Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుండెతడి-7

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[మర్నాడు ఉదయమే లేచి తయారై స్టేషన్‌కి వెళ్ళి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతాడు శ్యామల రావు. రద్దీగా ఉండడంతో టి.టి.యి. అనుమతితో రిజర్వేషన్ బోగీలో కూర్చుంటాడు. రాజమండ్రి దిగి హోటల్లో టిఫిన్ చేసి ఆర్.జె.డి. ఆఫీసుకు వెళ్తాడు. ఎ.ఓ. సారంగ రావుగారిని కలిసి తనని పరిచయం చేసుకుని వచ్చిన పని చెప్తాడు. ఆయన కాస్త ధుమధుమలాడగానే ఐదువందల రూపాయలు ఆయనకిచ్చి భీమ్లీలో పోస్తింగ్ వచ్చేట్టు చూడమని కోరుతాడు. సరేనని చెప్పి, జె.డి.గారిని కలవమంటాడాయన. జె.డి.గారొచ్చే సరికి పదకొండున్నర అవుతుంది. ఆయనను కలవడానికి చాలామంది ఎదురుచూస్తూంటారు. శ్యామల రావు వంతు వచ్చేసరికి ఒంటిగంట అవుతుంది. లోపలికి వెళ్ళి నమస్కరించి తనని పరిచయం చేసుకుంటాడు. బదులుగా ఆయన, తనకి విషయం తెలుసననీ, ప్రిన్సిపాల్ నరసింహ మూర్తిగారు తనకి ఫోన్ చేసి చెప్పారనీ, సాయం చేస్తానని చెప్తారు. ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుని బయటకు వస్తాడు. హోటల్లో భోంచేసి వైజాగ్ వెళ్ళే బస్ ఎక్కుతాడు. ఇల్లు చేరాకా తన ఆనందాన్ని తల్లితోనూ, భార్యాపిల్లలతోనూ పంచుకుంటాడు. మూడు రోజుల తర్వాత ఆర్దర్స్ వస్తాయి. రిలీవ్ చేసి వెంటనే భీమ్లీ లో జాయిన్ అవమని చెప్తారు ప్రిన్సిపాల్.  మర్నాడు భీమ్లీ కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ విలాసరావు గారిని కలిసి ఆర్డర్స్ చూపిస్తాడు. ఆయన వాటిపై సంతకం చేసి, జూనియర్ అసిస్టెంట్‌తో రిజిస్టర్ తెప్పించి అందులో శ్యామల రావుని సంతకం చేయమంటారు. తర్వాత ఇంగ్లీషు డిపార్టు‌మెంటులోని సీనియర్ లెక్చరర్ కుతూహలమ్మ గారి గురించి చెప్తారు. స్టాఫ్ రూమ్‌కి తీసుకెళ్ళి లెక్చరర్లకు పరిచయం చేస్తారు. తరువాత కుతూహలమ్మ గారితో, శ్యామల రావ్‌ని గైడ్ చేయమని కోరి, అక్కడ్నించి వెళ్తారాయన. – ఇక చదవండి.]

కుతూహలమ్మగారు నల్లగా ఉన్నారు. బక్కపలుచగా ఉన్నారు. జుట్టుకు రంగు వేశారు. బాబ్డ్ హెయిర్. పెదవులకు లిప్‌స్టిక్. గోల్డెన్ ఫ్రేమ్ కళ్లజోడు. సినిమా వాణిశ్రీ లాగా మోచేతుల కిందికి జాకెట్టు. ఇంకా విశేషమేమంటే ఆ జాకెట్టుకు చిన్న కాలరు కూడా ఉండటం. కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది ఆమెను చూస్తే.

“ఆయనట్టే అంటాడుగానీ, నేను నిన్ను గైడ్ చేసేదేముందీ, నాల్రోజులు క్లాసులకు బోతే అదే అలవాట వుద్ది” అన్నదామె. ఆమెది ప్రకాశం జిల్లా టంగుటూరట. “నలభైఏళ్ల కిందట్నే, వైజాగుకొచ్చేసినాము” అన్నది. కొంచెం బోళా మనిషని అర్థమవుతూ ఉంది.

అన్నేళ్లయినా వాళ్ల జిల్లా యాస ఆమె మరిచిపోలేదు. కొందరంతే! ఎక్కడున్నా తమ మూలాలు మరచిపోరు. మరి కొందరు కొంత సమయం లోనే కొత్త చోటికి అడాప్ట్ అవుతారు.

“ఏమయ్యా, నీవు నా కంటే చాలా చిన్నవాడివి గదా, నిన్ను తమ్ముడూ అని బిలుస్తాలే. ఏమనుకోవాకు” అన్నదామె.

