[హాంక్ విలియమ్స్ పాడిన ‘ఐ విల్ నెవర్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అలైవ్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- హాంక్ విలియమ్స్ – ‘ఐ విల్ నెవర్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అలైవ్’ (1952)
- ఆల్బమ్ – 24 ఆఫ్ హాంక్ విలియమ్స్ గ్రేటెస్ట్ హిట్స్ (1970)
- రచన – హాంక్ విలియమ్స్, ఫ్రెడ్ రోజ్
~
హిరామ్ ‘హాంక్’ విలియమ్స్ (సెప్టెంబర్ 17, 1923 – జనవరి 1, 1953) అమెరికన్ గాయకుడు, పాటల రచయిత సంగీతకారుడు. కంట్రీ మ్యూజిక్కు తొలి మార్గదర్శకులలో ఒకరైన ఇతను, 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన, ప్రభావవంతమైన సంగీతకారులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. విలియమ్స్ రికార్డ్ చేసిన 55 సింగిల్స్ బిల్బోర్డ్ కంట్రీ & వెస్ట్రన్ బెస్ట్ సెల్లర్స్ చార్ట్‌లో టాప్ 10కి చేరుకున్నాయి, వాటిలో 5 అతని మరణానంతరం విడుదలయ్యాయి. 12 పాటలు నెం.1 స్థానానికి చేరుకున్నాయి.
హాంక్ కెరీర్ తక్కువ కాలం సాగినా, 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ ప్రభావవంతమైన సంగీతకారుడిగా, ముఖ్యంగా కంట్రీ సంగీతంలో ఈయన ఎందరికో మార్గదర్శకుడిగా నిలిచాడు. 1961లో కంట్రీ మ్యూజిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో, 1970లో సాంగ్రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో, 1987లో రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో, 1999లో నేటివ్ అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఈయన చేర్చబడ్డాడు. ఈయన హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో ఒక స్టార్‌ను కూడా పొందారు. 2010లో, మరణానంతరం పులిట్జర్ ప్రైజ్ ప్రత్యేక ప్రశంసాపత్రం కూడా హాంక్ కు లభించింది.
పాట శీర్షిక మరణం అనివార్యతను సూచిస్తూ, దాని సాహిత్యం బ్లాక్ కామెడీ శైలిలో సాగుతుంది. అందరి ప్రయాణమూ మృత్యువు దిశగానే, ఈ ప్రపంచ మార్గాన్ని ప్రాణాలతో ఎవరూ దాటలేరు. మరి ఈ కష్టాలకు భయం దేనికి అనే ధోరణిలో సాగే ఈ పాట జీవితంలో ప్రతి ఒక్క కష్టాన్ని, దురదృష్టాన్ని స్వీకరించే దిశగా శ్రోతలను ప్రేరేపిస్తుంది.
Are you’re lookin’ at a man that’s getting kinda mad
I had lots of luck, but it’s all been bad
No matter how I struggle and strive
I’ll never get out of this world alive
(మీరు పిచ్చివాడిగా మారుతున్న ఓ వ్యక్తిగా నన్ను చూస్తున్నారా? నాకు ఎన్నో సార్లు అదృష్టం కలిసి వచ్చింది, కాని అదంతా చెడు వైపుకే నన్ను నెట్టింది. నేనెంత తపించినా శ్రమించినా ఈ ప్రపంచం నుండి ప్రాణాలతో బైటపడలేను కదా)
ఈ పాట ప్రధాన తాత్విక భావం మరణాన్ని అంగీకరించడం. మానవ జీవితం ఎప్పటికయినా అంతమయ్యేదే. మనమందరం మరణమనే ఒకే తుది గమ్యాన్ని పంచుకుంటాము. కాబట్టి, ప్రతి చిన్న సమస్య గురించి ఆందోళన చెందడం వ్యర్థమన్నది కవి భావం. ఈ భావాన్ని బలపర్చడానికి తన జీవితాన్ని పరిచయం చేసుకుంటున్నాడు అతను. నేడు ఒక పిచ్చివాడిగా కనిపిస్తున్న తన జీవితంలోనూ అంతకు ముందు కొన్ని అదృష్టాలు కలిసి వచ్చాయని, కాని ఆ ప్రయాణం చివరకు నష్టాల వైపుకే దారి తీసిందని, ఎంత కష్టపడ్డా, ప్రయత్నించినా ఈ ప్రపంచాన్ని ప్రాణాలతో దాటడం కుదరదనే సత్యం తనకు తెలుసని చెప్తున్నాడు. అలా తనను చూసి నవ్వుతున్న వారికి ఓ పెద్ద లోతైన ప్రశ్నను వేస్తూ, ఎన్ని అదృష్టాలలో మునిగి తేలినా, చావే కదా మీ అందరి ఆఖరి మజిలీ కూడా అనే చురకతో వారి నోళ్లు మూయించే కవి ప్రయత్నం కూడా ఇందులో కనపడుతుంది.
