Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-2

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[శ్యామలరావు తల్లి ప్రసూనాంబతో కలిసి నర్సీపట్నంలో పెళ్ళిచూపులకి వెళ్తాడు. అమ్మాయి తండ్రి జగన్నాథరావు, తల్లి విశాలక్షి వీళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు. తమ ఇల్లు చూపిస్తారు. అదయ్యాకా, మీరు విశాఖలో ఎక్కడుంటున్నారని జగన్నాథరావు అడిగితే, మహారాణిపేట అని చెప్తాడు శ్యామలరావు. తర్వాత, తన తండ్రి చనిపోగా, కంపాషనేట్ గ్రౌండ్స్‌లో తనకి యల్.డి.సి.గా ఉద్యోగం వచ్చిందని, పూసపాటిరేగ కాలేజీలో పనిచేస్తున్నానని చెప్తాడు. పిల్లవాడి వినయం ఆడపెళ్ళివారికి నచ్చుతుంది. అమ్మాయిని తీసుకురమ్మంటుంది ప్రసూనాంబ. శర్వాణిని తీసుకువస్తారు. ప్రసూనాంబకి, శ్యామలరావుకి నచ్చుతుంది. శర్వాణి పాడిన పాటలు కూడా నచ్చుతాయి. ఇక వెళ్ళొస్తామని చెప్పి, బస్సెక్కి విశాఖపట్టణం చేరుతారు. మర్నాడు ఆదివారం, మార్కెట్‍కి వెళ్ళి కూరలు తెస్తాడు శ్యామలరావు. వంటలో తల్లికి సాయం చేస్తాడు.  అమ్మకు ఆ అమ్మాయి నచ్చిందో లేదో, ఇంతవరకు ఆ ప్రసక్తి తేలేదని అనుకుంటాడు. మధ్యాహ్నం భోంచేస్తూ తల్లిని అడిగితే, కొడుకు ఇష్టపడ్డాడని అప్పటికే గ్రహించిన ఆమె సరేనంటుంది. పూసపాటిరేగ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ జార్జిరెడ్డిగారికి శ్యామలరావు తండ్రి అంటే అభిమానం. శ్యామలరావుకి కంపాషనేట్స్ గ్రౌండ్స్ మీద ఉద్యోగం వచ్చేలా సాయం చేసింది ఆయనే. రేగ ప్రిన్సిపాల్ దాలినాయుడు గారికి కూడా శ్యామలరావు తండ్రి మిత్రులే. ఓ రోజు ఆయన శ్యామలరావుని పిల్చి, ఇంగ్లీషులో ఎం.ఎ. చేయమని, భవిష్యత్తులో జూనియర్ లెక్చరర్ అవవచ్చని చెప్తారు. చెప్పడమే కాదు, ఇంగ్లీషు ఎం.ఎ. వారికి కోచింగ్ ఇచ్చే పాత్రో గారిని పరిచయం చేస్తారు. ఆయన రిక్వెస్టుతో పాత్రో గారు ఫీజు వెయ్యి రూపాయలు తగ్గిస్తారు. ప్రతి ఆదివారం కాకపోయినా, నెలకు ఒకటి రెండుసార్లు విజయనగరం వెళ్లి పాత్రోగారి కాసులకు అటెండ్ అవుతాడు శ్యామల రావు. – ఇక చదవండి.]

నర్సీపట్నంలో జగన్నాథరావు గారికి కబురు చేరింది. వాళ్లు సంతోషించినారు. శర్వాణిని కూడా అడిగారు. ఆ అమ్మాయి సిగ్గుపడి “మీ ఇష్టం నాన్నా” అని లోపలికి పారిపోయింది.

జగన్నాథరావు పక్కనే రోలుగుంటలో ఎలిమెంటరీ స్కూలు హెడ్ మాస్టరుగా చేసి రెండేళ్ల క్రితమే రిటైరైనాడు. వాండ్ల సొంత ఊరు యస్. రాయవరం. అక్కడ వారికి పిత్రార్జితమైన ఒక పాత పెంకుటిల్లు, ఎకరన్నర పొలం ఉన్నాయి. దాన్ని కౌలుకిచ్చారు. కౌలుదారు అందులో చెరుకు పండిస్తాడు. ఆయన రిటైర్మెంటు బెనిఫిట్స్ ఎనిమిది లక్షలు వచ్చినాయి. ఆ డబ్బును బ్యాంకుతో డిపాజిట్ చేసి, ఆ వచ్చే వడ్డీ, పెన్షనుతో సంసారం లాక్కొస్తున్నాడు.

