[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘గుండెతడి’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[కుతూహలమ్మ శ్యామల రావుని తమ్ముడని అని పిలుస్తానని అంటారు. సెకండ్ సి.ఇ.సి. క్లాసుకి తీసుకెళ్ళి పిల్లలకి పరిచయం చేసి వెళ్ళిపోతుంది. శ్యామల రావు పిల్లల్ని ఫ్రెండ్స్ అని సంబోధించి పాఠం చెప్తాడు. తదుపరి పిరియడ్‌లో ఫస్ట్ యియర్ సైన్స్ వాళ్ళకి గ్రామర్ చెప్తాడు. మార్కులు తక్కువ వచ్చిన కుర్రాడికి ధైర్యం చెప్పి ప్రోత్సహిస్తాడు. ఇలా రెండు క్లాసులకి చెప్పేసరికి శ్యామల రావుకి ధైర్యం వస్తుంది. నెలరోజులు తిరక్కుండానే, శ్యామల రావుకు పాఠాలు బాగా చెబుతాడని పేరొస్తుంది. మూడు రోజులు సెలవులు రావడంతో అత్తామామల్ని, మురళి కుటుంబాన్ని రమ్మని ఉత్తరాలు రాస్తాడు. ఆదివారం పూట తన ఊర్లో ఉన్న పొలానికి బాగా రేటు వస్తోందని, దాన్ని అమ్మేద్దామనుకుంటున్నాననీ, వచ్చిన డబ్బుని కొడుకుకీ, కూతురికి సమానంగా ఇస్తానని చెప్తాడు మామగారు. ఆ డబ్బుతో ఇంటి నిర్మాణం మొదలుపెట్టమని చెప్తాడు. అనుకున్న విధంగా పొలం అమ్మేస్తాడాయన. తమ వాటా డబ్బు తీసుకునేందుకు రమ్మని అల్లుడికి కబురు చేస్తాడు. అమ్మతోనూ, భార్యాపిల్లల తోను నర్సీపట్నం వెడతాడు శ్యామల రావు. టిఫిన్ తిన్నాకా అల్లుడి చేతికి లక్షన్నర రూపాయలున్న జిప్ బ్యాగ్‌నిస్తాడాయన. అందులో యాభైవేలు తీసి శర్వాణికి నగలు చేయిస్తానంటాడు. ఆమె వద్దంటుంది. శ్యామల రావుకి కోపం వచ్చి వెళ్ళి ముందుగదిలో మాట్లాడకుండా కూర్చుంటాడు. భర్తకి అంత కోపం రావడమెన్నడూ చూడలేదు శర్వాణి. పెద్దలంద్దరూ నచ్చచెప్పగా, నగలు చేయించుకోడానికి ఒప్పుకుని, భర్త కోపం చల్లారుస్తుంది శర్వాణి. సంతోషిస్తాడు శ్యామల రావు. – ఇక చదవండి.]
అందరికీ రెండోసారి కాఫీలు తెచ్చిచ్చింది విశాలాక్షి. తాగుతుండగా శర్వాణి అన్నది “అయితే నాదొక్క షరతు. అత్తయ్యగారికి కూడా రెండు కాసులు పెట్టి గొలుసు చేయించాలి.”
ప్రసూనాంబ వాత్సల్యంగా కోడలిని చూసింది. “నాకెందుకే తల్లీ!” అన్నది నవ్వుతూ.
“నా కెందుకో, మీకూ అందుకే అత్తయ్యా!” అన్నది కోడలు.
“అంత కంటేనా, దానికి కూడా ఈ బడ్జెట్ సరిపోతుంది. నాకు తోచనే లేదు” అన్నాడు పుత్రరత్నం.
“పెళ్ళానికి చేయించాల్సినవి ‘ఇన్ని’ లిస్టు చదివావు! అమ్మ గురించి ఆలోచించావా? కలికాలం నాయనా, కలికాలం” అన్నది తల్లి నవ్వుతూ.
అమ్మ తనను ఆట పట్టిస్తుందని అర్థమయింది శ్యామల రావుకు. “ఊరుకోవే అమ్మా” అన్నాడు గారాబంగా.
ప్రసూనాంబ అన్నది “నాకీ ఈ వయసులో గొలుసెందుకు గాని, ఈ పగడాల దండకు వెండి తీగ చుట్టించాము, ఎప్పుడో ఏళ్లనాడు. దానికి బంగారంతో తీగ చుట్టించరా శ్యామూ.”
