Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మళ్లీ మళ్లీ వినాలనిపించే కంట్రీ సాంగ్ ‘ఐ క్రాస్ మై హార్ట్’

[జార్ట్ స్ట్రెయిట్ పాడిన ‘ఐ క్రాస్ మై హార్ట్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

కంట్రీ మ్యూజిక్‌లో ఎక్కువగా వినిపించే మరో పేరు జార్జ్ హార్వే స్ట్రెయిట్ సీనియర్ (జననం మే 18, 1952). ఈయనను ‘కింగ్ ఆఫ్ కంట్రీ మ్యూజిక్’ అని అభిమానులు ప్రేమతో పిలుచుకుంటారు. ఈయన గాయకుడు, పాటల రచయిత, నటుడు, సంగీత నిర్మాత కూడా. లక్షకు పైగా అభిమానులు వీరి ఆఖరి కాన్సర్ట్‌కు తరలి రావడంతో అది ఉత్తర అమెరికాలోనే ఎక్కువ ప్రేక్షకులు వచ్చిన లైవ్ కాన్సర్ట్‌గా చరిత్ర సృష్టించింది. జార్జ్ ఎంత మంది మనసులకు దగ్గరయ్యారో ఈ కాన్సర్ట్ తెలియజేసింది.

స్ట్రెయిట్ పాడిన రికార్డులు ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. RIAA ప్రకారం, స్ట్రెయిట్ యునైటెడ్ స్టేట్స్‌లో 12వ బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ రికార్డింగ్ ఆర్టిస్ట్, యునైటెడ్ స్టేట్స్ అంతటా మొత్తం 70 మిలియన్లకు పైగా రికార్డులను విక్రయించారు. 1980లలో నియోట్రడిషనల్ కంట్రీ స్టైల్‌కు మార్గదర్శకుడిగా అతన్ని సంగీతకారులు గుర్తించారు. నాష్‌విల్లే సంగీత పరిశ్రమ కంట్రీ పాప్ క్రాస్ఓవర్ యాక్ట్‌లపై ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో అతని ప్రామాణికమైన కౌబాయ్ ఇమేజ్, రూట్స్-ఓరియెంటెడ్ సౌండ్‌ ఎందరినో ఆకట్టుకున్నాయి. ఈ శైలిపై అతని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, రచయితలు, సంగీత విమర్శకులు స్ట్రెయిట్‌ను ‘కంట్రీ మ్యూజిక్ రారాజు’ అని పిలిచేవారు. ఏ సంగీత శైలిలోనైనా, బిల్‌బోర్డ్ హాట్ కంట్రీ సాంగ్స్ చార్టులో రికార్డు 44తో సహా, అన్ని చార్టులలో అత్యధికంగా (60) నంబర్ వన్ పాటలను పాడిన కళాకారుడి రికార్డు కలిగి ఉన్నారు స్ట్రెయిట్. ఈయన 16 గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు. 2009లో తన ఆల్బమ్ ట్రౌబాడోర్‌తో ఉత్తమ కంట్రీ ఆల్బమ్‌గా తన మొదటి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు.

జార్ట్ స్ట్రెయిట్ పాటలు చిన్న నగరాలలో నివసిస్తున్న గ్రామీణ అమెరికన్ యువఆత్మను ఆవిష్కరిస్తాయి. ఈయన సమకాలీనులు పాప్ సంగీతానికి మారినా, స్ట్రెయిట్  స్టీల్ గిటార్‌లు, ఫిడిల్స్, పాట ద్వారా కథనంతో హాంకీ-టోంక్, వెస్ట్రన్ స్వింగ్, సాంప్రదాయ కంట్రీ సంగీతంపై దృష్టి సారించారు. అతను స్టేజ్‌పై ప్రదర్శించే కౌబాయ్‌ను లుక్, తన టెక్సాస్ మూలాలు, ఆడంబరమైన ప్రదర్శనకు దూరంగా సంప్రదాయ సంగీతంతో నిండిన ప్రదర్శనలకు అమెరికా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. విచ్చలవిడిగా చొచ్చుకు వచ్చిన పాప్-కంట్రీకి ఎదురీదగల ధీటైన కళాకారుడిగా ఇతన్ని సాంప్రదాయవాదులు గుర్తించారు.

