సూర్యుడితో పాటు పరుగుపెట్టడం నేటి జీవన సరళిగా వుంది.
శిరీష ఒక స్కూల్లో టీచర్‍గా పనిచేస్తుంది. భర్త వి.ఆర్.ఓ.గా చేస్తున్నాడు. నెల తిరిగేటప్పటికి రెండు జీతాలు. పావు వంతు మాత్రమే ఖర్చు. మూడు వంతులు బ్యాంక్‍లో నిల్వ. అదీగాక ఎల్.ఐ.సి.లు, చీటీలు రకరకాలుగా నిల్వధనము.
ఇద్దపు పిల్లలు. ఆడపిల్ల ఒకటవ తరగతి, పిల్లవాడు మూడవ తరగతి. మంచి ఆదాయము, మంచి జీవితము. అయితే పిల్లల్ని చూడటానికి సాయంత్రం వచ్చేటప్పటికి ఒక ఆయాను ఏర్పాటు చేసింది. సాయంత్రం స్కూలు నుంచి రాగానే పాలు వెచ్చబెట్టి ఇస్తుంది. సీసాలో కారంబూందీ, లడ్డూ, కాజా, వడలు, బిస్కట్లు, చాక్‍లెట్లు ఎప్పుడూ ఉంటాయి. ఏది కావాలంటే అది తీసుకుని తింటారు. కాసేపు హోమ్‍వర్క్ చేసుకున్నాక అన్నాచెల్లెలు ఏదో ఆడుకుంటారు, పొట్లాట అనేది లేదు. అన్నకి చెల్లెలంటే అభిమానము. అయితే ఎంతకాలం వాళ్ళిద్దరూ ఆడుకుంటారు? స్నేహితుల కోసం వెంపర్లాడారు.
ఆయా కన్నుగప్పి ప్రక్కింటి పిల్లలతో ఆడుకోవాలని తాపత్రయపడ్డారు. ఆ విషయం తల్లికి చెప్పవద్దు అని అన్నారు.
***
శిరీష పిల్లల్ని స్ట్రిక్ట్‌గా పెంచేది. అందులో ఆడపిల్లని మరీ స్ట్రిక్ట్‌గా పెంచేది. పాపం హిమజ తల్లికి భయపడేది. తన వయస్సు వారు గొబ్బిళ్ళు, పేరంటాలు- బువ్వలాటలు ఆడుకొంటుంటే, తను మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు. ఎంతసేపు ఇంట్లోనే ఉండి టి.వి. చూసుకోవాలి. బొమ్మలతో కూడా ఆడుకోకూడదు. కామిక్ కథలు చదువుకోవాలి. అంతేగాక గచ్చకాయలు, గవ్వలు అందరి పిల్లల్ల ఆడుకోవడానికి వీలులేదు అంది. పోనీ ఎదురింటమ్మాయి డాన్స్‌కి, పక్కింటి అమ్మాయి సంగీతం క్లాసులకి వెళుతుంది. కనీసం వాటికైనా పంపించమని గోలచేసింది. రితీష్ కూడా అబాకస్‍కి గాని, ఛెస్‍కి నేర్చుకోవడానికి గాని పంపమని అల్లరిచేశాడు. ఎవరి మాట వినలేదు. శిరీషకి తన పిల్లల్ని గొప్పగా పెంచి, విదేశాలకి పంపాలన్నదే ధ్యేయము. అక్కల పిల్లలతో పోల్చుకుంటుంది. పెద్ద చదువులతో వాళ్ళంతా విదేశాల్లో సెటిల్ అయ్యారు. తన పిల్లలు కూడా బాగా చదువుకొని ఉద్యోగాలు ఎప్పటికి చేస్తారో? ఎప్పటికి ఎదుగుతారో? అన్నదే శిరీష బాధ. శిరీష నాలుగు అక్కల చెల్లెలు, ఆఖరి చెల్లెలు ఐదవ పిల్ల అవడం వల్ల శిరీషకి చిన్నపిల్లలు, అక్కలు అప్పుడే మనుమల్ని కూడా ఎత్తారు.
