Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హన్యమానే శరీరే

[డా. గోపాలకృష్ణ కొవ్వలి రచించిన ‘హన్యమానే శరీరే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

గోదావరి వాసన మర్చిపోలేదు

బస్సు దిగిన వెంటనే గోదారి గాలి చెంపలని ముద్దాడింది. తడిసిన మట్టి, వరి చేలు, కొబ్బరి పూత కలిసిన గోదావరి వాసన గత స్మృతులని తీసుకువచ్చింది. హైదరాబాద్‌లో ముప్పై సంవత్సరాలు ఉన్నాడు. పట్నం వాసనలు అలవాటయ్యాయి – పెట్రోల్, సిమెంట్, AC గాలి.

రాఘవరావు నెమ్మదిగా అడుగు వేశాడు. Hip fracture తర్వాత నడక మారింది

జాగ్రత్తగా, ఒక్కో అడుగూ చూసుకుంటూ—-

ఆ అడుగుల శబ్దంలో మార్పు తనకే తెలుస్తోంది

తాతయ్య ఇలాగే నడిచేవారు.

ఉదయం ఏడు గంటలు, గోవిందాపురం పాత వీధి, రాఘవరావుకి పదేళ్ళు ఉంటాయి.

వంగిన వీపుతో, ఒక్కో అడుగూ నేల మీద నిలబెట్టుకుంటూ నడుస్తున్నారు తాతయ్య . వెనక రాఘవరావు ఆ నడకను అనుకరిస్తున్నాడు.

వంగిన వీపుతో, నెమ్మదైన అడుగులతో.

స్నేహితులు నవ్వారు. రాఘవరావు మరింత ముందుకు వంగాడు. తాతయ్య తిరిగి చూశారు. కళ్ళు రాఘవరావు మీద పడ్డాయి – కోపం కాదు, అరుపు కాదు, కేవలం ఒక చూపు.

అది ఒక్క క్షణమే ఉంది. తర్వాత తాతయ్య మళ్ళీ తిరిగి నెమ్మదిగా నడిచారు. నవ్వులు ఆగలేదు. రాఘవరావు మళ్ళీ అనుకరించాడు.

ఆ జ్ఞాపకం వదలకముందే రాఘవరావు ఒక చెట్టు నీడలో ఆగాడు.

సూట్‌కేస్ కింద పెట్టాడు. తన అడుగులు చూసుకున్నాడు-

జాగ్రత్తగా, నెమ్మదిగా, నేల మీద నిలబెట్టుకుంటూ.

తను పుట్టిపెరిగిన ఇంటి వీధిలోకి తిరిగాడు.

తమ్ముడు గేటు దగ్గరే నిలబడి ఉన్నాడు, ఎదురు చూస్తూ.

ఆప్యాయంగా పలకరించి, లోపలికి తీసుకెళ్ళాడు. మాటలు తక్కువగా నడిచాయి.

ఒకరి ఉనికిని మరొకరు ఆస్వాదిస్తూ నిశ్శబ్దంగా ఉన్నారు, అంతే.

రాఘవరావు ఇల్లంతా కలయదిరిగి చూసి వచ్చి ముందు గదిలో కూర్చున్నాడు.

అది తాతయ్య రోజంతా గడిపే గది. ముక్కుపొడెం వాసన వస్తోంది! అది భ్రమే అని తెలుసు, తాతయ్య పోయి దాదాపు ముప్పై-నలభై ఏళ్ళు అవుతోంది.

కిటికీ తెరిచాడు. గోదావరి గాలి లోపలికి వచ్చింది. పక్కింటి గేటు కనిపించింది.

అదొక కొత్త అనుభూతిలా అనిపించింది, పట్నంలో కిటికీ తీస్తే పక్క అపార్టెమెంట్ వాళ్ళ కిటికీ, పైకెగసే భవనాలు చూడడానికి అలవాటుపడ్డ ప్రాణానికి.

ఆ గేటు చూడగానే నాయనమ్మ గుర్తొచ్చింది.