‘ఐ క్రాస్ మై హార్ట్’ సెప్టెంబర్ 1992లో జార్జ్ స్ట్రెయిట్ ఆల్బమ్ ‘ప్యూర్ కంట్రీ’కి మొదటి సింగిల్‌గా విడుదలైంది, అదే పేరుతో వచ్చిన చిత్రానికి ఇది సౌండ్‌ట్రాక్ కూడా. ఈ పాట యునైటెడ్ స్టేట్స్, కెనడాలోనూ నంబర్-వన్ స్థానానికి చేరుకుంది. ఇది సినిమా ముగింపు సమయంలో వస్తుంది. జార్జ్ స్ట్రెయిట్ పాట్లల్లో కథనం ప్రధానం. ఈయన రొమాంటిక్ పాటలకు లక్షల్లో అభిమానులున్నారు. ముఖ్యంగా ఈ పాట ఆయనకు దేశ విదేశాలలో అభిమానులను సంపాదించిపెట్టింది. ప్రసిద్ధ కంట్రీ ప్రేమ గీతాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. సాహిత్యం కన్నా ఈ పాటను జార్జ్ ఎంత భావయుక్తంగా పాడారో గమనిస్తే ఆయన గాత్రంలోని మాధుర్యంతో పాట గానకౌశలం అర్థం అవుతుంది.

Our love is unconditional, we knew it from the start
I see it in your eyes, you can feel it from my heart
From here on after, let’s stay the way we are right now
And share all the love and laughter that a lifetime will allow

(మనది షరతులు లేని ప్రేమని మనిద్దరికీ తెలుసు. నీ కళ్లల్లో నాకు అది కనిపిస్తుంది, నా హృది నుండి అది నీకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పడున్నట్లుగా ఇలాగే ఉండిపోదాం. జీవితం ఇవ్వగలిగినంత ప్రేమను ఆనందాన్ని కలిసి అనుభవిద్దాం)

తన మనసును మీటిన ప్రేమికురాలికి ప్రేమికుడు ఆమెతో భవిష్యత్తును కోరుకుంటూ తమ జీవితం ఎందుకు బావుంటుందో తానామెకు ఏమి ఎవ్వగలడో తెలుపుతూ ఆమెకు ఓ వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ క్షణం ఎలా ఒకరితో ఒకరు బేషరతుగా దగ్గరయ్యారో అలా ఉండిపోగలిగితే జీవితం అంతా పూలపానుపే. అసలు షరతులు, కొలమానాలే, బాంధవ్యాలను కలుషితం చేస్తాయి. వాటి ప్రస్తక్తే లేని అనుబంధం ఏర్పడగలిగితే అది స్వర్గమే కదా. మంద్రస్థాయిలో, పదాలను అతి స్పష్టంగా పలుకుతూ ఈ పాట జార్జ్ పాడుతూ వింటుంటే చాలా హాయిగా, ప్రశాంతంగా ప్రేమలో ఉండాల్సిన నిలకడ అనుభవంలోకి వచ్చి ఈ పాట మనసుకు హత్తుకుంటుంది. ప్రతి స్త్రీ  కాసేపు ఆ ప్రేమ మైకంలో విహరిస్తుంది.

I cross my heart and promise to
Give all I’ve got to give to make all your dreams come true
In all the world, you’ll never find
A love as true as mine

(నేను నా గుండెపై చేయి ఉంచుకుని నీకు వాగ్దానం చేస్తున్నాను. నీ కలలను సాకారం చేయడానికి నా దగ్గరున్నదంతా నీకు ఇవ్వడానికి నేను సిద్ధం. నా ప్రేమకన్నా స్వచ్ఛమైనది నీకు ఈ ప్రపంచంలో మరేదీ దొరకదు)

ఈ వాక్యాలు జార్జ్ పాడుతుంటే వినాలి. ఓ మైకం కమ్మేస్తుంది. ముఖ్యంగా తన ప్రేమ గురించి చెప్పుకుంటూ ఇంత కన్నా స్వచ్ఛమైనదేది నీకు దొరకదు అని అతను పాడే దగ్గర ఆ గొంతులో లేతదనం, సున్నితత్వం, అది ప్రేమికుని అహంకారంలా కాకా అతను ఇచ్చే కానుకలా ద్వనిస్తుంది. తనపై తనకున్న నమ్మకంతో పాటు ఒక కమిట్మెంట్  ఉంటుంది. ఎక్కడా మోటుదనం ద్వనించదు. ‘నాలాంటి వారెవరూ ఉండరు తెలుసా’ అనడంలో అహం ఉంటుందేమో కాని ‘నేను ప్రేమించినంతగా ఎవరూ నిన్ను ప్రేమించలేరు’ అనడంలో అహంకారం కనిపించదు. ప్రేమ అంటే ఇవ్వడం కాబట్టి. అందుకే మొదటి వాక్యంలో ప్రేయసి తన కలలను సాకారం చసుకోవడానికి తనకున్నదంతా ధారాదత్తం చేస్తానంటున్నాడు అతను. దీని తర్వాత వచ్చే ఆ వాక్యంలో ప్రేమ తప్ప అందుకే అహం కనిపించదు. దీన్ని జార్జ్ గొప్ప ఫీల్‌తో గానం చేసాడు.