***
పిల్లల్ని స్ట్రిక్ట్ గా పెంచి, పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించింది. హిమజ ఎంత చెప్పిన ఇంజనీరింగ్ చదవనంది. ఎమ్.కాం. చేసింది. టెస్ట్‌లు రాయవే అంటే రాయనంది. వంటవార్పు నేర్చుకో అంది. హిమజకి తల్లి శిరీష మనస్తత్వం నచ్చలేదు. బాల్యమంతా ఆటపాటలు లేకుండా హోమ్‍వర్క్ లతోనే సరిపోయింది. పెద్దయ్యాక వంటవార్పు అంటుంది. ‘ఇవన్నీ చిరాకు నాకు’ అని తల్లితోనే అన్నది. “అమ్మా, నీకు పిల్లల్ని పెంచడం రాదు. ఎంతసేపు డబ్బు సంపాదన తప్ప వేరే ఆలోచన లేదు” అంది.
శిరోష ఆడపిల్ల కోసం పైసా పైసా జాగ్రత్త పెట్టి ఎన్నో నగలు చేయించింది. ఇంటికి వస్తుసామాగ్రి అంతా ఏర్పాటు చేసింది. అయినా హిమజలో తల్లిపై సదభిప్రాయం లేదు. పెళ్ళి సంబంధాలు చూసి పెళ్ళి చేస్తే ఆడపిల్ల బాధ్యత తీరుతుంది.
“హిమజా! నీకు సంబంధాలు చూస్తున్నాము. ఈ తరం ఫ్యాషన్స్‌తో డ్రస్సులు కొంటాను” అంది తల్లి.
“ఇంతవరకు కాలేజీ యూనిఫారం, నీకు నచ్చిన డ్రస్సులు కొన్నావు. ఇప్పుడు సడెన్‍గా మోడ్రన్‍గా ఉండాలంటే ఎలా అలవాటు అవుతుంది?”
“ఇంజనీరింగ్ సంబంధాలు చూస్తున్నాము. వాళ్ళంతా నీకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కావాలంటున్నారు. కంప్యూటర్ సెంటర్‍లో చేర్పిస్తాను” అంటూ తండ్రి తీసుకెళ్ళి సర్టిఫికేట్ కోర్సులో చేర్పించాడు. సరే ఈ విధంగానైనా ఇంట్లోనుంచి బయటపడవచ్చు అనుకుంది హిమజ.
పదిహేను సంబంధాలు వచ్చాయి. ప్రతిసారీ ఒక క్రొత్త రకం డ్రెస్ కొనేవారు. ఏవో రకరకాల నగలు పెట్టి అలంకరించేవారు. ఏవో మాటలు మాట్లాడుకునేవారు. చివరికి వెళ్ళి ఏ విషయమో చెపుతామనేవారు. వారం అయ్యాక మామూలే. “మీ పిల్ల ఇంజనీరింగ్ చదవలేదు. అయినా పెట్టుపోతలు, మర్యాదలు బాగున్నాయని వచ్చాము. పిల్లాడు ఉద్యోగం చేసే పిల్ల కావాలనుకుంటున్నాడు” అనేవారు.
బ్యాంక్‍లో చేసేవారు బ్యాంక్‍లో చేసే అమ్మాయే కావాలని, ఎల్.ఐ.సి. వారు ఎల్.ఐ.సి ఎంప్లాయే కావాలని ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. పిల్ల మనసు గాయపడుతుంది. వస్తారు, టిఫిన్‍లు తింటారు. వంకలు పెడతారు. హిమజకి అలవాటు అయిపోయింది.
