[లక్ష్మీశర్మ త్రిగుళ్ళ గారు రచించిన ‘గువ్వా గోరింకా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“ఏయ్ ఆశా, ఈ రోజు భలే సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? ఉదయం నుండి చూస్తున్నాను, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏదో ఆలోచిస్తున్నావు, పైగా ఆఫీసు నుండి గంట ముందుగానే వెళ్ళిపోతున్నావంటే నీ ప్రియుడు శుభవార్త చెప్తానన్నాడా? నాకు చెప్పకుండానే వెళుతున్నావు,” భుజానికి బ్యాగు వేసుకొని బయలుదేరబోతున్న ఆశాను ఆపి అడిగింది విజయా.
“అబ్బే అదేం లేదు. నేను మామూలుగానే ఉన్నాను. ఈ రోజు చింటూ పుట్టినరోజు కదా! కాస్త ముందుగానే రమ్మని చెప్పింది ఆంటీ, తనకు సహాయంగా ఉండాలట. అందుకని వెళుతున్నాను,” తడబడుతూ చెప్పింది. చింటూ ఆశా ఇంటి ఓనరు అబ్బాయి.
“ఆహా అవునా ఎందుకే అబద్ధాలు చెబుతావు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? మనిద్దరి స్నేహం ఈనాటిదా చెప్పు? నీ మనసు నాకు తెలియదనుకున్నావా? చింటూ పుట్టినరోజుకు నాకు పిలుపు వచ్చింది. కానీ అది రాత్రి ఎనిమిది గంటలకు సంతోష్ హోటల్లో చేస్తున్నారు. నన్ను మభ్యపెట్టడానికి చూస్తున్నావా ఆశా,” ముఖం చిన్నబుచ్చుకొని అడిగింది విజయా.
“విజయా, నిన్ను కూడా పిలిచారా నాకు చెప్పనేలేదు నువ్వు. ఆంటీతో నువ్వు ఎక్కువగా మాట్లాడవు కదా, నీకు చెప్పలేదేమో అనుకున్నా. విజయా, నీ దగ్గర దాచినా దాగదని తెలుసు, నాకు నువ్వు కాకపోతే ఎవరున్నారు చెప్పు? ఈ రోజు రాహుల్ నేను ఒకరికొకరం మనసులోని మాట చెప్పుకోవాలి అనుకున్నాము. ముందే నీతో చెబితే రాహుల్ ఏం చెబుతాడో తెలియదు అందుకని ఎలా చెప్పాలి అని సందేహించాను,” విజయ చేతులు పట్టుకొని చెప్పింది ఆశా.
“ఆశా.. నీకు ఎందుకు అలా అనిపించింది? రాహుల్ మీద నమ్మకం లేదా? మీరిద్దరెన్నాళ్లుగానో ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు కదా,” అనుమానంగా చూస్తూ అడిగింది విజయా.
“రాహుల్‌కు వరస అయ్యే మరదలుందట. ఆమెకు రాహుల్ అంటే ఇష్టమట, వాళ్ళ మామయ్య ఏమంటాడోనని భయంగా ఉంది. రాహుల్‌ని ఎలాంటి ఇబ్బంది పెడతారో అర్థం కావడం లేదు, ఒకవైపు ఆనందంగా ఉంది రాహుల్ తన కోసం వస్తున్నాడు తన మనసులో మాట చెప్పడానికి , ఒకవేళ రాకపోతే ఏం చేయాలన్న బాధ రాహుల్ రాకపోతే నా పరిస్థితి ఏంటి అన్నది తెలియడం లేదు విజయా.”
“పిచ్చి ఆశా.. ఎందుకే అలా చెడుగా ఆలోచిస్తావు. రాహుల్‌కి నువ్వంటే ఎంతిష్టమో నీకు తెలియదా? నిన్ను కాదని ఆ అమ్మాయిని ఎలా ఒప్పుకుంటాడనుకున్నావు, ప్రేమంటే బొమ్మలాట కాదే మనసులు ఇచ్చిపుచ్చుకోవడం. అది మీరు ఎప్పుడో ఇచ్చుకున్నారు. ఇక మిమ్మల్ని ఎవరు కూడా విడదియ్యలేరు. పిచ్చి అనుమానాలు వదిలి సంతోషంగా వెళ్ళు శుభవార్తతో తిరిగిరా,” స్నేహితురాలిని గట్టిగా కౌగిలించుకొని చెప్పింది విజయ.
“విజయా, నీ నోటి పుణ్యాన నువ్వన్నది జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరే. శుభవార్తతో కలుస్తాను,” మనసు దూదిపింజంలా పరుగులు తీస్తుంటే స్నేహితురాలు దగ్గర నుండి పరిగెత్తినట్టే వెళ్లిపోయింది.
