండండల్. డాక్టరు ఎక్స్‌రే తీస్తే గాని చెప్పలేమన్నారు. డాల్ఫిన్ హోటలు పక్కవీధిలో ఎక్సరే తీయించుకొచ్చాము.”

శ్యామలరావు పితృహృదయం విలవిలలాడింది. “ఓ మై గాడ్! ప్రమాదమేమీ లేదు కద!” అని అరిచాడు ఫోనుతోనే.

“ఏం లేదంకుల్. మేం చూపించి జాగ్రత్తగా తీసుకు వస్తాం ఇంటికి.”

“వద్దు! నేను బయలుదేరి వస్తున్నాను. ఆ హాస్పిటల్ ఎక్కడ?”

“పోలీస్ బ్యారక్స్ దాటి డాల్ఫిన్ వైపు వెళుతూంటే, ఫైర్ సర్వీస్ స్టేషనుంటుంది అంకుల్. దాని ఎదురుగ్గా రోడ్డులోనే. కుడిపక్క. డాక్టర్ దాలినాయుడు. యమ్.యస్ (ఆర్థో) అని బోర్డు ఉంటుంది. కొంచెం ముందు కెళితే వెంకటేశ్వర థియేటర్ ఉంటుంది. అంత వరకు పోనవసరం లేదు!”

“సరే. అక్కడే ఉండండి నేను వస్తున్నాను” అని చెప్పి కట్ చేశాడు. కుతూహలమ్మగారి డ్రైవర్ చెంగయ్యకు ఫోన్ చేశాడు. అతడు ఎత్తి “నమస్తే మాస్టారు. చెప్పండి” అన్నాడు.

“ఎక్కడున్నావు చెంగయ్యా?”

“బరంపురం ఎల్తన్నానండి. టెక్కలి దాటినాము.”

“మా ఇంటికి దగ్గర్లో నీకు తెలిసిన డ్రైవరెవరైనా ఉన్నారా? మా అబ్బాయికి చిన్న యాక్సిడెంట్ అయ్యిందట. అర్జంటుగా కారు తియ్యాలి..”

“కొమ్మాది లోనే ఉన్నాడండి మావోడు ఒకడు. వాడి పేరు అప్పన్న. ఉండండి వాడికి ఫోన్ చేసి చెబుతాను.”

రెండు నిమిషాల తర్వాత ఫోన్ మోగింది. “సార్ నేను అప్పన్నను. చెంగయ్య ఇపుడే చెప్పాడు. నా బండి మీద బయల్దేరాను. సింహగిరి కాలనీలో మీ ప్లాట్ నంబరు చెప్పండి.”

“థాంక్యూ అప్పన్నా, 204. త్వరగా వచ్చెయ్యి.”

తాను తయారై తలుపు తాళం వేశాడు. ఒక బ్యాగ్‌లో ఒక లుంగీ, ఒక టవలు పెట్టుకున్నాడు. ఐదు నిమిషాల్లో అప్పన్న వచ్చాడు తన టి.వి.ఎస్. ఫిఫ్టీ మీద. బండి పక్కకు పెట్టి “రండి సార్” అన్నాడు. కారు స్టార్ట్ కాదేమో అని భయపడ్డాడు శ్యామల రావు. కానీ సులువుగానే అయ్యింది. “డీజిలు నూట్రలు కొచ్చింది సార్” అన్నాడు అప్పన్న.

“దారిలో కొట్టిద్దాం పద” అంటూ ముందు సీటులో కూర్చుని తలుపు వేశాడు. మధురవాడ దాటింతర్వాత డీజిలు రెండొందలది కొట్టించారు. “చెంగయ్య మా బావేనండి” అన్నాడు. “ఆహ!” అన్నాడు శ్యామలరావు. అతని మనసంతా కొడుకు మీదే ఉంది.

ట్రాఫిక్ హెవీగా ఉంది. ప్రతి కిలోమిటరుకూ ఒక ట్రాఫిక్ సిగ్నల్స్. మద్దిలపాలెం దాటేటప్పటికి పదయింది. అక్కడ నుంచి హైవే మీద వెళ్లి, గురుద్వారా దగ్గర టర్న్ తీసుకొని హాస్పిటల్ వెతుక్కునే సరికి పదిన్నర.