కొడుకు మురళిది చిన్న ఉద్యోగమే. చెల్లెలి పెళ్లికి వాడేమీ సాయపడలేడు. అక్కడ గరివిడిలో వాడికి కంపెనీ క్వార్టర్సు కూడా ఇచ్చారు. తర్వాత వాడిని కూడ ఒక యింటివాడిని చేస్తే వాడి బ్రతుకు వాడు బ్రతుకుతాడు.

జగన్నాథ రావు దంపతులు వైజాగు వెళ్లి ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకున్నారు, నరసింహమూర్తి గారు అనుసంధాన కర్త. ఆయన ఇలా అన్నారు. “పిల్లవానికి యాభైవేల కట్నం, చేతికి అరకాసు ఉంగరము, బజాజ్ చేతక్ స్కూటరు ఇవ్వండి. పెళ్లి మీ శక్తి మేరకు లోటు లేకుండా చెయ్యండి. వీళ్లు మీ అమ్మాయికి అరుకాసులు బంగారం పెడతారు. నాలుగు గాజులు, తాళిబొట్టు, చెయిను చేయిస్తారు. వియ్యపురాలికి మీరు పట్టుచీరపెట్టి, ఐదువేల రూపాయలు ఇవ్వండి. అమ్మాయికి పట్టుచీరలకుగాను ఒక పదివేలు ఇస్తారు. ఉభయులకూ సమ్మతమయితే లగ్నపత్రిక ఈ రోజే రాసుకుందాము.”

“అంతా బాగుంది కాని స్కూటరే తూగలేమండి” అన్నాడు జగన్నాథరావు. స్కూటరును అదనంగా చేర్చింది అనుసంధాన కర్తే!

శ్యామలరావు కల్పించుకొని, “మీకు భారమనిపిస్తే వద్దు లెండి” అన్నాడు మనస్ఫూర్తిగా.

“మరి నిశ్చితార్థం?”

ప్రసూనాంబగారన్నారు “నిశ్చితార్థాలు మాకు అచ్చిరావండీ అన్నయ్యగారూ! లగ్నపత్రిక వ్రాసుకుంటే సరిపోతుంది.”

“పెళ్లి ఎక్కడ చేద్దామని?”

“సింహచలంలో, నరసింహ స్వామివారి సన్నిధిలో చేయాలని ఉందండి. మా చెల్లెలి కొడుకు అక్కడ దేవస్థానంలో పని చేస్తున్నాడు. వాడు మనకు సహాయం చేస్తాడు.”

“మాకూ దగ్గరే. మా బంధువులంతా వైజాగ్ లోనే ఉంటారు కాబట్టి అందరికీ అనువుగా ఉంటుంది.”

లగ్నపత్రిక వ్రాసుకున్నారు. మరో మూడు నెలల్లో ముహూర్తం.

“స్కూటరు వద్దన్నావేమిరా?” అనడిగింది తల్లి.

“పోనీలేవీ, వాళ్లూ మధ్యతరగతి వాళ్లేను” అన్నాడు కొడుకు.

“వాళ్లిచ్చే యాభై వేలల్లో పది వేలు పట్టు చీరలకే పోతే, ఆరుకాసులు బంగారం కాసు రెండువేలు ఉందిప్పుడు, అదో పన్నెండువేలు. మీ మేనత్త లిద్దరికీ చెరో రెండు వేలన్నా ఇవ్వద్దూ? స్నాతకం, పెళ్లి కొడుకును చేసిన రోజు నలభైమందన్నా అవరూ మీ కాలేజీ వాళ్లతో కలిసి? సింహాచలానికి అందరం వెళ్లడానికి ఏదైనా వ్యాను మాట్లాడాలా? యాభైవేలు కట్నమని పేరే గాని, మనకేం మిగులుతుందిరా?”

“కానీ లేవే, నాకెందుకో వాళ్లను మరీ డిమాండ్ చేయాలనిపించలేదు.”

“అంతా ఆ శర్వాణి మహత్యం రా నాయనా” అంది నవ్వుతూ తల్లి!

పెళ్లి దగ్గర పడుతూంది. దగ్గర బంధువులనూ, కొన్ని కాలేజిల్లో వాళ్ల నాన్నతో పని చేసిన కొందరినీ, పూసపాటిరేగ కాలేజీ స్టాఫ్‌ను పెళ్లికి పిలిచాడు శ్యామల రావు.