వేసవి మధ్యాహ్నం. ఆమె ఆ గేటు దగ్గర కూర్చుని గోరుచిక్కుళ్ళు తొక్కలు తీస్తోంది. వేళ్ళు నెమ్మదిగా కదులుతున్నాయి – చక్. చక్. చక్.

స్నేహితుడు ‘నాయనమ్మని పిలువు – వింటుందో లేదో చూడు’ అన్నాడు నవ్వుతూ.

రాఘవరావు ఆమె వెనక నిలబడి మెల్లగా పిలిచాడు. వినలేదు. మళ్ళీ పిలిచాడు. వినలేదు.

నవ్వుతూ అన్నాడు – ‘నాయనమ్మకి రెండు చెవులున్నాయి, ఒక్కటీ పని చేయదు!’

నాయనమ్మ తిరిగింది. అర్థమైంది. ఆమె కళ్ళలో ఏదో మెరిసింది. వేళ్ళు ఆగాయి – ఒక్క క్షణం.

తర్వాత మళ్ళీ గోరుచిక్కుళ్ళు తొక్కలు తీసింది.

చక్. చక్. చక్— ఆ వేళ్ళు ఆగిన క్షణం – అప్పుడు కనిపించలేదు.

ఇప్పుడు కనిపిస్తోంది.

రాఘవరావు కిటికీ మూశాడు. ఇప్పుడు ఆ గేటు దగ్గర వేరే కుటుంబం ఉంది. నాయనమ్మ లేదు. కానీ ఆ మధ్యాహ్నపు ఎండ – ఇంకా అలాగే కాస్తోంది.

***

మర్నాడు ఉదయం పాఠశాల పక్క వీధిలో నడిచాడు. భవనం అలాగే ఉంది–కొంచెం వంగింది, గోడలకు తేమ మరకలు, ఆకుపచ్చ నాచు అలుముకుని ఉన్నాయి. పునాది కదిలినట్టనిపిస్తోంది తన ఇంజనీర్ కళ్ళకి. చదువుల విషయంలోనూ అంతేనట తమ్ముడు చెప్పిన మాట గుర్తొచ్చింది. బడి ముందు తలుపులలో ఒకటి మాత్రమే ఉంది. లోపలకెళ్లాడు. నల్లబోర్డు కనిపించింది తాను చదువుకున్న గదిలో. ఇంకా అక్కడే ఉంది.

పిల్లలతో బోర్డు పైన రోజుకో సూక్తి రాయించే ఆనవాయితీ ఇంకా కొనసాగున్నట్టుంది.

‘జననీ జన్మ భూమిశ్చ – స్వర్గాదపి గరీయసి’ అని రాసి ఉంది! ఆశ్చర్యం కదా! తనకోసమే రాశారేమో అనిపించినా, ఆ ఊహతో ఉద్వేగానికి గురయ్యాడు రాఘవరావు.

అవును కదా – భాగ్యనగరంలో ఎన్ని వసతులూ, సౌఖ్యాలూ ఉన్నా, పుట్టిపెరిగిన నేల, నీరుకి సాటిరావు కదా.

ఊరు వచ్చి పూర్తిగా ఒకరోజుకూడా కాకపోయినా, తనలో ఏదో ఆనందం తిరిగి వచ్చినట్టు, యవ్వనం మరలివచ్చినట్టు అనిపిస్తూంటే ఆశ్చర్యంగా ఉంది. పరిసరాలు, ప్రకృతి మనిషిని ఇంతగా ప్రభావితం చేస్తాయా!!

ఆ బోర్డు చూడగానే కృష్ణమూర్తి మాస్టారు గుర్తొచ్చారు, చూస్తూ అలానే నిలుచుండి పోయాడు రాఘవరావు—

మధ్యాహ్నం రెండు గంటలు. బయట ఎండ తీవ్రంగా ఉంది. తరగతిలో ఒక fan నెమ్మదిగా తిరుగుతోంది– గాలి కంటే శబ్దమే ఎక్కువ ఆరాటపడుతోంది.

