[టామీ వైనెట్ పాడిన ‘ఐ డోంట్ వానా ప్లే హౌస్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- టామీ వైనెట్ – ఐ డోంట్ వానా ప్లే హౌస్
- ఆల్బమ్ – ఐ డోంట్ వానా ప్లే హౌస్ (1967)
- రచన – బిల్లీ షెరిల్, గ్లెన్ సట్టన్
~
టామీ వైనెట్ అసలు పేరు వర్జీనియా వైనెట్ ప్యూ (మే 5, 1942 – ఏప్రిల్ 6, 1998) కంట్రీ మ్యూజిక్‌లో అత్యంత ప్రభావవంతమైన విజయవంతమైన కళాకారిణులలో ఆమె ఒకరు. పురుషాధిక్యత ఉన్న కంట్రీ మ్యూజిక్ రంగంలో మహిళల గుర్తింపు కోసం ఆమె గొప్ప పునాది నిర్మించిందన్ని సంగీత విశ్లేషకులు భావిస్తారు. ఈ ప్రక్రియలో తరవాతి తరంలోని మహిళలు ప్రాతినిధ్యం లభించడానికి ఆమె కృషి దోహదపడింది. తన ప్రత్యేకమైన గాత్ర శైలి, విశిష్టమైన భావోద్వేగాలను వ్యక్తపరిచినందుకు విమర్శకులు, పాత్రికేయులు రచయితలచే ప్రశంసలందుకున్న గాయని వైనెట్. ఆమె కెరీర్లో ఇరవై పాటలు యూఎస్ కంట్రీ చార్టులో అగ్రస్థానంలో నిలిచాయి.
టామీ పాడిన ఎన్నో పాటలు శ్రోతల మనసులకు గాయం చేసాయి. ఆమె గాత్రం, ఇతర మహిళా గాయకులకు చాలా భిన్నంగా ఉంటుంది. ఒకింత జీరతో, గంభీరంగా, మనసు లోతుల్లోంచి తోడి భావాలను వెలికి తీస్తున్నట్లు, విషాదం, ఆలోచనను సమపాళ్ళలో నింపుకుని ఒకింత ఫిలాసఫీ జోడించి ఆమె గానం చేస్తుంటే, శ్రోతలు నిర్వేదాన్ని, ఉద్వేగాన్ని సమపాళ్లలో అనుభవిస్తారు. ఆమె పాటల కోసం ఎన్నుకునే విషయాలు అంతే గంభీరమైనవి.
తల్లి తండ్రులు విడిపోతున్నారని తెలిస్తే, చిన్నారుల మనసులు పడే మూగ వేదనను అత్యంత హృద్యంగా పలికిస్తుంది ‘ఐ డోంట్ వాంట్ టు ప్లే హౌస్’ అనే గీతం. ఇది నిజానికి చాలా చిన్న పాట. కాని ఒకో వాక్యం శూలంలా గుచ్చుకుంటుంది. కుటుంబాల విచ్చిన్నం పసి మనసులపై చేసే గాయాన్ని అనుభవిస్తూ శ్రోతల కళ్లు చెమ్మగిళ్ళుతాయి. ఈ వాక్యం పాటలో వచ్చే ప్రతి సారి మన మనసు నొప్పిని అనుభవిస్తుంది. టామీ ప్రత్యేకంగా విషాదాన్నికలిపి ఆ వాక్యాన్ని పలుకుతున్నప్పుడు ఇంత కన్నా విషాద స్థితి, ఇంత కన్నావిషాద వాక్యం ఇంకోటి ఉండదనిపిస్తుంది.
