[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[ప్రొఫెసర్ సౌమ్యనాధ్ గారు కరుణ అడ్రసు, ఫోను నంబరు ఇస్తారు. వాళ్లు గాజువాకలో అద్దె ఇంట్లో ఉంటారు. ఆమె కలెక్టారాఫీసులో ‘పబ్లిక్ గ్రీవెన్స్ సెల్’లో పని చేస్తారని చెప్పారు. శ్యామల రావు తమ రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ తరఫున వృద్ధులకు సేవలందిస్తామంటూ వెళ్ళి కరుణని కలుస్తాడు. ఆమె రిప్రెజెంటేషన్ ఇవ్వమంటుంది. మర్నాడు డ్రాఫ్ట్ చేసి, దానిని సాత్విక్ చేతికిచ్చి కరుణకి ఇచ్చి వెళ్ళమంటాడు. ఇలా రెండు మూడు సార్లు అయ్యేసరికి, కరుణకి, సాత్విక్ మధ్య స్నేహం కలుస్తుంది. కొన్ని సేవా కార్యక్రమాలు జరుపుతారు. కొంత నగదు విరాళం ఇస్తారు. కొన్ని రోజులకి తండ్రి పట్ల సాత్విక్ చూపే ‘కన్సర్న్’ కరుణను బాగా ఇంప్రెస్ చేస్తుంది, వాళ్లను తన యింటికి ఆహ్వానిస్తుంది. – ఇక చదవండి.]
శ్యామల రావు వెళ్లడానికి రెడీ అయ్యాడు! సాత్విక్ “ఏం బాగుంటుంది నాన్నా!” అన్నాడు.
కుతుహలమ్మ గారన్నారు “పిలవని పేరంటానికి వెళితే తప్పు గాని, పిలిచి పీట వేస్తానంటే వెళితే ఏం?”
ముగ్గురూ గాజువాక లోని కరుణ వాళ్లింటికి వెళ్లారు. చిన్న యిల్లు. మూడు గదులు. మహారాణీపేటలో తామున్న అద్దె యిల్లు గుర్తొచ్చింది శ్యామల రావుకు.
ఆదరంగా వీళ్లను రిసీవ్ చేసుకుంది కరుణ. వంగపండు రంగు కాటన్ చీర, ఎర్రని జాకెట్ ధరించింది. తలస్నానం చేసిందేమో బాబ్డ్ హెయిర్ గాలికి కదలుతూంది. ముఖాన మెరూన్ కలర్ స్టిక్కర్.
‘నిరాడంబర సౌందర్యం’ అనుకున్నాడు సాత్విక్. ‘ఏమిటో ఈ మధ్య కరుణను గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను’ అని కూడా అనుకున్నాడు. ముందు గదిలోని కుర్చీల్లో కూర్చోబెట్టింది వారిని. స్నాక్స్, టీ ఇచ్చింది. తల్లిని పరిచయం చేసింది. ఆమె చేతులు జోడించి వీళ్లకు నమస్కరించి తానూ ఒక కుర్చీలో కూర్చోబోతుంటే కుర్చీ వెనక్కు జరిగి కొద్దిగా తూలిపడబోయింది. సాత్విక్ వెంటనే లేచి ఆమెను పట్టుకున్నాడు. “జాగ్రత్త అంటీ!” అని ఆమెను కుర్చీలో కూర్చోబెట్టాడు. అతని ఈ చర్య కరుణలో మరింత ‘ఇది’ని పెంచింది. కరుణ వాళ్లమ్మ పేరు సుమిత్ర. “దీనికి పెళ్లి చేసేస్తే, నేమయిపోయినా ఫరవాలేదండి. ఇదేమో పెళ్లి చేసుకోదట. నన్ను కూడా తనతో తీసుకెళుతుందట. సగం జీతం నాకిస్తుందట. లోకరీతికి విరుద్ధంగా, ఇలా ఎక్కడైనా ఉంటుందా చెప్పండి మేడమ్!” అన్నది కుతూహలమ్మగారితో.
