[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[శ్రీకాకుళంలో మీటింగ్ పూర్తి చేసుకుని ఇల్లు చేరుకుంటాడు శ్యామల రావు. రాత్రి టిఫిన్ చేసి టీవీలో సినిమా చూస్తుండగా సాత్విక్ సెల్ నుంచి ఫోన్ వస్తుంది. ఆన్ చేయగా, సాత్విక్ ఫ్రెండ్ అబ్బరాజు మాట్లాడుతాడు. సాత్విక్‌కి చిన్న యాక్సిడెంట్ అయిందని, మోకాలికి దెబ్బ తగిలిందని, పోలీస్ బారక్స్ దగ్గరున్న ఓ ఆర్థోపెడిక్ సర్జన్ వద్దకి తీసుకెళ్ళామని, కంగారు పడవద్దని చెప్తాడు. వెంటనే శ్యామల రావు బయల్దేరి ఆ హాస్పటల్‌కి వెళ్తాడు. డాక్టర్‌తో మాట్లాడి ప్రమాదమేదీ లేదని నిర్ధారించుకుంటాడు. సిమెంటు కట్టు కట్టి, నీ బ్రేస్ వేసుకోమంటాడు డాక్టర్. ఒక్కరోజు కదలకుండా ఉంచి, ఆ మరునాడు నుంది ఇంట్లోనే అటూ ఇటూ నడిపించమంటాడు. సాత్విక్‌ని జాగ్రత్తగా ఇంటికి చేరుస్తాడు. మర్నాడు డి.ఇ.వో. గారి ఫోన్ చేసి ఓ వారం సెలవు పెడతాడు. కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటాడు. పది రోజులకి సాత్విక్‌కి పూర్తిగా నయమైపోతుంది. తండ్రి తన పట్ల చూపిన కన్సర్న్ సాత్విక్‌ని కదిలిస్తుంది. పై చదువులకి అమెరికా వెళ్ళాలన్న తన ఆలోచనను విరమించుకుని, తండ్రి తోనే ఉండాలని నిశ్చయించుకుంటాడు. సాహితి ఉద్యోగంలో చేరి ఏడాది పూర్తవుతుంది. సి.ఎ.ఐ.ఐ.బి. పరీక్ష పాసవుతుంది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా చేస్తుంది. కూతురికి పెళ్ళి సంబంధాలు వెతకడం ప్రారంభిస్తాడు శ్యామల రావు. ఓ మాట్రిమోనియల్ సర్వీస్ చేసే లలితాంబ గారికి సాహితి వివరాలిస్తాడు. చిన్నప్పుడు రాయించలేదని, సాహితి జాతకం రాయించడానికి ఆదివరాహశర్మ అనే సిద్ధాంతిని కలుస్తాడు. ఆయన పాత పంచాగం తీసి, పుట్టిన తేదీ, సమయం, పుట్టిన ఊరు తెలుసుకుని, పది నిమిషాల్లో జాతక చక్రం రాసిస్తాడు. పాపకి కుజగ్రహ వ్యతిరేక దృష్టి ఉందని, సుబ్రహ్మణ్యారాధన చేయమని చెప్తాడు. లలితాంబ ద్వారా ఓ సంబంధం వస్తుంది. పిల్లవాడి ఫోటో చూసి, నాట్ బ్యాడ్ అని జవాబిస్తుంది సాహితి. సాత్విక్ కూడా ఓకే అంటాడు. – ఇక చదవండి.]
మర్నాడు ఆయన నంబరుకు ఫోన్ చేసి మాట్లాడాడు. తన గురించి, తన కుటుంబం గురించి చెప్పాడు. అబ్బాయికి అమ్మాయి ఫోటో చూపిస్తామనీ, ప్రతి ఆదివారం విజయవాడ నుంచి వచ్చి పోతుంటాడనీ చెప్పాడాయన. కొన్ని రోజులకి పాజిటివ్ రిప్లయ్ వచ్చింది. అమ్మాయిని చూసుకోడానికి రమ్మని ఆహ్వానించాడు శ్యామల రావు. దానికీ మంచిరోజు చూడాలేమో అంటే “ఉద్యోగాలు చేసుకొనే వారికి ఆదివారం కంటే మంచిరోజు ఎక్కడుంటుంది?” అని నవ్వాడాయన.
