[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[సాహితి ప్రేమించిన గిరిధర్‌తో పెళ్ళి చేయడానికి అంగీకరిస్తాడు శ్యామల రావు. ఒకరోజు గిరిధర్ తండ్రి మేఘశ్యామ్‍లాల్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. వాళ్ళని హైదరాబాద్ రమ్మని ఆహ్వానిస్తాడు. శ్యామల రావు, సాహితీ, మురళీ వెళ్తారు. గిరిధర్ కుటుంబం వారిని ఆహ్వానించి, ఆదరిస్తుంది. వాళ్ళ పద్ధతులు, మన్నన చూసి సంతోషిస్తాడు శ్యామల రావు. వాళ్ళని వైజాగ్ రమ్మని పిలుస్తాడు. ఓ రోజు వాళ్ళు వచ్చి శ్యామల రావు ఇంట్లో చర్చలు జరుపుతారు. పెళ్ళి ఎలా చేయాలి, పెట్టుపోతల గురించి మాట్లాడుకుంటారు. ఆగస్టు 13 అర్ధరాత్రి వివాహం జరుగుతుంది. పెళ్ళయి కూతురు కాపురానికి వెళ్ళిపోతుంటే శ్యామల రావు చాలా బాధపడతాడు. కాలగమనంలో రెండేళ్ళు గడిచిపోతాయి. సాత్విక్ ఇంజనీరింగ్ పూర్తవుతుంది. గుర్‌గావ్ టిఎస్‌సిలో వచ్చిన ఆఫర్‌ని కాదనుకుని, వైజాగ్ లోనే హెచ్.యస్.బి.సి.లో చేరుతాడు. శ్యామల రావు ఆశ్చర్యపోతాడు. కారణమడిగితే, తండ్రిని వదిలి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదని చెప్తాడు సాత్విక్. శ్యామల రావుకింకా నాలుగేళ్ళ సర్వీస్ ఉండడంతో, ఎస్. కోటకు బదిలీ చేస్తారు. సాహితికి కూతురు పుడుతుంది. వాళ్ళ సంసారం సుఖంగా సాగిపోతోంది. కొడుక్కి పెళ్ళి చేయాలని చూస్తాడు శ్యామల రావు. సాత్విక్ ఒప్పుకోడు. ఓ రోజు ఉన్నట్టుండి శ్యామల రావుకి మైల్డ్ హార్ట్ ఎటాక్ వస్తుంది. కొడుక్కి ఫోన్ చేస్తాడు. సాత్విక్ దగ్గరలోనే ఉండడంతో, వెంటనే వచ్చి హాస్పిటల్‌కి తీసుకువెళ్తాడు. దారిలో సార్బిట్రీట్ మాత్ర ఒకటి కొని తండ్రి నాలుక క్రింద పెడతాడు. హాస్సిటల్‌లో చికిత్స తరువాత ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్తాడు. మూడు నెలల తర్వాత శ్యామల రావు మామూలవుతాడు. పెళ్ళి చేసుకోమని ఎంత చెప్తున్నా కొడుకు పట్టించుకోకపోవడం అతనికి కోపం తెప్పిస్తుంది. చివరికి తనకి తెలిసిన ఓ మహిళని పెళ్ళి చేసుకున్నట్టుగా నాటకం ఆడి, ఇంటికి తీసుకువస్తాడు. దండలతో గుమ్మం ముందు వాళ్ళని చూసిన సాత్విక్ చిరాకు పడతాడు. పిన్ని ధోరణి అతనికి నచ్చదు. వాళ్ళ మీద కోపం పట్టలేక, తన బాధ కుతూహలమ్మ గారితో చెప్పుకుందామని వెళ్తాడు. – ఇక చదవండి.]
సాత్విక్ వెళ్లేసరికి కుతూహలమ్మగారు లంచ్ చేసి, కాసేపు కునుకు తీసి టి.వి చూస్తున్నారు. ఎక్కడో సువార్త కూటములు జరుగుతూంటే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కాలింగ్ బెల్ శబ్దం విని వంట కమ్ పనిమనిషి తలుపు తీసింది. ఆమె ఉదయం నుంచి రాత్రి వరకు మేడంగారి తోనే ఉంటుంది.
వెళ్లి ఆమెకు విష్ చేసి ఎదురుగ్గా సింగిల్ సోఫాలో కూర్చున్నాడు. ఆమె టి.వి. ఆపేసి, “ఏంటి స్మార్ట్ ఫెలో ఇలా వచ్చాడు? మా శ్యామూ బాగున్నాడా?” అని అడిగింది.
సాత్విక్ పలకలేదు. అతని ముఖం జేవురించి ఉంది.
పిల్లవాడు ఎందుకో బాధపడుతున్నాడని ఆమెకు అర్థమైంది. పనామెకు టీ పెట్టమని చెప్పింది. డబ్బాలో మురుకులున్నాయి. ఇద్దరికీ యివ్వమంది. “ఇలా రా నాన్నా!” అంటూ తన పక్కన కూర్చోపెట్టుకుంది. “ఏమయిందిరా అలా ఉన్నావు?” అని అడిగింది లాలనగా.