ముందురోజు అతన్ని పెళ్లి కొడుకును చేసి, స్నాతకం చేసుకున్నారు. సాయంత్రం ఒక మినీ వ్యానులో సింహాచలం చేరుకున్నారు. దిగువనే ఉంది దేవస్థానం వాళ్ల కల్యాణమండపం. దాని పేరు ‘కల్యాణనరసింహమ్’. క్రింద పెళ్లి జరిగే హాలు, పైన భోజనాలు, ఇరువైపుల వాళ్లు ఉండడానికి ఆరు రూములు ఉన్నాయి.

జగన్నాథరావుగారి బంధువు మండపాన్ని, రూములనూ ముందే బుక్ చేశాడు. మగ పెళ్లివారు ఇరవై రెండు మంది, పిల్ల తరపున ముఫై మంది. కాలేజీల స్టాఫ్ ఒక ఇరవైమంది. అంతా ఎనభై లోపే తేలారు. గోపాలపట్నం నుంచి వంట వాళ్లు వచ్చారు.

ఆ రోజు రాత్రి ఎదురు సన్నాహం జరిగింది. తర్వాత వధూవరులను కూర్చోబెట్టి చిన్న తంతు జరిపాడు పురోహితుడు. మర్నాడు ఉదయం 11 గంటల 8 నిమిషాలకు సుముహూర్తం.

శర్వాణి పెళ్లికుతురిగా ముగ్ధమనోహరంగా ఉంది. శ్యామల రావు హృదయం మధుర భావనలతో నిండిపోయింది. వేదమంత్రాలు, భజంత్రీలు మొగుతుండగా శర్వాణి మెడలో మూడుముళ్లు వేశాడు శ్యామల రావు.

మధ్యాహ్నం పెళ్లి విందు జరిగింది. పులిహోర, కంద బచ్చలి ముద్దకూర, దొండకాయ వేపుడు, టమేటా పప్పు, ముక్కల పులుసు, శనగపప్పు కొబ్బరిపచ్చడి, పూర్ణంబూరెలు, అప్పడాలు, వడియాలు! ఇదీ విందు మెనూ! హనుమంతువాక నుంచి మంచి అరటాకులు వచ్చినాయి. మొత్తం రెండు బంతులు వచ్చినాయి. వంటలన్నీ చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకున్నారు. సాయంత్రం నూతన దంపతులు వరాహనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ప్రసూనాంబ కూడ ఇంటికి పోయింది. శ్యామల రావు మూడు నిద్రలకని అత్తవారితో బాటు నర్సీపట్నం వెళ్ళాడు.

ఆ రోజు శ్యామల రావుకూ, శర్వాణికి శోభనం. బస్సులో టూ సీటర్లో ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. అదేమిటో గాని ఇద్దరికీ చాలా కాలం నుంచి చాలా సన్నిహితమైన బంధం ఉన్నట్లుగా అనిపించింది. భారతీయ వివాహ వ్యవస్థలోని గొప్పతనమే అది!

మధ్యగదిలో ఒక నవారు మంచం మీద కొత్తపరుపు, దుప్పటి పరిచారు. దుప్పటి మీద మల్లెలు చల్లారు. పక్కన స్టూలు మీద మగ్గుతో నీళ్లు పెట్టారు. ఇంకో చిన్న టీపాయి లాంటి దాని మీద స్వీట్లు, యాపిల్స్ ఉన్నాయి. నూతన దంపతులకు ఏకాంతం కల్పించాలని, జగన్నాథరావు దంపతులూ, మురళీ, ఇంకా ఇద్దరు ముగ్గురు దగ్గర బంధువులు, పక్క లైనులో తెలిసినవారి యిళ్లలో సర్దుకున్నారు. ఇంట్లో వీళ్లిద్దరే అన్నమాట.

శర్వాణికి, శ్యామల రావుకూ ఉద్వేగంగా ఉంది. ఇద్దరు మంచంమీద పక్కపక్కన కూర్చున్నారు. ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకోబోతూంటే, ఆపి,

“మీరేమి అనుకోవద్దు. కాసేపు ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం. తర్వాత..” అంటూ నవ్వింది శర్వాణి.

శ్యామల రావుకు కూడా నిజమే అనిపించింది.

