Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మానవ సంబంధాలను విశ్లేషణాత్మకంగా చర్చించిన పాట ‘హోల్డింగ్ ఆన్ టు నథింగ్’

[పోర్టర్ వాగనర్, డాలీ పార్టన్ పాడిన ‘హోల్డింగ్ ఆన్ టు నథింగ్’ అనే పాటను విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

పోర్టర్ వాగనర్, డాలీ పార్టన్‌లు కంట్రీ మ్యూజిక్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ జంటలలో ఒకటిగా పేరు పొందారు. వీరి అనుబంధం చాలా ఆసక్తికరంగా సాగింది. కంట్రీ మ్యూజిక్ ప్రపంచంలో అప్పటికే ప్రధాన స్టార్‌గా పేరు పొందిన పోర్టర్ వాగనర్, 1967లో ‘ది పోర్టర్ వాగనర్ షో’ (టెలివిజన్) ద్వారా డాలీ పార్టన్‌ను జాతీయ ప్రేక్షకులకు మొదటిసారి పరిచయం చేసారు. అప్పటి దాకా గాయని నార్మా జీన్ ఆ స్థానంలో ఉండేది. మొదట దీనికి ప్రేక్షకుల నుండి ప్రారంభ ప్రతిఘటన ఎదుర్కున్నా, ఈ జంట త్వరగా కంట్రీ మ్యూజిక్ ప్రపంచంలో పవర్‌హౌస్ జంటగా ఎదిగింది. 1974 దాకా ఇద్దరూ కలిసే ఈ షోలో పాటలు పాడేవారు. 1968-1980 మధ్య, వారిద్దరూ కలిసి 13 స్టూడియో ఆల్బమ్‌లను విడుదల చేశారు, వాటిలో ‘జస్ట్ బిట్వీన్ యు అండ్ మీ’, ‘ప్లీజ్ డోంట్ స్టాప్ లవింగ్ మీ’ వంటి హిట్‌లు ఉన్నాయి.

వాగనర్, డాలీ పార్టన్ ప్రారంభ సోలో రికార్డ్‌ల నిర్మాత కూడా. డాలి ‘మై ఫేవరెట్ సాంగ్ రైటర్, పోర్టర్ వాగనర్’ (1972) అనే ఆల్బమ్‌ను వాగనర్‌కు అంకితం చేసి అతనిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. కాని 1974 నాటికి, పార్టన్ సోలో ఆర్టిస్ట్‌గా ఎదగాలని కోరుకుంది. వాగనర్ పర్యవేక్షణలో తాను సొంతంగా ఎదగలేనని భావించి అతన్ని వీడి సొంతంగా పాటలు పాడాలని నిశ్చయించుకుంది. వాగనర్ ఆమెను విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవడంతో, ఆమె అతనికి ‘వీడ్కోలు’గా ‘ఐ విల్ ఆల్వేస్ లవ్ యు’ అనే పాటను రాసి పాడింది. ఇది ఇప్పటికీ కంట్రీ గీతాలలో ఎందరో గాయకులు విడిగా రికార్డ్ చేయడానికి ఇష్టపడే అపురూపమైన గీతం.

ఈ వృత్తిపరమైన విరామం తర్వాత విడిపోయిన ఆ ఇద్దరి మధ్య $1 మిలియన్ దావా సాగింది. వాగనర్ పార్టన్‌పై ఒప్పంద ఉల్లంఘనకు దావా వేసి, ఆమె రాయల్టీలలో 15% కోరాడు. చివరికి ఇద్దరూ కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నారు. చట్టపరమైన ఘర్షణ ఉన్నప్పటికీ, 1980లో పోర్టర్ & డాలీ అనే తుది సహకార ఆల్బమ్‌ను ఇద్దరూ కలిసే విడుదల చేశారు. 1980ల చివరలో ఇద్దరూ మళ్లీ రాజీ పడ్డారు. పార్టన్, వేగనర్ కష్టాలలో ఉన్నప్పుడు అతని 200 పాటలను తిరిగి కొనుగోలు చేసి, ఆర్థిక ఇబ్బందుల నుండి అతను బయటపడటానికి సహాయం చేసింది. 2007లో వేగనర్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించినప్పుడు ఆ చివరి క్షణాలలో డాలీ అతని పక్కనే ఉంది. అతని మరణం తర్వాత, తనకు మొదట పెద్ద బ్రేక్ ఇచ్చిన ఆత్మీయుడి గౌరవార్థం పార్టన్ ఒక స్మారక కచేరీని పెద్ద ఎత్తున నిర్వహించింది.