కళ్లనిండా నీళ్లతో ఆమె వైపు చూశాడు. “మీ తమ్ముడు పెళ్లి చేసుకుని, ఒకావిడను ఇంటికి తీసుకొచ్చాడాంటీ!” అన్నాడు. ‘నాన్న’ అనకుండా ‘మీ తమ్ముడు’ అనడంతోనే వాడెంత కోపంగా ఉన్నాడో ఆమెకు తెలిసిపోయింది. ఒక్కక్షణం తాను సరిగ్గానే విన్నదా అని ఆలోచించింది. తర్వాత ప్రారంభమైంది ఆమె నవ్వు! తెరలు తెరలుగా నవ్వసాగింది.
“అబ్బ, నావల్ల కాదురా అబ్బాయ్!” అంటూనే మళ్లీ మళ్లీ నవ్వింది.
“మీరు పెద్దవారు, మా కుటుంబానికి ఎంతో కావలసినవారని, మీతో చెప్పుకుందామని వస్తే మీరింతగా నవ్వుతున్నారేంటి ఆంటీ!” అన్నాడు.
“నవ్వక! నీకు యింకా అర్థం కాలేదా, పిచ్చోడా?” అంది.
అయోమయంగా చూశాడు.
“మీ అమ్మంటే మీ నాన్నకు ఎంత ప్రేమ! ఆమె పోయిన తర్వాత, మళ్లీ పెళ్లి చేసుకొమ్మని అతన్ని బలవంతపెట్టిన వారిలో నేనూ ఉన్నాను. అతను అప్పుడు యవ్వనంలో ఉన్నాడు. అందరికీ ఒకటే చెప్పేవాడు. ‘ఈ జన్మకు శర్వాణీ నా భార్య. ఆమెకు భర్తనైనందుకు గర్వపడుతున్నాను’ అని!
ఈ వయసులో ఉన్నట్లుండి పూలమాలలు వేసుకుని ఎవరినో తీసుకుని పెళ్లి చేసుకున్నామని వస్తే నమ్మేయటమే! ఎంత సింపుల్‍గా చేసుకున్నా ఎంత తతంగం ఉంటుంది. తప్పకుండా మీ నాన్న నాటకం ఆడుతున్నాడు రోయ్! నీవు స్మార్ట్ ఫెలోవి అనుకున్నానింకా!”
సాత్విక్‌కు కళ్ల ముందు ఏవో పొరలు తొలగిపోతున్నట్లు అనిపించసాగింది. “అంతేనంటారా ఆంటీ!” అన్నాడు ఆనందంగా. “ఎందుకలా చేస్తున్నాడంటారు?”
“సింపుల్ లాజిక్. తన కోసం నీవు పెళ్లి చేసుకోనంటున్నావు. ఇలా చేస్తే తన మీద నీకు ‘అవర్షన్’ డెవలప్ అవుతుంది. ఆయన తన బ్రతుకు తాను చూసుకున్నపుడు, నేనూ..”
“అర్థమయిందాంటీ! థాంక్యూ! మీ దగ్గరికి రావటం మంచిదైంది. వస్తానాంటీ!” అని బయలుదేరబోతూంటే
“ఉండుండు! ఆ మురుకులు తిను. టీ వస్తూంది! తాగి వెళుదువుగాని” అన్నారావిడ. మధ్యాహ్నం సరిగా తినలేదేమో అతనికి ఆకలేస్తూంది. గబ గబా మురుకులు తినసాగాడు. కుతూహలమ్మగారు తన ప్లేట్ లోనివి కూడా వాడి ప్లేట్లో వేశారు. టీ తాగి, వంగి ఆమె పాదాలను తాకాడు.
“ఇంటికి వెళ్లి నీ నటనా కౌశలం చూపించు. ఆమెను నీవు యాక్సెప్ట్ చేస్తున్నట్లు బిల్డప్ యివ్వు. రెచ్చిపో రా అల్లుడూ!” అన్నదామె.
“హేయ లంబూ, హేయ్ జంబూ, ఇక మీరు విజృంభించండి!” అని ఘటోత్కచుని గురువు ‘మాయాబజార్’ క్లైమాక్స్‌లో తన అనుచరులకు చెప్పినట్లున్నాయి ఆమె మాటలు.
ఇంటికి వెళ్లాడు. ‘అమ్మ నా డాడీ! ఆస్కార్‌కు నామినేట్ చేయొచ్చు మీ ఇద్దరినీ!’ అనుకున్నాడు దారిలో. వీడు వెళ్లేసరికి సోఫాలో దూరదూరంగా కూర్చున్నవారు కాస్తా, వీడిని చూసి గబుక్కున దగ్గరకు జరిగి రాని నవ్వులు నవ్వడం మొదలు పెట్టారు. అది గమనించి సాత్విక్‍కు నవ్వు వచ్చింది.
వెళ్లి ఆమె ముందు నిలబడి “పిన్నీ! అయాం వెరీ సారీ! మీ వల్ల మాయింటికే వెలుగొచ్చింది. ఉండండి! వేడివేడి ఉల్లిపాయ పకోడీలు వేసుకుని వస్తా ఇద్దరికీ. సాయంత్రం అమ్మవారి గదికి వెళదాం నాన్నా, మీ ఇద్దరి పేర అర్చన చేయిస్తానని మొక్కుకున్నా” అన్నాడు.
వాడు వెళ్లిం తర్వాత హీరో హీరోయిన్లిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు.
