Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హద్దులో ఉంటేనే హాయి.. అతి చేస్తే అపాయమోయి

[మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు హద్దులు దాటకుండా చూసుకున్నప్పుడే సమాజంలో మనకు విలువ ఉంటుందని. అతిని విడనాడి, మితాన్ని పాటించాలని సూచించే కవితని అందిస్తున్నారు శ్రీ కరణం నారాయణ స్వామి పిళ్లై.]

కడుపుబ్బ తిండి తినకోయి,
ముప్పావు కడుపు నిండగానే ఆపవోయి,
అలాచేస్తే జీర్ణక్రియ బాగుంటుందోయి,
మితిమీరితే అజీర్తి, అనారోగ్యమవుతుందోయి,
హద్దులో ఉంటేనే హాయి-అతి చేస్తే అపాయమోయి.

స్పష్టంగా, పొదుపుగా మాట్లాడవోయి,
అలాచేస్తే మన వ్యక్తిత్వం పెరుగుతుందోయి,
అనవసరమైన ప్రసంగాలు తగ్గించవోయి,
మితిమీరితే గౌరవం, మర్యాద పోతుందోయి,
హద్దులో ఉంటేనే హాయి-అతి చేస్తే అపాయమోయి.

సంపాదనలో కొంత భాగం వెనకేయవోయి,
అవసరాలకు తగ్గట్టు ఖర్చు చేయవోయి,
అది ఆర్థిక భద్రతను ఇస్తుందోయి,
మితిమీరితే అప్పులపాలవుతామోయి,
హద్దులో ఉంటేనే హాయి-అతి చేస్తే అపాయమోయి.

ప్రయాణంలో అతి వేగం వద్దోయి,
అది అత్యంత ప్రాణాంతకమోయి,
అందరికీ తెలిసిన నిదానమే ప్రధానమోయి,
మితిమీరితే ప్రమాదాలు తప్పవోయి,
హద్దులో ఉంటేనే హాయి-అతి చేస్తే అపాయమోయి.

పిల్లలపై గారాబం చూపకోయి,
అలా చేస్తే వారు మొండివారవుతారోయి,
బాధ్యతారహితంగా మారుతారోయి,
మితిమీరితే అప్రయోజకులవుతారోయి,
హద్దులో ఉంటేనే హాయి-అతి చేస్తే అపాయమోయి.

స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా అతిగా వాడకోయి,
మానసిక ఒత్తిడి ఎక్కువవుతుందోయి,
ఏకాగ్రత లోపం పెరుగుతుందోయి,
మితిమీరితే నిద్రకరువై, సోమరులవుతామోయి,
హద్దులో ఉంటేనే హాయి-అతి చేస్తే అపాయమోయి.

ఇంటినిండా సామాన్లు వద్దోయి,
క్రిక్కిరిసి అది గజిబిజి చేస్తుందోయి,
కావాల్సినంతే ఉంచుకోవాలోయి,
మితి మీరితే ప్రశాంతతే కరువౌతుందోయి,
హద్దులో ఉంటేనే హాయి-అతి చేస్తే అపాయమోయి.

నీరు పోస్తే మొక్క త్వరగా పెరుగుతుందోయి,
కానీ రోజంతా గంటకోసారి నీరు పోయరాదోయి,
అలాచేస్తే వేర్లు క్రుళ్లిపోతాయోయి,
మితిమీరిన నీరు చెట్టుకే ప్రమాదమోయి,
హద్దులో ఉంటేనే హాయి-అతి చేస్తే అపాయమోయి.

విశ్రాంతి లేని పని చేయకోయి,
శరీరం అలసి జబ్బుపాలవుతుందోయి,
విశ్రాంతి మాత్రమే తీసుకుంటే ఇల్లు గడవదోయి,
మితిమీరితే సమతుల్యం కాదోయి,
హద్దులో ఉంటేనే హాయి-అతి చేస్తే అపాయమోయి.

జీవితం ఒక త్రాసు లాంటిదోయి,
ఒకవైపు పనులు, కోరికలోయి,
మరోవైపు మితం, హితం ఉండాలోయి,
మితిమీరితే తిప్పలు తప్పవోయి,
హద్దులో ఉంటేనే హాయి-అతి చేస్తే అపాయమోయి.

Exit mobile version