“ఆ అమ్మాయి అంటున్నది కూడా నిజమే కదమ్మా!” అన్నది మేడం గారు. “మీకు ఆమె తప్ప ఎవరున్నారు?”
“అమ్మా, ఇక ఆపుతావా? ఇంటికి ఎవరు వచ్చినా ఇదే రికార్డు వేస్తావు!” అన్నది కరుణ విసుగ్గా.
“మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను కరుణగారు” అన్నాడు సాత్విక్. “మా యింట్లోనూ ఇదే గొడవ! కనిపెంచిన తల్లిదండ్రుల కంటే పెళ్ళే జీవిత ధ్యేయమన్నట్లు మాట్లాడితే నాకు నచ్చదు.”
“తల్లి తండ్రులూ ముఖ్యమే, పెళ్ళీ ముఖ్యమేరా స్మార్ట్ ఫెలో!” అన్నది కుతూహలమ్మగారు.
అలా డాక్టర్ సౌమ్యనాధ్ గారు చెప్పిన ‘లైక్ మైండెడ్ బిహేవియర్’, ‘సిమిలర్ ప్రాబ్లం’ – కరుణ, సాత్విక్‌ల హృదయాల్లో ఒక అనుకూల భావనను చిగురింపచేశాయి.
ఈసారి తన తల్లిని డాక్టర్ సౌమ్యనాధ్ దగ్గరకు తీసుకెళ్లింది కరుణ. ఆయన సుమిత్రను పరీక్షించి కొన్ని ప్రశ్నలు వేశాడు. యాంగ్జైటీ తగ్గడానికి ఇచ్చిన మందులు కంటిన్యూ చేయమన్నాడు. కరుణ ఆయనతో అన్నది.
“డాక్టరు గారు, మీరు నా గురించి శ్యామల రావు గారికి, కుతూహలమ్మగారికి చెప్పారట. వారి అసోసియేషన్ ద్వారా, పాత పోస్టాఫీసు దగ్గరున్న ‘ప్రభుత్వ వృద్ధుల రిహాబిలిటీషన్ సెంటర్’ను అడాప్ట్ చేసుకున్నారు. కలెక్టరేట్ నుండి కావలసిన పర్మిషన్స్, వీలుంటే కొంత ఫండ్స్ అరేంజ్ చేయడంలో నేను కూడ నా పరిధిలో సాయం చేశానండి.”
“చేస్తావనే గదా నీ పేరు సూచించింది, కరుణా!” అన్నాడాయన నవ్వుతూ. ఆమే ఆ ప్రసక్తి తీసుకురావాలని చూస్తున్నాడాయన. అదే జరిగింది. “వాళ్లబ్బాయి సాత్విక్ కూడ దీంట్లో యాక్టివ్ ఇన్వాలే అవుతున్నాడు!”
“అవును సార్! నేను కూడా అప్పుడప్పుడు వారితో వెళుతున్నాను. అతను చాలా నైస్ పర్సన్” అంది.
“వాళ్ల నాన్నంటే ఆ అబ్బాయికి ప్రాణం!” సాత్విక్‌ని గురించి చెబుతూంటే ఆ అమ్మాయి కళ్లలో ఒక విధమైన మెరుపును గమనించాడు సౌమ్యనాధ్.
“నీకు మీ మదర్ మీద ఉన్నట్లు గానే!” ఆ అమ్మాయి తలవంచుకుంది.
“ప్రేమలకేం కొదువ లేదండి! పెళ్లంటేనే వస్తుంది గొడవంతా!” అన్నది సుమిత్ర.
మామూలుగా అయితే డాక్టరు గారి ముందే తల్లి మీద విసుక్కునేది కరుణ. ఇప్పుడు మౌనంగా ఉండిపోవటం గమనించాడు. ఇది ఒక ‘శుభ పరిణామమే’ అనుకున్నాడు.