Today I sat alone at the window
And I watched our little girl outside at play
With the little boy next door like so many times before
But something didn’t seem quite right today
So I went outside to see what they were doing
(ఇవాళ కిటికీ దగ్గర నేను ఒంటరిగా కూర్చుని, మా చిన్న తల్లి పక్కింటి చిన్న పిల్లాడితో ఇంతకు ముందు ఎన్నో సార్లు ఆడినట్లే ఇంటి బైట ఆడుకోవడాన్ని చూస్తున్నాను. కాని ఈ రోజు ఏదో సరిగ్గా లేనట్లు అనిపించింది. అందుకని వాళ్ళేం చేస్తున్నారో చూడాలని నేను బైటకు వెళ్లాను)
పాట ఎక్కడా ఆగకుండా స్వగతంలా వెళ్ళిపోతుంది. మొదటి వాక్యం నుండే విషాదం ద్వనిస్తుంది. ఆమె ఒంటరిగా కూర్చుని ఆడుకుంటున్న కూతురిని చూస్తున్నాను అని చెప్తున్నప్పుడు ఆ ‘సాట్ అలోన్’ అన్న పదాలలోని విషాదాన్ని చొప్పిస్తుంది గాయని. ఆమె ఒంటరితనం సహజమైనది కాదని, అది ఆమె జీవితంలోని ఒంటరితనం అని మొదటి వాక్యంతోనే శ్రోతలకు అర్థం అవుతుంది. కాని ఈ రోజు ఆటలో ఏదో తేడా అనిపించింది ఆ తల్లికి. ఆ వాక్యం దగ్గరకు వచ్చేసరికి టామి గొంతులో వణుకు మనలో చిన్న భయాన్ని కలిగిస్తుంది.
And then the teardrops made my eyes grow dim
‘Cause I heard him name a game and I hung my head in shame
When I heard our little girl say to him
(తర్వాత నా కంట చిమ్మిన కన్నీరుతో నా దృష్టిని మసకబారింది. ఎందుకంటే ఆ అబ్బాయి ఓ ఆట గురించి అడగితే, నా చిన్నతల్లి అతనికిచ్చిన జవాబు విని నా తలను సిగ్గుతో దించుకున్నాను)
జీవితంలో మనం అలవాటుగా రోజులు గడిపేస్తూ మనసులోని సున్నిత భావాల తాకిడిని, అమాయక హృదయాల స్పందనలను వేగవంతమైన మన జీవితాల నడుమ గమనించం. కాని తరచి చూస్తే అత్యంత సాధారణమైన విషయాలలో తీవ్రమైన భావావేశాలు వ్యక్తీకరించబడతాయి. వాటిని గమనించకుండా దాటేసి జీవించేస్తుంటారు చాలామంది. కాని వాటిని గుర్తించగలిగితే మన జీవితాల విలువ అర్థం అవుతుంది. మనం విస్మరించే ఎన్నో విషయాలు ఎదుటపడి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఇద్దరు చిన్న పిల్లలు రోజూ ఆడుకుంటుంటారు. కాని పరిశీలించి చూస్తే వారి ఆటల్లోనే వారనుభవించే జీవితం కనిపిస్తుంది. ఆటల ద్వారా పిల్లలు ఈ ప్రపంచంలో పొందిన అనుభవాలకు సమాధానాలు వెతుక్కుంటారు. వాటి ద్వారా తమ అనుభవాలను వ్యక్తీకరిస్తారు. గొప్ప మనస్తత్వ శాస్త్ర విధానాలు ఆ ఆటల్లో గమనించవచ్చు. ఆ తల్లి ఓ రోజు హఠాత్తుగా ఆగి ఆ పిల్లల ఆటను గమనించి సిగ్గుపడుతుంది. ఆ పిల్లవాడి ఓ ఆట ఆడదాం అని ఆ పాపను అడుగుతున్నాడు. దానికి ఆ చిట్టి తల్లి ఇచ్చిన జవాబు ప్రపంచంలోని తల్లులందరిని ఆలోచనలో పడేస్తుంది.
I don’t want to play house, I know it can’t be fun
I’ve watched mommy and daddy
And if that’s the way it’s done
I don’t want to play house, it makes my mommy cry
‘Cause when she played house
My daddy said goodbye
(నేను ఇల్లు ఆట ఆడను. నాకు తెలుసు అది నవ్వులాట కాదని. అమ్మని నాన్నని నేను గమనించాను. అలాగే ఈ ఆట ఆడాలంటే, నేను ఈ ఇల్లు ఆట ఆడను. అది మా అమ్మను ఏడిపించింది. అమ్మ ఆ ఆట ఆడుతున్నప్పుడే నాన్న సెలవంటూ వెళ్ళిపోయారు)
చిన్న పిల్లలు సాధారణంగా అమ్మా నాన్న ఆట ఆడుకుంటూ ఆ రోజుల్లో కనిపించేవారు. ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఆ ఆట రోజూ ఆడుకునేవారు. కాని ఇంటి విషయాలు క్రమంగా అర్థం చేసుకుంటున్న ఆ చిన్నారి ఇక తాను ఆ ఆట ఆడనని, అమ్మా నాన్నా ఇద్దరూ ఆ ఆట ఆడుకుంటుంటే రోజూ గమనిస్తున్నానని, అమ్మ ఆడే ఆ ఆటలోనే నాన్న సెలవంటు తమందరినీ వదిలేసి వెళ్ళిపోయారని అందుకే ఆ ఆట తనకు నచ్చదని చెప్పింది.
