[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[లలితాంబ ద్వారా వచ్చిన సంబంధం వాళ్ళు వచ్చి సాహిత్ని చూసి వెళ్తారు. నాలుగు రోజుల తర్వాత, పెళ్ళికొడుకు తండ్రి ఫోన్ చేసి తమకి అమ్మాయి నచ్చిందని, అమ్మాయికి ఓకె అయితే ప్రొసీడవుదామని అంటాడు. శ్యామల రావు సాహితికి ఫోన్ చేస్తే, తనకా సంబంధం నచ్చలేదని, తనని ఒత్తిడి చేయద్దని అంటుంది. సాహితికి ఇష్టం లేకపోతే, బలవంతం చేయద్దని, సాత్విక్, మురళి అంటారు. ఆదివరాహశర్మగారు చెప్పినట్టు సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేస్తాడు శ్యామల రావు. మరికొన్ని సంబంధాలొస్తాయి, కానీ అవేవీ సాహితికి నచ్చవు. సాహితి తీరు గురించి కుతూహలమ్మ గారితో చెప్పుకుంటాడు శ్యామల రావు. అమ్మాయి ఎవరినైనా ఇష్టపడిందేమో కనుక్కోమంటారావిడ. ఒక శనివారం రాత్రి సాహితి నర్మదతో బాటు ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొస్తుంది. తన బ్రాంచ్ లోనే ప్రొబేషనరీ ఆఫీసరుగా పని చేస్తున్నాడని, మంచి ఫ్రెండ్ అనీ చెప్తుంది. అతని పేరు గిరిధర్ లాల్ చౌతాలా. శ్యామల రావుకు లీలగా అర్థమమవుతుంది కానీ, తనంతట తాను బయటపడడు. ఓ వారం తరువాత హైదరాబాద్ నుంచి గిరిధర్ తండ్రి మేఘశ్యామ్ లాల్ ఫోన్ చేసి పరిచయం చేసుకుంటాడు. తన కొడుకు సాహితినే పెళ్ళి చేసుకుంటానని పట్టుబట్టాడని, అమ్మాయికి కూడా గిరిధర్ అంటే ఇష్టం ఉందని, పెళ్ళి చేద్దామని ప్రతిపాదిస్తాడు. రెండు రోజుల్లో ఏ సంగతి చెప్తామని అంటాడు శ్యామల రావు. ఈ సంబంధానికి తండ్రి సంశయించడం చూసి సాత్విక్ నచ్చజెప్తాడు. అక్కని ఒక్కర్తినే రమ్మని ఫోన్ చేయమంటాడు శ్యామల రావు. కూతురొచ్చకా, కాసేపు ఆ సంబంధం ఇష్టం లేనట్టు నటించి, కాసేపటికి తన అమోదం తెల్పుతాడు. – ఇక చదవండి.]
తర్వాత అన్నీ చకచక జరిగాయి. మురళికీ, వసంతకూ, కుతూహలమ్మగారికీ చెప్పేశారు. వాళ్లు చాలా సంతోషించారు. శనివారం సాయంత్రం ‘దురంతో’కు రిజర్వేషన్ దొరికింది. ఆదివారం ఉదయం ఆరుగంటలకు సికింద్రాబాద్‌లో దిగారు. వీళ్లను రిసీవ్ చేసుకోడానికి అంత పొద్దున్నే మదన్ వచ్చాడు. వాళ్లింటికి వద్దు, రూం తీసుకుందామన్నాడు మురళి. దిల్‍సుఖ్‍నగర్‍లో ఆల్రెడీ వీళ్లకు ‘స్వాగత్ గ్రాండ్’ హోటల్లో రూం బుక్ చేసి ఉన్నారు వాళ్లు. వీళ్లను రూంలో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. కారు అతనే డ్రైవ్ చేసుకొని వచ్చాడు.
స్నానాలు చేసి, ఫ్రెష్ అయ్యారు. “బ్రేక్‍ఫాస్ట్ మా యింట్లోనే అంకుల్” అని మదన్ చెప్పడం వల్ల కాఫీలు మాత్రం తెప్పించుకొని తాగారు. తొమ్మిదికి వచ్చాడు మదన్. మలక్‍పేట టి.వి. టవర్ ఎదురుగా ఉన్న రోడ్లోని తమ ఇంటికి తీసుకువెళ్లాడు. దగ్గరే.
త్రీ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ అది. మూడవ ఫ్లోర్‌లో ఉంది. శ్యామ్ గారు, ఆయన భార్య వీళ్లను సాదరంగా రిసీవ్ చేసుకొన్నారు. ఆయన శ్యామల రావును కౌగిలించుకున్నాడు. నాన్న ఆశ్చర్యం చూసి అది నార్త్ ఇండియన్స్ సంప్రదాయమని చెప్పాడు కొడుకు.
