[కీత్ విట్లీ పాడిన ‘ఐ యాం ఓవర్ యు’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- కీత్ విట్లీ – ‘ఐ యాం ఓవర్ యు’
- ఆల్బమ్ – ‘ఐ వండర్ డు యు థింక్ ఆఫ్ మీ’ (1990)
- రచన – టిమ్ నికోల్స్, జాక్ టర్నర్ (1989)
~
కీత్ విట్లీ ఆకస్మిక మరణం తరవాత రిలీజ్ అయిన పాట ‘ఐ యాం ఓవర్ యు’. కీత్ తన గొంతుపై ఎంత నియంత్రణ సాధించాడో ఈ పాట వింటే అర్థం అవుతుంది. ఎందరో కంట్రీ గాయకులు ఈ పాటను విపరీతంగా ఇష్టపడతారు. అందుకే తరవాతి తరం గాయకులు చాలా మంది తమ కచేరీలలో దీన్ని పాడారు కూడా. కాని కీత్ పాటలోని మాధుర్యం, ప్రతి వాక్యంలోని విషాదం, మనల్ని కదిలించినంతగా ఇతర గాయకుల గానం మనల్ని చేరదు. చిన్న చిన్న విరుపులు, పదాలను కొన్ని సారి పట్టిఉంచి గానం చేయడం కీత్ ఎంత బాగా చేస్తాడంటే ఈ పాట ఒక్క సారి వింటే తనవి తీరదు. కంట్రీ గీతాలలో నేను ఎక్కువ సార్లు వినే పాటల్లో ఇది ఒకటి.
‘ఐ యామ్ ఓవర్ యు’ పాటను టిమ్ నికోల్స్, జాక్ టర్నర్‌లు రాసారు. జనవరి 1990లో ‘ఐ వండర్ డు యు థింక్ ఆఫ్ మీ’ ఆల్బమ్ నుండి మూడవ సింగిల్‌గా ఇది కీత్ మరణానంతరం విడుదలైంది. ఈ పాట బిల్‌బోర్డ్ హాట్ కంట్రీ సింగిల్స్ & ట్రాక్స్ చార్ట్‌లో 3వ స్థానానికి చేరుకుంది. ఈ ఆల్బం కోసం 1989లో ఆల్కహాల్ పాయిజనింగ్‌తో మరణించే ముందు విట్లీ చివరి సారిగా పాటలు రికార్డ్ చేశారు.
Where there’s a cloud, don’t mean there’s rain
Tears in my eyes, don’t mean there’s pain
Don’t flatter yourself
I’m over you
(ఎక్కడ మేఘం ఉంటుందో అక్కడ వర్షం ఉన్నట్లు కాదు. నా కంట్లో నీరున్నంత మాత్రాన నాలో బాధ ఉన్నదని కాదు. నిన్నునువ్వు పొగడ్తలతో ముంచేసుకోకు. నేను నిన్ను దాటి వచ్చేసాను)
అతని మనసులో బాధ ఉంది. కంట్లో నీరు ఉబికివస్తూనే ఉంది. అయినా ఆమె తనను వీడిపోవడం తనను అంతగా బాధించట్లేదని, ఆ సంఘటన నుండి తాను బైట పడిపోయానని, ఆమె జ్ఞాపకాలను దాటి వచ్చేసానని అతను నమ్మించే ప్రయత్నం ఇది.
Things aren’t always what they seem
You can’t believe everything you read
On my face
I’m over you
(కనిపిస్తున్నవన్నీ ఎప్పుడూ అలాగే ఉన్నాయని కాదు. నా ముఖంపై నువ్వు చదువుతున్న ప్రతిదీ నిజమే అని నమ్మక్కర్లేదు. నేను నిన్ను దాటి వచ్చేసాను)
ఈ పల్లవి పాడుతున్నప్పుడు కీత్ గొంతులో అమాయకత్వంతో పాటు కోపం, ఆత్మాభిమానం సమపాళ్లల్లో ధ్వనిస్తాయి. అ యాం ఓవర్ యూ అని చెప్పడం అబద్ధం అని తెలుస్తూనే అతని గాయపడిన హృదయం పట్ల ఎంతో జాలి కలుగుతుంది.