You will always be the miracle that makes my life complete
And as long as there’s a breath in me, I’ll make yours just as sweet
As we look into the future, it’s as far as we can see
So let’s make each tomorrow be the best that it can be

(నా జీవితాన్ని పరిపూర్ణం చేసే అద్భుతంగానే నువ్వెప్పటికీ ఉండిపోతావు. నాలో ఊపిరున్నంత వరకు నీ ఊపిరిలో అదే తీయదనం ఉండేలా చూసుకుంటాను. భవిష్యత్తులోకి మనం చూడాలనుకుంటే అది మనం చూడగలిగినంత మాత్రమే కనిపిస్తుంది. అందుకే మన ప్రతి రేపును వీలయినంత మంచిగా తీర్చిదిద్దుకుందాం)

జార్జ్ ఈ చరణం పాడేటప్పుడూ అందులో పలికించే భావాలు ఆస్వాదించండి. అతనితో ప్రేమలో పడిపోతాం. ఒక స్త్రీ ఏం కోరుకుంటుందో, ఎలాంటి సాంగత్యాన్ని ఆస్వాదిస్తుందో పూర్తిగా అర్థం అయినట్లు ఆ చరణాన్ని గానం చేస్తాడు. అతనిలో ఊపిరున్నంతవరకు ఆమెలో అదే తీయదనం ఉండేలా చూస్తాను అని చెప్పడంలో ఆమె ప్రేమ అతని జీవితాన్ని ఎంత తీయగా మార్చేసిందో చెప్పీ చెప్పకుండా చెప్తూ నీ జీవితం అంతే తీపితో నింపేస్తానని అతను చెప్పడం భలే బావుంటుంది.

I cross my heart and promise to
Give all I’ve got to give to make all your dreams come true
In all the world, you’ll never find
A love as true as mine

(నేను నా గుండెపై చేయి ఉంచుకుని నీకు వాగ్దానం చేస్తున్నాను. నీ కలలను సాకారం చేయడానికి నా దగ్గరున్నదంతా నీకు ఇవ్వడానికి నేను సిద్దం. నా ప్రేమకన్నా స్వచ్ఛమైనది నీకు ఈ ప్రపంచంలో మరేదీ దొరకదు) ఈ చరణం ఎన్ని సార్లు వచ్చినా అన్నీ సార్లు ఓ వైవిధ్యత కనిపిస్తుంది. ముఖ్యంగా a love as true as mine అని జార్జ్ పలకడాన్ని వింటుంటే ఈ పాట మరీ మరీ వినాలనిపిస్తుంది.

And if, along the way, we find a day it starts to storm
You’ve got the promise of my love to keep you warm
In all the world, you’ll never find
A love as true as mine
A love as true as mine

(మన జీవనదారుల్లో తుఫాను రోజుల్లో నా వాగ్దానం గుర్తుంచుకో. నా ప్రేమ నిన్ను అప్పుడూ వెచ్చగా కాపాడుతుంది. నా ప్రేమలోని స్వచ్ఛత నీకు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు)

కంట్రి గీతాలలోని గొప్పతనం అందులో ధ్వనించే నిరాడంబరతే. అదే ఈ పాట అందాన్నీ పెంచి పోషిస్తుంది. ఆడంబరాలు, హంగులు లేని జీవితాలు, ఒకరి నీడన ఒకరు బ్రతకాలనుకునే కోరికలు, జీవితంపై ఆశలు, జీవితంలో ముంచుకొచ్చే విషాదాలు, వాటిని భరించే సహనం, మనుష్యుల బలహీనతలు అన్నీ ఈ సాహిత్యంలో విషయవస్తువులే. అందుకే అవి జీవితాన్ని స్పృశించిన కవితలు. వాటిలో అబద్ధాలు, ప్రదర్శనలు, హంగులు ఉండవు. వీటన్నిటికీ అతీతమైన స్వచ్ఛమైన మానవ అనుభూతులే ఈ పాటలలో వినిపిస్తాయి. దానికి ఈ గీతమే ఉదాహరణ.  A love as true as mine అని జార్జ్ చివర్లో ఆ వాక్యంతో పాటను పాటను ముగించిన తరువాత ఆయన మౌనం ఆ తరువాత వచ్చే ఆ చిన్న బీట్ నిజంగా సూపర్. మళ్లీ మళ్లీ వినాలనిపించే కంట్రీ గీతాలలో ఇది ఒకటి.

~

ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:

(https://youtu.be/jXY6q0_LXoA?si=bZCGYf4KiJRdXlAF )

Exit mobile version