Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఓ భర్త మనఃస్థితిని నిజాయితీగా వినిపించే పాట ‘ఐ జస్ట్ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ లివింగ్’

[హాంక్ విలియమ్స్ పాడిన ‘ఐ జస్ట్ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ లివింగ్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

హాంక్ విలియమ్స్ పాటలన్నిటిలో అంతర్లీనంగా విషాదం ఉంటుంది. ఆయన జీవితంలో అనుభవించిన ప్రేమరాహిత్యం ఆయన రాసుకున్న పాటలన్నిటిలోనూ ధ్వనిస్తుంది. ఒక గాయకుడిగా హాంక్ కెరీర్ సాగిన కాలం కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే. ఆ కాలంలో 167 పాటలను హాంక్ స్వయంగా రాసి గానం చేసారు. 225 పాటలను రికార్డు చేసారు. ఇందులో పదకొండు పాటలు నంబర్ వన్ కంట్రీ హిట్స్‌గా పేరు పొందాయి. ఈయన పాటలను ఎందరో తరవాతి తరం గాయకులు కోరి రీరికార్డ్ చేసారు. చనిపోయాక రిలీజ్ అయిన పాటలతో కలుపుకుని టాప్10 బిల్బోర్డ్ హిట్స్‌గా హాంక్ విలియమ్శ్ గానం చేసిన 55 పాటలు నిలిచాయంటే కంట్రీ మ్యూజిక్‌లో ఆయన పాత్ర అర్థం చేసుకోవచ్చు. ‘ఐ జస్ట్ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ లివింగ్’ హాంక్ విలియమ్స్ రచించి జనవరి 1950లో MGM రికార్డ్స్లో పదమూడవ సింగిల్‌గా విడుదల చేసిన గీతం. ఈ పాట బెస్ట్ సెల్లింగ్ రిటైల్ ఫోక్ రికార్డ్స్ చార్ట్లో #5వ స్థానానికి చేరుకుంది. ఏకపక్ష ప్రేమ, నిరంతర సంఘర్షణల వల్ల కలిగే మానసిక అలసటను ఈ పాట అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. దీని సాహిత్యం నిత్యం ఘర్షణలతో విషపూరితంగా మారిన సంబంధం పట్ల అలసట నిండిన వ్యక్తి తమ అనుబంధాన్ని, వాస్తవిక దృక్పథంతో విశ్లేషించే ప్రయత్నాన్ని ఆవిష్కరిస్తుంది.

I just don’t like this kind of living
I’m tired of doing all the giving
I give my all and sit and yearn
And get no lovin’ in return
And I just don’t like this kind of living

(నాకిలాగ బ్రతకడం నచ్చట్లేదు. నేను మాత్రమే ఎప్పటికీ ఇచ్చే స్థానంలో ఉండి అలసిపోతున్నాను. నన్ను నేను ఇచ్చుకుని అలసి కూలబడిపోతున్నాను కాని బదులుగా నాకు ప్రేమ దొరకట్లేదు. అందుకే ఇలా జీవించడం నాకు నచ్చట్లేదు)

తమ మధ్య బంధంలో తానొక్కడే ఎప్పటికీ అన్నీ ఇస్తూ, సహిస్గ్తూ, ప్రేమను పంచుతూ ఒంటరినయిపోతున్నానని, బదులుగా తనకు కాస్తయినా ప్రేమ దొరకక అల్లాడుతున్నాని, ఈ జీవితం తనకు నచ్చట్లేదని ఆవేదనగా చెప్తున్నాడు గాయకుడు. తమ అనుబంధాన్నినిలుపుకోవడానికి చేయవలసినదంతా చేస్తూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండడం ఇక తన వల్ల కాదన్న భావం పాట పల్లవి నుండే గాయకుడి గొంతులో ధ్వనిస్తుంది. అతనిలోని బాధతో పాటు, కోపం, ఇక ఈ బాధ భరించడం తన వల్ల కాదన్న నిర్ణయం కూడా శ్రోతలకు వినిపిస్తుంటాయి.