వచ్చే ఆదివారమే వస్తామని ఉదయం ‘రత్నాచల్’లో బయలుదేరి మధ్యాహ్నం చేరుకుంటామని చెప్పాడు. వారికి చిత్రాలయ థియేటర్ రోడ్డులో ఒక ఎ.సి. రూం బుక్ చేశాడు శ్యామల రావు. సాత్విక్ వెళ్లి వారిని రిసీప్ చేసుకొని, హోటల్లో దింపి వచ్చాడు. వాళ్ళు లంచ్ చేసి, కాసేపు రిలాక్స్ అయి, నాలుగు గంటలకు వస్తామన్నారు. సాత్విక్‌కు కారు డ్రయివింగ్ వచ్చేసింది. మరో మూడు నెలల్లో కుతూహలమ్మగారు రాబోతున్నారు కూడా. సాత్విక్ మూడు గంటలకే బయలుదేరి వాళ్ళను తీసుకురావడానికి వెళ్లాడు. సాహితి శనివారం రాత్రి ఈస్ట్‌కోస్ట్‌కు వచ్చేసింది. మురళి వసంత కూడా ఆదివారం ఉదయాన్నే వచ్చేశారు.
వారికోసం రవ్వకేసరి, పొట్లకాయ బజ్జీలు తయారు చేసింది వసంత. రస్నా పాకెట్ తెప్పించి రడీగా ఉంచుకున్నారు. నాలుగున్నరకు వాళ్ళు వచ్చేశారు. అబ్బాయి ఫోటోలో కంటే బాగున్నాడు. వాళ్లను సాదరంగా రిసీవ్ చేసుకొని, స్నాక్స్ పెట్టారు. రస్నా కలిపి యిచ్చారు.
“సిటీకి చాలా దూరమండీ బాబూ!” అన్నాడు అబ్బాయి వాళ్ల చిన్నాన్న.
‘లేకపోతే జగదాంబ సెంటర్‌లో కట్టుకుంటారనుకున్నాడో ఏమో!’ అని నవ్వుకున్నాడు సాత్విక్.
సాహితి మెరూన్ కలర్ చీర, మ్యాచింగ్ జాకెట్టు వేసుకుంది. తలలో జాజుల మాల పెట్టుకుంది. వచ్చి సింగిల్ సోఫాలో వారికి అభిముఖంగా కూర్చుంది. వరుని తల్లి కొన్ని ప్రశ్నలు వేసింది.
ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకొమ్మని చెప్పారు పెద్దలు. గదిలోకి తీసుకెళ్లింది సాహితి అతన్ని. పదినిమిషాల తర్వాత ఇద్దరూ బయటికి వచ్చారు. అబ్బాయి ముఖం ప్రసన్నంగా ఉంది. అమ్మాయిు ముఖం భావరహితంగా ఉంది. కాసేపుండి వాళ్ళు వెళ్ళిపోయారు. దింపి రావడానికి మళ్లీ సాత్విక్ వెళ్లాడు. సాహితికి నచ్చాడో లేదో అడగమని వసంతకు చెప్పారు. “ముందు వాళ్లేమంటారో చూద్దాం అత్తా!” అన్నదట.
మర్నాడు ‘జన్మభూమి’కి వాళ్లు వెళ్లిపోయారు. నాలుగు రోజుల తర్వాత శ్యామల రావు కాలేజీలో ఉండగా ఫోన్ వచ్చింది. ఆయనే! “మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది. అమ్మాయికి కూడ ఓ.కె. అయితే, ప్రొసీడ్ అవుదాం” అన్నాడాయన.
‘నా బంగారు తల్లికి నచ్చకపోతే ఆశ్చర్యపడాలి!’ అనుకున్నాడు శ్యామల రావు. లంచ్ బ్రేక్‍లో సాహితికి ఫోన్ చేశాడు. అతని గొంతులో ఆనందం!
“తల్లీ! నీవు వాళ్లకు నచ్చావుటమ్మా! మరి నీ అభిప్రాయం కూడా చెబితే, ప్రొసీడవుదాం!”
అట్నుంచి కాసేపు మౌనం!
“సాహితీ!” అని పిలిచాడు. “లైన్లో ఉన్నావా?”
“ఉన్నాను నాన్నా! అయాం సారీ! నాకు ఆ అబ్బాయి నచ్చలేదు!”
“అదేంటమ్మా! మంచి సంబంధం..”