బిర్లా టెంపుల్ మెట్ల మీద ఓ మూలకు కూర్చొని రాహుల్ కోసం ఎదురు చూడసాగింది. వచ్చి గంట సేపు అవుతున్న రాహుల్ జాడలేదు. చూసి చూసి కళ్ళునొప్పి పుడుతున్నాయి. ఇక్కడికే కదా వస్తానన్నాడు నేను తప్పుగా చూడలేదు కదా అనుకుని పదేపదే రాహుల్ ఇచ్చిన ఉత్తరాన్ని చూడసాగింది. అవును ఇదే అడ్రస్ మరి ఎందుకు రావడంలేదు. అంటే వాళ్ళ మామయ్య కూతురు రానివ్వడం లేదేమో. ‘ఏమో నా మనసు కీడును శంకిస్తుంది. నేను అనుకున్నట్టుగా జరుగుతుందో లేదో. రాహుల్ ఇంకా ఎందుకు రావడం లేదు. నీ మీద పంచ ప్రాణాలు నిలుపుకున్నాను రాహుల్, త్వరగా రావు. స్వామి నన్ను రాహుల్‌ను ఒకటి చెయ్యి తండ్రీ. మా పెళ్లి అయ్యాక రాహుల్ నేను నీ కొండకు నడిచి వస్తాము. నామీద దయ చూపు స్వామి’ అనుకుంటూ, ఆందోళన పడుతూ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంది. గుడికి వచ్చిన భక్తులందరూ వెళుతున్నారు. చీకటి పడుతుంది. రాహుల్ జాడ మాత్రం లేదు. అయిపోయింది ఇక తన రాహుల్ రాడు, గుండెను పిండేసిన బాధ తట్టుకోలేక కళ్ళ నీళ్లు ఆగలేనట్టు వర్షిస్తున్నాయి,
“ఆశా.. ఎంతసేపు కూర్చుంటావు లే. చీకటి అయిపోయింది కదా. పద వెళ్దాం బర్త్ డే టయం కూడా అయిపోయింది,” ఆశ పక్కనే కూర్చుంటూ చెప్పింది విజయా.
“విజయా.. చూశావా నేను అన్నానా? రాహుల్ నన్ను మోసం చేశాడు, నాతో ప్రేమ అంటూనే నాటకం ఆడాడు. ఇక నా రాహుల్ నాకు దొరకడు. ఇప్పుడు ఏం చేయాలి,” విజయ భుజం మీద తలవాల్చి బోరుమంది ఆశా.
“ఆశా అటు చూడు. అందరూ నీవైపే చూస్తున్నారు, ఊరుకో. మనం వెళుతూ మాట్లాడుకుందాము పద, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించేసుకోకు. రాహుల్‌కు నువ్వంటే అంటే చాలా ఇష్టం, నిన్ను ఎందుకు దూరం చేసుకుంటాడు? ఇవాళ ఏవో ఇబ్బందివల్ల రాలేదేమో, రేపైనా వస్తాడు కదా. అప్పుడే ఇంత నిరాశ అయితే ఎలా? ఎదురుచూపులోనే ఉంటుంది ఆనందం. లే, లే, బర్త్ డే టైం అయిపోతుంది. నేను రాకపోయినా పర్వాలేదు నువ్వు రాకపోతే మీ ఆంటీ ఊరుకోదు,” బలవంతంగా లేపి కిందకు తీసుకొచ్చి ఆటో మాట్లాడి కూర్చున్నారు
“విజయా.. రాహుల్ రేపు వస్తాడంటావా, నాకు నమ్మకం కలగడం లేదు. నన్ను మోసం చేయడు కదా,” విజయ ముఖంలో ముఖం పెట్టి ఆత్రుతగా అడిగింది ఆశా.
“అబ్బా ఏమిటిది ఆశా.. అనుకున్న సమయానికి రాకపోతే ఇంతగా బాధపడితే ఎలా? రాహుల్ రాక ఎక్కడికి వెళ్తాడు? ఇవాళ కాకపోతే రేపు, ఎల్లుండి అయినా వస్తాడు. నువ్వు కాస్త ముఖానికి పౌడర్ అద్దుకుని జుట్టు దువ్వుకో. ఆంటీ చూసిందంటే ఇట్టే పసిగట్టేస్తుంది,” ఆశాను ఓదారుస్తూ తన బ్యాగులో నుండి దువ్వెనా పౌడర్ తీసిచ్చింది.
విజయ మాటలకు కొంత ఊరట కలిగించిన మనసులో మాత్రం నమ్మకం కలగడం లేదు. “విజయా నువ్వు ఎలా వచ్చావు? నేను ఇక్కడ ఉంటానని నీకు ఎలా తెలుసు?,” ఆశ్చర్యంతో అడిగింది ఆశా.