ఈ ఇద్దరు కళాకారుల మధ్య ప్రేమ, కోపం, పట్టుదల, అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు ఇచ్చుకున్న పరస్పర సహకారం కళాకారుల మధ్య నడిచే భావావేశాలకు నిదర్శనం. ఒకరినొకరు అభిమానించుకుంటూ, ఒకరి ప్రభావానికి మరొకరు లోనవుతూ, ఒకరినొకరు విపరీతంగా ప్రేమించుకుంటూ, కొన్నిసార్లు కలిసి ఉండడానికి ఇష్టపడుతూ మరి కొన్నిసార్లు ఒకరి నీడ నుండి మరొకరు తప్పించుకుంటూ తమ సొంత కళాత్మక విజయాల కోసం అర్రులు చాస్తూ జీవించడం ఇద్దరు సమఉజ్జీల మధ్య నడిచే విచిత్రానుభవాల మిశ్రమ అనుభవం. అదే వింత అనుబంధం ఈ ఇద్దరు కళాకారుల నడుమ కడదాకా సాగింది.

ఈ ఇద్దరూ కలిసి ఎన్నో అద్భుతమైన డ్యూయెట్లు పాడారు. వాటిలో ఒకటిని ఎంచుకోవడం కష్టమే అయినా, ‘హోల్డింగ్ ఆన్ టు నథింగ్’ అనే ఈ పాటను ప్రత్యేకంగా ప్రస్తావించుకుందాం. ఇద్దరు వ్యక్తులు ప్రేమగా కలిసి ఉండడం ఎంత ఆనందకరంగా ఉంటుందో, పరస్పర ప్రేమ లేనప్పుడు నటిస్తూ, కలిసి ఒకే చూరు క్రింద ఉండడం అంత కష్టంగానూ ఉంటుంది. ఆ నటనలోని ఇబ్బందిని ప్రస్తావించే గీతం ఇది. ఏదోలా కలిసి ఉండమని కాకుండా, ప్రేమ లేకపోతే గౌరవంగా విడిపోవడంలోని అవసరాన్ని విడమరిచి చెప్పే గీతం ఇది.

ఈ పాట ‘జస్ట్ ది టూ ఆఫ్ అస్’ అనే ఆల్బం కోసం పోర్టర్ వాగనర్, డాలీ పార్టన్ గానం చేసారు. ఇది వీరి రెండవ సహకార స్టూడియో ఆల్బమ్. దీనిని సెప్టెంబర్ 9, 1968న RCA విక్టర్ విడుదల చేశారు. ఈ ఆల్బమ్‌ను బాబ్ ఫెర్గూసన్ నిర్మించారు. ఇది బిల్‌బోర్డ్ టాప్ కంట్రీ ఆల్బమ్స్ చార్ట్‌లో ఐదవ స్థానంలోనూ, బిల్‌బోర్డ్ 200 చార్ట్‌లో 184వ స్థానంలోనూ నిలిచింది. ఈ ఆల్బమ్ మూడు సింగిల్స్‌కు దారితీసింది. ‘హోల్డింగ్ ఆన్ టు నథింగ్’, ‘వి విల్ గెట్ అహెడ్ సమ్‌డే’ బిల్‌బోర్డ్ హాట్ కంట్రీ సాంగ్స్ చార్ట్‌లో టాప్ టెన్ హిట్‌లుగా ఏడు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మూడవ సింగిల్, ‘జీనీస్ అఫ్రైడ్ ఆఫ్ ది డార్క్’, 51వ స్థానంలో నిలిచింది.

ఈ ఆల్బమ్ మొదటి సింగిల్, ‘హోల్డింగ్ ఆన్ టు నథింగ్’, మార్చి 1968లో విడుదలై, ఏప్రిల్ 13న బిల్‌బోర్డ్ హాట్ కంట్రీ సాంగ్స్ చార్ట్‌లో 60వ స్థానంలో నిలిచింది. ఇది జూన్ 1న చార్ట్‌లో ఏడవ స్థానంలో నిలిచింది. ఇది 16 వారాల పాటు చార్ట్‌లో ఉంది. కెనడాలో RPM కంట్రీ సింగిల్స్ చార్ట్‌లోనూ ఈ పాట 17వ స్థానంలో నిలిచింది. ఈ ఆల్బమ్ అక్టోబర్ 5, 1968న బిల్‌బోర్డ్ టాప్ కంట్రీ ఆల్బమ్స్ చార్టులో 41వ స్థానంలో నిలిచింది.

We’re holding on to nothing left to hold onto (both)

(ఏమీ మిగలని శూన్యాన్ని పట్టుకుని నిలుచున్నాం ఇద్దరం)

ఈ వాక్యంతోనే మొత్తం పాట సారాన్ని వ్యక్తీకరిస్తారు గాయకులు. నిజానికి ఈ విషయంలో వారిద్దరికీ ఏ అభిప్రాయాల భేదాలు లేవు. వారి మధ్య ప్రేమ లేదు. అసలు ఏదీ లేదు. కాని ప్రపంచం కోసం ఒకటిగా జీవిస్తున్నారు. తాము శూన్యాన్ని పట్టుకుని వేళ్ళాడుతూ నిజాన్ని దాచిపెట్టీ చుట్టూ ఉన్న అందరినీ భ్రమలో ఉంచి కలిసి జీవించడం నిజానికి ఏ అనుబంధంలో నయినా అత్యంత విషాదకర స్థితి.