You heard I’m drinking more than I should
That I ain’t been looking all that good
Someone told you I was taking it rough
Why are they making those stories up?
When I’m over you
(నేను తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగుతున్నానని నువ్వు విన్నావు. నేను అంత బాగా కనపడట్లేదని, చాలా కఠినంగా రోజులు నెడుతున్నానని నీతో ఎవరో చెప్పారు. ఆ కథలు వాళ్ళేందుకు అల్లుతున్నారో మరి నేను నిన్ను దాటి వచ్చేసాక)
There were times that if you’d been around
You would have seen me broken down
But now you won’t
I’m over you
(నేను తీరని వేదనతో క్రుంగిపోయి గడిపిన సందర్భాలు ఒకప్పుడు ఉండేవి. నా పక్కన నువ్వు ఉండి ఉంటే అవి నీకు కనిపించి ఉండేవి. కాని ఇప్పుడా సందర్భాలు రావు. ఎందుకంటే నేను నిన్ను దాటి ముందుకెళ్లిపోయాను.)
ఈ వాక్యాలు ఈ పాటకు ప్రాణం. ఆ గాయాకుని మానసిక స్థితిని ఎంతో గొప్పగా పట్టుకున్న వాక్యాలు ఇవి. తాను ఒకప్పుడు అతను కృంగుబాటుకు గురయిన మాట నిజమే. ఆమె అతని పక్కన ఉంటే అవి కనిపించి ఉండేవట. మన అనుకునే వారి ముందు మన బలహీనతలను వ్యక్తపరచుకోవడానికి, వారి భుజాలపై తల ఉంఛి ఏడవడానికి సందేహించం. కాని వారు పరాయివారయిపోతే మన దుఃఖాన్ని వారి ముందు బహిర్గత పరఛడానికి అభిమానం అడ్డు వస్తుంది. మొన్నటి దాకా ఆమె అతని ప్రియురాలు. ఆమె ముందు కన్నీరు చిందించడానికి ఆమె తనను ఏ స్థితిలో చూసినా ఆమె ఒడిలో కరిగిపోవడానికి అతను సిద్ధంగా ఉండేవాడు. కాని ఇప్పుడు ఆమె అతని ప్రేమను కాదన్నాక పరాయిదయిపోయింది. అందుకే ఇక ఆమెకు అతని దుఃఖం అంటదు. ఆమె ముందు తన బాధను వ్యక్తపరచడం అతనికి ఇష్టం లేదు. మన బాధలను వ్యక్తపరచుకోలేని పరాయితనానికి ఇతరులను నెట్టేయడమే వారిని శాశ్వతంగా మన జీవితాల నుండి విడదీసుకోవడం. మన విషాదాల నుండి ఇతరలను దూరం చేయడమే వారి నుండి విముక్తులవడం. ఈ వాక్యాలు కీత్ గొంతులో వింటున్నప్పుడు అతని గొంతులో ద్వనించే ఆ జీర నా మనసులోని చెమ్మను కదిలించి వెళుతుంది.