“అయ్యో మేడమ్! పెద్దవారు! మీ ఆశీర్వాదం ఉండాలి. పాఠాలు చెప్పడంలో మీరు చాలా సీనియర్లు. నాకు కొన్ని మెలకువలు నేర్పండి దయ చేసి” అన్నాడు.

ఆమె ప్రసన్నురాలయింది. “మనకు ఎనిమిది సెక్షన్లుంటాయి! అందులో రెండు వొకేషనల్. ముకుందరావుగారు రిటైరైనాక నేనే ఎట్టాగో లాక్కొస్తున్నాగానీ, నీవొచ్చావు గదూ, ఇక అంత ప్రెషరుండదు.”

వాక్యం లోని ప్రతి విరుపునూ దీర్ఘం తీస్తుందని అర్థమయింది. “రోజూ నాలుగు క్లాసులుంటాయి. నీకు బైపిసి, ఎంపిసి క్లబ్ చేస్తాము, లేకపోతే ఐదు. ఇక హెచ్.యిసి, సి.ఇ.సి. క్లాసులు బహిరంగ సభలే అనుకో. క్లాసుకు నూటయాభై మందిని చేర్చుకుంటాడీ ప్రిన్సిపాలు! క్లాసులకు పోతే గదూ తెలిసేది?” అన్నది.

“ఆ ముకుందరావు సైన్సు క్లాసులు నాకు కావాలని తీసుకునేవాడు. ఆ వెధవలు బాగా చదువుతారుగా, రిజల్టు పెరుగుద్దిగా, అందుకనీ! సరేలెండి మాస్టారూ అనేదాన్ని. ఈ ఇండివిడ్యుయల్ రిజల్ట్ అసెస్మెంటు వచ్చాకా.. చచ్చే చావయిందిగా! నీకూ సైన్సులే కావాలాయ్యా?”

“మీ ఇష్టం మేడమ్” అన్నాడు వినయంగా

“నీవే తీసుకోలేయ్యా, కొత్త గదూ, ఆ వెధవలు కొంచెం బాగా వింటారులే. ఈ ఆర్ట్స్ వెదవలే. కోతి మూకంటే నమ్ము” అంటూ టైంటేబులు ఇచ్చింది. “ఇప్పుడు నీకు సెకండ్ సి.ఇ.సి. పోదాం పాయ్యా” అని బయలుదేరింది

పాత బ్లాకులో ఉందా క్లాసు. మేడంను చూసి పిల్లలందరూ లేచి నిలబడి “గుడ్ మార్నింగ్ మేడం” అని పాడినట్లు చెప్పారు. కోఎడ్యుకేషన్, యూనిఫారం ధరించి ఉన్నారు.

“సిట్ డౌన్” అన్నదావిడ. శ్యామల రావును చూసి గుసగుసలు!

“సైలెన్స్!” అనరిచిందామె. “అయామ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ యువర్ న్యూ ఇంగ్లీష్ లెక్చరర్ మిస్టర్ శ్యామల రావ్. ప్లీజ్ కోపరేట్ విత్ హిమ్. బి అటెంటివ్ అండ్ రీప్ ఎ ప్రాఫిటబుల్ క్రాప్ ఫ్రం హిస్ టీచింగ్. థాంక్యూ!” ఆమె ఇంగ్లీషులో ఏ మాత్రం మాతృభాషా ప్రభావం లేదనీ, అద్భుతమైన యాక్సెంట్ అండ్ ఇంటోనేషన్ ఆమె సొంతమని గ్రహించాడు.

ఆమె వెళ్లిపోయింది. శ్యామల రావు కాసునుద్దేశించి, “మైడియర్ ఫ్రెండ్స్” అని సంబోధించాడు నవ్వుతూ! ఆ సంబోధనతో క్లాసు హర్షధ్వానాలతో హోరెత్తి పోయింది. వాళ్లు ఆపేవరకూ వారించలేదు.

“ఫ్రెండ్స్ అని ఎందుకు పిలిచానో తెలుసా? పేరెంట్స్‌తో కూడా షేర్ చేసుకోలేని విషయాలను ఫ్రెండ్స్‌కు చెప్పుకోగలం. యామై రైట్?”

“యస్ సార్” అని అందరూ అరిచారు.

“సో, లెజట్ క్రియేట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇన్ అవర్ క్లాస్. ఓకె?” అని ముందు వరుసలో ఉన్న ఒక అబ్బాయిని “డు యు హావ్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్?” అనడిగాడు.

“యస్ సర్” అని అతడు శ్యామలరావుకు ఇంగ్లీషు పుస్తకం ఇచ్చాడు. ప్రోజ్‍లో, పోయట్రీలో ఎన్ని లెసన్స్ పూర్తయ్యాయో అడిగాడు.