మాస్టారు నల్లబోర్డు దగ్గర నిలబడ్డారు.

చేతిలో సుద్ద.

ఒక శ్లోకం రాస్తున్నారు. చేయి వణుకుతోంది.

అక్షరాలు కంపిస్తున్నాయి.

ఒక్కో అక్షరం రాసే కొద్దీ సుద్ద పొడి నేల మీద రాలుతోంది.

మాస్టారు చేయి ఆగుతోంది –

మళ్ళీ ముందుకు వెళ్తోంది.

రాఘవ పక్కన కూర్చున్న పిల్లాడి చెవిలో చెప్పాడు- ‘మాస్టారు రాస్తూంటే భూకంపం వచ్చినట్టు ఉంది కదా!’

నవ్వులు వచ్చాయి.

మాస్టారు వెనక్కి తిరిగారు.

ఒక్క క్షణం నిశ్శబ్దం.

ఆ కళ్ళలో కోపం లేదు

శ్రమపడి రాసిన అక్షరాలు నవ్వులపాలయ్యేలా చేశాయని గ్రహించిన అనుభవం వ్యక్తపరచే నిశ్చలత్వం మాత్రమే ప్రస్ఫుటిస్తోంది.

మాస్టారు మళ్ళీ బోర్డు వైపు తిరిగారు.

రాశారు.

సుద్ద పొడి నేల మీద రాలింది.

ఆ జ్ఞాపకం నుండి బయటపడి రాఘవరావు తన చేయి చూసుకున్నాడు.

వణుకుతోంది

వయసు వల్ల, surgery తర్వాత వచ్చిన బలహీనత వల్ల.

సుద్ద పట్టుకుంటే అక్షరాలు కంపిస్తాయి. మాస్టారు చేయి వణికింది

–కాదు

తొంభై ఏళ్ళ జ్ఞానసంపద నిబిడీకృతమైన చేయి ఒక్కో అక్షరం శ్రద్ధగా రాయడానికి ప్రయత్నిస్తోంది.

ఆ వణుకు బలహీనతవల్ల కాదు. శరీరం సహకరించకపోయినా వృత్తిధర్మంతో చేసే ప్రయత్నం.

నేను నవ్వాను, హేళనాపూర్వకంగా, యవ్వనగర్వంతో!

ఆ మాటలు లోపలే అన్నాడు. బయటికి రాలేదు. కానీ గోదావరి వైపు నుండి వచ్చే గాలికి వినిపించినట్టే అనిపించింది.

పదహారేళ్ళకు రాఘవరావు గోవిందాపురం వదిలాడు. సివిల్ ఇంజనీరింగ్ చదివాక హైదరాబాద్‌లో ఒక construction company లో చేరాడు.

తన కళ్ళకి ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ ఏమి నిర్మించవచ్చో కనిపించేది. ఒక పాత భవనం కనిపిస్తే దాని బలహీనత ఏమిటో అర్ధమయ్యేది.

సంవత్సరాలు గడిచాయి.

హైదరాబాద్‌లో అనేక భవనాలు తన చేతుల మీదుగా నిర్మించబడ్డాయి. పాత నిర్మాణాలు రిపేర్ చేశాడు. పడిపోయే స్థితిలో ఉన్న భవనాలని నిలబెట్టాడు.

పగుళ్లు చూసి భవనాల స్థితి అంచనా వేసేవాడు.

సరోజినితో పెళ్ళి అయ్యింది. ఆమె అతనిలో అతనికే తెలియని మేధస్సుల లోతులు చూసేది.

కొడుకు శ్రీనివాస్, కూతురు మాధవి పుట్టారు. హైదరాబాద్‌లో ఒక మంచి అపార్ట్‌మెంట్, ఒక మంచి జీవితం.

