Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హోసూరు ఆంధ్ర సాంస్కృతిక సమితి అన్నమయ్య జయంతి ఉత్సవాలపై నివేదిక

అలరించిన అన్నమయ్య కీర్తనలు – ఆకట్టుకున్న హరికథా కథనం

తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా హోసూరు లోని ఆంధ్ర సాంస్కృతిక సమితి భవనంలో 27-7-25న జరిగిన అన్నమయ్య జయంతి ఉత్సవాలు శ్రోతలకు వీనులవిందు చేసింది. తాళ్ళపాక అన్నమయ్య 616 వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని అన్నమయ్య గీతాలాపన, హరికథా కార్యక్రమం నిర్వహించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (తి.తి.దే) అన్నమాచార్య ప్రాజెక్టు  ద్వారా గాయకులు లోకానాథ్ రెడ్డి, శ్రీమతి కవితలు అన్నమయ్య ‘సప్తగిరి సంకీర్తనల’ను హృద్యంగా ఆలాపన చేశారు.

అనంతరం రమేష్ బాబు ‘మోహినీ భస్మాసుర’ హరికథా కార్యక్రమం ప్రేక్షకుల హృదయాలను మైమరపించింది. తదనంతరం స్థానిక కళాకారుల ద్వారా ‘భక్తి గీతాలాపన’ జరిగింది. భోజన విరామం తర్వాత శ్రీమతి నాగమణి  చేసిన ‘కుచేలోపాఖ్యానం’ హరికథ సభను రంజిల్లజేసింది.

సాయంత్రం 6:30 గంటలకు అదే అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులచే జరిగిన ‘సంగీత విభావరి’ కార్యక్రమాన్ని నగర డిప్యూటీ మేయర్ ఆనందయ్య ప్రారంభించారు. అజరామరమైన సంగీత, సాహిత్యాలను నలుదిశలా వ్యాపించడానికి కృషి చేస్తున్న సమితి కార్యవర్గ నిర్వాహానికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ప్రజలు కూడా విరివిగా ఇటువంటి కార్యక్రమాలకు హాజరై మన భాషను, సంస్కృతిని రక్షించుకోవాలని కోరారు.

సంగీత విభావరిలో కళాకారులు ఆలపించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘వేడుకుందామా..’, ‘కొండలలో నెలకొన్న’, ‘అలరు చంచలమైన’, ‘బ్రహ్మ కడిగిన పాదము..’, ‘బ్రహ్మమొక్కటే..’ కీర్తనలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. కార్యక్రమం చివరన కళాకారులు ఆలపించిన కొన్ని కీర్తనలకు శ్రోతలు కూడా మంత్రముగ్ధులై గాయకులతో కలసి గోవింద నామ స్మరణ చేయడం కార్యక్రమానికి వన్నె తెచ్చింది. హోసూరు ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు అనేకమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగీత విభావరి అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా లడ్డూ ప్రసాద వినియోగం జరిగింది.

శ్రీనివాస ప్రసాద్ తాడేపల్లి రామమూర్తి, హోసూరు.

Exit mobile version