“సో, లెటజ్ టేకప్ ది పోయం, ‘The Dance of the Eunuchs’ బై కమలా దాస్. డు యు నో ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ‘యూనక్’?”

ఎవ్వరూ మాట్లాడలేదు. ఇంగ్లీషులో వివరించాడు

“భగవంతుడు తన అద్భుతమైన సృష్టిలో ఆడ, మగనే కాక రెంటికీ తప్పిన మరో జాతిని సృష్టించాడు. వాళ్లనే మనం హిజ్రాలు, కొజ్జాలు అంటాం.”

ఒక కుర్రాడు లేచి ‘పాయింట్ ఫైవ్’ అని అరిచాడు.

మాస్టారు కోప్పడలేదు. “యస్, ఆ పేరు కూడా ఉంది. ఎందుకో చెప్పగలవా?” అని ఆ అరచిన కుర్రాణ్ణి ప్రశ్నించాడు.

డైరెక్ట్‌గా తననే అడిగేసరికి వాడు తడబడ్డాడు. “తెలీదు సార్” అన్నాడు.

“ఒకటిలో సగం కదా పాయింట్ ఫైవ్ అంటే. సగం మగ సగం ఆడ అని దాని భావం. వాళ్లను మనం గౌరవించం. ఎగతాళి చేస్తాం. అవునా?” అన్నాడు.

క్లాసు ఏకీభవించింది!

“మన పుట్టుక మన చేతిలో ఉందా, చెప్పండి! పాపం వాళ్లేం చేస్తారు? కవయిత్రి గురించి ముందు తెలుసుకుందాం. పేజీ నంబరు 28లో ఉంది చూడండి.”

క్లాసంతా పేజీ తిప్పిన చప్పుడు.

టెక్ట్స్ లోని పరిచయం స్పష్టమైన ఉచ్చారణతో చదివాడు. కమలాదాస్ గొప్పతనం, ఇతర రచనలు, పొందిన సత్కారాలు అన్నీ వివరించాడు. తర్వాత, పోయం ఎక్స్‌ప్లయిన్ చేశాడు.

“ఆడ మగకు నీవు ప్రసాదించిన అద్భుతమైన ఆనందాలను వీళ్లకు లేకుండా చేశావేమి ప్రభూ” అంటూ దేవున్ని నిలదీస్తుందీమె. ఆ ఆనందాలేమిటో చెప్పగలరా?”

ఒకమ్మాయి లేచి, “పిల్లలు సార్” అన్నది.

“వెరీగుడ్, వెరీగుడ్. రెండోది?”

ఒక కుర్రాడు లేచి “ సెక్స్” అని చెప్పాడు. క్లాసంతా నిశ్శబ్దం!

“వండర్‍ఫుల్. వెరీగుడ్ ఆన్సర్” అని ఆ అబ్బాయిని మెచ్చుకున్నాడు. వాడు అమ్మాయిల వైపు చూశాడు.

శ్యామల రావు “నిన్ను అప్రీసియేట్ చేస్తూంటే ఆడపిల్లలవైపు చూస్తున్నావెందుకు?” అనడిగాడు. క్లాసు గొల్లున నవ్వింది.

“నిజమే కదా ఫ్రెండ్స్! సెక్స్, మ్యారేజ్, చిల్డ్రన్ లేని బతుకు, దాని కవకాశమే లేని బతుకు ఎంత దుర్బరం కదా” అన్నాడు. అతని గొంతులో ఆవేదన! పిల్లలందరూ అతని ఆవేదనను పంచుకున్నారు. వారి ముఖాల్లో అది స్పష్టంగా కనిపించింది శ్యామల రావుకు.

పద్యం చివరికి వచ్చింది. “ఒక యింటి ముందు యూనక్స్ నృత్యం చేస్తున్నారు. చేసి చేసి వాళ్లు ‘బ్లీడ్’ అవుతారేమో అని ముగించింది కమలాదాస్. మీకర్థమయిందా?”

క్లాసు మౌనాన్ని ఆశ్రయించింది.

“జాగ్రత్తగా వినండి. స్త్రీత్వానికి గుర్తు మెన్సస్ అవడం. మెన్సస్‍లో ఆడవాళ్లకు రక్తస్రావం అవుతుంది. ‘అరిచీ, అరిచీ, ఎగిలి, ఎగిరీ చివరికి రక్తస్రావమయినా అయితే వాళ్లు స్త్రీలుగా మారతారేమో’ అని అంటున్నారు కమలాదాస్. ఎంత అద్భుతంగా చెప్పారు? ఎటూ కాకుండా మిగిలిపోయిన ఆ అభాగ్యుల పట్ల ఎంత కన్సర్న్? అదీ కవిత్వానికుండే గొప్పదనం!”