“డామిట్! కథ అడ్డం తిరిగింది!” అన్నాడు శ్యామల రావు గిరీశం లెవెల్లో! “మధ్యాహ్నం వరకు ధుమధుమలాడుతూనే ఉన్నాడు. బయటికి వెళ్లొచ్చిన తర్వాత యిలా మారిపోయాడెందుకు?” అన్నది ఉత్తుత్తి పిన్ని.
“అదే అర్థం కావడం లేదు!” అన్నాడు శ్యామల రావు అయోమయంగా.
తర్వాత సాత్విక్ నట విశ్వరూపం ముందు; యస్.వి.రంగారావు గారు ఫ్రేములో ఉంటే ఇతర నటులు ‘అండర్‌మైన్’ ఐనట్లు వీళ్లిద్దరి నటన వెలవెలబోయింది. మర్నాడు సాయంత్రం ‘పిన్ని’ని వాళ్లింట్లో దిగబెట్టి వచ్చాడు సాత్విక్.
వారం రోజులు గడిచాయి. మళ్లీ పెళ్లి ప్రసక్తి తెచ్చాడు శ్యామల రావు. నీవి అర్థం లేని భయాలన్నాడు. అందరు కోడళ్లు ఒకలా ఉండరన్నాడు. ఇద్దరికి మాటామాటా పెరిగింది. ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. రాత్రి సాత్విక్ ఆఫీసు నుంచి వచ్చే సరికి శ్యామల రావు ఇంట్లో లేడు. టీపాయ్ మీద ఒక కాగితం మీద టీవీ రిమోట్ ఒత్తుపెట్టి ఉంది. అందులో ఇలా రాసి ఉంది.
‘నాన్నా, ఎంత చెప్పినా నీవు మనసు మార్చుకోవడం తీదు. పైగా ఎదిరించి మాట్లాడుతున్నావు! నా మనసు విరిగిపోయింది. నేను వెళ్లిపోతున్నాను. నా కోసం వెతక్కు. నేనే లేనప్పుడు, నీకు పెళ్లి చేసుకోడానికి అభ్యంతరం ఉండదని ఆశిస్తున్నాను. ఇట్లు.. కన్నకొడుకు సుఖం చూసుకోలేని.. నాన్న!.’ నిర్ఘాంతపోయాడు సాత్విక్. ఎందుకిలా చేస్తున్నాడు నాన్న? తన మనసు అర్థం చేసుకోడెందుకు? వెంటనే మామయ్యకు ఫోన్ చేశాడు. అక్కడికి రాలేదని చెప్పాడు మురళి. అక్కకు చేశాడు. వాళ్లు ప్రస్తుతం భీమవరంలో పని చేస్తున్నారు. అక్క కూడా తమ దగ్గరికి రాలేదంది. కంగారుపడవద్దనీ, నిన్ను బెదిరించడానికని ఎవరయినా ఫ్రెండింటికి వెళ్లి ఉంటాడనీ ఉదయానికి వచ్చేస్తాడని చెప్పింది. నాన్న ఫ్రెండ్స్ కొందరికి ఫోన్ చేస్తే రాలేదన్నారు.
పిచ్చెక్కినట్లుంది. రాత్రి ఏమన్నా తిన్నాడో లేదో? చారు, ఏదైనా వేపుడు లేకపోతే అస్సలు తినలేడు. రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు సాత్విక్. అందర్నీ విచారించాడు గాని కుతూహలమ్మగారిని మరచిపోయాడు! ఉదయం లేటుగా లేచి, టీ పెట్టుకుని తాగాడు. ఆ రోజు సెలవు కావాలని వాళ్ల బాస్‌కు మెయిలు పెట్టాడు.
సాయంత్రం వరకు చూసి, మధురవాడ పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేద్దామనుకున్నాడు. కొడుక్కు టెన్షన్ పెట్టాలనే తండ్రి ఉద్దేశం. ‘పోనీ ఆయన మాట విని పెళ్లి చేసుకుందామా’ అనుకున్నాడు. కానీ భయమేసింది. ‘అమ్మో! వద్దే వద్దు’ అనుకున్నాడు.
మధ్యాహ్నం ఉప్మా చేసుకున్నాడు కాని సయించలేదు. నాలుగు గంటలకు టీ పెట్టుకొని తాగాడు. మళ్లీ కొందరికి ఫోన్ చేశాడు. వాళ్ల దగ్గరికి పోలేదట. తండ్రి సెల్ టివి దగ్గరే ఉంది. ఆయన మందుల పెట్టె కూడా. ఈ మధ్య షుగర్ బార్డర్‌లో ఉందనీ, వాకింగ్ పెంచాలనీ, టీ కాఫీలలో షుగర్ తీసుకోవద్దనీ, కాన్‍సన్‌ట్రేటెడ్ షుగర్స్ ఐన స్వీట్స్, ఐస్క్రీమ్స్, కొన్ని రకాల పళ్లు తినద్దనీ డాక్టరుగారు చెప్పారు.
తలుపులు తాళం వేసి బైక్ స్టాండ్ తీస్తూంటే ఇంటి ముందు కారు ఆగింది. అందులోంచి కుతూహలమ్మగారు, శ్యామల రావు దిగారు.