“ప్లీజ్ డోంట్ కంపెల్ మీ, నాన్నా! బేర్ విత్ మీ” అని కట్ చేసింది బంగారు తల్లి! శ్యామల రావు డల్ ఐపోయాడు. ‘ఇదేమిటి? ఇలా మాట్లాడుతుంది?’ అనుకున్నాడు.
సాత్విక్ అక్కను బలపరచాడు. “పోనీలే నాన్నా, అక్కకి ఇష్టం లేదంది కదా! వదిలెయ్యండి!” అన్నాడు.
మురళి అన్నాడు ఫోన్‍లో – “మన కాలాలు కాదుగా బావా! ఈ జనరేషన్ ఆలోచనలు వేరు. పోనివ్వండి. బోలెడు సంబంధాలు వస్తాయి ఇంకా!”
శ్యామల రావుకు ఆదివరాహశర్మగారు గుర్తొచ్చారు. ‘ఈ కుజుడి సంగతేదో చూడాలి’ అనుకొని మర్నాటి నుంచి సుబ్రహ్మణ్యాష్టక పారాయణం ప్రారంభించాడు. మధురవాడలోని ఒక శివాలయంలోని ఉపాలయం కొలువై ఉన్న, సర్పరూపంలో ఉన్న స్వామికి ఆదివారం వెళ్లి అభిషేకం చేయించాడు. మనసు కొంచెం నిమ్మళించింది.
మురళి ఒక సంబంధం తెచ్చాడు. కుర్రవాడు తుని ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో జూనియర్ ఇంజనీర్ – అదీ మంచి సంబంధమే. దాన్ని ఫోటో చూసి తిరస్కరించింది సాహితి.
ఆదివరాహశర్మగారి వద్దకు వెళ్లాడు. ఆయన జాతకం మరొకసారి చూసి వచ్చే సంవత్సరం ఆగస్టులోగా వివాహం అయిపోతుందని, సంబంధాలు చూడటం కొనసాగించమని చెప్పాడు. అంటే దాదాపు సంవత్సరం టైముంది. సుబ్రహ్మణ్యోపాసన మానొద్దని చెప్పాడు.
ఆయన కూడ ఒక సంబంధం చెప్పాడు. జాతకాలు కూడా సరిపోయాయట – అబ్బాయి వాళ్లది వైజాగే! వాళ్ళు మర్రిపాలెంలో ఉంటారు. అబ్బాయి స్టీల్ ప్లాంట్‌లో ఇంజనీరు. తండ్రి లేడు. ఒక్కడే కొడుకు. తల్లి భాష్యం స్కూల్లో టీచరు.
వచ్చి అమ్మాయిని చూశారు వాళ్ళు. అబ్బాయికి నచ్చింది సాహితి – కాని సాహితికి నచ్చలేదు. కాలం గడిచే కొద్దీ శ్యామల రావుకు దిగులు ప్రారంభమయింది. ఎందుకిలా చేస్తూంది?
కుతూహలమ్మగారు వచ్చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో కాన్వెంటు జంక్షన్ ప్రాంతంలో ఒక అపార్టుమెంటు కొనుక్కున్నారు. కారు పంపించేశాడు శ్యామల రావు. ఒక రోజు ఆమెతో తన మనసులోని బాధను చెప్పుకున్నాడు.
ఆమె నవ్వి.. అన్నది – “శ్యామూ! నీవు అమ్మాయిని ప్రెషర్ పెట్టకు. ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి. ఒకరోజు కూర్చోబెట్టుకొని ప్రశాంతంగా అడుగు. అమ్మాయి ఎవర్నయినా ప్రేమించిందేమో? నీకు చెప్పడానికి జంకుతుందేమో? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో! తల్లి లేని పిల్ల. అన్నీ నీవే దానికి. ఏ మాత్రం హర్ట్ చేయకుండా మాట్లాడాలి సుమా! ఒకవేళ మనసు విప్పి చెప్పిందనుకో! ఒప్పేసుకో. అంత చదువుకుంది, ఉద్యోగం చేస్తున్నది, తన జీవితాన్ని తాను చక్కదిద్దుకోలేదా ఏమిటి? తల్లిదండ్రులు చెప్పినట్లు వినే కాలాలా ఇవి?”
శ్యామలరావు ఆలోచించాడు. నిజమే మరి. అదేమిటో వచ్చిన సంబంధాలన్నీ తనకు బాగానే ఉన్నాయనిపిస్తుంది. అమ్మాయి వైపునించి కూడా ఆలోచించాలి కదా!