అవర్ అయిపోయినట్లు బెల్ మోగింది! ‘అప్పుడే క్లాసయిపోయిందా’ అనిపించింది పిల్లలకు.

“థాంక్యూ ఫర్ యువర్ అటెంటివ్ కోఆపరేషన్, ఫ్రెండ్స్! రేపు ఈ పోయమ్ లోని కఠిన పదాలకు గ్లాసరీ, రెఫరెన్సెస్ టు ది కాంటెక్ట్ చెప్పుకొని, షార్ట్ క్వశ్చన్స్‌కి నోట్స్ చెబుతాను.” అని క్లాసునించి నిష్క్రమించాడు.

“కొత్త మాస్టారు బాగా చెప్పారు కదరా”

“అస్సలు కోపం లేదే మాస్టారికి”

“ఫ్రెండ్స్ అన్నారురా మనల్ని. సూపర్ రా”

ఇలాంటి వ్యాఖ్యానాలు క్లాసంతా. శ్యామల రావుకు చాలా రిలీఫ్‍గా, కాన్ఫిడెంట్‌గా అనిపించింది. పరవాలేదు తానూ లెసన్స్ చెప్పగలడు అన్న ధైర్యం కలిగింది.

తర్వాత పీరియడ్ లీజరు. కుతుహలమ్మ గారు ఒకేషనల్ క్లాసుకు వెళ్లారు. కాలేజీ బయట ఉన్న టీ కొట్టు నుంచి ఒకామె టీలు కెటిల్‌లో తెచ్చి, స్టాఫ్ రూంలో ఉన్నవాళ్లకు పింగాణీ కప్పుల్లో పోసి యిచ్చింది. తర్వాత కప్పులన్నీ బయట వరండాలో ఉన్న బకెట్ లోని నీళ్లతో శుభ్రంగా కడిగింది. క్లాసుల్లో ఉన్నవాళ్లకు, ఆఫీసు వాళ్లకు ఇవ్వడానికని వెళ్లింది.

అమె పేరు కనకమ్మట. టీ ఖరీదు రూపాయి అనీ, జీతాల నాడు అందరి దగ్గర వసూలు చేసుకుంటుందనీ చెప్పారు.

మూడో పీరియడ్ సైన్సు క్లాసు, ఫస్టియర్ వాళ్లకు వెళ్లాడు. వీళ్లంతా తెలివైన పిల్లలు. టెంత్ నాలుగు వందల ఎనభై మార్కులకు పైన వచ్చినవారు. వాళ్ళకు గ్రామర్ బుక్ లోంచి ‘కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్’ అన్న ఛాప్టర్ తీసి, కామన్ ఎర్రర్స్ కొన్ని, వాటి సవరణలు ఎక్స్‌ప్లయిన్ చేశాడు. ఎర్రర్ వున్న పది వాక్యాలను బోర్డు మీద వ్రాసి, ఎర్రర్ ఉన్న పార్టును అండర్‌లైన్ చేశాడు. పిల్లలను వాటిని కరెక్ట్‌గా రాయమని పావుగంట టైం ఇచ్చాడు.

బెంచీల మధ్య ఖాళీ స్థలంలో తిరుగుతూ, పర్యవేక్షించాడు. పావుగంట తర్వాత, వారి నోట్ బుక్స్‌ని ఎక్స్చేంజి చేసుకొమ్మని, ఆన్సర్స్ చెప్పి, వాళ్లనే మార్కులు వేయమన్నాడు.

“పదీ కరెక్ట్ చేసిన వాళ్ళు చేతులెత్తండి”

చేతులు ఎత్తినవాళ్లను లెక్కపెడితే 32 మంది తేలారు.

“వెరీగుడ్! కీపిటప్!” అని వాళ్లను ప్రశంసించాడు.

“ఒక్కటి తప్పు అయినవాళ్లు?”

వాళ్లు ఇంచుమించు యాభైమంది తేలారు. వాళ్లకు గూడ ఒక “వెరీగుడ్”.

“అన్నీ తప్పులు రాసిన వాళ్లు?”

ఎవరూలేరు, అనుకుంటుండగా వెనక బెంచీలో ఒక అబ్బాయి లేచి నిలుచున్నాడు. పిల్లలందరూ అతన్ని చూసి నవ్వారు. “నో! దటీజ్ వెరీ బ్యాడ్” అన్నాడు ఇంగ్లీషు మాస్టారు.