“నాన్నా, ఎక్కడికెళ్లావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా?” అంటూ వీధిలోనే తండ్రిని వాటేసుకున్నాడు. “ఇప్పుడే పోలీస్ రిపోర్టు ఇవ్వడానికి వెళుతున్నాను. సెల్ ఇంట్లో వదిలేశావు. మందులు కూడా తీసుకెళ్లలేదు. చూడండి మేడం ఈయన? అయామ్ బికమింగ్ మ్యాడ్ డే బై డే!” అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
“నో నీడ్ టు బికమ్ మ్యాడ్, మై డియర్ స్మార్ట్ ఫెలో” అన్నదామె. “పదండి లోపలికెళదాం.”
ముగ్గురు యింట్లోకి వెళ్లారు.
“నిన్న రాత్రి మా యింటికి వచ్చాడు. వచ్చినట్లు నీకు ఫోన్ చేయద్దు అన్నాడు. ‘వాడికి తెలిసి రావాలి’ అంటున్నాడు. పిల్లవాడిని ఎందుకిలా సతాయిస్తున్నావని తిట్టాను. వాడి మొండితనం వెనుక నీ పట్ల ఉన్న యునీక్ కన్సర్న్ నీవెందుకు గ్రహించడం లేదని మందలించాను. నచ్చచెప్పి తీసుకొచ్చాను.”
“థాంక్యూ మేడమ్! మీరొక్కరే నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారు” అన్నాడు. ‘నా పాయింట్ ఆఫ్ వ్యూను ఆమె గ్రహించింది అంతే చాలు’ అనుకున్నాడు. కుదరకపోతే అట్నుంచి నరుక్కు రమ్మన్నారు. అదే స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉందామె.
“మీ సమస్య పరిష్కారానికి నేను తీవ్రంగా ఆలోచించి ఒక కన్‌క్లూజన్‌కు వచ్చాను రా అబ్బాయ్! మీ నాన్నకు కూడా చెప్పాను. నీవు నేను చెప్పింది కాదనకూడదు. అంతా నాకు వదిలెయ్యండి. మీ యిద్దరికీ నేనంటే యిష్టమా కాదా? నా మీద నమ్మకం ఉందా లేదా?” అనడిగిందామె తండ్రీ కొడుకులను. “మీకంటే మా బాగు కోరేవారెవరు మేడమ్. అలాగే!” అన్నారు.
“అయితే ముందు ఏవైనా స్నాక్స్ చెయ్యి స్మార్ట్ ఫెలో! నీవు బాగా చేస్తావట!” అన్నదామె నవ్వుతూ. తండ్రి వచ్చేశాడన్న సంతోషంతో వంటింట్లోకి వెళ్లాడు. బ్రెడ్ స్లైసులు రెండు భాగాలు చేసి బ్రెడ్ బజ్జీలు వేసి ఇద్దరికీ యిచ్చాడు. కుతూహలమ్మ గారి మనసులో ఏముందో మరి!
***
మరి కొన్ని రోజులు గడిచాయి. తండ్రీకొడుకుల మధ్య మళ్లీ పెళ్లి విషయమై గొడవలు రాలేదు. కుతూహలమ్మ గారి నుంచి ఏ వర్తమానమూ లేదు. బహుశా అప్పుడు ఇద్దర్ని శాంతింపచేయడానికి ఏదో చెప్పి ఉంటుంది లెమ్మని అనుకున్నాడు సాత్విక్. కానీ అతనికి ఆ రోజు మేడం గారింట్లో ఆమెకూ తండ్రికీ జరిగిన చర్చ గురించి తెలియదు.
కొడుక్కు చెప్పకుండా ఉత్తరం రాసిపెట్టి తన యింటికి వచ్చిన శ్యామల రావును చూసి కంగారు పడలేదు ఆమె. కొడుకును దారి లోకి తెచ్చుకోడానికి మరో స్ట్రాటజీ ఇదని అర్థమైంది ఆమెకు. “ఇలా ఎంత కాలం శ్యామూ?” అన్నది ఆవేదనగా.
“చేజేతులారా జీవితం నాశనం చేసుకుంటుంటే చూడలేకపోతున్నాను మేడమ్! ఒకోసారి జీవితం మీద విరక్తి పుడుతోంది అంటే నమ్మండి.
ఇంతమంది తండ్రులున్నారు, కొడుకులున్నారు! వీడిలా ఎవరూ ఆలోచించడం లేదు. భార్య నన్ను ఇల్‍ట్రీట్ చేస్తుండేమోనని అనవసరంగా అపోహ పడుతున్నాడు.”
కుతూహలమ్మగారన్నారు. “ఇదేదో మానసిక సమస్యలా అనిపిస్తుంది శ్యామూ! ఎవరికైనా చూపిస్తే మంచిది.”
“అంటే సైకియాట్రిస్ట్ కంటారా? రమ్మంటే వస్తాడా అసలు?”
“సైకియాట్రిస్టుకు సంబంధించినంత సీరియస్ ప్రాబ్లమ్ కాదిది. దిసీజ్ ఓన్లీ ఎ సైకలాజికల్ ఇష్యూ! నేను అనంతపురంలో డి.వి.ఇ.వో.గా పని చేసేటప్పుడు ‘ముచికుందప్పగార’ని ‘శింగనమల’ కాలేజి ప్రిన్సిపాల్‍గా నా జ్యురిస్‌డిక్షన్‌లో పని చేసేవారు. వాళ్లబ్బాయి ఒకరు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, సైకాలజీలో పి.హెచ్‌డి చేశాడనీ, తర్వాత అతనికి మన ఆంధ్ర యూనివర్సిటీలోనే అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చిందనీ చెప్పినట్లు గుర్తుంది. ఆయన నాకంటే ముందే రిటైరైనారు. అనంతపురం డి.వి.ఇ.ఓ. గారికి ఫోన్ చేసి, వివరాలు కనుక్కుంటానుండు” అని తన సెల్ లోంచి ఫోన్ చేశారు. అవతల ఎత్తారు. “నమస్తే. నమస్తే. బాగున్నారా పద్మనాభరెడ్డి గారూ! ఒక చిన్న సహాయం కావాలి. ముచికుందప్ప గారి నంబరు కావాలి. పది నిమిషాల్లో చేస్తారా? సరేనండి” అని కాల్ ముగించింది.