“ఏమో నిన్ను చూస్తుంటే నాకు కంగారుగా అనిపించింది. ఒకవేళ నువ్వు అన్నట్టుగా రాహుల్ రాకపోతే నువ్వు ఏం చేస్తావో అని నాకు భయమేసింది, అందుకే నీ వెనకాలే నేను ఆటోలో వచ్చాను. అదిగో ఆ చెట్టు కింద కూర్చొని నిన్నే గమనిస్తున్నాను, ఇక నువ్వు కదిలేటట్టు లేవని నేనే నీ ముందుకు వచ్చాను,” నవ్వుతూ అంది.
“నిజంగా నీలాంటి స్నేహితురాలు నాకు ఉన్నందుకు చాలా అదృష్టవంతురాలిని. నా అనే వాళ్ళు లేని నాకు ఒక తోబుట్టువులా నన్ను చూసుకుంటున్నావు, విజయా నన్ను ఎప్పుడు విడిచి పెట్టవు కదూ,” విజయ రెండు చేతులు పట్టుకొని అడిగింది.
“ఆశా.. ఏమిటి నీ పిచ్చి మాటలు నాకు మాత్రం ఎవరున్నారు ఇద్దరము అనాథలమే, ఎప్పుడు కలిసామో ఎలా కలిసామో కాని ఒకరికి ఒకరం ఆత్మీయులమై పోయాము, నువ్వు ఎక్కడున్నా నేనెక్కడున్నా మన బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుంది,” ఆశా చేతులను ముద్దాడుతూ చెప్పింది.
ఏదైతే జరగకూడదు అని కోరుకున్నాదో అదే జరిగింది ఆశాకు. రాహుల్ కోసం రోజు ఎదురుచూడడం అతను రాకపోవడంలో నిరాశకు గురి అయింది. రాహుల్ జాడలేదు. ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి వెళదామంటే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో భయపడిపోతుంది. ఆశ బాధ చూడలేక రాహుల్ స్నేహితుడైన శేఖర్ దగ్గరకు వెళ్లింది విజయ.
“ఏయ్ విజయా, చాలా రోజులకు కనిపించావు! ఆశా ఎక్కడ? మీరిద్దరూ జంట పక్షులు కదా తను రాలేదే,” విజయను చూడగానే అన్నాడు శేఖర్.
“శేఖర్.. నేను నీతో మాట్లాడాలి. అలా నడుచుకుంటూ వెళదాం వస్తావా,” అడిగింది.
“నాకు తెలుసు విజయా నువ్వేం అడగడానికి వచ్చావో. రాహుల్ కోసం కదూ. నువ్వు వచ్చింది. రాహుల్ ఇప్పుడు ఇక్కడ లేడు, ఇప్పట్లో రాడు కూడా,” చెప్పటం ఆపి విజయ వైపు చూసాడు.
“రాహుల్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు? ఏమైంది రాహుల్‌కి,” కంగారుపడుతూ అడిగింది.
“విజయా.. రాహుల్ ఎవరికీ చెప్పవద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. కానీ, ఆశాను తలుచుకుంటే బాధగా అనిపిస్తుంది. తనకు రాహూల్ కనిపించకపోతే పిచ్చిదైపోతుందేమోనని బాధగా ఉంది, ఆశా ప్రాణాలన్ని రాహుల్ మీదనే కదా. అతను కనిపించకపోతే తను ఎలా ఉంటుందో నేనర్థం చేసుకోగలను, ఎప్పటికైనా తనకు తెలియాలి విజయా. నువ్వు ఆశాను ఎలా ఓదారుస్తావో నాకు తెలియదు, నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. రాహుల్..” చెప్పలేక తలకిందకుదించుకున్నాడు.
“శేఖర్.. ఏమైంది చెప్పు రాహుల్ బాగానే ఉన్నాడు కదా,” ఆదుర్దాగా అడిగింది.
“రాహుల్ ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు, కాకపోతే తనకొక కిడ్నీపాడైపోయిందట, ఇంకో కిడ్నీ కూడా అదే పద్ధతిలో ఉందని డాక్టర్లు చెప్పారట. మధ్య మధ్యలో జ్వరం వస్తుంటే డాక్టరు దగ్గరకు వెళితే అన్ని టెస్టులు చేసి చెప్పారట. ఈ విషయం ఆశాకు చెప్పాలని గత నెలరోజులుగా అనుకున్నాడు. కానీ, ఆశాకు ఆ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. తన కళ్ళముందే ఆశా బాధపడుతుంటే చూడలేననుకుని ఏ రోజుకా రోజు దాటవేస్తూ వస్తున్నాడు, ఆశా మనసులో మాట చెప్పడానికి వెనకాడుతుందట. ఎందుకంటే మొదటగా రాహుల్ నోటి నుండి వినాలని కోరికనట. ఆశా బలవంతం మీద పది రోజుల కిందట చెప్పాడానికి ఒప్పుకున్నాడట, పాపం ఆశా రాహుల్ నుండి తను కోరుకున్నది జరుగుతుందని ఆశపడింది, రాహుల్ ఆశా ఎదురుపడి చెప్పలేక మొహం చాటేసాడు. తనను ఒక మోసగాడి కింద జమ కడుతుంది అయినా పరవాలేదు కానీ తన పరిస్థితి తెలిస్తే ఆశా ఏదైనా ఆఘాయిత్యం చేసుకుంటుందేమోనని భయంతో దూరంగా వెళ్ళిపోయాడు. బతికి ఉన్నన్నాళ్ళు ఎక్కడో అక్కడ ఆశా జ్ఞాపకాలతో బతుకుతానని అన్నాడు. ఈ విషయం ఎవ్వరికి చెప్పవద్దన్నాడు కానీ నా మనసు ఉండబట్టలేక నీకు చెప్పాను. నువ్వే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం,” చెప్పాడు.