వివాహ వ్యవస్థలోని లోపాలు రాబోయే తరాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో, వివాహం అంటే విముఖత కలిగిస్తాయో, ఆ బంధం నిరాకరించే తరాన్నిఎలా మనం తయారు చేస్తున్నామో ఈ పాట చాలా గొప్పగా వివరిస్తుంది. అమ్మా నాన్న ఆట ఆడనంటున్న చిన్నారి ఆ ఆటను మాత్రమే కాదట్లేదు, వివాహం అనే వ్యవస్థనే కాదంటుంది, అమ్మ కార్చిన కన్నీరు చూసాక తాను ఆ స్థితిలోకి రాకూడదని, వివాహాన్నే కాదంటుంది. నేటి యువతరం వివాహ వ్యవస్థను ఏవగించుకోవడం వెనుక ఉన్న కారణాన్ని అత్యంత విషాదభరితంగా వివరించే గీతం ఇది.
I don’t want to play house, I know it can’t be fun
I’ve watched mommy and daddy
And if that’s the way it’s done
I don’t want to play house, it makes my mommy cry
‘Cause when she played house
My daddy said goodbye
(నేను ఇల్లు ఆట ఆడను. నాకు తెలుసు అది నవ్వులాట కాదని. అమ్మని నాన్నని నేను గమనించాను. అలాగే ఈ ఆట ఆడాలంటే, నేను ఈ ఇల్లు ఆట ఆడను. అది మా అమ్మను ఏడిపించింది. అమ్మ ఆ ఆట ఆడుతున్నప్పుడే నాన్న సెలవంటూ వెళ్ళిపోయారు)
ఈ పాటలో టామీ ప్రతిభ పూర్తిగా కనిపిస్తుంది. ప్రతి పదాన్నిభావయుక్తంగా, మర్మగర్భంగా ఆమె పాడిన విధానం ఈ పాట ఆ రోజుల్లో అతి పెద్ద హిట్ అవడానికి కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీన్ని తర్వాతి తరం గాయకులు కూడా చాలా మంది ఇష్టపడి గానం చేసారు. 1973లో, దక్షిణాఫ్రికా గాయని బార్బరా రే దీనిని పాడి రికార్డ్ చేశారు. ఇది ఆమె స్వదేశంలో నంబర్-వన్ హిట్‌గా నిలుస్తూ, ఆస్ట్రేలియాలో కూడా టాప్ 10లో చోటు దక్కించుకుని, ఆ ఏడాది చివరలో మూడవ స్థానానికి చేరుకుంది. ఆమె పాడిన ఈ వెర్షన్ 1973లో దక్షిణాఫ్రికాలో అత్యధికంగా అమ్ముడైన సింగిల్‌గా రికార్డు నెలకొల్పింది.
కాని సంగీతాభిమానులు చాలామంది ఈ రోజుకీ టామీ వైనెట్ రికార్డునే ఇష్టపడతారు. కారణం టామీ గొంతులోని విశిష్టత. బార్బరా కూడా చాలా బాగా పాడింది. కాని టామీ గొంతులోని జీర, ఆ గాంభీర్యం ఈ పాట మధ్యలో వచ్చే ఆ హై పిచ్ శ్రోతలకు ఇచ్చే ఫీల్ వేరు. కంట్రీ గీతాలలో ఇది నా మటుకు ఒక అత్యుత్తమ గీతం.
~
ఈ పాట యూ ట్యూబ్ లింక్ ఇది.
https://www.youtube.com/watch?v=uCc9tJlRUZ4