ఇల్లు చాలా పోష్‌గా ఫర్నిష్ చేయబడి ఉంది. యాభై నాలుగు అంగుళాల సోనీ బ్రేవియా టి.వి. రూఫ్‌కు షాండిలియర్, ఖరీదైన సోఫాలు, మూలలకు కంచు పూల కుండీలు అంతా నీట్‍గా అమర్చుకున్నారు. టివి పక్కన ఒక స్టూలు మీద మురళి వాయిస్తున్న శ్రీ కృష్ణ పరమాత్మ పాలరాతి విగ్రహం ఉంది.
“కిషన్ జీ హమారా ఖాన్‌దాన్ కా మూల్ పురుష్ హై, శ్యామల్ జీ!” అన్నాడాయన.
‘ఈ కిషన్ జీ ఎవరై ఉంటారబ్బా!’ అని ఆలోచిస్తుంటే “కృష్ణుడు నాన్నా! వాళ్ల కులదైవం అని చెబుతున్నారాయన” చెప్పాడు సాత్విక్.
“ఆప్ శ్యామల్ హై, మై భీ శ్యామ్ హూ. బరాబర్ హోగయా!” అని బిగ్గరగా నవ్వాడాయన. అది అర్థమైంది.
పదిన్నర దాటింది. వస్తూనే టీ ఇచ్చారు. అంతే. వీళ్ళకు కడుపులు నకనకలాడుతున్నాయి. ఎంతకీ టిఫిన్ పెట్టరేం? పదకొండు తర్వాత డైనింగ్ టేబుల్ వద్దకు ఆహ్వానించారు. పుల్కాలు, మిక్స్‌డ్ వెజ్ కర్రీ వడ్డించారు. అంత మృదువైన పుల్కాలు వీళ్లెపుడు తినలేదు. పూరీల్లాగా పొంగి, పొరలు పొరలుగా వస్తున్నాయి. తర్వాత వెజిటబుల్ పలావ్, క్యాషు మసాలా పెట్టారు. రైతా కూడా. చివర్లో గాజుకప్పుల్లో బాసుంది ఇచ్చారు.
ఇదా బ్రేక్‌ఫాస్ట్ అంటే? దీన్ని బ్రంచ్ అంటే సరిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కలిస్తే బ్రంచ్ అవుతుంది! అనుకున్నారు.
అందరూ తినడం ముగించి విశ్రాంతిగా కూర్చున్నారు. మహానందా దేవి గారు పంజాబీ డ్రస్‍లో ఉన్నారు.
వచ్చే ఆదివారం వైజాగ్ వస్తామనీ, మీ యిల్లు వాకిలి చూస్తామనీ చెప్పారు. ఈ అపార్టుమెంటు మూడేళ్ల కిందట తీసుకున్నారట. ఇది పెద్దబ్బాయికట. చిన్నవాడికని భైరతాబాద్‌లో ఒకటి తీసుకున్నారట. “మాకంటూ సొంతయిల్లు లేదు” అని జోక్ చేశాడాయన. “పిల్లలకు ఉంటే మీకున్నట్లు కాదా” అనాలనుకుని, దాన్ని హిందీలో ఎలా చెప్పాలో తెలియక మిన్నకున్నాడు.
వారిని వైజాగ్‌కు ఆహ్వానించారు. ‘విశాఖపట్నం’ అనడం వారికి ఇచ్చిందిగా ఉంది. ‘వైజాగే’ నచ్చింది.
పన్నెండున్నరకు రూములో దిగబెట్టాడు మదన్. సాయంత్రం ఐదు నలభై ఐదుకు వాళ్లకు గోదావరికి రిజర్వేషన్ ఉంది. వచ్చే ఆదివారం వాళ్లు కూడ వచ్చేశారు ‘గరీబ్ రథ్’లో.
వాళ్లకు ‘దసపల్లా కోర్ట్’లో రూం బుక్ చేశారు. వాళ్ళు భోజనం పెట్టారు కాబట్టి వీళ్ళు అర్లీ లంచ్, అదే బ్రంచ్ అరేంజ్ చేశారు.
కుతూహలమ్మగారు కారునీ, డ్రైవర్‌ను పంపారు. కొమ్మాదికి వస్తూంటే పచ్చని చెట్లు, కొండలు చూసి, చాలా సంబరపడ్డారు. ‘ఐసీ హరియాలీ హమ్ కో హైదరాబాద్ మే నహీ మిల్తీ’ అనుకున్నారు.
సింహగిరి కాలనీ వారికి బాగా నచ్చింది. ఇండివిడ్యుయల్ హౌస్, ఇండివిడ్యుయల్ హౌసే. అపార్ట్‌మెంటు దాని ముందు ఎందుకూ పనికిరాదని తేల్చారు మేఘుశ్యామ్ గారు.
