Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హ్యాపీ వాలంటైన్స్ డే

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘హ్యాపీ వాలంటైన్స్ డే’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

వికారంగా ఫోన్ వంక చూస్తూ, ఎత్తుదామా వద్దా అని ఒకటికి పది సార్లు బుర్ర గోక్కుని మరీ ఆలోచించి సరే ఎత్తుదాం అని ఫోన్ లిఫ్టు చేసి “ఆ లలిత చెప్పు, ఏవిటి ఫోన్ చేశావ్. నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఫ్రీ అవ్వగనే నేనే వచ్చి నీ దగ్గర వాలతాను. ఇంతకీ ఏవిటి విషయం” అడిగాడు.

ఓ రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత, “హ్యాపీ వేలంటైన్స్ డే మధు. మనం గత రెండేళ్లుగా మంచి ఫ్రెండ్స్. కానీ ఈ రోజు నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని ఇలా ఈ కాఫీ షాప్‌కి రమ్మంటున్నాను. త్వరగా రా, మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళాలి. అంతకంటే ముందు హాస్టల్‌కి వెళ్ళి నా లగేజీ అదీ కూడా ప్యాక్ చేసుకోవాలి. సో ప్లీజ్ కం క్విక్” అంది

“సరే సరే, పనిలో ఉన్నాను. కొంచెం ఫ్రీ టైమ్ దొరకగానే వచ్చేస్తాను.” అని ఆమె ఇంకా ఏదో చెప్తుండగానే పెట్టేశాడు.

పక్కనున్న మధు ఫ్రెండ్ రవి, తెల్లమోహం వేసుకు చూస్తూ, “అదేంట్రా ఖాళీగా పిల్లల వీడియో గేమ్ ఆడుకుంటూ, బిజీగా ఉన్నానూ, ఖాళీ అయ్యాక వస్తా అంటావేంటీ. అయినా మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా, త్వరలోనే ఇద్దరూ ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాంటిది నువ్ తనని ఇలా అవాయిడ్ చేస్తున్నావ్ అంటే నాకు చాలా వింతగా అనిపిస్తోంది సుమీ” అన్నాడు.

“అదో చిన్న కాలక్షేప మజిలీ కథ లాంటిది. ఈ రోజు ఏవిటో మర్చిపోయావా. వేలంటైన్స్ డే. నేను గానీ ఆమె వెయిట్ చేస్తున్న కాఫీ షాప్‌కి వెళితే, గబుక్కున ఐ.లవ్.యు గట్రా చెప్పిందనుకో, నేను కక్కలేక మింగలేక ఇరుక్కు పోవాలి. అందుకే వెళ్ళడం ఇష్టం లేక ఇలా అని తప్పించుకుంటున్నాను” చెప్పాడు పెద్దగా ఆసక్తి లేనట్టు.

“అయితే మంచిదే కదా, ఆమె మంచి అమ్మాయి. ఆమెని చూస్తే కొంచెం పేద అమ్మాయి అయి ఉండొచ్చనిపిస్తుంది కానీ, పద్ధతి గల అమ్మాయి. కనుక వెళ్ళి ఆమెతో ఇప్పటి వరకూ ఉన్న స్నేహాన్ని ప్రేమగా మార్చుకోరా డింబకా” అన్నాడు రవి అభయ హస్తం ఫోజు పెడుతూ

“నేను ఎందుకు వెళ్తాను,ఇందాక చెప్పినట్టు, ఐలవ్యూ చెప్పిందనుకో, నేను ఎటూ చెప్పలేక నలిగిపోవాలి. ఏదో ఇప్పటివరకు తనతో అటు,ఇటు టైమ్ పాస్‌గా తెగ తిరిగాను. ఈ రోజు ఫిబ్రవరి 14న ప్రేమ అనీ, రేపు పెళ్లి అనీ నన్ను కమిట్ చేయించినా చేయిస్తుంది. ఎందుకు వచ్చింది నాకా బాధ. అసలే నాకు మంచి, మంచి డబ్బున్న వాళ్ల పెళ్లి సంబంధాలు లైన్లో ఉన్నాయి. ఈ టైం పాస్ ఫ్రెండ్షిప్పులతో లవ్‌లో దిగి, నేను అనవసరంగా కొత్త చిక్కులు తెచ్చుకోదల్చుకోలేదు. అయినా ఫ్రెండ్షిప్ లోనే నాకు తనంటే బోర్ కొట్టేసింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ప్రేమ ఎందుకు. నాకు అదో చిరాకు” అన్నాడు.

“సరే, సరే నీ ఇష్టం నీకు నచ్చినట్టు కానీ” అన్నాడు రవి.

ఇంతలో మధు ఫ్రెండ్ సుధ ఫోన్ చేసి, “నీకోసం లలిత కాఫీ షాప్‌లో వెయిట్ చేస్తుంటే, నువ్ ఇంకా వెళ్లలేదా” అడిగింది.