“లెటజ్ వెయిట్!” అన్నారు. పావుగంట తర్వాత ఫోన్ మోగింది. “ఓ.కె. అయితే మరీ మంచిది. నంబరు చెప్పండి” అని శ్యామల రావుకు నంబరు ఫీడ్ చేయమని సైగ చేశారు. అవతలనుండి వారు నంబరు చెబుతుంటే ఆవిడ రిపేట్ చేస్తూంటే శ్యామల రావు నంబరు ఫీడ్ చేశాడు తన సెల్‍లో. పేరు కూడా. ప్రొఫెసర్ సౌమ్యనాధ్ అతని పేరు.
నంబరు కొట్టి ఇమ్మన్నారు మేడమ్. “హలో! ప్రొఫెసర్ సౌమ్యనాధ్ గారా! నమస్తే! నా పేరు కుతుహలమ్మ అండీ. మీ నాన్నగారు అనంతపురంలో, శింగనమల కాలేజీలో పని చేసినపుడు నేను ఆ జిల్లా డి.వి.ఇ.ఓ.గా ఉండేదాన్ని. నాన్నగారు, అమ్మగారు మీ దగ్గరనే ఉన్నారట! వెరీ గుడ్! మీతోనే ఒక విషయం డిస్కస్ చేయాలి. ఎప్పుడు రమ్మంటారు? అలాగే, అలాగే. తప్పక వస్తాము.” చెప్పి కాల్ ముగించిందామె.
“వచ్చే ఆదివారం ఉదయం పదకొండు తర్వాత రమ్మన్నారు” అని శ్యామల రావుతో చెప్పిందామె. “అబ్బాయితో ఏమీ చెప్పకు శ్యామూ!”
ఆదివారం, అనుకున్నట్లుగానే, టిఫిన్ చేసి, ఒక ఫ్రెండ్‌ను కలవడానికి వెళుతున్నానని కొడుక్కు చెప్పి, కుతూహలమ్మ గారింటికి వచ్చాడు శ్యామల రావు. ఇద్దరూ కలిసి వాల్తేరు మెయిన్ రోడ్ లోని ఒక బైలైన్ ఉన్న ప్రొఫెసర్ గారి అపార్టుమెంటుకు వెళ్లారు మేడం గారి కారులో.
ముచికుందప్ప గారు, కుతూహలమ్మగారికి నమస్కరించి, ఇద్దరినీ ఆహ్వానించారు. పొఫెసర్ గారిది చిన్న వయసే. నలభై లోపే ఉంటాయి. వీళ్లకు చేతులు జోడించి నమస్కరించాడాయన. ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో లభించే గౌరవమది. పైగా మేడం గారు తన తండ్రికి పైఅధికారి కూడాను.
అందరూ కూర్చున్నారు. ప్రొఫెసర్ గారి భార్య వచ్చి అందరికీ వాముపూస, రవ్వలడ్డు ఇచ్చింది. తర్వాత టీ.
ముచికుందప్పగారు కుటుంబ సభ్యులతో చెప్పారు – “నా రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ అన్నీ త్వరగా శాంక్షన్ కావడానికి కారణం మా డి.వి.ఇ.ఓ. మేడం గారే. కడవ ఆర్.జె.డి గారికి చెప్పి, త్వరగా పెన్షన్ ప్రపోజల్స్ ఎ.జి ఆఫీసుకు పంపించేలా చూశారు.”
“సరేలెండి. ఆర్.జె.డి గారు నేనూ జె.యల్స్‌గా విజయనగరం జిల్లా గార కాలేజీలో పని చేశాము. ఆ స్నేహం వల్ల చెప్పగలిగాను. ఆయన వినాలని లేదుగా? కొందరు క్యాడర్ పెరిగింతర్వాత, పాత మిత్రులను పట్టించుకోరు. కొండల్రావుగారు నా మాట మన్నించి మనకు సాయం చేశారు. అంతే!” అన్నారామె. చేసిన మేలును చెప్పుకోరు సౌశీల్యపరులు!
సౌమ్యనాధ్ గారు పేరుకు తగినట్లు చాలా నెమ్మదస్థులు.
ఆయన మాట కూడా చాలా మృదువుగా ఉంది.
“ప్రొఫెసర్‌గారి పేరు చక్కగా ఉంది. ఇటువైపు ఆ పేరు ఎక్కడా వినలేదు.”
ఆయన, వివరించమన్నట్లు, తండ్రి వైపు చూశాడు.