సాహితి ముందు రోజే వచ్చింది. కాబోయే అత్తామామలకు పాదాలు తాకి నమస్కరించింది. “జీతే రహో బేటీ” అని వాళ్ళు ఆశీర్వదించారు. పులిహోర, పూర్ణంబూరెలు, వంకాయ కొత్తిమీర కారం, గోంగూర పచ్చడి, అరటికాయ బజ్జీ, పూరీలు వడ్డించారు వియ్యంకులకు. ఇన్ని ఐటమ్సా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు.
రెండోజుల ముందే ఆదివరాహశర్మ గారి వద్దకు వెళ్లి మూడు నాలుగు ముహూర్తాలు వ్రాయించుకొని వచ్చిఉన్నాడు శ్యామల రావు. ఇంటర్‌కేస్ట్ మ్యారేజని ఇష్టమొచ్చినట్లు తిడతాడేమోననుకున్నాడు గాని ఆయనేవీ కోపగించుకోలేదు. జాతక రీత్యా తనకు ఆ విషయం ముందుగానే స్ఫురించిందని, ప్రతికూల విషయాలు చెప్పడం జ్యోతిశ్శాస్త్రంలో నిషిద్ధం కనుక చెప్పలేదన్నాడు.
“మనం నిమిత్తమాత్రులం! ‘నాహం కర్తా, హరి కర్తా’ అని అన్నమాచార్యుల వారన్నట్లు, వీళ్లిద్దరికీ రాసిపెట్టి వుంది నాయనా. నీవూ నేనూ అక్షింతలు వేసి దీవించడం తప్ప ఏం చేయలేం. ఇంకా ఏ పిచ్చిపనులూ చేయకుండా ఉభయులూ తల్లిదండ్రులను ఒప్పించి చేసుకుంటున్నారన్నావు చూడు! అదీ సంస్కారం!” అన్నాడాయన. రుక్మిణీ కల్యాణఘట్టంలో పోతన్న గారి పద్యపాదాన్ని ఉటంకించారు. ‘వీరిర్వురన్ తగులం గట్టిన బ్రహ్మనేర్పరిగదా!’
ఇరువైపుల వారికి అనుకూలమైన ముహూర్తం ఖరారైంది. ఇంకా రెండు నెలలు టైముంది. వారి వైపు నుంచి ఒక పాతిక, ముప్ఫె మంది దాకా రావచ్చునని చెప్పారు. వీరి వైపు దగ్గరి బంధువులు, కాలేజి స్టాఫ్ అంతా డెభై మంది దాకా ఉంటారు. మొత్తం వందమందికి మించరు.
సాయంత్రం ‘విశాఖ’కు వారు వెళ్లిపోయారు. వందమంది కోసం పెద్ద పెద్ద కల్యాణ మంటపాలు ఎందుకని, జగదాంబ సెంటర్ దగ్గరున్న దసపల్లా హోటల్లో వెన్యూ బుక్ చేశారు. క్యాటరింగ్ వాళ్ళే చేస్తారు. హాలు రెంట్ ఫ్రీ. పదహారు గంటలు స్లాట్. ముందురోజు సాయంత్రం ఆరుగంటల నుండి. మర్నాడు పదిగంటలకు వెకేట్ చేయాలి. ఈవెనింగ్ స్నాక్స్, రిసెప్షన్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్‍ఫాస్ట్, టీ, కాఫీ అంతా కలిపి పర్ హెడ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు. అదే హోటల్లోనే పది రూములు కూడా బుక్ చేశారు. రూము రెంటు రోజుకు పదిహేను వందలు!
ఆగస్టు 13 రాత్రి రిసెప్షన్. రాత్రి పన్నెండు పదికి సుముహూర్తం. వియ్యంకులు ఒక వోల్వో ఎ.సి. బస్సులో రాత్రి బయలుదేరి పదమూడు ఉదయం పదిగంటలకు వైజాగ్ చేరుకున్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేసి విశ్రాంతి తీసుకున్నారు.
కల్యాణ మంటపం డెకరేషన్ హోటలు వాళ్లే చేశారు, అదనంగా ఛార్జి చేసి. సన్నాయివాళ్ళు నర్సీపట్నం దగ్గర ధర్మసాగరం నుంచి వచ్చారు. వీడియో, ఫోటోలు, మధురవాడలోని సలోని స్టూడియో వారికి అప్పచెప్పారు.