“నీ పేరేమిటి అబ్బాయ్” అని అడిగితే “నాని బాబు సార్” అని చెప్పాడు.

“ఏమిటి? నేను ఎక్స్‌ప్లయిన్ చేసింది నీకర్థం కాలేదా?”

“కాలేదు సార్.”

వాడి పక్కన ఉన్న కుర్రవాడిని అడిగాడు “నీకెన్ని వచ్చాయిరా?”

“ఎనిమిది సార్.”

“అయితే నీవు నాని బాబుకు ఎక్స్‌ప్లయిన్ చెయ్యి. రేపు కూడా ఇదే ఛాప్టర్ చెప్పుకుందాము. రేపు నాని బాబు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు చూడండి. ఇదేమంత బ్రహ్మ విద్యనా ఏమిటి? ఎక్కడ తప్పుందో అండర్‌లైన్ గానీ, ‘ఇటాలిక్స్‌’లో గానీ మార్క్ చేసి ఉంటుంది. మిగతా వాక్యం మనకు అనవసరం. మన గ్రామర్ బుక్‍లో వంద కామన్ ఎర్రర్స్ ఎక్స్‌ప్లయిన్ చేశారు. రోజుకో పదిచొప్పున ‘మాస్టర్’ చేయగలిగితే సరి.

పరీక్షల్లో ఈ ప్రశ్నకే ఎనిమిది మార్కులున్నాయి. గ్రామర్ మీద పట్టు సంపాదిస్తే మాథ్స్‌లో లాగా పూర్తి మార్కులు వస్తాయి.”

బెల్ మోగింది! ఇంగ్లీషు మాస్టారు పిల్లలకు థాంక్స్ చెప్పి బయటకు నడిచాడు.

సాయంత్రం ఇంటికి చేరి, తాను క్లాసులు డీల్ చేసిన విధానం శర్వాణికి వివరించాడు.

“నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది వాణీ!” అన్నాడు.

ఆమె అతని భుజం చుట్టూ చేయివేసి, దగ్గరకు తీసుకొని, ఇలా అంది – “ఇంగ్లీషు మాస్టారు బాగా చెబుతారని నాకు తెలుసు లెండి!”

ఇద్దరూ హాయిగా నవ్వుకొన్నారు.

నెలరోజులు తిరక్కుండానే, శ్యామల రావుకు పాఠాలు బాగా చెబుతాడని కాలేజీలో పేరొచ్చింది. లీజరులో ఆఫీసుకు వెళ్లి సీనియర్ అసిస్టెంట్ సాంబమూర్తి గారి దగ్గర కూర్చుని “ఏదైనా పని ఉంటే చెబుతూండండి సార్,” అని అడిగితే ఆయన ఆశ్చర్యపోయాడు.

“మీలా ఎవరూ ఉండరు మాస్టారు. ప్రమోషన్ వచ్చిన వెంటనే అదోలా మారిపోయి పోజు కొడతారు. థాంక్యూ, థాంక్యూ అండి. వెరీ నైస్ ఆఫ్ యు సార్! అంత అవసరమైతే చేద్దురుగాని” అన్నాడు.

రాబోయే శనివారం సెకంట్ సాటర్ డే. ఆదివారం, సోమవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సెలవు. మొత్తం మూడు రోజులు సెలవులు కలిసివచ్చాయి. బావమరిది వాళ్లను, మామయ్య వాళ్లను ఇక్కడికి రమ్మని ఉత్తరాలు వ్రాశాడు.

మహారాణిపేటలో కంటే న్యూకాలనీలో ఇల్లు పెద్దది. వసతులు కూడా మెరుగ్గా ఉన్నాయి. అందరూ వచ్చేశారు. మురళికి ఒక కొడుకు. వాడికీ నాలుగేళ్ళే. ‘విశాల్’ అని పేరు పెట్టుకున్నారు. మురళి భార్య కూడా గరివిడిలో విశాల్ చదివే కాన్వెంటు లోనే టీచరుగా చేరిందట. ఆరు వందలిస్తారట.

జగన్నాథరావు, విశాలాక్షి, బెల్లం గవ్వలు, చుప్పులు చేసుకొని వచ్చారు. ఆదివారం అందరూ బస్సులో వెళ్లి అనకాపల్లి నూకాలమ్మ తల్లిని దర్శించుకుని వచ్చారు. చాలా పెద్ద దేవస్థానం అది. అమ్మవారి వదనంలో జీవకళ తొణికిసలాడుతూంటూంది.