“అత్తయ్యకు అమ్మవారంటే యిష్టం. క్రింద చిన్న లక్ష్మీ దేవి బొమ్మ ఉన్న లాకెట్ చేయించి తగిలిస్తే బాగు” అన్నది శర్వాణి.
“అవి రెడీమేడ్‍వి కూడా దొరుకుతాయి” అన్నది విశాలాక్షి.
మధ్యాహ్న భోజనం బూడిద గుమ్మడి ముక్కలతో మజ్జిగ పులుసు, పాలకూర పప్పు, గుమ్మడి వడియాలు, బర్‌బాటీ కూరతో సుసంపన్నమయింది.
సాయంత్రం చల్ల పునుగులు చేసింది విశాలాక్షి, అందరూ కలిసి కె.టి. పేట రోడ్డులో ఉన్న జగన్నాథరావు గారి శిష్యుడి బంగారం కొట్టుకు వెళ్లారు. ఆ అబ్బాయి చిన్నవాడే. శ్యామూ వయసే ఉంటుంది. ‘మోదకొండమ్మ తల్లి జ్యూయలర్స్’ అన్న బోర్డు ఉంది పాపు ముందు. మాస్టారిని చూసి లేచి వచ్చాడు. “నమస్కారం మాస్టారూ! రండి! రండమ్మా! శర్వాణమ్మా బాగున్నావా?” అని ఆహ్వానించాడు.
అతని పేరు వీరేశం. అందరూ కూర్చున్నారు. “కబురుపెడితే నేనే వచ్చేవాడిని కదా మాస్టారూ!” అన్నాడు వినయంగా.
“ఈయన శ్యామల రావు. మా అల్లుడు. భీమునిపట్నం గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్” అని పరిచయం చేశాడు జగన్నాథరావుగారు. ఆయన గొంతులో కించిత్ గర్వం తొంగి చూసింది.
“నమస్కారం సార్!” అన్నాడు వీరేశం. బయట కూల్ డ్రింక్స్ షాపు నుండి అందరికీ నిమ్మకాయ సోడాలు తెప్పించాడు.
“నీ దగ్గర అమ్మాయికి, వాళ్లమ్మగారికి నగలు చేయించాలని వచ్చామురా వీరేశా! వైజాగ్ సిటీలో వద్దనుకున్నాము, నీవైతే నమ్మకం మాకు.”
“తప్పకుండా చేద్దాము మాస్టారు!” అన్నాడు ఆ అబ్బాయి.
“ఇప్పుడు బంగారం ధర ఎంతుందండి?” అని అడిగాడు శ్యామల రావు.
“ఈ రోజు కాసు మూడు వేల నాలుగు వందల ఇరవై ఉంది సార్. గతవారం కంటే రెండు వందలు తగ్గిందండి”
కావలసిన వన్నీ చెప్పారు. ప్రసూనాంబ పగడాల దండ తీసి యిచ్చింది. దానికి బంగారం తీగ చుట్టి, లక్ష్మి లాకెట్ పెట్టాలన్నారు.
ఒక కాగితం మీద వివరంగా లెక్కవేసి యిచ్చాడు. “నాలుగు గాజులు, నెక్లెస్, దుద్దులు, లాకెట్, ముక్కుపుడకకు డైమండ్ వేద్దామండి. శర్వాణమ్మ రంగుకు ఎర్రరంగుదైతే బాగుంటుంది. పెద్దమ్మగారి పగడాల దండ, లాకెట్ అన్నీ కలిసి పధ్నాలుగు కాసుల ఆరు గ్రాములవుతాయండి. మా గురువుగారు కాబట్టి మజూరీ తీసుకోను. అంతా కలిసి నలభైవేల ఏడువేల ఆరువందల రూపాయలవుతుంది. ఆ ఆరువందల కేమిలెండి. నలభైఏడు ఇవ్వండి చాలు.”
“ఎందుకురా వీరేశా, మా కోసం నష్టపోతావు?” అన్నారు మాస్టారు శిష్యవాత్సల్యంతో. “రాక రాక అవకాశం వచ్చింది గురువుగారు. ఏం పరవాలేదండి. మీ వంటివారికి చేసిస్తే, మా వ్యాపారం మరింత బాగుపడుతుందండి” అన్నాడతను. అప్పట్నించి నిలబడే ఉన్నాడు. ఎంత చెప్పినా కూర్చోలేదు. అదే గురువుకున్న విలువ! శర్వాణి “వీరేశన్నా, మూడు వేలతో మావారికి ఒక ఉంగరం చేయవా?” అన్నది. “రాయి వద్దు. నరసింహస్వామి మూర్తి రావాలి.”