“శేఖర్ నువ్వు చెప్పింది వింటుంటే నాకే ఇంత బాధగా ఉందంటే ఆశాకు తెలిస్తే తట్టుకుంటుందా? రాహుల్ అంటే ప్రాణం కన్నా ఎక్కువ తనకు. అలాంటిది రాహుల్‌కు ఇలా జరిగిందంటే ఎలా భరిస్తుంది, తనకు ఎలా చెప్పాలో నాకు కూడా అర్థంకావడం లేదు.”
“అందుకే రాహుల్ తనకు చెప్పొద్దన్నది. తనకో మరదలున్నదని చెప్పాడట, ఇప్పుడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడని చెప్పమన్నాడు. కొన్నాళ్ళు బాధపడుతుంది, రాహుల్ తనను మోసం చేసాడని తననో మోసగాడినని తిట్టుకుంటుంది, కాలం ఎంతటి గాయాన్నైనా మానుపుతుందన్నట్టు మెల్లిగా తనే మారుతుంది, ఎవరినైనా పెళ్ళిచేసుకొని తను సుఖంగా ఉండడమే తన కోరిక అని చెప్పాడు రాహుల్,” విజయ మొహంలోకి చూస్తూ చెప్పాడు శేఖర్.
“రాహుల్ తప్పుగా ఆలోచించాడు ఆశా గురించి. అతని కోసం జీవితమంతా వేచి ఉంటుందేగానీ తన జీవితంలోకి ఇంకొకరిని ఆహ్వానించలేదు ఆశా. అంత బలమైన ప్రేమ పెట్టుకుంది రాహుల్ మీద. శేఖర్ చూసావా రాహుల్ తన ప్రాణాలమీదకు వస్తున్నా తన ప్రేయసి సంతోషం కోరుకుంటున్నాడు, పైగా తనను తాను మోసగాడిగా ముద్రవేసుకుంటున్నాడంటే వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో అర్థం కావడలేదు! పోనీ ఒక పని చేస్తే, రాహుల్ గురించి ఆశాకు చెబుదాము. అర్థం చేసుకుని రాహుల్‌ను చూసుకుంటుందేమో. తనకు ఆ తృప్తి అయినా మిగులుతుంది కదా,” అడిగింది విజయ.
“మీరు చెప్పింది బాగానే ఉంది. రాహుల్ ఎక్కడో ఒంటరిగా ఉంటూ ఆరోగ్యం బాగాలేకా చూసేవాళ్ళు లేక బాధపడుతున్నాడు. ఇక్కడ ఆశా అతని కోసం బాధపడుతూ ఉండే బదులు ఇద్దరు ఒక దగ్గరుండి కష్టమైనా సుఖమైనా పంచుకోవడం మంచిదనిపిస్తుంది.”
“ఇంతకు రాహుల్ ఎక్కడున్నాడో తెలుసా నీకు? నువ్వు వెళ్ళి రాహుల్‌ను ఎలాగైనా ఒప్పించి తీసుకవస్తావా?, ఈలోపు నేను ఆశాకు ధైర్యం చెప్పి తనను ఒప్పిస్తాను.” ఆరాటంగా అడిగింది విజయ.
“సరే అయితే వచ్చే ఆదివారం వెళ్ళి ఎలాగైనా రాహుల్‌ను తీసుకవస్తాను, ఎలాగైనా వాళ్ళను కలపడం మన బాధ్యత. తరువాత వాళ్ళ జీవితాలను ఆ విధి నిర్ణయిస్తుంది,” నవ్వుతూ చెప్పాడు శేఖర్.
“అంతే శేఖర్. మనం చెయ్యవలసింది మనం చేద్దాం. సరే మరి నేను వెళతాను,” అంటూ వెళ్లింది విజయ.