రెండ్రోజుల తర్వాత కుతూహలమ్మగారికి ఫోన్ చేశాడు సౌమ్యనాధ్. శ్యామల రావు గారిని తీసుకొని తన వద్దకు రమ్మన్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత, – కరుణ వాళ్ళు వచ్చారనీ, మీ పరిచయం తర్వాత ఆమెలో కొంచెం ‘ఆటిట్యూడినల్ ఛేంజ్’ గమనించాననీ అన్నాడు. ఒకసారి అందరం కూర్చుంటే ఒక హ్యాపీ కన్‌క్లూజన్‌కు రావచ్చుననే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడాయన.
“మా పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ చాలా గొప్పది ప్రొఫెసరు గారు!” అన్నాడు శ్యామల రావు. “మీ దయవల్ల వీళ్లిద్దరూ ఒకటైతే, పెద్దవాళ్లం మేం నిశ్చింతగా ఉంటాము.”
“అంతా భగవంతుని దయ ప్రిన్సిపాల్ గారు. మా దగ్గరికి వచ్చినవాళ్లు సంతోషంగా ఉండాలనే మేం కోరుకుంటాం. అది మా ప్రొఫెషనల్ ఎథిక్స్! అసలు మా వృత్తే హ్యూమన్ ఎమోషన్సు అండ్ సెంటిమెంట్స్‌తో ముడిపడి ఉంటుంది.”
“యువర్స్ ఈజ్ రియల్లి ఎ నోబుల్ అండ్ ఛాలెంజింగ్ ప్రొఫెషన్, సార్!” అన్నది కుతూహలమ్మగారు.
సౌమ్యనాధ్ గారు అన్నారు “అమ్మా! మనిషికి మనిషి పట్ల ఉండే ఆర్ద్రత చాలా గొప్పది. దాన్నే రచయితలు ‘గుండె తడి’గా అభివర్ణిస్తుంటారు. దాని మీదే మానవ జీవిత చక్రం పరిభ్రమిస్తుంది. తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులకు మాత్రమే ఇది పరిమితం కాదు. ఇంకా విస్తరించుకుని, పెంపుడు జంతువులు, క్రీడాకారులు, నటులు, నాయకులు చివరికి ఇష్టమైన వస్తువుల వరకు ఈ ‘గుండె తడి’ వెళుతుంది. ఎంత కఠినాత్ముడిలోనైనా ఇది కొంచెమైనా ఉంటుంది. ఆఖరుకు జంతువులలో కూడా!
మనం వీడియోలు చూస్తూంటాం. కుక్కపిల్లకు పాలిచ్చే కోతి, జింక చూలుతో ఉందని తెలిసి నోటికి చిక్కిన దాని గొంతును వదిలేసిపోయే పులి; ఇవన్నీ వాటి గుండె తడికి తార్కాణాలే. దాన్ని మనుషుల్లో పెంపొందించదానికే ‘ఫేబుల్స్’ (నీతికథలు) వ్రాశారు. ‘వచ్చి నీ కాహార మౌతాను’ అని పులికి వాగ్దానం చేసిన ఆవు; దాన్ని పోనిచ్చిన పులి; నిజాయితీగా తిరిగొచ్చిన ఆవును గౌరవించి తినకుండా సాగనంపిన పులి.. ఇవన్నీ అలాంటివే!
మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా సాహిత్యాన్ని బాగా చదివితే ఈ ‘గుండె తడి’ మరింత తడిగా మారుతుంది. ‘వాణిశ్రీ’ అనే కలం పేరుతో కథలు వ్రాసే శివరాం ప్రసాద్ గారు నా అభిమాన రచయిత. ఆయన కిప్పుడు ఎనభై దాటాయి. 1953 నుంచి రాస్తున్నారు. వెయ్యికి పైగా కథలు వ్రాశారాయన. చందమామ, అపరాధ పరిశోధన, విజయ లాంటి పత్రికల్లో కూడ ఆయన కథలు వచ్చేవట. ఓ. హెన్రీ గారి లాగా కథకు అనుకోని ముగింపు ఇవ్వడం ఆయన ప్రత్యేకత.