“అత్తయ్య గారికి ఏవంటే యిష్టం? అంటే వంటకాలు, పద్ధతులు?”

శ్యామల రావుకు ఆశ్చర్యమనిపించింది – ‘భర్త యిష్టాయిష్టాలు తెలుసుకోకుండా, అత్తయ్య గురించి అడుగుతుందేమిటి?’ అని.

అదే ఆమెతో అంటే, “ఇప్పట్నించి మనం కలిసుంటాం. మన అభిరుచులు అలవాట్లు మెల్లగా తెలుసుకుంటాం. కాని మామయ్యగారు లేరు కదా, మీరే ఆమెకు అన్నీను. ఒక్కసారిగా మీరు నా వైపు మొగ్గుచూపడం మొదలుపెడితే ఆవిడ బాధపడతారు. కాబట్టి మీరు ‘కంట్రోల్లో’ ఉండాలి.”

“కంట్రోల్లో ఉండడమంటే?” అన్నాడు చిలిపిగా నవ్వుతూ. మెల్లగా ఆమె నడుం మీద చెయ్యివేసి, మెత్తని పొట్ట మీదకి జరుపుతున్నాడు.

సున్నితంగా అతని చెయ్యి తీసేసి, “ఇలాంటివి అత్తయ్య గారి ముందు నిషిద్ధం. ఏదయినా మన పడకగదికే పరిమితం కావాలి.”

“అవును నీవన్నది కరెక్ట్. మా అమ్మకు పొద్దున్నే ఫిల్టర్ కాఫీ పడాలి. ఆమె టిఫిన్ చేయదు. పదకొండున్నరకల్లా భోజనం చేస్తుంది. ఇల్లు నీట్‌గా ఉండాలి. మా అమ్మను ప్రతి శుక్రవారం కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి తీసుకుని వెళ్లాలి. ఇక వంటకాలంటావా, నాకేది యిష్టమో అవన్నీ చేసి పెడుతుంది గాని, ఆమెకేది యిష్టమో నేను ఆలోచించలేదు.”

“సరే. నాకర్థమయింది. ముందు ఆమెకు నా మీద మంచి అభిప్రాయం కలగాలి. అదీ ముఖ్యం. దాన్ని బట్టే మన సుఖశాంతులు ఆధారపడి ఉన్నాయి.”

శ్యామల రావుకు అబ్బురమనిపించింది. ‘ఎంత మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తూంది ఈ అమ్మాయి?’ అనుకున్నాడు.

“మీరు ఉద్యోగంలో చేరి ఎన్నేళ్లయింది?”

“రెండేళ్లు దాటింది.”

“జీతం అత్తయ్యగారికే యిస్తారా?”

“అదేం లేదు. తెచ్చి బీరువాలో పెడతాను. నెలవారీ కిరాణా, కూరగాయలు, అన్నీ నేనే తెస్తాను.”

“ఇప్పట్నుంచి పద్ధతి మారుతుంది. అవన్నీ నేనూ అత్తయ్యా కలిసి తెచ్చుకుంటాం. పొరపాటున కూడ జీతం తెచ్చి నా చేతికివ్వకండి.”

శ్యామల రావుకు అర్థమవుతోంది. “అలాగే” అన్నాడు.

“ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్యగారు మన వల్ల, ముఖ్యంగా నా వల్ల మనసు కష్టపెట్టుకోకూడదు. ఆమె సంతోషంగా ఉంటే మన సంసారం హాయిగా సాగిపోతుంది.”

“అవును. మరి నీ మీద నాకు మంచి అభిప్రాయం కలగడానికి ఏం చేయబోతున్నావు?” అని అడిగాడు గంభీరంగా.

అతని చెయ్యిపట్టుకుని, చెంపలు రాస్తూ, గుసగుసగా ఏదో అన్నది ఆ కొత్త పెళ్లికూతురు. అతని మనసు గంతులు వేసింది. ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరూ ఒకటైనారు.

మర్నాడు పొద్దున్న శ్యామల రావు లేచేటప్పటికి శర్వాణి తలంటు స్నానం చేసి, మెరూన్ కలర్ కాటన్ చీరలో, ముఖాన కుంకుమ, తలతో కనకాంబరాలమాలతో దర్శనమిచ్చింది. వచ్చి మంచం మీద కూర్చొని, అతని జుట్టు సవరిస్తూ, “లేవండి మరి. ఎనిమిది దాటింది. అమ్మావాళ్లు వచ్చేశారు. త్వరగా ముఖం కడుక్కుంటే, టిఫిను, కాఫీ..”

