Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుప్పిట్లో తెలుగు సాహిత్యం – ఒక పాఠకుడి అభిప్రాయం

(సాహిత్య అకాడమీ అవార్డుల గురించి క్రితం వారం శరచ్చంద్రిక వ్యాసానికి స్పందనగా ఒక పాఠకుడు రాసిన మెయిల్ ఇది. ఈ అభిప్రాయాన్ని కామెంట్ గా కన్నా ప్రత్యేక వ్యాసంగా అందిస్తే అందరికీ అందుతుందన్న ఉద్దేశంతో ఈ కామెంట్‍ను వ్యాసంగా అందిస్తున్నాము.సం.)

నా పేరు కృష్ణచైతన్య. నేను రచయితను కాదు. తెలుగు సాహిత్యాన్ని అతి దగ్గరగా చూస్తున్నవాడిని. సాహిత్య అకాడమీ అవార్డుల గురించి జరుగుతున్న చర్చలో నా అభిప్రాయాన్ని, నేను గమనించిన విషయాలను మరో కోణంలో చెప్పదలచుకున్నాను. ఏవైనా పొరపాట్లుంటే క్షమించాలి.

Conflict of Interest అని ఒక పదం ఉంది. Conflict of Interest అంటే ‘a situation in which a person is in a position to derive personal benefit from actions or decisions made in their official capacity’. నిర్ణయాత్మక స్థానంలో ఉన్న వ్యక్తి, తనకు కానీ, తన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కానీ లాభకరమైన నిర్ణయాన్ని తీసుకోవటం, ‘స్వలాభం కోసం’ అధికార దుర్వినియోగం చేయటాన్ని Conflict of Interest అనవచ్చు. ఈ లాభం ధన రూపంలోనే కానవసరం లేదు. పరపతి పెరగటం,  తన భావజాలానికి ప్రాచుర్యం కల్పించటం, తన చుట్టూ తిరిగేవారికి లబ్ధి కలుగుతుందన్న నమ్మకం కలిగించటం కూడా  Conflict of Interest  క్రిందకే వస్తుంది.

సాహిత్యానికి  కూడా Conflict of Interest వర్తిస్తుంది. ఒక పత్రిక కథల పోటీ పెట్టిందనుకుందాం. ఆ కథల పోటీని పత్రిక తరఫున నిర్వహించే వ్యక్తికీ, పోటీలో విజేతలను ఎన్నుకునే న్యాయనిర్ణేతకు, మొదటి బహుమతికి ఎన్నుకున్న కథా రచయితకు సన్నిహిత సంబంధాలుంటే, అది Conflict of Interest క్రిందకు వస్తుంది. ( ఒక ప్రధాన పత్రిక విషయంలో ఇది నిజంగా జరిగింది కూడా)

అలాగే, సంవత్సరం సంవత్సరం ఒక ఉత్తమ కథల సంకలనం ప్రచురిస్తున్నారని అనుకుందాం. దాని ప్రచురణకు  దేశంలోనో, విదేశంలోనో వున్న ఒక  సంస్థ ఆర్థిక సహాయం చేస్తున్నదనుకుందాం. ఇంకొందరు ప్రతి సంవత్సరం కథల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అనుకుందాం.  ఆ కథల  సంపాదకులు  ఈ శిక్షణ శిబిరం నిర్వహించే వారికీ  సన్నిహితులనుకుందాం.  కథల సంకలనాల సంపాదకులే  సాహిత్య అకాడమీ  సభ్యులు కూడా అనుకుందాం. ఇలాంటి పరిస్థితిలో ఉత్తమ కథల ప్రచురణకు ఆర్థిక సహాయం అందించే సంస్థ నిర్వహించే నవలల పోటీలో బహుమతి పొందిన నవలకు సాహిత్య అకాడమీ అవార్డు రావటం Conflict of Interest అవుతుంది. ఎందుకంటే నవలల పోటీ నిర్వహించే సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి [ఈ వ్యక్తి సంపాదకత్వం వహించే కథల సంకలనం ప్రచురణకు ఆ సంస్థ ఆర్థిక సహాయం చేయటం] అకాడమీ అవార్డు సభ్యుల కమిటీలో ఉండటం, ఆ కథల సంకలనాలకు ఆర్ధిక సహాయం అందించే సంస్థ ఉత్తమ రచనగా ఎంచుకున్న రచనలకే సాహిత్య అకాడెమీ  అవార్డులు రావటం Conflict of Interest ఆలోచనకు తావిస్తుంది. కథల సంకలనాలు చేసే సంపాదకులలో ఒకరు సాహిత్య అకాడెమీ  సభ్యులయి, ఇంకొక సంపాదకుడికి సాహిత్య అకాడెమీ అవార్డు రావటం కూడా  Conflict of Interest క్రిందకే వస్తుంది. ఆ అకాడెమీ సభ్యుడికి సన్నిహితంగా వుంటూ అతడు సమర్ధించే భావజాలాన్ని సమర్ధించే రచయితలకు అకాడెమీ సాహిత్య అవార్డు రావటం కూడా Conflict of Interest  అవుతుంది.  ఒకవేళ సభ్యులంతా ఒకే భావజాలాన్ని సమర్ధించేవారే అయితే అసలు అవార్డివ్వటమే  Conflict of Interest అవుతుంది.