“మాది కడప జిల్లా అండి. పోరుమామిళ్ల. ఆ రాయలసీమ నాలుగు జిల్లాలూ ఫోర్త్ జోన్ పరిధి లోకి వస్తాయి కాబట్టి, చిత్తూరు తప్ప మూడు జిల్లాల్లో పనిచేశాను నేను, లెక్చరర్‍గా, పిన్సిపాల్‌గా”
“మీ సబ్జెక్టు మాస్టారు?” అని అడిగాడు శ్యామల రావు.
“ఎకనామిక్సండి. వెంకటేశ్వర యూనివర్సిటీ! మావాండ్లది (భార్య) మా జిల్లా లోనే నందలూరని కడప – తిరుపతి హైవేలో ఒంటిమిట్ట తర్వాత వస్తుంది. అక్కడ వెంకటేశ్వరస్వామి వారిది చాలా పురాతనమైన, దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత గల, దేవళం ఉంది. ఆ స్వామిని సౌమ్యనాధస్వామి అంటారు. నరసింహుల వారు హిరణ్యకశ్యపుని వధించిన తర్వాత, మహోగ్రరూపాన్ని మామూలు స్థితికి తెచ్చుకోకుండా అందరినీ భయభ్రాంతులను చేస్తూ ఉంటే వెంకటేశ్వరస్వామి వారు తన దగ్గరికి, అంటే నందలూరికి తీసుకొని వచ్చి, శాంతింపజేశారట. అప్పటినుంచి ఆయన సౌమ్యనాధ స్వామి అని పిలువబడుతున్నారట. పక్కన యోగానంద నరసింహస్వామి వారు కూడా వెలసి ఉన్నారు. వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో కేవలం రెండు ప్రమిదలు మాత్రమే వెలిగిస్తారు. స్వామివారు ఎనిమిదడుగుల విగ్రహం. నయన మనోహరంగా ఉంటారు. అభయముద్రను దాల్చి ఉంటారు. ఆయన పేరే మా వాడికి పెట్టారు మా మామగారు. వాడు నందలూరు లోనే పుట్టాడు లెండి.”
‘తండ్రి, లక్ష్మీనరసింహ!’ అని మనసు అనే స్వామికి మొక్కుకున్నాడు శ్యామల రావు.
‘కుతుహలమ్మగారు క్రిస్ట్రియన్ కదా. నాన్న మరీ వివరంగా చెప్పి, ఆమెను విసిగిస్తున్నారేమో’ అనుకున్నాడు ప్రొఫెసర్ సౌమ్యనాధ్. ఆమె ఆసక్తిగా వింటూండడం గమనించి రిలాక్స్ అయ్యారు.
“ప్రమిదలు రెండూ స్వామి మీద పడకుండా పక్కకు తిప్పేస్తాడు పూజారి. అప్పుడు గర్భాలయం చీకటవదు సరికదా, బయటి పగటి వెలుగు స్వామి వారి విగ్రహంపై చక్కగా ప్రసరించి, స్వామి స్పష్టంగా కనపడతారు. అదే ఆ ఆలయం లోని విశేషం. ఒంటిమిట్ట రాముల వారిని దర్శించుకున్న వారంతా నందలూరు సౌమ్యనాధుని దర్శించుకోకుండా వెనక్కిరారు.”
“గాడ్స్ వేస్ ఆర్ అన్ ఇమాజినబుల్ అండ్ యునీక్!” అన్నారు కుతూహలమ్మగారు. “యువర్ న్యారేషన్ ఈజ్ వెల్ ఇన్‌స్పైరింగ్, ముచికుందప్పగారు!”. ఆ మాటలు ఆమె లోని సెక్యులర్ స్పిరిట్‌కి అద్దం పట్టాయి.
ముచికుందప్పగారు, ఆయన భార్య మేడం గారికి నమస్కరించి, లేచి లోపలికి వెళ్లిపోయారు. శ్యామల రావు తాను తన కొడుకుతో ఎదుర్కుంటున్న సమస్యను సౌమ్యనాధ్ గారికి వివరించాడు. ఆయన జాగ్రత్తగా విన్నాడు. మధ్యలో కొన్ని ప్రశ్నలు వేశాడు. తర్వాత యిలా చెప్పాడు –
“తల్లి పోయినప్పటి నుంచి అన్నీ మీరే అయి ఆ అబ్బాయిని పెంచినందువల్ల అతనికి మీతో అటాచ్‌మెంట్ బాగా ఏర్పడింది. అది మోతాదుకు మించిపోయి, తాను పెళ్లి చేసుకొంటే, భార్య వల్ల మీరు నిర్లక్ష్యానికి గురి అవుతారేమో అని భయపడుతున్నాడు. అతనికి మీ పట్ల ఉన్న ఒక బలమైన ‘సెన్స్ ఆఫ్ బిలాంగింగ్’ అనేది, తీవ్రమయిన ‘పొసెసివ్‌నెస్’గా మారింది. మీ క్షేమం తప్ప అతనికి ఏమీ అక్కర్లేదు. కెరీర్‍ను కూడా త్యాగం చేసి, వైజాగ్ లోనే కాంప్రమైజయి, మెరుగైన అవకాశాలు కూడా వదులుకొని మీ దగ్గరగా ఉంటున్నాడంటే, ఆ భయం వల్లనే. దీన్ని శాస్త్ర పరిభాషలో ‘ఇన్‌డిఫరెన్స్ ఫోబియా’ అంటారు. సైకియాట్రిలో దీన్ని ‘ఒడిపస్ కాంప్లెక్స్’ అంటారు.
