Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పాటే మంత్రము: థోడీసీ బేవఫాయీ

[సంచిక పాఠకుల కోసం ‘థోడీసీ బేవఫాయీ’ అనే సినిమా లోని ‘హజార్ రాహేఁ ముడ్‌కే దేఖీఁ’ పాటని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

గుల్జార్ సాబ్ ఎన్నో రకాల పాటలు రాశారు. భావగీతాలు, ప్రేమగీతాలు, విరహగీతాలు, విషాదగీతాలు – ఇలా ఎన్నో. ‘థోడీసీ బేవఫాయీ’ లోని టైటిల్ సాంగ్ విభిన్నమైనది. ఇలాంటి పాటలు ఇతర రచయితలు కూడా ఎక్కువగా రాయలేదు.

నాయికానాయకులు విడిపోయిన తర్వాత పంతంగా “నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి నేనూ దూరంగా ఉన్నాను” ఒకరినొకరు దెప్పి పొడుచుకునే పాట ఇది. అయితే వారిద్దరూ ఎందుకు దూరంగా ఉన్నారు అనే ప్రశ్నకి సినిమా కథలో సరైన జవాబు దొరకదు. కథలో భార్యాభర్తల మధ్య కుటుంబకలహాలు వస్తాయి. అదే సమయంలో భర్తకి వేరే స్త్రీతో సంబంధం ఉందని భార్యకి అనుమానం వస్తుంది. ఆమె భర్తని వదిలి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత భర్తకి అక్రమసంబంధం లేదని భార్యకి తెలిసిందా అనేది కథలో స్పష్టంగా లేదు. ఆమె తండ్రి దగ్గరకి వెళ్ళాక తండ్రి లంచం కేసులో ఇరుక్కుని అప్రతిష్ఠ పాలవుతాడు. డబ్బుకి కటకటగా ఉంటుంది. కూతురిని అల్లుడి దగ్గరకి వెళ్ళమంటాడు. ఆమెకి ఆత్మాభిమానం ఎక్కువ. తండ్రి పరిస్థితి బాగాలేదని భర్త దగ్గరకి వెళితే అది అవకాశవాదం అవుతుందని ఆమె అభిప్రాయం. ఆమె భర్త కూడా పంతంగా ఉంటాడు. పాటలో ఆమెకి తన తప్పు తెలిసినట్టు ఉంటుంది. కథలో అలా ఉండదు. మరి దర్శకుడు, గీత రచయిత మధ్య సమన్వయం ఎలా లోపించిందో తెలియదు. రాజేష్ ఖన్నా, షబానా ఆజ్మీ నటనాకౌశలంతో స్క్రీన్ ప్లేలో ఉన్న దోషాలు చిన్నవిగా కనపడతాయి.

అయితే ఈ పాట అహంకారాలు బతుకులని ఎలా పాడు చేస్తాయో చెప్పటానికి మంచి ఉదాహరణ. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే జంటలు విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి. అహాన్ని పక్కన పెట్టి మాట్లాడుకుంటే కాపురాలు నిలబడతాయి. తలిదండ్రులు కూడా రాజీ కుదర్చటానికి చూడాలి కానీ తమ సంతానాన్ని అన్నివేళలా సమర్థిస్తామంటే విపరిణామాలు తప్పవు. ఈ చిత్రంలో నాయిక తండ్రి మొదట కూతురు పుట్టింటికి తిరిగి వస్తే ఆమెని సమర్థిస్తాడు. తర్వాత తన పరిస్థితి బాగాలేక కూతుర్ని భర్త దగ్గరకి వెళ్ళిపొమ్మంటాడు. ఇది న్యాయం కాదని ఎవరైనా చెబుతారు. కానీ తన దాకా వస్తే ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. నాయకుడు కూడా ‘నీ బుద్ధి ఇంతే’ అని నాయికని దూరం చేసుకుంటాడు. ఇదీ తప్పే.

ఈ చిత్రానికి సంగీతం ఖయ్యాం అందించారు. మెలడీకి ప్రాధాన్యం ఇచ్చే సంగీత దర్శకుడాయన. గుల్జార్ కవిత్వపటిమ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. టైటిల్ సాంగ్ కిశోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడారు. కిశోర్ కుమార్‌కి ఉత్తమ గాయకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది.

పాట:

అ: హజార్ రాహేఁ ముడ్‌కే దేఖీఁ
కహీఁ సే కోయీ సదా న ఆయీ
ఆ: బడీ వఫా సే నిభాయీ తుమ్‌నే
హమారీ థోడీసీ బేవఫాయీ
అ: జహాఁ సే తుమ్ మోడ్ ముడ్‌గయే థే
వో మోడ్ అబ్ భీ వహీఁ ఖడే హైఁ
ఆ: హమ్ అప్‌నే పైరోఁ మేఁ జానే కిత్‌నే
భఁవర్ లపేటే హువే ఖడే హైఁ
అ: కభీ కిసీ రోజ్ యూఁ భీ హోతా
హమారీ హాలత్ తుమ్హారీ హోతీ
ఆ: జో రాత్ హమ్‌నే గుజారీ మర్‌కే
వో రాత్ తుమ్‌నే గుజారీ హోతీ
అ: ఉన్హే యే జిద్ థీ కి హమ్ బులాయేఁ
హమేఁ యే ఉమ్మీద్ వో పుకారేఁ
ఆ: హై నామ్ హోఠోఁ పే అబ్ భీ లేకిన్
ఆవాజ్ మేఁ పడ్‌గయీఁ దరారేఁ

ఇప్పుడు పాట అర్థం చూద్దాం.