Why do we stay together
We always fuss and fight?
You ain’t never known to be wrong
And I ain’t never been right
Tell me where you think we’re going
‘Cause I ain’t got no way of knowing
When things go wrong, you go your way
You leave me here to pay and pay
And I just don’t like this kind of living

(అసలు మనం కలిసి ఎందుకు ఉన్నాం? ఎప్పుడూ అరుచుకోవడం, కొట్లాడుకోవడమే కదా చేస్తుంది. నీవు చేసేది ఎప్పుడూ తప్పు అవ్వదు. నేను చేసేదీదీ సరైనదికాదు. ఇలా మనం ఎక్కడికి చేరతామో చెప్పు, నాకైతే ఏమీ తెలియకుండా ఉంది. పరిస్థితులు అనుకూలించనప్పుడు, నువ్వు నీ దారిన వెళ్ళిపోతావు, నన్ను ఫలితం అనుభవించమని, నష్టాన్ని భర్తీ చేయమన్ని వదిలేస్తావు. ఇలాంటి జీవితం నాకు ఇక నచ్చట్లేదు)

ఇద్దరి మధ్య అస్సలు సఖ్యత లేదు. ఎప్పుడు కాస్త సమయం గడిపినా అది గొడవలోకే వెళుతుంది. కలిసి ఉన్న ఆ కాసేపు అరుచుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడమే అయితే ఈ బంధం ఎటు వైపుకు ప్రయాణిస్తున్నట్లు? ఇలా జీవించడం అవసరమా. ప్రతికూలతల నడుమ ఒంటరిగా అన్నీ భరిస్తూ, సహిస్తూ, ఆమె తప్పించుకుని వెళ్లిపోతే, ఆ నష్టాన్ని పూరిస్తూ, ఖర్చులు భరిస్తూ ఒంటరిగా జీవించడం తనకు ఏ మాత్రం బావుండట్లేదని, ఇది ఇక తన వల్ల కాదన్నది అతని అభిప్రాయం.

I just don’t like the things you’re doing
Your evil heart will be your ruin
When things start running smooth and free
You haul right off and you pick on me
And I just don’t like this way of living

(నువ్వు చేస్తున్నవేవీ నాకు నచ్చట్లేదు. నీ చెడు హృదయం నిన్ను నాశనం చేయబోతుంది. అన్నీ సవ్యంగా జరుగుతుంటే కూడా నువ్వు ఏదో నెపం పెట్టి నన్ను వేలెత్తి చూపుతావు. అందుకే ఈ జీవితం నాకు నచ్చట్లేదు)

పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడా ఏదో నెపంతో అతన్ని తప్పు పడుతూ అతని మనసును గాయపరుస్తూ ఏ మాత్రం చేయూత నివ్వకుండా అన్ని వేళలా ఒంటరి చేసే ఆమెతో సహజీవనం తనకు నచ్చట్లేదంటున్నాడు అతను.

They say the road of love is long
It’s rocky and it’s rough
But if this road don’t start to get smooth
I’ve traveled it long enough
Why don’t you act a little older
And get that chip up off your shoulder?
I told you once, now I’ll tell you twice
You better start to treat me nice
‘Cause I just don’t like this way of living

(ప్రేమ దారి సుదూరం అని, అది రాళ్లతో నిండిన క్షష్టమైన బాటని అందరూ అంటారు. కాని ఈ దారి ఇప్పుడు సరళంగా మారకపోతే, ఇక నేను చేసిన ఈ ప్రయాణం చాలు. నువ్వు కాస్త పరిణతితో ఎందుకు ప్రవర్తించవు? నీ భుజాలనెందుకు సవరించవు? నేను అంతకు ముందోసారి నీకు చెప్పాను, ఇప్పుడు మరోసారి అదే చెప్తున్నాను, నాతో ఇక నువ్వు మంచిగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఈ జీవితం నాకు నచ్చట్లేదు)

ప్రేమ పేరుతో ఇక తాను ఇవన్నీ భరించబోనని, ఆమె తనతో మంచిగ ప్రవర్తించాలని, ఈ జీవితం తనకు నచ్చట్లేదని, ఇలా ఇంకొంత కాలం గడపడం అసాధ్యమని అతను చివర్లో ప్రకటిస్తున్నాడు.