ఇక కథల శిక్షణ కార్యక్రమం నిర్వహించే వ్యక్తులతో ఉత్తమ కథల సంకలనం ప్రచురించే సంపాదకుడికి సన్నిహిత సంబంధాలుండటం, ఆ కథల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కథకుల కథలు అధిక సంఖ్యలో ఉత్తమ కథలుగా పరిగణనకు రావటం కూడా Conflict of Interest అవుతుంది.   ఒక వ్యక్తి అటు తన పుస్తక ప్రచురణకు సహాయం చేసే సంస్థ ఎన్నుకున్న పుస్తకాలకు అకాడమీ అవార్డు ద్వారా ప్రామాణికతను కల్పించటం ద్వారా ఆ సంస్థకు unnecessary advantage ఇచ్చిన వాడవుతాడు. అకాడమీ అవార్డు రావటం వల్ల  సంస్థ ప్రతిష్ఠ పెరుగుతుంది. అవార్డు రావటం ద్వారా పుస్తకాల అమ్మకాలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో ఆ వ్యక్తికి కానీ, ఆ వ్యక్తికి పుస్తక ప్రచురణలో ఆర్ధిక సహాయం చేసే సంస్థకు కానీ, ఆ సంస్థ అవార్డులిచ్చిన పుస్తకాలను ప్రచురించే సంస్థతో సన్నిహిత సంబంధాలుంటే కూడా అది Conflict of Interest  క్రిందకే వస్తుంది.  ఏ వ్యక్తి అయితే ఇటు సంస్థతో సంబంధాలుండి, అటు సాహిత్య అకాడమీలో సభ్యుడిగా ఉన్నాడో  సాహిత్య ప్రపంచంలో అతని విలువ పెరుగుతుంది. అవార్డు కోసం ఆత్రపడే వారికి   అవార్డు ఇవ్వగల శక్తిమంతుడెవరో అందరికీ  స్పష్టంగా తెలుస్తుంది. ఇందువల్ల ఆ వ్యక్తికి undue advantage వస్తుంది. సాహిత్యంపై vice like grip వస్తుంది. సాహిత్యం దిశను నిర్దేశించగలుగుతాడు. ఆ వ్యక్తి ఎంత శక్తిమంతుడవుతాడంటే, అతని కనుసన్నులలో వుంటూ చెప్పింది చేసేవారు రచయితలుగా గుర్తింపు పొందుతారు. వారి రచనలు ప్రామాణికతను పొందుతాయి. వారికి అవార్డులొస్తాయి. కాబట్టి ఆ వ్యక్తి ఒక భావానికో, ఉద్యమానికో కార్యకర్త అయితే అలాంటి   రచయితలకే అవార్డులు, గుర్తింపు, అగ్రతాంబూలం లభించటం సర్వ సాధారణమవుతుంది. దాంతో గుర్తింపు కోసం, అవార్డు కోసం రచయితలు అతను చెప్పినట్టు చేసేందుకు సిద్ధమవుతారు. కానివారు రచయితలే కాకుండా పోతారు. అందుకని సాహిత్య ప్రపంచం అతని స్నేహం కోసం అర్రులు చాస్తుంది. ఇదీ  conflict of interest  అవుతుంది.

