[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘గురుదేవోభవ’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
తల్లిగర్భము తనువునిచ్చె తండ్రి బాటను చూపె
ఆచార్యుని అరచేతి అంతరార్థము విప్పె
జీవితమొక జన్మతోనే పరిపూర్ణము కాదని
మలచిన మనసే మనిషికి మహిమను చేకూర్చె
సాందీపని మౌనమందు కృష్ణుని కౌశలమై
విశ్వామిత్ర తపస్సందు రాముని ధర్మమై
ద్రోణుని దృష్టిలో పార్థుని శరమై పదునై
గురుసన్నిధి తాకిన మేధ శిఖరమై ఎదిగె
అక్షరపు అంచున ఆలోచనకు రెక్కలొచ్చి
ప్రశ్నల పయనమున మేధకు పథమొచ్చి
శిష్యుని ఎదుగుదల గురుహృదయ పండుగై
తన జాడ మరుగునపెట్టి పరుల జయమై వెలిగె
నేలలో దాగిన వేరై నింగిని తాకిన కొమ్మై
నిశ్శబ్దమై నిలిచి నవయుగ స్వరమై
ఒక్క జీవిని తీర్చిదిద్ది వంద జీవితాలై
కాలపు కఠిన శిలపై కీర్తి చెక్కిన శిల్పియై
శిష్యశిరము వాలగానే శతభావ పుష్పార్చన
శిష్యవిజయం రాగానే గురుతపస్సు ఫలార్పణ
తరతరాల హృదయమందు చెరగని ఆచార్యచరణ
నీ మహిమకు శిరసొగ్గి శతకోటి వందనం