‘విజయా అందరి ప్రేమలను సరి చెయ్యాలని చూస్తున్నావు మరి నా ప్రేమను మాత్రం నువ్వర్ధం చేసుకోలేకపోతున్నావు. నువ్వంటే నాకెంతిష్టమో నీకు తెలియదు విజయా. తొందరలోనే నా మనసును నీ ఎదుట పరుస్తాను’ అనుకున్నాడు శేఖర్ విజయ వెళ్ళినవైపే చూస్తూ .
“ఆశా.. ఏమిటి అలా వణికిపోతున్నావు ఏమైంది నేను వెళ్ళెటప్పుడు బాగానే ఉన్నావు కదా, అయ్యో ఒళ్ళు కాలిపోతుందే. డాక్టర్ దగ్గరకు వెళ్దాం పద. లే, లే, ఆశా,” ఇంటికి వస్తూనే ఆశాను చూసి కంగారుపడుతూ ఆశాను లేపి కూర్చోబెట్టింది.
“అబ్బా విజయా నా వల్ల కావడం లేదు నేను లేవలేను,” ఓపికలేక మళ్ళీ పడుకుండిపోయింది ఆశా.
“అయ్యో అలా అంటే ఎలాగా ఎలా కాలుతుందో చూడు నీ ఒళ్ళు, ఉండు నేనే వెళ్ళి డాక్టరును ఇంటికి తీసుకవస్తాను,” పక్కింటి వనజకు చెప్పి గబగబా వెళ్ళింది.
“ఏమ్మా నీ నాలిక చూపు. ఎప్పటినుండి వస్తుంది జ్వరం, తల తిరుగుడు అలా ఏమన్నా ఉందా? వాంతులు గానీ బయటకు వెళ్ళడకానీ అవుతున్నాయా,” ఆశాను పరీక్ష చేస్తూ అడిగాడు డాక్టర్ మాధవరావు.
“అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, మాత్ర వేసుకుంటాను తగ్గిపోతుంది, ఇప్పుడు రావడం రావడమే వణుకుతోపాటు వాంతులు అవుతున్నాయి తల తిరుగుతుంది డాక్టర్,” మాటలు కూడదీసుకుంటూ చెప్పింది కళ్ళు మగతగా మూసుకుంటూ.
“చూడమ్మా.. ఈ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేసి కొన్ని పరీక్షలు చెయ్యాలి, అంతవరకు ఈ మాత్రలు వెయ్యండి లేటు చెయ్యవద్దు,” డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు.
తడిబట్టతో ఒళ్ళు తుడుస్తూ బలవంతంగా ఆశాతో మాత్ర మింగించి హాస్పిటల్‌కు తీసుకెళ్లి అడ్మిట్ చేసింది విజయ.
వారం రోజులు మూసిన కన్ను తెరవకుండా ఉన్న ఆశాకు అన్ని పరీక్షలు చేసారు చివరకు డాక్టర్లు చెప్పింది కాలేయం సరిగా పని చెయ్యడం లేదు, దానికి ఇన్ ఫెక్షన్ వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతానికి ఇప్పుడే ఏమి చెప్పలేము అని. అది విన్న విజయకు పై ప్రాణాలు పైనే పోయినంతపని అయింది.
దరిద్రుడికి వడగండ్ల వానా అన్నట్టు అటు రాహుల్ పరిస్థితి బాగా లేదు ఇక్కడ ఆశా ఇలా.
ఇదేమిటి ప్రేమలోనే కాదు రోగాలలో కూడా పోటీ పడుతున్నారా వీళ్ళు. ఆశా మీ పరిస్థితి ఒకరి గురించి ఒకరు చెప్పుకునే స్థితిలో లేరు, చెప్పినా తట్టుకునేందుకు మీ మనసులు దృఢంగా లేవే నేనేలా భరించుకోను ఈ విషయం. కళ్ళనుండి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ ఆశాను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకవచ్చింది.
“విజయా.. నాకేమైందే డాక్టరు నీతో ఏదో రహస్యంగా చెబుతున్నాడు,” నీరసించిన మొహంతో ఉన్న విజయను అడిగింది ఆశా మనసులో ఏదో కీడును శంకిస్తూ.
“అబ్బే ఏం లేదు ఆశా.. నువ్వు మానసికంగా దేని గురించైనా బాధపడుతున్నావా అని అడిగాడు అంతే,” కంగారుపడుతూ చెప్పింది మొహాన నవ్వు పులుముకుంటూ.
“రాహుల్ వచ్చి నన్ను చూసాడా? ఏమిటో నాకు ఒంటిమీద స్పృహా లేకుండా ఉండిపోయాను. రాహుల్‌ను చూసి ఎన్నాళ్ళయిందో? ఏమన్నాడు రాహుల్ మళ్ళీ వస్తా అన్నాడా?” అడిగింది విచ్చుకున్న మందారంలా మొహం పెడుతూ.
