[హోర్నాడు లోని అన్నపూర్ణా దేవి ఆలయం సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]
సహ్యాద్రి పర్వతశ్రేణుల నడుమ ప్రకృతి అందాల మధ్య కొలువుతీరి ఉన్న ఈ అన్నపూర్ణాదేవి ఆలయం, భద్రానది సమీపంలో, కర్ణాటకలో, హోర్నాడులో దట్టమైన అడవుల మధ్య, ఉంటుంది. ఒకవైపు ఆలయం, దట్టమైన వృక్షాలతో నిండిన కొండలు ఉంటే, మరొకవైపు పచ్చని చెట్లతో కూడుకున్న లోయ ఉంటుంది. చిక్ మగళూరుకు 100 కి.మీ., కలసకు 10 కి.మీ. దూరంలో ఉంటుంది.
శివుడు లోకంలో ఉన్నదంతా మాయ అని చెప్పగా, ఆహారం మాయ కాదని నిరూపించడానికి అన్నపూర్ణమ్మ మాయమైపోతే, ముల్లోకాలు తల్లడిల్లిపోతే అప్పుడు అన్నపూర్ణమ్మ కరుణించి ప్రత్యక్షమైందని, పురాణ కథనం. మూల విగ్రహం అగస్త్యమహర్షి ప్రతిష్ఠిస్తే, ప్రస్తుతమున్న అన్నపూర్ణేశ్వరీ దేవి బంగారు విగ్రహాన్ని 1973లో ప్రతిష్ఠించారు.
ఆలయం రాతి కట్టడం కాదు. సిమెంటు ఇటుకలతో కట్టబడింది. రాజగోపురం లేదు. నాలుగు స్తంభాలపై ఉన్న ఆలయ ప్రవేశమంటపం చిన్నగా ఉండి, నీలం రంగుతో పెయింట్ చేయబడి ఉంది. దానిపై అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి విగ్రహాలున్నాయి. అక్కడనుండి 40- 50 మెట్లు ఎక్కితే హాలులా కనిపిస్తుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు, మనకు ఎడం చేతివైపు క్యూ లైన్లు కనిపిస్తాయి. అన్నప్రసాదానికి క్యూలైన్లట అవి. ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కానీ మూడవ అంతస్తులో ఉంటుంది.
గర్భగుడి, ముఖమంటప ప్రవేశ ద్వారాలు, తలుపులే కాకుండా, వాటికిరువైపులా ఉన్న ద్వారాలు, తలుపులు కూడా వెండి తొడుగుతో చేయబడ్డాయి. వాటిపై అష్టలక్ష్మిలను, వాహనాలను మలిచారు. ముఖమంటపం మధ్యలో ఇరు ప్రక్కలా మూడు వరుసల ఇత్తడి స్టాండులపై దీపాలంకరణకు వీలుగా ప్రమిదలను ఏర్పాటు చేశారు.
అమ్మవారి మూర్తి, ఐదారు అడుగుల ఎత్తుతో, బంగారంతో చేయబడి చక్కని కళ్ళతో, చూస్తుంటే మరీ మరీ చూడాలనిపించే అంత సౌందర్యంతో అలరారుతుంది. అన్నపూర్ణమ్మ చతుర్భుజి. పై రెండు చేతుల్లో శంఖు, చక్రాలు, క్రింద చేతులు అభయ వరద ముద్రలతో ఉన్నాయి. క్రింద సింహ వాహనం కనిపిస్తుంది. అమ్మవారికి వేసిన ఆభరణాలలో మూడు అంగుళాల వ్యాసమున్న మరకతమణి దూరం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మవారున్న పీఠం చుట్టూ ఏనుగులు, కమలాలు బంగారంతో చేయబడి ఉన్నాయి. ఆ క్రింద గాయత్రి అమ్మవారుంటారు. గర్భగుడిలోనే అమ్మవారికి కుడివైపు ఉద్భవ గణపతి ఎత్తైన పీఠం మీద ఉంటారు.
oplus_6291490
ఇక్కడ అమ్మవారికి బియ్యాన్ని సమర్పిస్తారు. ప్రక్కనున్న యాగశాలలో కుంకుమార్చన, యజ్ఞాలు చేస్తారు. మే నెలలో రథోత్సవం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజును చాలా వైభవంగా జరుపుతారిక్కడ. దర్శనానికి స్త్రీలు సంప్రదాయ దుస్తులు ధరించాలి. పురుషులు చొక్కాలు తీసి ఉత్తరీయాన్ని కప్పుకోవాలి.