ఒక అబ్బాయి, లేదా అమ్మాయి, తన తల్లిని లేదా తండ్రిని విపరీతంగా ప్రేమించడం వల్ల, తన జీవితంలోని ఫైనర్ ఎలిమెంట్స్‌ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతాడు దీనిలో. మీరు ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు కదా! డి.హెచ్. లారెన్స్ వ్రాసిన ‘సన్స్ అండ్ లవర్స్’ నవల గురించి తెలిసే ఉంటుంది.”
“అవునండి. పి.జి. ఫైనల్‌లో అది మాకు ప్రిస్క్రైబ్ చేయబడింది.”
“దాని జిస్ట్ గుర్తుందా మీకు? లారెన్స్ ఆ నవలను ‘ఒడిపస్ కాంప్లెక్స్’ అనే మానసిక జాడ్యం ఆధారంగానే వ్రాశాడు. అందులో మిసెస్ మారెల్ అనే ఆవిడ భర్త తాగుబోతు, శాడిస్టు. ఆమెను నానా బాధలు పెడుతుంటాడు. ఆమె తన పిల్లలను చూసుకోని సాంత్వన పొందుతూ ఉంటుంది. పెద్ద కొడుకు విలియమ్ పెద్దవాడై తన కష్టాలు తీరుస్తాడనుకుంటుంది. కాని అతను జబ్బు చేసి చనిపోతాడు.
రెండో కొడుకు పాల్. అతని మీదే ఆమె ఆశలన్నీ. వీళ్లిద్దరూ ఎంత అటాచ్‌డ్‌గా ఉంటారంటే, లారెన్స్ ఒక చోట అంటాడు, ‘వాళ్లను చూస్తే తల్లీ కొడుకులులా అనిపించరు. లవర్సేమో అనిపిస్తారు!’ అని. తల్లి మీద ఒక పొసెసివ్‌నెస్ ఏర్పడుతుంది పాల్‌కి. దానివల్ల అతడు తన సెక్స్ సంబంధాల్లో కూడా ఫుల్‌ఫిల్ అవలేడు. ఇతర ఏ స్త్రీ అతనికి దగ్గర కావాలని చూసినా, తల్లి దూరమౌతుందేమో అనే అభద్రతా భావానికి లోనవుతుంటాడు.
మిరియమ్ అనే అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది. కానీ పాల్ ఆమెతో సన్నిహితంగా ఉండలేకపోతాడు. తల్లి కూడ కొడుకు ఇతర స్త్రీలతో అనుబంధాన్ని పెంచుకోడానికి సుముఖంగా ఉండదు. మిరియమ్‌తో అతని రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుంది. తర్వాత క్లారా అనే ఒక డైవోర్సీ అతని జీవితంలోకి వస్తుంది. కాని మొదటి భర్తతో సంబంధాన్ని పూర్తిగా తెంచుకోదు. మిరియమ్‌ను పోగొట్టుకొన్నందుకు చింతిస్తాడు కాని, ఆమెతో సంబంధాన్ని పునరుద్ధరించుకోడు. కారణం అతని తల్లి! ఆమెకు జబ్బు చేస్తుంది. ఆమెకు సేవలు చేస్తాడు. ఆమెతో తప్ప ఇతర ఏ స్త్రీతో సంతోషంగా ఉండలేనని గ్రహిస్తాడు. తల్లి మరణించిన తర్వాత ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోతాడు. పేరెంటల్ పొసెసివ్‌నెస్ ఎంత ప్రమాదకరమో, లారెన్స్ ఈ నవలలో అద్భుతంగా చిత్రీకరించాడు. మీ కేసులో పొసెసివ్‌నెస్ వన్‍సైడెడ్‍గా ఉంది.
లారెన్స్‌కు బేస్ ‘ఒడిపస్ కాంప్లెక్స్’. ఆ టర్మ్ సోఫోకిల్స్ రాసిన గ్రీకు నాటకం ‘ఒడిపస్ రెక్స్’ నుంచి పుట్టింది. ఒడిపస్ ఒక ట్రైబల్ నాయకుడు. అతని జాతకంలో తన తండ్రిని చంపి, తల్లిని పెళ్లి చేసుకుంటాడని ఉంటుంది. అది ఎలా సాధ్యమని, నమ్మడు!
అతి చిన్న వయసు లోనే అతని తల్లి గర్భం దాల్చి అతన్ని కని, సమాజ భయంతో అడవుల్లో వదిలేస్తుంది. ట్రైబల్స్ అతన్ని పెంచుతారు. నాయకుడిగా ఎదిగి, ఒక శక్తివంతమైన ట్రైబల్ ఆర్మీని తయారుచేసుకుంటాడు. తన జాతిని అణచివేయాలని చూస్తున్న ‘లాయస్’ అనే రాజుపై దాడి చేసి, అతన్ని చంపి అతని రాజ్యాన్ని ఆక్రమిస్తాడు.
వారి సంప్రదాయం ప్రకారం గెలిచిన రాజు, ఓడినవాడిని భార్యను పెళ్ళాడాలి. దానికనుగుణంగా ‘జోకాస్టా’ను పెళ్లాడతాడు. ఆమెతో పిల్లలను కంటాడు. అలా దారుణమైన పాట్రిసైడ్ (పితృహత్య), ఇన్‌సెస్ట్ (మాతృదేహం) అనే రెండు పాపాలు తాను చేసినట్లు తర్వాత తెలుస్తుంది. ‘జోకాస్టా’ ఉరిపోసుకొని చనిపోతుంది. ఒడిపస్ భరించలేని వేదనతో తన కనుగుడ్లను తానే పెరికి వేసుకుంటాడు!