ఒక శనివారం రాత్రి సాహితి నర్మదతో బాటు ఒక అబ్బాయిని తీసుకొచ్చింది వైజాగ్‌కి. తమ బ్రాంచ్ లోనే ప్రొబేషనరీ ఆఫీసరుగా పని చేస్తున్నాడని, మంచి ఫ్రెండ్ అనీ చెప్పింది. వాళ్లు ఉత్తరాది వాళ్లుట. ఒరిజినల్ హర్యానా ఐతే, హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారుట. వాళ్ల నాన్నగారు అఫ్జల్‌గంజ్‌లో ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తారట. మలక్‍పేటలో వాళ్లకు సొంత యిల్లు, కారు ఉన్నాయట. తమ్ముడున్నాడు. సాత్విక్ లాగా ఇంజనీరింగ్ చదువుతున్నాడట ఇబ్రహీంపట్నం దగ్గర గురునానక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. విశాలమైన నుదురు, ఒతైన క్రాఫ్. తెలివితేటలు ప్రతిఫలిస్తున్న కళ్ళు. అతని పేరు గిరిధర్ లాల్ చౌతాలా అట. నాన్న గారి పేరు మేఘశ్యామ్‌లాల్ చౌతాలా. తమ్ముడి పేరు మదన్‌మోహన్ లాల్ చౌతాలా. అమ్మ పేరు మహానందాదేవి.
“అంకుల్, అంకుల్” అంటూ కలిసిపోయాడా అబ్బాయి. తెలుగు వచ్చుగాని, అదొక రకంగా మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ మాత్రం అద్భుతంగా ఉంది. హిందీ కూడా బాగా మాట్లాడతాడని సాహితి చెప్పింది. వీళ్లకు హిందీ అసలు రాదు. అతనితో సన్నిహితంగా మెలుగుతూంది. అతనితో మాట్లాడుతూన్నపుడు ఆ అమ్మాయి కళ్లతో వెలుగు.
శ్యామల రావుకు లీలగా అర్థమవుతూ ఉంది. కాని తానే బయటపడటం ఎందుకని మిన్నకున్నాడు. అతనికి రైస్ అంత అలవాటు లేదని చపాతీలు చేసింది. బంగాళాదుంపలు, బటాణీలు తెప్పించి కూర చేసింది. మామూలుగా అయితే వీకెండ్స్‌లో వచ్చినపుడు వంట చెయ్యదు. నాన్న చేసిపెడితే తింటుంది. సాత్విక్ అక్కను, ఆ అబ్బాయిని గమనిస్తూ ఉన్నాడు.
సోమవారం జన్మభూమికి ముగ్గురూ వెళ్లిపోయారు. శ్యామల రావు మూడీగా ఉండటం చూసి సాత్విక్ అడిగాడు “ఏంటి నాన్నా, అలా వున్నారు?”
“సాహితి మనసులో ఏముందో అర్థం కావడం లేదురా! వాళ్లు రాకపోయి ఉంటే కూర్చోబెట్టి ప్రశాంతంగా అడిగేద్దాం అనుకున్నాను.”
“అందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్నా! షి ఈజ్ ఇన్ లవ్ విత్ హిమ్! చూస్తూంటే తెలియడం లేదూ!” వాడిలో అస్సలు సీరియస్‍నెస్ లేదు. చాలా క్యాజువల్‌గా చెబుతున్నాడు. అక్క ప్రేమ వ్యవహారం నిజమైతే వాడు సపోర్టు చేసేలా ఉన్నాడు.
తల పట్టుకున్నాడు శ్యామల రావు! “తండ్రీ! వరాహనరసింహా! ఎంత సమస్య తెచ్చిపెట్టావు?” అన్నాడు బయటికే. “మీ అమ్మ ఉండి ఉంటే నాలుగు చీవాట్లేసి, అలాంటి పిచ్చి వేషాలు మన యింట్లో పనికిరావని కచ్చితంగా చెప్పి ఉండేది!” అన్నాడు కొడుకుతో.
వాడు గట్టిగా నవ్వాడు! “బయట ఏం జరుగుతోందో నీకు అసలు ఎక్స్‌పోజర్ లేదు నాన్నా. ఒక్కసారి మా గీతం కాలేజికి రా! అబ్బాయిలు అమ్మాయిలూ ఎంత క్లోజ్‌గా మూవ్ అవుతుంటారో చూద్దువుగాని! ఇక అమ్మే ఉంటే.. ఇవన్నీ హైపోతిటికల్ ఐడియాస్ నాన్నా. ‘అమ్మాయి యిష్టపడుతూంది. చేసీద్దామండి. అది సంతోషంగా ఉండడమేగా మనకు కావాల్సింది!’ అనేదేమో?” అన్నాడు.