“నాకెందుకు..” అని మొదలుపెట్టబోతుంటే ప్రసూనాంబ వారించింది కొడుకును. “ఇక నీవు మొదలుపెట్టావా త్యాగాలు? అమ్మాయి సరదా తీర్చు. మాట్లాడకు” అంది.
ఇబ్బందిగా ముఖంపెట్టి కూర్చున్న శ్యామల రావును చూసి అందరూ నవ్వారు. “చేయించుకోండి సార్, మొన్ననే రావికమతం శెట్టిగారు ఒకాయన చేయించుకున్నారలాగ. చూపిస్తాను ఉండండి” అని అద్దాల షెల్ఫ్ లోంచి ఒక ఉంగరం తీసి చూపించాడు. అద్భుతంగా ఉంది. లక్ష్మీనరసింహస్వామి మూర్తిని పొదిగారు. అమ్మవారి, స్వామివారి రూపురేఖలు స్పష్టంగా కనబడుతున్నాయి.. “చాలా బాగుంది” అన్నారందరూ.
“ఏడు గ్రాములు పడిందండి. మజూరీతో రెండువేల ఆరువందలయింది. మీకు రెండూ నాలుగుకే చేయిస్తాను.” అన్నాడు.
“ఇంకా ఆరువందలు మిగులుతూంది” అన్నాడు శ్యామల రావు.
“ఓహో, రౌండ్ ఫిగర్ యాభైవేలు చేద్దామనా, అయితే శర్వాణమ్మ కూతురికి కాళ్లకు వెండి పట్టీలు చేద్దాము.”
అందరూ బాగుందీ ఆలోచన అన్నారు.
“మరి నాకో వెండి పట్టీలు?” అని అడిగాడు సాత్విక్. అందరూ నవ్వారు. “మగపిల్లలు పట్టీలు పెట్టుకోరు నాన్నా” అన్నది శర్వాణి.
“అయితే నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్ బార్ కొనివ్వండి. పే..ద్దది! అక్కయ్యకు వద్దు!”
“ఓరి వెధవా! అలా అనొచ్చా!”
“సరే, అయితే, చిన్న ముక్క యిస్తాలెండి సాహితక్కకు!”
అందరూ నవ్వుకున్నారు.
వచ్చే నెల ఇరవైమూడున వాళ్ల పెళ్లి రోజనీ, దానికి నాలుగు రోజులు ముందు గానే నగలు పూర్తవ్వాలనీ చెప్పారు. అంత టైం అవసరం లేదనీ, పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి చేసి ఇంటికే తెచ్చిస్తానన్నాడు వీరేశం. వెళ్లేముందు మాస్టారికీ, అమ్మగారికి కాళ్లకు దండం పెట్టాడు.
“ఆయుష్మాన్ భవ! వ్యాపారాభివృద్ధిరస్తు!” అని దీవించారు శిష్యుణ్ణి. ఎప్పుడు పురమాయించాడో గాని, ఒక కుర్రవాడు వచ్చి రెండు బిగ్ సైజ్ చాక్లెట్ బార్‍లు, పెద్దది గుడ్ డే బిస్కట్ పాకెట్టు, ఎక్లయర్స్ చాక్లెట్ పాకెట్ అరకేజీది తెచ్చిచ్చాడు ఒక ముచ్చు కవర్లో.
అడ్వాన్సు గురించి అడిగితే, ఎంతో కొంత యివ్వండన్నాడు. పదిహేను వేలు ఇచ్చేసి అందరూ యిల్లు చేరుకున్నారు. శ్యామల రావు ముఖం సంతోషంతో వెలిగిపోతోంది! శర్వాణి అతన్ని ఓరకంట చూసి నవ్వింది!
***
వచ్చే ఆదివారం మురళి వస్తున్నట్లు కాలేజి ల్యాండ్‌లైనుకు ఫోన్ చేశాడు. ఉదయాన్నే భార్యను కూతురిని తీసుకొని ఖుర్దా రోడ్ ప్యాసింఖరులో వచ్చేశాడు. టిఫిన్లయ్యాక బావా, మరదులిద్దరూ బస్సులో కొమ్మాది జంక్షన్‍కు వెళ్లారు. అక్కడి నుంచి ఆటోలో ప్లాట్ దగ్గరకు వెళ్లారు. చక్కగా చదును చేసి మధ్యలో ముప్ఫై అడుగుల రోడ్లు వేశారు. డ్రయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. రోడ్ల వెంబడి కొబ్బరి మొక్కలు నాటారు. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ‘సింహగిరి డెవలపర్స్’ అన్న బోర్డు ఎండలో మెరుస్తూంది.