కొంతకాలంగా ప్రసూనాంబకు పూర్తి విశ్రాంతి ఇచ్చి, శర్వాణే వంట చేస్తూంది. మురళి భార్య కూడా మంచిదే. కానీ ఎక్కువగా మాట్లాడదు. శర్వాణికి వంటలో సాయపడసాగింది. కాబట్టి విశాలాక్షికి కూడా విశ్రాంతి దొరికింది. నర్సీపట్నంలో ఆమెకు ఎలాగూ తప్పదు.

మధ్యాహ్న భోజనాలయిం తర్వాత అందరూ విశ్రాంతిగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

జగన్నాథరావుగారు ఇలా అన్నారు “అబ్బాయి శ్యామల రావు! మా ఊర్లో ఎకరన్నర పొలం ఉన్నదని చెప్పానుగా. ఇప్పుడక్కడ భూముల రేట్లు బాగా పెరిగాయి. మొన్న కౌలురైతు వచ్చి, పక్కపొలం రైతు సరిహద్దు రాళ్లను ఒకవైపు గజం దూరం తన పొలంలోకి మార్చుకోవాలని ప్రయత్నించాడనీ, తానే గొడవ చేసి, ఊర్లో పెద్దమనుషులకు చెబితే, విరమించుకున్నాడనీ చెప్పాడు.”

“భూమి విలువ పెరిగే కొద్దీ, దురాశలు కూడ పెరగడం అసహజమేం కాదు కదా మామయ్యా!” అన్నాడు అల్లుడు.

“బాగా చెప్పావు. నాకా శక్తి తగ్గిపోతుంది. మా మురళి చూద్దామంటే దూరంగా ఉన్నాడు. ఇలా అన్యాక్రాంతాలు మొదలవక ముందే పొలం అమ్మేసి మీ యిద్దరికీ చెరిసగం ఇచ్చేద్దామని అనిపిస్తుంది. కౌలు రైతు చాలా సంవత్సరాల నుంచీ చేస్తున్నాడు. మంచివాడు. ఒకవేళ మనం అమ్మదలిస్తే తానే కొంటానని కూడా అన్నాడు.”

“ఇప్పుడక్కడ ఎకరం ఎంత పలుకుతూంది నాన్నా!” అనడిగాడు మురళి.

“రెండు లక్షల వరకూ ఉందిరా! విచారించాను.”

“అంటే ఎకరన్నరకు మూడు లక్షల దాకా రావచ్చు!’

“ఆ! భేషుగ్గా!”

“బావా, అయితే ఒక పని చేద్దాము. నీవు కొమ్మాదిలో, నేను పెద బొడ్డేపల్లిలో హౌస్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాము. ఒక మూడు లక్షలు హౌసింగ్ లోన్ తీసుకుంటే సరిపోతుంది. నీకు కూడా శాలరీ బాగా పెరిగింది కాబట్టి కష్టమనిపించదు. మెల్లగా చేసుకుంటే ఒక సంవత్సరం లోపు ఇల్లు పూర్తవుతుంది. పోను పోను కన్‌స్ట్రక్షన్ కాస్టు పెరగడమేగాని తగ్గడం ఉండదు కదా!”

శ్యామల రావు మామగారితో అన్నాడు “ఆ డబ్బు మురళికే ఇచ్చేయండి మామయ్యా! భగవంతుని దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. హౌసింగ్ లోన్..”

“అలా అనకు నాయనా, తృణమైనా, పణమైనా నా పిల్లలిద్దరికీ చెరి సగం! అంతే. మా అమ్మాయికిచ్చుకుంటున్నాము, నీకు కాదు.”

“మా బావ ఈ కాలం నాటివాడు కాదు” అన్నాడు మురళి నవ్వుతూ.

“కొమ్మాది ఏరియా అంతా చాలా మారిపోయింది మురళీ! అసలు గుర్తు పట్టలేము. మన సైటుకు వెళ్లే దారి తారురోడ్డు అయింది. అక్కడక్కడా ఇళ్ళు లేస్తున్నాయి.”

“నాకు తెలుసు బావా! మనం కొని ఏడేళ్లు కాలేదా?”

“దాటింది.”

“ఇప్పుడక్కడ గజం వెయ్యి రూపాయలట. అంటే మన సైటు లక్షా ఇరవైవేలు! మనం కొన్నది పదకొండవేలకీ కదా! ఎంత అప్రీసియేషనో చూడు! నర్సీపట్నంలో కూడా నా సైటు విలువ బాగా పెరిగిందట.”

“అయితే శుభస్య శీఘ్రమ్! పొలం అమ్మేద్దాము. ఇద్దరూ చక్కగా యింటి నిర్మాణాలు ప్రారంభించండి” అన్నారు జగన్నాధరావుగారు.