అలాగే ఆమెను మీదికి లాక్కోడానికి ప్రయత్నించాడు. “బయట అందరూ వున్నారు. ప్లీజ్!” అని వారించింది.

బావమరది మురళి శ్యామల రావును ఆటపట్టించటానికి, “ఏం బావగారూ, మా చెల్లెలు రాత్రి మీకు క్లాసు పీకినట్లుంది! దానివన్నీ చిత్రమైన ఆలోచనలు. వయసుకు మించి ఆలోచిస్తుంది” అన్నాడు.

శ్యామలరావు నవ్వి “అదేం లేదు లే బావా, క్లాసు పీకలేదు, ఏం లేదు” అన్నాడు.

అత్తగారు వచ్చి,” నాయనా, ఈ రోజు సోమవారం. మీరిద్దరూ ‘బలిఘట్టం’ వెళ్లి శివునికి అభిషేకం చేయించుకు రండి. ఒరేయ్ మురళీ, చెల్లెల్నీ బావను తీసుకు వెళ్ళు. నాయనా మీరు వచ్చింతర్వాత టిఫిన్ చేద్దురు.”

కాఫీలు తాగి ముగ్గురూ బయలుదేరారు. ఆర్.టి.సి. కాంప్లెక్లు ముందున్న కొట్లో కొబ్బరికాయ, పూలు, అరటిపండ్లు, కర్పూరము, అగరొత్తుల పాకెట్టు తీసుకున్నారు. ‘తుని’కి వెళ్లే బస్సెక్కి ‘బలిఘట్టం’లో దిగారు. చాలా దగ్గర. నాలుగు కిలోమీటర్లే. అక్కడ నుంచి రెండు ఫర్లాంగాల దూరం ఉంటుంది గుడి.

మధ్యలో ఏరు దాటాలి. ఏట్లో నీళ్లు మోకాలి వరకు వచ్చాయి. ఆ ఏటిని ‘ఉత్తరవాహిని’ అంటారు. గుడి చాలా పురాతనమైంది. బలి చక్రవర్తి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడనీ, చాలా మహిమాన్వితమైన క్షేత్రమనీ చెబుతారు. ఒక కొండ చుట్టూ ఆవరించి ఉంది. చుట్టూ పచ్చని చెట్లు. దాదాపు ముఫై మెట్లెక్కి పైకి చేరుకున్నారు. భక్తులు అంత ఎక్కువ మంది లేరు.

“శివరాత్రి బాగా జరుగుతుంది బావగారూ, ఇక్కడ” అన్నాడు మురళి.

దేవాలయమంతా నల్ల రాతినిర్మాణం. చుట్టూ ప్రాకారం. పుజారి ఏకవార రుద్రాభిషేకం చేశాడు. వీళ్ల గోత్రనామాలు చెప్పి అష్టోత్తరం చేశాడు. స్వామికి విభూతి రేఖలు దిద్ది, మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాడు. పానవట్టమంతా పూలతో అలంకరించాడు.

“అఘోరేభ్యోరఘోరఘోరతరేభ్యః..” అంటూ శివునికి హారతిచ్చాడు. మంత్రపుష్పం చదివి, నూతన దంపతులకు తీర్థ ప్రసాదాలిచ్చి, శఠగోప స్పర్శ చేయించాడు తలలకు.

చాలా ప్రశాంతంగా అనిపించింది. ‘ఎంత నిరాడంబరంగా ఉన్నాడు స్వామి!’ అనుకున్నాడు. అదే శర్వాణితో అంటే..

“అదేనండీ శివాలయానికీ, విష్ణావాలయానికీ తేడా! శివుడు అభిషేకప్రియుడు. ‘హరహరమహాదేవ’ అంటూ చెంచెడు నీళ్లు ఆయన మీద పోస్తే చాలు. విష్ణువు అలా కాదు, ఆ కైంకర్యాలు, సేవలు, వైభోగాలు.. అబ్బో!” అన్నది.

“బాగా చెప్పావు” అన్నాడు భార్య వైపు మెచ్చుకోలుగా చూస్తూ.

