ఉరకలేసి ఎగిసిపడుతుందది,
స్థిరత్వ లేమి దాని అస్థిత్వం,
ఉత్సాహ నిరుత్సాహాలతో
మనిషికి నిలకడలేని
వ్యక్తిగా గుర్తింపుతెస్తుంది.
ఊహించని ఘటనలతో
నిశ్చలతటాకం లాంటి
జీవితాలను అల్లకల్లోలం చేస్తుంది
అదే—-
మనసు అనే నీడ!!
మంచితనం కనిపించేదీ,
అసూయకు బీజం నాటేదీ
మానవత్వం పరిఢవిల్లేది, రాక్షసత్వం నిద్రలేచేదీ
గుప్పెడంత మనసులోనే-
గుండెలాంటి మదిలోనే!!
వదలలేని ఇష్టమైనా,
కలవలేని ఏహ్యమైనా,
మొలకెత్తి మానులా
విస్తరించేదీ మనస్సులోనే-
గాయం తగిలితే తట్టుకోలేని సున్నితమదీ-
కొండలు పిండిలా మారినా,
కరగని బండలాంటిదది!!
అన్ని పార్శ్వాలను
అనుభవించి ఆస్వాదించే మనసుకు
అట్టిపెట్టుకున్న మనిషితోనే-
అనంతలోకాలలో
కలసిపోయిన రోజే
శాశ్వత వీడ్కోలు-
గజిబిజి జీవితానికి
అదే తుదిమజిలీ!!
సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.