Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హే కృష్ణా

[వాణి వేమవరపు గారి ‘హే కృష్ణా’ అనే రచనను అందిస్తున్నాము.]

తెల తెల్లవారుతుండ ఆ ఉద్యానవనమున,
కుసుమాలకై నేను అడుగిడు సమయాన,
అల్లంత దూరాన కాంచితి నిను నేను,
తన్మయ మొందితిని, నను నేను మరచితిని,

నా కనులు నీ నుండి మరి మరలనన్నవి,
నీ నామ సుధలనే మది విడువనన్నది,
తడబడు అడుగులతో నీ దరి చేరబోవా,
ఏమి మాయనో అది, నిను గాంచనైతి.

నీ ప్రేమను పొంద గోపికను కానైతి,
నీ మదిన కొలువుండ రాధనూ గానైతి,
పదు నాలుగు లో‌కాలు ఏలేటి నీ పాదాల పరమాణునైనా కానైతి నేను,
ఎచట నుంటివో కృష్ణా, నీ దర్శనముకై నిలచితి నేను.

కృష్ణా కృష్ణా యనుచు నిను వెతుకుచూ నేను,
అలసి ఉంటినయా, అలసిన నా కనులు క్షణకాలము వాల్చ,
నీ యందే ఉంటినని లీలగా నీ మాట,
తెరచినా కనులకు నీవు గాన రాక,
తెల్లవారెననే స్పురణ నొందితి నేను.

Exit mobile version