వీళ్ల ప్లాటు అప్రోచ్ రోడ్డును ఆనుకునే ఉంది. చక్కగా చదును చేసి, నాలుగు సరిహద్దు రాళ్లు పాతి, వాటి మీద పసుపుపచ్చ పెయింట్ వేసి దాని మీద నల్లని అక్షరాలతో ప్లాటు నంబరు వేసి ఉంది. “బావా, లే ఔట్ కాబట్టి మనం సేఫ్. అదే ఇండివిడ్యుయల్ ప్లాటు కొని ఉంటే రిస్కు!” అన్నాడు మురళి.
“నిజమేనోయ్” అన్నాడు బావ.
చుట్టుపక్కల చాలా వెంచర్స్ వచ్చాయి. ఇళ్ల నిర్మాణం జోరుగా జరుగుతూంది. వీళ్ల వెంచర్ లోనే దాదాపు ఇరవై ఇళ్ల దాకా లేచాయి. కొన్ని పునాదులు తీశారు. పిల్లర్స్ వేశారు. కొన్ని బేస్ మట్టం వరకు వచ్చాయి. వీళ్ల లైన్ లోనే రెండు ప్లాట్ల అవతల ఒక యిల్లు శ్లాబ్ వేస్తున్నారు.
ఇద్దరూ అక్కడికి వెళ్లారు. ఓనరు ఒక పక్కన నిలబడి వర్కును పర్యవేక్షించుకుంటున్నాడు. వెళ్లి విష్ చేశారు. “చెప్పండి మాస్టారు!” అన్నాడతను.
“209 మాదేనండి. మేము కూడా హౌస్ కన్‍స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నాము. మిమ్మల్ని చూసి..”
పరస్పరం పరిచయాలయ్యాయి. “తొందరగా కట్టేయండి. పోనుపోను సిమెంటు, ఐరను, కంకర, ఇసుక మరింత ధరలు పెరుగుతాయి. మీరు వైజాగులో ఉంటారు. భీమిలిలో జాబ్ అంటున్నారు, కాబట్టి ‘సింహగిరి’ వాళ్లకే బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇచ్చేయండి. స్క్వేర్ ఫీట్‌కి ఇంతని ఉంటుంది. బ్యాంకు లోన్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. పక్కాగా చేస్తారు లెండి. ఆ మెటీరియల్ తెచ్చుకోవడం, లేబరు, ఈ బాధలన్నీ మీరు పడలేరు మాస్టారు. వీళ్ల దగ్గర సివిల్ ఇంజనీరుంటాడు. ఆయనే ప్లాన్ యిస్తాడు. మనమే అన్నీ తెచ్చుకొని, దగ్గరుండి కట్టించుకుంటే ఒక టెన్ పర్సెంట్ కలిసొస్తుంది కాని, ఆ చాకిరీ మీరు చెయ్యలేరు. నన్నడిగితే వాళ్లకీ అప్పగించి, మధ్యలో వారం పది రోజులకొకసారి వచ్చి చూసుకుంటే సరిపోతుంది.”
ఇద్దరూ అతనికి థాంక్స్ చెప్పి వచ్చేశారు. మధ్యాహ్నం వెజిటబుల్ పలావు, రైతా చేసి, మిరపకాయ బజ్జీలు చేశారు వదినా మరదళ్లు. భోంచేసి కాసేపు రిలాక్స్ అయి, టీ తాగి ఆశీలుమెట్టలోని ‘సింహగిరి డెవలపర్స్’ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ కూర్మారావు, సూర్యారావు ఇద్దరూ ఉన్నారు. చాలా కాలమైంది కాబట్టి గుర్తుపట్టలేదు వీళ్లను.
“కొమ్మాది లోని మీ వెంచర్‌లో ప్లాటు నం. 209 తీసుకున్నాము కదా” అని శ్యామల రావు అంటూనే.. “అవునండి. గుర్తొచ్చింది. తమరు రేగలో పని చేసేవారు. ఈయన మా పార్టనర్ బుల్లబ్బాయి కొడుకు నూకరాజు కొడుక్కి క్లాసుమేటు కద!” అన్నాడు సూర్యారావు.
“మీ ప్లాటు అమ్ముతారేటండి. గొప్ప రేట్లెలిపొచ్చి నాయండి బాబు” అన్నాడు సూర్యారావు.
“ఇప్పుడక్కడ ఎంతుందేమిటి?” అన్నాడు మురళి ఏమంటాడోనని.
“మీది నూటిరవై గదండి. లచ్చన్నరకు పైమాటేనండి.”