అ: హజార్ రాహేఁ ముడ్‌కే దేఖీఁ
కహీఁ సే కోయీ సదా న ఆయీ
ఆ: బడీ వఫా సే నిభాయీ తుమ్‌నే
హమారీ థోడీసీ బేవఫాయీ

అ: వేయి దారులు తిరిగి చూశాను, వినపడనేలేదు పిలుపు ఏదీ
ఆ: మహ దొడ్డ ప్రేమతో కాచావుగా చిన్నపాటి ఈ నా ద్రోహాన్ని

ఎంతో వేచి చూసినా ఆమె అతనితో మాట్లాడటానికి ప్రయత్నించలేదు. అది అతని ఫిర్యాదు. ఆమె ఫిర్యాదు ఏమిటంటే ‘నా చిన్నపాటి ద్రోహాన్ని నువ్వు క్షమించలేకపోయావు’ అని. ఇక్కడ వెటకారంగా అనటం ఈ పాటలో ప్రత్యేకత. ‘నీది మహా దొడ్డ ప్రేమ కదా’ అంటుంది నాయిక. పైగా ద్రోహంలో చిన్న ద్రోహం, పెద్ద ద్రోహం ఉండవు. ద్రోహం ద్రోహమే. అతన్ని అనుమానించటమే ఆమె చేసిన ద్రోహం. ఎవరైనా చేస్తే దాన్ని పెద్దగా చేసి చెప్పటం, తాము చేస్తే దాన్ని తక్కువ చేసి చెప్పటం మనిషికి అలవాటే. ఈ మానవనైజాన్ని చక్కగా చెప్పారు గుల్జార్ సాబ్. ‘చిన్నపాటి ద్రోహం’ (థోడీసీ బేవఫాయీ) అనేదే చిత్రానికి పేరుగా పెట్టారు.

అ: జహాఁ సే తుమ్ మోడ్ ముడ్‌గయే థే
వో మోడ్ అబ్ భీ వహీఁ ఖడే హైఁ
ఆ: హమ్ అప్‌నే పైరోఁ మేఁ జానే కిత్‌నే
భఁవర్ లపేటే హువే ఖడే హైఁ
అ: ఎక్కడైతే నీవు మలుపు తిరిగిపోయావో
ఆ మలుపులు అక్కడే ఉన్నాయి
ఆ: నీకేం తెలుసు, నా పాదాలను
ఎన్నో సుడిగుండాలు ఆపుతున్నాయి

‘నువ్వు మలుపు తిరిగి వెళ్ళిపోయావు. మళ్ళీ అదే మలుపు తిరిగి వస్తే నన్ను చేరుకుంటావు’ అని అతని భావన. ఆమె తండ్రి పతనం తర్వాత కుటుంబ బాధ్యత తీసుకుంది. పైగా అభిమానం ఎక్కువ. ‘మావాళ్ళని వదిలి రాలేను. వస్తే చులకనైపోతాను’ అని ఆమె బాధ. భార్యాభర్తల మధ్య చులకన అనే భావం రాకూడదు.

అ: కభీ కిసీ రోజ్ యూఁ భీ హోతా
హమారీ హాలత్ తుమ్హారీ హోతీ
ఆ: జో రాత్ హమ్‌నే గుజారీ మర్‌కే
వో రాత్ తుమ్‌నే గుజారీ హోతీ
అ: నా దశలాంటి దశ ఎప్పటికైనా
నీకూ వస్తే తెలుస్తుంది
ఆ: నేను చస్తూ గడిపిన రాత్రులు
నువ్వూ గడిపితే తెలుస్తుంది

‘నన్ను వదిలి నీవు అన్యాయం చేశావు. నేను ఒంటరిగా మిగిలిపోయాను’ అనే భావాన్ని ఇద్దరూ చెరో రకంగా చెబుతున్నారు ఇక్కడ. ‘నీకు నా బాధ తెలియదులే’ అనే ఆక్షేపణే కానీ ‘వారు ఎంత బాధపడుతున్నారో’ అనే భావం కరువవటం ఇక్కడ గమనార్హం.

అ: ఉన్హే యే జిద్ థీ కి హమ్ బులాయేఁ
హమేఁ యే ఉమ్మీద్ వో పుకారేఁ
ఆ: హై నామ్ హోఠోఁ పే అబ్ భీ లేకిన్
ఆవాజ్ మేఁ పడ్‌గయీఁ దరారేఁ
అ: ఆమె పంతం నేను రమ్మనాలని
నా ఆశ ఆమె పిలుపివ్వాలని
ఆ: పెదాలపై నీ పేరు ఇప్పటికీ ఉంది కానీ
గొంతులోనే ఏవో పగుళ్ళు పడ్డాయి

గుల్జార్ సాబ్ ఇక్కడ మరోసారి మానవ నైజం ఆవిష్కరించారు. ‘నేనే ఆమెని రమ్మనాలని ఆమె పంతం. ఆమె పిలిస్తే బావుండునని నా ఆశ’ అంటున్నాడతను. ఆమెది పంతమట. తనది ఆశట. ఏం ద్వంద్వ ప్రవృత్తి! ‘నాదే పంతమేమో’ అనుకుంటే ఒక్క క్షణంలో మనసు మారుతుంది. దృష్టిలో భేదం, అంతే. ఆమె ‘నీ పేరు పిలవాలనే ఉంది కానీ గొంతు సహకరించటం లేదు’ అంటుంది. భర్తతో మాట్లాడటానికి అభిమానం అడ్డు. భార్యాభర్తల మధ్య ఇలాంటి అభిమానాలూ ఉండకూడదు.

Exit mobile version