
సమకాలీన సమాజంలో మనం చూస్తున్నాం – హనీమూన్ లోనే భర్తను హత్య చేసే నవనాగరిక సతీమణులను; చేసుకోబోయేవాడికి తల్లిదండ్రులు, తోడబుట్టినవారు ఉండకూడదని, ఉన్నా కొడుకు దగ్గర ఉండడానికి ససేమిరా వీల్లేదని గొంతెమ్మ కోర్కెలు కోరే దిగువ మధ్యతరగతి ఆడపిల్లలను, వారి మాటలకు తందానా పాడే తల్లిదండ్రులను. ఏమిటిది? రాను రాను మనుషుల్లో ‘గుండెతడి’ ఇంకిపోయి, మానవమృగాలవుతున్నారా? ఆర్థిక సంబంధాలు మాత్రమే మానవ సంబంధాలుగా నిలుస్తున్నాయా?
కాదు, కాదని నిరూపించే నవల ‘గుండెతడి’. భార్యే స్నేహితురాలు, గురువు, ఫిలాసఫర్ అయితే ఆ మగవాని జీవితం ఎంత మధురంగా ఉంటుంది? అత్తాకోడళ్ల మధ్య ఆతి పైశాచిక కక్షాకార్పణ్యాలను మన టీవీ సీరియళ్లు వండివారుస్తూన్న ఈ పోయే కాలంలో, ఇలాంటి అత్తాకోడళ్ళుంటే ఎంత బాగుంటుంది! అనిపించే నవల ‘గుండెతడి’. బావ బావమరదుల బంధం ఎలా వుండాలో చెప్పే నవల ‘గుండెతడి’.
సిగ్మండ్ ఫ్రాయిడ్ వివరించిన ‘ఒడిపస్ కాంప్లెక్స్’ అన్న మానసిక రుగ్మతను వందశాతం తెలుగు ఫిక్షన్‌గా రూపొందించిన నవల ‘గుండెతడి’. ఇలాంటి పిల్లలూ ఉంటారా అని పాఠకులను ఆలోచింపచేసే నవల ‘గుండెతడి’.
చక్కని ప్లానింగ్‌కు, కృషి, పట్టుదల తోడైతే, దానికి భార్య కొండంత అండగా నిలబడితే, ఆ భర్త ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదగగలడో చూపించే నవల ‘గుండెతడి’. తల్లినీ, భార్యనూ సమానంగా ప్రేమించేలా చేసే నవల ‘గుండెతడి’. ఆపేక్షలకు మతం లేదని, అభిమానాలకు కులం లేదనీ నిరూపించే నవల ‘గుండెతడి’.
~
పాణ్యం దత్తశర్మ గారి నవల ‘గుండెతడి’ సంచిక వారపత్రికలో, వచ్చే వారం నుండి ప్రారంభమవుతోంది.
చదవండి.. చదివించండి.
‘గుండెతడి’