పెళ్ళి చక్కగా జరిగింది, హిందూ సంప్రదాయ విధానంలో.. వాళ్లకూ హోమాలున్నాయి. ఎక్కడా ఎలాంటి కల్చరల్ క్లాష్ లేదు. సాత్విక్‌కు సూటు కుట్టించాడు శ్యామల రావు. వాడూ విశాల్ కలిసి పెళ్లి పనులన్నీ చేశారు. మురళి, వసంత పీటల మీద కూర్చుని కన్యాదానం చేశారు. రిసెప్షన్ డిన్నర్, బఫే సిస్టమ్. ‘నార్త్ సౌత్ కాంబో’ అని వియ్యంకులకు కూడా నచ్చే విధంగా మెనూ సెలెక్ట్ చేశారు. కాలేజీల స్టాఫ్, దగ్గరి బంధువులు హజరయ్యారు. ఎదురు సన్నాహం వద్ద ఛలోక్తులు విరిశాయి. వాళ్ళు ఎంతగా కలిసిపోయారంటే, ఇంటర్‌కేస్ట్ మ్యారేజ్ అనే కాన్షస్‍నెస్సే ఎవరికీ అనిపించ లేదు.
అప్పగింతలపుడు కూతుర్ని దగ్గరకు తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు శ్యామల రావు. సాత్విక్ కళ్ల నిండా నీళ్ళు. మురళి, వసంత కూడా కళ్ళు చెమర్చుకున్నారు. విశేషమేమంటే శ్యామ్ గారు, మహానందాదేవి కూడా ఏడ్చారు! శ్యామ్ గారు వియ్యంకుడిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
భాష, కాలం, ప్రాంతం, వేరు కావచ్చు. మానవత్వం, ప్రేమలు, భావావేశాలు, ఆత్మీయతల్లో మాత్రం ఏ మార్పూ ఉండదని స్పష్టమయింది.
మర్నాడు ఉదయం పది తర్వాత వెన్యూ వెకేట్ చేశారు. వారి సంప్రదాయం ప్రకారం బహూ (కోడలు)ను తమతో పాటు తీసుకొని వెళతారట. వెంట ఎవరూ రాకూడదట. మూడు రోజుల తర్వాత హైదరాబాదులోని వాళ్లింట్లో వ్రతం, రిసెప్షన్ ఉంటాయట. వీళ్లందర్నీ ఆహ్వానించి వెళ్ళారు.
వీళ్లు అంతా కలిసి పది మంది కూడా లేరు. విశేషమేమంటే కుతుహలమ్మ గారు తాను కూడా హైదరాబాదుకు వస్తానన్నారు. అందరూ ‘గరుడ ప్లస్’ బస్సులో హైదరాబాదు చేరుకొని అక్కడ ఫంక్షన్ చక్కగా జరుపుకున్నారు.
తర్వాత అమ్మాయిని అల్లుడిని వైజాగ్ తీసుకొచ్చారు. అక్కడి నించి వారు బెంగుళూరు, మైసూరు, ఊటీలకు హనీమూన్ వెళ్లారు.
అనుక్షణం శర్వాణిని తలుచుకుంటూ, తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించి, తృప్తిగా నిట్టూర్చాడు శ్యామల రావు. ‘ఆకాశమంత’ సినిమాలో – కూతురు పంజాబీ యువకుడిని ప్రేమిస్తే, ప్రకాష్ రాజ్ పడిన అగచాట్లు చూసి నవ్వుకున్నాడొకప్పుడు. ఇప్పుడు తన పరిస్థితీ అలాగే అయ్యిందని నవ్వుకున్నాడు.
***
మరో రెండు సంవత్సరాలు గడిచాయి. సాత్విక్ ఇంజనీరింగ్ పూర్తయింది. క్యాంపస్ సెలెక్షన్స్‌లో వాడికి మూడు ఆఫర్లు వచ్చాయి. ఒకటి గుర్‍గావ్ లోని టి.సి.యస్., రెండోది పూనెలోని క్యాప్ జెమినీ, మూడవది హైదరాబాద్ అని హెచ్.యస్.బి.సి. అన్నిట్లో మెరుగైన ఆఫర్ టి.సి.యస్ వాళ్లది.
శ్యామల రావు దాన్నే ప్రిఫర్ చేయమని చెప్పాడు కొడుక్కి. వాడేం మాట్లాడలేదు. ఒకరోజు సంతోషంగా ఇంటికి వచ్చి ఒక కవరు తండ్రి చేతిలో పెట్టి ఆయన పాదాలకు నమస్కరించాడు.
“ఏమిట్రా, గుర్‍గావ్ టిసియస్సేనా? వెరీ గుడ్!” అంటూ కవరు తెరిచి చూశాడు. అందులో హెచ్.యస్.బి.సి. వారి అపాయింట్‌మెంట్ లెటరు ఉంది. అభ్యర్థి స్పెషల్ రిక్వెస్టుని పరిగణిస్తూ, అతన్ని వైజాగ్ కాంపస్‌కి అలాట్ చేస్తున్నట్లు ఉందందులో.
“ఇదేమిటి? దీని ప్యాకేజ్ తక్కువ అని చెప్పావు? దీంట్లో జాయిన్ అవుతున్నావెందుకు?” అని అడిగాడు.
“నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్లను నాన్నా! నాకు ప్యాకేజి ముఖ్యం కాదు నీ దగ్గరుండటం ముఖ్యం” అన్నాడు తలవంచుకొని.
