Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హృదయావి-7

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది – పద్యకావ్య రచన పోటీలో ₹ 10,000/- బహుమతి పొందిన శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారి ‘హృదయావి’ కావ్యాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము.]

~
తరగలెత్తిన యీ పత్రహరితసరసి
యొరసి నా గుండె గోడల నురలె నొక్క
కవిత – పడవ జేసెద, రాగకౌముదీ ల
హరుల విడిచిపెట్టెద పునర్యానమునకు. (37)

దిక్కుల వెక్కిరించు పరిధిన్ విడిపూవులు సున్నితమ్ముగా
చక్కదనంపు మర్మముల సైగల జేయగ వీను వాల్చి పెం
పెక్కిన చిత్తవంతులు తపించిన తావుల తావి తాకగా
నక్కర తీరి మానవత యక్షయదీపముగా వెలింగెడిన్. (38)

నేలకు చిక్కి విత్తనము నేర్చెనిదే సహయోగవిద్య; రా
గాల వినోదులై కణుపుగర్భమునుండి జనించి శీర్షసం
చాలన బల్లవమ్ము లవిచార మధుస్రు తపస్సులో చికి
త్సాలయపుం గవాటములు చయ్యన దీసెను మన్కి మందులన్. (39)

చెవిలో ప్రేమరహస్యమున్ జిటికెలో జెప్పం బ్రయత్నించి, వా
గ్భవకూటమ్ము బెగల్చనీయని సమస్వాదుస్థితిన్ మగ్నవై
భవశాంతిచ్ఛవు లుగ్గడించు నగవున్ పండించి నావైపు మా
ర్దవదృక్కుల్ బఱపించుచున్న వనసామ్రాజ్ఞీ! నమోవాకముల్. (40)

నీకెదురై కొఱంతల ననేకములన్ వినిపించు కోర్కెతో
కేకలు వైచు నా హృదయగేహములో వెలిగించి స్నిగ్ధ రా
గాకర దీపికల్, బ్రతుకు కష్టము వెన్కటి తాల్ములన్ పవి
త్రీకృత యత్నధారలను తేలిక నిచ్చిన దేవి! మ్రొక్కెదన్. (41)

కృత్య మకృత్యము నొకటై
వ్యత్యాస సమన్వయాది పరిమిత భిన్న
ప్రత్యయముల్ శమియించెడు
నిత్య పదార్థప్రకృతికి నీరాజనముల్. (42)

కలిత రిరంసా సమభవ
లలితాలంబన, మనంత లావణ్య గుణో
జ్జ్వల, మధికతమానందాం
చల కమనీయమునగు కవిశక్తి నిలుచుతన్. (43)

వ్యసనముననో! నిధులలోనొ! కసవు కుప్ప
వోలె కలియనీక నను పూపొడిగ జేసి
ఆలయ పరిసరములలో వెలయ జిమ్ము
కావ్యకన్యక నిరుపమకరుణ నెంతు. (44)

అని యా రాత్రము కవితా
ర్పణగావించి, తడులింకు ప్రజ్ఞ లొలయగా
గుణయుత కవితా కలవా
సనల వరించి తన చేతిసంచిని నింపెన్. (45)

౩

ఆ మఱుదిన మొక ప్రాకట
సామూహిక సంగమసభ జరుగునని బృహత్
ద్ధామమునందున కవివర
ధీమయ పండితయుతమని తెలిసెను వార్తన్. (1)

ఆ కలయికలో పఠియింప నభిలషించి
యల్లుటకు బూనె బదివన్నెలారు కవిత
పదకుసుమముల మాలలౌ పద్యముల న
వారిత ప్రబంధ సుగంధ బంధురముగ. (2)

నకనకలాడు కడుపు లె
క్కకు రాదు, పెరవిషయములు కానబడవు గుం
డెకు నే నొప్పి తెలియ దత
నికి సంకల్పము కృతికి యనెడు తహతహలో. (3)

వ్రేళులందు జొనిపి వ్రేళుల నొడిబంధ
మున నాన్చి, పరికించు ముమ్మరముగ;
నాలోచనముసేయు నతిదీర్ఘముగ; వ్యాస
పీఠిపై నుంచిన ప్రియతమార్ద్ర
కావ్యరాజము దదేకముగా కనుంగొను;
మరి ప్రాత పద్యమ్మె స్మరణ దలచు;
శయనించి చిత్తుపుస్తకమును గుండెపై
బోర్లించి లీనతాపూర్ణు డగును;
భోజన సమయాన ముద్దజేయుట మాని
తీవ్రమనీష వాదించికొనును;
అడ్డు మొలచి తన నాపిన యట్లుగా
చలనమ్ము వారించి చలితు డగును
దృష్టి కుదురును కుదించినటు లొకట
మనసు లయించు నూహనమునందు

ఇటుల నారాటపడి, యొకయింత యంత
రాత్మ పదముల నొలికింప వ్రాసె పద్య
ములను ప్రేమాశుత ఫలించి ముంచివేసి
మేని యందు ప్రతికణము మేలుకొనగ. (4)

ఆ సభాసదుల నడుమ మోసులెత్తి
వింత వెఱపు డెందమ్మును వేగిరింప
కవిత వ్రాసికొన్న తెలుపు కాగితమును
దీసి “చిత్తగింపు” డనియె తేటలూర. (5)

గంభీరమ్మగు గొంతుతో, నలతి రాగక్షేమవైచిత్రితో
నంభోజమ్ముల వంటి పద్యముల వాగర్థప్రభల్ బొల్చు వి
స్రంభద్యోతకమౌనటుల్ చదివె వాచాంభామినీ సేవనో
జ్జృంభాహ్లాదితుడై సదస్యుల హృదాశ్లేషమ్ము కాంక్షించుచున్. (6)

(సశేషం)

Exit mobile version