అదే వ్యక్తికి  కథల శిక్షణ నిర్వహించే వారితో సన్నిహిత సంబంధాలు ఉండి, ఆ శిక్షణలో పాల్గొన్న వారి కథలనే  అధికంగా  ఉత్తమ   కథలుగా ఎన్నుకోవటం వల్ల కూడా ఆ వ్యక్తి ప్రాబల్యం పెరుగుతుంది. సాహిత్య ప్రపంచంలో ఏ కథకుడికి పేరు రావాలో, ఏ కథకుడికి ప్రాచుర్యం లభించాలో అన్నది ఈ వ్యక్తి ప్రాపకం సంపాదించటంపై, ఆ శిక్షణ శిబిరంలో పాల్గొనటంపై ఆధారపడి ఉంటుందన్న message రచయితలకు వెళ్తుంది. ఇందువల్ల ఆ శిక్షణ శిబిరంలో పాల్గొనాలని తపన పడే వారి సంఖ్య పెరుగుతుంది. దీనికి తోడు ఆ శిక్షణ శిబిర నిర్వాహకులు అందరినీ కాక తమ మాట విని చెప్పినట్టు చేసే రచయితలకే ఆహ్వానాన్ని పరిమితం చేస్తే ఈ శిబిరాన్ని నిర్వహించే వారి ప్రాబల్యం కూడా పెరుగుతుంది.  దాన్లో పాల్గొని పేరు   తెచ్చేసుకోవాలని రచయితల తహ తహ అధికమై, నిర్వాహకులకు డిమాండ్ పెరుగుతుంది. ఆ కథల శిక్షణ శిబిరంలో పాల్గొనటం పేరు వచ్చేందుకు రహదారి అన్న అభిప్రాయం రచయితలకు కలుగుతుంది. శిబిర నిర్వాహకులు ఒక పవర్ సెంటర్‍లా ఎదుగుతారు. అటు ఆ శిక్షణ నిర్వాహకులతో సన్నిహిత సంబంధాలుండటం, ఇటు ఆ శిబిరంలో పాల్గొన్న వారి కథలు ఉత్తమ కథలుగా గుర్తింపు పొందటం, ఆ కథల ప్రచురణకు సహాయం చేసే సంస్థతో సన్నిహిత సంబంధాలుండడం, వీటికి తోడు సాహిత్య అకాడమీ సభ్యుడిగా ఉంటూ, అవార్డులను ప్రభావితం చేయగల స్థితిలో ఉండడం.. తాను మెచ్చి, తన మాట విని, తన భావజాలాన్ని సమర్థించే రచయితలకే  సాహిత్య  అకాడెమీ సమావేశాల్లో పాల్గొనేందుకు పిలుపు రావటం.. ఇది  ఒకటి కాదు, పలు Conflicts of Interests కు తావిస్తుంది. ఇవే కాకుండా తన భావజాలాన్ని సమర్ధించే ఒకటి రెండు పత్రికలలో ప్రచురితమయ్యే కథలను మాత్రమే ఆ వ్యక్తి ఉత్తమ  కథలుగా ఎంచుకోవటం వల్ల ఆయా పత్రికలకూ లాభం వుంటుంది. ఇలా పలు విభిన్నమయిన అంశాలను గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి సాహిత్య ప్రపంచాన్ని ఆడించగలుగుతాడు.  ఇది  వ్యక్తిని   తెలుగు సాహిత్యంలో అత్యంత శక్తిమంతుడిగా ,  రచయితల భవిష్యత్తులను నిర్దేశించే మినీ భగవంతుడి స్థాయికి ఎదిగిస్తుంది. దీనికి తోడు తన మాట విని, తమవారిని మాత్రమే పొగడి, తన భావాజాలాన్నే సమర్ధించే విమర్శకులను  ఎంచుకుని పలు అకాడెమీ  సమావేశాల్లో వారికి విరివిగా అవకాశాలు కల్పిస్తూ గుర్తింపు నిస్తే,  ఆ పెట్టుడు విమర్శకులు తాను ఎంపిక చేసిన రచయితలనే పనిగట్టుకుని పొగడుతూవుంటే,  తెలుగు సాహిత్యాన్ని ఆ వ్యక్తి భావజాలం సంపూర్ణంగా appropriate చేసే వీలు కలుగుతుంది. ఇప్పుడు పొగడ్తలందుకుంటున్న రచయితలు, అవార్డులందుకుంటూ, ఉత్తమ రచయితలుగా గుర్తింపు పొందుతూ, వేదికలెక్కి జ్ఞానాన్ని పంచే గుప్పెడుమంది రచయితలు, విమర్శకులను, వారి రచనలను పరిశీలిస్తే ఈ conflict of interest  ద్వారా appropriation of literature to a specific ideology and a  set of thoughts  తెలుగు సాహిత్యంలో స్పష్టంగా కనిపిస్తుంది.

2012 సంవత్సరంలో చైనా రచయిత ‘మో యాన్’కు నోబెల్ సాహిత్య పురస్కారం వచ్చింది. స్వీడిష్ అకాడమీ సభ్యుడయిన ‘గోరాన్ మామ్‍క్విస్ట్’ అనే అతను చైనా రచయితకు అవార్డు రావడం కోసం తీవ్రంగా కృషి చేశాడు. ఇతర మెంబర్లకు చైనా రచయిత రచనల  అనువాదాలను అందించి, అవార్డు చైనా రచయితకు వచ్చేట్టు చేశాడు. దీనికంతటికీ కారణం, ఆ చైనా రచయిత పుస్తకాలను ప్రచురించే సంస్థతో ‘గోరాన్’కు సన్నిహిత సంబంధాలుండటమే అని తేలింది. దాంతో పెద్ద దుమారం చెలరేగింది. అమ్మకాల వల్ల అతనికి లాభాలు అందుతాయనీ తెలిసింది. ‘గోరాన్’ ప్రవర్తన Conflict of Interest క్రిందకు వస్తుందని తేల్చారు. స్వీడిష్ అకాడమీ  తన పరువును కాపాడుకునేందుకు గోరాన్ ను  సమర్థించిందన్నది వేరే విషయం. కానీ తెలుగు సాహిత్యంలో ఒక వ్యక్తి ఇంత శక్తిమంతుడై కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు, కొన్ని భావజాలాలకే ప్రాచుర్యం కలిగే రీతిలో వ్యవహరిస్తున్నా, Conflict of Interest అన్న ఆలోచన రాకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తెలుగు సాహిత్య ప్రపంచంలో Conflict of Interest తద్వారా appropriation of literature to a specific ideology and a set of thoughts  పై దృష్టి ప్రసరింప చేయాలన్నది నా ఉద్దేశం. నా ఆలోచన పొరపాటయితే క్షంతవ్యుడను.

Exit mobile version