Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హిమాచల్ యాత్రానుభవాలు-7

“నా అనుభవం ఎవరితో పంచుకుంటున్నా నన్ను నేను ఆ ప్రాంతంలోకి మరల తీసుకెళ్లిన వింత భావన. అదేమిటో? అదే హిమాలయ మహత్యం కావచ్చు” అంటూ తాము పొందిన అనుభూతిని పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరిహిమాచల్ యాత్రానుభవాలు” అనే ఈ యాత్రాకథనంలో.

మణికరణ్

ణికరణ్ పార్వతి నది ఒడ్డున ఉన్న దైవ క్షేత్రం. కులు జిల్లాలోని భుంతర్‌కి దగ్గర్లో ఉంది. మనాలి నుండి 80కిమీ దూరం. సముద్రమట్టానికి 1760 మీ. ఎత్తులో ఉంది.

ఇదొక చిన్న గ్రామం. మనాలి యాత్రికులను ఆకర్షిస్తుంది. మనాలి, ఖత్రాన్, కులు, భుంతర్ మీదుగా పచ్చని ప్రకృతి ఒడిలో ప్రయాణం… దారంతా పండ్ల తోటలు, అడవి పూలు, అంబరాన్ని చుంబిస్తున్నట్లు భ్రమింపచేసే దేవదారు వృక్షాలు, మంచు పర్వత శిఖరాలు, గలగలా పారుతున్న పార్వతి నది ప్రవాహం, తెల్లని పాలలాంటి నీళ్లు అచ్చెరువు కల్పిస్తాయి. ఇరుకైన దారుల్లో భీకరంగా ప్రవహించే శ్వేత పార్వతి నది గగ్గురపొడుస్తూ మాతో పాటు సాగింది. దాదాపు 3-4 గంటల ప్రయాణం తరువాత గమ్యం చేరాము.

ముందుగానే అదనపు దుస్తులు తెచ్చుకున్నాము. ఎందుకంటారా? ఇక్కడ వేడి నీటి ఊటలు, వేడి నీటి గుహ ప్రసిద్ధం. అందుకు.

పట్టణవాసులకు దారంతా కనిపించే సెలయేళ్ళు, పర్వతాలు, శీతల గాలి అద్భుతంగా, ఆనందాన్ని పంచి ఇస్తాయి. నలువైపులా పూలే, వాటి పరిమళాలే. నది, హిమగిరులు అందంగా ఉంటాయని చదివాను, విన్నాను.

కానీ స్వయంగా చూసి పొందిన అనుభూతి మాటలకు అందనిది. వాటి ప్రేమలో పూర్తిగా మునిగిపోయాను.

జన్మ తరించిన అనుభూతి. నా అనుభవం ఎవరితో పంచుకుంటున్నా నన్ను నేను ఆ ప్రాంతంలోకి మరల తీసుకెళ్లిన వింత భావన. అదేమిటో? అదే హిమాలయ మహత్యం కావచ్చు.

మణికరణ్‌లో దుర్గ మాత ఆలయం, సిక్కుల మందిరం ఉన్నాయి. బస్సు లేదా వాహనాలు గురుద్వారా దగ్గర్లో ఆగుతాయి. మెట్లు దిగి క్రిందకు వెళ్ళితే ముందుగా సిక్కుల మందిరం. మరింత ముందుకు వెళితే మాత గుడి ఉన్నాయి

ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఆది దంపతులు శివ పార్వతులు ఈ దేవ భూమిలో విహారానికి వచ్చినప్పుడు

కొంతకాలం ఇక్కడే ఉన్న సమయంలో పార్వతి చెవు కమ్మలోని ఒక మణి జారి పాతాళంలో పడిపోయిందట. అది ఆదిశేషునికి దొరికితే అక్కడే దాచి ఉంచాడట.

పార్వతి విన్నపం ప్రకారం శివుని ప్రమధ గణాలు శివుని ఆదేశంతో మణిని వెదికేందుకు వెళ్ళి విఫలం అయ్యాయి.

అది చూసి శివుడు తాండవ నృత్యం చేస్తే కంపించిన దేవతలు ఆదిశేషుని ఆ మణిని పార్వతికి తిరిగి ఇవ్వమని ఆదేశిస్తే, తన దగ్గరున్న అనేక మణులలో అది ఏదో తెలియదని కనుక వేలకొలది మణులు భూమి పైకి వేదచిమ్మాడట. వాటిలోని తన మణిని పార్వతి తీసుకుందని, ఇతర మణులు నేటికీ ఆ లోయలో ప్రజలకు అప్పుడప్పుడు దొరుకుతాయని చెప్పారు. అందువాళ్ళ దీనికి మణికరణ్ అని పేరు వచ్చిందిట.