గోవిందపురానికి అప్పుడప్పుడు వెళ్ళేవాడు. తాతయ్య సుబ్బయ్య పోయారు. నాయనమ్మ లక్ష్మమ్మ పోయింది. కృష్ణమూర్తి మాస్టారు పోయారు. ఆ వీధుల్లో నడిచినప్పుడు అప్పుడప్పుడు ఒక అలజడి కలిగేది – ఏదో మర్చిపోయాను అని. కానీ ఆ అలజడిని పక్కన పెట్టేవాడు.

***

అరవై ఏళ్ళు వచ్చాయి. ఉద్యోగవిరమణ చేశాడు. కొడుకు, కూతురు వేరే ప్రాంతాలలో స్థిరపడ్డారు. సరోజిని అనారోగ్యానికి గురైంది. రెండు సంవత్సరాల పోరాటం తర్వాత ఆమె వెళ్ళిపోయింది.

రాఘవరావు జీవితంలో మొదటిసారి నిజమైన ఒంటరితనం అనుభవించాడు. కానీ దాన్ని కూడా ఒక మౌలికమైన సవాలులాగా చూసుకున్నాడు- జీవితాన్ని పునర్మూల్యాంకనం చేసుకున్నాడు.

ఉదయం నడక, సాయంత్రం పాత మిత్రులతో కూర్చోవడం.

క్రియాశీలకంగా ఉన్నాడు.

బాగున్నాడు.

వార్ధక్యం వచ్చిందని తెలుసు. కానీ అది బయట నుండి వస్తోంది అని అనిపించేది.

లోపలికి ఇంకా రాలేదు అనే ధీమా.

ఏ నిర్మాణం అయినా హఠాత్తుగా కూలిపోదని అతని ఆలోచన, ఇంజనీర్‌గా.

ప్రమాద సూచికలు ఉంటాయి.

చిన్న చిన్న పగుళ్లు వస్తాయి, పునాది క్రుంగుతుంది. కానీ నా శరీరం ఇచ్చిన సంకేతాలు – మోకాళ్ళు మెల్లగా నొప్పి పెట్టడం, మెట్లు దిగేటప్పుడు కొంచెం ఆగడం, ఉదయం లేచినప్పుడు కొంచెం తడబడటం – ఇవన్నిటినీ గురించలేదు.

ఒక ఇంజనీర్ తన స్వంత శరీర నిర్మాణాన్ని అవగాహన చేసుకోలేకపోయాడు. రాబోయే మార్పులని గుర్తించలేకపోయాడు.

శరీరం కూడా ఒక భవనంలాంటిదే అయినా నిర్మించిన వారు?!!

అది ఒక సాధారణ మంగళవారం ఉదయం.

బాల్కనీలో కాఫీ వాసన. హైదరాబాద్ ఉదయపు శబ్దాలు – ఆటోలు, కూరగాయల అమ్మకపు బళ్ళవాళ్ళ అరుపులు, పొరుగింటి ఇల్లాలి బహిరంగ నసుగుడు.

రాఘవరావు కప్పు చేతిలో పట్టుకుని నిలబడ్డాడు. తాను బానే ఉన్నాడు అని అతనికి అనిపించింది- ప్రతిరోజూ అనిపిస్తుంది.

అప్పుడు కూడా అనిపించింది.

కాఫీ కప్పు పక్కన పెట్టాడు. లేచాడు.

బాత్రూమ్ కి వెళ్ళే ప్రయత్నంలో లోపలికి అడుగు వేశాడు.

అంతే-

వళ్ళు తూలింది –

అడుగు జారింది.

శరీరం పడిపోయింది

నేల చల్లగా తగిలింది

అది చివరి స్పష్టమైన అనుభవం

తర్వాత నొప్పి వచ్చింది- తుంటిలో, తీవ్రంగా, ఆగకుండా.

నేల మీద పడుకుని పైన fan చూస్తున్నాడు.

Fan తిరుగుతోంది – నెమ్మదిగా, ఆగకుండా.