‘గుండె తడి’ ఎంత వినూత్నంగా ఉండగలదో ఒక కథ రాశారాయన. ఆంధ్రభూమి వీక్లీలో వచ్చింది. సైకాలజిస్టునైన నేనే ఆ కధ ముగింపు చదివి కాసేపు తేరుకోలేకపోయాను. బ్రీఫ్‌గా చెబుతా వినండి.
ఇద్దరు భార్యాభర్తలుంటారు. వెరీ యంగ్ కపుల్ లవ్ మేరేజ్! అన్యోన్య దాంపత్యం! కొంత కాలం కాపురం చేస్తారు హ్యాపీగా. ఇద్దరికీ యు.ఎస్.లో చాలా గొప్ప జాబ్ ఆపర్ట్యూనిటీస్ వస్తాయి. వెళ్దామంటుంది భార్య. వద్దంటాడు భర్త. విడాకులు తీసుకుంటారు! ఆమె వెళ్ళిపోతుంది.
వీళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ కూతురు ఒక అమ్మాయి అతని దగ్గరకు వస్తుంది. ‘అంకుల్ అంతగా ప్రేయించుకొన్న వారు ఎందుకు విడిపోయారు?’ అని అడుగుతుంది ఆవేదనగా.
‘డెబ్బై ఐదు సంవత్సరాల అమ్మను ఇక్కడ ఒంటరిగా, దిక్కులేకుండా వదిలేసి, కేవలం మంచి జాబ్ కోసం అమెరికా వెళ్లడం నాకు నచ్చలేదు. ‘ఆమె కోసం మన కెరీర్‌ను నాశనం చేసుకుంటామా’ అంటుంది ఆమె. చివరికి నాకు విడాకులిచ్చేసి, ఆమె యు.ఎస్.కు వెళ్లిపోయింది!’
‘మీ అమ్మ అంటే మీకెంత ఇష్టం అంకుల్! యు ఆర్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ సన్!’ అంటుంది ఆ అమ్మాయి.
‘మా అమ్మా! మా అమ్మ ఎక్కడుంది? నా చిన్నపుడే చనిపోయిందిగా!’ అంటాడాయన. ఆ అమ్మాయి నిశ్చేష్టురాలవుతుంది.
‘అంటే మీరు…’
‘అవునమ్మా! మా అత్తగారామె. నా భార్య తల్లి! మా పెళ్లయినప్పటి నుంచి నన్ను అల్లుడిలా కాకుండా, కొడుకులా ఆదరించిందామె నన్ను! మా అమ్మను మా అత్తయ్యతో చూసుకునేవాడిని. అందుకే ఆమె కూతురు వెళ్లిపోయినా, నేను వెళ్లలేకపోయాను. ఆమెని జాగ్రత్తగా చుసుకోడానికి!’
అదీ కథ!” అని ఆపారు ప్రొఫెసర్ గారు.
శ్రోతలిద్దరూ కాసేపు తేరుకోలేకపోయారు. “ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్” అన్నారు.
“సొంత కూతురికి లేని గుండె తడి అల్లునికి ఉంది. మీ అబ్బాయి, కరుణ మీ కోసం, వాళ్లమ్మ కోసం పెళ్లి మానేద్దామనుకోవడంలో విచిత్రమేముంది? తన అభిమాన నటుడో, ప్రజానాయకుడో, సడన్‌గా చనిపోతే తట్టుకోలేక కొందరు గుండె ఆగి మరణిస్తూంటారు. అదీ గుండె తడే! దాన్ని నిర్వచించడానికి మన దగ్గరున్న భాష సరిపోదు!
మీరు సరేనంటే వచ్చే ఆదివారం వాళ్లనూ రమ్మంటాను, మీరూ రండి! మీరు వస్తున్నట్లు వాళ్లకు చెప్పను. లెటజ్ హోప్ ఫర్ బెస్ట్!” అన్నాడు సౌమ్యనాధ్.
ఆదివారం సాయంత్రం ఐదుగంటలకు తల్లిని తీసుకొని కరుణ వచ్చింది. అప్పటికే శ్యామల రావు, సాత్విక్, కుతూహలమ్మగారు వచ్చేసి ఉన్నారు. వాళ్లను చూసి కరుణ కళవళపడలేదు. అందరికీ విష్ చేసింది. సాత్విక్‍ని చూసి స్నేహంగా చిరునవ్వు నవ్వింది!