***

కొన్ని రోజుల తర్వాత, పొలం కౌలుదారే తీసుకున్నాడనీ, రిజిస్ట్రేషన్ అయిపోయిందనీ, మూడు లక్షల ఇరవై ఏడువేలకు కుదిరిందనీ జగన్నాథరావు గారు జాబు వ్రాశారు. మురళి భాగం అక్కడే బ్యాంకులో వేశాననీ, శర్వాణి భాగం వచ్చి తీసుకుపోవలసిందనీ కోరారు. తమకు, ఏదైనా అత్యవసర ఖర్చుల నిమిత్తం ప్రస్తుతానికి ఆపై ఇరవై ఏడువేలు ఉంచుకుంటామని, వచ్చేటపుడు అమ్మాయిని, పిల్లలను అమ్మను తీసుకోని రావలసిందని వ్రాశారు.

ఒక ఆదివారం ఉదయాన్నే బయలుదేరి నర్సీపట్నం నాన్-స్టాప్ బస్ ఎక్కారు. ఈ మధ్యనే వేశారా బస్సులు. అనకాపల్లి ఊర్లోకి కూడా వెళ్లవు. రెండుంపావు గంటల్లో నర్సపట్నం చేరుకున్నారు. నేషనల్ హైవేను నాలుగు లేన్ల రహదారిగా విస్తరిస్తున్నారు.

విశాలాక్షి వీళ్ళు వస్తారని రాత్రే పొట్టుపెసలు నానేసి ఉంచింది. అందరికీ పెసరట్టు ఉప్మాతో టిఫిన్ పెట్టింది. అందరూ టిఫిన్ చేసి విశ్రాంతిగా కూర్చున్నారు.

లక్షన్నర క్యాష్ ఉన్న జిప్ బ్యాగ్‌ను తెచ్చి అల్లునికి చ్చారు జగన్నాథరావుగారు. “ఇక ఆలస్యం చేయకుండా ఇంటిపని ప్రారంభించండి నాయనా” అన్నారు.

“తప్పకుండానండి మామయ్యగారు! వచ్చే ఆదివారం మురళీవాళ్ళు వస్తున్నారు. ఇద్దరం కలిసి వెళ్లి ఆ వ్యవహారం చూస్తాము” అన్నాడు శ్యామల రావు.

“మీ దగ్గరే ఒక ప్రస్తావన తెస్తున్నానండి. మీ అమ్మాయి తన కంటూ ఏమీ ఆశించకుండా, నా చదువనీ, సైటు కోసమనీ త్యాగాలు చేస్తూ వస్తూంది. ఇది అసలు ఆమెకు మీరిచ్చిన డబ్బు. ఎలాగూ ఇల్లు కట్టుకోడానికి లోన్ పెట్టక తప్పదు. దీంట్లో నుంచి ఒక యాభైవేలు తీసి శర్వాణికి నెక్లెస్, గాజులు, దుద్దులు, రవ్య ముక్కుపుడక, నల్లపూసల చెయినుకు ఒక లాకెట్, ఒక మంచి ఉంగరం చేయించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కాసు బంగారం మూడు వేల ఆరువందలుంది” అన్నాడు.

కూతురిపై అల్లుడు చూపిస్తున్న ప్రేమకు తల్లిదండ్రులు చాలా సంతోషించారు.

“తప్పకుండా చేయించు నాయనా! ఇక్కడ నర్సీపట్నంలోనే నా శిష్యుడు ఉన్నాడు. చాలా నమ్మకస్థుడు. వాడి దగ్గర చేయిస్తే చూసుకోవాల్సిన పని ఉండదు.”

విశాలాక్షి అన్నది “నాలుగు గాజులు ఒక్కటి కాసున్నర పెడితే గాని కంటికానవు. నెక్లెస్ మూడు కాసులన్నా ఉండాలి. దుద్దులు రెండూ ఒక కాసుతో వస్తాయి. లాకెట్ ఒక అరకాసు, ఉంగరం ఒక అరకాసు..”

శర్వాణి కోపంగా అన్నది “నా ప్రమేయం లేకుండా మీరంతా అన్నీ మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడిన్నిన్ని నగలు నా కవసరమా? ఇల్ల కట్టడమంటే అనుకోని పెట్టుబడి ఎంతో ఉంటుంది. పిల్లలు ఎదిగి వస్తున్నారు..”

శ్యామల రావుకు కోపం వచ్చింది. అతనికి అంత కోపం రాగా ఎన్నడూ శర్వాణి చూడలేదు ఈ ఎనిమిదేళ్లలో!