“నేనింత బాధపడుతూ ఉంటే నీకు ఆటగా ఉందేమిట్రా?”
“ఆట కాదు నాన్నా, హార్డ్ రియాలిటీ! ఇంటర్‌కేస్ట్ మ్యారేజీలంటే ఒకప్పుడు న్యూస్. మరి ఇప్పుడు? యాజ్ నాచురల్ యాజ్ బ్రీతింగ్!”
అదీ జనరేషన్ గ్యాప్ అంటే! దాన్ని భరిస్తే పేరెంట్స్, చిల్డ్రన్ హ్యాపీ! లేకపోతే మిజరబుల్!
రెండు రోజులు గడిచాయి. కుతూహలమ్మగారి వద్దకు వెళ్లి చర్చించాడు. అమ్మాయి ఇష్టానికి విరుద్ధంగా వెళ్లొద్దని మరీ మరీ చెప్పిందామె. మురళి కూడా “చూద్దాం! తనంతట తాను బయటపడని” అన్నాడు.
ఆరోజు ఆదివారం. సాత్విక్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. శ్యామల రావు సెల్ మోగింది. ఇడ్లీకి పెట్టి, కొబ్బరి చట్నీ కోసం కొబ్బరి ముక్కలు తీస్తున్నాడు. సాత్విక్ పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర సన్నగా తరుగుతున్నాడు మిక్సీలో వేయడానికి.
ఫోనెత్తి “హలో, హు ఈజ్ స్పీకింగ్?” అని అడిగాడు.
“ఆప్ శ్యామల్ రావ్ హైనా? మై హైదరాబాద్ సే మేఘశ్యామ్ బోల్ రహా హు! నమస్కార్” అని వినపడింది. “రాంగ్ నంబర్!” అని కట్ చేయబోయి, ఆ అబ్బాయి నాన్నగారి పేరు అదే అని గుర్తొచ్చి, “నమస్తే. చెప్పండి” అన్నాడు.
“కృపా కర్‍కే హిందీ మే బాత్ కీజియే” అన్నాడాయన.
“ఇట్ విల్ బి కంఫర్టబుల్ ఫర్ మీ ఇన్ ఇంగ్లీష్.”
అవతల పెద్దమనిషికి అర్థమయింది కాని అంత ఇంగ్లీషు రాదు. సాత్విక్‌కి పరిస్థితి అర్థమై “స్పీకర్‍లో పెట్టండి నాన్నా” అని చెప్పాడు, గీతం లోని కొందరు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వల్ల అతనికి కొద్దో గొప్పో హిందీ వచ్చును.
“బోలియే జీ! మై శ్యామల్ రావ్ జీ కా బేటా హు! మేరా నామ్ సాత్విక్ హై” అన్నాడు.
“ముఝే మాలుం హై బేటా!! తుమ్ పితాజీ కో మేరే బాత్ సమజావోగే క్యా?”
“జరూర్. బోలియే”
“హమారా బేటా గిరిధర్ లాల్ ఆప్ కీ బేటీ సాహితీ సే ప్యార్ కర్ రహా హై. వోభీ ఇన్ సే ప్యార్ మే హై.”
“మా అబ్బాయి..” అంటూ సాత్విక్ వివరించబోతుంటే “అర్థమైంది. ఆయన్ను చెప్పనివ్వు” అన్నాడు శ్యామల రావు.
“హమ్ గిరిధర్ కో సమఝానేకీ కోశిష్ కియే థే. ఫిర్ వో హమారా బాత్ నహీ సున్ రహా హై. ‘సాహితీ కే అలవా కిసీ కో షాదీ నై కరూంగా’ బోల్ రహా హై – ఆప్ బ్రాహ్మిన్ లోగ్ హై, హమ్ తో జాట్స్ హై! కేస్ట్, ఏరియా, కల్చర్ పూరా అలగ్ హై.”
శ్యామలరావు మళ్లీ అర్థమైందని తల ఊపాడు.
