[‘గురువులకే గురువు – సర్వేపల్లి రాధాకృష్ణన్’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబర్ 5వ తేదీన వీరాస్వామి సీతమ్మ దంపతులకు తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా నెల్లూరు, తిరుపతి, తిరుత్తణిలలోనే సాగింది. వీరాస్వామి కుటుంబము నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి గ్రామానికి చెందింది. ఆ తరువాత వీరాస్వామి గారు ఉద్యోగరీత్యా తమిళనాడుకు వలస వెళ్లడం జరిగింది.
చిన్నతనం నుంచి రాధాకృష్ణన్ అసాధారణమైన తెలివితేటలు కలవారు. 16 సంవత్సరముల వయస్సులోనే మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరి పట్టభద్రుడు అయినారు. అదే కళాశాల నుండి తన మాస్టర్స్ డిగ్రీని కూడా పూర్తి చేయటం జరిగింది. గణితం మీద ఆసక్తి ఉన్నప్పటికీ రాధాకృష్ణన్ తమ బంధువు ఇచ్చిన తత్వశాస్త్ర పుస్తకాలను చదివి దానిపై ఆసక్తి పెంపొందించుకున్నారు. ఆ తరువాత ఆయన ప్రధానంగా తత్త్వశాస్త్రాన్ని ఎంపిక చేసుకున్నారు. అందులోనే ఆయన మాస్టర్స్ డిగ్రీ సాధించడం జరిగింది.
21 ఏళ్ల వయస్సులోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. కళాశాలలో ఆయన పాఠం చెబుతుంటే పక్క క్లాసులలోని విద్యార్థులే కాక అధ్యాపకులు సైతం తరగతి గది బయట నిలబడి వినేవారుట. అది ఆయన గొప్పతనం. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూర్ విశ్వవిద్యాలయం ఆయనను ఆహ్వానించింది. తత్వశాస్త్రంలో ఆయన ఉపన్యాసాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులకి ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమర్చి చెప్పినవారు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్. అధ్యాపకుడిగా, వైస్ ఛాన్స్‌లర్‌గా, దౌత్యవేత్తగా, యు.జి.సి. ఛైర్మన్‌గా, యునెస్కో అధ్యక్షుడుగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన అధిష్టించని పదవి లేదు. ఆయన సేవలు నిరుపమానము, అనితరసాధ్యము. ఆయన అధిరోహించిన శిఖరాలు లెక్కలేనన్ని. దాదాపు వంద విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌తో ఆయనను గౌరవించాయి.
డాక్టర్ జి. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తా వచ్చి విశ్వవిద్యాలయ ఆచార్య పదవిని చేపట్టమని కోరారు. ఆ తరువాత ఆయన కలకత్తా వెళ్ళటం జరిగింది. కలకత్తా వెళ్ళిన తర్వాత ఆయన కీర్తి దశదిశలా వ్యాపించడం ప్రారంభించింది.
1931లో ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా, బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు.
సనాతన భారతీయ సాంప్రదాయంలో గురువు యొక్క ప్రాధాన్యత గణనీయమైనది. గురువు ముఖతః నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్థాన్ని పరమార్ధాన్ని చేకూరుస్తుందని భారతీయుల నమ్మకం. గురుశిష్య సంబంధాన్ని యుగయుగాల నుంచి నిలుపుతున్నది. హిందూదేశం పురాణ, ఇతిహాసాలలో సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదేనని చెప్తారు. గురువుకు దైవత్వాన్ని ఆపాదించారు.
మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
అని తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని గురువుకు కల్పించారు.
పూర్వకాలంలో గురువులను వెతుక్కుంటూ శిష్యులువెళ్ళి ఆయనను ప్రసన్నం చేసుకొని సమస్త విద్యలను నేర్చుకునేవారు. గురువు మాటే వారికి వేదవాక్కుగా ఉండేది. చిన్నతనంనుండి రాధాకృష్ణన్ చురుకుగా ఉండేవారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి ఇంటి నుండి తాను చదువుకునే ఊరికి పరీక్ష రుసుము చెల్లించడానికి బయలుదేరారు. రసుము చెల్లించటానికి అదే చివరి రోజు. అలా వస్తున్న రాధాకృష్ణన్‌ను ఒక దొంగ అడ్డగించి, దాడి చేసి ఆయన చెవిపోగులు లాక్కున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆయనని చంపి వేస్తానని బెదిరించాడు. దానితో భయపడిన సర్వేపల్లి రాధాకష్ణన్ పరీక్ష ఫీజు విషయం మర్చిపోయి పాఠశాలకు కూడా వెళ్లలేకపోయినారు. ఫీజు చెల్లించని విద్యార్థి ఎవరైనా ఉన్నారా? అని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించగా అందులో రాధాకృష్ణన్ పేరు చూసిన ఆయన బాగా చదువుకునే విద్యార్థి రాకపోవడం ఏమిటి? ఫీజు కట్టక పోవడమేమిటని ఆయనే ఫీజు చెల్లించడం జరిగింది. అలా ఆనాడు తన ఫీజు చెల్లించి, తన అభివృధ్ధికి మూలమైన ఆ ఉపాధ్యాయుడు అంటే గౌరవమే కాకుండా ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలో అనేది రాధాకృష్ణన్ ఈ సంఘటన ద్వారా తెలుసుకున్నారు. ఆ సంఘటన రాధాకృష్ణన్ జీవితంలో మర్చిపోలేదు. ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన ఘనత ఆయనది.