అప్పుడు గుర్తొచ్చింది – చిన్నప్పుడు గోవిందాపురంలో పడిపోయినప్పుడు నేల వేరేగా ఉండేది

నెప్పెట్టినా ఓదార్చినట్టుగా అనిపించేది. ఎన్నిసార్లు పడలేదు, ఎన్నిసార్లు లేవలేదు!

అమ్మ పరిగెత్తుకుని వచ్చేది. తాతయ్య నెమ్మదిగా వచ్చి చేయి పట్టుకునేవారు. ‘ఏమీ పరవాలేదురా, ఏమీ కాలేదు’ అనేవారు నాన్న.

ఇప్పుడు నేల చల్లగా, గట్టిగా ఉంది. పైన fan తిరుగుతోంది. పరిగెత్తుకుని వచ్చేవారు ఎవరూ లేరు, ఓదార్చేవారూ లేరు.

Hip fracture. ఆసుపత్రిలో surgery. కూతురు మాధవి, కొడుకు శ్రీనివాస్ వచ్చారు. నెల రోజులు ఉన్నారు

తర్వాత వెళ్ళిపోయారు.

వాళ్ళ జీవితాలు, అవసరాలు వాళ్ళవి.

నేను మాత్రం అమ్మ, నాన్న, పెరిగిన పల్లెని వదిలి కూటికోసం, ఏదో సాధించాలనే తపనతో ఊరు విడిచి భాగ్యనగరం పోలేదా!!

పిల్లలు తిరిగి వెళ్లారు.

సాయంత్రం రాఘవరావు పడక కుర్చీలో కూర్చున్నాడు. కిటికీవైపు చూశాడు.

హైదరాబాద్ అలాగే ఉంది- బిజీగా, వేగంగా పరుగిడుతోంది.

సాయంత్రపు ట్రాఫిక్ హోరు వినిపిస్తోంది.

అపార్ట్‌మెంట్ లోపల నిశ్శబ్దం.

ఇది ప్రతీరోజు గమనించే పరిసరాల ఉనికి, రాఘవరావుకి.

రోజులు గడుస్తున్నాయి.

ఉదయం లేచాడంటే కిటికీ దగ్గర కూర్చోవడం.

సాయంత్రం అయిందంటే మళ్ళీ కిటికీ దగ్గర కూర్చోవడం.

మధ్యలో అయ్యర్ పంపించే భోజనం కోసం వేచిచూడడం – ఆకలి ఉన్నా, లేకున్నా !

హైదరాబాద్ జీవితం నడుస్తూనే ఉంది

పిల్లలు బడికి వెళ్తున్నారు, ఆఫీస్ వాళ్ళు పరిగెడుతున్నారు, కూరగాయల బండి వాడు అరుస్తున్నాడు. నగర నిత్యజీవన గతి ఇది.

ఆ నగర జీవన గమనంలో రాఘవరావుకి స్థానం లేదు

అతను చూస్తున్నాడు, అంతే.

కూతురు అప్పుడప్పుడు పుస్తకాలు, పత్రికలు పంపేది. రాఘవరావు తిరగేసేవాడు -చదవడానికి కాదు, కాలం గడపడానికి.

చేతులు పేజీలు తిప్పుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, మనసు మాత్రం ఎక్కడో ఉంది.

ఒక సాయంత్రం –

కిటికీ వెలుతురు తగ్గుతున్నప్పుడు ఒక పత్రిక తిరగేస్తున్నాడు.

కూరగాయల బండివాడు కింద అరుస్తున్నాడు-

గొంతు పరిచయమైంది, కానీ పేరు తెలియదు.

పేజీ తిప్పిన వేళ్ళు ఒక్క క్షణం ఆగాయి.

ఆ వేళ్ళు ఆగడం చూసి గుర్తొచ్చింది –

నాయనమ్మ వేళ్ళు అలా ఆగాయి – గోరుచిక్కుడు తొక్కలు తీస్తూ, నవ్వు విన్నాక!

చక్. చక్. చక్. ఆగడం.