“హమ్ బహుత్ దిన్ సే సోచ్ రహే హైఁ. అంత్ మే హమ్ ఫైసలా కియే థే. బచ్చోం కీ ఖుషీ హమ్ దోనోం పరివారోం కో ప్రధాన్ హై. ఇసీలియే హమ్ ఆప్ సే రిస్తేదార్ బన్‌నే కేలియే తయ్యార్ హైఁ. ఆప్ ఆప్ కీ సమ్మతీ దీజియే శ్యామల్ రావ్ జీ. మై హాథ్ జోడ్ కే మాంగ్ రహా హు!” అన్నాడాయన.
“ఆప్ లైన్ మే రహియే జీ” అని సాత్విక్ ఆయనకు చెప్పి,
“ఏం చెబుదాం” అని అడిగాడు తండ్రిని.
“రెండు రోజులు టైమిమ్మను. ఆలోచించి చెబుతామని చెప్పు.”
“హమ్ కో దో దిన్ టై౦ దీజీయే మేఘశ్యాం జీ. హమారా పితాజీ సోచ్ కర్ ఆప్ సే బోలేంగే..”
“ఠీక్ హై, ధన్యవాద్” అని పెట్టేశాడాయన.
“చూసావా రా అక్క గడుసుదనం, తాను చెప్పకుండా వాళ్లతో అడిగిస్తూంది చూడు.”
“ఆ అబ్బాయి చేసుకుంటే అక్కనే చేసుకుంటాను తప్ప లేకపోతే పెళ్ళే చేసుకోను అన్నాడట నాన్నా!”
“అదీ అర్థమయింది లే. నాకు నీలాగా మాట్లాడటం రాదుగాని, ఆయన చెబుతున్నవన్నీ తెలుస్తున్నాయి. అక్కకు ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మను. ఒక్కదాన్నే రమ్మను. సోమవారం సెలవు పెట్టమను!”
సాత్విక్ తన సెల్ ఫోన్ చేసి నుంచి అలాగే చెప్పాడు. “ప్రశాంతికి బయలుదేరుతుందట వెంటనే” అన్నాడు.
ఈ వ్యవహారం జరుగుతూ ఉంటే చీమ కుట్టినట్లయినా లేదు వాడికి. చాలా సహజంగా, ఆహ్వానించదగ్గ పరిణామంలా అనిపిస్తూంది.
నాన్న మనసు బాగోలేదని గ్రహించి వాడే మిక్సీలో చట్నీ వేసి రుబ్బాడు. పోవు పెట్టాడు. ఇడ్లీ స్టాండ్స్ బయటకు తీసి ప్లేటులో రెండిడ్లీలు, చట్నీ వేసి నాన్నకిచ్చాడు. ఆడ దిక్కులేని సంసారంలో పిల్లలకు అన్ని పనులూ వచ్చి ఉంటాయి మరి.
“నాకో తినాలని లేదు. నీవు తినెయ్యి” అన్నాడు శ్యామల రావు.
చిన్నపిల్లాడిలా అలిగిన తండ్రిని చూసి నవ్వొచ్చింది సాత్విక్‌కి. “తిండి మానేసేంత సీన్ ఇప్పుడేం జరిగింది? వాళ్ల వాళ్లను కూడా వప్పించి, తండ్రి తోనే అడిగిస్తున్నాడంటే, ఆ అబ్బాయి సంస్కారం తెలుస్తోంది కదా నాన్నా. ఆయన కూడా ఎంత మర్యాదస్తుదో చూడు. కొడుకు సంతోషం కోసం ఎంత తపన పడుతున్నాడో!”
ఎంతో బాలెన్స్‌డ్‌గా, మెచ్యూర్డ్‌గా పరిస్థితిని విశ్లేషిస్తున్న కొడుకును చూసి గర్వపడ్డాడు. తన ముందు పుట్టి పెరిగిన పసి వెధవ ఎంత బాగా ఆలోచిస్తున్నాడు!
లేచి కొడుకు దగ్గరకు వెళ్లి వాడిని కౌగిలించుకున్నాడు. “నాకెందుకో భయమేస్తూందిరా నాన్నా” అన్నాడు జీరగా.
సాత్విక్ తండ్రి వీపు నిమురుతూ ఆయనకు సాంత్వననిచ్చాడు. ఆ క్షణంలో వీళ్లిద్దరూ తండ్రీకొడుకుల పాత్రలు మార్చుకొన్నట్లు ఉంది. “ఎందుకు నాన్నా భయం! అక్కను మనం అప్రిసియేట్ చెయ్యాలి. సపోర్టు చేయాలి. రెండుగంటల కల్లా వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు. సూటిపోటి మాటలు అస్సలు అనకూడదు. సంతోషంగా ఒప్పుకో. కుతూహలమ్మ గారి మాటంటే నీకు చాలా గౌరవం కదా! మరి ఆమె ఏమంటోంది?”