శ్యామల రావు రిసెప్షన్‌లో ఉన్న అతన్ని “సాత్విక్ అని..” అడుగుతూంటే అబ్బరాజు వచ్చి”రండి అంకుల్” అని తీసుకుని వెళ్ళాడు. జనరల్ వార్డులో ఒక మంచం మీద పడుకొని ఉన్నాడు సాత్విక్. నొప్పి చాలా ఎక్కువగా ఉన్నట్లుంది. ముఖం పీక్కుపోయింది. తండ్రిని చూసి, “నాన్నా, వచ్చేశావా?” అని బలహీనంగా నవ్వాడు. తండ్రి చేతిని గట్టిగా పట్టుకొన్నాడు.

ఎడమ మోకాలికి పెద్ద బ్యాండేజ్ వేసి ఉంది. నొప్పితో మూలుగుతున్నాడు. శ్యామలరావుకు కళ్లనీళ్లు తిరిగాయి.

“ఏం కాదులే నాన్నా, కొద్దిగా ఓర్చుకో” అన్నాడు.

డాక్టరుగారు కె.జి.హెచ్.లో పని చేస్తారట. సాయంత్రం ఏడు నుంచి రాత్రి పదకొండు వరకు ఈ క్లినిక్‍ నడుపుతారట. ఇంకో ఫ్రెండు వెళ్లి ఆయన ఉన్నారో లేదో చూసి వచ్చాడు. పదకొండు కాలేదు. ఆయన వెళ్లిపోలేదు.

అబ్బరాజును తీసుకొని డాక్టరుగారి ఛాంబర్‌కు వెళ్లాడు శ్యామల రావు. ఆయన యువకుడే. ముఫ్ఫై ఐదేళ్లుంటాయేమో! వెళ్లి విష్ చేశాడు.

“రండి మాస్టారు! మీరు రణస్థలం కాలేజి ప్రిన్సిపాల్ గారట కదా! మాది పలాస దగ్గర గరుడఖండి! మా తుంబనాధం మాస్టారు తెలుసేటీ మీకు? పలాస కాలేజిలో మా గురువుగారండి ఆయన!” అన్నాడు.

“ఆయన తెలియకపోవటమేమిటి డాక్టరుగారు! మన జోన్ లోనే సీనియర్ ఇంగ్లీష్ లెక్చరర్. పోయినేడాది రిటైరైపోయారు.”

“అవునండి. మీ అబ్బాయికి మోకాలి దగ్గర లిగమెంట్ నొక్కుకు పోయిందండి. అంతే. బంతిగిన్నె కీలుంటాది గదండి. ఒక ఎముక పోయి చిన్న గిన్నెలాంటి మరో ఎముక చివర కూచుంటాదంది. అది డిస్‍లొకేట్ పూర్తిగా కాలేదుగాని కదిలిపోనాది. ఫ్రాక్చరేమీ లేదండి. మీవోని అదురుష్టమండి బాబు. ఆ పడిన ఉదుటుకు ఏదైన బండరాయి మీద పడి తలలో దెబ్బ తగల్నేదు. కుర్రోల్లు కదా, బేగి అతుక్కుంటాది లెండి. ఎక్కడ లేని ఆత్రమండి గుంటలకు.”

అంత చదువుకున్నా తన ప్రాంతపు యాసను వదిలి పెట్టలేదా భిషగ్వరుడు. శ్యామల రావుకు ముచ్చటేసింది.

“అయితే ఏం ప్రమాదం లేదంటారా?”

“అచ్చ. అదేం నేదంది. వీరు ఇంటికి ఎలిపోవచ్చు. వారం తర్వాత వస్తే కట్టిప్పేస్తా. చూసి, నీ బ్రేస్ (Knee brace) ఒకటేసుకుంటే సరిపోద్ది. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఇచ్చినాను. ఈ వారం రోజులకు మాత్రలు రాసిచ్చినాను. మన కాడే దొరుకుతాయి. హీట్ బ్యాగ్ ఒకటి కొనుక్కెల్లండి. రేత్రి నొప్పి ఎక్కువనిపిస్తే, మోకాలి మీద కాకుండా, తొడల మీద, పిక్కల మీద కాపడం పెట్టండి.”

“ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏవైనా..”

“పత్తెం ఏమీ లేదండి మాస్టారు. అన్నీ పెట్టంది. నాన్-వెజ్ తీసుకుంటే యానిమల్ ప్రొటీన్ దొరుకుతాది. మీరు తినరు గదా!” అని నవ్వాడు.

“రేపంతా పక్క మీద కదలకుండా ఉండి ఎల్లుండి నుంచి ఇంట్లోనే అటూ ఇటూ నడుస్తూండమనండి. వారం తర్వాత చూస్తాను.”

డాక్టరుగారికి థాంక్స్ చెప్పి వచ్చేశాడు. “ఏమయినా తిన్నారా?” అనడిగితే తిన్నామన్నారు. సాత్విక్‍కి కూడా ఆలూ పరోటా పెట్టామన్నారు.

బైక్ కేమీ కాలేదు. చిన్న సొట్టలు పడిందంతే. సాయంపట్టి సాత్విక్‍ను కారు వెనక సీటులో పడుకోబెట్టారు. అబ్బరాజు బైక్ మీద ఫాలో అవుతానన్నాడు. మిగతా ఫ్రెండ్స్‌ని వెళ్లిపొమ్మన్నాడు శ్యామల రావు.

ఇల్లు చేరేసరికి పన్నెండున్నర అయ్యింది. కారు పార్క్ చేసి అప్పన్న వెళ్లిపోతుంటే అతనికి రెండు వందలిచ్చాడు. అబ్బరాజు రాత్రి ఉండిపోయాడు. ముగ్గురికి వేడిగా మాల్టోవా కలిపి ఇచ్చాడు. హీట్ బ్యాగ్‌తో కొడుకు కాలుకు కాపడం పెట్టసాగాడు. కంఫర్ట్‌బుల్‍గా ఉంటుందని లుంగీ కట్టించాడు.

తెల్లవార్లు నొప్పితో బాధపడుతూ, ఉదయం ఐదు గంటలకు నిద్రలోకి జారుకున్నాడు సాత్విక్. అటాచ్డ్ బాత్రూం ఉన్నగదిలో పడుకోబెట్టాడు కొడుకును. అబ్బరాజు ఉదయం ఏడు గంటలకు లేచి టీ తాగి వెళ్లిపోయడు.

సాత్విక్ తొమ్మిదికి లేచాడు. నాన్న భుజం ఆసరా చేసుకుని కుంటుకుంటూ బాత్ రూంకు వెళ్లాడు. వెస్ట్రన్ కమ్మోడ్ కాబట్టి మోకాలు వంచాల్సిన పని లేదు.

బ్రష్ చేయించి, ‘టీ’ ఇచ్చాడు కొడుక్కి. ఆ లుంగీ, షర్టు బనియన్ తీసేయించి, గోరువెచ్చని నీళ్లతో ఒళ్లంతా తుడిచాడు. ఫ్రిజ్‍లో అట్లపిండి ఉంది. రెండు దోసెలు పోసి యిచ్చి, టాబ్లెట్ వేశాడు. హీట్ బ్యాగ్‍తో తొడ, పిక్కలకు కాపడం పెట్టాడు. ఆ పెయిన్ కిల్లర్స్‌లో మైల్డ్ సెడెటివ్ కూడా ఉండేమో, అది వేసిన కాసేపటికే మగత లోకి జారుకున్నాడు సాత్విక్.

డి.వి.ఇ.ఓ. గారికి ఫోన్ చేసి, జరిగిందంతా చెప్పి, వారం రోజులు లీవ్ కావాలన్నాడు. ప్రిన్సిపాల్‍కు లీవ్ శాంక్షనింగ్, ఇంక్రిమెంట్స్, సర్వీస్ బుక్ ఎంట్రీస్, పే రివిజన్ ప్రాసెస్ అన్నింటికీ కాంపిటెంట్ అథారిటీ ఆయనే. ఆయన పేరు సాయన్న.

“అలాగే మాస్టారు! బాబును జాగ్రత్తగా చూసుకోండి. కంగారేం లేదు. ఛార్జి ఎవరికయినా హండోవర్ చేయండి. లీవ్ అప్లికేషన్ నాకు మెయిల్ పెట్టించండి” అన్నాడాయన.