గర్భగుడి శిఖరం బంగారు రేకుతో తాపడం చేయబడి ఉంది. గోపురం ముందు వైపు ఏనుగులు, వెనకవైపు ఒంటెలు, వాటి పైన నెమలులు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అన్నపూర్ణాదేవి గర్భగుడి చుట్టూ పాము చుట్టుకుని ఉన్నట్టుగా తల వెనుక భాగాన ఉండేటట్టుగా గర్భగుడిని తీర్చిదిద్దారు. ఇంకా ముందుకొస్తే నవగ్రహం మంటపం, అక్కడే రథం కూడా ఉంటుంది.
దర్శనం చేసుకుని బయటికి వస్తే అక్కడ పెద్ద బేసిన్ నిండా బ్యాంగిల్స్ ఉన్నాయి. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోవచ్చు.
మేము ఉడిపి నుండి హోర్నాడు వెళ్ళాం. త్రోవంత ఘాటు రోడ్డు. దట్టమైన అడవుల మధ్య ప్రయాణం. మధ్య మధ్యలో జామ తోటలు, మల్లె పూల తోటలు, మార్గానికిరువైపులా దట్టమైన వృక్షాలు, ఎత్తైన కొండలు, కొన్నిచోట్ల లోయలు, మధ్య మధ్యలో నదీనదాలు, సన్నగా పొడుగ్గా ఉన్న పామాయిల్ తోటలు, వాటి మధ్య కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, అక్కడక్కడ ఆగుపిస్తున్న చిన్న చిన్న గ్రామాలు, ఆకులే పువ్వులంత అందంగా కనిపించే కొన్ని చెట్లు, ఒంపు సొంపుల రహదారులు, త్రోవ పూల మొక్కలతో ముఖ్యంగా మందార మొక్కలతో కూడి ఉంది.. మొత్తానికి ప్రయాణమాసాంతం ఆహ్లాదకరంగా సాగింది.
జాలువారుతున్న జలపాతాలతో, దట్టమైన ఆకుపచ్చని వృక్షాలతో కప్పబడిన కొండలతో, అలుముకుంటున్న మంచు తెరలతో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మధ్య కాలంలో ప్రకృతి రమణీయంగా ఉంటుందిక్కడ.
దర్శనానికి టికెట్ లేదు. మొబైల్ ఫోన్లను ఎలోవ్ చేస్తున్నారు. కానీ, లోపల ఫోటోలు తీయకూడదు. యాత్రికులకు దేవస్థానం వారి తుంగ, భద్ర కాటేజీలతో పాటు వేరొక కాటేజీ కూడా ఉంటుంది. చుట్టుపక్కల ప్రైవేటు వసతులు కూడా చాలా ఉన్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో వెళ్లినా ఎండ ఎక్కువగానే ఉంది. భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. అయినా చక్కని దర్శనం అయింది. మనసు నిండా మధురానుభూతులను మూట కట్టుకొని అక్కడనుండి కలసకు కలసేశ్వరుని దర్శనార్థం ప్రయాణమయ్యాం.
కలశేశ్వర స్వామి దేవస్థానం- కలశ
దక్షిణ కాశీగా పిలవబడే ఈ దేవస్థానం కర్ణాటకలోని చిక్ మగళూరు జిల్లాలో (100 కిలోమీటర్లు దూరంలో), ముడిగెరె తాలూకాలో, కలశ గ్రామంలో, భద్ర నది ఒడ్డున, సహ్యాద్రి పర్వతాల నడుమ, హోర్నాడుకు పది కిలోమీటర్ల దూరంలో, ఎత్తైన కొండమీద ఉంటుంది. చుట్టూ దట్టమైన చెట్లతో కూడుకొని ఉన్న పర్వతశ్రేణులు, కొండల మధ్య గలగల పారుతున్న భద్రానది.. ప్రకృతి మనోహరంగా ఉంటుంది ఈ ప్రాంతంలో.
రోడ్డు ప్రక్కనే ఉంటుంది దేవస్థానం. రోడ్డుపై నుండి సుమారు 80- 100 వరకు ఉన్న విశాలమైన మెట్లెక్కి వెళ్తే, ఎదురుగా, జటాజూటము నుండి ఉరుకుతున్న గంగాదేవిని, పట్టుకొని ఉన్న శివుని విగ్రహం కనిపిస్తుంది. మెట్లకు ఎడమవైపు అందమైన పూలవనం, కుడివైపు దేవస్థానపు బిల్డింగ్ ఉంటుంది. మెట్లెక్కి వెళ్తే ముందు చిన్న వినాయక ఉపాలయం, తరువాత కొంచెం పెద్దదిగా ఉన్న ఇంకో వినాయక ఆలయం కనిపిస్తాయి.