కంట్రీ గీతాలలో ప్రజల జీవితకథలుంటాయి. అవి వ్యక్తిగతాలే కావచ్చు, కాని మనిషి సమాజంలో జీవించడానికి, గౌరవాన్ని పొందడానికి పడే తాపత్రయం అందులో కనిపిస్తుంది. జీవితాన్ని నరకప్రాయం చేసే స్త్రీతో సహజీవనం చేస్తున్న ఓ పురుషుడు అనుభవించే బాధను ఈ పాట వినిపిస్తుంది. హాంక్ గొంతులో విషాద ఆగ్రహ ఆవేశాలు సమపాళ్లలో వినిపిస్తాయి. సంగీతం ఏ మాత్రం తెలియని హాంక్ కేవలం స్వరజ్ఞానంతో ఇలాంటి పాటలు రాసుకుని బాణీలు కట్టుకుని వాటిని ప్రజలకు చేరువ చేయడం ఆశ్చర్యపరిచే విషయం. ఈ పాటనే తీసుకుంటే ఇందులో పదాలన్నీ కూడా కవితాత్మకంగా ఉంటూనే భావాన్ని వినిపిస్తాయి. ఒక చరణంలో అసహాయత, మరో చోట బాధ, నిస్పృహ, ఒక చోట కోపం విసుగు హాంక్ గొంతులో ద్వనించే ఈ భావాలు ఒకొక్కటిగా మనకు పరిచయం అవుతూ అతని జీవితంలోని సంఘర్షణను బహిర్గత పరుస్తాయి. అతని గొంతులో ఆవేదన మనల్ని బాధిస్తుంది. అర్థం చేసుకోలేని సహచరితో జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో స్పష్టపరుస్తూనే ఈ బాధ ఇంకెన్నాలనే ప్రశ్న కూడా ఈ పాట లేవనెత్తుతుంది.

హాంక్ పాడిన ఎన్నో పాటల మధ్య ఇది ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణం, ఇందులో ద్వనించే విషాదం అయితే కంట్రీ గీతాలలో అన్ని రకాల ఇతివృత్తాలకున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కఠినాత్మురాలైన స్త్రీతో గడిపే పురుషుడి బాధను ఇంత లోతుగా వివరించే పాటలు తక్కువ. భార్యను అనుకూలంగా మార్చుకోలేకపోవడం పురుష బలహీనతగా ముద్ర వేసే మన సమాజంలో ఇంత నిజాయితీగా తన జీవితంలోని ఓటమిని గానం చేసిన రచన మనకు లభ్యం కాదు. స్త్రీ సాంగత్యంలో జాలి పడాల్సిన స్థితిలో ప్రధాన పాత్ర లేదా గాయకుడు ఉండడం, ఆ పాత్ర మనోభావాలను ఇంత సవిస్తారంగా వినిపించడం తక్కువ. సాధారణంగా తన ప్రేమను కాదని వెళ్ళిపోయే ప్రేమికురాలి గూర్చి ఉండే పాటలలో ప్రేమికుడుని ఇంకా గొప్పగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. కాని ఇక్కడ గాయకుడు నిస్సహాయుడిగా, ఆమె ఆడించే ఆటలో ఓ బొమ్మగా, పూర్తి బలహీనుడిగా కనిపిస్తాడు. అమెరికన్ కంట్రీ గీతాలలో బలహీనమైన వ్యక్తులు, జీవితంలోని బలహీనతల నడుమ సంఘర్షణలు, చాలా సహజంగా పాటలుగా చిత్రీకరించబడ్డాయి. గయ్యాళి భార్య చర్యలకు ప్రతిస్పందనగా తనలోని దుఖాన్ని వినిపిస్తున్న ఓ భర్త మనఃస్థితిని అన్ని రకాల హీరోయిజాలకు దూరంగా నిజాయితీగా వినిపించే పాట ఇది.

(ఈ పాట యూట్యూబ్ లింక్:
https://www.youtube.com/watch?v=ptRN_zOo0n4)

Exit mobile version