Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హమారా హైదరాబాద్

[శ్రీ తోకల రాజేశం రచించిన ‘హమారా హైదరాబాద్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

హైదరాబాద్! హైదరాబాద్!!
ఈ పేరు వింటే చాలు నరాల్లో అనిర్వచనీయమైన
కొత్త ఉత్సాహం పొంగుతుంది
చిన్నప్పుడు కచ్చురం బండిమీద అమ్మమ్మ ఇంటికి వెళ్తుంటే
మనస్సు గాలిపటమై ఎగిరినట్టు
హైదరాబాద్‌కి వెళ్తుంటే
కొత్త నీటికి ఎదురెక్కే చేప పిల్లలాంటి ఆనందం

ఇక్కడి నేలలోనో గాలిలోనో నీటిలోనో
మా తాత ముత్తాతల పాదముద్రల పరిమళాలున్నాయేమో
నగరంలో అడుగు పెట్టగానే
నిలువెల్లా పూసిన పూలచెట్టునవుతాను

బుద్ధుని ముందు నిలబిడితే
చెవిలో శాంతిమంత్రం ఊదుతాడు
తెలుగు తేజోమూర్తులు మన రక్తంలో కరిగి
దిశను చూపి ముందుకు పొమ్మంటారు

ఎన్ని సంస్కృతులు? ఎన్ని భాషలు?
సముద్రంలో నదులన్నీ చేరి స్నేహపరిష్వంగం చేసుకున్నట్టు
నగరంనిండా దేశ దేశాల ప్రజలు

చల్లని నీడనిచ్చి పండ్లతో ఆకలితీర్చే
చెట్టులాంటి తల్లి హైదరాబాద్

తవ్వినకొద్దీ తియ్యగా ఊరుతున్న చెలిమ దీని చరిత్ర
ఎంత మంది రాజులను కడుపులో దాచుకుందో
ఎన్ని కట్టడాలను గుండెపై నిలుపుకుందో
ఎన్ని ఉద్యమాలకు ఓనమాలు దిద్దించిందో
నాలుగు దిక్కులనిండా కీర్తి తోరణాలు
అల్లుకున్న చార్మినార్ నా హైదరాబాద్!

ఇది నీదో నాదో మాత్రమే కాదు
కడుపులోని ఆకలి పేగులను మీటుతూ వచ్చిన
ఎవరినైనా పిడికెడు అన్నంముద్దతో దీవించే
మనందరి భాగ్యనగరం.

Exit mobile version