[జిమ్ రీవ్స్ పాడిన ‘He’ll Have To Go’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- పాట – He’ll Have To Go
- గాయకుడు – జిమ్ రీవ్స్
- రచన – జో అలిసన్, ఆడ్రి అలిసన్
- ఆల్బం – హేల్ హావ్ టు గో అండ్ అథర్ ఫేవరెట్శ్
- నిర్మాత – చెట్ ఆట్కిన్స్
♤
జిమ్ గాత్రంలోని మృదుత్వానికి ఎందరో అభిమానులున్నారు. ఈయన గాస్పల్ పాటలు అంటే క్రిస్టియన్ భక్తి పాటలకు కూడా ప్రసిద్ది చెందారు. మరణించిన చాలా సంవత్సరాల తర్వాత కూడా ఈయన రికార్డులు ఇతర దేశాలలోనూ అత్యధికంగా అమ్ముడవుతూ ఉన్నాయంటే ఈయన అంతర్జాతీయంగా ఎంత ప్రేరు సంపాదించుకున్న గాయకులో అర్థం చేసుకోవచ్చు.
1960 ప్రారంభంలో, ఈ పాట ‘బిల్బోర్డ్ హాట్ 100’ జాబితాలో రెండవ స్థానానికి చేరుకుంది. 1960 సంవత్సరానికి, బిల్ బోర్డ్ ఈ పాటను ఆ సంవత్సరపు రెండవ అత్యుత్తమ పాటగా గుర్తించింది. అంతేకాకుండా, 1960 ఫిబ్రవరి 8న ఈ పాట ‘హాట్ కంట్రీ సింగిల్స్’ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది, అక్కడ అది వరుసగా 14 వారాల పాటు కొనసాగింది. అదనంగా, ఇది ‘రిథం అండ్ బ్లూస్ సింగిల్స్’ జాబితాలో 13వ స్థానానికి చేరుకుంది. కెనడాలో, ఈ పాట ‘పాప్ సింగిల్స్’ జాబితాలో ఆరు వారాల పాటు అగ్రస్థానంలో నిలిచింది. ఒక కంట్రీగీతం పాప్ సింగిల్స్ లోనూ చోటు సంపాదించుకోవడం అరుదైన విషయం. ఆస్ట్రేలియా ‘సింగిల్స్’ జాబితాలో అగ్రస్థానానికి, యూ.కె ‘సింగిల్స్’ జాబితాలో 12వ స్థానానికి చేరుకుంది.
‘He’ll have to go’ పాట ఒక స్త్రీని ప్రేమించి, ఆమె మరొకరితో కూడా సన్నిహితంగా ఉంటుందని తెలిసినప్పుడు ఆ ప్రేమికుడు బాధతోనూ ఆత్మాభిమానంతోనూ ఆమెతో చేసే సంభాషణ. జిమ్ గొంతు మార్దవంగా, అలాగే ఖచ్చితంగానూ ఉంటూ వినేవారికి ప్రేమికుని మనసులో బాధను, పట్టుదలలను ఒకే క్రమంలో పరిచయం చేస్తుంది. వీరిద్దరి మధ్య నడిచే ఫోన్ సంభాషణే ఈ పాటంతానూ.
Put your sweet lips a little closer to the phone
Let’s pretend that we’re together all alone
I’ll tell the man to turn the jukebox way down low
And you can tell your friend there with you he’ll have to go
(నీ తీయని పెదాలను ఫోన్ దగ్గరకు తీసుకురా. ఇద్దరం ఒంటరిలాగే ఉన్నట్లుగా నటిద్దాం. ఇక్కడ జూక్ బాక్స్‌లో పాటలు వింటున్న వ్యక్తితో సౌండ్ తగ్గించమని నేను అడుగుతాను. నువ్వు నీతో ఉన్న నీ స్నేహితుడితో ఇక వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పు)
ఇద్దరూ వారి వారి స్థానాల్లో ఒంటరిగా లేరు. ఆమె మాట్లాడుతుంది అతనికి వినిపించట్లేదు. అతను లోగొంతుతో మాట్లాడుతున్నాడు. తనలోని సంఘర్షణ నలుగురికి తెలియడం అతనికిష్టంలేదు. అందుకే ఆమెతో ఫోన్‌కి దగ్గరగా రమ్మని అడుగుతున్నాడు. నీ తీయటి పెదవులను ఫోన్ దగ్గరకు తీసుకురా అని చెప్పడంలో ఆమెపై అతనికున్న ప్రేమ అలాగే ఆమెతో విషయం అప్పుడే చెప్పాల్సిన అవసరం కనిపిస్తున్నాయి. తన పక్కన జూక్ బాక్స్‌లో పాటల సౌండ్‌ను తగ్గించమని తాను చెప్తానంటూనే నీతో ఉన్న నీ స్నేహితుడికి ఇక అతను వెళ్లిపోవల్సి ఉంటుందని చెప్పమంటున్నాడు. అంటే ఆమె కోసం అతనేమయినా చేయడానికి సిద్ధమే కాని ఆమె ఇక తన ఇతర స్నేహితులను వదులుకోవాలి. ఆమెతో ఆమెను ప్రేమిస్తున్న మరో వ్యక్తి ఉన్నాడు. ఇద్దరిలో ఎవరో ఒకరిని ఆమె ఇప్పుడు ఎన్నుకోవాలి. ఇద్దరితో స్నేహం ఇక ఆమె చేయడం మంచిది కాదు. ఏదో ఒక నిర్ణయాన్ని ఆమె తీసుకోవలసిన సమయం వచ్చేసింది అని మృదువుగానూ ఖచ్చితంగానూ సూచిస్తున్నాడు ఆ ప్రేమికుడు.