‘ఆమె కూడ సాహితినే సమర్థిస్తోందిరా!”
“చూశావా, ఎనీ రైట్ థింకింగ్ పర్సన్ విల్ సపోర్ట్ మై సిస్టర్. చీరప్ మై డాడ్! బీ పిపేర్డ్ టు ఫేస్ యువర్ డాటర్ అండ్ అస్యూర్ హర్ ఆఫ్ యువర్ హోల్ హార్టెడ్ కన్సెంట్!”
“ఏమిట్రోయ్, సడెన్‌గా ఇంగ్లీషులోకి దిగిపోయావు!” అన్నాడు శ్యామల రావు. అతని ముఖం తేటగా మారింది. పెదవుల మీద సన్నని చిరునవ్వు మెరిసింది.
“ఏంటో అలా వచ్చేసింది. హనుమంతుని ముందు కుప్పిగంతులు వేశానా ఏంటి?”
“అదేం లేదులే. అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు.”
“ఈ రోజు వంట వద్దు. నేను బండి మీద వెళ్లి మధురవాడలోని మీనాక్షి మెస్‍లో అందరికీ లంచ్ పార్సల్ చేయించుకొస్తా.”
“వద్దురా! ఊరికే కూర్చుంటే పిచ్చి ఆలోచనలు వస్తాయి నాకు. ఇంకా పదకొండు కూడా కాలేదు. వంట చేసేస్తా. నీవు హెల్ప్ చేయి.”
“అయితే అక్కకిష్టమయిన దోసకాయ పప్పు, వంకాయ స్టఫ్ చేద్దాం నాన్నా! నేను కొమ్మాది జంక్షన్‍కు వెళ్లి జీడిపప్పు పకోడీ పావు కిలో పట్టుకొస్తా.”
“అది నీ కిష్టమని కాబోలు!” సాత్విక్ నవ్వాడు! వాడి నవ్వులో వెన్నెలలువిరిశాయి!
రెండుంబావుకు సాహితి వచ్చింది. ఆ అమ్మాయి ముఖంలో సీరియస్‌నెస్! ‘బహుశా గిరిధర్ వాళ్ల నాన్నగారు ఫోన్ చేసి ఉంటారు. అందుకే హుటాహుటిన తనను రమ్మన్నారు. అటువైపు ఓ.కె. చేసేశారు. మరి నాన్న ఏమంటారో! రెండు రోజులు టైమివ్వమని అడిగారని గిరిధర్ చెప్పాడు. అంటే కాదని చెప్పలేదనేగా!’ ఇలా పరి పరి విధాలుగా ఆలోచిస్తూంది ఆ అమ్మాయి మనసు.
తండ్రి హల్లోనే ఉన్నాడు. సాహితిని పలుకరించ లేదు. సీరియస్‍గా చూస్తున్నాడు.
“అక్కా, వచ్చేశావా, కాళ్లుచేతులు కడుక్కో త్వరగా, భోం చేద్దాం” అన్నాడు సాత్విక్.
‘సిచుయేషన్ ఎలా వుంది?’ అన్నట్లు తమ్ముని వైపు చూసింది. ‘ఆల్ ఈజ్ వెల్’ అన్నట్లు సైగ చేశాడు. నాన్న చూపిస్తున్న బిల్డప్ చూసి నవ్వుకున్నాడు.
డైనింగ్ టేబుల్ దగ్గర పదార్థాలన్నీ తనకిష్టమైనవే చేశాడు నాన్న. మరి ఈ మౌనం? భోజనాలు ముగిశాయి. డైనింగ్ టేబుల్ సర్ది, అంట్లు గిన్నెలన్నీ సింకులో వేసింది సాహితి, గుడ్డతో టేబులంతా శుభ్రంగా తుడిచింది.
‘నాన్నా కూతురూ ఒకర్ని మించి ఒకరు బిల్డప్ ఇస్తున్నారు’ అనుకొని నవ్వుకున్నాడు తమ్ముడు.
ముగ్గురూ హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు.
“నాన్నా, రమ్మన్నారట. తమ్ముడు ఫోన్ చేశాడు.”