కాసేపు ముఖ మంటపంలో కూర్చొన్నారు. పూజారి వచ్చి “జగన్నాథం మాస్టారు మాకు బాగా తెలుసు బాబూ, మురళినీ, శర్వాణినీ ఇంతప్పటి నుంచి ఎరుగుదును. వారింటికి అల్లుడైనారు. చాలా సంతోషం. నర్సీపట్నానికి వచ్చినపుడు గుడికి వస్తూండండి” అన్నాడు.

“తప్పకుండానండి” అని జేబులోంచి పది రూపాయలనోటు తీసి ఆయన చేతిలో పెట్టి, భార్యతో సహా ఆయన కాళ్లకు మొక్కాడు శ్యామల రావు.

“ఆయుష్మాన్ భవ, దీర్ఘసుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్రప్రాప్తిరస్తు! ధన కనక వస్తు వాహన సమృద్ధిరస్తు” అని దీవించాడాయన

శర్వాణితో అన్నాడు. “అమ్మాయ్, ఏదైనా మంచి పాట పాడు తల్లీ”

“మా శర్వాణి చక్కగా పాడుతుంది సార్.”

“నాకెందుకు తెలియదండీ” అన్నాడు శ్యామలరావు.

“మీరు కూడా బాగా పాడతారట..” అన్నది శర్వాణి.

“నీకెవరు చెప్పారు?” అన్నాడు ఆశ్చర్యంగా.

“అత్తయ్యగారు చెప్పారు లెండి” అన్నది నవ్వుతూ.

‘జననీ శివకామిని..’ అన్న పాటను చక్కగా పాడింది. గుడిలో ఆమె గొంతు మరింత బాగా పలికింది.

మురళి అన్నాడు “బావగారు, మరి మీరు?”

“మీ చెల్లి అంత బాగా పాడలేను మురళీ. ప్రయత్నిస్తాను” అని “నీలకంధరా దేవా, దీనబాంధవా రావా, నన్నుగావరా…” అన్న పాటను పాడాడు శ్యామల రావు. అతని గొంతు బాగుంటుంది. చక్కగా వచ్చింది పాట.

శర్వాణి మగనివైపు అబ్బురంగా చూసింది. “ఎంత బాగా పాడారండి! మీ ముందు నేను…” అంటూంటే ఆపి, “నీవేం తక్కువ కాదు. నీ పాట కూడా..” అన్నాడు శ్యామల రావు.

మురళి కల్పించుకుని, “ఇద్దరికిద్దరే, సరిపోయారు! మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో!” అన్నాడు.

ముగ్గురూ రోడ్డు మీదికి వచ్చి తుని నుంచి వస్తున్న బస్సు ఎక్కి నర్సీపట్నం అబిద్ సెంటరులో దిగారు. అప్పటికింకా పది కాలేదు.

“బావా, రండి. మా ఊరి ఉడిపి హోటల్‌లో పెసరట్టు ఉప్మా బాగుంటుంది. తిని వెళదాం” అన్నాడు మురళి.

“మరి అమ్మ టిఫిన్ చేసుంటుందేమో కదరా అన్నయ్యా!” అన్నది చెల్లి.

“ఇడ్లీలని చెప్పిందిలే, అవి రాత్రి తిందాం.” అంటూ హోటలుకు దారితీశాడు. అది చిన్న హోటల్. చాలా రష్‌గా ఉంది. పది నిమిషాలు నిలబడితే గాని సీట్లు దొరకలేదు. పెసరట్టుప్మా మురళి చెప్పినట్లే చాలా బాగుంది. కాఫీ కూడా తెప్పించాడు. ఇంటికి వెళ్లి అమ్మకు చెప్పేశారు.

సాయంత్రం సినిమాకు దేనికైనా పోదామని అన్నాడు శ్యామల రావు.

“బంగార్రాజు థియేటర్లో వెంకటేశ్ సినిమా ‘చంటి’ ఆడుతోంది, వచ్చి యాభైరోజులు దాటిందనీ, చాలా బాగుందని అందరూ అంటున్నారు” అని చెప్పాడు మురళి. రామారావుపేటకు ఆ థియేటరు చాలా దగ్గర. సాయంత్రం అత్తగారు చేసిన పొట్లకాయ బజ్జీలు తిని బయలుదేరారు. “పానకంలో పుడకలాగా నీ వెందుకురా వాళ్ల మధ్యన?” అని తల్లి అంటూంటే, “నిజమేనే, నాకు తోచనే లేదు” అని బావమరిది అనడం శ్యామల రావుకు వినబడింది. లోపలికి వెళ్లి, “మురళీ, అలాంటిదేం లేదు. నాకు తమ్ముళ్ళూ, అన్నయ్యలు లేరు. ఇప్పటినుంచి నీవు నాకు ‘బ్రదర్-ఇన్-లా’వు మాత్రమే కాదు, బ్రదర్‍వి కూడా. పద వెళదాం” అన్నాడు. ఆ మాటలకు బావమరది కళ్లు చెమరించుకున్నాడు.