“ఆశా.. ఇప్పుడవన్నీ ఎందుకు నువ్వు ప్రశాంతంగా ఈ మాత్రలు మింగి విశ్రాంతి తీసుకో, డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా? కొన్నాళ్ళు నువ్వు దేని గురించి ఆలోచించకుండా ఉంటేనే నీ ఆరోగ్యం బాగుపడుతుందట,” మాత్రలు ఇస్తూ అనునయంగా చెప్పింది.
“విజయా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదూ! రాహుల్ రాలేదు కదా? నాకు తెలుసు రాహుల్ ఆ రోజునుండి కనిపించడం లేదంటే నాకర్థమైపోయింది తన మరదలిని పెళ్ళి చేసుకుని మొహం చాటేసాడు, నన్ను మోసం చేసాడు. అందుకే నువ్వు నన్ను మభ్యపెట్టడానికి చూస్తున్నావు కదా,” కోపంగా విజయ వైపు చూస్తూ అడిగింది.
“ఆశా.. అదేం కాదు రాహుల్ ఎవర్ని పెళ్ళి చేసుకోలేదు. తను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, నీ ఆరోగ్యం బాగయ్యేవరకు నువ్వు అనవసరంగా ఆలోచించొద్దని అలా చెప్పాను, రాహుల్ ఎక్కడున్నా నీకోసం వస్తాడు. తొందరపడకు ఆశా. ముందు నువ్వు పూర్తిగా కోలుకో. తరువాత రాహుల్ గురించి ఆలోచించు,” ప్రేమగా తల నిమురుతూ చెప్పింది విజయ.
“లేదు విజయా నాకు నమ్మకం లేదు. రాహుల్ నన్ను విడిచి ఇరవైరోజులయింది, ఇన్ని రోజులు నన్ను కలువకుండా ఉన్నాడంటే ఏదో జరిగింది. నీకు నిజం తెలిస్తే చెప్పు విజయా. స్నేహితురాలిని మోసం చెయ్యకు ఫ్లీజ్ ,” విజయ చేతులుపట్టుకుని బతిమాలింది.
“ఛా ఛా నువ్వు నన్నర్ధం చేసుకున్నది ఇంతేనా ఆశా, నీ కోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధం. రాహుల్ ఎక్కడున్నా వెతికి తీసుకరమ్మని శేఖరుకు చెప్పాను, బహుశా ఈ రోజు లేదా రేపటికల్లా నీ రాహుల్ నీ ముందుంటాడు చూడు,” ఆశాను నమ్మిస్తూ చెప్పింది.
“విజయా.. నువ్వు చెప్పేది నిజమా! రాహుల్ వస్తున్నాడా! అబ్బా ఎంత మంచి మాట చెప్పావే, నిన్ను అనవసరంగా బాధపెట్టాను నన్ను క్షమించు,” అంటూ గబుక్కున లేచి విజయను గట్టిగా కౌగిలించుకుంది ఆశా.
ఆశా మీ ప్రేమకు ఎంత బలమున్నదో మీకే తెలియాలి ఇద్దరు పోటిపడుతున్నారు ఆరోగ్య విషయంలో. మీ ఇద్దరి గుండె చప్పుడు మీరు వింటున్నారో లేదో తెలియదు. గువ్వను విడిచి గోరింక ఉండదు గోరింక లేకుండా గువ్వకు మనుగడ లేదు. మీరు ఎంతకాలం సంతోషంగా ఉంటారో కానీ ఉన్నన్నాళ్ళు గువ్వా గోరింకల్లా కలిసే ఉండేలా మిమ్మల్ని కలుపుతాను. మీరు ఒకరికి తెలియనివ్వకుండా ఒకరు ఆరోగ్యం విషయం దాస్తారని తెలుస్తుంది. ఎందుకంటే గువ్వను బాధపెట్టడం ఇష్టంలేకనే కదా గోరింక దూరంగా ఉంది.
రేపు గువ్వ కూడా అంతే తను ఎంతో కాలం జీవించనని తెలిస్తే గోరింక ఏమైపోతుందోనన్న సంధిగ్ధంతో. తను నవ్వుతూ గోరింకను తృప్తిపరుస్తుంది. మీకంత బాగానే ఉంటుంది మీ మధ్య నలిగిపోయేది నేనే కదా. తప్పదు ఆశా కోసం నేను ఆ మాత్రం చెయ్యకపోతే మా స్నేహానికి విలువలేదు మనసులో గట్టి నిర్ణయం చేసుకుంది.
“ఏయ్ విజయా ఏంటీ మౌనంగా ఉండిపోయావు, నాకు ఇంత సంతోష వార్త చెప్పి నువ్వు అలా ఉన్నావేంటి,” విజయను తనవైపు తిప్పుకుంటూ అడిగింది.