So if I seem a little bit cold
It only means you’ve lost the hold
You had on me
I’m over you
(కాబట్టి నేను గడ్డకట్టుకుపోయినట్లు కనిపిస్తే ఒకప్పుడు నీకు నాపై ఉన్న పట్టుని ఇప్పుడు నువ్వు కోల్పాయావని అర్థం. నేను నిన్ను వీడి వచ్చేసాను)
మళ్లీ మళ్ళీ వినాలనిపించే వాక్యం ఇది, ఒకప్పుడు ఆమెను చూస్తే అతను మంచులా కరిగిపోయేవాడు. ఆమె కనుసైగతో అతన్ని ఆడించేది. కాని ఇప్పుడు ఆమెకు అతనిపై ఆ పట్టు లేదు. అందుకే నీ పట్ల నేను గడ్డకట్టుకుపోయినట్లు కనిపిస్తే నువ్వు నాపై ఉన్న పట్టు కోల్పోయావని అర్థం అంటున్నాడు అతను. ఎంతటి విషాదంలోనయినా అవతలివారి పరిధిని చూపించాల్సిన స్థితి ఒకరకంగా మోసపోయినవారు సాధించే విజయం కూడానేమో. ఆ స్థితిలో ఈ పరిపక్వత చూపడం ఒక్కటే మన చేతల్లో ఉంటుంది. మనసుకు అయిన గాయాల ఛాయలు మాసిపోవు. వాటితో గడ్డకట్టేస్తుంది మనసు. దానితో మనల్ని గాయపరచిన వారి పట్టునుండి మనకు విముక్తి లభిస్తుంది. ఒక రకంగా ఇది స్వేచ్ఛ కూడానేమో. అంతటి విషాదంలోనూ మోసంలోనూ మనం సంకెళ్ల నుండి విముక్తులమయ్యామనే అర్థం కూడా.
You heard I’m drinking more than I should
That I ain’t been looking all that good
Someone told you I was taking it rough
But why are they making those stories up?
When I’m over you
(నేను తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగుతున్నానని నువ్వు విన్నావు. నేను అంత బాగా కనపడట్లేదని, చాలా కఠినంగా రోజులు నెడుతున్నానని నీతో ఎవరో చెప్పారు. ఆ కథలు వాళ్ళేందుకు అల్లుతున్నారో మరి నేను నిన్ను దాటి వచ్చేసాక)
వై ఆర్ దే మేకింగ్ దోస్ స్టోరీస్ అప్ అన్న దగ్గర కీత్ గొంతు వినండి అందులోని ఆ లోతైన విషాదం మనలోకి పాకుతుంది.
You heard I’m drinking more than I should
That I ain’t been looking all that good
Someone told you I was taking it rough
But why are they making those stories up?
When I’m over you
I’m over you
I’m over you
(నేను తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగుతున్నానని నువ్వు విన్నావు. నేను అంత బాగా కనపడట్లేదని, చాలా కఠినంగా రోజులు నెడుతున్నానని నీతో ఎవరో చెప్పారు. ఆ కథలు వాళ్ళేందుకు అల్లుతున్నారో మరి నేను నిన్ను దాటి వచ్చేసాక)
విషాదాన్ని మనిషి ఎదుర్కునేటప్పుడు కొన్ని దశలను అతను దాటాల్సి వస్తుంది. కోపం అసహాయత నుంచి ఒక రకమైన అంగీకార స్థితికి చేరుకోక తప్పదు. ఈ పాట తొలి వాక్యం నుంచి చివరకు వచ్చే ఐ యామ్ ఓవర్ యూ అనే వాక్యం దాకా ఆ దశలన్నీ ఒకో చరణంలో కీత్ గానంలో అనుభూతికి వస్తూ ఉంటాయి. చివర్లో అతను ఐ యామ్ ఓవర్ యూ అన్నప్పుడు ఎంతో విషాదంతో ఆ స్థితిని అంగీకరించిన అసహాయత మనలోకీ పాకుతుంది.
కొన్ని పాటలు వింటున్నప్పుడు ఆ అనుభూతిని కలిగిస్తాయి. కీత్ పాడిన ఈ పాట మనకు పరిచయం అయితే ఈ పాట గుర్తొచ్చిన ప్రతిసారి అది కలిగించే విషాదానుభూతి అనుభవానికి రావడం జరిగితే ఆ పాటతో మనం ఎంతో కనెక్ట్ అయినట్లు. కంట్రీ గీతాల్లో తప్పకుండా వినాల్సిన పాటగా ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పగల పాట ‘ఐ యాం ఓవర్ యు’.
Frankly I am not yet over this wonderful song..
~
ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
(https://youtu.be/Mo1FqsQ5jXM?si=t_yaI7jDGoWyO8_H )