Whisper to me, tell me do you love me true
Or is he holding you the way I do?
Though love is blind, make up your mind, I’ve got to know
Should I hang up or will you tell him he’ll have to go
(చిన్నగా నా చెవులో చెప్పు నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అతను నిన్ను నేను చేతుల్లోకి తీసుకుంటున్నట్లు తీసుకుంటున్నాడా? ప్రేమ గుడ్డిదే, కాని ఓ నిర్ణయానికి నువ్విప్పుడు రావాలి. నాకు నీ నిర్ణయం తెలియాలి. నేను ఫోన్ పెట్టేసి వెళ్లిపోనా లేదా అతన్ని వెళ్లిపొమ్మని నువ్వు చెబుతావా?)
అతనికి ఆమె ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నదని తెలుసు. కాని ఆమె ఇప్పుడు నిర్ణయించుకోవడం వారి ముగ్గురి భవిష్యత్తుకి అత్యవసరం. అందుకే రహస్యంగానన్నా సరే ఆమె మనసులో ఏ నిర్ణయానికి వచ్చిందో చెప్పమన్ని, ప్రేమ గుడ్డిదే అయినా ఒక స్పష్టత ఉండాలని, ఆ స్పష్టత తనకూ అర్థం కావాలని, ఇలా సందిగ్ధంలో తాను ఉండలేనని, ఆమె నిర్ణయంలో జరిగే ఆలస్యం నడుమ ఆ తెలియని స్థితిలో తానిక ఉండలేనని అతను చెబుతున్నాడు. ఇందులో ఆ ప్రేమికుడు అభిమానం కనిపిస్తుంది. ఆమెను అతను గుడ్డిగానే ఆరాధిస్తున్నా, దాని కోసం మరో వ్యక్తితో పోటీ పడుతూ ఆమె నిర్ణయం కోసం ఎదురు చూస్తూ కాలయాపన చేస్తూ తనను తాను తక్కువ చేసుకోలేననే నిశ్చయం అతని గొంతులో వినిపిస్తుంది. పైగా ఆ మాట చెప్పేటప్పుడు అతనిలో ఎలాంటి కరకుతనం లేదు. ఆమెపై ప్రేమను ప్రకటిస్తూనే ఈ నిర్ణయం తన ఆత్మగౌరవానికి అత్యవసరం అన్న దృఢ నిశ్చయమే కనపడుతుంది.
You can’t say the words I want to hear
While you’re with another man
Do you want me, answer yes or no
Darling I’ll understand
(నేను వినాలనుకుంటున్న మాటలను నువ్వు మరొక మగవాడు పక్కన ఉండగా చెప్పలేవని నాకు తెలుసు. నీకు నేను కావాలా అన్నది అవును కాదు అన్న ఒక్క మాటతో చెప్పు నేను అర్థం చేసుకుంటాను ప్రియా)
ఆమె కూడా తనలాంటి ఇబ్బందిలో ఉండి మరో మగాడు పక్కన ఉండగా ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండి ఉండవచ్చు. కాని అందుకని ఈ సంభాషణను మరో సందర్భానికి అతను నెట్టాలనుకోవట్లేదు. తను ఆమెకు కావాలా వద్దా అన్నది ఒక అవును, కాదు అనే జవాబుతో ఆమె చెప్పినా సరిపోతుంది, తాను అర్థం చేసుకోగలడు. ఆమెను ఇబ్బంది పెట్టడం, బలవంత పెట్టడం అతని ఉద్దేశం కాదు. కాని అస్పష్టమైన ఆ సందిగ్ధ స్థితి అతనికి ప్రాణాంతకంగా ఉంది. ముందు అందులోనించి అతను బైట పడాలి. దానికి ఆమె ఒక చిన్న మాటతో జవాబు చెబితే అతని ఆ తరువాత ఆమెను కలిసే దాక ఒక స్పష్టమైన అవగాహనతో వేచి ఉండడానికి సిద్దంగా ఉన్నాడు. ఈ చరణం దగ్గర్ జిమ్ గొంతులో బాధ్ ఆతృత సమపాళ్లలో పలుకుతాయి.
Put your sweet lips a little closer to the phone
Let’s pretend that we’re together all alone
I’ll tell the man to turn the jukebox way down low
And you can tell your friend there with you he’ll have to go
(నీ తీయని పెదాలను ఫోన్ దగ్గరకు తీసుకురా. ఇద్దరం ఒంటరిలాగే ఉన్నట్లుగా నటిద్దాం. ఇక్కడ జూక్ బాక్స్‌లో పాటలు వింటున్న వ్యక్తితో సౌండ్ తగ్గించమని నేను అడుగుతాను. నువ్వు నీతో ఉన్న నీ స్నేహితుడితో ఇక వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పు)
మళ్లీ అదే పల్లవితో జిమ్ గొంతు జీరపోతుండగా తన అసహాయతను చెప్పకనే చెబుతూ పాట రూపంలో వినిపిస్తూ ఉండగా పాట ముగుస్తుంది. కంట్రీ గీతాలను ప్రేమించే అభిమానులందరూ జిమ్ రీవ్స్ పాడిన ఈ పాటను ఇష్టపడతారు. సాహిత్యం కన్నా జిమ్ దీన్ని పాడిన విధానం, గొంతులోని ఆ ఆర్ద్రత విశేషంగా శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ పాటను వింటే జిమ్‌ను అందరూ ‘మాన్ విత్ ది విల్వెటీ వాయిస్’ అని ఎందుకు అంటారో స్పష్టమవుతుంది.
♤
(ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=whxFcO3rFRo )