కొడుకు రితీష్ అదర్ స్టేట్‍లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ తనతో పనిచేసే పిల్లని పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. ఒక ప్రక్క ఆడపిల్లకి పెళ్ళి కుదరలేదు. మగపిల్లాడు పెళ్ళి ఖాయం చేసేసుకున్నాడు. ఆ పిల్లవాళ్ళు పెళ్ళి చేసేస్తామని తొందర చేశారు. శిరీషకి పెళ్ళి చేయడం తప్పలేదు. ఆడపిల్ల పెళ్ళి ప్రక్కన పెట్టి పిల్లాడి పెళ్ళి చేసేశారు.
ఆడపడుచు లాంఛనాలు ఘనంగా ఇచ్చారు. పిల్లాడి పెళ్ళితో శిరీషకి బెంగ ఎక్కువయ్యింది. సంబంధాలు చూస్తూనే ఉన్నారు. ఒక బిజినెస్ సంబంధం వచ్చింది. పిల్లాడు ఎమ్.కామ్ చదివాడు. విజయవాడలో స్టేషనరీ షాపు ఉంది. పైన ఇల్లు ఉంది. అన్నగారు ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళకి ఇండియాలో ఆస్తితో సంబంధం లేదు. “మీ పిల్ల మాకు నచ్చింది. ఇండియాలో ఆస్తి అంతా ఈ రెండవ పిల్లాడి పేరుమీదే ఉన్నది” అన్నారు.
హిమజ పెళ్ళిచూపులతో విసిగిపోయింది. “నాకు ఈ సంబంధం నచ్చింది. నేను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతాను” అంది. శిరీష మనస్సు చివుక్కుమంది. “నేను నీకు ఏమి లోటు చేశాను? నా ఇంటినుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావు?” అంది.
‘అయినా 28 ఏళ్ళు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో ఏ తల్లీదండ్రులు ఉంచుకోకూడదు’ అని తల్లికి తండ్రికి బిజినెస్ సంబంధం ఇష్టం లేకపోయినా పెళ్ళి కుదిర్చారు. నిశ్చితార్థం ఘనంగా ఫైవ్‍స్టార్ హోటల్‍లో చేశారు. పెళ్ళి చేసినంత ఖర్చు పెట్టారు. స్నేహితుల్ని, బంధువుల్ని పిలిచి అందరికి మంచి గిఫ్ట్‌లు ఇచ్చారు. పెళ్ళికి ఇంకా రెండునెలలు టైమ్ ఉంది.
“మాకు కట్నకానుకలు వద్దు. మీరేం పెట్టుకున్న మీ పిల్లకే కదా! పెళ్ళి ఖర్చు కూడా మీరు సగం మేము సగం పెట్టుకుందాము. నిశ్చితార్థంతో పిల్ల మా పిల్ల అయిపోయింది” అని కలుపుగోలుగా వియ్యపురాలు అంది. “పిల్లాడికి పిల్ల అవసరం ఎంతో ఉంది. మగమహారాజు అని అనుకోకూడదు. చాలామంది పిల్లకి పెళ్ళి అవసరం అంటారు. ఒకరికి ఒకరు అవసరమే. ఇలా ఆలోచిస్తే కుటుంబాల్లో సమస్యే ఉండదు. అంతా ఆడపెళ్ళివాళ్ళే పెట్టుకోవాలి అంటూ మగపెళ్ళివాళ్ళు దర్జా మెయింటెయిన్ చేస్తారు. అమ్మాయి, అబ్బాయి తేడా లేకుండా ఈ పెళ్ళి చేసుకుంటే మంచిది” అని అత్తగారు అన్నారు.