“బంగారం లాంటి భవిష్యత్తును వదులుకొని నన్ను గురించి పాకులాడతావేమిరా? నేనేం వయసు మీద పడిపోయి, మంచాన పడ్డానా ఏమిటి?”
“అవన్నీ నాకు తెలియవు నాన్నా. నీవు ఒంటరివాడివి కాకూడదు అంతే!”
తనంత ఎత్తు ఎదిగిన కొడుకును చూసి గర్వపడ్డాడు. భౌతికంగానే కాదు, వ్యక్తిత్వంలో కూడా ఉన్నత శిఖరాలు అందుకున్నాడు తన సాత్విక్. అతని హృదయం బరువెక్కింది. వాడిని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకొన్నాడు.
శ్యామలరావుకు నాలుగేళ్ల సర్వీసుంది. అతన్ని యస్.కోటకు ట్రాన్స్‌ఫర్ చేశారు. శృంగవరపు కోటను అలా అంటారు.
“కారు కొందాం నాన్నా, డ్రైవరును పెట్టుకుందాము, రోజూ కారులో వెళ్లిరా, హాయిగా” అని కొడుకంటే, నవ్వాడు.
“కాంప్లెక్స్‌కు పోయి బస్ ఎక్కితే గంటంబావు ప్రయాణం. రణస్థలం కంటే పది కిలోమీటర్లే ఎక్కువ. కారెందుకురా దండగ!” అన్నాడు.
“పోనీ నేను తీసుకోనా, కార్ లోను?”
“ఎవరు తీసుకున్నా అనవసరం రా పిచ్చివెధవా! నీవు కావాలంటే నేనే కొనిస్తా. సిటీలో తిరగడానికి.”
సాహితికి ఆడపిల్ల పుట్టింది. ‘శర్వాణి’ అని వాళ్లమ్మ పేరు పెట్టుకుంది. వాళ్ల సంసారం హ్యాపీగా సాగుతూంది. బారసాల జరిపించాడు. శ్యామల రావు మనవరాలికి రెండు కాసులు బంగారు గొలుసు చేయించాడు. ప్రస్తుతం శ్యామల రావు జీతం లక్ష దాటిపోయింది. డి.వి.ఇ.ఓ.ల ప్రమోషన్ లిస్టులో రెండవ పేరే అతనిది.
కొడుక్కు పెళ్లి చేయాలని సంకల్పించాడు. సంబంధాలు చూస్తున్నాడు. వాడు వాళ్ళ అక్క కంటే నాలుగాకులు ఎక్కువే చదివాడు. ఎవర్నీ నచ్చడు. వైజాగ్ అమ్మాయే కావాలంటాడు ఒకసారి. జాబ్ హోల్డరు కావాలంటాడు, వద్దంటాడు. అలా మరో రెండేళ్లు గడిచాయి. ఒకరోజు సడన్‍గా ఆయాసం వచ్చింది. కొడుకు యింట్లో లేడు. ఊపిరి అందడం లేదు. ఎడమ చెయ్యి లాగేస్తూంది. హార్ట్ ఎటాక్ రాబోతూందని అర్థమయింది. వెంటనే కొడుక్కు ఫోన్ చేశాడు. వాడు అదృష్టవశాత్తు మధురవాడ వరకు వచ్చేశాడు. వెంటనే ఒక క్యాబ్ మాట్లాడుకొని, ఇంటికి వచ్చి, తండ్రిని తీసుకొని, సంపత్ వినాయక టెంపుల్ రోడ్డులో ఉన్న కేర్ హాస్పిటల్‍కు తీసుకెళ్లాడు. దారిలో ఒక మెడికల్ షాపు వద్ద ఆపి సార్బిట్రీట్ మాత్ర ఒకటి కొనుక్కుని నాన్న నాలుక క్రింద పెట్టాడు.
వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. సమయానికి తీసుకొచ్చారని చెప్పారు డాక్టర్ ‘సార్బిట్రేట్’ నాలుక కింద పెట్టుకోవడంవల్ల ప్రాణాపాయం తగ్గిందన్నాడు. ఆ విషయం వాట్సప్‍లో వచ్చిన మెసేజెస్‌లో ఎక్కడో చదివి ఉన్నాడు సాత్విక్.
గుండెలో రెండు చోట్ల రక్తనాళాలలో బ్లాక్స్ ఉన్నాయనీ, స్టెంట్స్ వేయాలనీ చెప్పారు. గుడి దగ్గర కొబ్బరికాయల కొట్లో రకాలున్నట్లు స్టెంట్స్ కూడ మంచివి, అతి మంచివి, అంతమంచివి కానివి, ఇలా మూడు రకాలున్నాయి. ఎందుకైనా మంచిదని బెస్ట్ క్వాలిటి స్టెంట్స్ వేశారు.