“మీకు ఆ రోజే చెప్పాను సార్. అదే జరుగుతుంది చూడండి.”
“మేము ఇల్లు కట్టించుకోవాలని అనుకుంటున్నామండి. దాని గురించి వచ్చాము. మీరేమో..”
“చాలా సంతోషం సార్. మేమే కట్టించి యిస్తాము. బయట సివిల్ ఇంజనీర్లు ప్లాను వేసిచ్చినందుకే కన్‌స్ట్రక్షన్ కాస్టులో వన్ పర్సెంట్ తీసుకుంటారండి. మా సంస్థ ఇంజనీరే ఉన్నారు. మీకు పైసా ఖర్చుండదు. స్క్వేర్ ఫీటు ప్రకారం మాట్లాడుకుంటే చాలు. మార్కెట్ కంటే యాభై రూపాయలు తక్కవకే కట్టిస్తాము.”
“ప్రస్తుతం ఎంత తీసుకుంటున్నారు స్క్వేర్ ఫీట్‌కి?”
“సిటీలో ఏడువందల యాభై నుంచి ఎనిమిది వందలవరకు నడుస్తూంది సార్. మనది దూరం కాబట్టి ఏడువందలకు చేస్తున్నాము. మీరు మేము ఒక మాట అనుకుంటే ఆరువందల యాభైకి చేస్తాము.”
“మీ ప్లాటు రోడ్డును ఆనుకొని ఉంది. పైగా మెయిన్ సిక్స్టీ ఫీటు రోడ్డు మీకు ఎడమ వైపు, ఎదురుగ్గా ధర్టీ ఫీట్ రోడ్ వచ్చాయి” అన్నాడు టేబుల్ మీద పరచి ఉన్న మ్యాప్ చూస్తూ. “ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇల్లు సూపర్‌గా వస్తుంది.”
“రఫ్ ఎస్టిమేట్ వేయండి దయచేసి”
“సూర్యారావు, కాల్‌క్యులేటర్ తియ్యి” అని చెప్పసాగాడు. “మనది ప్లింత్ ఏరియా వెయ్యిన్నీ యాభై అడుగులు వస్తుంది సార్. కార్పెట్ ఏరియా ఎనిమిది వందల యాబై దాకా రావొచ్చు. 850 x 650 కొట్టు.”
సూర్యారావు నంబర్లు నొక్కిచెప్పాడు “ఐదు లక్షల ముపై రెండు వేల ఐదొందలు”.
“ఐదున్నర అనుకోండి సార్. మెటీరియల్ మంచిదే వేస్తాము. పోర్ట్‌లాండ్ సిమెంట్ ప్రీమియంది వాడతాము. ఐరన్ మన స్టీలు ప్లాంటుదే. మీరు ఇల్లంతా వుడ్ వర్క్స్ చేయించుకోవాలంటే మరో లక్ష వరకు అవుతుంది.”
“లోన్ కూడా మీరే అరేంజ్ చేస్తారని విన్నాము.”
“భేషుగ్గానండి. మన వెంచరుకు ఇసుక తోటలోని ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ బ్రాంచి వారు హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారండి. ఐదు లక్షల లోపు అయితే ఎయిట్ పర్సెంట్ ఇంటరెస్ట్ పడుతుంది. లక్షకు పన్నెండు వందలు ఇన్‌స్టాల్‌మెంట్ వస్తుంది అటు ఇటూగా. మనకు కాస్టుతో ఎనభై పర్సెంట్ వరకు లోన్ వస్తుంది. మిగతాది మన మార్జిన్ మనీ.”
మళ్లీ సూర్యారావును కొట్టమన్నాడు. “ఆరున్నర లక్షలు అనుకుందాం, వుడ్ వర్క్‌తో సహా. అందులో ఎయిటీ పర్సెంట్ కొట్టు.”
“లక్ష అరవై ఐదువేలు మార్జిన్ మనీ. ఐదు లక్షల ఎనభై ఐదువేలు లోను.”
“మనం మార్జిన్ మనీ పెంచుకొని, లోన్ తగ్గించుకుంటే?
“మరీ మంచిది. మీ దగ్గర ఎంతవుంది?”
“లక్ష రూపాయలు ఉంది.”
“అంటే మరో ముపై ఐదు వేలు కలుస్తుంది. అప్పుడు లోన్ ఐదున్నర తీసుకుంటే చాలు.”
శ్యామల రావన్నాడు “ప్రస్తుతానికి వుడ్ వర్క్ వద్దులెండి. నెమ్మది మీద చేయించుకుంటాము.”
