Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హృదయ సామ్రాజ్ఞికి ఓ విన్నపం

[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘హృదయ సామ్రాజ్ఞికి ఓ విన్నపం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

సృష్టి స్థితి లయ కారకుడైన పరమాత్మ
ఊహాజనితమైన ఓ పదార్థమే!
ఓ దివ్యతేజమూర్తిని
నా మది మందిరంలో ప్రతిష్ఠించి
నిత్యనీరాజనాలు సమర్పిస్తూ
హృదయారాధనలో మునిగిపోయాను!

కానీ.. ఇదేమి విచిత్రమో..
నా జీవన యానంలో
విభిన్న పాత్రలు పోషిస్తూ
నా అడుగులో అడుగులేస్తూ
నా మాటల చిరుజల్లుల్లో తడుస్తూ
నా సమస్యల సంద్రాన్ని నాతో కలిసి ఈదుతూ..
నా కన్నీటి ప్రవాహంలో నాతో బాటే కొట్టుకుపోతూ..
అనంతమైన ఈ జీవన సాగరాన్ని
నీ ప్రేమ గంగాజలంతో పునీతం చేసి
విలువైన జీవన గమ్యంలో
నన్ను ‘రాజు’ లా నిలిపి..
మన సంసార సామ్రాజ్యానికి
‘సామ్రాట్టు’ను చేసిన నిన్ను మాత్రం..
నా హృదయ ‘సామ్రాజ్ఞి’గా గుర్తించలేకపోయాను!
సమస్యల తేనెటీగలు చుట్టుముట్టాయని బెదిరిపోలేదు
సంప్రదాయ సంకెళ్ళను తెంచుకొని పారిపోలేదు
బంధాలను గౌరవించి
రక్త సంబంధాలకు విలువనిచ్చి
ప్రతి.. ప్రతిఘటననూ ప్రేమమయంగా మలుచుకొని
నీ జ్ఞాపకాల దొంతరల్లో భద్రపరచుకోని
భరించలేని వేదనను సైతం
నీ గుండెలోతుల్లో దాచుకోని
కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా
పంటి బిగువున కన్నీళ్ళను అదుపు చేసుకొని
మా కోసం హృదయ పరిమళాలను వెదజల్లావు!
భౌతికంగా బలహీనురాలివేగానీ..
మానసికంగా దృఢమైన సంకల్పబలం
నిన్ను మహోన్నతమైన వ్యక్తిత్వంతో
ఆకాశం అంచులతో నిలబెట్టింది!

ఓర్పు నీ ఆయుధమై అలరారుతోన్న వేళ..
నిరంతర కృషితో నిస్వార్థ త్యాగమూర్తివై
కలల కడలిలో మునిగి పోతున్న
కుటుంబ జీవన నౌకను
ప్రశాంత బ్రతుకు తీరానికి చేర్చావు!
ఓ సౌభాగ్యవతీ..
ప్రేమాన్విత సుందరమూర్తీ..
నీ పాదధూళిని నా శిరస్సున దాల్చి
నీ పాదాల చెంత..
నా ప్రాణాలు విడిచి పెట్టాలని
అత్యంత ప్రీతికరమైన..
నా కడ కోరిక!

Exit mobile version