మధ్యాహ్నం భోజనానికి చుక్కకూర పప్పు, కాకరకాయ వేపుడు, చారు చేశాడు. మంచం దగ్గరికీ ప్లేటులో అన్నీ పెట్టుకుని తీసుకొని వచ్చాడు. తిన్న తర్వాత ప్లేటులోనే చేయి కడిగించి, టవలుతో మూతి తుడిచాడు. బాత్ రూంకు తీసుకెళ్లి వచ్చి మాత్ర వేసి పడుకోబెట్టి, తానూ భోంచేసి, కొడుకు పక్కనే నడుం వాల్చాడు. రాత్రి సరిగ్గా నిద్రలేక అతనికీ కునుకు పట్టింది.

వారం రోజుల పాటు కంటికి రెప్పల్లా కాచుకున్నాడు కొడుకును. మూడో రోజు నుంచి తన భుజం మీద వాడి చేయి వేసుకొని హాల్లో రోజుకు మూడు సార్లు అటూ యిటూ పది నిమిషాలపాటు నడిపించాడు. ఐదో రోజు నుంచి నొప్పి బాగా తగ్గింది. బ్యాండేజ్ వల్ల మోకాలు వంచలేడు. రాజమండ్రి నుంచి అక్క వచ్చి తమ్మున్ని చూసి ఒక రోజు ఉండి వెళ్ళింది. నర్సీపట్నం నుంచి మురళీ వాళ్ళు వచ్చి చూసి వెళ్లారు. ఎనిమిది రోజు అప్పన్నకు ఫోన్ చేసి రప్పించి, కారులో డాక్టరుగారి క్లినిక్‌కి వెళ్లారు. రాత్రి ఏడున్నరకు ఆయన బ్యాండేజ్ తొలగించి, మళ్లీ ఎక్స్‌రే తీయించారు.

“మాస్టారు! సెట్ అయిపోనాదండి. నీ బ్రేస్ ఇస్తాను. బ్యాండేజి నాగ శిరాగ్గా ఉండదండి. దాని కింద దురదెట్టినా తీసేసి గోక్కొని మల్లా పెట్టుకోవచ్చండి. ఒక నెల రోజులు దాన్ని పెటుకునే తిరగమనండి. రోజూ సుబ్రంగా తానం చేయొచ్చు, బాగా తుడుచుకొని ఆరిం తర్వాత బ్రేస్ కట్టుకోవాల. నేను ఒక జెల్ ఇస్తాను. మూడు పూటలా దాంతో మైల్డ్‌ గా రబ్ చేయండి. మాత్రలు మరో వారం వాడి ఆపేద్దురు గాని, కూసింత జోరు తగ్గించాల నీవు. మీ డాడీ సూడు ఎంత ఇదయి పోయినాడో!” అని నవ్వాడాయన.

బ్యాండేజ్ తీసేసిన తర్వాత ప్రాణానికి హాయిగా ఉంది సాత్విక్‌కి. పదిరోజుల తర్వాత కాలేజీకి వెళ్లసాగాడు శ్యామల రావు. బ్రేస్ వల్ల మోకాలు బెండ్ కాకుండా నడవగలిగేవాడు సాత్విక్. పడుకున్నపుడు దాన్ని తీసేయమన్నాడు డాక్టరు. నెలరోజుల తర్వాత పరీక్షించి, బ్రేస్ కూడా అవసరం లేదు, మూడు నెలలపాటు పరిగెత్తడం, గెంతడం చేయొద్దన్నాడు.

నాన్న తన పట్ల చూపించిన కన్సర్న్‌కు కదిలిపోయాడు సాత్విక్. అప్పుడే నిర్ణయించుకొన్నాడు – ఎప్పుడూ తాను నాన్నను వదిలి ఉండకూదని. అంతకు ముందు, ఇంజనీరింగ్ తర్వాత యు.ఎస్.లో ఎమ్.ఎస్. చేయాలని కలలు కనేవాడు. వాటన్నిటికంటే నాన్నే ముఖ్యమని తీర్మానించుకున్నాడు.