తర్వాత మళ్ళీ చక్. చక్. చక్.

ఆ వేళ్ళు ఆగిన క్షణంలో ఏమి అనిపించిందో —-

ఇప్పుడు తెలుస్తోంది.

ఒక పేజీలో చిన్న వ్యాసం చదివాడు- ‘జీవితం అంటే ఏమిటి?’ అనే శీర్షికతో. అందులో ఒక వాక్యం కళ్ళకి అడ్డుపడింది.

“హేబెల్ హబాలీమ్” – ‘అన్నీ వ్యర్థం, అన్నీ వ్యర్థం’.

Ecclesiastes లో Solomon వృద్ధాప్యంలో రాసిన మాటలు.

రాఘవరావు ఆగాడు. పత్రిక పక్కన పెట్టాడు.

కిటికీ వైపు చూశాడు.

హైదరాబాద్ apartment, నిర్మించిన భవనాలు, పొందిన పతకాలు బహుమతులు, పిల్లలు బతుకుతెరువుకోసం వెళ్ళిపోవడం, సరోజిని పోవడం, తను పడిపోవడం.

ఇప్పుడు ఈ కుర్చీ జీవనం —

అన్నీ వ్యర్థమా? అంతా వ్యర్థమా?

కాదు –

ఏదో మిగిలి ఉంది.

గోవిందాపురం వీధి.

తాతయ్య సుబ్బయ్య.

లక్ష్మమ్మ నాయనమ్మ.

అక్కడ బాకీ ఉంది – చెల్లించని బాకీ.

రాఘవరావు పత్రిక మళ్ళీ తీశాడు.

మరో పేజీ తిప్పాడు. వేరే వ్యాసం.

అందులో మరో వాక్యం – ఈసారి ఒక హదీస్.

చిన్నవారిపై కరుణ చూపించనివాడు, పెద్దవారిని గౌరవించనివాడు – మనలో ఒకడు కాదు.’

రాఘవరావు చేయి ఆగిపోయింది.

తాతయ్య సుబ్బయ్యని గౌరవించలేదు. నవ్వాడు.

నాయనమ్మని గౌరవించలేదు. నవ్వాడు.

కృష్ణమూర్తి మాస్టారిని గౌరవించలేదు. నవ్వాడు.

మనలో ఒకడు కాదు’.

ఆ మాటలు గుండెలో దిగాయి. లోతుగా గుచ్చుకున్నాయి.

వృద్ధాప్యంలో ఇప్పుడు పిల్లలు దూరంగా; భార్య లేదు, ఒంటరిగా పడక కుర్చీలో.

తను సమాజంలో ఒకడు కాదా?

పత్రిక మూశాడు. చాలాసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు.

కిందన కూరగాయల బండి వాడి అరుపు మెల్లగా దూరమైంది.

‘అన్నీ వ్యర్థం’ అంటే?

ఇక్కడ ఏమీ మిగలలేదు అని కాదు. అక్కడ ఏదో మిగిలి ఉంది అని.

గోవిందాపురం వీధిలో చెల్లించని బాకీ ఉంది.

నేను ఇప్పుడు వెళ్ళకపోతే – అది నిజంగా వ్యర్థమవుతుంది.

ఆ రాత్రి కూతురు మాధవికి ఫోన్ చేశాడు.

గోవిందపురానికి వెళ్ళాలని ఉంది తల్లీ’ అన్నాడు.

నాన్నా, అక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు?’

ఒంటరిగా ఉండను మాధవీ. హైదరాబాద్‌లో లక్షల మంది మధ్య ఉన్నాను, ఒక కుర్చీలో, జ్ఞాపకాల పందిరి కింద. అదే నిజమైన ఒంటరితనం. నా మనసు అర్థం చేసుకున్న చోటికి వెళ్తున్నాను. నా బాకీ అక్కడ ఉంది’.

మాధవి అడ్డు చెప్పలేదు.