గురువు ఒక వ్యక్తిని ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్తారో ఆచరించి చూపిన మహా పురుషుడు రాధాకృష్ణన్. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ‘భారతరత్న’ అందుకున్నారు. 1962లో ఆయన భారత రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన మిత్రులు, కొందరు విద్యార్థులు సెప్టెంబర్ 5న ఆయన జన్మదినాన్ని జరుపుకోవడానికి రాధాకృష్ణన్ అనుమతి కోరారు. అపుడు ఆయన తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా పరమ పవిత్రంగా చేయాలని కోరుకున్నారంటే ఆయనకు అధ్యాపక వృత్తిపైగల గౌరవం ద్యోతకం. ఆయన కోరిక మేరకు నాటినుంచి సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ఒక ఆనవాయితీగా మారింది. అదీ రాధాకృష్ణన్ గొప్పతనం. రాష్ట్రపతిగా మొదటిసారి బ్రిటన్ వెళ్ళగా రాణీగారే స్వయంగా వచ్చి స్వాగతించారు. ఏ పదవికైనా, ఏ పురస్కారానికైనా ఆయనే అర్హులని బ్రిటన్ రాణి ప్రశంసలనందిన విద్యావేత్త రాధాకృష్ణన్. అదీ విద్య యొక్క గొప్పతనం. విద్యావంతునికున్న గౌరవం. “నీ గురించి పదిమంది చెప్పుకోవాలంటే వందమంది గొప్పవాళ్ళ చరిత్రలు చదువు. అపుడే నీగురించి పదిమంది చెప్పుకుంటారు. జ్ఞానాన్ని మించినదేది లేదు” అన్నది వారి ఉవాచ.
“గుకారో అంధకారస్య
రుకారోస్తన్నిరోధకృత్
అంధకారస్యవినాశిత్వ
సాక్షాత్ గురురిత్యభిధీయతే”
అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు అని అర్థం. అందుకే భారతీయ వ్యవస్థలో గురువుకు అంత గొప్ప స్థానాన్ని కల్పించింది. ఆయన కలకత్తాలో అధ్యాపకుడిగా పనిచేసే సమయంలో తరగతిగదిలో ఒక్కరు ఉన్నా వందమంది ఉన్నా ఆయన పాఠం చెప్పే తీరులో ఏ విధమైన మార్పు ఉండేది కాదు. ఒకసారి ఆయన కళాశాలలో పనిచేస్తున్న సమయంలో ఆయన తరగతి గదిలోకి వెళితే గదిలో ఒక్క విద్యార్థి కూడా రాలేదు. అయినప్పటికీ ఆయన తన బోధనా సమయం ముగిసేదాకా తరగతి గదిలోనే గడిపే ఆ తర్వాత బయటికి రావటం జరిగింది. అది వృత్తిపట్ల ఆయనకుగల నిబధ్ధత, అంకితభావం.
అధ్యాపకుడంటే ఎలా ఉండాలో రాధాకృష్ణన్ వస్త్రధారణ, నడవడిక మనకు నేర్పుతున్నది. ఆయన కలకత్తాలోని కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న రోజులు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. ఆ సమయంలో కళాశాలలోని శిష్యులందరూ ఆయనెక్కిన గుర్రపు బగ్గీకిగల గుర్రాలను తొలగించి ఆ బగ్గీని వారే స్వయంగా లాగుకొని స్టేషన్ వరకు తీసుకొని వెళ్లారు. అది వారిపట్ల శిష్యులకుగల అభిమానము, గౌరవము. ఎప్పుడైనా గురువు శిష్యుని యొక్క అభిమానాన్ని సంపాదించుకోవాలి. అంతకు మించిన సంపద, ఆనందం వేరులేదు.
గురువు క్రమశిక్షణ, అంకిత భావంతో శిష్యులకు శిక్షణ ఇచ్చిన ఎడల కొన్ని తరాలు ఉన్నతస్థితికి చేరుకుంటాయి. అదే విధంగా సక్రమమైనటువంటి గురువు గనక మనకు లభించకపోయేటట్లయితే కొన్ని తరాలు నశించిపోవటం జరుగుతుంది. అది గురువు యొక్క ప్రాధాన్యత. దేశ భవిష్యత్తుకు పునాది గురువు. భావి పౌరులను తీర్చదిద్దగల గురుతర బాధ్యత, శక్తి ఒక్క ఉపాధ్యాయునికే ఉన్నది. దేశంలో అత్యుత్తమ ఆలోచన కలిగిన వారు ఉపాధ్యాయులు అని రాధాకృష్ణన్ గారి నమ్మకం. వారిపట్ల అంత గొప్ప గౌరవభావం.
ధవళవస్త్రధారియై, తెలుగువారి పంచకట్టుతో, తలపాగాతో, చురుకైన కళ్ళతో, పరిశీలనా దృక్పథంతో, చిరుదరహాసవదనంతో, ప్రశాంతమనస్కుడై, అపరిమిత జ్ఞానసంపదను స్వంతం చేసుకున్న పుంభావసరస్వతీ రూపమైన వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులను సత్కరించుకోవటమంటే సాక్షాత్తు సరస్వతీ సమర్చనం చేయడమే.
స్వగృహే పూజ్యతే మూర్ఖః
స్వగ్రామే పూజ్యతే ప్రభుః!
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే!!
విద్యావంతులయినవారు ఏ కాలానికైనా ఎప్పుడైనా పూజనీయులనటానికి రాధాకృష్ణన్ జీవితమే ప్రత్యక్ష నిదర్శనం.