I’m so tired of holding on to nothin’
The years have shown no kindness
For the hard times we’ve been through

(ఏమీ లేని శూన్యాన్ని పట్టుకుని వేలాడుతూ నేను చాలా అలసిపోయాను. గడిచిపోయిన సంవత్సరాలు మనం దాటిన కష్ట సమయాలలో మనపై ఎలాంటి దయను చూపించలేకపోయాయి)

అతనిలో ఆమెతో లేని అనుబంధాన్ని ప్రేమని నటిస్తూ జీవించడంలో చాలా అలసట చేరింది. ఇద్దరి మధ్య ఎన్నో కష్ట సమయాలు వచ్చి వెళ్లాయి. అవి వారి మధ్య దూరం పెంచాయి తప్ప ఏ మాత్రం ప్రేమను వారిలో పెంచలేకపోయాయి. ఆ పెరిగిన దూరాన్ని అనుభవిస్తూనే అదేమీ లేనట్లుగా నటించే శక్తి ఇక అతనిలో లేకుండా పోయింది.

We’ve squeezed the life from every dream
And still go right on bluffin’
With really nothin’ left to hold onto

(ప్రతి కల నుండి జీవితాన్ని పిండేసుకుని ఇంకా అబద్దాలు చెబుతూ గడుపుతున్నాం. శూన్యాన్ని పట్టుకుని వేళ్లాడుతూ నటిస్తున్నాం)

అతని మాటలను ఆమె అంగీకరిస్తుంది. తమ మధ్య జీవితంలో ఎంతో దూరం పెరిగిందని, తమ మధ్య నిజానికీ ఏ అనుబంధమూ లేకుండా పోయిందని, ఒకరినొకరు, తమ చుట్టూ ఉన్నవారిని తమ మధ్య అంతా బాగుందనే ప్రలోభంలోకి నెడ్తూ జీవించడం నరకప్రాయంగా ఉందని ఆమె ఒప్పుకుంటుంది.

Oh why do we keep holding on with nothing left to hold onto
Let’s be honest with each other
That’s the least that we can do
I feel guilty when they envy me and you
We’re holding on with nothing left to hold onto (both)

(మనం ఎందుకు ఈ శూన్యానికి వేలాడుతూ కలిసి ఉండాలి? ఒకరితో ఒకరం నిజాయితీగా వ్యవహరిద్దాం. కనీసం అదొక్కటయినా ఒకరికోసం ఒకరం చేసుకోవచ్చు కదా. లేని ప్రేమకు వేళ్లాడుతూ శూన్యాన్ని పట్టుకుని జీవిస్తున్న మనల్ని చూసి వాళ్లంతా అసూయపడుతుంటే అపరాధభావంతో కుంచించుకుపోతున్నాను.)

ఒకరితో ఒకరు తమ ఇబ్బందిని చెప్పుకున్నాక ఇద్దరూ మనసు విప్పి తమ మధ్య పెరిగిన దూరాన్ని, తగ్గిన ప్రేమను, మాసిపోయిన అనుబంధాన్ని అంగీకరిస్తూ తామిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నట్లు బయట ప్రపంచం భావించి తమను చూసి అసూయపడుతూ ఉంటే నిజాన్ని బైటపెట్టలేక, వారి అసూయకు అనుగుణంగా నటించలేక తమలో పెరుగుతున్న అపరాధభావాన్ని భరించలేకపోతున్నారు. నిజానికి అలాంటి నటన లోలోన మనుష్యులను తినేస్తూ ఉంటుంది. తమలో లేని ప్రేమను ప్రపంచం పొగుడుతుంటే అందరినీ మోసం చేస్తున్నందుకు సిగ్గుతో ఆ జంట కుంచించుకుపోతుంది.

