Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హృదయస్పందనకు దర్పణం

[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘హృదయస్పందనకు దర్పణం’ అనే కవితని అందిస్తున్నాము.]

థ అంటే.. కాదు కల్పితం..
కథకుని హృదయస్పందనకు అది దర్పణం..
లోకం పోకడలను స్వానుభవంతో రంగరించి
అల్లిన అనుభూతుల అనిర్వచనీయ కవనం..!
వైవిధ్యభరిత మనస్తత్వ
ఆవిష్కరణల అద్భుత విన్యాసం..!
అతని ఊహా ప్రపంచంలో మెదిలి మెదిలి..
రూపుదిద్దుకొని.. కడకు వీడి.. కాగితంపై
అక్షరాల బారులై పరచుకుని పాఠకుని
చేతికందిన అద్వితీయ బహుమతి.. పుస్తకం..
కలల ప్రతిరూపం.. ఊహకు నిలువెత్తు సాక్ష్యం..
సజీవంగా కళ్లెదుట సాక్షాత్కరించిన క్షణం..
ఆ సృష్టికర్త హృదిని ఎగసిపడే సంతోషతరంగం..
వర్ణనాతీతం..! అది అక్షరాలా.. అనుభవేకవేద్యం..
ఆ కలం వెలిగించిన అక్షరదీపాలు..
దారి చూపే దివిటీలు..
ప్రగతికి బాటలు వేసే స్ఫూర్తిప్రదాతలు..
పాత్రల తీరుతెన్నులు.. పాత్రోచితచిత్రణ!
కథాగమనం.. ముగిసేదాకా జరిగే మేధోమధనం!!
కవితాహృదయం మాత్రమే ఎరిగిన అక్షరసత్యం..
చదువరి ఎదపై అదో చెరగని జ్ఞాపకం…
అంతర్లీనంగా అందే ఓ సందేశం..
సర్వజనావళికి అదొక దిశానిర్దేశం…
రసజ్ఞత ఎరిగిన రచయితకు ఎదురేమున్నది!!
నవ్యత నిండిన రచనలకు కొదవేమున్నది!?
అందుకే.. కథ అంటే కానేకాదు మరి.. కల్పితం..
కథకుని హృదయస్పందనకు అది దర్పణం..

Exit mobile version