మర్నాడే డిశ్చార్జి చేసి, మందులు రాసి పంపించేశారు. సాత్విక్ సెలవు పెట్టి తండ్రిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. నెలరోజుల తర్వాత ఇద్దరూ విధి నిర్వహణలకు వెళ్లసాగారు. మధ్యలో సాహితివాళ్లు వచ్చి రెండు రోజులు, మురళీవాళ్లు అచ్చి రెండు రోజులు ఉండి వెళ్లారు. చూసి వెళ్లేవారే గాని, ఎవరుండిపోతారు? ఎవరి సంసారాలు వాళ్లవి.
తాను పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే భార్య తండ్రిని సరిగా చూసుకోకపోతే! వృద్ధాశ్రమంలో చేర్పిద్దామని పట్టుబడితే! నాన్న పరిస్థితి ఏమిటి? అలాంటి కేసులు తన ఫ్రెండ్స్ సర్కిల్ లోనే చాలా చూశాడు. నాన్నకు అలా జరగడానికి వీల్లేదు! అలా జరగకుండా ఉండాలంటే తాను పెళ్లి చేసుకోకూడదు! అంతే!!
మూడు నెలలు గడిచాయి. శ్యామల రావు మామూలుగా తిరుగుతున్నాడు. ఉదయం రెండు కి.మీ. వాకింగ్ చేస్తున్నాడు. సాత్విక్‍కు మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిది వరకు డ్యూటీ అవర్స్. ఉదయం టిఫిను, వంట చేసి వెళ్లేవాడు. తండ్రిని వంటింట్లోకి రానివ్వడం లేదు.
పెళ్లి చేసుకొమ్మని పోరుతూనే ఉన్నాడు శ్యామల రావు. వాడు వినిపించుకోవడం లేదు. ఇంకొక్క సంవత్సరన్నర సర్వీసు ఉండగా అతనికి డి.వి.ఇ.ఓ.గా ప్రమోషన్ ఇచ్చి, కరీంనగర్‌కు వేశారు. సాత్విక్ వద్దంటే వద్దన్నాడు! హెల్త్ గ్రౌండ్స్ క్రింద తాను ప్రమోషన్ తీసుకోలేనని రాసిచ్చేయమన్నాడు. అంతగా వెళ్లక తప్పదనుకుంటే తానీ ఉద్యోగం మానేసి నాన్నతో పాటు కరీంనగర్‌కు వస్తాడట!
శ్యామల రావుకు నవ్వొచ్చింది. ఆరోగ్యరీత్యా తానూ వెళ్లడానికి సిద్ధంగా లేడు. కానీ వీడేమిటి ఇలా?
“ఒరేయ్ నాన్నా! నీవు ఎక్కువగా, మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావనిపిస్తుంది. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేసి అమెరికాకు పిల్లలు ఎగిరిపోతున్న ఈ రోజుల్లో, నీవింత సిల్లీగా..”
“ఆపు నాన్నా” అని అరిచాడు వాడు. “అందరి సంగతి వేరు, మా నాన్న సంగతి వేరు. అమ్మ చనిపోతే, గుండెలమీద పెట్టుకొని పెంచావు నన్ను, అక్కను. అక్క ఆడపిల్ల కాబట్టి పెళ్లి చేసి పంపావు. నన్ను పెళ్లి చేసుకొమ్మని వేధిస్తున్నావు. వచ్చే మహాతల్లి నిన్ను సరిగ్గా చూసుకోకపోతే! అసలే హార్ట్ పేషంటువి నువ్వు. నా పెళ్లి ప్రసక్తి దయచేసి తేవద్దు” వాడి ముఖం ఎర్రబడింది! కోపం దుఃఖంగా మారింది.
“అయితే నేను చస్తేగాని పెళ్లి చేసుకోవన్న మాట! ఛీ! పాడు బతుకు! ఒక్కగానొక్క కొడుకు చక్కగా సంసారం చేసుకుంటుంటే చూసుకోలేని దరిద్రపు బ్రతుకు!” శ్యామల రావు గొంతు జీరబోయింది.
రెండు రోజులు ఇద్దరూ మాట్లాడుకొనేవారు కాదు. అయినా ఎవరూ తమ పట్టు వదల్లేదు.
శ్యామల రావు రిటైరయ్యాడు. పెన్షన్, ఇతర రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ అన్నీ ఆరు నెలల్లో సెటిలయ్యాయి. కాలక్షేపం కోసం ఆనందపురం లోని ఒక కాలేజీలో రెండు క్లాసులు చెప్పి, లంచ్ టైంకు ఇంటికి వచ్చి, భోజనం చేసి, విశ్రాంతి తీసుకొనేవాడు.