తల్లిని ప్రియురాలిగా భావించేంత తీవ్రమైన పొసెసివ్‌నెస్ లేదా తండ్రిని ప్రియుడిగా భావించేంత అటాచ్‌మెంట్‍ను ‘ఒడిపస్ కాంప్లెక్స్’ అని పిలుస్తారు. పైన చెప్పిన కథల్లో అంతగా కాకపోయినా, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు, పిల్లల పట్ల తల్లిదండ్రులకు గల విపరీతమైన అసహజమైన ప్రేమ, వారి జీవితాలను అఫెక్ట్ చేస్తుందని మనం తెలుసుకుంటాము” అని ముగించాడు ప్రొఫెసర్ సౌమ్యనాధ్.
“ఇంగ్లీషు సాహిత్యాన్ని ఎంత బాగా చదివారండీ!” అన్నది కుతూహలమ్మ గారు.
“వాట్ ఎ గ్రేట్ అనాలిసిస్, సర్!” అన్నాడు శ్యామల రావు.
ఆయన నవ్వాడు. “ఇంగ్లీషే కాదు తెలుగు సాహిత్యాన్ని కూడా బాగా చదువుతాం సైకాలజిస్టులం. సైకాలజీ లోని సిద్ధాంతాలకు ఫ్లెష్ అండ్ బ్లడ్‍లు అంటే సజీవమైన ఉదాహరణలు లభించేది సాహిత్యంలోనే కదండి! వెరీ కాంప్లికేటెడ్ అండ్ డీప్ హ్యూమన్ సైకాలజీకి సాహిత్యం ఒక రకంగా ప్రాక్టికల్ లాబోరేటరీ!” అన్నాడు.
“ఇక మీ వాడి విషయానికొద్దాం. మీ ఇద్దరూ ఈక్వల్లీ పొసెసివ్ అయితే ఎవరం ఏం చేయలేం. మీరు అతని జీవితం మీ వల్ల పాడుకాకూడదని కోరుకుంటున్నారు కాబట్టి, దీన్ని సాల్వ్ చేయవచ్చు. ‘లైక్ మైండెడ్ బిహేవియర్’ ఉన్న వ్యక్తులు తటస్థపడితే వీరిలో మార్పు వస్తుంది. ఇలాంటి కేసే కొన్ని రోజుల క్రిందట నా వద్దకు వచ్చింది. అక్కడ అమ్మాయి, తల్లి!
ఆ అమ్మాయి కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్. మీ వాడి వయసే ఉంటుంది. గ్రూప్ ఫోర్‍లో జూనియర్ అసిస్టెంట్‌గా సెలక్టయి, తర్వాత ప్రమోషన్ పొందింది. అన్నయ్య దూరంగా భిలాయ్‌లో పని చేస్తాడు. తండ్రి చనిపోయి చాలా కాలమైంది. తాను పెళ్లి చేసుకుంటే తల్లికి అన్యాయం జరుగుతుందేమోననే భయంతో పెళ్లి చేసుకొనేందుకు నిరాకరిస్తూంది. ఈ దిగులుతో తల్లి డిప్రెస్ అయింది. ఆమె మీకంటే పెద్దది. కొన్ని సంబంధాలు వస్తే, మా అమ్మ కూడా మాతో ఉండాలి. నా సగం జీతం ఆమెకు వినియోగిస్తాను అని ఇలాంటి షరతులు పెట్టిందట అమ్మాయి. ఆమె జీతం కావాలి గాని, తల్లి బాధ్యత కూడా తీసుకొనేంత ఉదార హృదయులు ఎవరుంటారు చెప్పండి?
నా సజెషన్ ఏమిటంటే, మీ వాడినీ, ఈ అమ్మాయినీ భేటీ చేయగలిగితే, ఇద్దరిదీ సేమ్ ప్రాబ్లమ్ కాబట్టి, ప్రేమించుకోకపోయినా, పేరెంట్స్ కోసం ఒకటయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ప్రొసీడయితే, ఆ అమ్మాయి తల్లిని మీతో పాటు ఉంచుకుని జాగ్రత్తగా చూడటానికి మీరు సిద్ధమా, శ్యామల రావుగారూ?”
“అయ్యో! తప్పకుండా నండీ. ఇద్దరి జీవితాలు పండించుకుంటామంటే అంతకంటే కావల్సిందేముంది?”
కుతుహలమ్మగారిలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపుదిద్దుకొంటుంది అప్పుడే. “ప్రొఫెసర్ గారు. వాళ్లను మాకు పరిచయం చేయండి. కొంత పరిచయం పెరిగిన తర్వాత, ఏదో సాకుతో ఇద్దరూ కలుసుకునేలా చూద్దాం. కలెక్టరేట్‌లో పని చేస్తుందంటున్నారు కాబట్టి, నేనూ మా శ్యామూ వెళ్లి ఏదో పని మీద ఆ అమ్మాయిని కలుస్తాం. తర్వాత కథ నేను నడుపుతాను.”
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‍గా, ప్రిన్సిపాల్‍గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