My fishing pole’s broke, the creek is full of sand
My woman run away with another man
No matter how I struggle and strive
I’ll never get out of this world alive
(చేపలు పట్టే నా కర్ర విరిగిపోయింది, ఈ వాగు ఇసుకతో నిండిపోయింది. నా భార్య మరొక మగవానితో వెళ్ళిపోయింది. నేనెంత కష్టపడ్డా, బాధపడ్డా, ఈ ప్రపంచాన్ని ప్రాణలతో దాటలేను కదా..)
ఈ పాట ప్రారంభ చరణాలు అత్యంత విషాదాన్ని సూచిస్తాయి. అతను ఓ మామూలు చేపలు పట్టే శ్రామికుడు. అతని ముఖ్యమైన పనిముట్లు విరిగిపోయాయి. అవి బాగు చేసుకునే స్థితిలో అతని జీవితం లేదు. తోడు ఉండవలసిన భార్య అతని పేదరికాన్ని, ఓటములను స్వీకరించలేక అతన్ని వదిలి మరొకరితో వెళ్లిపోయింది. అతనికి ఒంటరితనం, గత కాలపు జ్ఞాపకాలే తోడయ్యాయి. కాని ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మరణం దిశగా సాగే జీవితమే కదా ఇది. ఎందుకు బాధపడాలి అనే మొండి వైఖరిలోకి అతను ప్రవేశించాడు! వీటన్నిటిని పట్టించుకుని ఎందుకు బాధపడాలి? భయపడాలి. చివరకు ప్రాణాలను కూడా వదిలేసే కదా వెళ్ళాలి? మరి భయం దేనికి, జరిగిన సంఘటనలను గురించి బాధ దేనికి అని అతను అనుకోవడంలో ఓ తాత్వికత ఉంది. విషాదంలో కూరుకుపోయినా, దాన్ని పట్టించుకోనక్కర్లేదన్న దిక్కారం ఉంది. ఇక్కడే ప్రాణాలను సైతం ఇచ్చి వెళ్లాల్సినప్పుడు తనని వదిలి వెళ్తున్న వ్యక్తులు, అదృష్టాల పట్ల భయం, బాధా దేనికి, అవి ఏవీ మనతో ఉండిపోవు, తోడు రావు కదా..