“చేయించేద్దాం సార్! ఒక పనయిపోతుంది.”
“కష్టం లెండి, కూర్మారావు గారూ.”
“సరే అయితే. నాలుగున్నర. నెలకు ఐదువేల ఐదువందల వరకు మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ పడుతుంది. మీకు ఇన్‍కంటాక్స్ పడదేమో కదా!”
మురళి అన్నాడు “మా బావగారు ఇప్పుడు లెక్చరర్! భీమునిపట్నం కాలేజీలో. ఆయన బేసిక్ పే నే పదివేలుంటుంది” అని అతని గొంతులో బావ పట్ల గర్వం!
“బాబోయ్! సారీ మాస్టారు! మరేం అనుకోబాకండి” అన్నాడు కూర్మారావు.
“ఎందుకడిగానంటే, మీ శాలరీకి తప్పకుండా టాక్స్ పడుతుంది. కాని హౌసింగ్ లోన్ వల్ల మీరు ప్రతి సంవత్సరం బ్యాంకుకు కట్టే వడ్డీ అంతా ‘స్టాండర్డ్ డిడక్షన్’ క్రింద టాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది. అసలు మొత్తాన్ని 80 C. క్రింద చూపించవచ్చును. కాబట్టి మీరు TDS ఏమీ పెట్టుకోకండి మాస్టారు. అలా మీకు దాదాపు నెలకు వెయ్యికి పైగా ఆదా అయినట్లే!” అన్నాడు
‘ఇతనికి తెలియని విషయం లేనట్లుంది’ అనుకున్నాడు శ్యామల రావు. అతని ఉద్దేశం గ్రహించినట్లు “కస్టమర్లకి అన్ని విషయాలు చెప్పాలి కదండి అందుకే..” అని నవ్వాడు.
“సరేనండి. మీరు ప్లాను గీయించండి. రెండు మూడు రోజుల్లో వచ్చి కన్‌ఫర్మ్ చేస్తాను.”
ఇద్దరూ బయటికి వచ్చేశారు. “ఈ శుభ సందర్భంలో..” అని మురళి మొదలుపెట్టగానే “షరా మామూలే! పద!” అన్నాడు బావ నవ్వుతూ. మిర్చి బజీలు, పునుగులు తిని ఇంటికి చేరారు.
ఊరికి వెళ్లేముందు మురళి అన్నాడు “బావా, వాళ్లు చెప్పింది కరెక్టా కాదా అని క్రాస్‍చెక్ చేసుకోవాలి. నేను కనుక్కుంటా. బ్యాంక్ ఇంటరెస్ట్ రేట్లు కూడా ఎంక్వయిరీ చేయాలి.”
మర్నాడు కాలేజీలో, స్టాఫ్ రూంలో ఈ ప్రస్తావన తెచ్చాడు శ్యామల రావు.
“కొమ్మాది జంక్షన్‍కు దగ్గరలో ఎనిమిదేండ్ల కిందటే ప్లాట్ తీసుకున్నారా? ఇప్పుడక్కడ ప్లాట్లే దొరకని పరిస్థితి” అన్నాడు కామర్స్ లెక్చరర్ జి.యస్.యన్. ‘సింహగిరి డెవలపర్స్’ అని చెబితే “వాళ్లకు సిటీలో మంచి పేరుంది లెండి. యు కెన్ గో అహెడ్” అన్నారు జువాలజీ లెక్చరర్ జోగారావు.
సీనియర్ అసిస్టెంట్ సాంబమూర్తి గారితో, ప్రిన్సిపాల్ విలాసరావు గారితో కూడా చర్చించాడు.
“స్క్వేర్ ఫీట్ సిక్స్ ఫిఫ్టీ ఈజ్ రీజనబుల్ అండ్ అఫర్డబుల్” అన్నారు ప్రిన్సిపాల్ గారు. “ఈ మధ్య గోపాలపట్నంలో మా మేనల్లుని గృహప్రవేశానికి వెళ్లాం. వాడికి సెవెన్ ఫిఫ్టీ పడిందన్నాడు.”
“రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ జాతీయ బ్యాంకులన్నింట్లోనూ ఇంచుమించు ఒకటే ఇంగ్లీషు మాస్టారు!” అన్నాడు సాంబమూర్తి,
రెండు రోజుల తర్వాత వెళ్లి కన్ఫర్మ్ చేశాడు. బిల్డర్ అగ్రిమెంటు వ్రాసుకొన్నారు. ప్లాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, శ్యామల రావుది లేటెస్ట్ శాలరీ సర్టిఫికెట్, అతనివీ, శర్వాణివీ ఫోటోలు తెచ్చుకోమన్నారు. మేడంగారిని కూడ తీసుకువస్తే ఇంటి ప్లాను గురించి మాట్లాడవచ్చని, వాస్తు ప్రకారమే కన్‌స్ట్రక్షన్ చేస్తామని చెప్పాడు కూర్మారావు. లీగల్ ఒపీనియన్, జి.వి.ఎమ్.సి. పర్మిషన్లు అన్నీ తామే చూసుకుంటామని కూడా చెప్పాడు.
లక్ష రూపాయలు వాళ్లకు కట్టేశాడు శ్యామల రావు. వచ్చే నెల నుంచి తన జి.పి.ఎఫ్ కాంట్రిబ్యూషను రెండు వేలు చేయమని సాంబమూర్తిగారితో చెప్పాడు. హౌసింగ్ లోను ఐదువేలనుకున్నా, మిగతా డిడక్షన్స్ పోను చేతికి పద్నాలుగువేలు వస్తుంది.
లెక్చరర్‌గా తొలి జీతాన్ని తల్లి చేతిలో పెట్టి నమస్కరిస్తే, “దేవుని దగ్గర పెట్టు నాయనా” అన్నది. ఈ లెక్కలన్నీ అమ్మకూ, భార్యకూ చెప్పాడు.
సాహితి పేరున, సాత్విక్ పేరున చెరో వెయ్యి రూపాయలు ఆర్.డి. పోస్టాఫీసులో తెరవాలని శర్వాణి చెప్పింది. పాత మంచాలు, కుర్చీలు అన్నీ తీసేసి కొత్తవి కొన్నారు. నెలకు మూడువంద లిచ్చి గిన్నెలు తోమడానికి, ఇల్లు తుడవడానికి ఒక పనిమనిషిని కుదుర్చుకున్నారు. ఆమె పేరు అప్పలనరసమ్మ. ఇంటి కొచ్చి బట్టలు ఉతికి పెట్టే ఒక చాకలామె కూడా కుదిరింది. ఆమెకు వంద రూపాయలు.
నెలకు మూడు వందలు ఇన్‌స్టాల్‌మెంట్ కట్టేలా, ఒక బ్లాక్ అండ్ వైట్ టి.వి కొనుక్కున్నారు విశాఖ ఏజన్సీస్‌లో. స్టాండుతో సహా ఐదువేలయింది. ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్, మద్దిలపాలెం, బజాజ్ షోరూములో బజాజ్ ‘ప్రియ’ స్కూటరు వాళ్లింట్లోకి అదనపు ఆకర్షణగా వచ్చి చేరింది – ముదురు నీలం రంగులో మురిసిపోతూ ఉంది! అది ఆరువేల ఐదువందలు అయ్యింది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌కి బజాజ్ వాళ్ళు లోనిస్తారు. శాలరీలో నుండి కట్ చేసి, కాలేజీ వాళ్లే వాళ్ల అకౌంటుకు రెమిట్ చేస్తారు. ఆ మేరకు ‘అండర్‌టేకింగ్’ ఇచ్చాడు. దాని ఇన్‌స్టాల్‌మెంట్ నెలకు రెండువందల యాభై.
అలా శ్యామల రావు వాళ్ల లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇవన్నీ కట్టినా నెలనెలా చేతికి పదకొండు వేలు అందుతూండడంతో అతనికి పెద్ద టెన్షన్‍గా ఏమీ లేదు.
పెద్దగా అడ్డంకులు ఏమీ లేకుండా లోన్ శాంక్షనయింది. అమ్మనూ, భార్యనూ తీసుకొని పోయి సివిల్ ఇంజనీరుతో ఇంటి ప్లాను గురించి చర్చించాడు; సింహగిరి వాళ్ల ఆఫీసులోనే. ఆయన చాలా పెద్దాయన. ఆర్ అండ్ బి శాఖలో ఇంజనీరుగా పనిచేసి రిటైరై, వ్యాపకం కోసం ఈ పని చేస్తున్నాడట. వాళ్ళది నెల్లూరు జిల్లా. అయితే, ఉద్యోగరీత్యా విశాఖకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడట పెంచలనాయుడు. నెల్లూరు జిల్లాలో ‘పెనుశిల’ అనే ప్రసిద్ధ నృసింహ క్షేత్రం ఉందనీ, ఆయనను పెంచలయ్యస్వామి అంటారనీ, ఆ స్వామి పేరే తనదని ఆయన వివరించాడు. అన్ని రూపాలలో నరసింహుడు మన వెంటే ఉన్నాడని ప్రసూనాంబ అన్నది.
