Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హరితం కార్చిన రుధిరం!

[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘హరితం కార్చిన రుధిరం!’ అనే దీర్ఘ కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

అది..
మా ఊరు ప్రధాన రహదారి!
పాదచారులకు వాహన చోదకులకు
బహు సౌకర్యవంతమై అలరారుతూ –
అందమైన అపురూపమైన
మార్గమై విలసిల్లుతోంది!
అత్యంత ప్రభావవంతమైన
నా ఈ వర్ణనకు గొప్ప కారణమే వుంది!
జాతీయ రహదారిని కలుపుతూ
పట్టణం నడి బొడ్డను తాకుతూ
ఊరి పొలిమేరకు విస్తరించిన
అతి పెద్దదైన ఈ రాచబాటకు
నడుమ భాగంలో..
బాటసారులను సేద దీర్చే
హరితవన సముదాయం
దారి పొడవునా నిండుగా వుంది!
ఫలవృక్ష సంశోభితమై కళకళలాడుతోన్న ఈ మధ్య దారి
రహదారిని రెండు భాగాలుగా చేసి
మా ఊరికి వింత శోభను చేకూర్చి పెట్టింది!
నిరాశ్రయులైన బడుగు జీవులకు
ఆశ్రయమిచ్చే గృహసముదాయమై
అనాథల రక్షణ బాధ్యతను
దట్టమైన గుబురు కొమ్మలు తీసుకొని
ఆ రహదారి గుండా
ఖరీదైన వాహనాలలో పయనించే
కుబేర సమానులైన లక్ష్మీ పుత్రులకు..
దిక్కూ మొక్కూ లేని బలహీనుల యెడల
నిర్వర్తించవలసిన సామాజిక బాధ్యతను
ఆదర్శవంతంగా గుర్తు చేస్తున్నాయి!
అయితే..
నేటి ఇరవై ఒకటో శతాబ్దపు
కుహనా రాజకీయ నాయకులు
ప్రజాస్వామ్యం ముసుగులో
రాజ్యాధికారం చేపట్టే కాంక్షల్లో..
ఆనాడు విదేశి బానిస సంకెళ్ళను త్ర్రుంచి
భరతజాతికి స్వేచ్ఛాయుత జీవనాన్ని
కల్పించడం కోసం స్వార్థరహితంగా
త్యాగాలు చేసిన మానవతామూర్తుల
ప్రతిఓపాలను శిలా ప్రతిమలుగా మలచి
అందమైన ఈ రహదారి
విభజన (డివైడర్) మార్గంలో నిలిపారు!
అలనాటి నిస్వార్థ జాతినేతలకు
కులమతాల రంగులు పులిమి
ఆయా సంఘాల పేర్లు ప్రముఖంగా ముద్రించి
ఆకర్షణీయమైన రంగులతో
విగ్రహాలను అందంగా ప్రతిష్ఠించారు!
స్వతంత్ర భారతదేశం నిర్మాణం కోసం
ఆ మహనీయుల త్యాగాలను స్ఫురించుటకు
ఇదొక్కటే సరియైన మార్గమంటూ
నిస్సిగ్గుగా ప్రసంగాలు చేస్తూ..
మార్గం మధ్యతో బొమ్మలు ప్రతిష్ఠించి
పరమ పావనమైన వారి చరిత్రను
మట్టిలో కలిపి మలినం చేశారు!
అందరమూ భారతమ్మ బిడ్డలమేనంటూ
తోబుట్టువుల మాదిరి..
ఒకే కుటుంబంలా బ్రతుకుతోన్న
భరతజాతి బిడ్డల మధ్య
కులాల కుంపట్లు రాజేసి
కొట్టుకు చావమన్నారు రాజకీయ నేతలు!
అంతే కాదు..
గుండెల్ని పిండేసే అరాచకం
అప్పుడే ప్రారంభమైంది
ఈ రోజు..
ఓ జాతి నేత విగ్రహప్రతిష్ఠకు
ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న వేళ..
ఓ హృదయ విదారక దృశ్యం
నన్ను నిరుత్తరుణ్ణి చేసింది!
ఆ రహదారి విభజన(డివైడర్) మార్గంలో
ఏపుగా పెరిగిన మహా వృక్షం
ఓటమి ఎరుగని రాజ్యాధినేతలా
బాహువులు (కొమ్మలు) చాచి
ఠీవిగా నిల్చొని..
‘నా నీడలో ఒకింత సేద దీరమ’ని
ఆహ్వానం పలుకుతోంది!
కులమతాలకు
ఆర్థిక తారతమ్యాలకు
అతీతంగా..
వేసవి తాపం నుండి
ఉపశమనం పొందాలని
పౌరులెందరో ఆ హరితం నీడకు చేరి
ప్రశాంతంగా విశ్రమించి
సేదదీరుతోన్నవేళ..
ఆకస్మికంగా.. మహిషాన్ని బోలిన
ఓ అత్యాధునిక యంత్రం
రణగొణ ధ్వనులతో
హరిత వనాన్ని చేరింది!
దానితో బాటుగా వచ్చిన
అధికార యంత్రాంగం –
చెట్టునీడలో విశ్రమిస్తోన్న బాటసారుల్ని
బెదిరించి పారద్రోలారు!
మరుక్షణమే…
నా కన్నుల ముందే
విధ్వంసం ప్రారంభమై
ముష్కరుల చేతి కరవాలములు
మహావృక్షం బాహువులను (కొమ్మలను)
తునాతునకలు చేశాయి!
భారతీయ పురాణ ఇతిహాసాలలోని
రక్కసి మూకల వికృత ఆకారంతో
పదునైన ఇనుప కోరలను కలిగివున్న
అత్యాధునిక క్రూర యంత్రం
ఆ మహావృక్షం మొదలును
కూకటి వ్రేళ్ళతో పెకలించి
సుదూర ప్రాంతానికి విసిరివేసింది!
నా గుండెలో గునపాలు దిగాయి!
నా హృదయం రక్త ధారలను స్రవించింది!!
ప్రకృతి మాత ఒడిలో..
హాయిగా సేద దీరుతోన్న హరితవనం
రుధిర వర్ణాన్ని సంతరించుకొని
మోడువారి విలపిస్తోంది దీనంగా!!!

Exit mobile version