కొడుకును ఎలా దారికి తేవాలి? అని తీవ్రంగా ఆలోచించగా, ఒక ఐడియా తట్టింది. ఆనందపురం కాలేజీలో ఒక వృద్ధ కన్య ఉంది. అడ్మిషన్స్ కౌన్సెలర్‌గా పని చేస్తుంది. నలభై ఐదు సంవత్సరాలుంటాయి. శ్యామల రావు మంచి తనం, నెమ్మదైన స్వభావం వల్ల అతనితో స్నేహంగా ఉండేది. తన కష్టాలు చెప్పుకోనేది. ఆమెదో విచిత్ర గాథ. ఆమెకు పెళ్లి చేసి పంపించేస్తే, ఆమె జీతం తమకు దక్కదని ఆమె తండ్రి, అన్నయ్య ఆమెకు పెళ్లి చేయలేదు. తల్లి చిన్నపుడే చనిపోయింది.
తన గురించి కూడా చెప్పాడామెకు. తనను శర్వాణి ఎలా తీర్చిదిద్దిందో చెప్పాడు. కొడుకు తనను చూసుకోవడం కోసం పెళ్లి చేసుకోకుండా సతాయిస్తున్నాడని చెప్పుకొని బాధ పడ్డాడు. ఆమె పేరు శారద.
ఒకరోజు ఇలా అన్నాడామెతో “అమ్మా,శారదా! నాకొక్క సహాయం చేయాలి నీవు. ఇలా అడగకూడదు నిన్ను. కాని మావాడి మనసు మారడానికి ఇంతకంటే ఉపాయం తోచడం లేదు నాకు.”
“చెప్పండి మాస్టారు”
“మనిద్దరం పెళ్లి చేసుకొన్నట్లు నాటకం ఆడాలి. పూలదండలతో ఇంటికి వెళదాం. నా కోసం పెళ్లి మానేసి తాను ఉండిపోతే, ఈ వయసులో తగుదునమ్మా అని పెళ్లి చేసుకొని వచ్చాడని, నా మీద అసహ్యం వేసి, ఇంట్లోంచి వెళ్లిపోయి, ఆ కసితో పెళ్లి చేసుకుంటుందని నా ఆశ. నీవు మా యింట్లో రెండు రోజులుండాలి. మనిద్దరం కలిసి వాటికి నరకం చూపించాలి.”
పకపక నవ్విందామె. “సూపర్ ఐడియాసార్. కనీసం నాటకంగా అయినా నా పెళ్లి అవుతుంది. నేను రెడీ!” అంది ఉత్సాహంగా.
శని ఆదివారాలు సాత్విక్‍కు సెలవు. శనివారం నాడు ఫ్రెండ్‍ను కలిసి వస్తానని టిఫిన్ చేసి వెళ్లాడు శ్యామల రావు. పదకొండున్నరకు ఇంటి ముందు కారు ఆగింది. కారు శబ్దం విని గేటు దగ్గర కొచ్చిన సాత్విక్‌కు దండలతో కార్లోంచి దిగుతున్న నాన్న, మరో మధ్యవయసావిడ కనిపించారు. మ్రాన్పడిపోయి చూస్తూ ఉండిపోయాడు.
ఇద్దరూ గుమ్మం దగ్గరికి వెళ్లారు. “కుడికాలు లోపల పెట్టు డియర్” అన్నాడు శ్యామల రావు ఆమెతో. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. సాత్విక్ తండ్రి దగ్గరకు వెళ్లి “ఇదంతా ఏమిటి నాన్నా, ఈవిడ ఎవరు?” అని అడిగాడు.
శ్యామల రావు విలాసంగా నవ్వుతూ, “ఏముంది? పెళ్లి చేసుకున్నాం! ఈ వయసులో నాకూ ఒక తోడు కావాలనిపించింది!” అన్నాడు
లక్ష్మీపార్వతి మీద హరికృష్ణ కొచ్చినంత కోపం వచ్చింది వాడికి!
“తోడా! తోడెందుకు? నేను బ్రతికే ఉన్నాను కదా ఇంకా!” అనరిచాడు.
“ఎవరి జీవితం వాళ్లది! నేను ఒకరి కోసం త్యాగాలు చేసే రకం కాదు.. నీవు ససేమిరా పెళ్లి చేసుకోనన్నావు! సరేలే అని నేను చేసుకున్నాను. దట్సాల్! మహ్మదు ప్రవక్త కొండను తన దగ్గరికి రమ్మని పిలిచెను. అది రాలేదు! సరేలే అని, ప్రవక్తే కొండ దగ్గరకు వెళ్లెను!” అన్నాడు. శారద నవ్వుతూ, “గుడ్ జోక్ డియర్!” అని శ్యామల రావు మీద వాలిపోతూ చెప్పింది.
సాత్విక్‍కు అరికాలి మంట నెత్తికెక్కింది. “ఆపండి మీ కుళ్లు జోకులు!” అనరిచాడు. ఆ రియాక్షనే వాళ్లకు కావాల్సింది.
