‘సంస్కృతి’ పత్రిక వార్షికోత్సవానికి వచ్చినప్పుడు విశాఖలో మొదటిసారి కలిసాం. స్నేహశీలి, అందరి నుండి ఏదైనా తెలుసుకోవాలనే అబిలాష కలవారు. రాయగడలో రారసం (రాయగడ రచయితల సంఘం) నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. మండలి బుద్ధ ప్రసాద్, గొల్లపూడి వంటి మొదలైన ప్రముఖులను పిలచి రారసంలో ప్రసంగాలు ఇప్పించేవారు. ఒడిస్సా ప్రజలు సంస్కృతికి నిదర్శనమయిన ‘చైతి’ అనే సాంస్కృతిక పండగకు పిలచినప్పుడు రాయగడ వెళ్ళాను. మరో రెండు రారసం వార్షికోత్సవాలకు ఆహ్వానించారు. ఇలా ఆనందరావుగారితో సాన్నిహిత్యం పెరిగింది. గురజాడ జయంతికి నేను విజయనగరం పిలిచాను, వచ్చారు. అప్పుడు శ్రీ మండలి బుద్ద ప్రసాద్‌గారితో పరిచయం చేసాను. ఆ తరువాత విజయవాడ ‘పుస్తక ఉత్సవాల’కి ఆహ్వానం మేరకి ఇద్దరం వెళ్ళాం. అక్కడ జి. వి. పూర్ణచంద్రగారిని కలిసాం. అప్పుడు ‘ఆనందరావు కథలు’ పేరుతో పుస్తకం ప్రచురించి నా సహకారం కోరారు. శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావుగారి వద్ద పుస్తకాలు ప్రింట్ చేయించడంలో సహకరించాను. విజయనగరం వచ్చినపుడు మా యింటిలో రెండు రోజులు ఉన్నారు. ‘గ్రీన్ హంట్’ అనే ఓ నవల పబ్లిష్ చేయాలని అంటుండేవారు. నేను విజయనగరంలో డిటిపి చేయించి సిడి కూడా ఇచ్చాను. కానీ పబ్లిష్ చేయ్యలేదు.
ఇలా ఆనందరావు పట్నాయక్ కథలను నిశితంగా పరిశీలించినపుడు… ఆయన హాస్యచతురత, నిరసన, సమాజంలోని మూఢత్వం, మానవ సంబందాలు మనకి విశదమవుతాయి.
రాష్ట్రేతర తెలుగు సంఘంలో కూడా ఆయన చురుకుగా ఉన్నారు. భువనేశ్వర్‌లో జరిగిన సభలో సాంస్కృతిక ప్రతినిధిగా పలు సూచనలు చేశారు. అక్కడ రేడియో కార్యక్రమాల్లోనూ, టీ.వీ. కార్యక్రమాల్లోనూ పలు పత్రికల్లోనూ వారి రచనలను చూడొచ్చు. అనేక జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి సభల్లో పాల్గొన్నారు. మంచి హాస్య చతురులు. వారి కుమారుడు భువనేశ్వర్‌లో పాత్రికేయులు. వారి కుమార్తె హైదరాబాద్‌లో నివాసం. రాయగడలో భార్యతో విశ్రాంత జీవితాన్ని గడుపుతూ వుండేవారు. వారి మృతికి సాహితీ లోకంలో విషాదం నిండింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.