A distant uncle passed away and left me quite a batch
And I was living high until that fatal day
A lawyer proved I wasn’t born, I was only hatched
(ఓ దూరపు బంధువు చనిపోతూ కొంత ఆస్తి వదిలి వెళ్లాడు. ఒక లాయరు నేను పుట్టలేదని, గుడ్డులో నుండి బైట పడ్డ పక్షిలా పొదిగి తీయబడ్డానని నిరూపించేదాకా నేనూ కొంతకాలం ఆనందంగా జీవించాను)
ఇందులో గొప్ప విషాదమూ, దాన్ని మించిన వ్యంగ్యంతో కూడిన శ్లేషను అతిశయోక్తిగా ఉపయోగిస్తాడు కవి. ఒక న్యాయవాది అతను పుట్టలేదని, కేవలం పొదగబడ్డాడని నిరూపించాడని చెప్పడంలో, అతని హక్కును కాలరాసిన సమాజం తీరు పట్ల అతని వేదన కూడా అర్థం అవుతుంది. కడు పేదరికంలో ఎవరో బంధువు చనిపోయాక అతని పరం అయిన ఆస్తిని అతను అందుకుని ఆనందించే సమయంలో, అతనికి ఆ వారసత్వంలో హక్కే లేదని నిరూపించాడు ఓ న్యాయవాది. దానికి నేను పుట్టలేదు మరి పొదిగి బైటకు తీసారు, నేనెలా వారసుడిని అవుతాను అంటూ తన పరిస్థితిపై వ్యంగ్యబాణాలను విసురుకుంటూ ఈ దురదృష్టాన్నికోపంగానూ బాధతోనూ స్వీకరిస్తున్నాడు అతను. ఈ వాక్యాలు విలియమ్స్ ప్రత్యేకమైన చమత్కార శైలికి నిదర్శనం. విధి చేతిలో శాశ్వతంగా దురదృష్టవంతుడిగా మారిన ఒక దిక్కులేని వ్యక్తి మనోగతాన్ని ఇవి పరిచయం చేస్తాయి.
Everything’s again’ me and it’s got me down
If I jumped in the river, I would probably drown
No matter how I struggle and strive
I’ll never get out of this world alive
(అంతా నాకు వ్యతిరేకంగా జరుగుతోంది. అది నన్ను కృంగదీస్తోంది. నేను ఒకవేళ నదిలో దూకితే, బహుశా మునిగిపోతానేమో. ఎంత పోరాడినా, ఎంత శ్రమించినా ఈ లోకం నుండి నేను సజీవంగా బయటపడలేను)
అతని జీవితంలో అన్నీ విరుద్ధం గానే జరుగుతున్నాయి. దేనిపైనా అతని నియంత్రణ లేదు. అది అతన్ని అన్ని విధాలుగానూ బాధిస్తుంది. నదిలో దూకితే మునిగిపోతాడు తప్ప పైకి తేలడు. అతని జీవితానుభవాలన్నీ నటి మునకలే. ఎక్కడా కొంచెం తేలికపాటి ఆనందం కూడా లేదు. అయితే నేమి, సజీవంగా ఇక్కడి నుండి నడిచిపోయే మార్గమే లేనప్పుడు, అన్నీ ఇచ్చేసి వెళ్లవలసి వచ్చినప్పుడు ఈ మునకలకు భయమేల?)
These shabby shoes I’m wearing all the time
Is full of holes and nails
And brother if I stepped on a worn out dime
I bet a nickel I could tell you if it was heads or tails
(నేను ఎప్పుడూ ధరించే ఈ అరిగిపోయిన కాలిజోళ్ళు రంధ్రాలు, మేకులతో నిండి ఉన్నాయి. కాని సోదరా, ఓ అరిగిపోయిన నాణెం మీద నా కాలు పడిన వెంటనే అది బొమ్మా, లేక బొరుసా అని ఖచ్చితంగా చెప్పగలనని పందెం కాయగలను)
అతనెంత పేదరికంతో బాధపడుతున్నాడంటే, ఆ అరిగిపోయిన కాలి జోళ్ల నిండా చిరుగులు, అవి దాచడానికి ఉపయోగించిన మేకులే ఉన్నాయి. అయితేనేం ఆ కాలితోనే అరిగిపోయిన నాణాన్ని స్పృశించి, అక్కడ ఉన్నది బొమ్మో బొరుసో చెప్పగల అనుభవం అతని సొంతం. పేదరికం, దురదృష్టం అతనికి జీవితానుభవాలను మిగిల్చాయి. చాలా మంది తెలుసుకోలేని ఎన్నో విషయాలను అతను అనుభవించాడు. జీవితానుభవాలిచ్చిన జ్ఞానం, అతనికి ఎన్ని అదృష్టాలు దురదృష్టాలు చుట్టుముట్టినా అవన్నీ ఇక్కడ ఉండిపోయే ఆటలేనని తెలియపరుస్తోంది. తన జీవన పోరాటాన్ని దుఃఖంతో కాక భుజాలు ఎగరవెస్తూ ఓ మొండితనంతో అతను గుర్తు చేసుకుంటున్నాడు.