గోవిందాపురానికి వెళ్ళే ముందు రాత్రి రాఘవరావు నిద్రపోలేదు. అపార్ట్‌మెంట్ నిశ్శబ్దంగా ఉంది. బయట హైదరాబాద్ రాత్రి కూడా నిశ్శబ్దంగా అయింది. ట్రాఫిక్ తగ్గింది, కిటికీల్లో దీపాలు ఆరిపోతున్నాయి. రాఘవరావు దీపం వెలిగించాడు. పాత పెట్టె తెరిచాడు.

హైదరాబాద్ జీవితపు అవశేషాలు – పాత డైరీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు, అభినందన స్తోత్రాలు, అధికారులతో ఛాయాచిత్రాలు.

అడుగున ఒక చిన్న సంస్కృత పుస్తకం.

దాన్ని చేతిలోకి తీసుకున్నాడు.

అట్ట మీద వణికే చేత్తో రాసిన పేరు కనిపించింది – కృష్ణమూర్తి మాస్టారు ఇచ్చిన పుస్తకం, కాలేజీకి వెళ్లేటప్పుడు బహుమతిగా.

అక్షరాలు కంపించాయి- అప్పుడూ, ఇప్పుడూ.

తెల్లవారు జామున దీపం వెలుతురులో ఆ పుస్తకం తెరిచాడు. వాక్యాలు ఈసారి వేరేగా కనిపించాయి- అక్షరాలుగా కాదు, అనుభవంగా.

‘అణోరణీయాన్ష మహతో మహీయాన్
ఆత్మాస్య జన్తోర్నిహితో గుహాయామ్’

ఆత్మ అతి సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమైనది; అతి మహత్తరమైన దానికంటే మహత్తరమైనది. అది ప్రతి జీవి హృదయ గుహలో దాగి ఉంది.

తాతయ్య సుబ్బయ్య వంగిన వీపులో కూడా ఇదే ఆత్మ. నాయనమ్మ వినపడని చెవుల వెనక కూడా అదే ఆత్మ. కృష్ణమూర్తి మాస్టారు వణికే చేతుల్లో కూడా అదే ఆత్మ.

నేను మనిషి పైతొడుగులు చూసి నవ్వాను- లోపల ఉన్న ఆత్మను చూడలేదు’ అని వాపోయాడు.

‘న జాయతే మ్రియతే వా కదాచిన్
న హన్యతే హన్యమానే శరీరే॥’

ఆత్మ పుట్టదు, చావదు. శరీరం నాశనమైనా ఆత్మ నాశనం కాదు.

తాతయ్య శరీరం పోయింది. కానీ ఆయన ఆత్మ- ఇంకా ఆ వీధిలో ఉంది. నన్ను పిలుస్తోంది. నేను వింటున్నాను- ఆలస్యంగా అయినా వింటున్నాను.

రాఘవరావు పుస్తకం మూశాడు. కళ్ళు తుడుచుకున్నాడు. తన పాత డైరీ తెరిచి రాశాడు-

చేయి వణుకుతోంది.

కృష్ణమూర్తి మాస్టారు చేయి వణికినట్టు.

అతనికి నవ్వు వచ్చింది

నిజమైన నవ్వు, చాలా కాలం తర్వాత.

గోవిందాపురంలో మొదటి వారం గడిచింది.

ప్రతి ఉదయం గోదావరి ఒడ్డుకు వెళ్ళేవాడు.

నీళ్ళు చూసేవాడు. గోదావరి ఏమీ మర్చిపోదు.

ఏమీ తెలుసుకున్నట్టు నటించదు. కేవలం ప్రవహిస్తుంది.

అతను చాలాసేపు అక్కడ కూర్చునేవాడు కారణం తెలీకుండా కారే కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా నీళ్ళ శబ్దం వింటూ.

గోదారి గాలి చెక్కెళ్లను తాకుతూ, నిమురుతూ, ఓదార్పుగా అన్నట్టు తాకుతూ కవ్విస్తూ నిష్క్రమించేది.