“అవును చాలా పెద్దదానివయ్యావు కదా! నీకు నాన్నతో పనేముంది? నీ జీవితం నీ యిష్టం!”
ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది సాహితికి. “అలా అనకండి నాన్నా, మీకిష్టం లేకపోతే..”
“ఇంతవరకు తెచ్చి ఇప్పుడు బ్లేమ్ నా మీద వేద్దామనుకుంటున్నావా?”
సాత్విక్ నవ్వుతూ అన్నాడు. “నాన్నా, ఇక ఆపితే మంచిదేమో? చూడలేకపోతున్నా నీ ఓవరాక్షను!”
“ఇదంతా నటనా?” అని ఆశ్చర్యంగా చూసింది తండ్రి, వైపు. ఆయన కళ్ల ప్రేమనంతా నింపుకొని కూతురివైపు చేతులు చాచాడు. ఒక్క ఉదుటున వచ్చి నాన్న చేతుల్లో ఒదిగిపోయింది.
“థాంక్యూ నాన్నా!” అంది వెక్కుతూ.
అమ్మాయి వీపు లాలనగా నిమురుతూ, “పిచ్చి తల్లీ! నీవంత యిష్టపడుతుంటే కాదంటానా?” అన్నాడు.
“అక్కా, నీవు కుతూహలమ్మ మేడంకి, నాకు థాంక్స్ చెప్పుకోవాలి. ఒక పట్టాన దారికి వచ్చాడా పిన్సిపాల్ గారు!”
బుగ్గలమీద కన్నీటి చారికలతో, తండ్రి మెడచుట్టూ చేతులు వేసి, ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టింది. “ఐ లవ్ యు డాడ్!” అంది.
వాళ్ల కుటుంబం గురించి చెప్పింది. గిరి చాలా మంచివాడట. ప్రపోజ్ చేశాడట అతనే. కాని ‘బోత్ సైడ్స్ అంగీకరిస్తే కాని మనం ప్రొసీడ్ అవకూడదు సాహీ’ అన్నాడట. వారి ప్రేమ చిగురించి సంవత్సరం దాటిందట.
“అందుకేనా తెచ్చిన సంబంధాలన్నీ తిరగ్గొట్టేదానివి! ముందే చెప్పి ఉండొచ్చు కదా!” అన్నాడు తమ్ముడు.
“నాన్న మనసు కష్టపెట్టుకుంటాడేమో అని చెప్పడానికి జంకానురా” అన్నది అక్క.
“మేఘశ్యామ్ గారికి ఫోన్ చెయ్యి నాన్నా! మాట్లాడేదాద్దాం. శుభస్యశీఘ్రం అని, ఆలస్యం చేయడం ఎందుకు?” అన్నాడు సాత్విక్.
తండ్రి ఫోన్ నుంచి కాల్ చేశాడు. ఆయన లిప్ట్ చేశాడు.
“అంకుల్, హమారా పితాజీ ఆప్ సే బాత్ కరనా చాహ్‌తే హై!” అని తండ్రికి ఇచ్చాడు.
“నమస్తే శ్యామ్ గారు. హమ్.. హమ్ భీ, సోచ్‍నే కే బాద్.. ఆప్ సే.. రిస్తా.. కర్నే కే లియే.. డెసిషన్ లియే” అన్నాడు తన కొచ్చిన హిందీని జాగ్రత్తగా వాడుతూ.
“బహుత్ ఖుషీ కీ బాత్ హై శ్యామల్ జీ! ఫోన్ సాత్విక్ కో దీజియే” అన్నాడు ఆయన.
“ఏక్ బార్ ఆప్ లోగ్ హైదరాబాద్ ఆజాయియే. హమారా ఖాన్‍దాన్ దేఖ్ సక్తే హైఁ. బాద్ మే హమ్ భీ విశాఖపట్నమ్ ఆజాయేంగే” ఫోన్ స్పీకరులో ఉంది.
తండ్రి సరే అని చెప్పమని సైగచేశాడు.
“జరూర్ ఆయేంగీ సర్ జీ, అనేవాలీ ఐత్‍వార్ హమ్ హైదరాబాద్ ఆయేంగే.”
“ఆప్ కే లియే ఇంతజార్ కరేంగే. ఆప్ కో స్వాగత్ హై. ధన్యవాద్!”
అక్క వైపు థమ్స్ అప్ సైన్ చూపించాడు తమ్ముడు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