I’m not gonna worry wrinkles in my brow
‘Cause nothing’s ever gonna be alright, no how
No matter how I struggle and strive
I’ll never get out of this world alive
(నా నుదుటిపై ముడతలు పడేలా నేను దేనికీ చింతించదల్చుకోలేదు. ఏదీ ఎప్పటికీ అనుకున్నట్లు జరగదు, ఎలా చూసినా సరే, నేను ఎంతగా పోరాడినా, ఎంతగా శ్రమించినాఈ లోకం నుండి నేను ప్రాణాలతో బయటపడలేను)
ఇంత పేదరికంలోనూ, ఇన్ని కష్టాలలోనూ, ఏదీ అచ్చి రాని పరిస్థితులలోనూ నేను దీర్ఘంగా ఆలోచించను అని అతను చెప్పుకుంటున్నాడు. ఈ వైఖరి కొందరికి పలాయనవాదంలా కనిపించవచ్చు, చేతకానితనంగానూ అనిపించవచ్చు. కాని తరచి చూస్తే ఇందులే గొప్ప తాత్వికత ఉంది. జీవితాన్ని ఎదుర్కునే మొండితనం కనిపిస్తుంది. జీవితంలో ఏదీ మనకు కలిసి రానప్పుడు ఈ మొండితనమే మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఈ మొండితనంలో శక్తి ఉంటుంది. అది మనిషిని డీలా పడనివ్వదు. పరిస్థితులను స్వీకరించే శక్తిని ఇస్తూనే వాటికి తలవంచి బాధితుల్లా కుమిలిపోయే పరిస్థితిలోకి, అపరిమితమైన శోకతప్త నిరాశలోకి వెళ్లనివ్వదు. ఓటమిని స్వీకరించే శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది తప్ప ఓటమికి కృంగిపోయి స్వీయ విధ్వంసాన్ని ఆహ్వానించే పరిస్థితికి మనిషిని తీసుకెళ్లదు.
ఈ పాట ఓ దురదృష్టవంతుడిలోని తాత్వక చింతన పట్ల, ఈ భూమిపైని గెలుపు ఓటములలోని ఆశాశ్వతాల పట్ల అవగాహనను కలిగిస్తూనే, జీవితంలోని విషాదాన్ని కూడా పరిచయం చేస్తోంది. దాన్ని మొండిగా స్వీకరించి చివరకు ఏదీ మన సొంతం కాదు అన్న భావంలో ఆ కష్టాలను ఎదుర్కుంటున్న ఓ సామాన్య మానవుడి జీవన పోరాటాన్ని వివరిస్తుంది. అందుకే ఇది అతి విషాద గీతమూ, అలాగే గొప్ప తాత్విక గీతమూ కూడా. ఇందులో హాంక్ గొంతు, అతీంద్రీయమైన విషాదాన్ని, అంతకు మించిన అవగాహనను వినిపిస్తుంది.
1953 నూతన సంవత్సరం రోజున, 29 ఏళ్ల వయసులో, హాంక్ విలియమ్స్ తన క్యాడిలాక్ కారు వెనుక సీటులో విషాదకరంగా మరణించి, ఈ పాటను తన అభిమానులకు వీడ్కోలు గీతంగా అందించారు. ఇందులోని విషాదానికి అతని మరణం అనే విషాదం తోడవడంతో, హాంక్ విలియమ్స్ పాటలన్నిటిని మధ్య ఇది ప్రత్యేకంగా ఎప్పటికీ నిలిచి పోయింది.
~
(పాటకు సంబంధించిన యూ ట్యూబ్ లింక్ ఇది
https://www.youtube.com/watch?v=UoYOlZm0PO8)