వీపు వంగింది. అడుగులు నెమ్మదించాయి. తాతయ్య సుబ్బయ్య అడుగులు

ఇప్పుడు తన అడుగులయ్యాయి. అదే వీధి, అదే నడక.

***

ఒక సాయంత్రం –

గోదావరి వైపు నుండి గాలి వస్తోంది, కొబ్బరి చెట్లు వంగుతున్నాయి, ఆకాశంలో ఎర్రని వెలుతురు పరుచుకుంటోంది.

రాఘవరావు అదే పాత వీధిలో నడుస్తున్నాడు. నెమ్మదిగా, జాగ్రత్తగా.

వీపు ముందుకు వంగి ఉంది.

రోడ్డు దాటాలి —

ఇంటి గేటు దగ్గర ఒక పిల్లవాడు నిలబడి ఉన్నాడు-

ఏడెనిమిది ఏళ్ళు ఉంటాయేమో

పెద్ద కళ్ళు, తెల్లని చొక్కా. రాఘవరావును చూశాడు.

ఏమీ అనలేదు.

చూస్తూ ఉన్నాడు.

తాతయ్యా, ఇబ్బందిగా ఉందా నడవడానికి?’

రాఘవరావు ఆగాడు. ఆ ప్రశ్నలో వెక్కిరింత లేదు, జాలి లేదు –

కేవలం సాయంచేయాలనే ఆలోచనతో నిజమైన ప్రేమ, మానవతతో కూడిన ప్రశ్న

కొంచెం నొప్పిగా ఉంది. కానీ నడవగలను’ అన్నాడు రాఘవరావు.

పిల్లవాడు గేటు దాటి బయటకు వచ్చాడు.

రాఘవరావు పక్కన నిలబడ్డాడు.

అతని చిన్న చేయి రాఘవరావు చేయి పట్టుకుంది – అవసరం లేకుండా, ఎవరూ చెప్పకుండా, ఏ కారణమూ లేకుండా.

కేవలం పట్టుకుంది.

రాఘవరావు ఆగిపోయాడు.

గొంతు మూసుకుపోయింది.

అప్పుడు గుర్తొచ్చింది – తాతయ్య సుబ్బయ్య ఈ వీధిలో నడిచినప్పుడు ఒక్కసారైనా ఇలా చేయి పట్టుకున్నానా ?

లక్ష్మమ్మ నాయనమ్మ మళ్ళీ అడిగినప్పుడు ఒక్కసారైనా ఓపిగ్గా చెప్పానా?

కృష్ణమూర్తి మాస్టారు చేయి వణికినప్పుడు ఒక్క విద్యార్థి అయినా దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడా?

నేను నిలబడలేదు.

ఈ పిల్లవాడు నిలబడ్డాడు- నా పక్కన.

హదీస్ చెప్పింది – ‘–గౌరవించనివాడు మనలో ఒకడు కాదు’ అని.

నేను గౌరవించలేదు. కానీ, ఈ పిల్లవాడు నన్ను తమలో ఒకడిగా చూస్తున్నాడు. నేను అర్హుడిని కాదేమో!

కరుణ, ప్రేమ అర్హత చూడవు

రాఘవరావు ఆ పిల్లవాడితో నడిచాడు నెమ్మదిగా, ఆ చిన్న చేయి పట్టుకుని.

గోవిందాపురం సాయంత్రపు గాలిలో ఇద్దరూ నడిచారు.

ఒక పెద్ద నీడ, ఒక చిన్న నీడ

పడమర వైపు పడుతూ.

తత్త్వమసి’

అది నువ్వే.

తాతయ్య సుబ్బయ్య, రాఘవరావే.

లక్ష్మమ్మ నాయనమ్మ, రాఘవరావే.

 ఆ పిల్లవాడు —- రాఘవరావే.

జ్ఞానం పుస్తకంలో ఉంది. అనుభవం ఆ చిన్న చేయిలో ఉంది.

Exit mobile version