ఆదిశేషు మణులతో పాటు అగ్నికీలతో పాటు వేడినీటిని కూడా పైకి పంపాడట. నేటికీ అక్కడ అత్యంత వేడి నీటిని ప్రవహించే ఉష్ణ నీటి ఊటలు ప్రవహిస్తూ ఆవిరి వెదజల్లటం స్వయంగా చూడవచ్చు. ఇక్కడ స్త్రీ పురుషులు స్నానం చెయ్యటానికి ఏర్పాట్లున్నాయి. గుడిలో ఉష్ణ కుండంలో వండిన అన్నాన్ని ప్రసాదంగా ఇస్తారు.

సిక్కుల స్థల పురాణం ప్రకారం గురునానక్ 1574 సంవత్సరంలో తన అనుయాయి భాయ్ మార్దనతో వచ్చారట ఇక్కడకు. మార్దనకి ఆకలివేస్తే గురునానక్ అతనిని సమీప గ్రామంలో బిక్షాటనకి వెళ్ళమన్నారట. అతనికి రొట్టెల పిండి మాత్రమే దొరికిందిట. రొట్టెల తయారీకి వస్తువులు లేవు. అప్పుడు గురునానక్ శిష్యునితో ఒక పెద్ద రాయిని చూపి దాన్ని తొలగిస్తే వేడినీటి ఊటలు వస్తాయన్నారట. అదేవిధంగా చేస్తే రాతి క్రింద వేడినీటి ఊటలు కనిపించాయి. పిండిని రొట్టెలుగా చేసి ఆ వేడి నీటిలో వెయ్యమంటే శిష్యుడు అలాగే చేసాడు. కానీ అవి నీటిలో కరిగిపోయాయిట.

ఆకలి, నిరాశతో ఉన్న శిష్యుని రొట్టెలు నీటిలో వేసే ముందు దేవుని ప్రార్థించి రొట్టెలు నీటిలో మునగకుండా ఉంటే ఒక రొట్టెకి ఇంకో రొట్టె ఆకలితో ఉన్న వారికీ ఇస్తానని ప్రార్ధించమన్నారట.

అదే విధంగా ప్రార్థన చేసి రొట్టెలను వేడి నీటిలో వెయ్యగా అవన్నీ చక్కగా కాలి బైటకు వచ్చాయి. ఈ రోజుకి అక్కడ వేడి నీటి ఉష్ణ గుండం,ఉష్ణ గుహ ఆలయం, గురుద్వారా, సహపంక్తి భోజనాలయం లంగర్ ఉన్నాయి.

 అక్కడ ఉన్న ఉష్ణ నీటి కొలనులో స్నానమాచరించి దైవ దర్శనం చేసుకున్నాము. లంచ్ లంగర్‌లో తిన్నాము.

అక్కడున్న సేవక భక్తులు తమవంతు సేవను వంటింట్లో, గిన్నెలు శుభ్రపరస్తూ, పరిసరాలు నీట్‌గా ఉంచుతూ,

వచ్చిన అతిథులకు వడ్డిస్తూ కనిపించారు. వారి క్రమశిక్షణ, నిబద్ధత ఆకట్టుకున్నాయి.

ఈ యాత్ర ఆధ్యాత్మికమే కాదు, ప్రకృతి ప్రేమికులకు కనులవిందు కూడా.

నిండుగా ఉధృతంగా ప్రవహిస్తున్న పార్వతి నదిని చూస్తూంటే సమయం తెలీలేదు. ఇంతలో సడన్‌గా కురిసిన పెద్ద వానలో తడిసి ముద్దయిన ఆనందమే వేరు. బాల్యం గుర్తుకు వచ్చింది.

ఆఖరి బస్సు ఎక్కి తిరిగి మనాలికి రాత్రి 8 గంటలకు వచ్చాము. వేడి టీ తాగుతూ డిన్నర్ ఆర్డర్ చేసి వేడి వేడి

రోటీలు, దాల్, కూర తిని నేటి యాత్ర అనుభవాలు నెమరు వేసుకున్నాము.

గుడ్ నైట్ చెప్పుకుని రేపటి రోజు ఏమిటీ? అని అనుకుని నిద్ర పోయాము.

మర్నాడు కేవలం 18 మైల్ గ్రామం నుండి పట్లి కూల్ దాకా నడవాలని అనుకున్నాము. మా యాత్ర మనాలిలో చివరి దశకు చేరింది.

(ఇంకా ఉంది)

Exit mobile version