సాహితి ఉద్యోగంలో చేరి సంవత్సరం దాటింది. సి.ఎ.ఐ.ఐ.బి. (సర్టిఫైడ్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్) అనే డిపార్టుమెంటల్ పరీక్ష పాసయ్యింది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పి.జి. డిప్లొమా కూడా పూర్తి చేసింది.

ఒక వీకెండ్ ఇంటికి వచ్చినప్పుడు శ్యామల రావు అడిగాడు కూతుర్ని “తల్లీ! నీకు ఇరవైమూడు నిండి, ఇరవైనాలుగు నడుస్తూంది. ఇక పెళ్లి చేసుకోమ్మా! నేను సర్వీసులో ఉండగానే మీ ఇద్దరి బాధ్యతలు తీరిపోతే, నిశ్చింతగా మీ అమ్మ దగ్గరికి వెళ్లిపోతాను.”

సాహితి ఎందుకో కొంచెం కళవళపడింది. అంతలోనే తనను తాను సర్దుకుని, నవ్వుతూ “నా పెళ్లికి అప్పడే అంత తొందరేమెచ్చింది నాన్నా” అన్నది.

ఈ కాలం పిల్లల రొటీన్ డైలాగే అది!

“లేదమ్మా! నీవింకా చిన్నపిల్లవు కాదు. ఐ వాంట్ టు సీ యు ఇన్ ది సేక్రెడ్ వెడ్ లాక్ సూన్” అన్నాడు.

సాహితి ఏమీ మాట్లాడలేదు. కానీ ఎందుకో వెళ్లేంతవరకు తన టిపికల్ హ్యాపీ స్పిరిట్స్ లేదు. శ్యామల రావు అది గమనించలేదు. మౌనం అర్ధాంగీకారం అనుకున్నాడు. బిడియం అనుకున్నాడు. ఆడపిల్ల సిగ్గు విడిచి “సరే నాన్నా నాకు పెళ్లి సంబంధాలు చూడందయితే” అని ఎలా చెబుతుంది!

షీలానగర్‌లో ఒక ‘బ్రాహ్మణ వివాహ వేదిక’ ఉందని తెలిసి, తర్వాతి అక్కడికి వెళ్ళాడు. దాన్ని నడుపుతున్నది ‘లలితాంబ’ అనే పెద్దావిడ. సాక్షాత్తు లలితాపరమేశ్వరి లాగే ఉంది. కాని నిక్కచ్చిగా రిజిస్ట్రేషను ఫీజు వెయ్యి రూపాయలు వసూలు చేసింది. ఒక ఫాం ఇచ్చి వివరాలన్నీ నింపమన్నది. ప్రిఫరెన్స్ అన్నచోట ‘బ్యాంక్ జాబ్’ అని వ్రాశాడు. గోత్రం, శాఖ, వయసు, ఉద్యోగం అన్నీ నింపాడు. శాఖాభేదం లేదని నోట్ చేశాడు. సాహితిది ఫోటో ఒకటి ఆ ఫాంకు స్టేపిల్ చేసి దాన్ని ఒక ఫైల్లో పెట్టుకుండావిడ.

“మీకు సూటయినవి వస్తే ఫోన్ చేస్తా లెండి” అన్నది. సెలవు తీసుకొని వచ్చేశాడు. మురళీనగర్‌లో ఆదివరాహశర్మ అనే సిద్ధాంతి గారున్నారనీ, ఆయన జాతకాలు చూసి, నప్పితేనే, సంబంధాలు చెబుతాడనీ, హస్తవాసి చాలా మంచిదనీ, చాలా పెళ్లిళ్ళు కుదిరించాడనీ, కాలీజీలో బాటనీ మాస్టారు పన్నగభూషణ్ గారు చెబితే వెళ్ళి ఆయనను కూడా కలిశాడు. ఆయనకు ఎనభై సంవత్సరాలుంటాయి. దబ్బపండు ఛాయ. గోష్పాదమంత పిలక, మెడలో రకరకాల రుద్రాక్షమాలలు. ఒకదానికి చిన్న స్ఫటిక లింగం వేలాడుతున్నది. చెవులకు కుండలాలు. వంగపండు రంగు పంచె కట్టుకోని, పైన ఖరీదైన శాలువా కప్పుకున్నాడు. నిరంతర తాంబూల సేవనం వలన ఆయన పెదవులు, నాలుక, దవడలు ఎర్రగా ఉన్నాయి. ఆయన కనుబొమలు గుబురుగా ఉండి, చెవులకు కూడా వెంట్రుకలు మొలచి ఉన్నాయి. మాటిమాటికి నశ్వం (ముక్కుపొడుం) డబ్బా తెరిచి, చిటికెడు తీసి, ముక్కు లోకి పీలుస్తున్నాడు.