కళ్ళనీళ్ళు కనబడకుండా తుడుచుకుని “అబ్బే అదేం లేదు ఆశా.. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నాకది చాలు, చాలా భయమేసింది తెలుసా నిన్ను అలా చూస్తుంటే. అది తలుచుకుని బాధపడుతున్నాను అంతే,” ఆశా నుదుట ముద్దుపెడుతూ చెప్పింది విజయ.
“అమ్మయ్యా అంతే కదా. నేను చాలా మొండి ఘటాన్ని విజయా. నాకేం కాదు నిండా నూరేళ్ళు జీవిస్తానని నా చెయ్యి చూసిన జోతీష్యుడు చెప్పాడులే, నీకా బెంగక్కరలేదు,” విజయకు కితకితలుపెడుతూ నవ్వుతూ చెప్పింది.
‘అవున్లే అదే భ్రమలో ఉండు ఆశా. నీలో ఈ సంతోషం చూడాలన్నదే నాకోరిక’ అనుకుంది తనలోతానే. “మరింకేం నీ గోరింకతో రివ్వున ఎగురుతూ కాలం గడుపు ఆశా,” అంది.
టింగ్ టింగ్ కాలింగ్ బెల్ మోగుతుంటే పరుగున వెళ్ళి తలుపుతీసింది ఆశా. ఎదురుగా నిలబడిన రాహుల్‌ను చూసి పారవశ్యంతో అమాంతంగా కౌగిలించుకుంది. ఆశాను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు రాహుల్.
“ఊహు ఊహు,” చిన్నగా శబ్దం చేసాడు వెనకనున్న శేఖర్. ఒకరినొకరు మైమరిచిపోయిన ఆ జంట శేఖర్ చేసిన శబ్దానికి సిగ్గుతో వదిలి దూరంగా నిలుచున్నారు.
“బయటే ఉన్నారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంటి ముందుకు వచ్చిన మనిషి ఇంట్లోకి రాడేంటి, అబ్బా మీ విరహవేదన మా అందరికి తెలియాలనేనా ఇదంతా,” నవ్వుతూ రాహుల్ భుజం తట్టాడు శేఖర్.
“పోరా నీకేం తెలుసు మా బాధ నువ్వు ప్రేమిస్తే తెలిసేది ప్రేమలో మాధుర్యం,” ఆశా చేతిని చేతిలోకి తీసుకుంటూ అన్నాడు రాహుల్.
“అవును నీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉన్నదో నాకు తెలుసు, అందుకే తనను విడిచి దూరంగా వెళ్ళిపోయావు, నాకు ప్రేమ గురించి తెలియక కాదురా రాహుల్ నేను ప్రేమిస్తున్న మనిషి నా ప్రేమను గుర్తించడం లేదు ఏం చేస్తాం, చూద్దాం ఎన్ని రోజులు ఎదిరిచూసేలా చేస్తుందో మీ ప్రేమలాంటిదే మా ప్రేమ కూడా కావాలని కోరుకుంటున్నాను,” క్రీగంట విజయ వైపు చూస్తూ చెప్పాడు. సరిగ్గా అప్పుడే శేఖర్ వైపు చూస్తున్న విజయ కళ్ళు శేఖర్ కళ్ళతో కలుసుకున్నాయి. నీ ప్రేమకు నేను అర్హురాలనా శేఖర్ అన్నట్టుగా అడిగాయి విజయ కళ్ళు. నీ ప్రేమ కోసమే నేను వేచి ఉన్నాను విజయ చెప్పాయి శేఖర్ కళ్ళు. అర్ధం చేసుకున్న విజయ సిగ్గుతో తలకిందకు దించుకుంది.
“ఆశా ఏమిటి ఇంతలా చిక్కకపోయావు ఇదంతా నా మీద బెంగతోనేనా, నేను చాలా తప్పుచేసాను ఆ రోజు నీ దగ్గరకు వస్తానని చెప్పి రాలేకపోయాను, అందుకే కదా నువ్విలా తయారయ్యావు నాకు అర్జంటుగా ఒకపని మీద ఆఫీసు వాళ్ళు దూరంగా పంపించారు నీకు చెప్పే సమయం లేక చెప్పలేకపోయాను నన్ను క్షమించు ఆశా,” రెండుచేతులలో వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చిన్న అబద్దం చెప్పాడు రాహుల్.
“రాహుల్ నన్నంటున్నావు కానీ నువ్వు చూడు ఎలా అయిపోయావో లంకణాలు చేసినవాడిలా కళ్ళు లోపలకు పీక్కుపోయి ఎంత నీరసంగా ఉన్నావు చూడు,” ఆర్తిగా రాహుల్ తల గుండెలకదుముకుంటూ అంది.