“అమ్మా, మీకు రెండు వైపుల రోడ్లు వచ్చాయి కాబట్టి రెండు ఎంట్రన్సులు పెడదాము. ఈస్ట్ ఫేసింగ్ ముఖద్వారం. చుట్టూ కాంపౌండు వాల్. ముందు గేటుకూ మెయిన్ డోర్‌కు మధ్య పదకొండు అడుగులు స్థలం వదుల్తాము. బండి పెట్టుకున్నా, ఇంకా స్థలం ఉంటుంది. కుడి పక్క నుంచి దాబా మీదకు మెట్లు వస్తాయి.
మొదట యల్ షేపు హాలు వస్తుంది. కుడి పక్క మాస్టర్ బెడ్ రూమ్ 14 x 12, ఎడమ పక్క నైరుతిలో వంటగది, సింకు, గట్టు వస్తాయి. ఈశాన్యంలో, ఒక రాడ్‌కు కర్టెను కట్టుకుంటే చిన్న డైనింగ్ ప్లేస్ అవుతుంది. వంట గదికి ఇవతల ఇంకో బెడ్ రూం వస్తుంది. అది చిన్నది. వంటింట్లోంచి పెరట్లోకి తలుపు వస్తుంది. వెనక ఆరడుగుల వెడల్పున పెరడు. అందులో ఒక వైపు బాత్రూం కం లావెటరీ, రెండో వైపు గిన్నెలు, బట్టలకు వాషింగ్ ఏరియా వస్తాయి. గోడ నుంచి ఒక అడుగు స్థలం ప్లాస్టరింగ్ చేయకుండా ఆరించిల ఇటుక గోడ కట్టి వదిలేస్తే ఏవయినా మొక్కలు పెంచుకోవచ్చు. ఇంటికి ఎడమవైపు పెరట్లోకి వెళ్లడానికి వీలుగా నాలుగడుగుల ప్యాసేజ్ వస్తుంది. అక్కడ బట్టలు ఆరేసుకునే తీగలు వగైరా కట్టుకుంటారు. ఇంటికి కుడివైపు మాత్రం రెండడుగులే వదుల్తాము. ఇంటికి, కాంపౌండ్ వాల్‌కి మధ్య మెట్ల క్రింది స్థలాన్ని కూడా ఏమయినా వస్తువులు పెట్టడానికి వాడుకోవచ్చు. మరిచిపోయాను, హాల్లో ఒక కామన్ బాత్ రూం చిన్నది వస్తుంది. మాస్టర్ బెడ్ రూముకు ఒక అటాచ్డ్ బాత్ రూం వస్తుంది. పెరట్లో బాత్ రూం సరిపోతుందనుకుంటే, హల్లో బాత్ రూం మానేస్తే హాలు మరింత విశాలంగా ఉంటుంది. దీంట్లో మీకేమయినా మార్పులు కావాలంటే చెప్పండి.”
“ఈ డైనింగ్ ప్లేసుకి బదులు దేవుడికి ప్రత్యేకంగా ఒక పూజగది కట్టిస్తే బాగుంటుందండి” అన్నది ప్రసూనాంబ.
“దానికేం భాగ్యం! దేవుడి కంటేనా? అప్పుడు డైనింగ్ టేబుల్ హాల్లోనే ఒక చివర వేసుకుంటే పాయె” అన్నాడు ఆయన.
ప్రసూనాంబ సంతోషించింది. “ఇంటి ముందు మొక్కలు పెంచుకోడానికి..” అని శర్వాణి అంటే, “అలా చేస్తే ‘పోర్టికో’ తగ్గుతుంది తల్లీ! నీవు డాబా మీద కుండీల్లో కావలసినన్ని మొక్కలు పెంచుకోవచ్చు. వాటర్ టాంకు పక్కన ఒక ట్యాప్ పెట్టించుకొని, దానికో రబ్బరు ట్యూబు తగిలించుకుంటే, మొక్కలకు నీరు పెట్టడం కూడా సులువే.”
ఆయన వివరించిన విధానం ఎంత బాగుందంటే కట్టబోయే యిల్లు మొత్తం కుటుంబ సభ్యుల కళ్ల ముందు నిలిచింది. ప్లాన్ ఓ.కె. చేసి అందరూ ఇంటికి వచ్చేశారు. ఏడెనిమిది నెలల్లో కన్‌స్ట్రక్షన్ పూర్తి చేసి ఇల్లు హాండోవర్ చేస్తామని డెవలపర్స్ మాటిచ్చారు.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