శ్యామలరావు వివరాలు చెబుతూంటే వినకుండా “ముందు జాతకం ఇవ్వండి” అన్నాడు. జాతకం రాయించలేదనీ, పుట్టిన తేదీ, సమయం, పుట్టిన ఊరు ఉన్నాయని చెప్పాడు శ్యామల రావు. “బ్రాహ్మణ పుట్టుక పుట్టి, జాతకం రాయించకుంటే ఎలా?” అన్నాడు తీవ్రమైన స్వరంతో. కొడతాడేమో అని భయమేసింది. “క్షమించండి” అన్నాడు చేతులు జోడించి. ఆయన ఆ చర్యతో ప్రనన్నుడైనాడు. వివరాలు ఒక పుస్తకంలో వ్రాసుకున్నాడు. ఆయన చేతివ్రాత ‘భారతీయుడు’ సినిమాలో ముసలి కమల్ హాసన్ చేతివ్రాతలా అనిపించి, నవ్వుకున్నాడు శ్యామల రావు.

ఆయన దగ్గర యాభై సంవత్సరాల క్రిందటి పంచాంగాలు కూడా ఉన్నాయట. ఇచ్చిన వివరాలని బట్టి ‘ప్రమాదీచ’ అనుకుంటూ షెల్ఫ్ లోంచి ఒక పాత పంచాంగం తీశాడు.

పదినిమిషాల్లో జాతక చక్రం తయారు చేసి మనసులో ఏవో గుణించుకున్నాడు.

“సమీప భవిష్యత్తులో, ఈ సౌభాగ్యవతికి వివాహయోగం అగుపించడం లేదు. ప్రతి ఆదివారం సుబ్రమణ్యస్వామికి క్షీరాభిషేకం చేయండి. రోజూ పదకొండు సార్లు సుబ్రమణ్యాష్టకం పారాయణ చేయండి. వివాహానికి అడ్డు తగులుతున్న కుజుడు శాంతించి అనుకూలుడవుతాడు” అన్నాడాయన.

“అయితే కుజదోషం..” అన్నాడు శ్యామల రావు తన మిడిమిడి జ్ఞానంతో.

“అని నేనన్నానా? మధ్యలో అధికప్రసంగం! కుజదోషం వేరు, కుజగ్రహ వ్యతిరేక దృష్టి వేరు” అన్నాడాయన కోపంగా.

అదేమిటో గాని ఆయన ఎంత దురుసుగా మాట్లాడినా శ్యామల రావుకు ఇబ్బందిగా లేదు. మహాపండితుడు; శాస్త్రాధ్యయనంలో పండిపోయిన ఆ విప్రోత్తమునికి ఆ మాత్రం కోపం ఉండటం సహజమనిపించింది.

“ఒక పక్షం దినాల అనంతరం కనిపించండి” అన్నాడు దూర్వాస మహాముని. జేబు లోంచి వంద రూపాయలు తీసి, వినయంగా ఆయన కివ్వబోయాడు. “ఏమిటిది?” అని అడిగాడు.

“ఏదో ఉడతాభక్తిగా తమరికి సంభావన..”

“ఉడతా లేదు, పిచుకా లేదు. నాకే సంభావన ఇచ్చేంత వాడివా నువ్వు? అసలు ద్రవ్యం స్వీకరిస్తానని నీకు చెప్పిన అప్రాచ్యుడెవరు? ధనం గ్రహిస్తే శాస్త్రం పనిచెయ్యదనే ప్రాథమిక సూత్రం కూడా తెలియకుండా కాలేజీ ప్రిన్సిపాల్ ఎలా అయ్యావు?” అని శ్యామల రావును ఎడాపెడా దులిపేశాడా విశ్వామిత్ర మహర్షి. “బి.ఎ. చదివావు, తేలు మంత్రం రాదా” అని వెనకటికి ఒక మామ్మగారు మనుమడిని తిట్టారట. ‘ఈ కాలంలో ఇలాంటి నిస్వార్థమైన వారు కూడా ఉంటారా’ అని అబ్బురపడ్డాడు. ఆయన తిట్టినందుకు కోపం రాలేదు సరికదా ఆయన మీద గౌరవం పెరిగింది.