“అదీ, నేను కొంచెం బిజీగా ఉండి వెళ్లలేదు. ఎందుకు అలా అడుగుతున్నావ్” అడిగాడు.

“నేనూ కాఫీ షాప్ లోనే ఉన్నాను. లలితకి దూరంగా వచ్చి మాడ్లాడుతున్నాను. తను నీ కోసం నిన్న డైమండ్ రింగ్ కొని ఉంచింది. నువ్వు ఇప్పటివరకు, అంటే గంటన్నర వరకు వెళ్లకపోతే ఎలాగా? వాళ్ల నాన్నగారు కూడా ఎవరో ఒక అబ్బాయిని పంపిస్తా, మాట్లాడు అన్నారట. నువ్ రాకపోతే ఆ రింగ్‌ని తను అతనికి తొడిగినా తొడిగేస్తుంది. ఎందుకంటే నాకు అతని మీద డౌట్. వాడు రోజు ఫోన్లు మెసేజ్‌లు చేస్తున్నాడట. ఈ రోజు కూడా వాడు కాఫీ షాప్‌లో లలిత ఉందన్న విషయం వాళ్ళ నాన్న ద్వారా తెలుసుకుని  వస్తున్నాడట. అసలే  రోజులు బాగా లేవు. కాంపిటేషన్ కూడా ఎక్కువుంది. పైగా బాగా డబ్బున్న అమ్మాయి కూడానూ” అని ఆమె అనీ అనగానే,

షాక్ కొట్టిన వాడిలా, “బాగా డబ్బున్నమ్మాయా. ఏంటి, మరెప్పుడూ చాలా సింపుల్‌గా ఉంటుంది.”

“ఏదో నీతో ఫ్రెండ్షిప్ నచ్చి అలా తిరుగుతుంది కానీ, దానికి ఊరంత డబ్బుంది. కాకపోతే సింపుల్‌గా ఉంటుంది. చూస్తే డబ్బున్న అమ్మాయి అని ఎవరూ అనుకోరు కూడా. తనకి ఇక్కడ కాదు, బెంగళూరులో రెండు మూడు కార్లు కూడా ఉన్నాయి” చెప్పింది

“అలాగా, అయితే ఇప్పుడే వెళ్తాను” అని వరద ప్రాంతం వాసి పులిహార పొట్లం కోసం పరిగెత్తినట్టు పరిగెత్తుకెళ్లి, బండి స్టార్ట్ చేసి, కాఫీ షాప్‌కి వెళ్ళాడు. వెళ్తే లలితతో పాటుగా ఎవరో ఒక అబ్బాయి తెల్లగా చక్కగా ఉన్నాడు. నవ్వుతూ మాట్లాడుతున్నాడు.

మధు గుండెల్లో రాయి పడింది. కాస్త తనలో తానే నలిగిపోతూ, లలితకి దగ్గరగా వెళ్ళి, “ఎవరు ఈ అబ్బాయి” అడిగాడు.

లలిత చెప్పే లోపే, “తను నాకు కాబోయే భార్య” అన్నాడతను.

ఆవదం మొహంతో వికారంగా చూస్తూ, “అదేమిటి లలితా! నన్ను రమ్మన్నావ్ కదా” అన్నాడు.

“అవును రమ్మన్నాను. నీకోసం చాలా సేపు వెయిట్ చేశాను కూడా. కానీ నువ్వు రాలేదు. అప్పుడే సుధ నువ్ మనీ మైండెడ్ అని చెప్పింది. నేను కాదని వాదించాను. సరే నిరూపిస్తా అని నీకు ఫోన్ చేసి నాకు బాగా ఆస్తి పాస్తులు ఉన్న సంగతి చెప్పింది. దాంతో, గంటన్నరగా రాని నువ్వు ఇలా ఐదు నిమిషాల్లో నా ముందు ఉన్నావ్. నువ్వు తొందరగా వస్తే ఈ స్థానంలో నువ్వు ఉండేవాడివి. కానీ నువ్వు చాన్స్ పోగొట్టుకున్నావ్. సుధ చెప్పిందే నిజం అని తేలిపోయింది. నువ్వు ఈ పరీక్షలో దారుణంగా ఫెయిల్ అయ్యావ్.  నాకు ఆస్తుంది, కానీ అది తెలియకుండా నువ్ నా ముందుకు వచ్చుంటే నేను  నిన్ను యాక్సెప్ట్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేను. మనం ఇక మీదట ఫ్రెండ్స్‌గా కూడా కొనసాగడం నాకు ఇష్టం లేదు. హ్యాపీ వేలంటైన్స్ డే” అని చెప్పి తల తిప్పుకోడంతో తెల్ల మొహం వేసి వెనుతిరిగాడు.

Exit mobile version