ఆశా ఈ మాత్రం దానికే నువ్వింతలా బాధపడుతున్నావు నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు అది తెలిస్తే నువ్వింకెంతబాధపడతావో నేను ఊహించగలను. ఉన్నన్నీ రోజులు నిన్ను సంతోషపెడుతూ నీ చేతిలో తృప్తిగా వెళ్ళిపోతాను ఆశా మనసులో అనుకుంటూ గాఢంగా కౌగిలిలోకి తీసుకున్నాడు రాహుల్.
వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలి బయటకు వచ్చారు శేఖర్ విజయా.
“శేఖర్.. వీళ్ళిద్దరికి వీలైనంత తొందరలో పెళ్ళి చేద్దాం ఏమంటావు,” అడిగింది.
“విజయా.. నువ్వేం మాట్లాడుతున్నావో నీకర్థమౌతుందా? రాహుల్ పరిస్థితి తెలిసి కూడా వాళ్ళకు పెళ్ళంటున్నావు, రేపు రాహుల్‌కు జరగరానిది జరిగితే ఆశా నూరేళ్ళ జీవితం ఏమౌతుందో ఆలోచించావా,” ఆశ్చర్యంతో అడిగాడు శేఖర్.
“శేఖర్ నేను అన్నీ ఆలోచించాను గనుకనే వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామన్నది, నీకు ఆశా గురించి తెలియదు కదూ! ఈ మధ్యలో ఆశాకు ఆరోగ్యం బాగుండడం లేదు. రోగి కోరింది వైద్యుడు చెప్పింది ఒకటే అన్నట్టు ఆశా కూడా ఆనారోగ్యంతో ఇబ్బందిపడుతుంది,” అంటూ హాస్పిటల్ జరిగింది మొత్తం చెప్పింది శేఖర్‌తో.
“విజయా నువ్వు చెప్పేది నిజమా! అయితే మనం రాహుల్‌ను తీసుకవచ్చి మంచిపని చేసామన్నమాట, మరింకేం ఆ జంటను ఒకటి చేసి వదిలేద్దాం, వాళ్ళ జీవితం వాళ్ళు అనుభవిస్తారు, ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు. ప్రేమలోనే కాదు చావులో ఒకటే అవుతారేమో చూద్దాం. ఆశాకు ఈ విషయం తెలియదు కదా,”
“లేదు శేఖర్, తనకేం తెలియదు. రాహుల్‌కి కూడా ఆశా సంగతి తెలియదు, అందుకే వాళ్ళ ప్రేమకు ప్రాణం పోద్దామంటున్నా విషయం తెలిసేవరకు వాళ్ళు సంతోషంగా గడుపుతారు,” అంది.
“విజయా.. మరి మన సంగతి ఏం చేస్తావు నేనంటే నీకిష్టం లేదా? నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, వాళ్ళ పెళ్ళితోపాటు మన పెళ్ళి కూడా జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం ఏమంటావు,” విజయ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు .
“శేఖర్ నిన్ను కాదనటానికి నాకే అభ్యంతరంలేదు కాకపోతే మీ వాళ్ళు నాలాంటి అనాథను ఒప్పుకుంటారా? పెద్దవాళ్లను ఇబ్బందిపెట్టి మనం సుఖపడగలమా, నాకు నీలాంటి సహృదయుడు భర్తగా రావడమంటే నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యంగా భావిస్తానే తప్పా కాలదన్నుకునే దురదృష్టవంతురాలను కాదు శేఖర్,” అతని హృదయం మీద వాలుతూ చెప్పింది.
“విజయా నువ్వు చెప్పేది నిజం కదూ! ఇన్నాళ్ళు ఈ విషయం మనసులో దాచుకున్నావా, అబ్బా ఎంత మంచిమాట చెప్పావు, మావాళ్ళు నా ఇష్టానికే వదిలేసారు. వాళ్ళెప్పుడు నన్ను ఇబ్బందిపెట్టరు, నీ మెడలో మూడు ముళ్ళు వేసి అమ్మా ఇదిగో నీ కోడలంటే, ఎంత అందంగా ఉందిరా చిదిమి దీపం పెట్టుకునేట్టు అంటుంది తెలుసా, అయితే ఈ వారంలోనే మనకు రాహుల్ వాళ్ళకు రిజిష్టరు మ్యారేజ్ జరుగుతుందన్నమాట,” పొంగుకువస్తున్న ఆనందంతో విజయను గట్టిగా గుండెలకదుముకున్నాడు శేఖర్.
అనుకున్నట్టుగానే రెండు జంటలు ఒకటయ్యాయి. విజయా శేఖర్ కమ్మటి కలలకు స్వాగతం పలికారు. రాహుల్ ఆశాను హృదయంలోకి ఆహ్వానించాడు. రేపటి తన భవిష్యత్ గురించి మరిచిపోయి ముందడగు వేసాడు. గువ్వా గోరింకల్లా ఎగురూతూ ఎక్కడో సుదూరతీరాలకు ప్రయాణమయ్యారు ఆశా రాహుల్.