హితోపదేశకారుడున్నట్లు యోగ్యుని, సమర్థుని కోపం లోకంలో గౌరవాన్నే పొందుతుంది.

“మీ గురించి తెలియక పొరపాటు పడ్డాను. నన్ను మన్నించండి” అంటూ వంగి ఆయన పాదాలు తాకాడు.

ఆయన శ్యామలరావు తలమీద చేయి పెట్టి “ఆయుష్మాన్ భవ” అని ఆశీర్వదించాడు. అంత కోపం ఎటు పోయిందో! ‘విప్రుల యలుకయు దృణహుతాశనంబు దీర్ఘమగునె’ అని మహాభారతంలో చెప్పినట్లుగా ఆయన కోపం గడ్డి మంట లాంటిదని, క్షణంలో చల్లారి పోతుందని గ్రహించాడు. లలితాంబకు, అదివరాహశర్మగారికి ఎంత తేడా ఉందో తెలిసింది. ముందు వెయ్యిరూపాయలిస్తేగాని ఫాం ఇవ్వలేదామె. డబ్బు ఇవ్వబోతే వద్దని తిడుతున్నాడు ఈయన!

“ఆందోళన చెందాల్సిన పని లేదబ్బాయ్! సుబ్రహ్మణ్యారాధన ఎంతో మహిమాన్వితమైనది. అది చేయి. శుభం కలుగుతుంది. నా మాట తీరుకు బాధపడకు నాయనా, కొంచెం ఆగ్రహం అనే లోటును నా వ్యక్తిత్వానికి ఆ లోకరక్షకుడు, పరాత్పరుడు ఆపాదించినాడు. వెళ్లిరా!” అన్నాడాయన మృదువుగా.

కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులకి ఉన్నట్లు కించిత్ ప్రథమ కోపమున్నూ ఆయనకు ఉందని ఆయనే ఒప్పుకున్నాడు. ‘తన లోటు తానెరుంగుట’ ఉత్తముల లక్షణం. చివర్లో ఆయన మాటలు, ఆయన శాంతచిత్తానికి నిదర్శనాలుగా ఉన్నాయి.

“పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము/మనంబు నవ్వనవనీత సమానము!” అని నన్నయభట్టారకుడు ఆదిపర్వము లోని ఉదంకోపాఖ్యానములో బ్రాహ్మణుల గురించి చెప్పిస్తాడు.

సరిగ్గా వారం రోజుల తర్వాత, లలితాంబగారు ఫోన్ చేసింది. ఏలూరులో ఒక సంబంధం ఉందనీ, కర్రవాడు బ్యాంక్ ఆఫ్ బరోడాతో విజయవాడలో పనిచేస్తున్నాడనీ, అమ్మాయి వివరాలు, ఫోటో, వాళ్లకు పంపాననీ, వారి వివరాలు శ్యామల రావుకు వాట్సాప్‌లో పెట్టాననీ, చూసుకొమ్మని చెప్పింది.

ఓపన్ చేసిచూశాడు. పిల్లవాడు బాగున్నాడు. తండ్రి, యల్.ఐ.సి.లో పనిచేస్తున్నాడు ఏలూరులోనే. అబ్బాయికి ఒక అక్క. ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది. వధూవరులు ఇద్దరికీ మూడేళ్లు తేడా. లలితాంబ గారి లెక్కప్రకారం జాతకాలు సరిపోయాయి. రెండు వైపుల శాఖ నో బార్.

పిల్లవాడి ఫోటో సాహితికి పంపాడు. నాట్ బ్యాడ్ అని కామెంట్ పెట్టింది. ‘అంటే గుడ్ అని అనుకోవచ్చు’ అనుకున్నాడు. సాత్విక్ కూడా ఓకే చేశాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version