ఈ కలశేశ్వర ఆలయ ఆవిర్భావానికి, శివపార్వతుల కళ్యాణానికి దగ్గర సంబంధముంది. అదెలాగంటే, కైలాస పర్వతంపై గిరిజా కళ్యాణం జరుగుతున్నప్పుడు, మునులందరూ ఆ కళ్యాణం చూడడానికి వెళ్లగా, ఆ బరువుకు భూమి ఉత్తరం వైపుకు కుంగిపోతుంటే, శివుడు, అగస్త్య మహర్షిని పిలిచి, దక్షిణదిక్కుగా వెళ్లి, అక్కడ నివాసం ఏర్పరచుకొని భూమి సమతుల్యాన్ని కాపాడమని చెప్పారట. గిరిజా కళ్యాణం చూడకుండా వెళ్లడానికి, అగస్త్య మహర్షి సంశయిస్తుంటే ఎక్కడున్నా గిరిజా కళ్యాణం అక్కడ నుండే మహర్షికి కనిపించేలా అనుగ్రహిస్తే, మహర్షి ఈ కలశలో నివాసమేర్పరచుకొని, కలశం నుండి ఉద్భవించిన స్వయంభు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారని పురాణ కథనం.
అందుకని ఇక్కడ కార్తీకమాస శుద్ధ పౌర్ణమినాడు గిరిజా కళ్యాణాన్ని అతి వైభవంగా జరుపుతారు.
ఈ కలశలో పంచ తీర్థాలుంటాయి. అవి వశిష్ట, నాగ, కోటి, రుద్ర, అంబ తీర్థాలు.
మెట్లెక్కి కారిడారులో ఎడమ వైపు వెళ్తే, అతి విశాలమైన ప్రాంగణంలో కొబ్బరి చెట్ల నడుమ, ముందుగా అమ్మవారి (సర్వాంగ సుందరి) ఆలయం, తర్వాత, కలశేశ్వరుని ఆలయం కనిపిస్తాయి. ఆలయాల గోడలపై పురాణ ఘట్టాలను ప్రతిబింబిస్తున్న కుడ్య చిత్రాలు వరుసగా కనిపిస్తాయి. ఆలయ పైకప్పుపై కూడా అందమైన కుడ్య చిత్రాలున్నాయి. హోయసల వాస్తు శైలిలో నిర్మాణాలున్నాయి.
పేరుకు తగినట్లుగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో, మనసుతీరా దర్శనాలు చేసుకున్నాం.
కలశేశ్వర శివలింగంపై, బంగారంతో చేసిన శివుని ముఖరూపంతో అలంకరించారు. ఆలయం ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం దాని ముందు, అంతే ఎత్తుతో ఉన్న దీపస్తంభమున్నాయి.
వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, అగస్త్య మహర్షి ఆలయాలున్నాయి. ఆలయ ప్రాంగణంలోనే స్పెషల్ టికెట్లను, పూజా ద్రవ్యాలను, ప్రసాదాలను అమ్మే షాపులున్నాయి. ఒక ప్రక్కగా యాగశాల కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే దేవనాగరి లిపిలో శాసనాలున్న రాతి పలకలున్నాయి.
ఈ ఆలయంలో చాలా ఉపాలయాలున్నాయి. మేము మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్లేసరికి చాలా ఉపాలయాలు మూసి ఉన్నాయి.
ఈ ప్రాంగణం నుండి చూస్తుంటే, చుట్టూ ఉన్న ఊరు, దాని చుట్టూ దట్టంగా అలుముకున్న వృక్షాలు, ఆపైన వరుసల్లో కనిపిస్తున్న నీలిరంగు కొండలు, అద్భుతంగా కనిపిస్తుంది. నవంబర్ జనవరి మధ్య వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఒకరోజు మనమిక్కడ ఉండగలిగితే, గ్రామానికి దగ్గరలోనే ఉన్న రోబస్ట్ కాఫీ తోటలను, ఆ కాంపౌండ్‌లో ఉన్న విఘ్నేశ్వర ఆలయాన్ని, కుద్రేముఖ్ నేషనల్ పార్కును, భద్ర నదిపై ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జిను, టీ ఎస్టేట్లను, క్యాతనమక్కి హిల్ స్టేషనును చూడవచ్చు.
చుట్టూ దట్టమైన చెట్లతో, నీలి కొండల నడుమనున్న, రాళ్ల మధ్య ప్రవహిస్తున్న నది అందాలు మనల్ని ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. అక్టోబర్ జనవరి మధ్య వచ్చి ఒకరోజు గడపగలిగితే ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు.