వియ్యపురాలు మాటలకి శిరీష ఆశ్చర్యపోయింది. తల్లిగా తన ఆలోచన వేరు. హిమజ తల్లివంక గర్వంగా చూసింది. ఉద్యోగం చేసే తల్లికి, ఉద్యోగం చెయ్యని అత్తగారు బుద్ది చెప్పిందని అనుకుంది. హిమజ చాలా అదృష్టవంతురాలని పెద్దమ్మలు చక్కగా సమర్థించారు. హిమజ ఆనందపడింది. శిరీషకి మాత్రం కూతురిపై కోపం, అసంతృప్తి ఉన్నాయి.
పెళ్ళి అత్యంత ఘనంగా చేసి సారెతో అత్తారింటికి పంపారు. మళ్ళీ అట్లతద్ది తీర్పులకే హిమజ వచ్చింది. మళ్ళీ బంధువుల సందడి. నలుగురితో చుట్టంచూపుగా వచ్చి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోయింది.
కాలగమనంలో హిమజ గర్భవతి అయింది. తొమ్మిదవ నెలవరకూ పుట్టింటికి రానంది. శిరీష కొంచెం బాధపడింది. కాని తనకి అత్తింటి సుఖం పుట్టింట లేదంది. ఎంతోకాలంగా ఉన్న కోరిక సంగీతం నేర్చుకోవాలని, ఆమెకి అత్తింటివారు సంగీతం నేర్పించారు. చక్కగా టైలరింగ్ నేర్చుకుంది. బట్టలన్నీ కుడుతుంది.
తొమ్మిదవ నెలలో అత్తింట్లో సీమంతం చేసి హిమజని తెచ్చారు. డెలివరీ అయ్యి నెల వెళ్ళకుండానే హిమజ అత్తింటికి వెళ్ళిపోయింది. ‘అమ్మా! మా అత్తగారు నన్ను ఎంతో ప్రేమగా చూస్తారం’టూ బొమ్మసారెతో వెళ్ళింది. ఎప్పుడైనా శిరోష ఫోన్ చేస్తే “మా పిల్లాడి పనిలో ఉన్నాను, నేను తర్వాత ఫోన్ చేస్తాను” అని ఫోన్ పెట్టేస్తుంది. తను జీవితంలో పొందిన అసంతృప్తి తన పిల్లలకు ఉండకూడదన్నదే హిమజ ధ్యేయం. ఈ తరం పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ అంతంత మాత్రమే! మాతృదేవోభవ!
శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి గారు సంగీత సాహిత్యాలలో విశేషమైన ప్రజ్ఞ కలవారు. వీణా విద్వాంసురాలు. 11 వరల్డ్ రికార్డ్ల గ్రహీత. 300కు పైగా కథలు, 2500 పైగా కవితలు, 18 నవలలు, వ్యాసాలు 2000 పైగా, వంటలు 1500 వ్రాసారు. 6000కి పైగా వివిధ అంశాల ప్రచురణ. వారికి 126 పైగా బిరుదులు పురస్కారాలు లభించాయి. అనేక అవధానాలలో పాల్గొని వర్ణన, సమస్య, దత్తపది అంశాలు అడిగారు. ఎన్నో సభలలో కర్ణాటక సంగీతం, శ్రీ అన్నమయ్య శ్రీ వెంటేశ్వరస్వామి కీర్తనలు, లలిత సంగీతం ఆలపించారు. ప్రముఖ వ్యక్తులను, మహిళలను, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు. తెలుగు సాహితీ వైభవంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు.
అంతర్జాల కవి సమ్మేళనాలు 1800 పైగా వీణ కచ్చేరీలు అంతర్జాలంలో 68 పై గా సూర్య వర్ణం నూతన లఘు ప్రక్రియలో 150 కవులు పాల్గొని విజయవంతం చేశారు.
మోడరన్ టైలరింగ్ బుక్, సంగీత స్వర రవళి బుక్ వెలువడినాయి. వీరి నవలలు కథలు, 516 కవితలపై విద్యార్థులు పరిశోధన చేస్తున్నారు. ‘ఉదయం’ ద్వారా వీరి వంటల వీడియోలు వస్తున్నాయి.