వీళ్లు ముగ్గురూ వెళ్లింతర్వాత జగన్నాథరావు భార్యతో అన్నాడు “విశాలా, అల్లుడు చాలా మంచివాడే. మన అమ్మాయి అదృష్టవంతురాలు.”

“అవునండి, ప్రసూనాంబగారు కూడా చాలా మంచావిడ. పెళ్లిలో చూశాము కదా, ఎక్కడా ఒక్క సొడ్డు మాట అనలేదు” అన్నదామె.

దారిలో, “పాలిటెక్నిక్‍లో నీది ఏ ట్రేడు మురళీ?” అని అడిగితే “మెకానికల్ బావా” అని చెప్పాడు. గరివిడికి నర్సీపట్నం కంటే వైజాగు దగ్గర కాబట్టి తరచూ వస్తూండమని చెప్పాడు శ్యామల రావు.

బంగార్రాజు థియేటరు చాలా పెద్దది. మూడు బాల్కనీ టికెట్లు తెచ్చాడు మురళి. అన్ని రోజులైనా జనం బాగానే ఉన్నారు. ఇంటర్వల్‌లో సమోసాలు తిన్నారు. కూల్ డ్రింక్స్ తెస్తానంటే వద్దన్నాడు అల్లుడు.

సినిమా అయిపోయింతర్వాత ఇంటికి వస్తున్నారు. “సినిమా ఎలా వుంది శర్వాణీ” అనడిగితే “పాటలు బాగున్నాయి. అయినా అంత అమాయకుడుగా చూపించారు ఆ వెంకటేశ్‌ను, మరి ఫైటింగులు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు. క్యారెక్టర్‌లో ఏదో అసహజత్వం అనిపించడం లేదూ మీకు?” అనడిగింది భర్తను.

“ఆ మాత్రం మాస్ ఎలిమెంట్ లేకపోతే, ఎవరు చూస్తారే?” అన్నాడు మురళి.

శ్యామలరావు అన్నాడు – “నా మటుకు నేను సినిమాను ఒక వినోద కాలక్షేపం గానే చూస్తాను. వాళ్లకు డబ్బు, మనకు టైంపాస్ తప్ప సినిమాల వల్ల సమాజానికి ఒరిగిందేమీ లేదు. అందుకే నేను చూడ్డమే తప్ప పెద్దగా తర్కించను.”

“అలా అనకండి. చాలా సినిమాలు ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్‌వి. కొన్ని కొత్తవి కూడా మానవ సంబంధాలను ఎంత బాగా చూపించాయి? మన పురాణాలను, చరిత్రను వివరంగా సామాన్య జనానికి తెలియచేసింది ఆ సినిమాలే కదా?”

“అఫ్‌కోర్సు నిజమే. నేనంటున్నది కమర్షియల్ సినిమాల గురించి. కళాఖండాల గురించి కాదు.”

“అయితే సరేనండి శ్రీవారు!’ అన్నది శర్వాణి. ముగ్గురూ నవ్వుకున్నారు.

రాత్రి భోజనంలోకి కట్టుచారు, చామదుంపల వేపుడు, కంది పచ్చడి చేసింది విశాలాక్షి.

మూడు రోజులూ గడిచిపోయాయి. అందరూ విశాఖ చేరుకున్నారు. మరుసటి రోజు శ్యామల రావు దంపతులు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. వీళ్లు వాళ్లూ ముఖ్యమైన బంధువులూ కలిసి ఇరవైమంది అయినారు. వంట వియ్యపురాండ్లిద్దరే చేశారు. ప్రసూనాంబ కోడల్ని వంటింట్లోకి కూడా రానివ్వలేదు.

తల్లిదండ్రులు వెళ్లిపోతూంటే శర్వాణికి కన్నీళ్లు ఆగలేదు. మురళి ఇట్నుంచి ఇటే గరివిడి వెళ్లిపోయాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version