We were young and foolishly mistaken
Victims of a passion much too strong to be denied (he)
With only tears to show for all the years that we’ve been fakin’
God only knows how long how hard we’ve tried

(అప్పుడు మనం చిన్నవాళ్లం, మూర్ఖత్వంలో తప్పు చేశాం. ఆకర్షణలో పడి కొట్టుకుపోతూ దాన్ని తప్పించుకోలేకపోయాం. మోసంతో నిండిన మన గడిచిన సంవత్సరాలు మిగిల్చిన కన్నీళ్ళ నడుమ మనం ఎంతగా కలిసి ఉండడానికి కష్టపడ్డామో ఆ భగవంతునికే తెలుసు)

అతను తమ వివాహం అయిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ, తమ మధ్య మొలకెత్తిన ఆకర్షణ మాయలో పడి వివాహంతో ఒకటయి తాము మూర్ఖంగా తెలియని వయసులో తప్పు చేసామని  అంగీకరిస్తున్నాడు. చిన్నతనంలో అకర్షణకు ప్రేమకు మధ్య తేడా అర్థం కాక, ఎవరు చెప్పినా వినక ఒకటిగా జీవితాన్ని మొదలుపెట్టి ఆ తరువాత నిజం గ్రహింపుకొచ్చినా చేసిన తప్పును ఒప్పుకోలేక, అందరి ముందు పలుచన కాలేక ఎందరో రోజులు నిస్సారంగా బైట ప్రపంచానికి తమ మధ్య పెరుగుతున్న దూరం తెలియనివ్వకుండా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ జీవితాలను గడిపేస్తారు. ఈ జంట అదే చేస్తుంది. తాము పొరపాటు చేసామని అతను ఆమెకు చెప్తున్నాడు. దానికి జవాబుగా ఆమె ఇన్ని సంవత్సరాల నటనలో తాము నిజంగా కలిసి ఉండాలని, ఒకరికొకరు దగ్గరవడానికి ప్రయత్నించామని, తిరిగి ఆ పాత ప్రేమను అందుకోవడానికి ఎంతలా కష్టపడ్డామో ఆ భగవంతునికే తెలుసని కాని అది అసాధ్యం అని తేలిపోయిందని నిరాశగా బదులిస్తూ తన ఓటమిని అంగీకరిస్తుంది.

Oh why do we keep holding on with nothing left to hold onto
Let’s be honest with each other
That’s the least that we can do
I feel guilty when they envy me and you
We’re holding on with nothing left to hold onto (both)
We’re holding on with nothing left to hold onto

(మనం ఎందుకు ఈ శూన్యానికి వేలాడుతూ కలిసి ఉండాలి? ఒకరితో ఒకరం నిజాయితీగా వ్యవహరిద్దాం. కనీసం అదొక్కటయినా ఒకరికోసం ఒకరం చేసుకోవచ్చు కదా. లేని ప్రేమకు వేళ్లాడుతూ శూన్యాన్ని పట్టుకుని జీవిస్తున్న మనల్ని చూసి వాళ్లంతా అసూయపడుతుంటే అపరాధభావంతో కుంచించుకుపోతున్నాను.)

ఆ జంట కలిసి కూర్చుని ఇక ఈ నటన తాము సాగించలేమని, విడిపోవడం తమ ఇద్దరికీ అవసరం అని నిర్ణయించుకోవడం ఈ పాట సారం. ఇందులో కష్టపడి కలిసి ఉండాలని ప్రయత్నించి ఓడిపోయిన అసహాయత ఉంది. తమ ఓటమిని ఒప్పుకుంటున్న నిజాయితీ ఉంది. తాము తప్పు చేశామని చిన్నతనంలో తప్పటడుగు వేశామని అహం చంపుకుని అంగీకరించే పరిపక్వత కూడా కనిపిస్తుంది.

కాలంతో పాటు కొన్ని అనుబంధాలు పలచన అయిపోతాయి. బలవంతంగా కట్టిపడేసినట్లు జీవిస్తే ఆ ఇద్దరూ ఒకరికొకరు శతృవులుగా మారి తమకీ, తమ చుట్టూ ఉన్నవారికీ మనశ్శాంతి లేకుండా ప్రవర్తిస్తారు. దానికన్నా విడిపోయి స్నేహితులుగా మిగిలి ఉండడం ఉత్తమమనే భావాన్ని ఈ గీతం సూచిస్తుంది. ప్రేమలేని అనుబంధాలలో నటన పెరిగిపోయి అది వారి వ్యక్తిత్వావాలకు హానికరంగా మారుతుందని గ్రహించడానికి పరిపక్వత అవసరం. ఆ స్థితికి చేరిన ఓ జంట స్నేహపూర్వకంగా తమ మధ్య పెరిగిన అగాధానికి మిగిలిన తమ జీవితాలను బలి చేయకుండా జీవితంలో సరైన నిర్ణయంతో తమను తాము రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం ఈ పాటలో నిజాయితీగా ధ్వనిస్తుంది.

ఆనాటి కంట్రీ గీతాలు మానవ సంబంధాలను ఎంత లోతుగా విశ్లేషణాత్మకంగా చర్చించేవో చెప్పడానికి ఈ పాట ఉదాహరణగా నిలుస్తుంది.

~

ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
(https://youtu.be/YwPL7iWISgI?si=1X5h4NlvKmtqx2Y_ )

Exit mobile version