“అబ్బాయ్! తల పగిలిపోతుంది! వేడిగా మా ఇద్దరికీ టీ చేసి పట్టుకు రా!” అన్నది సాత్విక్ ఉత్తుత్తి పిన్ని!
“నేనెలా కనబడుతున్నా? టీ లేదు ఏమి లేదు. కావలిస్తే పోయి పెట్టుకోండి” అని అరిచాడు ఆమె మీద.
వంట కూడ చెయ్యడం మానేసి బయటకివెళ్లాలనుకున్నాడు. కానీ ఆ ‘రాక్షసి’ (?) నాన్నకు వండి పెడుతుందో, లేక ఆయనతో చేయించుకుని తింటుందో? ఆ ఆలోచన విరమించుకొని, కుక్కర్‍లో రైస్, పప్పు పెట్టి కూరకు వంకాయలు తరిగి, ఒక గిన్నెలో నీళ్లు, చిటికెడు పసుపు, చిన్న చింతపండు ముక్క వేసి, అందులో వంకాయ ముక్కలు వేశాడు. టమోటా పప్పు చేసి, వంకాయ కూర చేశాడు. కూరలో అల్లం, పచ్చిమిర్చి బరకగా మిక్సీలో గ్రైండ్ చేసి వేశాడు.
పన్నెండున్నరకు వంట పూర్తయింది. అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దాడు. కొత్త దంపతులు సోఫాలో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆమె రావు మాటలకు పడీ పడీ నవ్వుతుంది. ఆ నవ్వులు వింటూంటే ఒంటికి కారం రాసుకున్నట్లుంది ఆ అబ్బాయికి.
హల్లోకి వెళ్లి, “నాన్నా, వంటయింది! భోంచేయండి” అన్నాడు. శ్యామల రావుకు కొడుకు ముఖం చూసి జాలేసింది. ‘అయ్యో! నా బంగారు తండ్రిని కష్టపెడుతున్నానే!’ అనిపించింది. కానీ తప్పదు. వాడికి తన మీద ఏవగింపు రావాలి! అప్పుడు గాని తన జీవితాన్ని గురించి ఆలోచించడు.
కొత్తజంట లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. వంటలు రుచిచూసిన ‘ఉత్తుత్తి పిన్ని’ అతనికి వినబడాలనే “కందిపప్పు అడుగంటింది. ఈ వంకాయ కూరేమిటి ఇలా తగలడింది? రోజూ ఎలా తింటున్నావు డియర్ పాపం!” అంటూంది.
కానీ నాన్నలాగే కొడుకు కూడ మంచి కుక్. పప్పు, కూర అద్భుతంగా ఉన్నాయి నిజానికి. కుహనా పిన్నిగారు బాగానే లాగిస్తున్నారు.
కనీసం ‘నీవు కూడా రా నాన్నా, తిందాం!’ అని నాన్న తనను పిలవకపోవడం సాత్విక్‍ని బాధించింది. తండ్రి అనడం వినిపించింది “ఏం చేస్తాం శారూ, ఆడదిక్కు లేని సంసారం! తప్పదు మరి”.
“వంటమనిషిని పెట్టుకుందాం డియర్” అన్నదా ‘మహాతల్లి’.
‘నీ సోకుకు వంటమనిషొకటి!’ అనుకున్నాడు సాత్విక్ కసిగా.
తిన్న కంచాలు కూడ తీయలేదు. గిన్నెల మీద మూతలు పెట్టలేదు. పకపక, వికవికలతో బెడ్ రూంలోకి వెళ్లారు ఇద్దరు.
కంచాలు తీసి సింక్‍లో వేసి, టేబుల్ శుభ్రం చేసుకున్నాడు. తానూ ఒక ప్లేట్ పెట్టుకుని. భోజనం చేశాడు. తిండి సయించలేదు పాపం. మనసంతా పిచ్చిపిచ్చిగా ఉంది.
తయారై బైక్ తీసుకుని రోడ్లమ్మట తిరిగాడు. తన బాధ ఎవరితో చెప్పుకోవాలి? నర్సీపట్నం వెళ్లి మామయ్యతో చెబుదామా? అనుకున్నాడు. అక్కకు ఫోన్ చేద్దామా అనుకున్నాడు. ఈ విషయం తెలిసి పాపం అక్క ఎంత బాధపడుతుంది? కాని వాళ్లకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది?
అతనికి కుతూహలమ్మ ఆంటీ గుర్తొచ్చారు. అవును. ఆమె దగ్గరికి వెళ్లి విషయం చెప్పాలి. అమె యిల్లు కాన్వెంట్ జంక్షన్‌లో ఉంది. ఒకసారి నాన్నతోబాటు వెళ్లాడు. తనను ‘స్మార్ట్ ఫెలో’ అంటుంది.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