“ఇక ఆపుతావా! మహాత్యాగశీలివి తయారయ్యావు! అప్పుడు సరే, వద్దన్నావు, నేనూ ఉరుకున్నాను. నేను లెక్చరర్‍ను అయితే ఏకంగా నెక్లెస్ చేయించుకుంటానని అన్నావుగా! ఏదీ మరి! మామగారు పెద్ద మనసుతో కూతురికి గూడ ప్రతిదాంట్లో భాగం పంచి యిస్తూంటే, ఆ డబ్బుతోనైనా నీకు నగలు చేయించాలని నేను సరదా పడుతూంటే, సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు? ఛీ! వెధవ బతుకు! దేనికీ స్వతంత్రం లేదు!” అని చివాలున లేచి ముందుగదిలోకి పోయి కూర్చున్నాడు శ్యామల రావు ధుమధుమలాడుతూ.

శర్వాణికి మొదట భయమేసింది. తర్వాత ఏడుపొచ్చింది. పెళ్లయిందగ్గర్నుంచి అంత కోపంగా ఎప్పుడూ అరవలేదు ఆయన.

“అల్లుని మనసు గాయపరచినావు తల్లీ” అన్నారు జగన్నాథరావు, “అతను చెప్పింది సబబుగా ఉంది. నీకింకా నిండా ముఫై ఏళ్లు లేవు. ఇంతవరకు బాధ్యతలు, సరే! అతనూ ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నతస్థాయి కెదిగాడు, భార్యకు నగలు చేయించాలని ముచ్చటపడుతున్నాడు. హౌసింగ్ లోన్ ఎలాగూ తప్పనప్పుడు, కొంత డబ్బు నగలకు ఖర్చు చేస్తే తప్పేముంది? అని అల్లుని వాదన. తల్లీ! నగలు కూడ మంచి పెట్టుబడేనమ్మా! బంగారం ధర పెరగడమేగాని తగ్గడం ఉండదు. కాదనకు.” అన్నాడు.

“కోరి నగలు చేయిస్తానంటే నీకేమొచ్చింది, అలా అంటావు” అన్నది తల్లి.

“శర్వాణీ, యిలా రా!” అనిపించింది ప్రసూనాంబ. వెళ్లి అత్తయ్య దగ్గర కూర్చుంది. “చేయించుకోమ్మా, వాడి ముచ్చటా తీర్చాలి కద. ఇంతవరకూ నీవు చెప్పినట్లు విన్నాడా లేదా? మంచి స్థాయికి వచ్చాక మగవానికి భార్యను అపురూపంగా చూసుకోవాలని ఉంటుంది. ఇప్పడు మనకేం తక్కువ? వరాహనరసింహస్వామి చల్లగా చూస్తున్నాడు. వెళ్లు, వెళ్లి అనునయించి తీసుకురా.”

కళ్లనిండా నీళ్లతో అత్తయ్యను చూసిందా బంగారు తల్లి! కళ్లు తుడుచుకుని ముందుగదిలోకి వెళ్లింది. కిటికి లోంచి వీధిలోకి చూస్తూ, కుర్చీలో కూర్చున్న భర్త భుజం మీద చేయి వేసింది.

ఆ చేయిని విదిలించి వేశాడు శ్యామల రావు! ముఖం అటు తిప్పుకున్నాడు. “ఇంగ్లీషు మాస్టారు గారికి ఎంత కోపం వచ్చింది! అలాగే లెండి చేయించుకుంటాను. మీరంతా ఒక్కటైనాక నేను చేసేదేముంది? పదండి లోపలికి వెళదాం” అన్నది.

“ఏం అక్కర్లేదులే! నీ అంత బాధ్యత గలవాడిని కాదు నేను. అదే గదా నువ్వనేది?” అన్నాడు తిరిగి చూడకుండా.

దగ్గరగా వెళ్లి అతన్ని అనుకోని నిలబడి ముఖం తన వైపు తిప్పుకుని “అలిగిన వేళనే చూడాలి, శ్యామలకృష్ణుని అందాలూ!” అని కమ్మగా పాడింది. “మీరు అలిగితే ఎంత బాగున్నారండీ!” అని పొగిడింది.

భార్య ముఖం చూసిన శ్యామల రావు కరిగిపోయాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని “థాంక్యూ వాణీ! నౌ అయామ్ రియల్లీ హ్యాపీ” అన్నాడు. అతని ముఖం తేటగా మారింది.

ఇద్దరు లేచి లోపలకి వెళ్లారు. “నాన్నకు కోపం వచ్చింది. అమ్మ వెళ్లి చాక్లెట్ కొనిస్తానంటే తగ్గిపోయింది” అన్నాడు సాత్విక్. వాడికి కోపం వస్తే అలాగే చేస్తారు మరి.

(ఇంకా ఉంది)

Exit mobile version