టీ, స్నాక్స్ అయ్యాక ప్రొఫెసర్ సౌమ్యనాధ్ చిరునవ్వుతో అందరి వైపు చూశాడు. “మిమ్మల్ని అందర్నీ రమ్మనడానికి కారణం మీతో అతి ముఖ్యమైన, మీ జీవితాలకు సంబంధించిన విషయాన్ని చర్చించాలని.
అమ్మ కరుణా, నీవూ సాత్విక్, ఒకే రకమైన సమస్యతో బాధపడుతున్నారు. వీరిద్దరూ వివాహబంధంలో ఒకటైతే ఇద్దరి సమస్యా తీరుతుంది. పెళ్ళి తర్వాత సుమిత్రగారిని తమతో ఉంచుకొని మర్యాదగా జాగ్రత్తగా చూసుకోడానికి శ్యామల రావు గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనని ఏ లోటు లేకుండా నీవు చూసుకోగలవనే నమ్మకం నాకుంది. అలా అని ఒక సైకాలజిస్టుగా కాకుండా, మీ ఇరు కుటుంబాలకు శ్రేయోభిలాషిగా నేను సాత్విక్‍కు హామీ యివ్వగలను. దీని వెనుక సూత్రధారి కుతూహలమ్మ మేడంగారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అందరూ హ్యపీగా ఉంటారని ఆమె కూడా గ్యారంటీ ఇస్తున్నారు. ఏం సాత్విక్, ఏమంటావు?”
కొన్ని సెకన్లు, ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. మొదట కరుణ పెదవి విప్పింది. “సాత్విక్‌కు ఇష్టమైతే నాకిష్టమే అంకుల్!” అన్నది. ఆమె బుగ్గలు మందారాలయ్యాయి.
“థ్యాంక్యూ, కరుణా! నాకూ ఇష్టమే!” అన్నాడు సాత్విక్. కుతూహలమ్మగారు ఉద్వేగంతో అరిచారు – “గాడ్ ఈజ్ గ్రేట్!” అని.
శ్యామల రావు లేచి వెళ్లి కొడుకును కౌగిలించుకున్నాడు. అతని కళ్ల నుండి ఆనందాశ్రువులు! సుమిత్ర కళ్లు నీటి చెలమలయ్యాయి. కూతుర్ని దగ్గర తీసుకుని మహదానందం పొందింది!
పిల్లలిద్దరూ కుతూహలమ్మ గారికి, సౌమ్యనాధ్ గారి పాదాలకు నమస్కరించారు. వారు ఇద్దర్నీ ఆశీర్వదించారు. ప్రొఫెసర్ గారు ఇలా ఉన్నారు – “తల్లిదండ్రుల పట్ల మీ మీ గుండె తడిని ఇక నుంచి మీ మీదకు మార్చుకోండి. క్రమంగా దాన్ని దీనులు, పేదల మీదకి మళ్ళించండి. గుడ్ లక్!”
కొన్ని రోజుల తర్వాత సాత్విక్, కరుణల వివాహం సింహాచలంలో జరిగింది. మానవుల్లో గుండె తడిని సృష్టించి, వారి సుఖదుఃఖాలను శాసించే ఆ వరాహనరసింహుడు వారిని ఆశీర్వదించాడు.
తర్వాత కరుణ యిల్లు ఖాళీ చేసి, తల్లిని తీసుకుని శ్యామల రావు ఇంటికి వచ్చేసింది. సుమిత్ర శ్యామల రావుకు అక్కగా, సాత్విక్‌కు అత్తయ్యగా, ప్రశాంతంగా ఉండసాగింది. ఏడాది దాటగానే వాళ్లింట్లో శర్వకుమార్ పుట్టాడు! శ్యామల రావు, సుమిత్ర మనవడితో పుల్ బిజీ!
(సమాప్తం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
